నాకు బాగా ఇష్టమైన కథా రచయితలు ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాస్వేతాదేవి ఇంకొకరు కాళీపట్నం రామారావు. ఇద్దరి కథలని ఇష్టంగా చదువుకుంటాను. చాల సార్లు కథ రాస్తున్నప్పుడు ఎక్కడైనా తోచక పొతే వీళ్ళ పుస్తకాలలోకి తొంగి చుస్తాను. చిక్కులు కాస్త తొలిగి పోతాయి. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు నాకు రెడీరెకనర్ లాగ ఉపయోగపడుతుంటారు. వీళ్లిద్దరు నాకు సాహిత్యంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు.

ఏదైనా కథ నచ్చాలంటే కథలోని ఇతివృత్తంతో బాటు కథ నడిపే తీరు కూడా నచ్చాలి. దాన్ని బట్టే కథలో readability పెరుగుతుంది.

చిన్న చిన్న విషయాలని సైతం పట్టుకోవడంలో వీళ్ళు ఇద్దరు సిద్ధహస్తులు. అంటే అల వెనుక సముద్రపు హోరును వినిపించగలరన్నమాట.

మహాశ్వేతా దేవి ఎక్కువ భాగం ఆదివాసిల గురించే రాశారు. ఆమె అడవి గురించి చెపుతుంటే అడవిలోని చిన్న చిన్న వివరాలని సైతం వివరిస్తుంటే, ఈమె అడవిలోనే, గూడాల్లోనే బతికిందా….అన్నట్టు ఆశ్చర్య పోతాం. కారా గారు రాసే పద్ధతి కూడా అంతే. ఏ వివరమూ విడిచిపెట్టరు. ఈ పరిశీలన గురించి కారా మాట్లాడుతూ “రచయిత ఎవరైనా సరే అతను తన చుట్టుపక్కల వాటిని నిశితంగా పరిశీలించాలి” అంటాడు. ఈ నిశిత పరిశీలన ఆయన కథల్లో అడుగడుగునా కనిపిస్తుంది.

ఆయన రాసే కథలలో చాల సూక్ష్మమైన విషయాలని సైతం పట్టి చూపిస్తాడు. “చావు” కథనే తీసుకుందాం. చనిపోయిన ముసలమ్మను వర్ణిస్తూ “ఆ వెలుగు చీకట్లలో ఓ పాత కుక్కి మంచం. కొన్ని గోనె చింకి గుడ్డలు తప్ప వాళ్ళకేమి కనిపించలేదు. ఎక్కడి నుంచి వొస్తున్నదో భరించ రాని దుర్వాసన. అటు వైపే చూస్తే మంచం మధ్యన ఓ ఆకారం.

తెల్లగా పచ్చగా ఉండే ఓ వెలుగులో మంచానికి రెండో చివరన కృశించి కుంగిపోయిన ఓ ముసలి తల. వడలి పోయి ఉబ్బి పోయిన మొఖం. ఎండి పోయి పండిపోయిన జుట్టు. మూతపడని గాజువారిన కళ్ళు. తెరుచుకున్న దంతాలుడిన నోరు. చలనం ఏ మాత్రం లేదు. “ముసలమ్మ మరణ దృశ్యాన్ని ఒక సినిమా రీల్ లాగ చూయిస్తాడు. ముసలమ్మ మరణం, ఆ ఇల్లు, అక్కడి వాతావరణం ఆ పేదరికం ఈ రెండు పేరాల్లో మనకు పట్టిచూపుతారు. ఇట్లా చిన్న చిన్న విషయాలతోటి చాల పెద్ద పెద్ద విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తడు. ఇవన్నీ చూస్తూ ఉంటె ఈయన అట్టడుగు జనాల ఇండ్లలోనే ఉన్నడా….అని అనిపిస్తుంది.

