1. కథలు రాస్తూ నవలలోకి రావాలని ఎందుకు అనిపించింది?

నా కథలు అన్నీ దాదాపు సామాజిక సమస్యలకు సంబంధించినవే. ఈ రకమైన ఇతివృత్తాలకు ‘చమక్కు’ మనిపించే నైపుణ్యతకంటే ‘నెరేటివ్‌’ విధానం- పాఠకుడికి సులభంగా అర్ధమవడానికి వీలవుతుంది. అందువల్లే నేను కథను నైపుణ్యీకరించే క్రమం మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు. సామాన్య పాఠకుడికి చేరాలన్నదే నా లక్ష్యం. దానివల్ల నా కథలు పెద్దవిగా వుండేవి.

అలా రాస్తున్న క్రమంలో కథకంటే నవలలో జీవితాన్ని మరింత వివరించగలననిపించింది. అంటే, జీవితంలో వుండే ఆర్థిక సామాజిక, రాజకీయ ప్రాధాన్యతలను చెప్పడానికి నవలలో అయితే వీలవుతుందనుకున్నాను.

నా మొదటి నవల ‘నర్రెంక సెట్టు కింద’ అలా రూపుదిద్దుకున్నదే. అప్పట్లో ఎన్‌కౌంటర్లు విపరీతంగా జరిగాయి. ఆ మృతదేహాలను రక్తబంధువులు స్వాధీనం చేసుకునే సందర్భంలో నేను తప్పనిసరిగా మార్చురీల దగ్గరకు వెళ్తుండేదాన్ని. అ సందర్భంగా బంధువులూ, వుద్యమ సానుభూతిపరులూ పడే ఆవేదన, ఆ చంపడంలోని ‘హింస’, అదంతా నన్ను కలవరపరిచేది. దానిలో నుండే ఓ అమరుడి జీవితం కథగా మొదలుపెట్టాను. అయితే ఆ ఇతివృత్తం కథగా ఇమడలేదు. అతను పాల్గొన్న వుద్యమం, అ ప్రాంతపు సామాజిక పరిస్థితులు, ఆ వుద్యమ క్రమం వస్తేనే అతని అమరత్వపు గాఢత చెప్పగలననిపించింది. అట్లా అతని ప్రేరణగా ఆ వుద్యమాన్ని చిత్రించాల్సిన అవసరం కలిగింది. అందుకు నవల అయితేనే సరిపోతుందనుకున్నాను. అయితే నవల క్రమంలో అతనొక్కడే అందులో లేడు. ఆ వుద్యమంలో పాల్గొన్న ఎందరో వున్నారు.

  1. కథ – నవలా రచనలో ఏమైనా తేడా వుందా?

తప్పకుండా వుంటుంది. కథకు ఒక సంఘటనా, ఒక కాలం పరిమితి వుంటాయి. తీసుకున్న ఇతివృత్తం ఎలా మొదలై ఎలా ముగిసిందో చెప్తే సరిపోతుంది. నవల అలా కాదు. ఒక జీవితం, ఒక కాలం లేదా ఒక సంఘటన వీటన్నింటిలో దాని వెనకముందులు చెప్పాల్సి వుంటుంది. ఆ పూర్వాపరాల పరిణామ క్రమాన్ని అంతర్లీనంగా వివరించాల్సి వుంటుంది. అందుకు అప్పటి సమాజ అధ్యయనం అవసరమవుతుంది. ఇది శ్రమతోనూ, దీక్షతోనూ చేయాల్సిన పని.

  1. స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ జీవితం ఇతివృత్తాలకు కొనసాగింపుగా రాజకీయార్థిక ఇతివృత్తాలతో కథలు రాయడం మొదలు పెట్టాకే నవలల్లోకి వచ్చారు. కథా రచనలోని ఈ క్రమం మిమ్మల్ని నవల వైపు నడిపించిందని అనుకోవచ్చా?

అసలు రాయడం మొదలు పెట్టటమే ఒక బ్రహ్మ ప్రయత్నం. ఏ రచయితైనా ముందు కవిత్వం, తరవాత కథ, ఆ తరవాత నవలకు రావడం సహజం. లేదంటే కవిత్వం దగ్గరే ఆసక్తి కొద్దీ ఆగిపోయేవాళ్ళు, కథమీద అభిలాషకొద్దీ ఆగిపోయేవాళ్ళు వుంటారు. అలాకాక నవల రాయాలనుకున్నారంటే- వారికేదో ఇంకా చెప్పాలనీ చెప్పాల్సింది వుందనీ అనిపించి నవలా రచనకు ఉపక్రమిస్తారనుకోవచ్చు. నేను కూడా అలాగే నవలా రచనలోకి వచ్చాను. నేను రచయితగా ప్రారంభంలో నాకు తెలిసిన కుటుంబం, మా వూరు, పరిసరాలు, వ్యక్తుల గురించి రాస్తూరాస్తూ కార్యకర్తగా నేను పనిచేస్తున్న సామాజిక సంఘటనలవైపు వచ్చాను. అవి సహజంగానే రాజకీయ, ఆర్థిక సంబంధాల విశ్లేషణతో కూడుకుని వుంటాయి కదా!

  1. ‘ఒండ్రుమట్టి’ నవలలో 70-80 ఏళ్ళు వెనక్కివెళ్ళి ఆనాటి సామాజిక చరిత్రను ఎలా నవలలోకి తేగలిగారు? అప్పటి సంస్కృతిని మీరు అ నవలలో అద్భుతంగా చిత్రించారు. సంస్కృతి నిరంతరం మారుతూ వుంటుంది కదా, అప్పటిదాన్ని ఎలా రాయగలిగారు?

