ఆదివాసులపై వైమానిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదుల సమావేశాన్ని పాణి ఆరంభించారు –  తెలంగాణ ప్రజల గురించి, తెలుగు ప్రజల గురించి, ఆదివాసుల హక్కుల గురించి దశాబ్దాలుగా పనిచేస్తున్న  బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశానికి వచ్చారు. 1948లో హైదరాబాదు రాష్ట్రంపై నెహ్రూ, పటేల్‌ పోలీసు చర్య దగ్గరి నుంచి దండకారణ్యంలో సైనిక చర్యలు దాకా  మన ప్రజాస్వామ్యం విస్తరించింది. నేల మీద లక్షల సైన్యం ఆదివాసీ ప్రజలపై యుద్ధానికి తలపడిన దశ నుంచి సరిహద్దు దేశాల యుద్ధాల్లో వాడే హెలికాప్టర్లలో సైనికులు వచ్చి బాంబు దాడులు చేసే దాకా మన ప్రజాస్వామ్యం ఎలా బలపడుతున్నదో చూస్తున్నాం. రాజ్యాంగం అమలులోకి రాక ముందే పాలకవర్గం ఈ దేశ ప్రజలపై మొదలైన యుద్ధం   72 ఏళ్లపాటు అమలయ్యే క్రమంలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన సందర్భంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం.  జనవరి 11వ తేదీ ఉదయాన దక్షిణ బస్తర్‌లో వైమానిక దాడులు ప్రారంభమయ్యాక  ప్రొఫెసర్‌ హరగోపాల్‌ చొరవతో ఈ యుద్ధాన్ని ఖండిరచేందుకు   ఏర్పాటు చేసిన ఈ  సమావేశానికి  హాజరైన మిత్రులందరికీ స్వాగతం.. అన్నాడు.   

ప్రొ. హరగోపాల్‌ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ` జనవరి 7వ తేదీన రాయ్‌పూర్‌లో కేంద్ర హోం మంత్రి 2024 ఎన్నికల లోగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రకటించాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు ఈ దేశ ప్రజలపై యుద్ధం మొదలైంది.   ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల సంక్షేమాన్ని చూడవలసిన ప్రభుత్వం ఆ ప్రజల మీదనే యుద్ధానికి దిగింది.   గతంలో భారత ప్రభుత్వం మూడు యుద్ధాలు చేసింది. ఇది నాలుగో యుద్ధం అని దండకారణ్య ఆదివాసులపై మొదలు పెట్టిన యుద్ధాన్ని   సరిహద్దు యుద్ధాలతో ఒక భద్రతా అధికారి పోల్చాడు. ఇది భారత రాజ్య స్వభావాన్ని తెలియజేస్తున్నది. అటవీ  ప్రాంతాల్లో వనరులని దోచుకుని వెళ్లడానికి ఆదివాసులు అంగీకరించడం లేదు.  వాళ్లు దీర్ఘకాలంగా ప్రతిఘటిస్తున్నారు.  రాజ్యాంగపరమైన హక్కులు అమలు చేయమని ఉద్యమాలు చేస్తూ వచ్చారు.  కానీ ప్రభుత్వం అవి చేయకపోగా ఆదివాసులు చేస్తున్న ఉద్యమాలను అణిచివేయడానికి చివరికి సైనిక దాడులు ప్రారంభించింది. కారణం ఏమంటే ఆదివాసుల కాళ్ళ కింద అపారమైన ఖనిజ సంపద ఉన్నది. అది కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రభుత్వం చేపట్టిన రాజకీయ ఆర్థిక విధానాల వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదివాసులను నిర్వాసితులను చేసే అభివృద్ధి నమూనా దీనికి కారణం. దీని వల్ల గతంలో  నిర్వాసితులైన వారికి ఈనాటికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు అమలు చేయలేదు. పైగా  ఆదివాసుల సమస్యకు యుద్ధమే పరిష్కారం అని ప్రభుత్వం అనుకుంటున్నది. ఆదివాసుల సమస్యగా మనకు కనిపిస్తున్నది సామాజిక, చారిత్రక సమస్య. ప్రభుత్వం తన ఆర్థిక నమూనాను మార్చుకోకుండా ఈ సమస్యలను పరిష్కరించలేదు. ఈ సందర్భంలో మనం మనుషులుగా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మనం మాట్లాడితే మనలో స్పందన మిగిలి ఉన్నట్లు.  మావోయిస్టులను అణిచివేయడానికే ఈ యుద్ధం చేస్తున్నాని ప్రభుత్వం చెబుతున్నది. ఈ పద్ధతిలో ఏ సమస్యనూ పరిష్కరించలేరు.   ఈ యుద్ధాన్ని ఆపివేయాలని మనందరం ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం ద్వారా మన  నిరసనను తెలియజేయాలి.. అన్నారు. 