*****

కారా మాస్టర్ కథలు ఒకసారి చదివితే వెంటనే అర్థం కావు. పొరలుపొరలుగా చదివితేనే కథ అర్థం ఐతుంది. ఆయన కథలు చదివినాంక మన ఆలోచనల అవగాహనల విస్తృతి పెరుగుతుంది. మన లోపల లేదా మనం రాస్తున్న దాని లోపల ఏదైనా సంకుచిత దోరణి ఉంటె అది కాస్త దూరం అయి మనకు ఒక విశాల దృక్పథం ఏర్పడుతుంది. తెలియకుండానే పాఠకుల హృదయాల్లోకి ప్రవేశించి, వాళ్ళని ప్రభావితం చేసి హృదయ వైశాల్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారాయన.

కొన్నిసార్లు శరత్ బాబు లాగానే సీదసాదగా కథ చెప్పుకుంటూ పోయి అసలైన సoక్లిస్టత లోకి లాక్కుపోతాడు. తీరం వెంబడి సముద్రపు లోతు తక్కువగనే ఉంటది. లోతుకు పోయిన కొద్ది అలజడి అర్థం ఐతుంది కదా.

షేక్స్పియర్ గురించి బుచ్చిబాబు ఒక మాట అంటాడు.” ఆయన నాలుగు వందల సంవత్సరాల మనిషి. ఐనా ఇప్పటికి ఆయన నాటకాలను చదువుతున్నారంటే వాటిని చదివినా కొద్ది కొత్త అర్థాలేవో కనిపిస్తాయి.”  అంటే ఇప్పటికి ఆయన మనతో కనెక్ట్ అయి ఉన్నాడన్నమాట. ఆయన సృష్టించిన Hamlet పాత్ర ఇప్పటికి మనకు మధ్యతరగతి యువకుల్లో కనబడుతుంటుంది.

ఇదే లక్షణం మనకు కారా గారి కథల్లోనూ మనం చదివిన కొద్ది సమాజపు మూలాలు కొత్తగా తెలుసుకుంటాము. అక్కడెక్కడో ఉత్తరాంద్ర పల్లె జనాల గురించి రాస్తే అది ఇక్కడ మా గురించే రాసాడనిపిస్తుంది. మేము అదే జీవితం జీవించాం కాబట్టి మాకు బాగా కనెక్ట్ అయ్యాడు అనిపిస్తుంది.

 ఎక్కడా తెచ్చిపెట్టుకున్న కృతిమత కనపడదు. చాల సహజంగా అదేదో తన రక్తం లో ఇంకినట్టుగా కథలు కోసమే బతుకుతున్నట్టుగా బతికాడు. “రక్త చలన సంగీత శృతి” అని ఒక మాట చెపుతూ ఉంటారు. కారా మాస్టారు గారి రక్త చలన సంగీత శృతి అంటే కథనే అని చెప్పాలి.        

తన పాత్ర ఏదో తను పోషించి ముగించి నట్టుగా, నిశబ్దంగా తన కూతురు వొడిలో ప్రాణాలు విడిచాడు. కథను మనకి వారసత్వoగా విడిచి వెళ్ళాడు.  

రాయగలిగినంత రాసాడు. రాయలేని కాలంలో కథలని భద్రపరచడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కథలకి శ్రీకాకుళంలో ఒక ఇల్లుంది. ఒక అడ్రస్ ఉంది. అక్కడికి దేశవిదేశ రచయితలు వొచ్చి పోతూ ఉంటారు. భారత దేశంలోనే ఒక వీనూత్న సాంప్రదాయాన్ని మనకు చూయించి వెళ్ళాడు.

*****

ఐతే ఇటివల ఆయన మరణించాక పత్రికల్లోను సోషల్ మీడియాలోను రకరకాల అభిప్రాయాలు వొచ్చాయి. అందులో ఆయన కథలకి ప్రాసంగికత లేకుండా పోయింది అని కొందరి వాదన. అంటే ఆయన కథలకి కాలం చెల్లిందన్నమాట. ఈ మాటలు అనేవాళ్ళు ఆయన కథలని లోతుగా చదవలేదనిపిస్తుంది. చదివితే ఇట్లాంటి ఆలోచనలు వొచ్చేవి కావు. అయినా సరే ఒక విమర్శగా దీన్ని తీసుకోవాలి.

