50 ఏళ్ల విరసం మహాసభల్లో కలిసిన ఒక ట్రాన్స్‌ సామాజిక కార్యకర్తతో ఒక రాత్రంతా జరిపిన సంభాషణ, అంతకు ముందే జరిగిన హైదరాబాద్‌ ప్రైడ్‌ మార్చ్‌, అడపాదడపా బిట్టూతో పంచుకున్న విషయాలు కొత్త లోకంలోకి తలుపులు తెరిచాయి. అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని నిర్దేశించే సామాజిక నీతి పట్ల చికాకు, జెండర్‌ స్టీరియోటైప్‌కు భిన్నంగా ఉండే వ్యక్తుల పట్ల ఆసక్తి నా రాజకీయ అవగాహనతో సంబంధం లేకుండా మొదటి నుండీ ఉండేవి. మార్క్సిజం పరిచయమయ్యాక మానవ సంబంధాలను అర్థం చేసుకునే తీరు తెలిసింది. ఒక ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థం కావు. మన అధ్యయనానికి కొన్ని పరికరాలు మాత్రమే దొరుకుతాయి. వాటితో పనిచేయడమే కాదు, ఎప్పటికప్పుడు వాటిని పదును పెడుతూ ఉండాలి. సమాజమే కార్యశాల కాబట్టి ఎంత మంది మనుషులను కలిస్తే, సమూహాలను తాకితే, ఎన్ని ప్రయాణాలు చేస్తే అంతగా చూపు విశాలమవుతుంది, నిశితమవుతుంది. మన ఖాళీలను మనుషులే పూడుస్తారు, అన్ని రకాలుగా.

ట్రాన్స్‌జెండర్స్‌ పట్ల సానుభూతితో కూడిన ప్రజాస్వామిక దృక్పథం ఉండేది. నా ప్రపంచం, నా ఆలోచనా పరిధి ఎంత పరిమితమైనదో వారితో మాట్లాడినప్పుడు తెలిసొచ్చింది. క్రమంగా జెండర్‌ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అని అర్థమైంది. ఆడ, మగ, కాకపోతే ట్రాన్స్‌జెండర్‌ మాత్రమే కాదు, చాలా వైవిధ్యభరితమైన లింగ అస్థిత్వాలు, లైంగిక ఆసక్తులు ఉంటాయన్నది ఏదో పైపైన తెలిసిన విషయం. ఇది కూడా చాలా మందికి తెలీనప్పుడు ఈ మాత్రం తెలియడం గొప్ప విషయమా? ఈ వాస్తవం మనుషుల, సమూహాల భౌతిక, సామాజిక అనుభవంగా ఎలా ఉంటుంది ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశామా? ఈ ప్రశ్నలు ఎదురైనాయి. ఒక వాస్తవంగానైనా ఈ వైవిధ్యాలు మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ ఉంటాయని విన్నప్పుడు, చదివినప్పుడు ఆశ్చర్యమూ, అద్భుతమూ అనిపించింది. అయితే జంతువుల సహజాతాలకు, మనుషుల ప్రవర్తనలకూ చాలా తేడా ఉంటుంది. మానవ మానసికత మీద సమాజ ప్రభావం చాలా ఉంటుంది. లైంగిక వైవిధ్యాలను అర్థం చేసుకోవాలంటే అటు జీవసంబంధమైన (భౌతిక) విషయాలను, ఇటు సామాజిక అంశాలను అధ్యయనం చేయాల్సిందే.

