భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్‌ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్‌ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్‌ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌ పక్షం తీసుకుని భారతీయులు సోషల్‌ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్‌ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇండియా నుండి ఇటువంటి స్పందన రావడానికి కారణం ఏమిటి? ఈ మితిమీరిన ద్వేషం, యుద్ధోన్మాదం ఎక్కడి నుండి వచ్చాయి. భారత సమాజానికి ఏమైంది?


నిజానికి ఇప్పటి వరకూ పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సమస్య సగటు భారత పౌరులకు పట్టని విషయం. అటువంటిది ఇప్పుడు అందరి వాట్సాప్‌ ఫ్యామిలీ గ్రూపుల్లో ఇది చక్కర్లు కొడుతోంది. వాస్తవాల కన్నా ఎన్నో రెట్లు తప్పుడు వార్తలు, అబద్ధాలు, వక్రీకరించిన చరిత్ర ప్రచారమవుతున్నాయి. అసలు పాలస్తీనా అనే దేశం చరిత్రలోనే లేదట! కొంత మంది ఇస్లాం తీవ్రవాదులు తమ మతరాజ్యాన్ని స్థాపించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారట. తీవ్రవాదంపై ఇజ్రాయెల్‌ పోరాడుతోందట! ఇటువంటి కథనాన్ని పుట్టించే సాహసం బహుశా ఇజ్రాయెల్‌, అమెరికాలు కూడా చేయవేమో. ఎందుకంటే అక్కడి ప్రజలకు నిన్న మొన్నటి చరిత్ర తెలియకపోవడం ఉండదు కాబట్టి. భారతదేశంలో పనిగట్టుకొని చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం ఒకటి కొంతకాలంగా నడుస్తోంది. ఎప్పటి చరిత్రో కాదు, 1947 నుండి భారతదేశం స్వతంత్ర పాలస్తీనా రాజ్యానికి మద్దతు ఇస్తున్న విషయం కూడా మరుగున పడిపోయింది. బ్రిటీష్‌ వలస పాలన కింద ఉన్న పాలస్తీనా భూభాగాన్ని ఐక్యరాజ్యసమితి రెండుగా విభజించి, ప్రత్యేక ఇజ్రాయెల్‌, పాలస్తీనా రాజ్యాలను ఏర్పాటుచేయడానికి ‘‘విభజన ప్రణాళిక’’ ప్రతిపాదించినప్పుడు భారతదేశం దాన్ని వ్యతిరేకించింది. తమ దేశం మీద పాలస్తీనా ప్రజలకే హక్కు ఉందని స్పష్టంగా ప్రకటించింది. ఎందుకు మీడియా కనీసం దాన్ని గుర్తుచేయడం లేదు అంటే ఇప్పటి పాలకుల వైఖరి మారిపోయింది కాబట్టే. వీళ్ల దృష్టిలో హమాస్‌ ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడి చేసిన అక్టోబర్‌ 7 నుండే చరిత్ర మొదలైంది. 1948 మే 15 ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లంఘించి వందలాది పాలస్తీనా గ్రామాల్ని తగలబెట్టి, 7 లక్షలకు పైగా పాలస్తీనా అరబ్బుల్ని వాళ్ల దేశం నుండి వెళ్లగొట్టిన చరిత్రను మర్చిపోదాం. 1967లో గాజా స్ట్రిప్‌, వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేం సహా చారిత్రాత్మక పాలస్తీనాలోని మిగిలిన భాగాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించిన విషయం మర్చిపోదాం. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వెస్ట్‌ బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లు నిర్మించడం, యూదు సెటిలర్లకు ఇజ్రాయెల్‌ పౌరులుగా ఉండటానికి అన్ని హక్కులు ఉంటూ పాలస్తీనియన్లు సైనిక ఆక్రమణలో జీవించవలసి రావడం, వారి రాజకీయ వ్యక్తీకరణల్ని కూడా అణచివేయడం మర్చిపోదాం. 1987లో పాలస్తీనా కార్మికులపై ఇజ్రాయెలీ ట్రక్కు దూసుకుపోయి వారిని చంపేస్తే దశాబ్దాల అణచివేత నుండి యువ పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ సైన్యంపై ఒట్టి రాళ్లతో పోరాడటం నుండి తిరుగుబాటు ఎట్లా మలుపులు తీసుకుందో మనకు అనవసరం. పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌, అరాఫత్‌ను, ఆయనపై హత్యాయత్నాలను మర్చిపోదాం. ఓస్లో ఒప్పందం, అసంఖ్యాక ఐక్యరాజ్యసమితి తీర్మానాలు ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్‌ చేసిన దురాక్రమణను, నరమేధాన్ని మర్చిపోదాం. పాలస్తీనా జాతి మొత్తాన్ని నిర్మూలించే జెనోసైడ్‌ను కాదని దానికి ప్రతిఘటనగా అనివార్యంగా పుట్టుకొచ్చిన పోరాటాన్ని మాత్రం తీవ్రవాదం అందాం. ఇది ఎంత అమానుషం!