నా చిన్నప్పుడు మా వూరు చాలా వెనకబడి వుండేది. నీళ్ళులేవు, పంటల్లేవు, కరంటులేదు, చదువుల్లేవు. అలాంటి చోట మనుషులూ, ఊరూ ఎలా వుంటాయో నా అనుభవంలోనే వుంది. అదీగాక మా అమ్మమ్మ మాలక్ష్మమ్మ తన అమ్మ, అమ్మమ్మల గురించి చెప్పే కథలు నా మనసులో తిరుగుతుండేది. అంటే నాకు ముందు మూడుతరాల సమాచారం నా వునికిలో, ఊహల్లో వుంది.

ఒక ఉదాహరణ చెప్తాను. “కంపెనీ తిరణాల కథలో మా వూరి ‘గంగ తిరణాల’ గురించి చెప్పాను. ఆ తిరణాల కథ మా అమ్మమ్మ చెప్పిందే. నాకు ఊహ తెలిసేనాటికి ‘గంగ తిరణాల’ లో చాలా మార్పు చోటుచేసుకుంది. ప్రభలు వచ్చాయి. కొన్నాళ్ళకు కరెంటు ప్రభలు వచ్చి ఇప్పుడు వాటిమీద రికార్డు డాన్సులు కూడా వచ్చాయి.

అదేకాక, మెట్ట పంటలు కావడంతో మనుషులు పెద్దగా వ్యవసాయపు పనుల ఒత్తిడిలేక విశ్రాంతిగా వుండేవాళ్ళు. జనవరి దాటిందంటే పొద్దుటే సంగటి తిని, ఏదోఒకచోట పందిళ్ళ కింద చేరేది. అలా చేరినపుడు ఏ పౌరాణిక కథో, కాశీమజిలీ కథలనో వినేవాళ్ళం. మా వూళ్ళో ఓ ఇద్దరు వ్యక్తులు చదువులేదు, అయినా ఎంత అద్భుతమైన “నెరేషన్‌” వుండేదంటే విన్న కథలే అయినా మళ్ళీ మళ్ళీ అసక్తిగా వినేవాళ్ళం. “కిష్టాయి గిష్టాయి కిందాకుల్లోనే పోయారని”- అభిమన్యుడి వీరత్వం గురించి ‘నారాయుడు” మామ చెప్పే కథ ఎంత ఆసక్తిగా వుండేదంటే అది నా మనసులో రికార్డు అయిపోయింది. అట్లా “రాముడి గుడి’ సెంటర్లో వెంకయ్యమామ చెప్పే భేతాళుడి కథలు కూడా. అలా చిన్నప్పుడు రాట్నాలు వడికేవాళ్ళ దగ్గరో, “నార’పేనుకొనే వాళ్ళదగ్గరో చేరి వింటుందేదాన్ని. నేనేకాదు, ఆ రోజుల్లో 50,60 ఏళ్ళనాడు వేసవి కాలమంతా ఇట్లా నాటకాలతో, తోలుబొమ్మలతో, భట్రాజులతో మనుషుల తీరిక వేళలు గడిచిపోయేవి.

ఇప్పట్లా అమెరికాల గురించో, డబ్బు గురించో, సంపద గురించో మాటలే వుండేవి కాదు.

చదువులూ, రవాణా వెసులుబాటు లేనిచోట సంస్కృతి వేగంగా మారే అవకాశం తక్కువ. నా చిన్నప్పుడు పాత సంస్కృతి తాలూకా చివరి దశ కొనసాగుతుండేది. దాన్ని తిరిగి మా పెద్దల ద్వారా, ముఖ్యంగా మా అమ్మ ద్వారా జ్ఞాపకం (రీ కలెక్ట్‌) చేసుకున్నాను.

  1. కోస్తాంధ్రలోని పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమాన్ని ‘ఒండ్రుమట్టి’ నవలలో తెలంగాణా నుంచి సంపద తరలింపు కోణంలో కూడా రాశారు. ఈ రాజకీయార్థిక పరిణామాలను సాహితీకరించడంలో మీ అనుభవం ఏమిటి? ఈ మొత్తానికి మీ సోర్స్‌ ఏమిటి?

నేను ఎన్‌.జి.రంగా రచనలు కొన్ని చదివాను. అలానే కారంచేడు గ్రామంలో పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. కారంచేడు గ్రామ చరిత్ర వివరాలను సేకరించాను. అదేగాక తెలంగాణాలో కోస్తా నుండి వలసపోయి అక్కడ సెటిలయిన వాళ్ళ నుంచి సమాచారం సేకరించాను. తెలంగాణాలో రెండు మూడు గ్రామాలు తిరిగాను. అక్కడ సెటిలయినవాళ్ళు వామపక్ష రాజకీయాలలో తెలంగాణా సాయుధపోరాట కాలం నుండి పనిచేస్తున్న మిత్రులు. వాళ్ళు నాకు బాగా సహకరించారు. ఇదంతా నా రచనా క్రమంలో ఉపకరించింది.

