భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో కనీసం ఇద్దరు ఆదివాసీ గ్రామస్థులు, వారిలో ఒకరు చెవిటి బాలిక.
ఈ కథనంలో లైంగిక హింస, పోలీసు క్రూరత్వం, ఇతర రకాల హింసల ప్రస్తావనలు ఉన్నాయి
కమ్లీ కుంజమ్‌కి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, కడుపునొప్పి, సరిగ్గా తినలేకపోతోంది. 2024 ఏప్రిల్ 2, ఉదయం 9 గంటలకు, ఆమె నేంద్ర గ్రామంలోని తన మట్టి ఇంటి వరండాలో పడుకుని, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు ఇంట్లోకి రావడంతో భయపడి లోపలికి పరిగెత్తింది.
“వెంటనే కొంతమంది మహిళా పోలీసు ఆఫీసర్లు లోపలికి వచ్చి ఆమెను బయటకు లాక్కెళ్లడం ప్రారంభించారు. “కమ్లీకి ఒంట్లో బాగాలేదు, సరిగ్గా తినడం లేదు, నీరసంగా వుంది వదిలేయమని బ్రతిమిలాడాం. వారు ఆమె మణికట్టు పట్టుకుని చూసి, కడుపుమీద చెయ్యేసి చూసి, ఎలాంటి అనారోగ్యం లేదని అంటూ ఆమెను బయటకు లాక్కెళ్లుతుంటే మేము అడ్డుకోడానికి ప్రయత్నించాం. ఆమెకు ఆహారం ఇస్తామని, ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పి తీసుకెళ్లి పోయారు” అని కమ్లీ తల్లి సోమ్లీ వివరించింది.
కమ్లీ అమ్మమ్మ జోగ్గీ కూడా మనవరాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ భద్రతా బలగాలు ఆమెను పక్కకు నెట్టి కమ్లీని బయటకు లాక్కెళ్ళారు. “కమ్లీని ఏమీ చేయమని చెప్పారు, కానీ తీసుకెళ్తున్నప్పుడు ఆమెను కొట్టారు కూడా ” అని జోగ్గి చెప్పారు.
కమ్లీని భద్రతా సిబ్బంది రోడ్డుకు బదులు అడవి వైపు తీసుకెళ్లారని సోమ్లీ, జోగ్గి చెప్పారు. “మేము ఏమీ చేయలేకపోయాము. ఆమెను మా ఇంటి నుండి బలవంతంగా తీసుకువెళ్లారు, ఆమె బట్టలు చింపేశారు. ఆమె శరీరం కింది భాగంలోని బట్టలు కూడా చిరిగిపోయాయి. ఆమెకు ఏదో చెడు జరిగింది.” అని సోమ్లీ అన్నది.
మరుసటి రోజు, ఉదయం 6 గంటల ప్రాంతంలో, కమ్లీ వదిన ఐతే కుంజమ్, గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలలు కమ్లీని వెతకడానికి అడవిలోకి వెళ్ళారు. ఐదు గంటలపాటు వెతికిన తర్వాత, తనకు కమ్లీ చేతికి వుండిన కంకణం కనిపించిందని, బురదలోంచి ఈడ్చుకెళ్లినట్లు గుర్తులు ఉన్నాయని ఐతే చెప్పింది.
“నా బిడ్డా, నీకు ఒంట్లో బాగాలేదు, వాళ్ళు నిన్ను పశువులాగా చంపారు. ఎక్కడ ఉన్నావు, నా బిడ్డా? నేను నీ కోసం వెతుకుతున్నాను కానీ నువ్వు దొరకలేదు” అంటూ తల్లి సోమ్లీ తన బిడ్డ కమ్లీ కంకణం పట్టుకుని ఏడుస్తూంది.
ఏప్రిల్ 2న జరిగిన 8 గంటలపాటు జరిగిందని చెబుతున్న సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 13 మంది మావోయిస్టులలో కమ్లీ కుంజమ్ ఒకరు అని పోలీసులు తెలిపారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు దీనిని ఖండించారు. “నా కుమార్తెకి వినపడదు, ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా, ఆమె మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది? “ అని ప్రశ్నిస్తోంది సోమ్లీ.
