ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి

డాక్టర్‌ అమితవ చక్రవర్తి

ఫిబ్రవరి 4, 2021

పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి “నాగపూర్‌” మేధావులు తమ శక్తినంతటినీ ధారపోస్తున్నారు. తూర్పు భారతంలో మేథోదుర్గంగా, దాదాపు శతాబ్దంపాటు వామపక్ష ఉద్యమాల పెట్టని కోటగా గుర్తించబడిన కలకత్తా జీవితాన్ని తమ అజమాయిషిలోకి తెచ్చుకోవాలని, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని అర్‌యస్‌య‌ దృష్టి పెట్టింది. తూర్పు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే అర్‌యస్‌య వ్యూహంలో ఇది భాగం.

ఈ ఎదుగుదల అంతటికీ ఏకైక కారణం కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే అనుకోవడం అపోహ. కొందరు పార్లమెంటరీ వామపక్ష శక్తులకు చెందినవాళ్ళు, ఈ పెరుగుదలకు కేవలం తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వపు అవకాశావాద రాజకీయాలే కారణంగా భావిస్తున్నారు. అయితే మనం బెంగాల్‌లో భాజపా ఎదుగుదలను అర్థం చేసుకోవాలంటే ఈ అంశాలను మాత్రమే పరిశీలిస్తే చాలదు. వీటితోపాటు బెంగాల్‌లో బ్రహ్మణీయ ఫాసిస్టుల లోతైన భావజాల మూలాలను, సాంఘిక-రాజకీయ పునాదులను కూడా గుర్తించాలి. పశ్చిమబెంగాల్‌ సాంఘిక, ఆర్థిక దృశ్యంలో వచ్చిన మార్పులను లోతుగా పరిశీలించడం, అంచనా వేయడం ద్వారా మనం ఆర్‌యస్‌యస్‌, భాజపా ఫాసిస్టుల దాడిని ఎదుర్కోగలం.

పశ్చిమబెంగాల్‌లో బ్రాహ్మణవాదపు భావజాల పునాది :

ప్రాచీన, మధ్యయుగాల భారతదేశాలలో ‘హిందూ” అనే శబ్దానికి మత విభాగమనే అర్ధం ఎన్నడూ లేదు. భారతదేశంలోని ముస్లిమేతర ప్రజల మత విశ్వాసాలను, క్రతువులను వర్ణించడానికి, వ్యతిరేకించడానికి ఈ హిందూ అనే పదాన్ని క్రైస్తవ మిషనరీలు వుపయోగించారు. దేశీయ ప్రజల మత విధానాలను – ఇవి ముఖ్యంగా బ్రాహ్మణీయ స్వభావంతో కూడుకున్నవి- స్థానిక విద్యావంతులైన ప్రజలు- వాళ్ళలో అత్యధికులు బ్రాహ్మణులు- మిషనరీలకు బోధించారు. ఆ కారణంగా యూరోపియన్లు ఈ నిచ్చెనమెట్ల బ్రాహ్మణీయ విశ్వాస వ్యవస్థను హిందూమతంలో భాగంగా చేర్చారు. “విగ్రహారాధనను” విమర్శించే క్రమంలో రాజారామమోహనరాయ్‌ ఈ పదాన్ని 1816లో మొదటిసారిగా మత దృక్పథంలో వాడారు.

19వ శతాబ్దం ద్వితీయార్ధంలో బెంగాల్‌లో జరిగిన హిందూ తిరుగుబాటు వలసవాదుల సృష్టి. ఈ తిరుగుబాటుకు ముందు పీటీన నిలబడ్డవాడు రాజనారాయణ్‌ బసు. కలకత్తాకు చెందిన బసు, నవగోపాల్‌ మిత్రాలు 1867లో హిందూ మేళాను ప్రారంభించడం ద్వారా హిందూ తిరుగుబాటుకు సంబంధించిన తమ భావాలను వ్యాప్తి చేశారు. అరవిందఘోష్‌ తాతగారైన రాజనారాయణ్‌ “విద్యావంతులైన స్థానిక బెంగాలీలలో జాతీయ దృక్పథాన్ని రేకెత్తించడం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికిగల అవకాశాలు” (Prospectus of a Society for the National Feeling among the Educated Natives of Bengal) అనే పుస్తకాన్ని రచించారు. బసు, మిత్రాలు ఒక “జాతీయ పాఠశాలను, ‘జాతీయ జిమ్నాషియం’ను, ‘జాతీయ సంఘాన్ని ప్రారంభించారు. వారిద్దరి మాటల్ని అమర్‌ దత్తా (2007) ఇలా వుల్లేఖించారు. “తమంతట తాము ఖచ్చితంగా ఒక జాతిగా గుర్తించబడే అవకాశం వున్న సమయంలో దాని నుండి హిందువులకు మా విలేఖరి ఎందుకు మినహాయింపును ఇస్తాడో మాకు అర్థం కావడం లేదు. అదే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని ఎందుకు ‘జాతీయ సంఘంగా” పిలవకూడదో కూడా మాకు అర్థం కావడంలేదు.”