ఈ సమావేశాన్ని మానవ హక్కుల వేదిక నాయకుడు సమన్వయం చేశారు. ఆయన ప్రారంభిస్తూ గతంలో ప్రజలపై జరిగిన దాడులను పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు అర్థం చేసుకున్న తీరును వివరించారు. ప్రజాభిప్రాయం కూడగట్టడం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగాం అన్నారు. ఆ దిశగా  ప్రస్తుత వైమానిక దాడులకు వ్యతిరేకంగా చర్చ కోసం ఈ ఈ సమావేశం ఏర్పాటు చేశాం అన్నారు. 

ప్రొ. కోదండరాం మాట్లాడుతూ గతంలో ప్రజలపై దాడులను, ఎన్‌కౌంటర్లను, మాయం చేయడాన్ని మనం చూశాం. నేడు అటవీ ప్రాంతాల్లో వైమానిక దాడులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిరది. దీన్ని ఖండిరచేందుకు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పత్రాన్ని నేను సంపూర్ణంగా బలపరుస్తున్నాను. ఇందులో ఉండే అవగాహనను మనం సమాజంలోకి తీసికెళ్లాలి. ఆదివాసులను నిర్మూలిస్తానని కేంద్రం అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రజలపై సైన్యం చేస్తున్న దాడులను ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మనం వేసుకొని లోతుగా ఆలోచించాలి.  భారత రాజ్యాంగంలో ఆదివాసీ పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాఇ. వాటిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది.  కానీ ఆ పని చేయకుండా కార్పొరేట్లు వనరుల్ని దోచుకోవడానికి అనుకూలంగా ఇట్లా ఆదివాసులపై దాడులు చేయడం ఏమిటి? గతంలో బీడీ శర్మ లాంటి అధికారులు ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు రావడానికి ఎంతో కృషి చేశారు. వాటిని అమలు చేయడానికి ప్రయత్నించారు.  ఆదివాసుల  సమస్యలను శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని అలాంటి వాళ్లు  కృషి చేశారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల అమలు కోసం కూడా ప్రజాస్వామికవాదులు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వచ్చింది. అట్లాగే ఆదివాసీ ప్రజల పోరాటాల వల్ల కూడా ఎన్నో కొత్త రక్షణ చట్టాలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైమానిక దాడుల దాకా రాజ్య నిర్బంధం పెరిగింది. ఈ పత్రంలో ఒక విషయం చేర్చితే బావుంటుందని అభిప్రాయపడుతున్నాను.  దండకారణ్య ప్రాంతపు ఆదివాసీ సమస్యలతోపాటు  తెలంగాణలో ఆదివాసులు ఎదుర్కొంటున్న  సమస్యల గురించి, వాళ్లు చేస్తున్న పోరాటాల మీద అమలవుతున్న నిర్బంధం గురించి కూడా  చేర్చితే మరింత సమగ్రంగా ఉంటుంది.  ముఖ్యంగా తెలంగాణలో ఆదివాసులు పోడు భూముల కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇట్లాంటి పోరాటాలు తీవ్ర రూపం దాల్చిందు వల్లే  రాజ్యం వాళ్ల మీద   వైమానిక దాడులు చేస్తున్నది.. అన్నారు. 

పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొ. లక్ష్మణ్‌ మాట్లాడుతూ`  మధ్య భారత దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్న రాజ్య నిర్బంధం గురించి పౌర హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి వాస్తవాలను సమాజం ముందు పెడుతున్నాయి.  అయితే 2020 తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడిరది. పౌర హక్కుల సంఘాలను నిజ నిర్ధారణకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ ధోరణి గతంలో కూడా కొంత ఉన్నదే. అయితే ఇటీవల తీవ్రమైంది. అయినప్పటికీ జనవరి 11 నాటి  వైమానిక దాడుల గురించి నిజనిర్ధారణ చేయడానికి దేశవ్యాప్తంగా ఉండే పౌర ప్రజాస్వామ్య సంస్థలు బస్తర్‌కు త్వరలోనే వెళ్లనున్నాయి. మేము అక్కడిదాకా వెళ్లి   క్షేత్ర పరిశీలన చేసి మళ్లీ మీ అందరితో ఇలాగే  సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కానీ ప్రభుత్వం మాకు ఆ అవకాశం ఇస్తుందో లేదో తెలియదు. మమ్మల్ని అడ్డుకోవచ్చు లేదా అరెస్టు చేసి జైలుకు పంపించు పంపించవచ్చు. ఆ రకంగా అయినా సరే ఆదివాసులపై ఎంత పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉన్నదో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ దాడులను నిరోధించడానికి మేధావులు, బుద్ధిజీవులు  ఆలోచించి పెద్ద ఎత్తున పని చేయాల్సిన అవసరం ఏర్పడిరది. ఆదివాసీ ఉద్యమాలకు సంఫీుభావం ప్రకటించి, వాళ్లు ఒక న్యాయమైన ఉద్యమంలో ఉన్నారని ప్రచారం చేయవలసి ఉన్నది .. అన్నారు.

  ప్రముఖ కవి కే. శివారెడ్డి మాట్లాడుతూ`  హిందుత్వ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నది. అన్ని వ్యవస్థలలోని ప్రజాస్వామిక విలువలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నది.  దీనికి నేను సాహిత్య అకాడమీ ఉదాహరణ చెప్తాను.  సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌  వ్యక్తిని తీసుకుని వచ్చింది. ఇక  సాహిత్య అకాడమీ ఇంతకు ముందులాగా పనిచేసే అవకాశం లేనే లేదు. అన్ని రంగాలను ఇలాగే తయారు చేస్తున్నది. నాకు ఈ ప్రభుత్వం మీద   భ్రమలు లేవు.  ఆదివాసులపై వైమానిక దాడులు  ఈ సమాజంపై జరుగుతున్న సాంస్కృతిక దాడికి ఒక పెద్ద కొనసాగింపు.  ఆదివాసులపై బాంబులు వేసినట్టే ప్రజల మనసులపై సాంస్కృతికంగా హిందుత్వ ప్రభుత్వం యుద్ధం చేస్తున్నది. ఈ తరహా వైమానిక దాడులు ఇంకా జరిగే అవకాశం ఉంది. అయినా  ప్రజలు వీటిని ఎదుర్కొంటారు. చరిత్ర ఇదే చెబుతోంది. క్యూబా, వియత్నాం ఎంత దేశాలు? ఆ దేశ ప్రజలు పోరాడి విజయం సాధించారు. రచయితలుగా, బుద్ధిజీవులుగా మనం ఈ రాజ్యహింసకు వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. అనేక రూపాల్లో జరుగుతున్న ప్రజలపై రాజ్యం చేస్తున్న యుద్ధాన్ని మనం గుర్తించాలి. వాటికి వ్యతిరేకంగా జీవించి ఉన్నంత కాలం మనం పోరాడాలి. ఆదివాసులు  అలాంటి పోరాటం కొనసాగిస్తారు.. మనం ఆ పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టాలి… అన్నారు. 

