రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, దాన్ని విలువలేని దానిగా మార్చివేస్తూ రాజ్యాంగాన్ని విశ్వసించని వాళ్ళని మాత్రం నేరస్తులుగా పరిగణించే స్థితికి ప్రజాస్వామిక వ్యవస్థ దిగజారిపోయింది. రాజ్యాంగం గురించి ప్రజల్లి మాట్లాడకుండా చేయడమే కాదు, మాట్లాడిన వాళ్ళందరిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తూ అవసరం అనుకుంటూ అర్బన్ నక్సల్‌గా ప్రకటించే సంస్కృతి కొనసాగుతుంది. ప్రజా పోరటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్ని కేవలం చట్టాల వరకే పరిమితం అయ్యాయి. ఆచరణ అంతా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థ నడవాలనే స్థితిలో నేరస్తులే దొరలుగా కీర్తించబడుతున్నారు. న్యాయం కోసం నిలబడ్డవారు నక్సలైట్‌గా ముద్రవేసుకోబడి కాల్చివేయబడుతున్నారు. ప్రజా ఉద్యమం పునాదులు ఆ విధంగానే ఉంటాయి. ప్రజా ఉద్యమాలతో ఏ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడదు. సిద్ధపడితే ప్రజా సమస్యల పరిష్కారాలే చర్చలుగా ముందుకు సాగుతాయి. చర్చల కోసం వచ్చిన ప్రతినిధుల దగ్గరికి 600లకు పైగా న్యాయం చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. అంటే ప్రజలు ఎంతగా న్యాయానికి దూరమైపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఏ ప్రజా ఉద్యమమైనా న్యాయం కోసమే పోరాటం. ఆ పోరాటాల్లోని ప్రజాస్వామిక కాంక్షలను తొక్కేసి నిషేధ వ్యక్తులుగా ప్రచారం చేసి నిర్బంధాన్ని అమలు చేయడానికి దారులు వెతుక్కుంటున్నాయి. అందులో భాగమే ప్రభుత్వం ఆదివాసుల పోరాటాన్ని మావోయిస్టులతో జత చేసి ఆ ఉద్యమాలన్నిటిపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. 2023 జనవరి 11న గగనతలం నుండి చాపర్లను ఉపయోగించి బాంబు దాడులు చేసి హత్యాకాండను కొనసాగించింది. మన ప్రనజాస్వామిక పరిపాలన అధికారం దుర్వినియోగపరుస్తూ ప్రజలనే హత్య చేసే స్థితికి దిగజారిపోయింది. దీన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పనిచేయలేకపోతే, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. అందులో భాగంగా సాగే ఆందోళనలు ఉద్యమ రూపాన్ని కూడా తీసుకుంటాయి. ఆ ఉద్యమాలు సాయుధంగా సాగుతున్నాయని, వాటిపై అణచివేతలే ప్రధానంగా ఉండడం హేతుబద్ధతే కాదు. సమస్య మూలాలను సృషించకుండా, ఆచరణలోని తన హింసను దాచిసి, ఉద్యమకారుల ప్రతిహింసను ప్రధానం చేసి, అన్ని ఉద్యమాలను అదే కారణంతో అణిచివేస్తున్న స్థితిని అర్థ శతాబ్ధకాలంగా మనం చూస్తున్నాం. కొన్ని ఉద్యమాల నాయకత్వాలను ప్రభుత్వమే హత్య చేపించింది. ఇప్పటికి బాధిత కుటుంబాలకు, సంస్థలకు చట్టపరంగా న్యాయం అందనేలేదు. భూ సంస్కరణలు లేనందుకే నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ముందుకు వచ్చాయి. తర్వాత వచ్చిన ఆ చట్టం కూడా పటిష్టంగా అమలు జరగని కారణంగా జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ పోరాటాలు ముందుకు వచ్చాయి. ఉద్యమాలపై బలమైన అణచివేతలో అవి నిలదొక్కుకునే స్థితి లేక వేరే ప్రాంతాలకు విస్తరించాయి. ఎక్కడైనా సమస్యలు, అణచివేతలు ఉన్న దగ్గర పోరాటాలుంటాయి. అణచివేతలను ఎదురించి ఉద్యమాలు నిలదొక్కుకోవడం, త్యాగాలకు సిద్ధపడడం అనేది అనివార్యంగా మారుతుంది. అదే దండకారణ్యం మొత్తంగా ఆదివాసి ఉద్యమాలు నిర్వహిస్తున్న ఒక చారిత్రక సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా ఎప్పుడైనా నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ప్రయత్నించాయా అని ఆలోచిస్తే ఎప్పుడూ లేదు. 