లింగం (జెండర్‌), లైంగికత (సెక్స్‌) వేరు వేరు విషయాలు. సెక్స్‌ అనేది జీవసంబంధమైనది. జెండర్‌ సామాజికమైనది – అంటే సమాజంలో ఏ జెండర్‌ పాత్ర నీవు నిర్వర్తిస్తావు అన్నదానికి సంబంధించినది. రెండిరటికీ లంకె ఉంది. ఎలాగంటే నవజాత శిశువుగా నువ్వేమిటి అనేది వైద్యులు, కుటుంబం నిర్ణయించాక, దాని ఆధారంగా నీ సామాజిక పాత్ర ఆదేశించబడుతుంది.’’ పైకి కనిపించే దాన్నిబట్టి నువ్వు ఫలానా అంటే అంగీకరించలేని స్థితి ట్రాన్స్‌జెండర్స్‌కు ఉంటుంది. నువ్వు ఫలానా కాబట్టి ఇలా ఉండాలి అని ఆదేశిస్తే ఒప్పుకోకపోవడం ఎంత న్యాయమైనదో, నేను ఫలానా అని గుర్తించుకోవడం కూడా అంతే న్యాయమైనదీ, సహజమైనదీ అని మొదట మనం అంగీకరించడం దగ్గర మన అధ్యయనం మొదలుకావాలి. ఇక అన్వేషించండి. ప్రకృతిలో ఎన్ని రంగులో, వాటిలో ఎన్ని ఛాయలో! అరుణతారలో ఈ లైంగిక వైవిధ్యాల సీరీస్‌ మొదలుపెట్టినప్పుడు నా అవగాహనలో ఉన్నది ఎల్‌జిబిటిక్యు (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌, క్వీర్‌). ఇప్పుడు ట్రాన్స్‌ సామాజిక కార్యకర్తలు ఎల్‌జిబిటిక్యుఐఎ+ (అదనంగా ఐ-ఇంటర్‌సెక్స్‌, ఎ-ఎసెక్సువల్‌ మాత్రమే కాక అస్థిత్వాలు అనంతం) అని విశ్లేషిస్తుండటం చూసాను. అనంతమైన అస్థిత్వాలు అన్నప్పుడు వాటిని చేరుకోవడం ఎలా? మీరు పోస్ట్‌మాడ్రన్‌ గందరగోళాలలో పడుతున్నారా అని అడిగినవాళ్లున్నారు.
అనేక అస్థితాలు ఉన్నా ఉమ్మడి కార్యక్షేత్రం ఉంటుంది. ఎవరి అస్థిత్వం వారిది, ఎవరి అనుభవం వారిది, ఎవరి పోరాటం వారిది అంటేనే సమస్య. మార్క్సిస్టులు సమాజంలోని వైవిధ్యాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. వేరువేరు సమూహాల ప్రత్యేక సమస్యల్ని అర్థం చేసుకోవాలి. పరిష్కారాలు వెదకాలి. అసలు వైవిధ్యాలనే గుర్తించకుంటే ఎలా? సమాజాన్ని లోతుగా పరిశీలించే కొద్దీ మనకు తెలియని కొత్త వైవిధ్యాలు కనపడి ఎప్పటికప్పుడు మన చూపుల్ని విశాలం చేస్తాయి. మనం చూడ నిరాకరిస్తే అవి లేకుండా పోవుకదా. అసలు వైవిధ్యాలను గుర్తించి గౌరవించడం సమాజ ప్రజాస్వామికీకరణకు మొదటి మెట్టు. లైంగిక వైవిధ్యాల విషయంలో ‘గుర్తించకపోవడమే’ మొదటి సమస్య. సమాజం గుర్తించదు సరే. సమాజాన్ని మార్చాలనుకునే వాళ్లు అన్ని అస్థిత్వాలను గుర్తించాలి.

సమాజంలోని అన్ని సమూహాలు గౌరవప్రదంగా జీవించగలగాలి. అన్ని సమూహాల శారీరక మానసిక శక్తిసామర్థ్యాలు సమాజానికి ఉపయోగపడాలి. కొన్ని శారీరక ప్రత్యేకతల కారణంగా ఏ సమూహాన్నీ సమాజం నుండి వేరుచేసి కించపరిచే స్థితి ఉండకూడదు. ట్రాన్స్‌జెండర్‌ సమూహాలు పితృస్వామిక వ్యవస్థ నుండి దాని పరిరక్షకురాలైన రాజ్యం నుండి హింస, దోపిడి, పీడన, వివక్ష ఎదుర్కుంటున్నారు. వీటి గురించి తప్పనిసరిగా మాట్లాడాలి.

