నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్ అభిప్రాయాలేవైనా సరే… అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం.
నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక హెచ్చరిక చేయదల్చుకున్నాయి. మీరు భావప్రకటనా స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉంటే మేం మనోభావాలని భౌతిక దాడులు చేస్తాం.. అని చెప్పదల్చుకున్నాయి. ఆ రకంగా తెలంగాణలో ఫాసిస్టు శక్తుల ప్రాబల్యానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. నరేష్ వాదనా పద్ధతి మీద భిన్నాభిప్రాయాలు ఉన్నవారికి కూడా దిగ్భ్రాంతికలిగేలా ఈ ఘటన జరిగింది.
అంత మాత్రమే కాదు. కేసీఆర్ తోక పుచ్చుకొని ఫాసిజాన్ని ఈది ఆవలి గట్టుకు చేరుకోవాలనుకుంటున్నవారికి కూడా బైరి నరేష్ మీద దాడి హెచ్చరిక చేస్తున్నది. కేసీఆర్ ప్రసంగాలు విని, తాము భ్రమపడి, ప్రజలను భ్రమల్లోకి తోసేయాలని, మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నవారి అవగాహనలను కూడా ఈ ఘటన బట్టబయలు చేస్తున్నది. నిజంగానే కేసీఆర్ తెలంగాణలో హిందుత్వ మూకలను కట్టడి చేయదల్చుకుంటే నరేష్ మీద దాడి జరిగేదే కాదు. బహుశా నరేష్ మాటలకు కేసీఆర్ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయా? అని అనుమానించాల్సి వస్తోంది.
ఎన్నికల రాజకీయాలు చేసే పార్టీలకు మత రాజకీయాల మీద అభ్యంతరం ఉండదని, అధికారం దానికదే ఈ వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను అంగీకరించలేని ఫాసిస్టు శక్తి అని ఈ ఘటన తెలియజేస్తోంది. బీజేపీకి నేరుగా హిందుత్వ భావజాల సంస్థల పునాది ఉండవచ్చు కానీ మిగతా ఎన్నికల పార్టీలు దగ్గరిగానో, దూరంగానో మత రాజకీయాలతో కలిసి నడుస్తున్నాయి. మామూలప్పుడు సెక్యులర్ వేషాలు వేస్తూ అధికారం కోసం ఎంత అవసరమైతే అంత మతాన్ని వాడుకోడానికి సంకోచించవు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనల్లాంటివే నరేష్ కేంద్రంగా తెలంగాణలో జరుగుతున్నాయి. ఇవి కేవలం తెలంగాణ సమాజంలో పెరుగుతున్న మతతత్వశక్తులనే సూచించడం లేదు. తెలంగాణ రాజకీయ రంగంలో, ముఖ్యంగా అధికారం కేంద్రంగా పెరుగుతున్న ఫాసిజాన్ని కూడా సూచిస్తున్నాయి. కేసీఆర్ దొరతనంలోనే ఫాసిస్టు స్వభావం ఉంది. ‘ఏకీభవించనోడి పీక నొక్కడం’ అనే ఫాసిస్టు లక్షణం బూర్జువా రాజకీయాల్లోనే ఉంటుంది. అందుకే నరేష్ మీద దాడులు చెదురుమొదరు ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం బైటికి హిందుత్వ మూకలు చేస్తున్న దాడి వెనుక కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉన్నది.
కాబట్టి కేసీఆర్‌కు తెలంగాణలోని హిందుత్వ మూకను కట్టడి చేసే కర్తవ్యం ఏమీ లేదు. ఆయన ప్రసంగాల జోరుకు భ్రమసేవాళ్లే ఆయన నుంచి దాన్ని ఆశిస్తూ ఉంటారు. ఆయన మాత్రం చాలా తేటతెల్లంగా ఉన్నాడు. ఒక వేళ నరేష్ మీద దాడిపట్ల ఆయనకు ఏదైనా అభ్యంతరం ఉంటే స్పందించి ఉండేవాడు కదా. నిజంగానే దొరవారికి అలాంటి వైఖరి ఉంటే పోలీసులు తమ కళ్లెదుట ఈ దారుణం జరగనిచ్చేవారా? ఇప్పటికీ అల్లరి మూక మాత్రమే నరేష్ మీద దాడి చేసిందని సరిపెట్టుకోగలమా?
NOT RIGHT KCR GARU —-NO COMMENT FROM YOU SIR ?? WHY KING KCR GARU ???