రాజనారాయణ్‌ ‘ఒక వృద్ధ హిందువు ఆశ (Hope of an Old Hindu) అనే పుస్తకాన్ని రాశారు. క్రైస్తవులు, మహమ్మదీయులు తప్ప సిక్కులు, బౌద్దులు, జైనులు, బ్రహ్మెవాదులు వంటి ఇతర మతాలకు చెందిన వారంతా హిందూ మతానికి చెందినవారుగా రాజనారాయణ్‌ భావించడం వింత కొల్పుతుంది. ‘మహా హిందు సమితి’ని ప్రారంభించమని ఆయన సలహా ఇచ్చారు. తాను స్వయంగా “భారత ధర్మ మహామండల్ను స్థాపించారు. ఇది హిందూ మహాసభకు మాతృసంస్థలాంటిది. ఈ సంస్థ ఒక బలమైన హిందూజాతిని నిర్మాణం చేస్తుందని, మొత్తం భారతదేశాన్నే కాక ప్రపంచమంతటిపైనా ఆధిపత్యాన్ని కలిగి వుంటుందని రాజనారాయణ్‌ విశ్వసించారు. “ఒక వృద్ధ హిందువు అశ అనే తన పుస్తకంలో ఆయన వర్ణ వ్యవస్థను శ్లాఘించారు. బ్రాహ్మణులను ‘భూమిపై నడయాడే భగవంతులుగా గుర్తించారు.

ఈ హిందూ తిరుగుబాటు, బ్రాహ్మణీయ దురహంకారం సమకాలీన బెంగాలీ సాహిత్యంలో కూడా వ్యక్తమయ్యాయి. రంగాలాల్‌ బందోపాధ్యాయ, నవీన్‌ చంద్రసేన్‌ వంటి కవులు తమ సాహిత్య సృజనద్వారా ఈ భావజాలాన్ని ప్రచారం చేశారు. శశిధర్‌ తర్కశిరోమణి “ఆర్యధర్మ ప్రచారిణీ సభి, ‘హరి సభ అనే సంస్థలను స్థాపించారు. ఈ హిందూ తిరుగుబాటులో అత్యంత ప్రధానమైన వ్యక్తి బంకించంద్ర ఛటోపాధ్యాయ. అరవిందఘోష్‌ ఈయనను ‘తన రాజకీయ గురువుగానూ, తనను ఉత్తేజపరిచిన వ్యక్తిగానూ’ పేర్కొన్నారు. బంకించంద్ర తాను రచించిన అనేక నవలలో హిందువులను ‘మనం’” అని, ముస్లింలను ‘ఇతరులిని చిత్రీకరించారు. “వందేమాతరం” జాతీయగేయానికి మూలమైన ‘“ఆనందమఠం” నవలలో తొలి ప్రతిలో వున్న “బ్రిటీష్‌వాళ్లను చంపండి” అనే పదాన్ని బంకించంద్ర తరవాతి ప్రతులలో ‘ముస్లింలను చంపండి’గా మార్చారు.

బెంగాల్‌ చరిత్రను మనం పరిశీలిస్తే దానిని దోచుకున్నది, కొల్లగొట్టినది మరాఠాల దురాక్రమణ అనే విషయం స్పష్టమవుతుంది. కాని బంకించంద్ర తనకున్న హిందూ పక్షపాత దృష్టితో ఈ చారిత్రిక వాస్తవాన్ని గమనించ నిరాకరించాడు. ఆయన తరవాత వివేకానందుడు భారత జాతీయతను అర్థం చేసుకోవడానికి అవసరమైన హిందూ పునాదిని సమకూర్చాడు. “హిందూయిజానికి వున్న వుమ్మడి పునాదిని కనుగొనడం, హిందువులలో జాతీయ స్పృహను రేకెత్తించడం” భారతదేశంలో తన ఉద్యమ కర్తవ్యమని వివేకానందుడు 1898లో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వివేకానందుడి రచనలలో వున్న కొన్ని ఉదారవాద అంశాలు ఆయనకున్న హిందూత్వ జాతీయవాద అవగాహనకు వ్యతిరేకమైనవి కావు. “జాతీయ పునరుత్ధానం కోసం జరిగే తమ ఉద్యమం రాజకయమైనది కాదని, అది ఆధ్యాత్మికము, మతపరమైనది” అని కూడా అరవిందుడు రాశాడు. ఆయన ఇలా కూడా అన్నారు. “నన్ను బహిరంగంగా నొక్కి చెప్పనివ్వండి; సనాతన ధర్మమే మన జాతీయత”.

ఇరవయో శతాబ్దపు తొలి భాగంలో కలకత్తాలోని వైద్యకళాశాలలో విద్యార్థిగా వున్న డాక్టర్‌ కె.బి. హెడ్గే వార్‌ దీ‌న్ని అందిపుచ్చుకోవడంలోనూ అ తరవాత ఆర్‌యస్‌యస్‌కు భావజాల పితామహుడు కావడంలోనూ ఆశ్చర్యమేమీ లేదు. వలసవాద దృక్పథంకల ఈ “జాతీయవాదుల” సైద్ధాంతికతను, సంస్థాగత కార్యకలాపాలను పరిశీలిస్తే అర్‌యస్‌య‌కు, రాజనారాయణ్‌, నవగోపాల్‌, బంకిం తదితరుల రచనలలో ‘పేర్కొన్నబడ్డ చారిత్రిక వ్యక్తులకు మధ్య పోలికలు కనపడడంలో ఆశ్చర్యం లేదు.