2017లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించిన తర్వాత జరిగిన ఒక పెద్ద ఎన్‌కౌంటర్‌గా, నక్సల్స్ వ్యతిరేక చర్యగా ఈ ఘటనను పోలీసులు అభివర్ణిస్తున్నారు.
మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న ఘర్షణ బస్తర్ ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు సంబంధించి భద్రతా దళాలపై పలుసార్లు ఆరోపణలు వచ్చాయి: 2017లో, 16 మంది మహిళలపై రాష్ట్ర పోలీసు సిబ్బందిపైన వచ్చిన అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపుల ఆరోపణలు వాస్తవమని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. 2018లో 23 ఏళ్ల ఆదివాసీ యువతి బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లో భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పాప తుపాకీతూటాతో మృతి చెందింది. మావోయిస్టులు ఆమెను హత్య చేశారని పోలీసులు చెబుతుండగా, చెట్ల నరికివేతకు నిరసన తెలియచేస్తున్నప్పుడు పోలీసులు కాల్పులు జరపడంతో ఇది జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
2023 డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రమయ్యాయి- పోలీసుల ప్రకారం, 2024లో యిప్పటివరకు 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లోని సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ (22).
ఆర్టికల్ 14 చేసిన విశ్లేషణ ప్రకారం, ఈ హింస పోలీసు లేదా మావోయిస్టుల మరణాల కంటే ఎక్కువగా పౌర మరణాలకు దారితీసింది. ఛత్తీస్‌గఢ్‌లో 2002 నుండి 2022 మధ్యకాలంలో 2,000 మందికి పైగా పౌరులు మరణించారు. ఈ సంఖ్య భద్రతా బలగాల సంఖ్య కంటే 35% ఎక్కువ; మావోయిస్టుల సంఖ్య కంటే 40% ఎక్కువ.
అంతేకాకుండా ఈ పౌరుల మరణాల గణాంకాలలో ‘మావోయిస్ట్‌లు’గా ముద్రపడిన కమ్లీ వంటి గ్రామస్థులు ఉండరు. ఏప్రిల్ 2 ఘటన జరిగిన వారం తర్వాత, ‘బెహన్‌బాక్స్’ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని నేంద్ర, కోర్చోలి గ్రామాలకు వెళ్ళి పోలీసు చర్యలో మరణించిన వారిలో కమ్లీతో సహా కనీసం ఇద్దరు మావోయిస్టులతో ఎటువంటి సంబంధాలు లేని గ్రామస్తులు ఉన్నారని వారి కుటుంబాలు చెప్పినదాన్ని బట్టి గుర్తించింది.
బాధితుల కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలగురించి బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి సుందర్‌రాజ్‌ని సంప్రదించాము. అతని ప్రతిస్పందన రాగానే అప్‌డేట్ చేస్తాము.
రేపు ప్రజలు ఓటు వేయనున్న బస్తర్‌లో తిరుగుబాటు ఎన్నికల అంశంగా మారింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ తిరిగి వస్తే మూడేళ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తానని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఆదివాసీ మహిళలపై అడవుల మళ్లింపు, గనుల త్రవ్వకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్న మా రెండు నివేదికల సిరీస్‌లో ఇది మొదటిది.
ఇదంతా ఎలా మొదలైంది?
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ జిల్లాలో దోపిడీ భూస్వాములపై 1967లో జరిగిన రైతు తిరుగుబాటులో మావోయిస్టు తిరుగుబాటు మూలాలు ఉన్నాయి. ఆ ఉద్యమం అణచివేయబడినప్పటికీ, సాయుధ ఉద్యమాలు రెండు దశాబ్దాలుగా స్థానికంగా ఉధృతంగా కొనసాగాయి. భూమి, నీరు, అటవీ ఉత్పత్తులు, మెరుగైన వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యపై వారి హక్కుల కోసం పోరాడేందుకు మావోయిస్టులు 1980లలో బస్తర్‌లో ఆదివాసీ ప్రజలను సంఘటితం చేయడం ప్రారంభించారు.
1990లలో, భారత ఆర్థిక వ్యవస్థ ప్రైవేటీకరణ, సరళీకరణ తరువాత, ప్రభుత్వం ప్రైవేట్, బహుళజాతి సంస్థలకు, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో, మైనింగ్ లీజులను మంజూరు చేయడం ప్రారంభించింది. ఇది తిరుగుబాటును తీవ్రతరం చేసింది. పారిశ్రామిక అభివృద్ధికి అటవీ భూమిని మళ్లించడానికి రాజ్య, కార్పొరేట్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఘటన పెరిగింది.