2005 సాల్వాజుడుం నుండి నేటి వరకు అడవిలోనే ఆదివాసులు ప్రశాంతంగా బతికింది లేదు. దానికి కారణం అడవిలో దోపిడి, విధ్వంసాలకు హద్దే లేని స్థితిలో ఆదివాసులు జీవితాలున్నాయి. ఆదివాసీలు ఉద్యమకారులుగా మారే తప్పనిసరి పరిస్థితుల్ని ప్రభుత్వమే కల్పిస్తుంది. దాన్ని కారణంగా చూపుతూ గగనతలం దాడులు చేస్తూ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం అప్రజాస్వామ్యం కాదా? పెట్టుబడిదారుల సామ్రాజ్య వాదుల బలమే తన శక్తిగా భ్రమించడం ప్రభుత్వాల అజ్ఞానానికి తార్కాణం కాక మరొక్కటి కాదు. పాలనాదక్షుడిలో పెట్టుబడిదారుడి, సామ్రాజ్యవాద అవశేషాలు ఏమాత్రం ఉన్న ప్రజాస్వామ్యవాదిగా పాలన చేయలేడు. అది చివరికి ఖచ్చితంగా యుద్ధానికి దారి తీసి, దేశాన్ని అరాచకానికి, అస్థిరతకు గురి చేస్తుంది. మన దేశంలో అడివిపై హక్కు ఆదివాసులదే నని 1997 సమతా జడ్జిమెంటులో సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికి కూడా అనేక తప్పుడు కారణాలతో, అక్రమాలతో, న్యాయవ్యవస్థను పక్కదోవ పట్టించి అడవి నుండి ఆదివాసులనే విస్తాపనకు గురి చేసే స్థితి 2005 నుంచి ముమ్మరంగా సాగుతుంది. దేశాన్ని రిపబ్లిక్‌గా మాట్లాడుతూనే, ఆదివాసీ గూడాలపై బాంబులు కురిపిస్తున్న వైఖరి పట్ల మనందరం మాట్లాడాల్సిన స్థితి ఉన్నది.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం సాగినపుడు కూడా బూటకపు ఎన్కౌంటర్లు నిత్యకృత్యమైన స్థితిలో నుండి శాంతి చర్చలకు, తెలంగాణ మేదావి వర్గం ప్రధానంగా పౌర స్పందన వేదిక, సినియర్ ఐఎఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ చొరవతో శాంతి చర్చలకు పునాది పడిరది. ప్రభుత్వానికి చర్చలు, శాంతియుత వాతావరణం కన్నా, హత్యాకాండ కై ప్రాముఖ్యత నిచ్చి ఒక మూడు నెలలు సాగిన శాంతి కాలాన్ని విఘాతం కలిగిస్తూ, మళ్ళీ ఎన్కౌంటర్ హత్యాకాండతో చర్చలను నిశ్శబ్ధం చేశారు. మళ్ళీ తుపాకి మోతలు మోగించారు. అదీ నేటికి కొనసాగుతూ వచ్చి, చివరికి తన ప్రజలపై తానే యుద్ధం చేసే ప్రక్రియలోకి ప్రవేశించింది. నేడు రిపబ్లిక్ తన పిల్లలను తానే చంపుకుంటుందనేది స్పష్టంగా నిరూపించబడుతున్న సత్యం. ప్రభుత్వం సాయుధ బలగాలతో, ఆయుధాలకు ఇస్తున్న ప్రాముఖ్యత, సమస్యలను చర్చించడానికో, పరిష్కరించడానికో ఇవ్వడం లేదు. చర్చలకు తావు లేకుండా కేవలం తుపాకులు మాట్లాడుకునే స్థితిని కల్పించింది ప్రభుత్వమే కదా? అందుకు ప్రజలకన్న పెట్టుబడిదారులపై ఉన్న మమకారం, పర్యావరణాన్ని విధ్వంసం చేసే కంపెనీల పట్ల ఉండే ఉదాసీనతే కారణం ఎందుకు వ్యవసాయానికి నేటికి ప్రాముఖ్యత ఇవ్వక, లక్షల్లో రైతాంగ ఆత్మహత్యలకు కారణమవుతున్నది. మనిషి జీవించే హక్కును రద్దు చేసుకోవలనుకుంటున్నాడంటే ‘ప్రభుత్వాలు’ గా అన్ని రాజకీయ పార్టీలు విఫలమయినట్టుగా భావించడం సత్యమే కదా? ఆత్మహత్యలకు ఏ ప్రభుత్వమైనా నివారించడానికి ప్రయత్నం చేసిందా?