బెంగాలీ మేథో సంప్రదాయంలో రెండు స్రవంతులు- లౌకిక, ప్రజాస్వామిక, రాడికల్ స్రవంతి – మతవాద హిందూత్వవారసత్వ స్రవంతి- వున్నాయని నేను నొక్కి చెప్పదల్పుకున్నాను. బ్రాహ్మణీయ మేథోవారసత్వానికి పశ్చిమబెంగాల్‌లో లోతైన మూలాలున్నాయి. సహనం, లౌకికతత్వం, ‘హేతుబద్ద అవగాహన అనే విలువైన పురావారసత్వం బెంగాల్‌కు వున్నది. దానితోపాటే బలమైన బ్రాహ్మణీయ మేథో సాంప్రదాయం కూడా వుంది. దీన్ని మనం గమనించకపోతే బెంగాల్‌లో తలెత్తుతున్న (బ్రాహ్మణీయ ఫాసిజాన్ని సక్రమంగాఅవగాహన చేసుకోలేం.

పశ్చిమబెంగాల్‌లో బ్రాహ్మణీయవాదపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ దృష్టికోణం :

11,12 శతాబ్దాల కాలం నాటి ‘సేన్‌వంశపు పరిపాలనా కాలంనుండి బెంగాల్‌లో భూస్వాములలో అత్యధికులు బ్రాహ్మణ కులాలకు చెందినవాళ్ళు. బెంగాల్‌లో సుల్తాన్‌ల పాలనాకాలంలో కూడా ఇందులో మార్పేమీ రాలేదు. సేన్‌లు కన్నడ బ్రాహ్మలు. వాళ్లు ప్రధానంగా బెంగాలీ బ్రాహ్మణులకు భూమిని పంచిపెట్టారు. దాని ఫలితంగానే కొన్ని మినహాయింపులతో, బెంగాల్‌లో అత్యధికశాతం భూమి అగ్రకులాలు, అందులోనూ అత్యంత ప్రధానంగా బ్రాహ్మణుల, చేతుల్లోకి చేరింది. బెంగాల్‌లో వున్న కులవ్యవస్థ ఉత్తరభారతంలో వున్న కులవ్యవస్థకంటే కొంతమేరకు భిన్నమైంది. పైగా బెంగాల్‌లోని శూద్రులు అంటరానివారు, ఆదివాసీలు, మహమ్మదీయులలోచేరిపోయారు. దీనికి కారణం బౌద్ధమతం ప్రచలితంగా వున్న కాలంలో జరిగిన మతాంతరీకరణ.

విభజనపు పూర్వపు బెంగాల్‌లోనూ, ప్రస్తుత పశ్చిమబెంగాల్‌లోనూ మహమ్మదీయుల జనభా గణనీయమైన సంఖ్యలో వున్నది. మత విశ్వాసాల రీత్యా మహమ్మదీయులైన వాళ్ళలో అత్యధికులు తమ జాతిరీత్యా బెంగాలీలే అనేది మనం గుర్తుంచుకోవాలి. దళితులు, మహమ్మదీయులలో అత్యధికులు పేదలు, భూమిలేని రైతులు. బెంగాల్‌లోని కొన్ని నిర్దిష్టమైన జిల్లాలను పక్కనబెడితే, ఆ రాష్ట్ర భూపటం, ఆస్తుల పంపకం ఇలానే వుంటుంది. పారిశ్రామికీకరణ, పాక్షిక భూసంస్కరణలు ఈ దృశ్యంలో మార్పులు తీసుకురావడంలో విఫలమయ్యాయి.

1905లో బెంగాల్‌ విభజనకోసం జరిగిన తొలి ప్రయత్నాన్ని సమీక్షించుకంటే మనకు ఈ సాంఘిక, అర్థిక వైరుధ్యం అంతర్లీనంగా బలంగా వున్న వాస్తవం కనపడుతుంది. బ్రిటీష్‌ వలసవాదులు ప్రజలమధ్య మత సంబంధమైన విభజనను సృష్టించడానికి తమకు సాధ్యమైనంతవరకు ప్రయత్నించారు. బెంగాల్‌ విభజనకు ముందు 1904లో లార్డ్‌ కర్టన్‌, భారత కార్యదర్శికి రాసిన ఒక లేఖలో ఇలా అన్నారు. “బెంగాలీలు తమనితాము ఒక జాతిగా అనుకుంటారు. బ్రిటీష్‌వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్లగొట్టబడిన భవిష్యత్తు గురించి వాళ్ళు కలగంటారు. కలకత్తాలోని అధికార కేంద్రమైన ప్రభుత్వ భవనంలో బెంగాలీ బాబు పదవిలో చేరతాడని వాళ్ళు ఊహిస్తారు. ఈ కలసార్ధకం కాకుండా జరిగే ఎలాంటి జోక్యాన్ని అయినా, విఘాతాన్ని అయినా వాళ్ళు తీవ్రంగా నిరశిస్తారు. వాళ్ళ అత్యాశకు లొంగిపోయేటంత బలహీనులంగా మనం ఇప్పుడు వుంటే, బెంగాల్‌ను భౌతికంగా రద్దు చేయడం మరోసారి మనకు సాధ్యం కాదు. అదే అలా జరిగితే భారతదేశపు తూర్పు భాగంలో ఇప్పటికే దుర్చేద్యంగా వున్న ఒక శక్తి మరింత సంఘటితం కావడానికి ఐక్యం కావడానికి మనం తోడ్పడీనవాళ్ళమవుతాం. ఇది భవిష్యత్తులో మనకు పెద్ద ఎత్తున సమస్యలు సృష్టించడానికి కారణమవుతుంది.” ఇలాంటి కుట్రపూరిత ఉద్దేశంతో బ్రిటీష్‌ ప్రభుత్వం బెంగాల్‌ను మతప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నించింది. ఇందుకుగాను వాళ్ళు ఢాకాకు చెందిన నవాబ్‌ సర్‌ ఖ్వాజా సలీముల్లా సహాయం తీసుకున్నారు. ఇతడు మహమ్మదీయులకు విద్యా, ఉద్యోగ అవకాశాలను డిమాండ్‌ చేస్తూ 1906లో ముస్తింలీగ్‌ను స్థాపించారు.

