కవితలల్లుదాం
ఢిల్లీలో రైతుల
పోరు నినాదాలను
కథలు చెపుదాం
రైతుల నెత్తురే
ధారలై పారుతున్న
ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం!
పిడికిళ్లు ఎత్తుదాం
దగాపడ్డ బతుకుల
పోరుదారిలో !
ఈ అక్షరాలను అస్వాదించండి
ఆరాధించడం వద్దు
మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను!
ఈ పదాలకు
పెదవి విరుపులు అలంకారమే !
పెదాల బిగువున దాగిన
మౌనాన్ని వీడి
అక్షరాల అలుగు దునికిద్దాం !
మాట్లాడుదాం
రైతుల పోరు గాథలను
ఢిల్లీ సరిహద్దులు
రక్తసిక్త మౌతుంటే,
అక్షరాలా
అగ్నిదీపాలను సృష్టిస్తాం!
మనం తినే పళ్లెంలో
అన్నంకు బదులు,
రైతన్నల రక్తపుచుక్కలు
మెరుస్తున్నయ్ !
ఆ వేళ యాడాదినర్థం
పోరు పొద్దులై పొడిచి
రాత్రనక పగలనక
ఎండనకా వాననక -
నూతన పోరురూపాలను,
వందలాది రైతుల
అమరత్వాలను
భారత మాత మోముమీద,
పోరు చరిత లిఖించి
మాటాతప్పిన సర్కారు మీద
కవాతు చేయకదిలిండ్రు
ఢిల్లీ సరిహద్దులు
రణరంగమైన వేల
రైతుపోరు కేకలు
వినబడుతున్నయ్ !
వారి అక్రందనల ధ్వనులు
మారుమోగుతున్నాయి
మన మనసులల్లగీసికున్న
సరిహద్దులు చేరిపేద్దాం !
పాలకుల చె త్వారాలకు
శస్త్ర చికిత్స చేద్దాం !
వంటపాత్రలకు సైతం
తుపాకీ తూటాలు దిగుతుంటే
ఈ దేశ అన్నదాతలు
పరాధీనులుగా
పట్టపగలు పిట్టల్లా రాలుతుంటే
భరతమాత గుండెలమీద
దిగ్గొట్టిన ఇనుప చువ్వలను
సుతారంగా వాళ్ళు
మునివేళ్లతో పీకేస్తుంటే
మన మనసు మైదానం మీద
ఇరుకుగా వేసుకున్న
ఇనుప కంచెలను పీకేద్దాం!
ఘనీభవిస్తున్న మనసులను
అగ్నిస్నానం చేయిద్దాం !
పోరు వ్యవసాయకులకు
రక్తబీజాలు అందిద్దాం !
పోదాం పద
రైతన్నలతో కలిసి
కవాతు చేద్దాం
ఢిల్లీ దిగివచ్చేదాకా !
కవాతు చేద్దాం
ఢిల్లీ దిగివచ్చేదాకా !!
Related