మధ్య భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం మొదలుకాక ముందు, హస్దియో అరంద్ డజను ఆదివాసీ కుగ్రామాలు వున్న మారుమూల అడవి. 650 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిని “మధ్య భారతదేశ ఊపిరితితిత్తి” అని పిలుస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులతో పాటు, అమూల్యమైన నీటి నిల్వలు వుండేవి. స్థానిక గ్రామస్తులలో చాలా మంది ఆదివాసీలు లేదా గోండు తెగకు చెందిన “ఆదిమ నివాసులు”. వారు తమ పెరట్లో పంటలు పండిస్తారు, నేసిన గడ్డి బుట్టలను మార్కెట్‌లో అమ్ముకొంటారు. వారికి తమ భూమి చాలా పవిత్రమైనది.

హస్డియో అరణ్య అడవులలో, కొత్త బొగ్గు గనుల త్రవ్వకాల కోసం అదానీ గ్రూప్ ముందుకు రావడంతో స్థానీయ గోండు ప్రజల జీవన విధానం తుడిచిపెట్టుకు పోతోంది. పెద్దఎత్తున జరిగే బహిరంగ త్రవ్వకాలు అడవులు, ప్రవాహాలు, పూర్వీకుల భూములకు స్పష్టమైన ముప్పును కలిగిస్తాయి. ఈ కార్పొరేట్ ఎజెండా వల్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు మరింత క్షీణిస్తాయి.

ఇది మధ్య భారతదేశంలో 170,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాలలో ఒకటి. మధ్య భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఒక ఏనుగు కారిడార్లో భాగం. ఇది ఆదివాసీ సముదాయాల యొక్క సాంప్రదాయ నివాసం. మధ్య-తూర్పు భారతదేశంలో ఒక ముఖ్యమైన నది అయిన మహానదికి ప్రధాన ఉపనది అయిన హస్దేయో నదికి కూడా ఇది నీటిపారుదల ప్రాంతం. అయితే, ఈ అడవిలో సుమారు ఐదు బిలియన్ టన్నుల బొగ్గు కూడా ఉంది.

బొగ్గు గనుల తవ్వకం ప్రకృతి దృశ్యాన్ని మార్చడంతో, స్వయం సమృద్ధికి ముప్పు ఏర్పడుతోంది. హస్దేయో నదికి ప్రవాహంగా ఉన్న సల్హి నది ప్రవాహానికి ఈ బొగ్గు గని ముప్పు కలిగిస్తోంది. గతంలో ఇది కనీసం 40 అడుగుల వెడల్పు వుండి సమాజానికి చేపలను స్వంత వినియోగానికి, అమ్ముకోడానికి వనరుగా వుండేది. బొగ్గు గని తవ్వకాల వాళ్ళ నీరు కలుషితమై నల్లగా మారిపోయింది.

తన కార్యకలాపాలు ఈ ప్రాంతంలోని నీటి మార్గాలను ప్రభావితం చేశాయని అనడాన్ని అదానీ గ్రూపు ఖండించింది. ‘భారతదేశంలోని పిఇకెబి బొగ్గు గనిలో రాష్ట్ర యుటిలిటీ రాజస్థాన్ రాజ్య ఉర్జా వల్కాస్ నిగమ్ లిమిటెడ్ యాజమాన్యంలోని నీళ్ళను శుభ్రం చేసే యంత్రాంగం ‘జీరో డిశ్చార్జ్’ సూత్రంపై పనిచేస్తుందని, వాషింగ్ ద్వారా ఉత్పన్నమయ్యే నీరంతా బెల్ట్ ప్రెస్‌ల వ్యవస్థ ద్వారా రీసైకిల్ చేసిన తరవాతనే మళ్లీ ఉపయోగిస్తారని, కాబట్టి ఈ నీరు ఏదీ మైనింగ్ ప్రాంతం నుంచి సమీపంలోని నీటి వనరులలోకి విడుదల చేయం’ అని అంటోంది.

పుష్కలంగా జామ చెట్లు వుండే చిన్న కుగ్రామమైన జంపనిలో తాను పెరిగానని ఉమేశ్వర్ సింగ్ ఆర్మో చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నాడు. తన పూర్వీకులు ఖననం అయిన ఈ ప్రాంతంలోనే తన తెగకు చెందిన భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాడు. ఈనాడు 43 ఏళ్ల వయస్సు వున్న అతను స్థానిక జిల్లా పటురియాదండ్‌లో 900 మంది జనాభా వున్న గ్రామ ముఖ్యుడు.