అరుణోదయ విమల మాట్లాడుతూ` గతంలో గ్రీన్‌హంట్‌ పేర అడవిని జల్లెడ పట్టినప్పుడు మనం అందరం ఆదివాసులకు అండగా ఉన్నాము.  ఇప్పుడు కూడా మనం అలాంటి సంఫీుభావాన్ని ప్రకటించాలి.  ఆదివాసులకు పోరాటం  కొత్తది కాదు. చరిత్రలోకి వెళితే ఎన్నో సందర్భాలలో ఆదివాసులు పెద్ద పోరాటాలు చేశారు.  వాటిని కొనసాగిస్తూ కార్పొరేట్‌ కంపెనీల సహజ వనరుల దోపిడీని వ్యతిరేకిస్తూ  పోరాడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ వైమానిక దాడి చేస్తున్నది. రాజ్యం స్వభావంలో భాగంగా వీటిని గుర్తించాలి. దీనికి  వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున సంఫీుభావాన్ని కూడగట్టాల్సి ఉందని… అన్నారు. 

ప్రొ. కల్పనా కన్నబిరన్‌  మాట్లాడుతూ`  రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూల్లో ఉన్న ఆదివాసీ రక్షణ అంశాలను అమలు చేయాలని దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో ఆదివాసులపై జరుగుతున్న దాడి కొత్తది కాదు. ఇది ఇప్పుడే మొదలైంది కూడా కాదు. కాంగ్రెస్‌ కాలంలోనే ఆదివాసులపై ఇలాంటి యుద్ధం మొదలైంది.  కాంగ్రెస్‌ హోం మంత్రి చిదంబరం కాలంలో మొదలైన విధానాలు ఇంకా ముందుకు  వెళ్లాయి.  ఇట్లాంటి నిరసన సమావేశాలలో ఆదివాసీ ప్రాతినిధ్యం ఉండేలాగా మనం చూసుకోవాలి. తమపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివాసులు ఇక్కడికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారో ఆలోచించాలి. రాజ్యాంగంలో 5,6  షెడ్యూళ్లు ఉన్నా ఆదివాసీ ప్రాంతాలలోకి సైన్యాన్ని పంపించడం దేశంలో కొత్త కాదు.  అన్ని ప్రభుత్వాలు ఈ పనులు చేశాయి. కాశ్మీరులోకి,  ఈశాన్య రాష్ట్రాలలోకి గత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపించి యుద్ధం చేశాయి.  చివరికి కాశ్మీరుకు రక్షణగా ఉన్న 370 ని రద్దు చేసి,  చరిత్రలో ఉన్న గుర్తింపుని ఏకంగా రద్దు చేశారు.  దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అణచివేతకు ఈ వైమానిక దాడులు ఒక పెద్ద కొనసాగింపు. ఇది మనం లోతుగా పరిశీలించి ఎదుర్కోవాల్సి ఉన్నది.. అన్నారు.

సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు సాదినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ` ఈరోజు ఆదివాసీ ప్రాంతాలలో వైమానిక దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ ప్రజలు పోరాడుతున్నారు. వాళ్లు గతంలోనూ లొంగిపోలేదు. భవిష్యత్తులో కూడా వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఆదివాసులు ప్రకృతితో సంఘర్షిస్తూ  రాజ్యంతో కూడా సంఘర్షిస్తూ  తమ పోరాటాలని ముందుకు తీసుకుపోతున్నారు. తమ ప్రాంతంలోని వనరులని కాపాడటానికి వాళ్లు ఈ పెద్ద పోరాటం చేపట్టారు. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం రాజ్యం యుద్ధానికి తెగబడినప్పటికీ ప్రజలు ఓడిపోతారని అనుమానించాల్సిన అవసరం లేదు. అణచివేత రాజ్య స్వభావం అయినట్లే దోపిడీ ఉన్నంత కాలం ప్రజలు పోరాడుతూనే ఉంటారు. మనం చేయవలసిందిగా ప్రజలు చేస్తున్న పోరాటాలకు సమాజం నుంచి పెద్ద ఎత్తున మద్దతును కూడగట్టడమే. అట్లాగే ప్రభుత్వాన్ని నిలదీసి  ప్రశ్నించడానికి అన్ని గొంతులను కలపాలి… అన్నారు. 