నేను చదువుకుంటున్న రోజుల్లో నన్ను రాజకీయంగా ప్రభావితం చేసినవాళ్లలో ఆంధ్రా నుండి వెళ్ళి నిజామాబాదు దగ్గర బోధన్‌లో సెటిలయిన పరుచూరు సీతారామయ్యగారు ఒకరు. ఆయన రాజకీయాల నుండి దూరమైనా వ్యక్తిగా నన్ను ఆకట్టుకున్నాడు. ఎంతగానంటే, ఆయన చనిపోయి దశాబ్దం దాటినా ఆ కుటుంబంతో నా పరిచయం ఇప్పటికీ ‘రక్త సంబంధీకుల’ వలె కొనసాగుతుంది. వాళ్లంతా నన్ను వాళ్ల కుటుంబంలో వ్యక్తిగానే చూస్తారు.

అలా ఆ కుటుంబంతో గడపటం కోసం బోధన్‌ వెళ్లేదాన్ని. అట్లా బోధన్‌ చుట్టుపక్కల క్యాంపులు, వాళ్ళ బంధువుల ద్వారా నవల కంటే ముందే నాకు చాలా సమాచారం వుండేది. కన్నెగంటి రవి నాన్నగారు నరసింహారావుగారు కూడా నాకు అప్పటి నుండి తెలుసు. ఆయన కూడా చాలా సమాచారం ఇచ్చారు.

“ఒండ్రుమట్టి రాయాలనుకున్నాక తెలంగాణాలోని రెండు మూడు గ్రామాలు తిరిగాను. ముఖ్యంగా రాయకూర్‌లో ‘సాంబులు’ వామపక్ష వీరాభిమాని. అసలు అ కుటుంబాలన్నీ అలానే వుంటాయి. వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులు వుండి రాయకూర్‌ పాత, కొత్త (గ్రామాలను సర్వే చేశాను.

అసలు కారంచేడు గ్రామంలోనే పాత కమ్యూనిస్టు పెద్దాయన లక్ష్మయ్యగారు- ఆయన ఆ గ్రామం గురించి ఎంతో విశ్లేషించి చెప్పారు. తెలంగాణాకు ఎన్ని కుటుంబాలు వెళ్ళాయి, వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితి ఏమిటి, ఆ తరవాత వారి ఎదుగుదల ఏమిటి? అన్నవి. ఇదంతా నా రచనకు సోర్సే కదా!.

  1. సామాజిక సంఘర్షణ – మానవ సంబంధాల సంఘర్షణ ‍‍_ వ్యక్తుల అంతరంగిక సంఘర్షణ అనే మూడు అంతస్థుల వైపు నుండి చూస్తే ఈ బృహత్‌ నవల మీకే ఏమనిపిస్తోంది?

ఇవన్నీ ఒకదాని నుండి ఒకటి విడదీయలేం. మనిషి సంఘజీవి. తనదైన వ్యక్తిగత జీవితం- తనచుట్టూ వున్న సామాజిక జీవితంతో ముడిబడే వుంటుంది. ఈ క్రమంలో మనుషుల మధ్య సంబంధాలలో సంఘర్షణ అనివార్యంగా వుంటుంది. నిజానికి ఈ మూడింటినీ కలగలిపి చిత్రించగలిగే శక్తి వుంటే రచయితకు అంతకంటే కావల్సిందేముందీ?

సమాజంలో వుత్పత్తి ప్రక్రియలో వస్తున్న మార్పు మానవ సంబంధాలలోనూ, విలువల్లోనూ మార్పు తెస్తుంది. ఫలితంగా వ్యక్తుల జీవితాలలో కలతలు, కల్లోలాలు సంభవించక తప్పదు.

“మాలపల్లి, “అసమర్ధుని జీవన యాత్ర, ‘చదువు, “గడ్డురోజులు” వంటి ఎంతో తెలుగు సాహిత్యం మనముందు వుంది.

  1. ప్రగతిశీల నవలల్లో కూడా మహిళలు ఎక్కువగా కుటుంబ జీవితం ఇతివృత్తంగానే నవలలు రాసినట్లుంది. దీనికి భిన్నంగా మీరు నేరుగా సామాజిక రాజకీయార్థిక ఇతివృత్తం తీసుకుని నవలలు రాస్తున్నారు. ఈ అనుభవాన్ని ఎలా వివరిస్తారు.

నేను సాహిత్యం ద్వారా, ఆ ప్రేరణతో సామాజిక రంగంలోకి వచ్చినదాన్ని కాదు. ఓ సాధారణ కార్యకర్తగా సామాజిక, రాజకీయ ఆచరణలలోకి వచ్చినదాన్ని కావడంతో, ఆ సమస్యలే ప్రధాన అంశంగా సాహిత్యంలోకి వచ్చాయి. అదేకాక నా వ్యక్తిగత సమస్యను దాటి బయటి ప్రపంచం మీదకు నా దృష్టి ఎప్పుడూ వుండడానికి కారణం- నేను మధ్య తరగతి కుటుంబ స్త్రీగా ఎప్పుడూ పరిమితమై లేను. నాకు అంతో ఇంతో చైతన్యం కలిగినప్పటి నుండీ నాకంటే అద్వాన్నపు జీవితం గడుపుతున్నవాళ్ళు ఎందరో కనిపించేవారు.

పైగా, నా బాల్యం ఏమంత పెట్టి పుట్టింది కాదు. ఘర్షణలతో, వెనుకబాటుతనంతో సాగింది. ఇదికూడా నన్ను మనిషిగా నిలబెట్టిందనుకుంటాను. అందువల్లే సమాజం గురించి, మనుషుల గురించి ఎక్కువ ఆలోచించాను.