“స్కూల్ లో చదువుకునేటప్పుడు, 2007లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సర్వేయర్లు శాటిలైట్ కెమెరాలు, లేజర్ స్కాన్‌లను ఉపయోగిస్తూ అటవీప్రాంతంలో తిరగడం మొదలుపెట్టాక కానీ ఈ ప్రాంతంలో వున్న దాదాపు 250 రకాల మొక్కలు, పక్షి జాతులు మాత్రమే అటవీ వనరులు కాదు, “బొగ్గు” అని పిలువబడే మెరిసే పదార్థం కూడా వుందని తెలియలేదు.

వారు భూమిని సర్వే చేయటానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా, ఉత్సాహంగా మేమంతా చేరేవాళ్లం.. కానీ వారు ఇలా భూమిని తవ్వేస్తారని ఊహించలేదు”అని ఆవేదన వ్యక్తం చేస్తాడు.

ఆ ప్రాకృతిక అడవిలో భూమి అడుగున 5 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు వున్నదని ఆ సర్వేయర్లు గనుల తవ్వకం చేసేవారి కోసం ఒక భారీ బహుమతిని కనుగొన్నారు. 2013లో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బొగ్గు దిమ్మలు లేదా తవ్వకాల కోసం ప్రాంతాలను కేటాయించి, ఇంధనాన్ని వెలికితీసేందుకు మరొక రాష్ట్రమైన రాజస్థాన్‌ ప్రభుత్వానికి అనుమతినిస్తే, ఆ రాజస్థాన్ ప్రభుత్వం భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆపరేటర్, బొగ్గు గనులు-బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లను ‘అభివృద్ధి’ చేసే ‘అదానీ పవర్‌’కు మైనింగ్ కార్యకలాపాల కాంట్రాక్ట్‌ను యిచ్చింది. పార్సా-ఈస్ట్ కాంటా బసన్ (పిఇకెబి) గనిని స్థాపించడానికి దాదాపు ఐదు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉన్న అడవి భాగం కొద్ది కాలంలోనే నాశనమై పోయింది. ఒకప్పుడు అక్కడ వుండిన రెండు కుగ్రామాల పేరే ఆ గనులకు పెట్టారు. నేడు ఆ ప్రాంతంలో నల్లటి పెద్ద గుంతలు మిగిలిపోయాయి.

2013లో పిఇకెబి బొగ్గు గని కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత హస్దియో అరణ్య అడవులలో బొగ్గు తవ్వకానికి వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటం ప్రారంభమైంది.

ఇది ఆదివాసీల జీవన్మరణ పోరాటం. కేటాయించిన బొగ్గు బ్లాకులన్నీ మైనింగ్‌కు తెరిస్తే వందలాది గ్రామాలు నిర్వాసితులవుతాయి. అడవులను నరికేసి ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారు.

వాస్తవానికి, బయటికి తీయడంతోనే బొగ్గు వల్ల కలిగే సమస్యలు ముగిసిపోవు. తలసరి ఉద్గారాలు అమెరికా కంటే దాదాపు ఏడు రెట్లు తక్కువగా ఉన్నప్పటికీ, బొగ్గు ప్రధాన వినియోగదారుగా, గ్రీన్‌హౌస్ వాయువుల మూడవ-అతిపెద్ద ఉద్గారకంగా భారతదేశం వున్నది. చాలా అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ పరిరక్షణా లక్ష్యాలను చేరుకోవడానికి బొగ్గు సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్నాయి. భారతదేశం, చైనాలకు మొత్తం క్రియాశీల బొగ్గు ప్రాజెక్టులలో 80% వాటా వుంది. అమెరికా, ఇ.యు. 2050 నాటికి నికర శూన్య ఉద్గారాలను చేరుకోవాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి, 2070 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుతానని చెప్తున్న భారతదేశం చైనా లక్ష్యంగా పెట్టుకొన్న 2060 కంటే మరో దశాబ్దం వెనుకబడి ఉంటుంది.

ఇటీవలి ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్ (వాతావరణ మార్పులను అంచనా వేసే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ- ఐపిసిసి) నివేదిక తెలిపిన ఖచ్చితమైన ఫలితాల వెలుగులో, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని దేశాలు వేగంగా కదలాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నొక్కిచెప్పాడు. బొగ్గు త్రవ్వకాన్ని దశలవారీగా రద్దు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లుతుందని గతంలో వాదించిన భారత్, ప్రపంచ ఒత్తిడికి లొంగిపోవచ్చు. ఈ సంవత్సరం మే నెలలో G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరిగిన కమిటీ సమావేశంలో, రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దాదాపు 30 బొగ్గు గనులను మూసివేయనున్నట్లు భారతదేశ బొగ్గు కార్యదర్శి అమృత్ లాల్ మీనా ప్రకటించాడు. కానీ హస్దియో నివాసితుల అనుభవం చూపినట్లుగా, బొగ్గు వల్ల జరిగే నష్టాన్ని దీర్ఘకాలంలో నిరోధించడానికి చేసే ప్రయత్నాలు కూడా స్వల్పకాలంలో ఆశ్చర్యకరమైన, హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.