ఆయన బెంగాల్‌ విభజనను బలంగా అనుకూలించారు. బెంగాలీ ముస్లింల అర్ధికస్థితి, చదువు, ఉద్యోగస్థితి చాలా హృదయవిదారకంగా వుండేది. అది ఒక ప్రధానమైన సమస్య. బెంగాల్‌లో ప్రసిద్ధ నాయకుడైన చిత్తరంజన్‌ దాస్‌ కూడా ఆ కాలంలో విద్య, ఉద్యోగ అవకాశాలలో బెంగాల్‌లోని మహమ్మదీయులకు వారి జనాభాకి తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశాడు. అరవింద ఘోష్‌ తదితరుల నాయకత్వంలో బెంగాల్‌లో జరిగిన స్వదేశీ వుద్యమం సంతరించుకున్న హిందూమత మతవాద ధోరణి క్రమక్రమంగా స్పదేశీ వుద్యమం నుండి మహమ్మదీయులను దూరం చేసింది. స్వరాజ్యపార్టీ, సుభాష్‌చంద్రబోస్‌ రాజకీయ ప్రభావం, కమ్యూనిస్టు, వామపక్షాల అభివృద్ధి, సోవియట్‌ యూనియన్‌ ప్రభావం ఇవన్నీ బెంగాల్‌లోని విద్యార్థులను, యువతను, మేథావులను లౌకికవాద, ప్రజాస్వామికవాద భావనలవైపు ఆకర్షించాయి.

బెంగాల్‌లో సామ్రాజ్యవ్యతిరేక ఉద్యమం కూడా ఈ లౌకిక అవగాహన ప్రభావంలోనే వున్నది. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌లకు కూడా వాటివాటి ప్రాబల్య కేంద్రాలు వున్నాయి. హిందూ మహాసభలోని మతతత్వవాదులకు అనేకమంది కాంగ్రెస్‌ నాయకులతో ‘స్నేహసంబంధాలు వుండడమేకాక, కొన్ని ప్రాంతాలలో మతతత్వవాదులు వాళ్ళకు నాయకత్వం వహించారు కూడా. కాని తూర్పు బెంగాల్‌కు చెందిన పేద ముస్లిం రైతాంగం, విద్యాధిక మేధావులు ముస్లింలీగ్‌ నాయకత్వాన్ని ఖండించారు. ఫజులుల్‌ హక్‌ నాయకత్వంలోని ప్రజా క్రిషక్‌ పార్టీ ఆ ప్రాంతంమీద గణనీయమైన ఆధిక్యతను కలిగివుందేది. ఆ పార్టీ పేద బెంగాల్‌ రైతుల ప్రయోజనాలకోసం పోరాడింది. బెంగాల్‌లోని కౌలు రైతుల కోసం ఫ్లౌడ్‌ కమిటీ భూసంస్కరణలను సిఫారసు చేసింది ఈ సమయంలోనే. అగ్రకుల హిందూ నేపథ్యం కల భూస్వాములకు ఇది చికాకు కలిగించింది. ఈ వర్గ శక్తులు ఈ కాలంలో హిందూ మహాసభ, కాంగ్రెస్‌లతో స్నేహంగా వుండేవి. ముస్లింలు, హిందువులలో నిమ్నకులాలకు చెందిన పేద, భూమిలేని రైతాంగం ఈ పార్టీలు రెండూ తమకు నమ్మక ద్రోహం చేశాయని భావించేవారు. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే ఈ సమయలో బెంగాల్‌లోని రాష్ట్రప్రభుత్వాన్ని అటు హిందూ మహాసభ ఇటు ముస్లిం లీగ్‌ బలపరచడం.

