మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లలో కొందరిని మర్చిపోవచ్చు.   ఇతరులను ప్రభావితం చేయగల వాళ్లను అంత సులభంగా మర్చిపోలేం. మన ఆలోచనలనో, లోకాన్ని పరిశీలించే చూపునో, జీవించే పద్ధతినో  వాళ్లు ముట్టుకొని ఉంటారు. ఈ అంశకు కాలంతోపాటు ఎదిగే స్వభావం ఉంటే.. వాళ్లు మన జ్ఞాపకాలను, ఉద్వేగాలను, అనుబంధాలను దాటి చరిత్ర పరిధిలోకి వెళతారు. అంటే ఆలోచనలను ప్రభావితం చేసే దశ నుంచి భౌతిక పరిస్థితులను మార్చే  క్రమంలో కూడా  వాళ్లు భాగం అవుతారు. చరిత్రను నిర్మించే పని మొదలు పెడతారు. ఈ సమాజం అందించే ఏ ప్రత్యేకతలు లేని మామూలు మనుషులు ఈ పనిలో భాగమైతే ఎంత అద్భుతంగా ఉంటుందో మావోయిస్టు ఆనంద్‌ జీవితం నిరూపించింది.

ఆనంద్‌ సుమారు యాభై ఏళ్ల విప్లవ జీవితం గడిపాడు. విప్లవోద్యమానికి తగినట్లు తన జీవితాన్ని మలుచుకున్నాడు. అందువల్లే చివరి దాకా విప్లవోద్యమమే శ్వాసగా బతికాడు. విప్లవోద్యమం నిర్మాణం కాగల భౌతిక పరిస్థితులన్నిటికీ తగినట్లు తననుతాను మార్చుకున్నాడు. ఆ పరిస్థితులను రూపొందించడంలో, మార్చడంలో భాగమయ్యాడు. ఆలోచనలకు, భౌతిక పరిస్థితులకు మధ్య సాగే నిరంతర ఘర్షణలో తన జీవితాన్ని ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దుకున్నాడు. ఈ మొత్తంలో అతి ముఖ్యమైన విషయం ఏమంటే పాతను నిర్మూలించి కొత్తను నిర్మించడం.

మానవ జీవితంలో, సమాజంలో,  చరిత్రలో ఉండే పరంపరాగతమైన పాత పద్ధతులను, విలువలను, విశ్వాసాలను, పని తీరులను మార్చాలని కటకం సుదర్శన్‌ యువకుడిగా బయల్దేరాడు. వందల ఏళ్ల నుంచి స్థిరపడిన యథాతథ స్థితిని మార్చడం మొదలు పెట్టాడు. ఇంత పెద్ద లక్ష్యాన్ని చాలా చిన్న  పనుల దగ్గర ఆరంభించాడు. ఈ సమాజం మొత్తాన్ని మార్చేసి కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే వ్యూహాన్ని   ఇప్పుడు కొందరు మహా కథనం అంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పటికీ సాధ్యం కాదని, చరిత్ర ఒప్పుకోదని, విఫలమైందని అనే వాళ్లు ఉన్నారు. మహా కథనాల కంటే పిట్ట కథలే వాస్తవాన్ని వర్ణిస్తాయని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ ఒక మహత్తర ఆశయాన్ని సాధించాలనుకొనే వారు ఎంత చిన్న పనుల దగ్గర ఆరంభమవుతారో తెలియాలంటే ఆనంద్‌లాంటి విప్లవకారుల జీవితాన్ని పరిశీలించాల్సిందే.