2000వ మధ్య కాలంలో ఉచ్ఛస్థితిలో ఉన్న తిరుగుబాటు 12 రాష్ట్రాల్లోని 200 జిల్లాల్లో ప్రబలంగా ఉండింది. 2006లో, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని “అంతర్గత భద్రతకు అతి పెద్ద సవాలు” అని పిలిచారు; అదే సమయంలో తిరుగుబాటు వ్యతిరేక ప్రయత్నాలను తీవ్రతరం చేసారు.
2005లో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ ఆదివాసీ, ఆదివాసేతర ప్రజలకు ఆయుధాలు, వేతనాలు అందజేసి, స్థానిక గోండి మాండలికంలో ‘శుద్ధి వేట’ అని అర్ధం వచ్చే సల్వా జుడుంను ఏర్పాటు చేసింది. నామమాత్ర శిక్షణ పొందిన ఈ ‘సంరక్షకులు’ (విజిలెంట్లు), గ్రామాలలో హింసాత్మక దాడులు చేసారు, గ్రామస్థులను నిర్వాసితులను చేసారు, కొన్ని సందర్భాల్లో, గ్రామస్థులను కొట్టారు, అత్యాచారం చేసారు, చంపారు. సల్వాజుడుం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని 2011లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భద్రతా బలగాలపైన హింసకు పాల్పడుతున్నారనే కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
మహిళలు దుష్ఫలితాల పాలయ్యారు
“ఏప్రిల్ 2 నాటి ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారని తాము గొప్ప విజయాన్ని సాధించామని పోలీసులు చెప్పారు” అని బస్తర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను వెలికితీసే కార్యకర్త సోని సోరి అన్నారు. అయితే పోలీసులు చెబుతున్నది పూర్తి నిజం కాదు. మరెన్నో గోప్యంగా ఉంచుతున్నారు. దాదాపు సగం మంది గ్రామస్తులను చంపారు, వారందరినీ యిందులో చేర్చారు.
“జనవరి నుండి, ఈ బూటకపు ఎన్‌కౌంటర్ల వేగం బాగా పెరిగింది. ఇంతకుముందు కూడా బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయి, కానీ వాటి ఆకస్మిక పెరుగుదలను గుర్తించాలి. అనేక మంది పౌరులను – మైనర్లతో సహా – చంపేసారు; చనిపోయినవారిలో అతి చిన్న వయస్సు కేవలం 6 నెలలు మాత్రమే” అని బస్తర్‌లో పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్త న్యాయవాది బేలా భాటియా అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన తమ భర్తలు మావోయిస్టులు కాదని, అమాయక గ్రామస్తులని పేర్కొంటూ ముగ్గురు మహిళలు, గ్రామస్తుల బృందంతో కలిసి కంకేర్‌లోని పోలీసు స్టేషన్‌కు పాదయాత్ర చేశారు.
ఈ హింస ఆదివాసీ ప్రజల మనసుల్లో భయాందోళనలకు దారితీస్తోందని సోనీ అన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు, 2011లో దేశద్రోహం, ఇతర కల్పిత ఆరోపణలపై జైలుపాలు చేస్తే, 11 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా విడుదలైంది.
“వారు ఇలా చేస్తే, ఆదివాసీ ప్రజలు తమ జల్, జంగిల్, జమీన్‌లను వదిలి వేరే చోటికి వెళ్లిపోతారు. ప్రభుత్వం అడవులు, కొండలను గని త్రవ్వకాలకు యిచ్చి, పెద్ద పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన వనరులను ఇవ్వాలని అనుకుంటోంది కాబట్టి ఆదివాసీ స్త్రీలు, పురుషులను కాల్చి చంపడం, అరెస్టు చేయడం, అత్యాచారం చేయడం లాంటివి జరుగుతున్నాయి”అని ఆమె అన్నారు.