సిఎంఎస్‌ నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ` రాజ్యం అంటేనే హింసకు ప్రతిరూపం. అది ఆదివాసీ మహిళలపై తీవ్రమైన హింసను కొనసాగిస్తోంది. దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. మహిళలను అవమానపరచడం, వాళ్ళ శరీరాలపై దాడి చేయడం రాజ్యానికి సంబంధించిన స్వభావం. ఇందులో పితృస్వామిగా కోణం ఉన్నది. ప్రతి దాడిలోనూ, ప్రతి యుద్ధంలోనూ పితృస్వామ్య కోణాన్ని మనం చూసి దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామిక చైతన్యాన్ని సమాజానికి అందించే క్రమంలోనే ఇలాంటి దాడులను ఎదుర్కోగలం.. అన్నారు.

ప్రముఖ సాహిత్య విమర్శకుడు ఏకే ప్రభాకర్‌ మాట్లాడుతూ` ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద దాడికి సిద్ధమైంది. ఎందుకిలా జరుగుతున్నది అనేది ఒక తీవ్రమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రతిఘటన ఎలా ఉండాలి? ఎన్ని రూపాలలో ప్రతిఘటన ఉండాలి? అపి  మనం ఆలోచించుకోవాలి.   ప్రజాస్వామ్య పోరాటాలు, సాయుధ పోరాటాలు జెమిలిగా సాగితే  ఈ యుద్ధాన్ని   కనుక్కోగలమా? సమాధానం ఆలోచించాలి. అప్పుడు  రాజ్యాంగ పరిధిలో జరిగే ప్రజాస్వామ్య పోరాటాలను ఎలా నిర్మించాలి? వాటికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఎలా పెంచుకోవాలి? ఏదేమైనా ప్రజల మీద యుద్ధం జరగడానికి వీల్లేదని చెప్పడం గురించి మనం లోతుగా ఆలోచించాలి. ఇట్లాంటి చర్యలను రచయితలుగా, ప్రజాస్వామిక వాదులుగా మేం అంగీకరించం అని   మనందరం ఇక్కడి నుంచి సంతకాలతో రాష్ట్రపతికి విజ్ఞప్తిని పంపిద్దామా.. దేనికంటే భారత రాష్ట్రపతి ఆదివాసీ మహిళ కాదా.. ఆమె ఎమైనా చర్యలు తీసుకుంటుందా?.. అన్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు నాగన్న మాట్లాడుతూ` జనవరి 11వ తేదీ ఆదివాసులపై హెలికాప్టర్‌ దాడులు జరిగిన సందర్భంలో టీవీలు   సర్జికల్‌ స్ట్రైక్‌ అనే మాట వాడాయి.  గతంలో మనం ఈ సర్జికల్‌ స్ట్రైక్‌ అనే మాటను పాకిస్తాన్‌తో భారత ప్రభుత్వం యుద్ధం చేసినప్పుడు విన్నాము.  అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం తన ప్రజలైన ఆదివాసులపైనే సర్జికల్‌ స్ట్రైక్‌ చేపట్టిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ అణిచివేత విధానం ఇప్పుడే మొదలు కాలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాట కాలంలో పోలీస్‌ యాక్షన్‌ పేరుతో వైమానిక, నావిక, పదాతి దళాలతో  యుద్ధం చేశారు. ఇప్పుడు అలాంటి రూపాలలోకి ప్రజల మీద యుద్ధం మారింది.  కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఆదివాసులను పూర్తిగా నిర్మూలించడమే తమ కర్తవ్యం అని భారత ప్రభుత్వం ప్రకటించింది. మనంమందరం అనేక రకాలుగా పరాయికరణకు గురైన వాళ్లం. ఆదివాసులు ఇంకా అలాంటి పరాయికరణకు గురి కాలేదు. అలాంటి సమూహాలను పూర్తిగా నిర్మూలిస్తే తప్ప కార్పొరేట్‌ రాజ్యం స్థిరపడదు.  ఈ ఆలోచనతోనే వాళ్లు ఈ యుద్ధానికి సిద్ధమయ్యారు.. అన్నారు.