మే 31, మధ్యాహ్నం దండకారణ్యంలో గుండెపోటుతో మరణించిన ఆనంద్‌ సంస్మరణ సభ జూన్‌ 12న బెల్లంపల్లిలో జరిగింది. ఆ సభలకు హాజరైన వాళ్లలో ఆనంద్‌తో కలిసి విప్లవోద్యమంలో పని చేసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు చెప్పిన మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. సాయుధ పోరాటం ద్వారా ఈ వ్యవస్థను సమూలంగా మార్చేయాలనే అతి పెద్ద అశయంతో బయల్దేరిన ఆనంద్‌గాని, ఆయన సహచరులుగాని ఎంత చిన్న పనుల దగ్గర ఆరంభించిందీ వాళ్లు చెప్పుకొచ్చారు. విప్లవానికి ఆదిలాబాద్‌ కన్నతల్లి అని, సింగరేణి ఊట చెలిమ అనే మాటల అసలైన అర్థం వాటిలో ఉన్నది. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల్లో అందివచ్చిన ప్రతి చిన్న పనీ చేయాల్సిందే. ఒక్కో గడ్డిపోచను వెతికి గూడును నిర్మించాల్సిందే.. ఒక్కో నిప్పు రవ్వను ఒడిసిపట్టుకొని ప్రాణవాయువును ఊది రగిల్చవలసిందే..ఒక్కో మనిషికి ఉండే సకల ప్రత్యేకతలను, పరిమితులను గుర్తించి, వాళ్లే వాటిని అధిగమించడానికి దోహదం చేయవలసిందే..విడి విడి మనుషులందరూ కలవగల చోటికి తీసికెళ్లి వాళ్లను సమూహంగా మార్చవలసిందే..అంతిమ లక్ష్యం చేరుకోగల మహాశక్తిగా తీర్చిదిద్దవలసిందే.. అనే స్పృహ ఆనంద్‌కు ఎలా ఉండేదో వాళ్ల మాటలనుబట్టి అర్థమైంది.

బహుశా ఈ రకమైన పని ఆయన  పట్టణాల్లో, బస్తీల్లో, విద్యాలయాల్లో, సింగరేణి గనుల్లో, పల్లెల్లో, అడవుల్లో చేశాడు. ఇదంతా ఒక పని ఆయ్యాక మరో పని అనే పద్ధతిలో చేయలేదు. ఏకకాలంలో చేసుకుంటూ వెళ్లాడు. భార్యాభర్తల సంబంధాల్లోని ఆధిపత్యాల దగ్గర ఆరంభించినా సకల ఆధిక్యాలతో కునారిల్లుతున్న ఈ సమాజం దగ్గరికి మనుషులను తీసికెళ్లాడు.  ఒక చిన్న అసమానత దగ్గర ఆరంభించినా సకల అసమానతలను రద్దు చేసి సమ సమాజ స్థాపన దిశగా ఆలోచింపచేశాడు. అవగాహనతో పరిష్కరించవలసిన సమస్యల దగ్గరి నుంచి సాయుధ పోరాటంతో కూల్చవలసిన సమస్యల దాకా  నడిపించాడు. ఒక చిన్న అణచివేత వ్యతిరేక పోరాటం దగ్గర మొదలు పెట్టినా ఆంక్షలు లేని స్వేచ్ఛా భావన కోసం జీవితాన్ని పణం పెట్టగల ఆచరణలోకి ప్రజలను కదిలించాడు. ‘విప్లవమంటే మౌలిక వైరుధ్యాన్ని రద్దు చేయడం’ అనే లక్ష్యాన్ని కాగడాగా ఎత్తిపట్టి ఆ వెలుగుల కింద అనేక వైరుధ్యాలకు, ఆంక్షలకు వివక్షలకు, వెలివేతలకు బలైపోతున్న మనుషులందరినీ సమీకరించాడు.

ఆనంద్‌, నల్లా ఆదిరెడ్డి, గజ్జల గంగారాంలాంటి అతి కొద్ది మంది 1970లలో  విప్లవోద్యమాన్ని ఎట్లా ఆరంభించిందీ హుసేన్‌ రాసిన తల్లులు బిడ్డలు నవల చదివి ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. చరిత్రను నిజ పాత్రలతో రాస్తే పాఠకులు ఎలా స్వీకరిస్తారు?   అనే సందేహం   ప్రచురణకు ముందు కలిగింది. కానీ ఆ నవల విడుదలైనప్పటి నుంచి అందులోని పాత్రలతో ఆ ప్రాంతం వాళ్లూ, ఇతర ప్రాంతాల వాళ్లూ మమేకం అవుతున్నారు.