అక్టోబర్‌ 7నాటి దాడి తర్వాత ప్రధాన మంత్రి ట్విట్టర్‌ సందేశంలో బాధిత ఇజ్రాయెల్‌కు సంఫీుభావం తెలియజేయగానే కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియా పాలస్తీనా వ్యతిరేక ప్రచారంతో, ఇంకా స్పష్టంగా ముస్లిం వ్యతిరేక ప్రచారంతో హోరెత్తిపోయింది. కసీసం ఈ దాడికి ముస్లిం సమాజానికి సంబంధం ఏమిటి అనే ఆలోచన కూడా లేదు. హమాస్‌ వ్యతిరేక ప్రచారంలో ప్రధానంగా వారు స్త్రీలపై భయానకమైన అత్యాచారాలు చేశారని ప్రచారం చేశారు. నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మందికి వ్యాపించిన ఈ ప్రచారం ఉద్దేశం ముస్లింలు ఇంత దుర్మార్గంగా ఉంటారని చెప్పడం. వీరు ప్రచారం చేసిన వార్తలు, వీడియోలు వేటికీ విశ్వసనీయత లేదు. చాలా వరకు ఎక్కడెక్కడివో, ఎప్పటివో హింసాత్మక ఘటనల వీడియోలన్నీ సేకరించి ఆ దారుణాలన్నీ ఇప్పుడు హమాస్‌ చేస్తున్న దుర్మార్గాలుగా ప్రచారం చేశారు. నిజానిజాలు తేలేలోపల వాటిని దేశమంతా చూసి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఉంటుంది. ఈ తరహా ప్రచారం బిజెపి అనుబంధ సంస్థల సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ పనేనని ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు ఈ విషయంలో వాళ్లకు కలిసొచ్చింది ఏమిటంటే పాశ్చాత్య మీడియా ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరి తీసుకొని ఆ దేశ పాలకులు వండివార్చిన కథనాలను తయారుచేయడం. అందువల్ల సోషల్‌ మీడియానే కాదు, ప్రధాన స్రవంతి పత్రికలు, టివి ఛానళ్లు కూడా అబద్ధపు వార్తలను అత్యుత్సాహంగా ప్రసారం చేస్తున్నాయి. చివరికి గాజాలోని హాస్పిటల్‌పై బాంబు దాడులు జరిగితే అది కూడా హమాస్‌ చేసిన పనే అని ప్రచారం జరిగింది. ఎవరైనా తమ పిల్లల మీద తామే బాంబులు వేసుకుంటారా? ఇది అబద్ధం అని తేలిపోయినా నమ్మని స్థాయిలో ఉన్మాదం తలకెక్కింది.
ఇంకో విషాదం ఏమిటంటే ఈ అబద్ధాల ప్రచార కాంపెయిన్‌లో క్రైస్తవులూ భాగం కావడం. ఇజ్రాయెల్‌ అనగానే అది దేవుడు వాగ్దానం చేసిన భూమి అనే సెంటిమెంటుతో వారు ముస్లిం వ్యతిరేక యుద్ధోన్మాదంలో పడిపోవడం. ఎన్నడూ లేనిది యూదులు వారికి మిత్రులైపోయి, ముస్లింలు టార్గెట్‌ కావడం. నిజానికి భారతదేశంలో అటు మైనారిటీ మతంగానూ, ఇటు దళితులుగానూ క్రిస్టియన్లు (దళిత క్రిస్టియన్లు) కూడా ముస్లింల లాంటి బాధిత సమూహం. అన్యాయంగా వీరు హిందుత్వ తీవ్రవాదుల ఉచ్చులో పడిపోయారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఒకసారి మనుషుల్లో సున్నితత్వం పోయి, హింసను, అణచివేతను -అది ఎవరిమీదైనా సరే, ఆమోదించే మానసికత వచ్చేస్తే వారు విచక్షణ లేని మూకగా తయారవుతారు. వీరిని పాలకులు ఏ రకంగానైనా రెచ్చగొట్టగలరు. ప్రజలు తమకేం కావాలో మర్చిపోయి, అసలు శత్రువులెవరో గుర్తించక తమ వర్గం వారిమీదనే కత్తులు దూస్తారు.


ఒకవైపు ఈ తరహా ప్రచారం నడుస్తుండగానే పాలస్తీనాపై భారత్‌ వైఖరి ఏమీ మారలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి అన్నారు. అంటే ఇప్పటికీ పాలస్తీనా రాజ్యాన్ని భారతదేశం గుర్తిస్తున్నదని, ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఖండిస్తున్నదని కదా అర్థం. ఈ విషయం స్పష్టంగా ప్రకటించడానికి ఇజ్రాయెల్‌తో ఇండియా ప్రభుత్వ స్నేహం అడ్డమొచ్చింది. ఇజ్రాయెల్‌ నుండి ఆయుధాలను, వివాదాస్పద పెగాసస్‌ వంటి నిఘాపరికరాలను, సేవలను కొనుక్కుంటున్న మన ప్రభుత్వం దాని దుర్మార్గాలను ఖండిరచలేదు. ఇజ్రాయెల్‌తో అటువంటి సంబంధాలు మన దేశానికి కొత్త కాకపోయినా అంతకు ముందు ఇంత బాహాటంగా లేవు. ఇజ్రాయెల్‌ దేశాన్ని సందర్శించిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీయే. ఇజ్రాయెల్‌ తరహా అణచివేత, ముస్లిం వ్యతిరేకత కూడా బిజెపి ప్రభుత్వానికి ముచ్చటగొలిపే అంశాలే. హిట్లర్‌ను ఆరాధించే సంఫీుయులు, హిట్లర్‌ చేతిలో భయంకరమైన అణచివేతకు గురై వేరొకరి మీద అదే తరహా అణచివేతను ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌ను ఇప్పుడు ఆరాధిస్తున్నారు. దీన్ని బైటికి చెప్పకుండా ఆ పని వాట్సాప్‌ యూనివర్సిటీకి అప్పగించారు మన పాలకులు.