ఐతే నిజంగానే ఆయన కథలకి కాలం చెల్లిందా? వాటి పని ఐపోయిందా… అంటే తుమ్మేటి రఘోత్తం రెడ్డి అన్నట్టు “దమ్ముoటే నిలబడతాయి. లేకుంటే గాలికి కొట్టుకుపోతాయి” ఆయన కథలకి ఆ దమ్ముంది. ఆ నిజాయితి ఉంది. ఆ ఫైర్ ఉంది. అనేక మంది మహారచయితలు కాలపు ఆటుపోట్లకి తట్టుకొని నిలబడ్డారు. అట్లాంటి ఆటుపోట్లకి తట్టుకొని నిలబడే శక్తి ఆయన కథలకి ఉంది. యాబై సంవత్సరాల కింద భూమ్మీద ఒక ప్రాంతంలో అట్టడుగు జనాలు అనుభవించిన మానవ సంఘర్షణని ఆయన చిత్రీకరించారు. అది చెరిపేసినా  చెరిగిపోని విషయం.

ప్రతి రచయితలోను కొన్ని ఖాళీలు ఉంటాయి. కారా మాస్టారు కథలోనూ దళిత స్పృహ లేదని స్త్రీ ల కోణం నుంచి రాయలేదని విమర్శలు వొచ్చాయి. ఆయన విడిచిపెట్టిన ఖాళీలను ఈ విమర్శకులు పూరించాలని నేను చెప్పదలిచాను.

*******

ఒకసారి మంటోను యాది చేసుకుందాం. ఆయన చాల కథలు రాసినా  ఆయనకు  పేరు తెచ్చినవి మాత్రం పిడికెడు కథలే. ఐతే ఆయన కథలు మొత్తం దేశవిభజన చుట్టూ తిరిగినవే. రెండు మతాల మధ్య జరిగిన మారణహోమాన్ని మానవ విలువల విధ్వంసాన్ని గొప్పగా చిత్రీకరించాడు. ఇది గాక ఆయన మరే అంశాన్ని అంత బలంగా పట్టుకోలేదు.

ఇప్పుడు దేశ విభజన కాలం నాటి పరిస్థితులు లేవు. అందుకని ఆయన కథలకి కాలం చెల్లిపోయిందని అనగలమా.. నిజానికి ఇప్పుడే ఆయన కథలకి ప్రాసంగిత పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే మంటో మరి మరి యాదికి ఒస్తాడు.

అట్లాగే కారా మాస్టారు యాబై యేండ్ల కిందటి సమాజ స్వభావాన్ని పట్టిచూపిన ఆయన కథలకి ప్రాసంగికత పెరిగిందే కాని తగ్గలేదు. నేను చూడమని చెప్తాను. విమర్శించేవాల్లని ఒకటికి రెండు సార్లు చదవమని చెప్తాను. “రూపం మారింది కాని సారం మాత్రం అలాగే ఉంది.”

మంటో కథలకి ఎట్లాగైతే ప్రాసంగికత పెరిగిందో కారా మాస్టారు కథలకి కూడా ప్రాసంగికత పెరిగింది. పది రెట్లు పెరిగింది.

******

ఎందుకీయన మాకు దగ్గరయ్యాడు, కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు అంటే He is emotionally attached with us.

ఆయన రాసిన “జీవధార” కథ చదివి నన్ను నేను ఎంతగా ఐడెంటిఫై అయ్యానో…..ఆ కథ మా కోసమే రాసిండేమో అన్నoతగా అక్షరం అక్షరము హృదయానికి హత్తుకున్నాం.