విషాదకరంగా అందులోని ఒక కథా నాయకుడు ఆనంద్‌ తన మరణంతో మరింత వాస్తవికంగా పాఠకులకు చేరువ అయ్యాడు.  కాల్పనికంగా వాళ్ల భావోద్వేగాలలో భాగమయ్యాడు. ఆ నవలా కాలంలోనే  దండకారణ్యం చేరుకోవడంతో కనిపించకుండాపోయిన    ఆనంద్‌  విస్తారమైన విప్లవోద్యమ చరిత్రలోంచి మరణానంతరం తిరిగి పాఠకుల మధ్యకు వచ్చాడు.  ఈ దు:ఖకర అనుభవంతో  ఇప్పుడు ఆ నవలను ఎలా చదవాలో కొత్త  చూపు  కలుగుతోంది. ఆయనతో సహా వేలాది మంది నిర్మించిన, కోటాది మంది ప్రమేయంతో సాగిన విప్లవోద్యమ చరిత్రను, ఈ యాభై ఏళ్ల సమాజ గమనాన్ని  కూడా అర్థం చేసుకోడానికి తగిన దృక్పథం ఇప్పుడు చదువరులలో రూపొందుతోంది. తొలి రోజుల్లో ఆయనలాంటి వాళ్లు చేసిన చిన్న చిన్న పనులు ఒకదానికి తోడై పెద్ద పనిగా మారడం అనే గణక పద్ధతిలో అభివృద్ధి చెందలేదు. ఒకదానితో ఒకటి రాపిడి పడి రాడికల్‌ రప్చర్‌కు  దారి తీసింది. అది ఎలా జరుగుతుందో, దానికి అవసరమైన పరిస్థితులను ఎలా ఎగదోయవలసి ఉన్నదో తెలిసి ఉండాలి. యథాతధ స్థితిని బద్దలు కొట్టి ఇరుకిరుకు దారుల గుండా సమాజాన్ని ముందుకు నడిపించడం తెలిసి ఉండాలి. ఆనంద్‌కు అది పుష్కలంగా తెలుసు. సమాజ మార్పు, వ్యక్తుల చైతన్యాల్లో మార్పు, సామూహిక ఆచరణలో మార్పు ఎన్నెన్ని రూపాల్లో, ఎంత సంక్లిష్టంగా, ఎన్నెన్ని తలాల్లో సాగుతుందో అంచనా ఉండాలి. ప్రజలకు ఆలోచనలు పరిచయం కావడానికీి, వాటిని ఆచరణలో పెట్టడానికీ  మధ్య ఉండే వైరుధ్యాలను గుర్తించాలి. వాటిని సృజనాత్మకంగా పరిష్కరించాలి. అట్లా విప్లవ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడమే సిద్ధాంతం తెలుసు అనడానికి రుజువు.

ఆలోచనాపరుడిగా, మేధావిగా ఆనంద్‌ను అక్కడ గుర్తించాలి. అట్టడుగు జీవితం నుంచి ఆర్గానిక్‌ ఇంటలెక్చువల్‌గా ఎదగడమంటే ఇదే. అలాంటి వాళ్ల నాయకత్వం ఉన్నందు వల్లనే విప్లవోద్యమం అనేక దశను దాటుకున్నది. ఆయన అప్పట్లో  చేసిన కృషి రాడికల్‌ విద్యార్థి యువజన ఉద్యమంగా, రైతుకూలి ఉద్యమంగా, సింగరేణి కార్మికోద్యమంగా, ఆదివాసీ పోరాటంగా విస్తృత రూపాల్లో విప్లవోద్యమాన్ని ఒక పెద్ద గెంతులో పురోగమింపచేసింది. ఒక పరిమిత ప్రాంతంలో, కొన్ని సెక్షన్ల ప్రజల్లో ఏర్పడ్డ ఈ పునాది దేశవ్యాప్త విప్లవోద్యమానికి ఆధారమైంది. దేశంలోని విభిన్న ప్రాంతాల, ప్రత్యేకతల, అనేక పీడిత అస్తిత్వాల, పలు దోపిడీ పీడనల, ఆధిక్యాల అణచివేతల మధ్య నుంచి విప్లవోద్యమం విస్తరించింది. ఆనంద్‌ ఒక సందర్భంలో .. భారత విప్లవోద్యమం తొలి రోజుల్లో తనది చైనా మార్గమని చెప్పుకున్నది. కానీ ఆనాటి చైనాకు,  భారతదేశానికి అనేక తేడాలు ఉన్నాయి. చైనా విప్లవోద్యమంలోని వ్యూహాత్మక పురోగమనానికి మన దేశ విప్లవోద్యమ విస్తరణకు సంబంధమే లేదు. ఇండియాలో పూర్తి ప్రత్యేక చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక సంబంధాల్లో, పూర్తి భిన్నమైన ప్రపంచ పరిస్థితుల్లో  విప్లవోద్యమం తనదైన దారి వెతుక్కుంటున్నది అన్నాడు.