ఒడిశాలో, సిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలు పోలీసుల బెదిరింపులు, అత్యాచారం, హత్య బెదిరింపులను ఎదుర్కొన్నారనే విషయంపై మేము నవంబర్ 2023లో రిపోర్టు తయారుచేసాం. కాంతమాల్, బంతేజీ గ్రామాలకు చెందిన 24 మంది మహిళలను పోలీసులు అడ్డగించి అత్యాచారం చేస్తామని బెదిరించారు అని ఖందమాల్‌కు చెందిన 19 ఏళ్ల నాయకురాలు కంచన్ మాఝీ మాకు అక్టోబర్ 9నాడు చెప్పారు.
“ఒక వ్యక్తిని చంపడానికి బలగాలకు 5 నిమిషాలు పడుతుంది. కానీ ఒక స్త్రీని చంపడానికి వారికి 1-1.5 గంటలు పడుతుంది. ఎందుకంటే, ఒక గంట పాటు, మమ్మల్ని తిడతారు, కొడతారు, అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత, పోలీసులు మమ్మల్ని కాల్చి చంపుతారు”అని జైలులో చిత్రహింసలు, లైంగిక వేధింపులకు గురైన సోనీ అన్నారు. “నేను ఈ రకమైన హింస నుండి బయటపడ్డాను. అది ఎంత క్రూరమైనదో అనుభవించాను. చాలా సందర్భాల్లో స్త్రీలను తీసుకెళ్ళి పోతారు, వారిపై దాడి చేస్తారు, వారి మర్మాంగాలను ధ్వంసం చేస్తారు, వారిని చితకబాదుతారు, ఆపైన చంపుతారు. వారు మమ్మల్ని వెంటనే ఎందుకు కాల్చిపారేయరు? కాల్పులకైనా, చావడానికైనా, జైల్లో వుండడానికైనా మేం సిద్ధమే. మా మీద అత్యాచారం ఎందుకు చేస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.
పిల్లలను నిర్బంధిస్తారు, కొడతారు
కోర్చోలిలో 12 ఏళ్ల నిమో పొట్టం (పేరు మార్చాం) ఇంట్లో బియ్యాన్ని దంచుతుంటే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఆమె తల్లి బుద్రి నిమోను పట్టుకోడానికి ప్రయత్నిస్తే వారు ఆమెను దూరంగా నెట్టివేసి, నిమోను తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లాకప్‌లో నిర్బంధించారు. ఏప్రిల్ 8న ‘బెహన్‌బాక్స్’ నిమో ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె ఇంకా లాకప్‌లోనే ఉంది. చూడడానికి తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
“మేము ఆమెను ఏప్రిల్ 2 నుండి చూడలేదు. మొదట ఆమె ఆసుపత్రిలో ఉందని చెప్పారు, కానీ మేము ఆమెను చూడలేకపోయాము” అని ఆమె తండ్రి సన్ను పొట్టం చెప్పారు.
ఆ రాత్రి, నిమో తల్లితో ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు మాతో మాట్లాడింది. “నన్ను కాళ్ళు చేతుల మీద వంగమని చెప్పి వీపుపైన కొట్టారు. తినడానికి ఏమీ యివ్వలేదు. బియ్యం , పప్పు ఇచ్చి మమ్మల్నే వండుకోమని చెప్పారు” అని నిమో వివరించింది.
ఏప్రిల్ 2 – 8 తేదీల మధ్య, బుద్రి గ్రామానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు ప్రతిరోజూ వెళ్ళేవాడు. కానీ అతనికి కూతురిని కలవడానికి అనుమతించలేదు. ఐదు రోజుల తర్వాత నిమోతో పాటు గ్రామానికి చెందిన మరో మహిళను విడుదల చేశారు.
“వారు మమ్మల్ని ఏప్రిల్ 7 సాయంత్రం వెళ్ళిపొమ్మన్నారు. కానీ చీకటిలో ఇంటికి తిరిగి రాలేక పోలీస్ స్టేషన్ దగ్గర చెట్టుకింద రాత్రి గడిపాం. మేము ఏమీ తినలేదు. మమ్మల్ని మేం కాపలా కాసుకోడానికి వంతులవారీగా నిద్రపోయాం” అని నిమ్మో చెప్పింది.