గాజా మీద దాడికి దిగుతూ 11 లక్షల జనాభాను 24 గంటల్లో ఖాళీ చేసి దక్షిణ గాజా ప్రాంతం వెళ్లాలని ఇజ్రాయెల్‌ అల్టిమేటం ఇచ్చింది. వీళ్లంతా ఎక్కడికిపోవాలి? పాలస్తీనా పిల్లలు పిల్లలు కాదా? ఎంత హృదయవిదారకంగా ఉన్నాయి యుద్ధదృశ్యాలు! ఏడు వేల మంది పాలస్తీనియన్లు, 14 వందల మంది ఇజ్రాయెలీలు చనిపోయారని అంచనా! ఎవరివైనా ప్రాణాలే అనుకున్నప్పుడు యుద్ధం ఆగాలని కదా కోరుకునేది! కానీ ఎలా ఆగుతుంది యుద్ధం? ఎప్పటికైనా పాలస్తీనా ప్రజలకు తమ సొంత భూభాగం మీద ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించినప్పుడే అది సాధ్యం. పీడిత జాతిని ప్రతిఘటించకుండా పడిఉండమని ఎవరూ చెప్పలేరు. నిరంతరం ఇజ్రాయెల్‌ పక్కనుండి యుద్ధాన్ని ఎగదోస్తున్న అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలను ఒక్క మాట అనకుండా, ఆక్రమణదారుల్ని ఆక్షేపించకుండా మీరు మాత్రం శాంతియుతంగా ఉండమని పాలస్తీనాకు ఎలా చెప్తారు? అందువల్ల హమాస్‌ చర్యను మాత్రమే ఖండించడం అన్యాయం.


ఈ యుద్ధ నేపథ్యం తెలియకపోయినా, మానవత్వం ఉన్న మనుషులెవరైనా కనీసం రెండు పక్షాలు యుద్ధం ఆపాలి అని కోరుకుంటారు. (నిజానికి ఇది యుద్ధం కాదు, దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా చేస్తున్న మానవ హననం) కానీ ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్‌ ‘విజయాల్ని’ వేడుక చేసుకునే అమానుషత్వం సోషల్‌ మీడియాలో వ్యాపించిపోయింది. ఇటువంటి విపరీత మానసికత ఎలా వచ్చింది? అంటే అంతగా మనుషుల్ని అమానవీయంగా తయారుచేస్తున్నారన్న మాట. ఫాసిజం ప్రజల మనసులను ఇంతలా విషతుల్యం చేస్తుందా! ఇది రానున్న కాలంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించగలం.
ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ చేసి గాజాకు సాయం అందించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటు వేయకుండా భారత ప్రభుత్వం తప్పించుకుంది. తన పాత వైఖరి ప్రకారం అయితే అనుకూలంగా ఓటువేయాలి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు ఏ విలువా లేదని చరిత్ర మనకు చెప్తూనే ఉందనుకోండి. అయితే ఐక్యరాజ్యసమితి తీర్మానం వెలుగులోనైనా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను గుర్తించాల్సింది. కానీ సోషల్‌ మీడియా అంత విచక్షణతో ఉండదు. నిలకడగా నిజం తెలుసుకునే వాతావరణం అక్కడ లేదు. పేరుకే సామాజిక మాధ్యమం కానీ నిజానికి అది పాలకవర్గాల చేతుల్లో ఆయుధమైపోయింది. మనుషుల్ని స్వతంత్ర ఆలోచన లేని మూర్ఖపు మందలా తయారుచేసే అనుకూలత వారికి అందులో దొరికింది. పాలస్తీనా సందర్భం దీన్ని నిరూపించింది. అయినా సరే వాస్తవాలు మాట్లాడాల్సిందే. అసలైన చరిత్రను మరింత శక్తివంతంగా ప్రచారం చేస్తూనే ఉండాలి. ఏ మాత్రం విచక్షణ, మానవత్వం ఉన్నా పీడితులైన పాలస్తీనా పక్షం వహించాలని చాటాలి. అన్ని వేదికల ద్వారా దీనిని ప్రకటించాలి. అంతిమంగా నిలిచేది సత్యమే

Leave a Reply