కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి, తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు. మానవ హక్కుల వేదిక బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ఏర్పడ్డప్పటి నుంచి అందులో క్రియాశీల రచయిత్రిగా, సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తన బోధన, రచన, పరిశోధన, ఉపన్యాసం వంటి సాంస్కృతిక రూపాల్లో ఆమె సామాజిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాక కూడా ఆమె అధ్యయనం, రచన విరమించుకోలేదు. వ్యక్తిగత పరిమితులకు లోబడే రచనను సామాజిక బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చారు. ఆలోచనాజీవిగా సృజనాత్మక, పరిశోధనారంగాల్లో ఎంతో చేయగల అవకాశం, అవగాహన ఉన్న శోభారాణి చిన్న వయసులోనే దూరమయ్యారు.
ఆమె ప్రగతిశీల చైతన్యానికి గీటురాయి విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు’. దీన్ని ఆమె కేవలం అకడమిక్ పరిశోధనా దృష్టితోనేగాక పితృస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక చైతన్యంతో ఈ కృషి చేశారు. స్త్రీవాదంతో సహా అనేక ప్రజాస్వామిక, విప్లవ పోరాటాల్లోని స్త్రీల కంఠస్వరాన్ని, వ్యక్తీకరణలను ఆమె 1910లోకి వెళ్లి అక్కడి నుంచి స్త్రీల విమర్శనాత్మక దృష్టిని వెతుక్కుంటూ వచ్చారు. ఆ పరిశోధనకు ఆరంభబిందువే చాలా అద్భుతమైనది. బెంగుళూరు నాగరత్నమ్మ దగ్గరి నుంచి తను పరిశోధనను మొదలు పెట్టిన కాలం దాకా సాహిత్య విమర్శలో స్త్రీల మార్గాన్ని చారిత్రకంగా చూపించారు. శోభారాణి పరిశోధన సాహిత్యమే అయినా విమర్శారంగంలో స్త్రీల కృషి కావడం వల్ల అది సహజంగానే పితృస్వామ్య వ్యతిరేక సామాజిక విమర్శగా కూడా కొనసాగింది. కళా సాహిత్యాలకు, సామాజిక వ్యవస్థలకు, సంస్కృతీ భావజాలాలకు వర్తించే రాజకీయ సిద్ధాంత విశ్లేషణగా కూడా కనిపిస్తుంది. అలాంటి ఎన్నో లోతైన పరిశీలనలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఆమె క్రోడీకరించారు. దాన్ని అర్థం చేసుకోవలసిన చారిత్రక, సాంస్కృతిక పద్ధతిని అందించే ప్రయత్నం చేశారు.
స్త్రీ మేధో, కాల్పనిక కృషిని పితృస్వామ్య సమాజం వందల ఏళ్ల నుంచి అడ్డుకుంటూ వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఒక మూసలోకి కుదించే ప్రయత్నం చేసింది. అదేమంటే` స్త్రీలు కేవలం తమ భావాద్వేగాలను పంచుకొనే కవిత్వమో, అనుభవాలను చిత్రించే కథలు, నవలలో రాస్తారనే మూస అది. కానీ స్త్రీలకు హేతుచింతన ఉంటుందని, సమాజ సాహిత్యాలను గుర్తించగల, విశ్లేషించగల మేథాశక్తి ఉంటుందని గుర్తించడానికి కూడా ఆధునిక యుగంలోనే చాలా దశాబ్దాలు పట్టింది. అంటే స్త్రీలు భావోద్వేగ మానవులే కాదు, ఆలోచనా జీవులు కూడా అని అంగీకరించడానికి ఈ సమాజంలో అవరోధాలు ఉన్నాయి.
అందు వల్ల స్త్రీ విమర్శకుల గురించి మాట్లాడటమంలే దీన్ని ఎదుర్కోవడమే. శోభారాణి పరిశోధన ఇతివృత్తాన్ని అక్కడ చూడాలి. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ వికాసంలోని అనేక దారుల్లో స్త్రీలు నిర్మించిన దారి ఉన్నదని చెప్పడం ఆమె ఉద్దేశం. స్త్రీలు అనుభవాలను పంచుకోవడం దగ్గరే ఆగిపోరని, వాటిని రాజకీయ, సిద్ధాంత స్థాయిలో విశ్లేషించగలరని, సామాజిక, సాంస్కృతిక చరిత్ర అధ్యయన పద్ధతిని ముందుకు తీసికెళ్లగలరని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధన శోభారాణిలో ఒక మౌలిక పునాదిని సమకూర్చింది. అక్కడి నుంచి ఆమె చాలా సాహిత్య వ్యాసాలు రాస్తూపోయారు. కొత్త ఆలోచనలు ప్రేరేపించే బుద్ధిజీవిగా తెలుగు సాహిత్యంలో చాలా కృషి చేయగలరని ఆశ కల్పించి అర్థాంతరంగా వెళ్లిపోయారు. విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే విప్లవోద్యమ, విప్లవ సాహిత్యోద్యమ అభిమానిగా కలిసి నడిచారు. ఆమె మృతికి విరసం సంతాపం తెలుపుతోంది. ఆమె కుటుంబానికి, ఆమె కొనసాగుతున్న ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకు సానుభూతి తెలుపుతోంది.