 రిసర్చ్‌ స్కాలర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాలలో వైమానిక దాడులు ప్రారంభమయ్యాక ఉస్మానియా విద్యార్థులం అప్పటికప్పుడు స్పందించి భారతదేశంలో పర్యటిస్తున్న చేగువేరా కూతురికి ఈ దాడులను ఖండిరచమని కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాము. ఆదివాసీ ప్రాంతాల రక్షణకు  ఉన్న చట్టాలను అమలు చేయాలని మనం చాలా కాలంగా పోరాడుతున్నప్పటికీ ఆగలేదు. పైగా సైనిక దాడులు వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మేము విశ్వవిద్యాలయం విద్యార్థులుగా ఒక సెమినార్‌ నిర్వహించాలి అనుకుంటున్నాము. దానికి ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులను. అటవీ అధికారులను పిలవాలని అనుకుంటున్నాం. ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో ఉన్న నిబంధనలు ఏమిటి? వాటికి లోబడే ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలపై ఈ దాడులు జరుగుతూ ఉన్నాయా? ఇలాంటి యుద్ధ చర్యలపై ఆ    విభాగం అధికారులు ఏమనుకుంటున్నారు?  అట్లాగే రాజ్యాంగబద్ధమైన ఆదివాసీ రక్షణ చట్టాలను అమలు చేయవలసిన అటవీ అధికారులు ఈ వైమానిక దాడుల గురించి  ఏమనుకుంటున్నారు? వాళ్ళ విభాగాల్లోని రాజ్యాంగ  నిబంధనలేమిటి అనే విషయాలు చర్చనీయాంశం చేద్దామని అనుకుంటున్నాం. దీని వల్ల భారత ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో మనకు తెలిసి అవకాశం ఉంది. ఇలా అనేక రంగాలకు చెందిన వాళ్లతో మాట్లాడిరచాలి. అప్పుడే యుద్ధానికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని కూడగట్టగలం…అన్నారు. 

కుల నిర్మూలన వేదిక నాయకుడు కోట ఆనంద్‌ మాట్లాడుతూ` ఆదివాసీ ప్రాంతాలలోకి కార్పొరేట్‌ కంపెనీల చొరబాటు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. బయ్యారం అడవుల్లో  జిందాల్‌ కంపెనీని   తెరిపించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న ఆదివాసులు మొదటినుంచి పోరాడుతున్నారు. వాళ్ళు ఆకాంక్షలను గౌరవించకుండా చట్టంలో ఆదివాసులకు ఉన్న రక్షణ అంశాలను జిందాల్‌ ప్రయోజనాల కోసం ప్రభుత్వం కాలరాస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న వైమానిక దాడి దేశ వ్యాప్తంగా ఆదివాసులపై జరుగుతున్న దాడిలో భాగం. వీటన్నింటినీ మనం కలిపి  ప్రచారం చేయవలసి ఉన్నది.. అన్నారు.

ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ`ఆదివాసీ ప్రాంతాలలో  జరుగుతున్న విడి విడి ఘటనలుగా వీటిని మనం గుర్తించడానికి వీల్లేదు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున   ఉద్యమం చేయాల్సిన  అవసరం ఉన్నది. తెలంగాణలో అయితే పోడు భూముల పోరాటం చాలా ప్రధానమైన అంశం. ఆదివాసుల భూములను వాళ్ల నుంచి లాగేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి కూడా మనం కలిపి చూసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.  రాజ్యాంగంలో చాలా రకాల అధికరణాలు ఉన్నప్పటికీ   అవేవీ ఆచరణలోకి రాలేదంటే మన దేశంలో ప్రజాస్వామ్యం లేనట్లే.  ప్రజలను భయభ్రాంతులను చేసి అధికారం కొనసాగించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఈ స్థితికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక విశాలమైన కార్యాచరణను మనం ప్రారంభించాలి.  అది ఆచరణ యోగ్యంగా ఉండాలి. అందరినీ కలుపుకుపోయేదై  ఉండాలి. ఒక పెద్ద సమిష్టి శక్తిగా మారినప్పుడు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మన వంతు మనం బుద్ధి జీవులుగా దోహదం చేయగలం.. అన్నారు.