ఇప్పటికే వరుసలో ఉన్నవి కాకుండా కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణాన్ని నిలిపివేయాలని భారతదేశం కూడా ఆలోచిస్తోందని రాయిటర్స్ నివేదించింది. బొగ్గుపై ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయకపోవడం శుభవార్తనే. అయితే ఇప్పటికే జరుగుతున్న కార్యకలాపాల వల్ల ప్రభావితమైన వారికి ఈ వార్త పట్ల ఒక ప్రతికూలత ఉంది, “’కొత్తగా బొగ్గును తవ్వం” అని అంటున్నారు అంటే మీరు యిప్పటికే వున్న గనుల త్రవ్వకాలన్నింటినీ పూర్తి చేయడానికి త్వరపడుతున్నారు అని అర్థం వస్తుంది”అని అన్న క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టిమ్ బక్లీ “మీరు ఆ బొగ్గు గనిలో పని చేస్తున్న గ్రామస్తులైతే కనక మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు” అని జోడించారు.

గనిని వ్యతిరేకించే స్థానికులతో పాటు దానికి మద్దతిచ్చే వారితో సహా 40 కంటే ఎక్కువ మందితో 2022 సంవత్సరంలో మూడు నెలల పాటు చేసిన ఇంటర్వ్యూలలో, ఒక మైనింగ్ దిగ్గజం ఉనికి వల్ల అడవిలో మారిపోయిన జీవితం గురించి పిఇకెబి గనిలోని అదానీ కార్మికులు, ఆ ప్రాంత ఉపాధ్యాయులు, పోలీసులు, కార్యకర్తలు వివరించారు.

చాలా మందికి ‘పరివర్తన’ అక్కడితో ఆగిపోదు. “బొగ్గు తవ్వకాలు జరిగేది 30 సంవత్సరాలు మాత్రమేనని మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత నాశనమై పోయే భూమిలో మన భవిష్యత్తు ఏమిటి? ఎక్కడికి వెళ్లగలం” అనే ఆందోళన వారిని నిత్యం వెన్నాడుతూ వుంటుంది.

గనుల నుండి బయటికి వచ్చాక బొగ్గు ప్రయాణం ఆరంభమై ఉత్తరానికి రైలులోనూ, రాజస్థాన్‌కు ట్రక్కులోనూ వెళుతుంది. అయితే దీనిని అమ్మడం వల్ల వచ్చే ప్రతిఫలం మాత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు దక్కుతుంది. మైకమెత్తించే టవర్లు, పెద్ద పెద్ద దుకాణాల సముదాయాలు, హోటళ్ళు మొదలైనవాటి అభివృద్ధి, గనుల్లో పని చేసే ఆదివాసీ అటవీ నివాసుల జీవితానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆదివాసీల్లో 90% మంది వ్యవసాయం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు.

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద దిగుమతిదారు, వినియోగదారు, బొగ్గు ఉత్పత్తిదారు అయిన భారతదేశం అంతటా ఈ నమూనా పునరావృతమవుతుంది. వచ్చే ఏడాది నాటికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ వల్ల, ప్రభుత్వం 2022 నుండి పది లక్షల టన్నులకు పైగా బొగ్గును సేకరించాలని ఆలోచిస్తోంది.

ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న కోటీశ్వరుడైన గౌతమ్ అదానీ 1988లో సరకుల మార్పిడి వ్యాపారంగా ప్రారంభించి, దేశంలోని అతిపెద్ద కార్పొరేట్, రేవు‌ల కార్యకలాపాల నిర్వహణ, విమానాశ్రయాలు, థర్మల్ పవర్ ఉత్పత్తి ప్లాంట్‌లలో ఒకటిగా మారిన అదానీ గ్రూప్ ఈ అత్యాశకి కీలకం. ప్రస్తుతం అదానీకి బొగ్గు వ్యాపారంలో దేశంలోని మార్కెట్ వాటాలో 50%; ప్రతి సంవత్సరం భారతదేశంలో 290 లక్షల టన్నుల కంటే ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేయడానికి, అమ్మడానికి ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు వున్నాయి. 2022 జూన్‌లో, స్థానిక బొగ్గు కొరతను అధిగమించడానికి ప్రభుత్వం 22 మిలియన్ టన్నుల విలువైన బొగ్గు దిగుమతి ఆర్డర్‌లను జారీ చేసినప్పుడు, 19 మిలియన్లు అదానీకి వెళ్లాయి.

