“నిరంకుశుడు మరణిస్తే అతని పాలన అంతమౌతుంది; అమరుడు మరణిస్తే అతని పాలన ప్రారంభమవుతుంది” అనే 19వ శతాబ్దపు డానిష్ తత్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ ఉల్లేఖనం, మేం చదువుకునే రోజుల్లో గోడలపై రాసే మా అభిమాన నినాదాలలో ఒకటి. కామ్రేడ్ ఆనంద్ ఇక లేడు. కానీ అతని ఆలోచన, ఆదర్శం, త్యాగస్ఫూర్తి, అలుపెరగని విప్లవోత్సాహం, నిర్విరామ విప్లవ సాధన తరతరాలకు స్ఫూర్తినిస్తాయి.
సీపీఐ (మావోయిస్ట్) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ 2023 మే 31 న దండకారణ్య దట్టమైన అడవిలో గుండెపోటుతో కన్నుమూశాడు. దండకారణ్య ప్రజల మధ్యన పార్టీ సీనియర్ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) యోధులు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అతని మరణంతో భారతదేశ విప్లవోద్యమం లాటిన్ అమెరికా చే గువేరాను, వియత్నాం వో న్గుయెన్ గియాప్‌ను కోల్పోయింది. 2001లో సెంట్రల్ రీజినల్ బ్యూరో ఏర్పాటు అయినప్పటి నుండి 2017లో అనారోగ్యం వల్ల పదవీవిరమణ చేసేంతవరకు ఆనంద్ కార్యదర్శిగా ఉన్నాడు. కటకం సుదర్శన్‌ విప్లవ కార్యాచరణ కాలంలో పెట్టుకున్న పేర్లు ఆనంద్, ప్రతాప్, దూలా.

అప్పటి ఆదిలాబాద్, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో ఉన్న బెల్లంపల్లిలోని నిద్రాణమైన బొగ్గుగని పట్టణంలో శ్రామికవర్గ తల్లిదండ్రులకు 69 సంవత్సరాల క్రితం సుదర్శన్ జన్మించాడు. సింగరేణి కాలరీస్‌లోని అనేక కార్మికుల కాలనీలలాగానే, కన్నాలబస్తీ ఒక సాధారణ శ్రామికవర్గ మురికివాడలా, ప్రాథమిక సౌకర్యాలు లేని కాలనీగా వుండేది. సింగరేణి కాలిరీస్‌ ఆరంభం నుంచి ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని అందిస్తోంది. దక్షిణ భారతదేశం మొత్తానికి బొగ్గును సరఫరా చేసింది.

దేశమంతటికీ వసంత మేఘఘర్జనగా పిలుచుకునే నక్సల్బరీలా, జంట తెలుగు రాష్ట్రాలకు శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం. అప్పటి వరకు సీపీఐ(ఎం)లో ఉన్న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు రివిజనిస్టు పార్టీతో విడిపోయి, నక్సలబరీ పోరాట రూపశిల్పి చారు మజుందార్ అడుగుజాడల్లో నడిచి 1969లో శ్రీకాకుళం తిరుగుబాటును రగిలించారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈశాన్య కొనలోని ఈ తిరుగుబాటును త్వరలోనే, అంటే 1972 నాటికి ప్రభుత్వం అణచివేసింది. కానీ యింకా సజీవంగా వున్న నిప్పురవ్వలతో విప్లవోద్యమం తిరిగి రాజుకొంది. 1948-51 నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవజ్ఞుడు, దార్శనికుడు కొండపల్లి సీతారామయ్య చేసిన అనిరత కృషి వల్ల ఐదేళ్ల స్తబ్దత తర్వాత ఫీనిక్స్ లాగా ప్రజాయుద్ధం మళ్ళీ తలెత్తింది. 1978 నాటికి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మిలిటెంట్ రైతాంగ పోరాటాల ఉధృతితో సీపీఐ(ఎంఎల్) (పీపుల్స్ వార్) ప్రయత్నాలు ఫలించాయి. ఆదిలాబాద్ రైతాంగ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తులైన కామ్రేడ్స్ శ్యామ్, గజ్జెల గంగారాం, పులి మదునయ్య, పల్లె కనకయ్యలతో పాటు ఆనంద్ ఒకరు.