నిమోతో పాటు కోర్చోలికి చెందిన ఐదుగురు మగపిల్లలు మిర్చి కోత పనికి తెలంగాణలో ఉండగా ఎత్తుకెళ్లారు. “మేము మార్చి 28న గ్రామాన్ని విడిచిపెట్టివెళ్ళాం. ఏప్రిల్ 1 నుంచి కూలీ పని మొదలుపెట్టాం” అని 16 ఏళ్ల సుక్కు* పొట్టం (పేరు మార్చాం)చెప్పాడు. “ఏప్రిల్ 5న ఛత్తీస్‌గఢ్ పోలీసులు అక్కడికి వచ్చి మమ్మల్ని బీజాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మమ్మల్ని బాగా కొట్టి విచారణ చేసారు. మా గ్రామాల్లో మావోయిస్టులు ఎవరు, వారికి ఎవరు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు.”
“మీకు తెలుసు కదా సార్, వారు విద్యార్థులకు ఏమీ చెప్పరు అని. మరి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు?’’ అని ప్రశ్నించానని గుర్తు చేసుకున్నాడు సుక్కు.
ఏప్రిల్ 6న తమని అక్కడికి తీసుకెళ్లినప్పుడు నిమోను పోలీస్ స్టేషన్‌లో చూశానని చెప్పాడు. “ఆమె మాతో కలిసి భోజనం చేసింది,” అని అతను చెప్పాడు. నాలుగు రోజుల విచారణ తర్వాత, సుక్కుతో పాటు మరో ముగ్గురు అబ్బాయిలను విడిచిపెట్టారు.
సల్వాజుడుం సైనిక చర్యల తర్వాత తమ గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీన ఇంత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు కనిపించడం ఇదే తొలిసారి అని నేంద్ర, కోర్చోలి గ్రామస్తులు మాతో చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక కొండ నుండి కాల్పులు వినిపించాయని, ఉదయం 6 గంటల వరకు కొనసాగాయని వారు చెప్పారు.
కాల్పులు కొద్దిసేపు ఆగిన తర్వాత, తప్పిపోయిన పశువులు రాలిన మహువ పువ్వులను తినకుండా చూసేందుకు తాను అడవికి వెళ్తున్నానని, పిల్లలకు తినిపించిన తర్వాత రమ్మని చైతు పొట్టం తన భార్య సోమితోచెప్పి వెళ్ళాడు. అదే సోమి చైతూని చివరిసారిగా చూడడం.
చైతు వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. “అతను దాక్కోటానికి పరుగెత్తాడు,” అని తన ఆరుగురు పిల్లలలోని చిన్నవాడికి స్తన్యం యిస్తున్న సోమి చెప్పింది. దాదాపు రెండు రోజులు ఎంత వెతికినా చైతూ కనిపించలేదు. ఏప్రిల్ 4న, బీజాపూర్‌లోని ఆసుపత్రికి వచ్చి అతని మృతదేహాన్ని గుర్తించాలని పోలీసులు చెప్పారు. “అతని శరీరం పూర్తిగా పాడైపోయి వుంది. అతని గడ్డమూ, పాదాలపై ఉన్న గుర్తు ఆధారంగా గుర్తించాను” అని సోమి చెప్పింది.
చైతు మావోయిస్టు, ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు అనే పోలీసుల కథనాన్ని సోమి ఖండిస్తోంది. “అతను నక్సల్స్‌లో చేరి ఉంటే, ఈ ఇంటిని ఎవరు కట్టారు, ఆ పొలాన్ని ఎవరు దున్నారు” అని సోమీ తన ఇంటికి ప్రక్కనే ఉన్న చిన్న పొలాన్ని చూపిస్తూ చెప్పింది. “పోలీసులు అబద్ధాలు చెబుతున్నారు. అతను నా భర్త. మా ఆరుగురు పిల్లల తండ్రి.”
గత ఏడాది చైతూ సోదరుడు మంగును పోలీసులు అరెస్ట్ చేశారు. మేము సోమిని కలిసినప్పుడు, వారి మూడవ సోదరుడు రాజు మంగు కోర్టు విచారణకు వెళ్ళాడు. “చైతు పొలం దున్నడానికి పశువులను కొన్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తారో నాకు తెలియదు, ”అని సోమి తన పిల్లలు, వారి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతోంది. “నేను నా పిల్లలను ఎలా పెంచుతాను? నా దగ్గర ఏమీ లేదు – వ్యవసాయం చేయడాని సాయం కానీ, డబ్బు కానీ లేదు.”