వివాదాలకు అదానీ కొత్తేమీ కాదు. 2010లో, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి, ఆస్ట్రేలియాలోని గెలీలీ బేసిన్‌లో కొత్త గనిని అభివృద్ధి చేస్తానని అతని కంపెనీ ప్రకటించింది. కానీ ప్రతిక్రియ ఎంత బలంగా వుండిందంటే పెట్టుబడి పెట్టడానికి, భీమా చేయించడానికి అదానీ నానా తిప్పలు పడాల్సి వచ్చింది; చివరికి ఇతర అదానీ సంస్థల నుండి రెండు వందల కోట్ల డాలర్లతో స్వీయ-నిధులను సమకూర్చాడు. గత నవంబర్ నాటికి, తన సామర్థ్యంలో మూడింట ఒక వంతు కంటే తక్కువ, అంటే 180 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గత సంవత్సరం ‘ది ఫైనాన్షియల్ టైమ్స్‌‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ గని తీసుకోవడం పొరపాటు అని అదానీ సూచించాడు.

ఈ సంవత్సరం ఆరంభంలో, అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్‌బర్గ్ ప్రచురించిన నివేదిక, సరుకు నిలవ లెక్కల తారుమారు, ఆర్ధిక ఖాతాల్లో మోసం తదితర దుర్వినియోగాల ద్వారా అదానీ గ్రూప్ “కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం చేసిందని ” ఆరోపించింది. అదానీ గ్రూప్ యిచ్చిన 413 పేజీల ప్రత్యుత్తరాన్ని “పాత, నిరాధారమైన అపఖ్యాతి పాలైనది”గా పేర్కొంది. అయితే ఆ నివేదిక అదానీ మైనింగ్ కార్యకలాపాలపై పరిశీలనను విస్తృతం చేసింది. ఫిబ్రవరిలో 847 మిలియన్ డాలర్ల మరొక బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ కొనుగోలును నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడానికి ఇది దోహదపడిందని నిపుణులు అంటున్నారు.

బొగ్గు వ్యాపారం పట్ల ఇంకా ఆకర్షణ వుందనేది స్పష్టంగా ఉంది. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (గనుల అభివృద్ధి&కార్యకలాపాల నిర్వహణ) (ఎమ్‌డిఓ) నమూనాగా పిలవబడే ఒక కొత్త చట్టాన్ని 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్‌కు యివ్వడానికి అనుమతించే ప్రక్రియ. భూ సేకరణ, పునరావాస, జీవనోపాధి కల్పనల బాధ్యతలు వహించి; గని కార్యకలాపాలు చేపట్టడం కోసం ‘బయటకు వెల్లడించని’ ధరలకు జరిగే విశ్వసనీయ (రహస్య) ఒప్పందం. భారతదేశంలో అదానీ గ్రూప్ అతిపెద్ద బొగ్గు ఎమ్‌డిఓ.

“అనేక మంది పోటీదారులతో అత్యంత పారదర్శకమైన పోటీతత్వ వేలం ప్రక్రియ” ద్వారా వున్న తొమ్మిది ఎమ్‌డిఓ కాంట్రాక్టులను చేజిక్కించుకున్నాము” అని అదానీ ప్రతినిధి చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల వల్ల అదానీ ఆధిపత్యం వుందని విమర్శకులు అంటున్నారు. అయితే, అదానీ బొగ్గు సామ్రాజ్యాన్ని పెంచిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమే కాదు.

2015లో, అప్పటి భారత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామస్తులకు వారి భూమిని గనుల త్రవ్వకం కోసం ఇవ్వబోమని హామీ ఇచ్చాడు. కానీ 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరుసటి సంవత్సరం కోర్బా జిల్లాలో బొగ్గు బ్లాకుల నిర్వహణకు అదానీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. గాంధీ ఆ వాగ్దానాలు చేసిన మదన్‌పూర్‌తో సహా నాలుగు గ్రామాల్లో మైనింగ్ కొనసాగితే ప్రజలు నిర్వాసితులయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

ఎమ్‌డిఓ ప్రక్రియ ప్రకారం తమ కంపెనీ కేవలం ప్రభుత్వ కాంట్రాక్టర్ మాత్రమే అని, అంటే పిఇకెబికి సంబంధించి గ్రామస్థులు లేవనెత్తే సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని దీని అర్థం అని అదానీ ప్రతినిధి నొక్కి చెబుతున్నాడు. అయితే కాంట్రాక్టును జారీ చేసే ప్రభుత్వ సంస్థ అయిన రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్‌కి 74% వాటాలు వున్నాయి. అంటే అదానీ గ్రూప్ పిఇకెబి బొగ్గుపై మెజారిటీ వాటాదారు.