బహుశా ఆయనకు ఈ అవగాహన బెల్లంపల్లి పట్టణంలో, బస్తీల్లో, బొగ్గుబాయిల మీద పని మొదలు పెట్టినప్పుడే తెలిసి ఉంటుంది. అందువల్లనే దండకారణ్యంలోనేగాక దేశంలోని అనేక ప్రాంతాలకు తగిన విప్లవ ప్రయోగాలు చేశాడు. ఒక్కడికక్కడ అనేక చిన్న పనులను, పెద్ద పనులను, ప్రజాస్వామిక పోరాటాలను, సాయుధ పోరాటాలను, మంద్రస్థాయి చలనాలను, ప్రజా వెల్లువలను, అట్టడుగు ప్రజలను, అత్యున్నత విద్యావంతులనదగిన మేధో బృందాలను, సైనిక కార్యకలాపాలను, సున్నితమైన కళాత్మక సృజన కార్యాలను మేళవించి ఒక మహాద్భుత ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు. అనేక ప్రత్యేకతలు తెలిసినందు వల్లే అతి పెద్ద సాధారణీకరణను సాధించగలిగాడు. తద్వారా  నేల మీద ప్రజలను నడిపించగల విప్లవాత్మక దృక్పథాన్ని అందించాడు. విప్లవోద్యమానికి ఆచరణలో, మేధో రంగంలో వెన్నుదన్నుగా నిలబడ్డాడు.

అందువల్లనే ఆయన జీవితంలో విప్లవోద్యమ దశలన్నీ కనిపిస్తాయి. ఈ వ్యవస్థను విమర్శించే ప్రత్యామ్నాయ ఆలోచనల దగ్గరి నుంచి ఈ సమాజంలో ఈ ప్రజలే ప్రత్యామ్నాయాలు నిర్మించుకోగలరని నిరూపించే దాకా  విప్లవోద్యమం ఎదిగింది. ఈ ప్రయాణమంతా ఆయన జీవితంలో కనిపిస్తుంది. బెల్లంపల్లిలో పెత్తందార్లు, స్థానిక పోలీసులు, సింగరేణి యజమానులు, ఇన్‌ఫార్మర్లు ఉద్యమం మీద దాడి చేసిన దశ నుంచి అమెరికా కనుసన్నల్లో అదాని కోసం వైమానిక దాడులను ఎదుర్కొనే దాకా విప్లవోద్యమం విస్తరించింది. అప్పట్లో  ఆ దాడులను ఎదుర్కోడానికి ఆనంద్‌లాంటి వాళ్లు అనుసరించిన ఎత్తుగడలు ఈ రోజు హిందుత్వ, కార్పొరేట్‌ ఫాసిస్టు యుద్ధాన్ని తిప్పికొట్టగల ప్రతిఘటనా పోరాట రూపాలుగా నిలదొక్కుకున్నాయి.

విప్లవోద్యమం అనేక దశలను దాటుతూ సాధించిన విస్తృతే ఆయన జీవిత వైశాల్యానికి కారణం. ఆయన విప్లవకారుడిగా జీవితమంతా కొనసాగిన వ్యక్తి మాత్రమే కాదు. విప్లవోద్యమ విస్తరణలో భాగంగా తన జీవితాన్ని తుదకంటా పరీక్షించుకుంటూ అత్యంత నిబద్ధతతో, నైతికశక్తితో కొనసాగాడు. అందువల్లనే విప్లవోద్యమ వికాస చరిత్రలో ఆయన వ్యక్తిత్వం సంలీనమైపోయింది. వ్యక్తిగా, తన సహచరుల్లో భాగంగా, ప్రజల్లో ఒకరిగా ఆయన మావోయిస్టు ఆచరణలోంచి దీన్ని సాధించాడు. ఇదీ.. ఆయన జీవితానికి, విప్లవోద్యమానికి మకుటాయమానం.

Leave a Reply