ఇలాంటి స్థితిలో మావోయిస్టు ఉద్యమం 1980లో గోదావరిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత, ఆదివాసీలపై ఫారెస్టు వాళ్ళ దాడులు, షావుకార్ల దోపిడి తగ్గి, వారు కనీసంగా జీవించే పరిస్ధితులు నెలకొనడానికి ఒక రెండు దశాబ్దాల పోరాటం అవసరమయ్యింది. ఈ పోరాటాన్ని అణిచివేయడానికి దండకారుణ్యం మొత్తంగా 100కు పైగా సాయుధ పోలీసు క్యాంపులు అనేక పేర్లతో మిలటరీ ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వ సాయుధ బలగాలతో అణచివేత మావోయిస్టులు అక్కడ ఉన్నందుకు కాదు, కోట్లాది విలువైన సహజ సంపద అడవిలో భూమి పొరల్లో ఉన్నందుకు దాన్ని పెట్టుబడాదారులు దోపిడి చేసే అవకాశం ఆదివాసులు ఇవ్వనందువల్లనే దాడులు జరుగుతున్నాయి. ఆదివాసీలు, మావోయిస్టులతో కలిసి ఆందోళన చేస్తున్నారని, ఆ సాకుతో తీవ్రమైన సాయుధ దాడులకు సిద్ధమవుతున్నారు. శ్రీలంకలో ఎల్‌టిటిఇ జాతి పోరాట ఉద్యమాన్ని నిర్మూలించినట్లుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అటువంటి ప్రకటనే 2023 జనవరి 7న చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్‌లో హోంమంత్రి అమిత్‌షా జనవరి 7న ప్రకటన చేశాడు. సరిగ్గా 4 రోజులకే డ్రోన్‌లో పాటు చాపర్లను ఉపయోగించి గ్రేహాండ్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్, డిఆర్సి బలగాలతో జనవరి 11, 2023 ఉదయం 11 గం॥లకు వైమానిక దాడి కొనసాగించింది. ఈ దాడి సుక్మా జిల్లాలోని కిష్టారం, పామేడ్ ప్రాంతాలలోని మల్కన్గూడ, మిట్టగూడ, బొట్టెతోంగ్, సాకిలేర్, మడ్రాడులాడె, కన్నెమార్క, పొట్టెమాగం, బొత్తలంక, రాసపల్లి, ఎర్రపాడు గ్రామాలపై బాంబులతో దాడి చేసి ‘‘పొట్టంహంగి’’ అనే ఆదివాసి మహిళను హత్యచేశారు. గతంలో వరుసగా రెండేళ్ళుగా డ్రోన్లతో బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 ఏప్రిల్ 29న డ్రోన్లతో బాంబుదాడులు బొట్టులంక, పాలగూడెం గ్రామాలపై దాడి చేసారు. 2022 ఏప్రిల్ 14, 15 తేదీలలో కూడా డ్రోన్లతో బాంబును జారవిడిచారు. ఈ బాంబులు కొట్టం, రాసం, ఎర్రం, సాకిలేర్, మదస, దూలేడ్, కన్నెమార్క్, పొట్టిమాగం, బొట్టెం గ్రామాలపై వేసారు. 2022 ఏప్రిల్ 14, 15 తేదీల తర్వాత అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్న నేషనల్ క్యాంపెయిన్ టు డిఫెండ్ డెమ్రోక్రసీ అనే సంస్థతో పాటు పియుసిఎల్ ప్రధాన కార్యదర్శి పి. సురేస్, నేషనల్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సంస్థ ప్రధాన కార్యదర్శి అనియరాజ, మానవహక్కుల వేదిక గుట్ట రోహిత్, చత్తీస్ఘడ్ బచావో ఆందోళన్‌కు చెందిన బేలాభాటియా, నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్‌కు చెందిన అరుంధతి దురు, వీర సంఘమిత్రలతో పాటు ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ కవితా కృష్ణన్, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ కార్యదర్శులు, న్యూ ట్రేడ్ యూనియల్ ఇనీషియెటివ్ (ఎన్‌టియుఐ)కు చెందిన గౌతం మోడి, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఎఐఎల్ఎజె)కు చెందిన కృష్ణన్ పి రాజారియో, సహేలికి చెందిన