భారతదేశంలో బొగ్గుత్రవ్వకాలకు ఎటువంటి ప్రతిఘటన లేదనికాదు: వాస్తవానికి భూమి-హక్కులకు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన కేసులు వున్న వాటిలో పిఇకెబి ఒకటి. తమ భూమి, ఇళ్లు, జీవనోపాధిని నాశనం చేయడం వెనుక ఉన్న శక్తిగా పిఇకెబిని భావించే వారు గనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బొగ్గు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు 2010లో ఒక సంయుక్త అధ్యయనాన్ని నిర్వహించి, సుసంపన్నమైన జీవవైవిధ్యం వున్న కారణంగా ఈ అటవీప్రాంతాన్ని బొగ్గు తవ్వకాలు “జరగకూడని ప్రాంతంగా” (“నో-గో ఏరియా”)గా ఉంచాలని నిర్థారించాయి.

అయినప్పటికీ ఏడాది తర్వాత ప్రభుత్వం గని త్రవ్వకాలకు ఆమోదం తెలిపింది.

పని మధ్య విశ్రాంతి కోసం ఆ గని ఒడ్డున కూర్చునే పిఇకెబి కార్మికులు హస్దియో అడవి అవశేషాలు, ఓపెన్-కాస్ట్ బొగ్గు గుంతకు మధ్య ఉన్న చీలికను దిగాలుగా గమనిస్తూ వుంటారు.

మైనింగ్ ఏమి చేయగలదు అనేది ఆ ప్రాంత ఆదివాసీ గ్రామస్తులకు తెలుసు. 2015 నుండి స్థానిక ప్రతిఘటన ప్రయత్నాలలో పాల్గొంటున్న, సమీపంలోని తారా గ్రామానికి చెందిన 41 ఏళ్ల ముద్రమ్ మార్కం “ప్రస్తుతం, అడవి కారణంగా మా జీవనోపాధి జరుగుతోంది. కానీ రేపు వారు బొగ్గు కోసం మా భూమిని తవ్వినప్పుడు, మేము అనారోగ్యాల పాలవుతాం. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతాం, నీటి నిల్వలు ఎండిపోతాయి, జీవితం మరింత కష్టాల పాలవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా అడవి నాశనం అవుతుంది.” అని అన్నారు.

బొగ్గుకు బదులుగా పురోగమనాన్ని అందిస్తానని అదానీ చేసిన వాగ్దానం అందరికీ తెలిసిందే. అమెరికా స్వర్ణ యుగంలో, మైనింగ్ దిగ్గజాలు దేశాన్ని శక్తివంతం చేశాయి. ఈ నాటికీ ఆదివాసీ సముదాయాలు పరిశ్రమల వారసత్వాలతో తంటాలు పడుతుంటే, 50,000 కి పైగా గనుల త్రవ్వకాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, కాలుష్యాలను శుభ్రపరిచే బాధ్యతలను నెరవేర్చడానికి అమెరికన్ బొగ్గు కంపెనీలు నానా తిప్పలు పడుతున్నాయి.

ఆ వ్యర్థాలు హస్దియోలో పేరుకుపోవడమనేది ఆరంభం మాత్రమే. ఆ వాణిజ్య ఒప్పందం చాలా లాభదాయకమైనదిగా పేర్కొంటూ, వాతావరణ మార్పులపై భారతదేశ నిబద్ధతలో తానూ భాగమని తెలియజేసిన కంపెనీ 15,000 ఉద్యోగాలను సృష్టించానని, పొరుగు గ్రామంలో గృహాలు, శౌచాలయ సౌకర్యాలు వున్న కాలనీని నిర్మించానని తెలిపింది. పిఇకెబి పరిధిలో వున్న గ్రామాలలో చుట్టుపక్కల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అదానీ ఫౌండేషన్ ద్వారా “నిరంతరంగా పని” చేస్తోందని దాని కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం పేర్కొంది.

ముఖ్యంగా, 800 మంది విద్యార్థులకు ఆంగ్లంలో ఉచిత విద్యను అందించే అదానీ విద్యా మందిర్ అనే పాఠశాలను ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. భారతదేశంలోని అణచివేత కుల వ్యవస్థలో అత్యల్ప స్థాయికి చెందిన స్థానిక ఆదివాసీ కుటుంబాల పిల్లలకు పాఠశాల అవకాశాలకు ప్రవేశ ద్వారాన్ని తెరిచింది. కానీ తమ పిల్లలను చేర్పించిన చాలా మంది తల్లిదండ్రులు 2013లో ప్రారంభించిన పాఠశాలలో విద్యాబోధనా నాణ్యత మరింతగా దిగజారిందని చెప్పారు. అదానీ పాఠశాలలో గత సంవత్సరం తమ నమోదును రద్దు చేసుకొని, తిరిగి తన వద్దకు వచ్చి చేరిన విద్యార్థులు తరగతిలో సగం మందికి పైగా వున్నారని పొరుగున ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఒక ఉపాధ్యాయుడు చెప్పారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే గనులలో పని చేస్తున్న, వాటి సమీపంలో నివసిస్తున్న వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ” గనులు, పవర్ ప్లాంట్‌ల పరిసరాల్లోని గని కార్మికులు, ప్లాంట్ కార్మికులు, నివాసితుల ఆరోగ్యంపై బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో జరిపే ప్రతి చర్యా…తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది” అని ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ వల్ల ఆరోగ్యంపై కలిగే పర్యావరణ ప్రభావం గురించి 2017లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనం పేర్కొంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, హస్దియో గ్రామాలకు సమానమైన పరిస్థితుల్లో రాయ్‌ఘడ్ నగరానికి సమీపంలోని గ్రామాలలోని ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత, క్షయవంటి వ్యాధులు పెరిగాయి. బొగ్గు గని తెరిచిన తర్వాత రోడ్డు ప్రమాదాలలాంటి మానవ నిర్మిత ప్రమాదాలు జరగడం అధికమైంది.

తమ ఇళ్లను అమ్మేసి, గనులలో పని చేయమని భూసేకరణదారులు తమని ఒప్పించినప్పుడు, నెలకు 12,000 రూపాయలు (144 డాలర్లు) వేతనం ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ, భారతదేశంలోని కార్మిక సంఘాలు సిఫారసు చేసిన సగటు ఆదాయం కంటే చాలా తక్కువ మొత్తంలో, సగం కంటే తక్కువ ఆదాయం వస్తోందని పలువురు పిఇకెబి కార్మికులు చెప్పారు.

2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం తమ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకోవాలంటే ఆదివాసీ గ్రామస్తులు అనుమతి ఇవ్వాల్సి వుంటుంది. తమ సమ్మతిని తీసుకోవడం కోసం ఆదివాసీ సముదాయ పెద్దలు గామ కమిటీ సమావేశాలు వేసినప్పుడు, అదానీ కోసం పనిచేస్తున్న భూసేకరణదారులు గ్రామస్థుల సంతకాలను ఫోర్జరీ చేసో, లేదా లంచాలు ఇచ్చో సంతకాలు తీసుకున్నారని అనేక మంది ఆరోపించారు.

తాము మోసం చేశామన్న ఆరోపణను అదానీ గ్రూప్ ఖండించింది. అత్యధిక గ్రామస్తులు చెప్పినదాన్ని సవాలు చేసింది. తాము నడుపుతున్న పాఠశాలలో జీతాలలో వ్యత్యాసం లేదా పాఠశాలలో విద్యా ఫలితాలపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించనప్పటికీ, “స్థానిక సముదాయాలతో వివరణాత్మక సంప్రదింపు ప్రక్రియ జరిపిన తర్వాతనే” పరిహారానికి సంబంధించిన నిర్ణయం జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

“బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులు, ఇతర ఇంధన సంస్థల, విద్యాసంస్థల ప్రతినిధులు తరచుగా సందర్శించే ఒక నమూనా గని”గా పిఇకెబిని మార్చాయి” అని కూడా అన్నది.

కొంతమంది గ్రామస్తులు అదానీ గ్రూప్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు. తమ భూమిని అమ్మిన వారు అదానీ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేయడం వల్ల ఇంతకు ముందు ఊహకందని మొత్తంలో డబ్బును సంపాదించడం మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం వుంటుందని భావించారు.

కానీ కంపెనీ తాను చేసిన వాగ్దానాలను ఎన్నడూ అమలు చేయలేదు. ‘తాను 2013 నుండి పిఇకెబి గనిలో పని చేస్తున్నానని, వారానికి ఆరు రోజులు, ఎనిమిది గంటల షిఫ్టుల్లో బొగ్గు దిమ్మలను లెక్క పెట్టడం తన పని అని, పని పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, సంతోషంగా లేమనీ, కానీ అవసరం వల్ల పని చేయక తప్పదని’ ఇతర డజను మంది గని కార్మికుల మాదిరిగానే తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పేరును బయట పెట్టద్దు అని సాల్హి గ్రామంలో నివసించే ఒక ఆదివాసీ గని కార్మికుడు చెప్పాడు.