ప్రముఖ సామాజిక కార్యకర్త రచయిత్రి సజయ మాట్లాడుతూ` ఆదివాసీ ప్రాంతాలలో వైమానిక దాడులపై మాట్లాడవలసింది మనం మాత్రమే కాదు. అధికారం కోసం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీల నాయకులను పిలిచి ఈ విషయంపై మీరు ఏమంటారు? అని వాళ్ళతో మాట్లాడిరచాలి. ఇప్పుడు మనం నిర్వహిస్తున్నది ప్రాథమిక సమావేశం   అనుకుంటే ఆ తర్వాత అయినా సరే మనం రాజకీయ పార్టీలతో మీటింగ్‌ ఏర్పాటు చేయాలి. ఈ రోజు పోరాటాలన్నీ ఫేస్‌బుక్‌కి  పరిమితం అవుతున్నాయి. దాన్ని దాటి కార్యాచరణలోకి వెళ్లాలి. చాలా పరిమితంగానైనా సరే కార్యాచరణ రూపొందించుకొని మన చైతన్యాన్ని సజీవంగా నిలబెట్టుకుంటూ ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సంఫీుభావం ప్రకటించాలి. అట్లాగే ఈ వైమానిక దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడానికి అవకాశం ఏమైనా ఉన్నదా? అని  కూడా మనం ఆలోచించాలి. బిజెపి మినహాయిస్తే మిగతా అన్ని రాజకీయ పార్టీలను గట్టిగా ఈ వైమానిక దాడుల విషయంలో నిలదీసి మీ వైఖరి ఏమిటి అనేది ప్రజల ముందు బహిర్గతం చేయాలని..అన్నారు.

దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకుడు చంద్రమౌళి మాట్లాడుతూ` ఆదివాసీ ప్రాంతాలలో వనరుల దోపిడీ గురించి మాట్లాడే క్రమంలో దేనికి ప్రభుత్వం వైమానిక యుద్ధం చేపట్టిందో మనం వివరించాలి.  దేనికి అణిచివేత ఇంత తీవ్ర రూపంలోకి వచ్చిందో మనం విశ్లేషించి ఎక్కువమంది ప్రజాస్వామ్యవాదుల మద్దతు కూడగట్టాలి ..అన్నారు.

సిఆర్‌పిపి నాయకుడు బల్ల రవీందర్‌ మాట్లాడుతూ` మన దేశ ప్రజలపై మన దేశమే యుద్ధం చేయడం అనే పరిస్థితి ఇవాళ ఏర్పడిరది. గతంలో కూడా ప్రజాతంత్ర శక్తులు ఎన్‌కౌంటర్‌ హత్యలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇప్పుడు   నేరుగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అంటే అణచివేత తీవ్ర రూపం ధరించింది. కాబట్టి  మన నిరసన పోరాటాలను కూడా మరింత ఉధృతం చేయాల్సిన  అవసరం ఉంది. దీని కోసం మేధావులను, బుద్ధిజీవులను ఐక్యం చేయడానికి అవకాశం ఉన్నదేమో పరిశీలించాలి.. అన్నారు.