ఒక రకంగా వ్యక్తిగత అనుభవాల వల్ల సాహిత్యంలోకి పనిగట్టుకొని వచ్చాను. అయితే తరవాత కాలంలో అదే ప్రధానంగా దాని చుట్టూ తిరగలేదు. దాన్ని దాటి ప్రపంచాన్ని గురించి చెప్పాలనుకున్నాను. ఇందుకు సుదీర్ఘకాలంగా సాగిన, సాగుతున్న నా సామాజిక ఆచరణే ప్రేరణగా వుందనుకుంటాను.

  1. సామాజిక రాజకీయార్థిక జీవితంలో భాగంగా కుటుంబ సంబంధాలను చూస్తున్నప్పుడు ఏమనిపించింది?

ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యమనిపిస్తోంది. మా అమ్మ, మా వూళ్ళో స్రీలు ఆనాడు కుటుంబపు పనిని పనిగా అనుకునేవాళ్ళు కాదు. వండుకోవడం, వూడ్చుకోవడం పనేకాదు వాళ్ళ దృష్టిలో. నేను ఆ స్థితిని నా బాల్యం అంతా గడిపాను. అందుకే కుటుంబపు శ్రమ, బిడ్డల పెంపకం వంటివి నన్ను ఏ పనికీ అటంకపరచలేకపోయాయి. ఇది మధ్య తరగతి మహిళలను ఎక్కువగా కుంగతీస్తుంది.

నిజానికి చదువుకున్న మధ్యతరగతి స్త్రీగా నన్ను నేనెప్పుడూ అనుకోలేదు. కనుకనే కుటుంబ సంబంధాల వత్తిడి నన్ను అతలాకుతలం చేయలేదు.

నిజానికి ఏ కుటుంబంలోనైనా ఘర్షణ తప్పదు. ఇప్పుడున్న ఈ కుటుంబ చట్రమే అటువంటిది. అయితే ఉత్పత్తిలో పాల్గొనే స్తీలకుండే విలువ, ప్రధానంగా మగవాడిమీద ఆధారపడే స్రీలకుండదు. ఆర్థిక స్వేచ్చ- మానసిక స్వేచ్చనూ ధైర్యాన్నీ ఇస్తుంది. అయితే అది మాత్రమే సరిపోదు. దానికి సామాజిక మార్పు తోడుకావాలి. వ్యక్తి స్వేచ్చ మార్పుకు దారితీయదు. సామాజిక మార్పు వ్యక్తి స్వేచ్చను సుసంపన్నం చేస్తుందనే అవగాహన అవసరం. వ్యక్తులు మారితే సమాజం మారుతుందనుకోవడం పొరపాటు. అలా తమ సాహిత్యాన్ని డైవ్‌ చేసేవాళ్ళ వల్ల మార్పుకంటే నష్టం ఎక్కువని నా వుద్దేశం.

మనుషులం విడివిడి గొలుసులం కాదు. అది అర్థం చేయించాలి. అది అర్ధమై చైతన్యం అయినప్పుడు కుటుంబం దాటి సమాజంలో తమ భాగం కోసం స్త్రీల పోరాటం సాగుతుంది.

  1. ఈ దృక్పథం మీ ‘గీతలకావల’” కథల సంపుటి కంటే భిన్నమైనదని అనుకోవచ్చునా?

బహుశా కావచ్చు. అయితే ‘గీతలకావలి’లో కూడా చర్చనీయాంశమైన కథ ‘చంద్రవంక’. దానిలోనూ కుటుంబ చట్రంవల్ల- మేనరికపు పెళ్ళి, దాని పరిణామాలు చెప్పాను. అసలు ‘గీతలకావల’ కథే- సమాజపు, కుటుంబపు గీతలకు- అవతలి సంబంధాల కథ.

మొదటి దశలో రాసిన కథలు కుటుంబ సంబంధాల చుట్టూనే తిరిగాయి. అయితే వాటి వత్తిడిని కుటుంబంలోని పురుషాధిపత్యం వైపునుండి మాత్రమే చూసాను. ఆ పురుషాధిక్యతకు వుండే ఆర్థిక కారణాలను సరిగ్గా విశ్లేషించలేకపోయి వుండవచ్చు. అనాటికున్న దృష్టి పరిమితమైంది కావచ్చు లేదా తొలి రచనల్లో ఎలా చెప్పాలో తెలియక కూడా వుండవచ్చు.

  1. మీ రెండో దశ కథల్లో, నవలల్లో మీరు స్వీయానుభవ పరిధిని అధిగమించారని అనుకోవచ్చా?

ఎప్పుడైనా కుటుంబం చుట్టూ తిరిగే కథల్లో వ్యక్తిగత అనుభవాలు ఏదోమేరకు లేకపోతే- ఆ కథ గాఢతను సంతరించుకోదు. స్వీయానుభవం తాలూకా నొప్పి అ కథలోని అంత:చేతనను తాకుతుంది. అందువల్ల కుటుంబపు కథలో వైయక్తిక ఛాయలుంటేనే చర్చ వీలవుతుంది. ఇటీవల రాసిన- ‘సంయమి” కథగానీ- “పెళ్ళి సందర్భం’గానీ అలా వున్నవే కదా! అయితే నేను తరవాత దశలో ఆ పరిమితి దాటి సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకున్నాను. నిర్వాసితులు, వలసలు, ఆర్థికమండళ్ళు, ముంపు బాధితులు – కనుకనే తరవాత కథల్లో అర్థిక, రాజకీయ కోణం ఎక్కువ కనిపిస్తుంది.