1940వ దశకం బెంగాల్‌ వైరుధ్యాలతో నిండివున్న కాలం. ఆ కాలంలోనే బెంగాల్‌ కరువు సంభవించింది. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు మద్ధతుగా గొప్ప సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో కార్మిక, రైతాంగ, విద్యార్థి వుద్యమాలు కూడా ఈ సమయంలోనే ఆవిర్భవించాయి. కలకత్తాలో పెద్ద ఎత్తున జరిగిన ఘర్షణలకు, బెంగాలీ రాజకీయాలు మతతత్వానికి లోనుకావడానికి, కాంగ్రెస్‌ పార్టీ నమ్మకద్రోహానికి పాల్పడడానికి ఈ కాలం సాక్షీభూతం. బీహార్‌, నౌఖాలి, కలకత్తాలో జరిగిన ఘర్షణలు మతసామరస్య వాతావరణాన్ని భగ్నం చేశాయి. ఈ కాలంలోనే జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూ మహాసభ ఊహించిన ఫలితాలను సాధించలేదు. “హిందువుల స్నేహితుడుగా” పేరుగాంచిన శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీని ఆయన పోటీచేసిన నియోజకవర్గంలో ఎవరికీ పెద్దగా తెలియని అభ్యర్థి ఓడించాడు. చివరకు ఆయన యూనివర్శిటీ కోటాలో కాంగ్రెస్‌పార్టీ దయాదాక్షిణ్యాలతో శాసనసభలో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.

చివరకు 1947లో జరిగిన అధికారమార్చిడి బెంగాల్‌ విభజనకు దారితీసింది. మత ప్రాతిపదికమీద జరిగిన ఈ విభజన అక్కడి ప్రజలపై దీర్హకాలిక ప్రభావాన్ని వేసింది. వాళ్ళు తమ పూర్వీకులు నివశించిన ప్రాంతాల నుండీ ఇళ్ళ నుండీ బలవంతంగా తరిమివేయబడ్డారు. అలాంటి స్థితిలో అక్కడ వుండడం సాధ్యం కాదనుకున్నవాళ్ళు ఆ తావులు వదిలిపెట్టి స్వచ్భందంగానే వెళ్ళిపోవల్సిన స్థితి ఏర్పడింది. అలా పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించిన బెంగాలీ హిందూ కాందిశీకుల పునరావాసం చేదు అనుభవాలను కలిగించింది. పాలకులు వాళ్ళకు ఆవాస సౌకర్యాన్నిగానీ, తిండినిగానీ, ఉద్యోగాన్ని గానీ, భూమినిగానీ చివరకు సహానుభూతినిగానీ అందించలేకపోయారు. కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు మాత్రమే కాందిశీకుల హక్కులకోసం పోరాడాయి. 1950-60లలో బెంగాల్‌లో జరిగిన సాంఘిక, రాజకీయ సంఘటనలు ప్రజాస్వామిక, వర్గ ఆశయాలతో జరగడానికి ఇదే కారణం. బెంగాలీ కష్టజీవులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాల డిమాండ్ల కోసం పోరాడిన ఘనత కమ్యూనిస్టులది. మతప్రాతిపదికన జరిగిన చీలికలను ఎదుర్మొన్నది కూడా కమ్యూనిస్టులే. అయితే దేశ విభజన కేంద్రంగా భారత ఉపఖండంలో రూపొందిన మత రాజకీయాలు బెంగాలీల సాంఘిక అర్ధిక అవగాహనలపై పరోక్షంగానైనా బలమైన ముద్రవేశాయి.

1970ల వరకు సాంఘిక ఆర్థిక ఉద్యమాలు ప్రధానంగా ప్రజాస్వామిక, విప్లవకర స్వభావాన్ని కలిగివున్నాయి. భారత-చైనా యుద్ధం, భారత్‌-పాక్‌ యుద్ధం, బంగ్లాదేశ్‌ యుద్ధం సందర్భాలలో మాత్రమే జాతీయ దురహంకార వాతావరణం ముందుకు వచ్చింది.

పశ్చిమబెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వ పాలనాకాలంలో హిందూత్వ సంస్థలు ఎలా వునికిలోకి వచ్చాయి?

పశ్చిమబెంగాల్‌ ఆర్థిక జీవనంలో కాంట్రాక్టర్లు, ప్రమోటర్లు, పంపిణీదార్లు క్రమక్రమంగా బలపడడానికి, భాజపా అవిర్భావానికి సంబంధం వున్నది.