విప్లవ రచయిత, అనువాదకుడు ఎన్‌ రవి మాట్లాడుతూ` తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సైనిక చర్య చేసి కూడా దాన్ని అప్పుడు వాళ్ళు పోలీస్‌ యాక్షన్‌ అని మాత్రమే అన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా దండకారణ్యం, జార్ఖండ్‌ వంటి ఆదివాసీ ప్రాంతాలలో చాల ఏళ్లుగా  సైనిక దాడులు చేస్తూ ప్రభుత్వం  కేవలం సైనికులను తరలించడానికే హెలికాప్టర్లను వాడుతున్నాం.. అంటున్నారు.  ఈ తరహా  యుద్ధంతో శ్రీలంకలో ఎల్టీటీఈ ఉద్యమాన్ని అణిచివేయగలిగారు. ఆదివాసులపై జరుగుతున్న ఈ యుద్ధం మావోయిస్టులపై కూడా జరుగుతున్న యుద్ధం. తమ విధానాలను వ్యతిరేకించే ఉద్యమాలను అణచివేయడానికి  ఒక వ్యూహం ప్రకారమే దేశంలోని అన్ని ప్రాంతాలలో ఇలాంటి రాజకీయార్థిక సైనిక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ యుద్ధంలోని అన్ని కోణాలను  పరిగణలోకి తీసుకొని మనం పోరాడవలసిన అవసరం ఉంది.. అన్నారు.

ప్రముఖ న్యాయవాది సురేష్‌ మాట్లాడుతూ` మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు ఈ సైనిక దాడికి వ్యతిరేకంగా పోరాడుతూనే  ఈ యుద్ధం వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలను కూడా చర్చనీయాంశం చేయాలి. చట్టం, రాజ్యాంగం ఈ తరహా దాడులను అంగీకరిస్తాయా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు అవకాశం ఉన్నదా? అనే చర్చ చేయడం వల్ల ఎక్కువ మంది ఆదివాసీ సంఫీుభావ ఉద్యమంలో భాగం అవుతారు.. అన్నారు.  

విరసం తరపున పాణి మాట్లాడుతూ` ఆదివాసులపై భారత ప్రభుత్వం యుద్ధం చేస్తోందనే ప్రాతిపదిక మీద విస్తృతంగా  వైమానిక దాడులకు వ్యతిరేకంగా సంఫీుభావం కూడగట్టగలం. దానితోపాటు ఈ సమస్యను అర్థం చేసుకోడానికి ఇంకా లోతుగా ప్రయత్నించాలి. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికే వైమానిక దాడులకు సిద్ధమయినట్లు వాళ్ల ప్రకటనలనుబట్టే తెలుస్తున్నది. మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలే. ఈ దేశ ప్రజల కోసమే వాళ్లు విప్లవోద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఆదివాసుల మీదా, మావోయిస్టుల మీదా… అనే సందేహాలకు గురి కావాల్సిన పని లేదు. ఇది మనందరి మీద దాడి అనుకుంటే తప్పక దీన్ని ఎదుర్కోడానికి ప్రయత్నించగలం. దేనికంటే కార్పొరేటీకరణ, సైనికీకరణ అనేవి ఈ దోపిడీ వ్యవస్థ విషపు కవల పిల్లలు.   2004 నుంచి గ్రీన్‌హంట్‌, కార్పొరేటీకరణతో ఈ యుద్ధం మొదలైంది.. అన్నారు.  ఈ సమావేశాన్ని సమన్వయం చేసిన మానవ హక్కుల వేదిక నాయకుడు జీవన్‌కుమార్‌ చివరగా మాట్లాడుతూ.. జనవరి 11వ తేదీన జరిగిన వైమానిక దాడులను ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్లంతా అనేక వైపుల నుంచి పరిశీలించారు. ఈ స్థితికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించారు.  ఈ చర్యలకు వ్యతిరేకంగా బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు చేయవలసిన పనులకు సంబంధించి అనేక మంచి సూచనలు చేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మన తదుపరి కార్యక్రమం రూపొందించుకుందాం. ఈ సమావేశం తక్షణంగా మనందరి ప్రతిస్పందన మాత్రమే. ఇందులో భాగం కాగల మిత్రులు ఎందరో ఉన్నారు. వాళ్లందరినీ సంప్రదించి సమాజం ఆలోచించేలా ప్రణాళికను తయారు చేసుకుందాం అన్నారు. ఈ సమావేశంలో మరో 50 మంది దాకా పాల్గొన్నారు. 

Leave a Reply