  1. ఈ కథల్లో, నవలల్లో చాలా చోట్ల గాఢమైన సన్నివేశాలు వున్నాయి. ఇందులో మీ స్వీయానుభవానికి బయటి వాటిని ఎలా అందుకోగలిగారు? దీన్ని దృక్పథం వైపు నుంచి ఎలా వివరిస్తారు?

ఏ రచనైనా దృక్పథమొక్కటే గాఢతను కలిగించలేదు. దృక్పథం తప్పక వుండాల్సిందే- అయితే ఏ కథలోనైనా, రచనలోనైనా మనం చెప్పే సమస్య ఎక్కడో మన లోపల హంట్‌ చేస్తూ వుండాలి. ‘ముంపు’ కథా వస్తువు నన్ను చాలా అవేశపరిచింది. నిజానికి వలస జీవితం నన్ను ఎప్పటికీ వేధిస్తూ వుంటుంది. ఎందుకంటే నేను నా ప్రాంతం నుండి ఒక అమాయకపు బాలికగా గుంటూరు వచ్చి మానసికంగా చాలా వేదనపడ్డాను. అ కాలంలో దానికి ‘సొలేస్’ దొరికేదికాదు. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అది కథల్లో రిప్లెక్ట్‌ అయింది. అందుకే ‘ముంపు’ కథలో అంత గాఢత వచ్చింది.

అలానే ఏవో కారణాలు మనకు ఎక్కడో అ కథా వస్తువుతో మమేకత్వాన్ని కలిగిస్తాయి. అలా లేకపోతే ఆ రచన తామరాకు మీద నీటిబొట్టులాగా వుంటుంది.

  1. సామాజిక చరిత్రకు, మానవ జీవితానికి మధ్య సమతుల్యత ఎలా సాధించారు?

నిజానికి ఇవి రెండూ విడివిడిగా లేవు. అయితే దీన్ని అర్థం చేసుకోవడంలోనే సమస్య. మనిషి సమాజంలో భాగం, మనిషి చరిత్ర కూడా సామాజిక చరిత్ర అవుతుంది. మనిషి స్థల కాలాలలో జీవించి వుండటమంటే, ఆ స్థల, కాల వుత్పత్తి జీవితంలో కూడా వుంటాడు కదా!. ఈ విశిష్టత అర్ధమయితే, రచనలోనూ, ఆ సమతుల్యత వస్తుందనుకుంటాను.

బహుశ ఇది విడదీయలేని నా సామాజిక అచరణవల్ల, నాకు అవగాహన కలిగించింది కావచ్చు. అదేగాక నా ముందు తరం వారి అనుభవాలు వినడం- అవసరమైన మేరకు అధ్యయనం చేయడం కూడా నా ఆలోచనలను పెంపొందించి వుండవచ్చు.

అయితే మీరన్నట్టుగా నా రచనల్లో నేను అంత సమతుల్యతను సాధించానా? అన్నది ప్రశ్న

  1. ‘మేరువు’ నవలా నాయకిని, అనాటి కమ్యూనిస్టుపార్టీని- ఇప్పుడు విప్లవోద్యమంలో మహిళల పాత్రను, పార్టీ అవగాహనను పోలిస్తే మీకేమనిపిస్తుంది?

అప్పటికీ ఇప్పటికీ సృష్టమైన తేడా వుంది. ‘మేరువు’ నవలలోని కథానాయకి భర్తతోపాటు పార్టీలో చేరింది. అయితే ఆ క్రమంలో ఆమె మరింత చైతన్యవంతమై భర్త చనిపోయినా పార్టీలో, పోరాటంలో కొనసాగింది. కానీ ఆ నవలలో ఆ కాలంలో చాలా మంది స్త్రీలు భర్తతోపాటు వెళ్ళి, వాళ్ళతో పాటు వెనక్కి వచ్చారు.

అదేకాదు ఆ నాటి స్త్రీలు భర్త చేసే పనికి సహాయకారులంగా అనుకున్నారు. తమకు తాముగా సామాజిక వ్యక్తిత్వాన్ని కలిగిలేరు. అయితే వారి కోసమే అయినా ఎన్నో కష్టాలను, హింసనూ భరించారు. సొంత చైతన్యం తక్కువనే చెప్పాలి.

అయితే ఈ రోజు చాలా మార్చు వచ్చింది. స్రీలు స్వయంగా గానీ, ఎవరి ద్వారా కానీ సంఘాల్లోకి వచ్చినా- వీలయినంతగా సంఘాలు వారిని చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా పోరాటం వీడిన భర్తలతోపాటు భార్యలూ వస్తున్నారుగానీ నిలబడి ఆచరణలో వుంటున్నవారి సంఖ్య కూడా పెరిగిందనే చెప్పాలి.

ఇంకొకటి, అనాడు దళ సభ్యులుగా పని చేసినవాళ్ళు మల్లు స్వరాజ్యం, ద్రోణవల్లి అనసూయమ్మలాంటి అతికొద్దిమందే అయితే ఈ రోజు ఒక్కోచోట మొత్తం దళమంతా స్త్రీలేనని వింటున్నాం. ఇది చాలా పెద్ద మార్పు కదా!.

అప్పట్లో పితృస్వామ్యం, రాజ్యం ఒకే నాణేనికి రెండువైపులన్న స్పష్టత పార్టీకి లేదు. ఆ అవగాహన పట్లనే స్పష్టత లేదు. ఇప్పుడు అలా కాదు. పితృస్వామ్యం పట్ల స్పష్టమైన అవగాహన వుంది.