వాణి సుబ్రహ్మణ్యం, జార్ఘండ్ జనాధికారి మహాసభకు చెందిన సిరోజ్దత్త, పశ్చిమ బంగా కేతే మజ్దూర్ సంఫ్‌ు సమితి (పిబికెఎంఎస్)కు చెందిన అనురాధా తల్వార్, పీపుల్స్ వాచ్‌కు చెందిన హెన్ని తఫాంగే, మంధన్ లాకు చెందిన అవసి చోస్కి, సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ తీస్తా సెతల్వాద్, బర్గి బాంద్ విస్తాపిత్ ఎవమ్ ప్రభావిత్ సంఫ్‌ు మధ్యప్రదేశ్ రాజ్‌కుమార్ సింగ్, కనన్ విరోధి విస్తాపన్ సంఘర్ష్ సమితి (రాజస్ధాన్) కైలాష్ మైనా, డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ (కర్ణాటక) సిస్టర్ సిలియా, పర్యావరణ సురక్షా సమితి (గుజరాత్) కృష్ణకాంత్ చౌహాన్, జన్జాగరన్ శక్తి సంఘటన్ (బీహార్) ఆషిష్రంజన్, ఉమెన్ అగేనెస్ట్ స్టేట్ రిప్రెషెన్ అండ్ సెక్సువల్ వయోలెన్స్‌కు చెందిన నిషా బిస్వాస్, అఖిలభారత ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌కు చెందిన జాతీయ కార్యదర్శి వినీత్ తివారి, ప్రొ॥ నందిని సుందర్, మానవ హక్కుల కార్యకర్తల మరియు రచయిత అకార్పటేల్, ఆహారహక్కు యాక్టివిస్ట్ జ్యోతి, రచయిత జర్నలిస్ట్ జాన్ దయాల్, అకాడమిక్ ఆక్విస్ట్ బ్రెమిల్లా డిసౌజా వీరందరు ప్రభుత్వం కొనసాగించిన డ్రోన్ బాంబు దాడులను వ్యతిరేకిస్తూ, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కొనసాగించాలని ఆదివాసి ప్రాంతాలల్లో ఉన్న మిలట్రీ క్యాంపులను ఎత్తివేయాలని, గగనతలం దాడులు ఆపివేయాలని ఏడాది క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికి మల్లీ ఈ ఏడాది జనవరిలో డ్రోన్‌లో పాటు చాపర్లను వాడినట్లుగా వార్తా మాద్యమాల ద్వారా బయటికి వస్తున్న వార్తలు. ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ బృందాన్ని సుక్మాజిల్లా డోర్నకల్ దగ్గర ఆపేసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళనీయకుండా నిజాన్ని దాచేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. నిజాలకై సత్యశోధనలు చేయాల్సిన అవసరం ఇంకా మిగిలే ఉంది. యుద్దం తరహా దాడులు ఒక వైపు, మరొకవైపు 500 రోజులుగా మిలట్ట్రీ క్యాంపులకు వ్యతిరేకంగా గాంధేయ విధానంలో ప్రజా ఆందోళన కొనసాగుతున్నాయి. మిలట్రీ క్యాంపులతో ఆదివాసీ జనజీవనం అస్తవ్యస్తం అవుతున్న నేపథ్యంలో సిలింగేర్ మిలిట్రీ క్యాంపులకు వ్యతిరేకంగా 500 రోజులు సుదీర్ఘకాలం శాంతియుత ఆందోళన ఆదివాసులు చేస్తున్నారు. ఆ ఆందోళనపై కూడా పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురు ఆదివాసీలను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఒక గర్బిణి మహిళ కూడా చనిపోయింది. శాంతియుత ధర్నా కూడా ఐదుగురిని బలి తీసుకుంది. ఈ హత్యాకాండపై నేటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. 2023 ఫిబ్రవరి 1న సిడిఆర్‌ఒ సంస్థ తరపున సుక్మా కలెక్టర్‌ను ప్రత్యక్షంగా కలిసి అడిగినపుడు స్పష్టమైన సమాధానం కూడా రాలేదు. ఆదివాసీ ఉద్యమంపై మిలట్రీ క్యాంపులు, కొద్దిగా స్తబ్దతకు గురిచేస్తాయేమో కాని శాశ్వత శాంతి కావాలంటే శాంతి చర్చలు, మిలట్రి కాంపుల ఎత్తివేత తక్షన పరిష్కారంగా ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉంది.