ప్రసాద్‌, మన వీధంత పోలీసులంట. ఏమయ్యిందో ఏమిటో?’’ పొద్దున్నె నా భార్య అనే సరికి, నిద్రెగిరిపోయి లేచి కూర్చున్న

‘‘ఏంది?’’ తిరిగడిగిన అనుమానంతో

‘‘మన పక్క ప్లాట్‌ అంకుల్‌ పాల పాకెట్‌ కోసం పోతే వీధిల ఎవరిని లోపలికి, బయటకు కదలనీయటం లేదట, వందల మంది పోలీసులు…’’

మెదడు వేగంగ పనిచేయసాగింది. విషయం అర్థమైంది. కాని ఇంత త్వరగా వస్తారని ఊహించలేకపోయా!

అయినా ఇంత మంది రావుడేమిటి ? అనుమానం తీరక విషయం తెలుసుకుందామని, లుంగిమీదనె బయలుదేరబోతుండగా, నాకు బయటకు పోయె శ్రమ తగ్గించారు! ముందు డోర్‌ను సుతారంగ పగులగొట్టి సాయుదులు లోపలికొచ్చారు. డోర్‌ దగ్గర మరికొంత మంది కాపల కాస్తుండగా, ముగ్గురు నలుగురు లోపలి కొచ్చారు లేడి పోలీస్‌తో సహా. అందులో ఒకరు స్థానిక పోలీసు అధికారిగా గుర్తించాను. మిగిలిన వారు కొత్త. అందులో ఒకరు

‘‘ఇదిగో సర్చి వారెంట్‌…’’ పక్కా రాష్ట్రంలో కోర్టు నుండి తీసుకొచ్చింది చూపుతూ, ఇంటిని అణువణువున గాలించటం మొదలు పెట్టారు వీడియో తీసుకుంటూ

కాలేజికి తయారైన మా పిల్లల్ని బయటకు కదలనీయకపోయె సరికి బయంతో చూడసాగారు.

‘‘ఎందుకు సార్‌ ఈ సోదా?’’ స్థానిక పోలీస్‌ అధికారిని అడిగా

‘‘నా కేమి తెలుసండి, పై నుండి వచ్చారు, ఇక్కడికి పట్టుకొచ్చారు’’

‘‘స్థానికంగ మీకు తెలియకపోవటం ఏమిటి? చట్ట వ్యతిరేకం గదా ఇది!’’

‘‘మా చేతిల ఏం లేదు, అయినా పక్క రాష్ట్రంల ఏమైన చేసి వచ్చావా ఏమిటి’’ ఆ అధికారి అనేసరికి నేను రక్షణలో పడ్డట్టయింది. ఇంతలో ఆ ముగ్గురు అధికారులు నా దగ్గరకొచ్చారు. వాళ్ల వేషబాషలు స్థానికులు కాదని అర్ధమవుతుంది

ఆ ముగ్గురు లైబ్రరిని ఎన్నడు చూడనట్టు, అడవిల ఏవో వింత వస్తువులను చూసినట్టు చూడసాగారు!

ప్రశ్నలు మొదలయ్యాయి

‘‘ఇన్ని పుస్తకాలు ఎందుకున్నాయి?’’ ఒకతను

‘‘ఇది నా పర్సనల్‌ లైబ్రరి. బాల్యం నుండి పుస్తకాలను సేకరించి పెట్టుకోవటం నా హాబీ’’ నా జవాబు సంతృప్తినివ్వనట్టుంది. 

హాబీ ఉంటే స్టాంప్స్‌, కాయిన్స్‌, గవ్వలు సేకరించుకోవాలిగాని, ఇవెందుకు అన్నట్టున్నాయి అతని చూపులు

‘‘ఏమి పుస్తకాలుంటాయి?’’ ఇంకొతను

‘‘సాహిత్యం, చరిత్ర, మత, సామాజిక పుస్తకాలుంటాయి…’’

షెల్ప్‌ ల రామాయణ, మహాభారత పుస్తకాలను చూసి ఆశ్వర్యంతో

‘‘ఇవి గూడ చదువుతావా?’’ అడిగాడు

‘‘అవును, చదువుతాను!’’

‘‘ఎందుకోసం?’’

‘‘ప్రాచీన చరిత్రను అర్ధం చేసుకోటానికి!’’

‘‘చరిత్రనా…!’’ ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నరు

‘‘మత గ్రంథాలలో మహాత్యాలుంటాయి గాని, చరిత్ర ఏమిటి?’’ ఒకతను అన్నడో లేదో

‘‘సార్‌ ఇవి చూడండి…’’ ఒకతను షెల్ప్‌ ల నుండి కమ్యూనిస్టు ప్రణాళిక ఆదివాసి ప్రజారాజ్యం పుస్తకాలను తీశాడు.

‘‘ఈ పుస్తకాలు ఏమిటి?’’ ఒకతను

‘‘అవి సామాజిక పుస్తకాలె కదా!’’ అవి ఎక్కడ కొన్నానో చెబుతున్న వినకుండ

‘‘ఇవ్ని పుస్తకాలతో ఏమి పని?’’ తిరిగి అతనే అడిగాడు

‘‘జ్ఞానం, సమాచారం కోసం…’’

‘‘జ్ఞానమా!’’ వారికి వింతగా ఉంది

‘‘నా దగ్గర ఈ ఏడొందల పుస్తకాలకే ఇంత ఆశ్చర్యపోతున్నారు. మా ముఖ్యమంత్రిగారి దగ్గర డెబ్బయి వేల పుస్తకాలున్నయి!’’ నా నోటి నుండి మాటరాకముందే

‘‘ఇన్ని డబ్బులెక్కడివి?’’ సోదాలో దొరికిన అయిదువేల రూపాయల కట్ట ముందు పెడుతూ

‘‘నా భార్య జీతం…’’ జవాబిచ్చా. నిజానికి రోజు మా ఆవిడ ఆటో చార్జి చిల్లర కోసమని తెచ్చుకున్న పది రూపాయల కట్ట అది!

‘‘సరే, ఈ లిస్టు ఏమిటి? ఈ వస్తువులు కొని ఎవరికైన పంపుతున్నావా?’’

కిరాణ సామానుకోసం మా ఆవిడ చెబుతుంటె రాసుకున్న చిట్టి అది! అదె గట్టిగ చెప్పిన

చివరి అంకానికొచ్చారు

‘‘నీకు సంబందించిన సమాచార ముంది. పోయిన నెలలో రెండు రోజులు ఎక్కడికి పోయావు?’’

‘‘గిరిజన ప్రాంతాలకు అన్ని పత్రికల జర్నలిస్టులం పోయాం.’’ ఓ ప్రభుత్వ పత్రిక విలేఖరి పేరు చెప్పా ఆసరా కోసం!

‘‘ఏం రాసుకొచ్చారు?’’

‘‘వారి జీవన పరిస్థితుల గురించి…’’

‘‘అక్కడ ఎవరిని కలిశారు?’’

‘‘ప్రజల్ని!’’

‘‘ఇంకెవరిని కలువలేదా?’’

‘‘ఇంకెవరంటె?!’’

‘‘తెలియనట్టు నటించకండి’’ అని

‘‘అయినా గిరిజనుల గురించి ఏమి రాద్దామనుకుంటున్నవు?’’

‘‘వ్యాసమో, కథో రాద్దామనుకుంటున్నా’’

‘‘నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాము’’

‘‘ఎందుకు, నేనేమి తప్పు చేయలేదె!’’

‘‘చేయబోతున్నావు, నీవు వ్రాసె రచన వల్ల దేశంల అలజడి ఏర్పడి, శాంతి బద్రతల సమస్యగా మారి, ఆర్థిక సంక్షోబం ఏర్పడుతుంది కాబట్టి…’’

‘‘ఎలా?!’’

‘‘నీ దగ్గర దొరికిన కమ్యూనిస్టు ప్రణాళిక, ఆదివాసి ప్రజారాజ్యం చాలు ఎంత కుట్ర చేస్తున్నావో…’’

‘‘నేను రాయటమే మొదలుపెట్టలే గదా!’’ 

‘‘అందుకె రాయకుండ ముందు జాగ్రత్తగా…’’

‘‘ఎటువంటి విషయం రాస్తున్నావో బయటకు రాక ముందె ఎలా అదుపులోకి తీసుకుంటారు?’’

‘‘మాకు సమాచార ముంది. నీ ఆలోచనలె ప్రమాదకరము. అందుకే ముందు జాగ్రత్తగా…’’

మీటింగులకు పర్మిషన్‌ నిరాకరించటం, ఇచ్చిన హాల్‌ వారిని బెదిరించి తాళాలు వేయటం, జనాన్ని అక్కడికి రాకుండా చేయటం, పుస్తకాల ప్రచురణ పూర్తికాక ముందె ప్రెస్‌లనె అదుపులోకి తీసుకోవటం ఇప్పటి దాక చూశా!

‘‘కాని నేను రాయకముందె, నన్ను నా ఆలోచనల్ని అదుపులో పెట్టడం ఏమిటి! నా బావ ప్రకటనా స్వేచ్చకు ఆటంకం ఇది…’’ రాజ్యాంగ ప్రకరణ గుర్తుకు చేసిన వారికి

‘‘రాజ్యాంగమా!’’ నా అమాయకత్వానికి నవ్వుకొని

‘‘రేపు మా ఆఫీసుల మరోసారి విచారణ ఉంటది’’ పద్దతిగా నా చేతిల లేఖ పెట్టి, నా పుస్తకాలను, సెల్‌ను మూటకొట్టుగొని, ఎంత చెబుతున్న వినకుండ మా పిల్లలు ల్యాప్‌టాప్‌ను పట్టుకెళ్లారు ఎన్‌ఐఎ వారు

One thought on “పుస్తకాయుధాలు

Leave a Reply