  1. “మేరువు” లాంటి అత్యద్భుత పోరాట మహిళల వల్ల, వారి వారసుల వల్ల విప్లవోద్యమం సంతరించుకున్న స్ర్రీముక్తి అవగాహన వైపు నుంచి స్ర్రీవాదాన్ని మీరు ఎలా చూస్తారు? స్త్రీవాదం ప్రధానంగా పితృస్వామ్యం మీద పోరాటం చెయ్యాలంటుంది. నిజానికి ఈ “పితృస్వామ్యం’”- రాజ్య స్వభావాన్ని కలిగి వుంటుంది. అయితే అదే “రాజ్యం” కాదు, రాజ్యానికి వెన్నెముక. స్త్రీవాదులేమనుకుంటారంటే పితృస్వామ్యపు ప్రతినిధులైన పురుషుడిమీద బాణం ఎక్కుపెడితే అది రాజ్యానికి తగులుతుందని- కనక “రాజ్యం” గురించి మాట్లాడవలసిన అవసరంలేదని మౌనంగా వుంటారు.

అయితే పితృస్వామ్యం రాజ్యాన్ని బలోపేతం చేసి- దాని వెనక నిలబడుతుంది. అందుకే రాజ్యాన్ని ఎదిరించడం ద్వారా పితృస్వామ్యాన్ని దెబ్బకొట్టగలగాలి.

రాజ్యాన్ని ఎదిరించడం అంటే- రాజ్యాన్ని కాపాడుకుంటూ, కావలికాస్తూ వున్న ఆర్ధిక, సామాజిక వ్యవస్థలన్నిటినీ ఎదిరించడం, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్‌ లింకు వున్న అంశాలు. ఈ రకమైన అవగాహన సరైందని విప్లవశక్తులు నమ్ముతాయి.

అదే ఇద్దరి మధ్యా తేడా!

  1. ఇంతకూ ఇప్పుడు విప్లవోద్యమంలో మహిళలు ఎక్కడికి చేరుకున్నారు? స్త్రీవాదులు ఎక్కడికి చేరుకున్నారు?

ముందే చెప్పినట్లు విముక్తిబాటకు దారులుపోస్తూ, విప్లవంలో మహిళలు నూతన ఉత్తేజంతో, కొత్త సంస్కృతిని సృష్టిస్తున్నారు. స్త్రీవాదులు మార్పుకోసం సాహిత్యం చుట్టూ తిరిగీ తిరిగీ- ఇంకేం చెయ్యాలో తెలియక, “అయ్యో” అనుకుంటున్నారు. కన్సూమరిజానికి, మార్కెట్‌కి మచ్చికై ఇంకా ఇంకా వెనక్కి పోతున్న మధ్యతరగతి స్త్రీలను చూస్తూ ఆవేదన చెందుతున్నారు.

  1. సామాజిక ఉద్యమాలను మలుపు తిప్పిన కారంచేడు, చుండూరు ఘటనల మీద దళిత రచయితల నుంచి నవలలు రాలేదు. ఇంతకాలం తరవాత రాయాలని మీకు ఎందుకు అనిపించింది?

నిజమే!, దళిత రచయితలు ఇంతకాలం వీటిపై ఏమీ రాయకుండా వుండటం అశ్చర్యం!. ఏదో కవిత్వం, వ్యాసాలకే పరిమితమై అప్పటి అవేశాలను తీర్చుకున్నారు. అంతే తప్ప సామాజిక విశ్లేషణ వైపు చూడనేలేదు.


అదేగాక అ కాలంలో పనిచేసిన చాలామంది తరవాత ఎన్‌.జి.ఓ.ల్లో చేరి నీడమీద యుద్ధం నడిపారు. వాళ్ళ లక్ష్యం వేరు. ఆ తరవాత రకరకాల దళిత వుద్యమ బృందాలు చాలా బయలుదేరి- వారి వారి సొంత ప్రయోజనాలను కొంతలో కొంత తీర్చుకోవడంవలో పడ్డారు. అదే అభివృద్ధిగా తలచారు.

కుల వైరుధ్యం మీద పనిచేశామన్నారుగానీ- అదీ సరైన పద్ధతిలో చేసిందిలేదు. ఆ వైరుధ్యాన్నీ అగ్రకుల పెత్తందారుల కనుచూపుల్లోనే జరిగాయి.

కారంచేడు, చుండూరు మారణకాండల మీద రాయడమంటే ఆయా గ్రామాల, అర్ధిక, సామాజిక, రాజకీయ వైరుధ్యాలను అధ్యయనం చేయాలి. దానికి మొత్తం వర్గ వ్యవస్థలో స్థానం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక సుదీర్ఘ ప్రయత్నం.

దీనివైపు దృష్టి పెట్టకపోవడానికి మరొక కారణం- నష్టపరిహారాలు రాగానే ఉద్యమాలు విజయవంతమయ్యాయనే దృక్పథం. దీనివల్ల ఈ సమస్యల లోతును చూడటానికి పరిమితి ఏర్పడింది.

అక్కడి దాకా ఎందుకు?- దళితులపై దాడుల కేసుల విషయంలో కూడా అ పోరాటంలో పాల్గొన్న వాళ్ళుకూడా శ్రద్ధపెట్టి పట్టించుకోలేదు. కారంచేడు నాడు పౌరహక్కుల సంఘం, జడ్సన్‌లాంటి వ్యక్తులు, ‘చుండూరు’ నాడు కె.ఎన్‌.పి.యస్‌., చంద్రశేఖర్‌వంటి కొందరు వ్యక్తులు పట్టించుకుని కేసులు నడిపారు.