అదానీ గ్రూప్ యిస్తాను అన్నదానికి అంగీకరించిన వారు యిక తమకు ఎక్కడికీ వెళ్లగలిగే అవకాశం లేదని భావిస్తారు. “మా భూమిని తీసుకోవడానికి వచ్చిన వారికీ, మాకు పురోగతిని వాగ్దానం చేసిన అదానీకి – యిద్దరి మధ్యా ఇరుక్కుపోయాము” అని సాల్హికి చెందిన గని కార్మికుడు అంటే “అదానీ మమ్మల్ని వెర్రి వాళ్ళను చేస్తున్నాడు” అని మరొకరు అన్నారు.

మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి మూడు వేర్వేరు అభ్యర్ధనలు మార్చిలో దాఖలు అయిన తర్వాత పిఇకెబి భవిష్యత్తు గురించి పునరాలోచన చేయాలని సుప్రీం కోర్ట్ కోరింది: స్థానిక గ్రామస్థులను నిర్వాసితులను చేసారని, పర్యావరణానికి హాని కలిగించారనే కారణాలపై గాని కార్యకలాపాలను హస్దియో గ్రామస్తులు, ఒక పర్యావరణహిత న్యాయవాద బృందం సవాలు చేస్తే, మరోవైపు తన విద్యుత్ అవసరాలను తీర్చడానికి గని త్రవ్వకాలను ఆమోదించాలని రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ బోర్డు కోర్టును కోరింది.

దాదాపు 70,000 అప్పీళ్లు, పిటిషన్‌ల బకాయిల మధ్య తుది తీర్పులను వెలువరించడానికి తరచుగా సంవత్సరాలు పట్టే అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై తుది తీర్పును ఇవ్వాల్సి ఉంది. ఈ వసంతకాలంలో, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అడవిలో ఖాళీగా వున్న బొగ్గు బ్లాకులపై మరొకసారి వేలాన్ని ప్రకటించింది.

“కేవలం పరివర్తన” అని పిలిచే ప్రపంచవ్యాప్త చిక్కులో భాగం ఈ సమస్యలు అని వాతావరణ నిపుణులు అంటున్నారు: శిలాజ ఇంధనాల నుండి దూరంగా మళ్లడం అనేది స్థానిక సముదాయాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతాయుతంగా జరగాలి. మైనింగ్ ప్రతికూల ప్రభావాలను తరచుగా అట్టడుగున ఉన్న ప్రజలు భరించాల్సి వచ్చినట్లే, స్థిరమైన భవిష్యత్తును సాధించడంలో కలిగే ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి.

” గాలిలో మార్పు ఉంది: పునరుత్పాదక బొగ్గు ఇప్పటికే పోటీ పడుతోంది, భారతదేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాయు కాలుష్యం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఒత్తిడిని పెంచుతున్నాయి. కానీ, భారతదేశంలో బొగ్గు రంగం కోసం దీర్ఘకాలిక న్యాయమైన పరివర్తన వ్యూహాన్ని అభివృద్ధి చేయడం ఒక ప్రధాన బాధ్యత” అని భారతదేశ శక్తి పరివర్తనలో నిపుణుడు సందీప్ పాయ్ అంటారు.

కాబట్టి పిఇకెబి భవిష్యత్తు సుప్రీం కోర్టులో వేలాడుతుంటే, నివాసితులు తమ స్వీయ భవిష్యత్తు గురించి కూడా బేరీజు వేసుకుంటున్నారు. గత సెప్టెంబర్‌లో, తెల్లవారుజామున 4:00 గంటలకు ఎవరో తలుపు తట్టడంతో గ్రామ పెద్ద ఉమేశ్వర్ సింగ్ అర్మో నిద్రలేచాడు. అతను తన పూరి గుడిసె తలుపు తీసి పోలీసు యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించాడు. ఒక సీనియర్ అధికారి అతనితో మాట్లాడాలనుకుంటున్నాడని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తమతో పాటు రావాలని వారు అడిగారు. ” ఎక్కువ సమయం పట్టదు, మిమ్మల్ని వెంటనే తిరిగి వదిలిపెడతాము” అని వారు తనకు భరోసా కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

ఆర్మో ఈ పరిస్థితులను ముందుగానే ఊహించాడు. అతను ఒక దశాబ్దం పాటు గని త్రవ్వకాలను నిరసిస్తున్న హస్దియో అరంద్ బచావో సంఘర్ష్ సమితి (హస్దియో అటవీ రక్షణా కమిటీ) ఏర్పాటులో పాల్గొన్నాడు. ఆ సముదాయం చేసిన ప్రయత్నాలు అధికారుల వ్యతిరేక ప్రతిఘటనా శక్తిగా మారాయి. తరువాత వచ్చిన స్థానిక, సమాఖ్య ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో మైనింగ్‌ను కొంతకాలం ఆపివేయాల్సి రావడంలాంటి చిన్నపాటి విజయాలను సాధించింది.