ఆ కథలో నీళ్ళు దొరకని అమ్మాజీ, సత్యవతి, అప్పాయమ్మలు బంగ్లా దగ్గరికి పోతారు. బంగ్లా వాళ్ళకి కావలసినన్ని నీళ్ళు. ఇవతలి వాళ్ళు ఒక్క బిందె నీళ్ళ కోసం కాళ్ళు రాళ్ళు కాంగా నిలబడాలి.

ఒక్క బిందె నీళ్ళ కోసం కూలి జనాలు నిలబడి చూస్తుంటారు. అవతల వాళ్ళేమో తమ చెట్లకి పచ్చని గడ్డికి సమృద్ధి గా నీళ్ళు పడుతుంటారు. లోపల జల. బయట కరువు.

ఇక్కడ పాలమూరులోను మా పరిస్థితి అంతే. ఇప్పుడంటే భగీరథ నీళ్ళు వొచ్చినాoక కొంత నయం కానీ నిన్నటి దాంక మా పరిస్థితి అదే. సైకిల్ కు బిందెలేసుకొని బోర్ల కాడికో, నల్లాలు గల వాల్లిoట్లకో వెళ్ళేవాల్లము. కొందరైతే తమ పాయఖానల్లోకి నీళ్ళు పట్టే వాళ్ళు. కాని మేము అడిగితె నీళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు.

ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ వాలే పరిస్థితి. రాత్రి పగలు తేడా ఉండేది కాదు. ఆ సందర్భం లో “జీవ ధార” కథ చదువుకొని ఎన్నిసార్లు కంటతడి పెట్టానో. అగో అక్కడ నేను కనెక్ట్ అయ్యాను.

ఎక్కడి శ్రీకాకుళం, ఎక్కడి పాలమూరు… ఎక్కడి కరువు.. ఎక్కడి కథ.. ఆ కథ శ్రీకాకుళం దాటి మా పాలమూరుకి వొచ్చి మా హృదయాలని తాకింది. అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ.

*********

 “యజ్ఞం” కథనే తీసుకుందాం ఆ కథలో అభివృద్ధి పేరు మీద జరుగుతున్న విధ్వoసాన్ని స్పష్టంగా చుయించారు. చూడటానికి రోడ్లు పాఠశాలలు కరెంటు మొదలైన అభివృద్ధి నమూనాలు కనిపిస్తున్నా అవి బడుగు వర్గాలని బానిసత్వం వైపు ఎట్లా నేట్టివేస్తున్నాయో ఒక్కొక్క పొరను విప్పి చూపిస్తాడు. గాంధేయవాదిగా పేరొందిన శ్రీరాములు నాయుడు అసలు స్వరూపాన్ని బయట పెట్టగలిగాడు రచయిత.

ఇక్కడ మా దగ్గర అంతకన్నా పెద్ద విధ్వంసమే జరుగుతుంది. మా పోలేపల్లిలో “సెజ్”లు ఏర్పాటు కాకముందు అరచేతిలో స్వర్గం చూయించారు. అదంతా అభివృద్దే అనుకున్నాం. ఉద్యోగాలొస్తాయి అన్నారు. రైతులు రాజులైతారు అన్నారు. ఇప్పుడేమైంది? అభివృద్ధి వొచ్చింది. కొందరు బాగు పడ్డారు కొండచిలువల్లాగ ఓ ఇరవై ఐదు ఫ్యాక్టరీలు వొచ్చిపడ్డాయి. మరో వైపు పొలాలు పోయిన రైతులు బికారులై తిరుగుతున్నారు. ఎకరాకు పద్దెనమిది లక్షలు అమ్ముడుపోయే చోట సర్కారు ఎకరాకు పద్దెనిమిది వేలు మాత్రం ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అందులో కొంత భాగం లంచాలకి పోగ మిగిలింది రైతులకి బూడిద. ఓ నలబై మూడు మంది గుండె ఆగి చనిపోయారు. పరిశ్రమల నుండి వచ్చే విసర్జకాలతో చుట్టుపక్కల వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

 “యజ్ఞం” కథలో విధ్వంసాన్ని సూక్ష్మ రూపంలో చూయిస్తే ఇక్కడ సెజ్ ల రూపంలో బాహాటంగా నగ్నoగా చూస్తూ ఉన్నాం. “యజ్ఞం” ప్రాసంగికత ఇక్కడ విశ్వరూపమై కనబడుతుంది.

