దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న ప్రాంతాలలో బస్తర్ ఒకటి. తరచుగా అక్కడ “తిరుగుబాట్లు”, పోలీసు “ఎన్‌కౌంటర్లు” జరుగుతుంటాయి.
గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. “ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో ఎవరైనా అందులో భాగం కావచ్చు” అని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ గిరి అంటారు.
బస్తర్‌లోని బెచ్చఘాట్ పోలీసు క్యాంపు వ్యతిరేక ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్త అజిత్ నూరుటి ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని పరిస్థితి గురించి యిలా వివరించారు.
”గత 3-4 సంవత్సరాలుగా జల్-జంగిల్-జమీన్ (నీరు-అటవీ-భూమి)పై తమ హక్కుల కోసం ఆదివాసీలు నిరసనప్రదర్శనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం మారింది, ఇప్పుడు బీజేపీ కొత్త ప్రభుత్వం మాలో చాలా మందిని నక్సల్స్ (మావోయిస్ట్ తిరుగుబాటుదారులు)అని అంటూ మేము చేస్తున్న నిరంతర ప్రదర్శనలను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. మాకు వ్యతిరేకంగా ఆ పదాన్ని ఉపయోగించడం చాలా సులభమని వారికి తెలుసు. అంతే కాకుండా లాఠీ దెబ్బలు తినడం మా సముదాయానికి కొత్తేమీ కాదు.”
ఉత్తర బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో 2023 అక్టోబర్‌లో జరిగిన ఒక ఘటనను ఆ కార్యకర్త వివరించాడు. “40-50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌ను తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్న ఒక ఆదివాసీ సమూహం నుంచి ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను భద్రతా దళాలు విడిగా తీసుకెళ్లి కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజు ఇద్దరు నక్సల్స్ చనిపోయినట్లు వార్తాపత్రికలో వచ్చింది. దురదృష్టవశాత్తు, ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరగడం సర్వసాధారణమైపోయింది. మీడియా సంస్థలు తరచుగా మరణించిన వ్యక్తులకు వారి గుర్తింపులను ధృవీకరించకుండానే నక్సల్స్ అని ముద్ర వేసేస్తాయి.”
“2022 ఫిబ్రవరిలో ఒక గ్రామంలో ప్రజలు రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనల మధ్య, రాష్ట్ర ప్రభుత్వ పారామిలటరీ బలగాలైన డిఆర్‌జి సిబ్బంది అక్కడ దగ్గరలోని ఒక చెరువులో స్నానం చేస్తున్న మహిళలను ఫోటో తీశారు. “ఈ ఫోటోలను నిరసనకారులకు వ్యతిరేకంగా ఉపయోగించాలనుకున్నారు” అని మరొక ఘటనను వివరించారు.
గనుల త్రవ్వకం వంటి అభివృద్ధి ప్రాజెక్టులను గ్రామస్తులు ప్రతిఘటించడం గురించి బయటి పరిశీలకులు చర్చిస్తూంటారు. అలాంటి ప్రయత్నాల వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు కదా అని వాదిస్తారు. అయితే, గతంలో ఇదే విధమైన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా తాము అనుభవించిన ప్రతికూల పరిణామాల వల్ల ఆదివాసీ సముదాయాల నుంచి ఆ వ్యతిరేకత వచ్చింది అనే విషయాన్ని వారు గుర్తించాలి.
ఆర్థికాభివృద్ధి, సాధికారతను పెంపొందించడానికి బదులుగా, ఈ ప్రాజెక్టులు తరచుగా అదనపు భద్రతా వ్యవస్థల ఏర్పాటుకు దారితీస్తాయి. అవి స్థానిక ప్రజలపై నియంత్రణను కలిగి ఉంటాయి, వారిపై హింసాత్మక చర్యలకు పాల్పడతాయి.
అంతేకాకుండా , అభివృద్ధిని పూర్తిగా వ్యతిరేకించడం – అభివృద్ధిని అమలు చేసే విధానాన్ని వ్యతిరేకించడం మధ్య వుండే కీలకమైన వ్యత్యాసాన్ని గ్రామస్తులు స్పష్టంగా ఎత్తిచూపారు. ఉదాహరణకు, రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రాథమికంగా సమాజపు నిజమైన అవసరాలను తీర్చడం కంటే కార్పొరేషన్ల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని వారు వాదించారు.
స్థానిక గ్రామస్తులకు అటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోయినా, పెద్ద ట్రక్కులకు అనువుగా ఉండేలా రోడ్ల విస్తరణ జరపడం అనేది స్థానిక ప్రజల శ్రేయస్సు కంటే కార్పొరేట్ లాభానికి ప్రాధాన్యతనిచ్చే వక్రీకృత ప్రాధాన్యతలను నొక్కి చెబుతుంది.
ఈ ప్రాంతంలోని ఆదివాసీ సమాజం చాలా సంవత్సరాలుగా హింసను ఎదుర్కొంటోంది, అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం వారి డిమాండ్‌లను ఎప్పుడూ వినడం లేదు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో 34 చురుకైన నిరసనలు జరుగుతున్నాయని బస్తర్‌కు చెందిన మైని కచ్లం అనే మహిళా కార్యకర్త తెలిపారు.
ఈ ప్రాంతంలో మహిళలు “లైంగికంగా ఎలా దోపిడీకి గురవుతున్నారు” అనే అంశంపై మాట్లాడుతూ “ఎవరినైనా నక్సల్ అని అనుమానిస్తే, చట్టం తన పని చేయాలి, వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి. కానీ పోలీసు బలగాలు నిందితులపై అత్యాచారం చేసి చంపడం ఎందుకు? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
బస్తర్‌లో ఇటీవలి ఘటనలు
మార్చి 19న, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని దంతేవాడలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు (వారిలో ఒకరు మహిళ) మరణించారని పోలీసులు ప్రకటన చేసారు.
పురంగెల్ గ్రామ సమీపంలోని అడవిలో డిఆర్‌జి, కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ పోలీసు ప్రతిఘటనా విభాగమైన బస్తర్ ఫైటర్స్, సిఆర్‌పిఎఫ్ బలగాలతో కూడిన జాయింట్ సెర్చ్ టీమ్‌లు ఆ ఎన్‌కౌంటర్ చేసాయి.
ఆ సందర్భంలో ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి మాట్లాడుతూ, “చాలా రోజులు ‘హింస’కు గురి చేసిన తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని యిచ్చారు. బాధితురాలి మర్మాంగాలలో, చుట్టుపక్కల పదునైన వస్తువు (బహుశా కత్తి)తో చేసిన గాట్లు వుండడాన్ని చూస్తే , బలగాలు ఆమె పట్ల ఎలా వ్యవహరించాయి అనే విషయంలో చాలా సందేహాలు కలిగాయి.”