మృదుస్వభావుడైన ఆర్మో, గత అక్టోబర్‌లో కమిటీ స్థానిక కార్యాలయంలో ఘటనలను ఇలా వివరించాడు. “పొరుగు గ్రామాలైన పెండ్రమార్, ఘట్‌బర్రాలో రెండవ దశ మైనింగ్ కోసం భూమిని చదును చేయడానికి అటవీ శాఖ మరిన్ని చెట్లను నరికివేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు గ్రామస్థులలో పుకార్లు వ్యాపించడంతో తమ నిరసనను అడ్డుకొనేందుకు పోలీసులు కొద్దిసేపటికే అక్కడికి వచ్చారని తాను అనుమానించాడు కానీ, తమతో పాటు రమ్మన్న వారి అభ్యర్థనను మన్నించి వెళ్తే కమిటీలోని ఇతర సభ్యులతో పాటు అతనిని 12 గంటలకు పైగా నిర్బంధించారు. తమను నిర్బంధంలో వుంచి, అడవిని నరికేయాలని నిర్ణయించిన ప్రాంతాల గుండా గ్రామస్థులు వెళ్లకుండా వుండడానికి అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు, 1,138 హెక్టార్ల అటవీప్రాంతాన్ని తొలగించడానికి దాదాపు 2,000 చెట్లను నరికివేశారు.”

ఏం జరుగుతోందో స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని అర్మోకు అర్థమైంది. (ఆర్మో తదితరులను “వారి భద్రత కోసం” నిర్బంధించారని పోలీసులు చెప్పారు.) “హస్దేవో నాశనం అవుతున్నప్పుడు, చెట్లను రక్షించడానికి ప్రయత్నించిన గ్రామస్తులను మోసగించడంలో మేము బిజీగా ఉన్నాము” అని అధికారులను తమ రికార్డులలో వ్రాసి వుంచమని, తద్వారా ” భవిష్యత్ తరాలు అది చదివి మీరు ఎంత తప్పు చేశారో చెబుతారు” అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.

ఇప్పుడు, హస్దేవో ఒక నిఘా జోన్‌గా ఉంది, అదానీ గ్రూప్ రిక్రూట్ చేసుకొన్న యువకులు నిరసనకారులపై నిఘా పెడుతున్నారు. మైనింగ్ కార్యకలాపాలు కొనసాగేలా చూడడానికి పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. తాము ఎదురు మాట్లాడితే ప్రతీకారం తీర్చుకుంటారని గ్రామస్తులు భయపడుతున్నారు. కానీ ఆర్మో దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ప్రతి రోజూ సూర్యాస్తమయం సమయంలో, గనిలో తాజా పరిణామాల గురించి ఇతర గ్రామస్తులతో మాట్లాడటానికి, భవిష్యత్తులో ప్రతిఘటన ప్రయత్నాల ప్రణాళికలను వేయడానికి ఒక పెద్ద టార్పాలిన్ టెంట్ క్రింద సమావేశమవుతాడు. హస్డియోను రక్షించే పోరాటం కూడా ఆదివాసీ అస్తిత్వం కోసం జరిగే మరింత పెద్ద పోరాటంగా అతను భావిస్తాడు.

‘ఈ అంశాన్ని ఒక రకమైన సామాజిక నిర్మాణంగా చూడవచ్చు’ అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా అంటున్నారు. ‘ఆదివాసీ జీవితాన్ని రెండు వైపుల నుండి నాశనం చేశారు. ఒకవైపు వారి భూమి, అటవీ, జీవనోపాధి బొగ్గు తవ్వకం, నిర్వాసితాల ద్వారా నాశనమైతే మరో వైపు వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను వాణిజ్య ప్రధాన స్రవంతి హిందూ మతంతో భర్తీ చేసి క్రమక్రమంగా సంకీకరిస్తున్నారు.‘

“పోరాడకపోతే చాలా నష్టపోతాం: భూమి, నది, జంతువులు, మొక్కలు, అభయారణ్యాలు, జీవనోపాధి, అన్నింటి కోసమూ మేం పోరాడుతున్నాం.”

అనువాదం: పద్మ కొండిపర్తి


https://time.com/6318729/india-coal-mining-climate-hasdeo-arand/

Leave a Reply