అందుకే అరుంధతి రాయ్ అభివృద్ధి గురించి ఒక మాట అంటుంది “ఆదివాసిలకి అభివృద్ధి అంటే రోడ్డు పక్కన పారేసిన జంతు కళేబరాలు” అని. ఎంత గొప్ప పోలిక.

*************

ఆయన కథలలో నాకు అన్నింటి కన్నా “చావు” కథ బాగా నచ్చుతుంది. ఆ కథను చదువుతుoటే ఒక సత్యజిత్ రే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. 

చలిని కులానికి, బానిసత్వానికి, పీడనకి ప్రతీకగా తీసుకోని తాను ఎక్కడ కనపడకుండా కథను నడిపిస్తాడు రచయిత. ఆ ఊర్లో ముసలమ్మ చనిపోతుంది. “తనను కట్టేల్లో కాల్చమని, తన ఇన్నాళ్ళ చలి కాష్టం మీదైనా కాలిపోవాలని” ముసలమ్మ గట్టి కోరిక. కట్టెలు దొరకవు, ఉన్న ఆసాములు ఇవ్వరు. ఆ కట్టెలన్నీ ఊరుమ్మడి ఆస్తులే. అవన్నీ దళితులు కొట్టితెచ్చినవే. కాని వాళ్ళకి వాటి మీద ఏ హక్కూ ఉండదు.

చర్చల మీద చర్చలు.. పాత తరం కొత్త తరానికి మద్యన ఘర్షణ. “వంద తరాలే అయిందో, వేల తరాలే అయ్యిందో. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ ఉన్నాం. ఉన్నా ఆదిని పంచుకోనికే భూదేవత అలాగే ఉంది. అటు కదిలి ఇటు కదిలి ఇన్ని తరాలు గడిసినా  ఎక్కడిదక్కడే ఉండేది… అయితే అన్నేయం కొసదాకా సాగుతుందా, అడ్డప్పోతే సాగుతదేవో” అంటాడు సూరయ్య.

ఈ మొత్తం స్తబ్దతని దళిత యువకులు ఛేదిస్తారు. చివరికి కొందరు యువకులు ఆసాముల దగ్గర నుంచి బలవంతంగా కట్టెలు తెచ్చి ఆ కట్టెలతో ముసలమ్మని కాల్చేస్తారు.         

చలికి వజ వజ వణికే ఎరకయ్యకెవరో సారా గ్లాసు అందించబోయారు “నాకు సలి లేదు, సలి నన్నోగ్గి పారిపోనాది” అంటాడతను.

 “ఎప్పుడు ఏం జరిగినా కనిపించని ఒక అనిర్వచనియమైన ఆనందం” వాళ్ళ కళ్ళలో కనబడుతుంది.  

తిరుగుబాటుకి తొలి అడుగు పడిందన్న మాట.

దళిత సృహ లేదనే విమర్శకులు ఈ కథ తప్పక చదవాలి.

*************

నాకు ఆయన కథలన్నీ ఆర్ట్ ఫిలింను చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. ఎక్కడ కృత్రిమత కనపడకుండా ఆయన పాత్రలన్నీ మన ముందు సజీవంగా కదలాడుతాయి. సత్యజిత్ రే గురించి ఓ మాట చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలందరూ ఎవరి మానాన వాళ్ళు బతుకుతూ ఉంటె, ఎవరి మానాన వాళ్ళు మాట్లాడుకుంటే ఈయన ఒక కెమెరా పట్టుకొని పోయి వాళ్ళకి ఎవరికీ తెలవకుండా వాళ్ళ బతుకులని చిత్రీకరిస్తాడట.. అంటే ఆయన సినిమాలు జీవితాలకి ప్రతిబింబాలన్న మాట. అట్లే కారా కూడా ఆ మనుషుల మద్యన చేతులు కట్టుకొని సీదాసాదాగా తిరుగుతూ ఆ మనుషులలోని చలనాన్ని పట్టుకొని కాగితం మీద పెట్టాడేమో అనిపిస్తుంది.