“ఇలాంటి పరిస్థితులలో, మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు” అని సోని చెప్పారు. “మృత దేహాన్ని తిరిగి తీసుకురావడానికి ఆమె చాలా దూరం వెళ్లాలి. ఎవరైనా జైలుకెళితే, వారి తల్లి, సోదరి లేదా భార్య మామూలుగా బీజాపూర్ లేదా దంతేవాడకు వెళ్లవలసి ఉంటుంది. వెళ్ళి, తిరిగి రావడానికి ఆమె చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుంది. అంతేకాకుండా కేసు కోర్టులో వుంటే లాయర్ల ఫీజులతో సహా అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.
కమ్లి కుంజమ్ (నేంద్ర గ్రామంలో ఆ పేరు గల మరొక నివాసి)ను మేము కలిసినప్పుడు ఆమె అప్పటికి దాదాపు ఒక వారం నుంచి భోజనం చేయడంలేదు. ” నా భర్తను చూసే వరకు నేను తినకూడదనుకుంటున్నాను,” అని బక్కగా, అనారోగ్యంతో వున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్న కమ్లి చెప్పింది. కమ్లీ భర్త, సుద్రును ఏప్రిల్ 2న అరెస్టు. ఒక వారం అయినా యింకా విడుదల కాలేదు.
“ఈ ఘటనల గురించి నిజాన్ని నిర్ధారించడం పెద్ద సవాలు” అని బేలా భాటియా చెప్పారు, గ్రామాలకు వెళ్లకుండా భాధితుల కుటుంబ సభ్యులను లేదా ఆసుపత్రులలో గాయపడిన వారిని కలవకుండా ఆమెను అనేకసార్లు ఆపేసారు. “ప్రస్తుతం, కనీసం రికార్డు అయినా ఉంటుంది అని చాలా కష్టంతో దర్యాప్తు చేయగలుగుతున్నాం, పోలీసు ఫిర్యాదులను నమోదు చేయడంలో కుటుంబ సభ్యులకు సహాయం చేస్తున్నాం..”
బిలాస్‌పూర్‌లోని హైకోర్టులో ఇటువంటి కేసులపై న్యాయపోరాటం చేసిన అనుభవం ఇప్పటివరకు కొంత నిరుత్సాహకరంగానే వున్నదని భాటియా అన్నారు. 2023 జూలై లో, హిమాంశు కుమార్, జగదల్‌పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్, హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్‌తో సహా కార్యకర్తలు, సంస్థలు దాఖలు చేసిన ఇలాంటి కేసులపై అనేక పిటిషన్లను అకస్మాత్తుగా ‘పరిష్కరించేసారు’ అనే విషయాన్ని ఆమె ఎత్తి చూపారు.
“దూరభారం, ఖర్చుల కారణంగా హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఎలాగూ కష్టమైన విషయం. హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి అవసరమైన వనరులు నా దగ్గర లేవు. బదులుగా, నేను ఎన్‌ఐఎ కోర్టులతో సహా జిల్లా కోర్టులలో పని చేస్తాను. ఎక్కువగా తప్పుడు కేసుల్లో నిర్బంధించబడిన వారి కోసం వాదిస్తాను, ”అని భాటియా వివరించారు.
పోలీసులు పట్టుకెళ్ళి ఆచూకీ తెలియని వారి గురించి కుటుంబ సభ్యులకు తెలియ చేయడానికి పోలీసు స్టేషన్‌లకు ఫోన్ చేస్తాను, వెళతాను. ఇలా చేయడం వల్ల, ఎవరైనా సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు చట్టాన్ని గౌరవించేలా పోలీసులపై కొంత ఒత్తిడిని కలిగిస్తుంది” అని అన్నారు.
“అభివృద్ధి” గురించి జరిగే చర్చల్లో తమను కూడా చేర్చాలని మాత్రమే ఆదివాసీలు కోరుకుంటున్నారని సోరి అన్నారు. “వారు మాతో ఎందుకు మాట్లాడరు?” అని ప్రశ్నిస్తున్నారు.
(గోండి నుండి అనువాదానికి విష్ణుకాంత్ తివారీ సహాయం చేసారు)
శ్రేయా రామన్
April 18, 2024