1977లో ఇందిరాగాంధీ ఓటమి తరవాత బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఊరటకలిగిస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉద్యమసాధనంగా వుంటుందని వాళ్ళు ప్రకటించారు. అయితే ఇదంతా అబద్ధమని కొంత కాలం తరవాత తేలింది. ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు గ్రామీణ రంగంలోనూ, ప్రభుత్వ రంగంలోనూ కొన్ని సంస్కరణలు ఖచ్చితంగా జరిగాయి. అయితే 1998 నుండి ఆ ప్రభుత్వం కూడా నయా ఉదారవాద ఆర్థిక విధానాల అడుగుజాడల్లోనే ప్రయాణించింది. “అభివృద్ధి” పేరుతో సెజ్‌ల స్థాపనకు అనుమతినిచ్చిన తొలి రాష్ట్రం పశ్చిమబెంగాల్‌. భూసంస్కరణలు నిలిపివేయబడ్డాయి. బహుళజాతి కార్పోరేషన్ల కోసం భూములను అక్రమించటం వాళ్ళు ప్రారంభించారు. ప్రభుత్వరంగ సంస్థలలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమైంది. మార్చిస్టుపార్టీకి చెందిన అనాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య ఒక ఇంటర్వ్యూలో ఇలా పేర్మొన్నాడు…“నా మనస్సులో పూర్తి స్పష్టత వుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ… నేను దానిని పాటించి తీరాలి” (హిందూస్సాన్‌ టైమ్స్‌ , జులై 20, 2007) అవినీతి, ఆశ్రితపక్షపాతం చెట్టాపట్టాలు వేసుకొని కొనసాగాయి. వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది. ఉత్పత్తి రంగాలు నాశనమయ్యాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పంపిణీదారులతో కూడిన ‘నయా ధనికవర్గం” శక్తివంతం కావడంతో బెంగాలీ గ్రామాలలో వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందాయి. ఈ నూతన సామాజిక వర్గంలో కొందరు మార్చిస్టు పార్టీకి చెందిన కార్యకర్తలు కాగా, ఇతరులు కొందరిని పార్టీ తన నిర్మాణంలోకి తీసుకున్నది. మార్చిస్టుపార్టీకి విరాళాల దాతలుగా, కండబలంగా, ప్రజాసమీకరణ సాధనంగా వ్యవహరించింది వీళ్ళే. బుద్ధదేవ్‌ భట్టాచార్య అనేక సందర్భాలలో కార్మికుల హక్కుల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడాడు. బంద్‌లు ‘చెడ్డవి’ అని, ‘ఘెరావోలు “చట్టవ్యతిరేకమైనివని ఆయన ప్రకటించాడు. (ది ఎకనామిక్‌ టైమ్స్‌, ఆగస్టు 27, 2008) ఎటువంటి గణాంకాలు చూపకుండానే బంగ్లాదేశ్‌ నుండి సరిహద్దులు దాటి వలసదారులు రావడం పట్ల ఆయన ఆందోళనను వ్యక్తం చేశాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి, “మదరసాలు టెర్రరిస్టు కార్యకలాపాల ఉయ్యాలలు” అని కూడా ఆయన ఒకసారి ప్రకటించాడు. (ది ఎకనామిక్‌ టైమ్స్‌, అక్టోబర్‌ 21, 2014)

ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో పశ్చిమబెంగాల్‌లోని వామపక్ష పాలనాకాలంలోని పరిస్థితి ఇతర రాష్ట్రాలలోకంటేచెప్పుకోదగినంత మెరుగైందేమీ కాదు.

వామపక్ష పాలనా కాలంలో ఆర్‌.యస్‌.యస్‌., భాజపాల పరిస్థితి ఎలా వున్నది?

1990వరకు పశ్చిమబెంగాల్‌ రాజకీయాలలో ఆర్‌.యస్‌.యస్‌., భాజపాలు చాలా బలహీనంగా వుండేవి. అప్పటివరకు ఆర్‌.యస్‌.యస్‌. సభ్యత్వం ఐదువేలు మాత్రమే. ఇది 1997నాటికి నాలుగు లక్షలకు చేరింది. పూర్ణ స్వయంసేవక్‌ల సంఖ్య 2227 నుండి 50,000లకు పెరిగింది. శాఖల సంఖ్య 2,500 నుండి 12,000కు పెరిగింది. 14 జిల్లాలలో వున్న నిర్మాణం 28 జిల్లాలకు విస్తరించింది. ఈ కాలంలోనే పశ్చిమబెంగాల్‌ మాజీ డి.జి.పి. భాజపాలో చేరాడు. పశ్చిమబెంగాల్‌ పోలీసులలో మూడువేలమంది ఆర్‌యస్‌యస్‌ కార్యకర్తలున్నారు. 1996లో పార్లమెంటు, శాసనసభ ఎన్నికలలో భాజపా ఓటు ఆరుశాతం మాత్రమే. 1998 నాటికి పార్లమెంటు ఎన్నికలలో అది పదిశాతానికి పెరిగింది. ఆర్‌.యస్‌.యస్‌. నిర్వహణలో 21 పాఠశాలలు వుండేవి. వాటిల్లో 160మంది పూర్తికాలపు ఉపాధ్యాయులు, 4282మంది విద్యార్థులు వుండేవారు.

అంతేకాక మార్చిస్టుపార్టీ మొదలుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌వరకు వివిధ రాజకీయపార్టీలు ఎన్నికల రాజకీయాలలో వివిధ దశలలో ఆర్యస్‌యస్‌ నాయకత్వంలోని భాజపాతో సంబంధాలు పెట్టుకున్నవే.

ప్రస్తుత దృశ్యం – మన కర్తవ్యం :

భాజపా ఆవిర్భావాన్ని పశ్చిమబెంగాల్‌ ఆర్థిక జీవనంలో కాంట్రాక్టర్ల, ప్రమోటర్ల, పంపిణీదార్ల వ్యవస్థ క్రమంగా శక్తివంతం కావడమనే కోణం నుండి అర్ధం చేసుకోవాలి. అది వామపక్ష పాలనలో ప్రారంభమై తృణమూల్‌ కాంగ్రెస్‌పాలనలో బలపడింది. టియమ్‌సి నాయకులు- వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా, పై నుండి కిందిస్థాయి వరకు పాంజీ పథకాలలో, ప్రభుత్వ పథకాలకు కేటాయించిన డబ్బును స్వాహా చేయడంలో, అక్రమ ఇసుక తవ్వకాలు, బొగ్గు తవ్వకాలు, రియల్‌ఎస్టేట్‌ పెట్టుబడులలో కూరుకుపోయారు. పట్టణాల నుండి పల్లెలదాకా వాళ్ళు తమదైన ఒక స్వంత గొలుసును నిర్మాణం చేసుకున్నారు. భూయజమానులు, భూమి మాఫియా, వడ్డీవ్యాపారస్తులు, వ్యాపారస్తుల అపవిత్ర కూటమి బెంగాల్‌ సాంఘిక, అర్ధిక జీవితాన్ని అజమాయిషీ చేస్తోంది. ఈ సాంఘిక శక్తులు గణేష్‌ చతుర్ధి, హనుమాన్‌ పూజ, తారామాత ఆరాధన వంటి ఉత్సవాలను ప్రోత్సహించి బెంగాల్‌లో బ్రాహ్మణీయ వాతావరణాన్ని శక్తివంతం చేశాయి. ఈ ఉత్సవాలన్నీ స్థానిక వ్యాపార, రాజకీయ వర్గాలతో కూడిన ఆశ్రితపెట్టుబడిలో అంతర్భాగమే. తమ సాంఘిక పునాదిని సృష్టించుకోవడం కోసం వాళ్ళు తమతమ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణాలను చేస్తున్నారు. ఈ మధ్యనే టియమ్‌సి నుండి భాజపాలోకి చేరిన సుఖేంద్‌ అధికారితో సహా అనేకమంది ఆ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళ నియోజకవర్షాలలో పెద్ద సంఖ్యలో హనుమాన్‌ దేవాలయాలు నిర్మించిన వార్తలు వస్తున్నాయి. భాజపాకు గతంలో వ్యాపారస్తులు, వైశ్యులు పునాదిగా వుండేవారు. ఇప్పుడు నూతనంగా తలెత్తిన సాంఘిక శక్తికూడా బనియాలను పోలిన వర్గస్వభావాన్నే సంతరించుకున్నది. వాళ్ళకు ఉత్పత్తితో సంబంధం వుండదు. బహుశా అందుచేతనే వాళ్ళు భాజపావైపు మొగ్గి వుండవచ్చు. అవినీతిపరులైన వ్యాపారస్తులు, బియమ్‌సి నాయకులు, కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా చేయిస్తున్న సిబిఐ దాడుల కారణంగా భాజపా వైపు మొగ్గుచూపుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో తన ప్రత్యర్థుల్ని స్వేచ్చగా పోటీ చేయనివ్వడానికి టియమ్‌సి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. భాజపా పాలనలో వున్న త్రిపురలో కూడా ఇలానే జరిగిందనే నిజం. ఇలాంటి అప్రజాస్వామిక కార్యకలాపాల పట్ల ప్రజలు విసుగుచెంది వున్నారు.

గతంలో బెంగాల్‌ను పరిపాలించిన వామపక్ష రాజకీయపార్టీలు అఖిలభారత వేదికలమీద ఎంత గొంతు చించుకొని మాట్లాడినా ఆచరణలో ప్రధానంగా కాంగ్రెస్‌ తోకపట్టుకునే నడిచాయి. 2019లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో, అ పార్టీలకు చెందిన స్థానిక కార్యకర్తలు టియమ్‌సికీ, భాజపాకు వ్యతిరేకంగా పోరాడడమనే నెపంతో వాస్తవానికి భాజపాతో కుమ్మక్కై ఆ పార్టీకే ఓటు వేశారు. 2021 ఎన్నికలలో భాజపా, 2026 ఎన్నికలలో వామపక్షం అనే నినాదాన్ని వాళ్ళు ఇచ్చారు. గత 34 సంవత్సరాల వామపక్ష పాలనలో మార్చిస్టుపార్టీ నాయకత్వపు సామాజిక పునాది ప్రగతి నిరోధక స్వభావాన్ని సంతరించుకున్నదని ఈ నినాదం ద్వారా తెలుస్తుంది.