కథ రాసేవాడు ఎంత వొళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలో చెప్పకనే చెపుతాడు. ఒక కఠినమైన బాటని మన ముందు ఉంచి వెళ్ళిపోయాడు. కథ రాయడం ఆషామాషి కాదని శిల్పి శిలను చెక్కడం లాంటిదని, తపస్సులాంటిదని భావించారు. ఆయన కథలు రాసినప్పుడు కూడా వెంటనే పత్రికకు పంపే వాడు కాదు. ఒక నెల్లాళ్ళు దాన్ని మాగ పెట్టి తిరిగి చూసుకునేవాడు. తనకి నచ్చితే పంపే వాడు. లేకపోతె పక్కన పెట్టేసేవాడు.

ఇస్మత్ చుగ్తాయ్ గారి కథలని నాటకాలుగా మలిచారట. దానితో ఆమె కథలు మరింతగా ప్రజల్లోకి వెళ్ళాయి.

కారా గారి కథలని నాటకాలుగా మలిచారో లేదో తెలవదు గాని ఒకటిరెండు తప్ప అన్ని నాటకాలుగా మలిచే వీలుంది. (పొద్దుటూరు లో “భయం” కథని నాటకoగా వేసారని వరలక్ష్మి గారు చెప్పారు.) ముఖ్యంగా “చావు”కథని చక్కటి నాటకంగా మలచవచ్చు .

ఆయన కథలని షార్ట్ ఫిలింలు  గా తీసి మంచి సంగీతం దృశ్యాలు పెడితే గొప్ప కళాఖoడాలు గా మిగిలిపోతాయి.

***********

కారా గారు తానెరిగిన జీవితాన్నే రాసాడు. తన పరిమితుల్లోనే రాసాడు. నిజాయితి గానే రాసాడు. నిజం మీద నిలబడి రాసాడు.

ఆయన కథలని  పై పైన చదవడం కన్నా గుండెనద్ది చదవాలి. పొరలు పొరలు గా విప్పి చదవాలి. మలి దశలో ఆయన రాసిన ఏ కథ చదివినా ఆయన స్పష్టంగా పీడితుల వైపు నిలబడ్డాడు అన్నది తెలిసిపోతుంది. కులాల్ని మతాలని ప్రాంతాలని సంకుచితత్వాలని దాటి కథ మీద, జీవిత మీద ప్రేమ కొద్ది చదవాలి. అప్పుడే ఆయన మనకి అర్థం అవుతాడు.

**************

ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథలు చాలానే వొచ్చాయి. కారా కథలు వాటిని మించినవని చెప్పను కాని వాటితో సామానంగా సగర్వంగా నిలబడగలిగినవి అని చెప్పగలను.

ఆయన కథల సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే, కనీసం పోల్చుకోవాలంటే మనం ఇతర భాషలలోని కథలని కూడా చదవాలి.

ఆయనే ఒక చోట అంటాడు. “ప్రపంచంలోని మనుషుల భావోద్వేగాలు అంటే కోపాలు, ప్రేమలు, కారుణ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, స్వార్ధాలు, అన్ని ఒకేలాగా ఉంటాయి” అని. వీటన్నిoటి సూక్షరూపాలని కొన్ని సార్లు సున్నితంగాను, గట్టిగాను, గుంభనంగాను చెప్పగలిగాడు.

ఆయన కథలు ఉత్తరాంధ్రను దాటి తెలుగు నేలని దాటి సమస్త పీడిత ప్రపంచాన్ని ఆర్ర్ధంగా కౌగలించుకుoటాయి.

ఆయన ప్రపంచ రచయిత.

                                        *******

Leave a Reply