అస్థిత్వాల గురించిన చర్చ అస్థిత్వవాదం కాదు, పోస్ట్‌మోడర్నిజం కాదు. ప్రతి అస్థిత్వం మీద మార్క్సిస్టు విశ్లేషణ ఉంటుంది. వర్గంలోని అన్ని సమూహాల మీద వర్గ విశ్లేషణ ఉంటుంది. మార్క్స్‌ కాలంలో ఇవి చర్చకు రాకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఇవి వర్గపోరాటానికి సంబంధం లేనివైపోవు. మార్క్సిస్టు ఆచరణ ముందుకుపోయేకొద్దీ సమాజంలోని వైరుధ్యాలను, వైవిధ్యాలను మరింత నిశితంగా పరిశీలించగలుగుతుంది. వర్గపోరాటం స్త్రీల సమస్యను ప్రత్యేకంగా గుర్తించింది దాని ఆచరణ క్రమంలోనే. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా లోపలా (కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం లోపల), బైటా (వ్యవస్థలో) జరగాల్సిన పోరాటం ఇప్పుడు వర్గపోరాటంలో భాగమని అర్థం చేసుకుంటున్నాం.
జెండర్‌ స్పృహ అన్నప్పుడు మన సాధారణ అవగాహనలో ఉండేది స్త్రీ అస్థిత్వం. ఇది మరింత విస్తరించి అన్ని లైంగిక అస్థిత్వాలను గుర్తించి మన అవగాహనలో భాగం చేసుకోగలగాలి. నిజానికి లైంగిక వైవిధ్యాల గురించిన చర్చ మన సాంస్కృతిక అవగాహన స్థాయిని పెంచగలుగుతుంది. ఇదేదో కొందరి వ్యక్తిగత సమస్య, లేదా ప్రత్యేక సమస్యగానే పరిమితం చేయకుండా ఒకసారి ఆలోచించండి. లింగం, లైంగికత చుట్టూ సమాజంలో ఏ భావజాలం అల్లుకుని ఉందో, సంస్కృతికి జెండర్‌కు ఉన్న సంబంధం ఏమిటో మరికాస్త లోతుగా అర్థం చేసుకోడానికి దారి దొరుకుంది. మార్క్పిజం ఆయా సమూహాల రాజకీయార్థిక సాంస్కృతిక విశ్లేషణ చేయగలదు. ఆ పని చేయకపోతే మతఛాందసులు మాట్లాడేది, ఎన్‌జివోలు మాట్లాడేది మాత్రమే సమాజంలో వినపడుతుంది. బిట్టు కెఆర్‌ ఆ దిశగా చేసిన ప్రయత్నం ఈ చిన్న పుస్తకం. ఇందులోని ప్రతిపాదనలను ఓపెన్‌ మైండ్‌తో చర్చించాలి.
మన సమాజానికి ఈ విషయాలు ఎంత తెలుసో అనువాదంలోకి దిగినప్పుడు గాని నాకు అర్థం కాలేదు. సైన్స్‌ సంబంధమైన పదాలే కాదు, జెండర్‌ సంబోధన విషయంలో కూడా సమస్య ఎదురైంది. ఒక వ్యక్తిని ఊహించుకున్నప్పుడు మీకు మొదట స్ఫురించేది లింగమే కదా అని బిట్టు సూటిగా అడుగుతారు. అప్పుడు అది తప్పనిసరిగా పురుష లేదా స్త్రీ లింగం అయి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యక్తి ఉండొచ్చు అని ఎంతమందికి అనిపిస్తుంది? వ్యక్తిని ప్రస్తావిస్తున్నప్పుడు రచయితలు చాలా సార్లు పుంలింగం వాడేస్తుంటారు. మనిషి అని రాసేచోట మానవుడు అని, క్రియా పదాలు డు..డు..డు అని వచ్చేస్తాయి. కొంత జెండర్‌ స్పృహ ఉంటే దీనిని అధిగమించొచ్చు. బహువచనం వాడితే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. ఉదాహరణకు ‘మనిషి కనుగొన్నాడు’ అనకుండా ‘మానవులు కనుగొన్నారు’ అనాలి. అయితే స్త్రవఅసవతీ టశ్రీబఱసఱ్‌వ కి సంబంధించిన కథ ఒకసారి ఎదురైంది. ఏకవచనమే వాడాలి. ఆ మనిషి స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇంగ్లీషు క్రియా పదాలకు ఆ సమస్య లేదు. తెలుగులో ఏం చేయాలి? పాసివ్‌ వాయిస్‌ వాడక తప్పలేదు. అది చాలా కృతకంగా అనిపించింది. ఒక ఫ్రెండ్‌ ద్వారా మూల రచయిత ఆచూకీ పట్టుకుని అడిగాను. అబ్బో.. కష్టమే అన్నారు. చివరికి పాసివ్‌ వాయిస్‌ వాడు, అదీ గత్యంతరం లేకుంటే లాస్ట్‌ ఛాయిస్‌ స్త్రీ లింగం తీసుకో అన్నారు. మన ఆలోచనల్లో, వ్యక్తీకరణల్లో ఎంతగా ఒక మూస, ఆధిపత్య భావజాలం పేరుకుపోయి ఉందో ఇటువంటి అనుభవాలు మళ్లీమళ్లీ గుర్తుచేస్తాయి.

ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు కలిగే తాజా అనుభూతి పక్కనే ఒక కష్టం కూడా ఉంటుంది. మరీ క్లిష్టంగా ఉంది, కాస్త సులువుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగని సులువైన దారులు వెతుక్కుంటే మొదటికే మోసం వస్తుంది. ఏదైనా సవ్యంగా నేర్చుకోవాలంటే ఆ కష్టం పడాల్సిందే. నేను సైన్స్‌ విద్యార్థిని కనుక లైంగిక అంశాల వెనకున్న జీవశాస్త్ర విషయాలు చదవగానే అర్థమయ్యాయి. కానీ ఇవే తెలుగులో రాస్తున్నప్పుడు మన భాషలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పదాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ‘లింగం’, ‘లైంగితక’ కన్నా ‘జెండర్‌’, ‘సెక్స్‌’ అంటేనే ఆ రెంటికీ ఉన్న తేడా చెప్పడం సులువనిపించింది. ఇట్లా అడుగడుగునా భాషా సమస్య వచ్చి కొన్నిసార్లు ఇంగ్లీషు పదాలు ఇంగీషులోనే రాసాను. ‘క్రోమోజోమ్‌’ అటువంటిదే. కొత్తగా చదివేవాళ్లను అటు విషయమూ, ఇటు అనువాదమూ రెండూ కష్టపెట్టొచ్చు. అయితే పాఠకులు ఆ కొంచెం కష్టం తీసుకుంటే ఈ పుస్తకం తప్పకుండా కొత్త ఆలోచనలకు, అన్వేషణలకు పురిగొల్పుతుందని నమ్ముతున్నాను.

2 thoughts on “కొత్త పాఠం

  1. వసంత మేఘం లో (01-3-2023)
    పి.వరలక్ష్మి గారు రాసిన
    ” కొత్త పాఠం” చదువుతూ ఉంటే
    బెర్నోడు షా వాక్యాలు గుర్తు చేశాయి
    ” నూతన దృష్టి ఉంటే నూతన సాహిత్యం వస్తుంది” అంటారు.
    ఈ కొత్త పాఠం పాఠకుల్లో, సమాజంలోని ప్రజల్లో, ఒక నూతన ఆలోచనని, నూతన అన్వేషణకి ప్రేరేపిస్తుంది.
    —— మా సత్యం

  2. మా సత్యం
    వసంత మేఘం లో (01-3-2023)
    ” కొత్త పాఠం” చదువుతూ ఉంటే
    బెర్నాడ్ షావాక్యాలు గుర్తు చేశాయి.
    ” నూతనదృష్టి ఉంటే నూతన సాహిత్యం వస్తుంది” అంటారు.
    ఈ ” కొత్త పాఠం” నిజంగానే కొత్త పాఠం.
    నా లో ఈ ట్రాన్స్ జెండర్ సమస్యల మూలాల పట్ల కొత్త ఆలోచనని రేకెత్తించింది.
    తరతరాలుగా ట్రాన్స్ జెండర్ పట్ల కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో బలమైన లోపం ఉంది. చాలా బాధాకరం.
    సమాజంలో ఒక విధమైన ఏవగింపుతో
    అసహ్యించుకుంటూ ఉన్నారు.
    ఆ ఉన్నవాళ్లలో నేను ఒకడిని.
    ఈ కొత్త పాఠం లో సరళమైన భాషతో లోతైన తార్కిక తాత్వికపరమైన ప్రశ్నలతో, విశ్లేషణతో తెలియజేశారు.
    పాఠకుల్లో,ప్రజల్లో, సమాజంలో, కుటుంబంలో ఒక నూతన ఆలోచనని, నూతన అన్వేషణకి ప్రేరేపిస్తూ కొత్త చర్చ లేవదీశారు.
    ఉద్యమాభివందనాలు
    —— మా సత్యం

Leave a Reply