మనదేశ సాంఘిక, ఆర్థిక స్థితి గురించి, బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం గురించి చాలామంది మేధావులు చర్చించివున్నారు. సామ్రాజ్యవాదం, భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావానికి వున్న సంబంధాన్ని వాళ్ళు తెలియజెప్పారు. ఆ విషయం పళ్చిమబెంగాల్‌కు కూడా వర్తిస్తుంది. అయితే ఈ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక నిర్దిష్ట అంశాలున్నాయి. అవి గణనీయమైన సంఖ్యలో వున్న ముస్లిం జనాభా, ముస్లింలు మెజారిటీగావున్న సరిహద్దు దేశం, హింసాకాండతో కూడిన దేశవిభజన చరిత్ర వంటివి. “ఇతరులు” అయిన ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని తీవ్రం చేయడంలో అర్‌యస్‌యవిజయవంతం అయింది.జనాభా లెక్కలలో ముస్లింల సంఖ్య పెరగడం పట్ల, సరిహద్దుల ఆవల నుండి వాళ్ళు భారతదేశంలోకి వలసలు రావడం గురించి, వాళ్ళ టెర్రరిస్టు కార్యకలాపాల గురించి అర్‌యస్‌య బెంగాల్‌లో సాధారణ ప్రజలలో అసత్య ప్రచారాన్ని చేసింది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సిపియమ్‌, టియమ్‌సిలతో సహా ఏ రాజకీయశక్తి పోరాడలేదు. హిందువుల ఓట్లు పోతాయేమోనని భయం వాళ్ళను వెంటాడింది. శిలాపూజ, రథయాత్ర, బాబ్రిమసీదు కూల్చివేత సమయాలలో బ్రాహ్మణీయ ప్రచారం అత్యున్నతస్థాయికి చేరింది. వాళ్ళతో పోరాడడానికి అవసరమైన ప్రత్యామ్నాయ సాంఘిక ఆర్థిక ఎజెండా ఏదీ సిపియమ్‌కిగానీ, టియమ్‌సికిగానీ లేదు.

భాజపా ఫాసిస్టులను ఎదుర్కోవడానికి ప్రధానంగా “భాజపాకు ఓటు వేయవద్దు” అనే నినాదాన్ని కొన్ని వామపక్ష సంఘాలు, కొందరు ఉదారవాద మేధావులు ప్రచారం చేశారు. అయితే గత కొద్దికాలంగా భాజపాకు వ్యతిరేకంగా ఐక్యకార్యాచరణను నిర్మాణం చేయడంలో వాళ్ళు నిమగ్నం కాలేదు. ఫాసిజంపై పోరాటం కింది నుండి జరగాలా, పై నుండి జరగాలా అనే అంశాన్ని చర్చించడంలోనే వాళ్ళ సమయం గడిచిపోయింది. భాజపాకు ఓటు వేయవద్దు అనే నినాదాన్ని టియమ్‌సి స్వాగతించింది. టియమ్‌సి దుష్పరిపాలన భాజపాకు అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. ఈ నినాదం కేవలం కొద్దిమంది కార్యకర్తల ముఠాలకే పరిమితమవుతుంది. భాజపా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య వుద్యమం నిర్మాణం కాకుండా ఇచ్చే ఇలాంటి నినాదాలను సాధారణ ప్రజలు పట్టించుకోరు.

ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారి విషము సమస్యలతో సంబంధం లేకుండా ఇచ్చే ఇలాంటి పిలుపులు ఖచ్చితంగావిఫలమవుతాయి. ఆర్‌యస్‌యస్‌, భాజపా ముఠాకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని మనం కోరుకున్నంత మాత్రాన అలా జరగదు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడడానికి పార్లమెంటరీ పద్ధతి ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతిరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తెచ్చుకోవాలి. ఉత్తరభారతదేశపు రైతులు మార్గాన్ని చూపించారు. చరిత్ర నేర్పుతున్న పాఠం కూడా అదే. తాము ఏ మార్గాన్ని అనుసరించదలచుకున్నారో నిర్ణయించుకోవాల్సింది విప్లవకర ప్రజాస్వామిక శక్తులే.

(1. పాంజీ పథకం : మదుపుదార్లను అధికలాభాల ఎరతో ఆకర్షించి క్రమక్రమంగా దివాళా తీయించే పథకం. దీనికి ఉత్పత్తితో సంబంధం వుండదు. మదుపుదార్లను చేర్చినకొద్దీ లాభాలు పెరుగుతాయనే అశ చూపిస్తారు. 1920లలో చార్లెస్‌ పాంజీ అనే ఒక ఇటాలియన్‌ వ్యక్తి నార్త్‌ అమెరికాలో దీన్ని ప్రారంభం చేశాడు. ఆ పేరుమీద దీన్ని పాంజీ పథకం అంటున్నారు. – అను)

అనువాదం : సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌

2 thoughts on “పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

  1. ఆధునిక బెంగాల్ చరిత్రను ఒక్క మాటలో చెప్పాలంటే MLM to MLM. మొదటి MLM ఆంటే మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం. రెండో MLM అంటే మల్టీలెవల్ మార్కెటింగ్. దీనినే అక్కడ (చార్లెస్ ) పోంజీ స్కీం అంటారు.

  2. పై వ్యాసాం లో విపలావోద్యమ పాత్ర గురించి లేదు. వామపక్ష శతులు ఆర్థిక రంగం లో చేసిన కృషి కొంతమేరకైనా కన్పిస్తుంది,కానీ,భావజాల రంగం లో ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని ప్రస్తుత బెంగాల్ మరియు కరీం నగర్,వరంగల్ ప్రాంతాలలో హిందూ ఫాసిస్ట్ప్రభావం తెలియ జేస్తుంది.. అది మన కర్తవ్యాన్ని గుర్తుజేస్తున్నది.

Leave a Reply