నేను ఇంతకాలం రాయకపోవడానికి- నేను సీరియస్‌గా రచనలవైపు సాగిందే ’85ల తరవాత. కొంత ఆలోచనలు పెరిగి, అవగాహన పెరిగి- ఆ ఉద్యమంలో పాల్గొన్న అనుభవాల నుండి- ఆ పోరాటాలను రికార్డు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాను. సమయం పట్టినా చేయవలసిన పని చేశాననుకుంటున్నాను.

  1. దళితవాదానికంటే భిన్నంగా “నిషిధ” చూపించిన మార్గం ఏమిటి?

దళితవాదం చుండూరు బాధితులను గ్రామానికి చేర్చి నష్టపరిహారాలిప్పించడంతో ఆగిపోయింది. ‘నిషిధ’లో- “కుల నిర్మూలనా పోరాట సమితి”- బాధితులను ఓదార్చి, ధైర్యమిచ్చి కోర్టులదాకా కూదా వారిని నిలబెట్టి పాక్షిక విజయం సాధించటం నవలలో చూపించాను.

మరొకటి ‘“నిషిధ’లో- వట్టి కుల వ్యతిరేక చైతన్యం మాత్రమే చాలదని- అందుకు సామాజిక చైతన్యంతోపాటు, సమాజంలో వున్న మిగిలిన శ్రేణులను కలుపుకోవాల్సిన అవసరాన్ని పాత్రలద్వారా రికార్డు చేశాను. అదేకాదు, చర్చల ప్రతినిధులు అక్కడికి వచ్చారంటేనే సాంఘిక, రాజకీయ వుద్యమాల గుర్తింపునూ, ఆ వైపు ప్రయాణించాల్సిన అవసరమేమిటో తెలియజేయడానికి ప్రయత్నించాను.

మొత్తంగా కుల రహిత సమాజంవైపు నడవాల్సిన దృక్పథాన్ని అంతర్లీనంగా చెప్పాను.

అయితే ముగింపు పోరాటపు సూచనలో లేకపోవచ్చు. కానీ అ బాధితుల అనంతమైన ‘ప్రార్ధనలో- వారి తీరని ఆవేదనను చూపించాను. రచయితలు వాస్తవానికి మరీ దూరంగా ఆదర్శీకరించడం మంచిది కాదేమోననిపించింది. నేననుకున్న భావన ఇటీవల గ్రాంసీని చదివిన సందర్భంలో రచయితల గురించి చెప్పినదానితో సరిపోల్చుకుంటున్నాను.

  1. తెలుగు నవలా చరిత్రలో విప్లవ నవల సాధించిన విజయాల గురించి చెప్పండి?

ఇది మనకంటే బయటివాళ్ళు అంచనా వేస్తే బాగుంటుందేమో! అయినా నవలా ప్రక్రియలో విప్లవ నవల మంచి ఎఫర్ట్‌ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘అంటరాని వసంతం” – నవల తెలుగు నవలా చరిత్రలో – ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు. దళిత, బహుజన సమస్యలమీద- “అంటరాని వసంతం”, ‘గుమ్మెట మోత’, ‘నిషిధ’ వంటి నవలలు విప్లవోద్యమం నుండీ వచ్చాయి. అయితే బయట రచయితలు రాసిన దళిత నవలలూ వచ్చాయి. అవి సమస్యను వున్నదున్నట్లు చిత్రించి వుండవచ్చు. అయితే ఆ సమస్య మూలాలను చెప్పినవి తక్కువ. అలా ఆలోచించినప్పుడు విప్లవ నవలలన్నీ వర్తమానంలో జరుగుతున్న సామాజిక పరిణామాలను నమోదు చేసాయనే చెప్పాలి.

స్త్రీవాదం తెలుగు నేలమీద చర్చ ప్రారంభంలోనే అల్లం రాజయ్య నవల ‘అగ్నికణం’” వచ్చింది. అటు దళిత కులం నుండి ఆదివాసీల నుండి వుద్యమం తెచ్చిన విలువలను ‘రాగో” లోనూ, ‘అగ్నికణం’లోనూ రచయితల చిత్రించారు.

అలాగే వుద్యమం తెచ్చిన మరో విలువ ఏమంటే తమ చరిత్రను తామే పునర్నిర్మించుకోవడం- అట్లా ‘కొమరం భీం’ వంటి గొప్ప చారిత్రిక నవలగా విప్లవోద్యమమే నమోదు చేయగలిగింది.

ఇక వుద్యమంలో సాగుతున్న, సాగిన దశలను పోరాట రూపాలను చిత్రించిన నవలలు చాలా వచ్చాయి. రాజయ్యగారి నవలలు చదువుతుంటే విప్లవోద్యమ దశలను అంచనా వేసుకోవచ్చు. అలానే రాయలసీమ ప్రాంతంలో జరిగిన పోరాటాన్ని చిత్రించిన ఎదురగ్గి’ నవలగానీ, వేంపెంట మారణకాండమీద వచ్చిన పాణి నవల ‘నిప్పులవాగు’ కానీ ఆయా వుద్యమాలలోని మంచి చెడులను గతితార్కికంగా విశ్లేషించాయి. ఇలా తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్చును తెచ్చింది విప్లవ నవల.

అట్లాగే ‘ఒండ్రుమట్టి’, ‘నిషిధ’ నవలలు కోస్తా ప్రాంతంలో వచ్చిన మార్పులను, ఆ మార్పులు వెనకవున్న అంతర్గత చలనాలయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలను, అంటే పొలిటికల్‌ ఎకానమీని విశ్లేషించాయి. ‘మాలపల్లి తరవాత ఈ ప్రాంతం నుండి ఈ అంశాలను విశ్లేషిస్తూ వచ్చిన నవల “ఒండ్రుమట్టి,

  1. విప్లవ నవల రాయవలసిన కొత్త కోణాల గురించి మీరేమనుకుంటున్నారు? ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు మీదుగా ‘మేరువు’తో మీ నవలా స్థలం కృష్ణా జిల్లాదాకా విస్తరించింది. అనకట్టల నిర్మాణానికి వెనుకటి నుంచి అమరావతి దాకా, కమ్యూనిస్టుపార్టీ చరిత్రలో జమిందారీ వ్యతిరేక పోరాటాల దగ్గరి నుంచి ‘నర్రెంకసెట్టు కింద’ నుంచి రాడికల్స్‌ దాకా కాలం విస్తరించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి సాహిత్యం రావాల్సి వుంది?

‘మేరువు’, ‘ఒండ్రుమట్టి’, ‘నిషిధ’ నవలలో చెప్పిన సామాజిక అర్థిక రాజకీయ పరిణామాలు ఇప్పటికీ సమాజంలో మరింత వికృతంగా కొనసాగుతూనే వున్నాయి. అలాగే భారతీయ సమాజంలో వున్న కుల వైరుధ్యాలను ఇప్పటిదాకా దళిత, బహుజన, మైనారిటీల అణచివేతకు సాధనం చేసుకున్నారు. ఇప్పుడు అవే వైరుధ్యాలను ఆధిపత్య వర్గాలు తమలో తామే ఆయుధంగా చేసుకోవడం కొత్త పరిణామం. ఈ కొత్త పరిణామమైన కులం, మతం ఆంధ్రదేశపు రాజకీయాలకు, సమాజానికి కూడా ఒక చెంప పెట్టులాగా వుంది. అయితే ఇది పైకి కుల, మత రాజకీయంగా కనిపించినా, దీని వెనుక ప్రైవేటు, కార్పొరేట్‌ రంగం దోపిడీ, పోటీ వున్నాయి. ఏ ఆధిపత్యం కులం/వర్గం దీన్ని స్వాధీనం చేసుకోవాలనే దుర్మార్గమూ వుంది. అయితే ఈ కుల సమరం ఎటుదారితీస్తుందో? అన్నది చూడాలి. దీన్నుండి కింది కులాలు చైతన్యం పొందుతాయా? లేక అధిపత్య కులాలు వ్యవస్థాగత సర్దుబాట్లు చేసుకుంటాయా? చూడాలి.

వీటన్నబటినీ చెప్పగలిగితే మంచిదే.

అదే కాదు, పాలకవర్గాలు ప్రజల కోసం సంక్షేమం చేస్తున్నట్టుగా పైకి రూపంలో కనబడుతూ సారంలో రాజ్యాన్ని బలోపేతం చేస్తూ నిరంకుశత్వంవైపు దారితీియించడం గతం నుండీ వున్నదే. అయితే అది ఇప్పుడు మరింత విశృంఖలంగా కనపడుతోంది. ఇది ప్రస్తుతం ప్రతిపక్షాలకే పరిమితమైనా అంతిమంగా ఇది ప్రజా పోరాటాలపైకి దారితీస్తుంది.

ఇవన్నీ సమాజంలో వస్తున్న అంతర్గత పాశవిక మార్పులు. వీటిని చెప్పగలిగితేనే కొత్త విశ్లేషణను ఇవ్వగలం.

అదేకాక మధ్యతరగతికి మనం దూరమయ్యాం అనిపిస్తోంది. నూతనంగా వస్తున్న సంస్కృతిని సొంతం చేసుకుంటున్న మధ్యతరగతిని మనం అంచనా వేయగలుగుతున్నామా అన్న ప్రశ్న వస్తోంది.

అలాగే మైనారిటీలతో మన సాన్నిహిత్యం పెరగాల్సినంత పెరగకపోవడంవల్ల, వాళ్ళ జీవితాలు మనకు అర్ధం కావడం లేదనిపిస్తోంది. ఇందుకు కారణాలనూ విశ్లేషించుకోవాలి.

  1. ఇప్పటిదాకా రాసిన నవలలకు కొనసాగింపుగా మీరు ఏం రాయాల్సి వుందనుకుంటున్నారు?

నేనేమి రాయాలనేదానిమీద నాకింకా స్పష్టత ఏర్పడలేదు. అయితే ఇప్పటిదాకా నేను రాసిందంతా గ్రామీణ నేపథ్యం నుండే రాశాను. అయితే పట్టణ జీవితం గురించి నేను పెద్దగా రాయలేదు. ప్రపంచీకరణ, ప్రైవేటు విద్యారంగం వంటి అంశాలను బేస్‌ చేసుకొని కొన్ని కథలు రాశాను. పట్టణాల్లో గత యాభై ఏళ్ళుగా అర్థిక, రాజకీయ పరిణామాలు అందువల్ల వచ్చిన మార్పులు చెప్పాలని వుంది. కాని అది నాకు సాధ్యపడుతుందా? నాకంత విశ్వాసం కలగడం లేదు.

Leave a Reply