ఆరంభకాలం

ఆనంద్ 1974లో హైదరాబాద్‌లో మైనింగ్‌లో డిప్లొమా చేశారు. రాడికల్ విద్యార్థులతో సన్నిహితంగా మెలిగిన ఆనంద్, ఆర్‌ఎస్‌యు (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్)ను స్థాపించి, వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో సింగరేణి కార్మికులను రహస్యంగా సంఘటితం చేసి, సింగరేణి కార్మిక సమాఖ్య నాయకత్వంలో పాలక శక్తులను వణికించిన శక్తివంతమైన కార్మిక ఉద్యమానికి బీజం వేసారు. ఎమర్జెన్సీ ఎత్తివేతతో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రైతాంగ పోరాటాల ఉధృతి మొదలైంది. రాడికల్ యూత్ లీగ్ నిర్మాణం, సింగరేణి బొగ్గు కార్మికులను సంఘటితం చేయడంపై ఆయన దృష్టి పెట్టారు. కానీ త్వరలోనే ఉన్నత బాధ్యతలు స్వీకరించడానికి ఇల్లు వదిలిన ఆనంద్, అజ్ఞాతంలోకి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. జన్నారం – లక్సెట్టిపేట్ ప్రాంతంలో ఆర్గనైజర్‌గా పనిచేశాడు. కొద్దికాలంలోనే సీపీఐ(ఎంఎల్)(పీడబ్ల్యూ) ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు అయ్యాడు.

ఇంద్రవెల్లి

1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్‌లోని ఆదివాసీ రైతుల ఇంద్రవెల్లి మారణకాండను ఎవరు మర్చిపోగలరు? తమ భూములను ఆక్రమించి అడవులను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చడానికి చెట్లను నాటిన ప్రభుత్వ విలక్షణ, అమానుష విధానాల వల్ల ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు-గోండులు, కోలాములు, పరధాన్‌లు- తాము యుగాలుగా సాగుచేసుకుంటున్న విస్తారమైన భూములను కోల్పోయారు. ఈ సమస్యలపై చర్చించేందుకు ఆదివాసీ రైతు సంఘం ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఎదుగుతున్న ప్రజా ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచివేయాలనే అవగాహనతో వేసిన ముందస్తు ప్రణాళికతో పోలీసులు సమావేశమైన ప్రజలపై కాల్పులు జరిపారు. తప్పించుకోడానికి ప్రయత్నించిన ఆదివాసీలను వేటాడి అనేకమందిని చంపేశారు. ఇది 1947 తర్వాత జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత.

దండకారణ్యంలోకి

ఇంద్రవెల్లి మారణకాండ సృష్టించిన భీభత్సం తరవాత కూడా ఆనంద్ తన సహచరుల బృందంతో కలిసి రైతాంగ పోరాటజ్వాలలను ఆరిపోనివ్వలేదు. రైతులు అకాసియా, టేకు లాంటి వాణిజ్య చెట్లను తొలగించి, తమ పొలాలను దున్నడం ప్రారంభించారు. తమ సంప్రదాయ ఆయుధాలతో పోలీసులను ప్రతిఘటించారు. అందుకు సత్నాలా ఒక ఉదాహరణ. ఈ ప్రజా తిరుగుబాటు క్రమంగా ప్రజా మిలీషియా, నియమిత సాయుధ దళాల రూపాన్ని పొందింది. సీపీఐ(ఎంఎల్)(పీడబ్ల్యూ) రాష్ట్ర కమిటీ తెలంగాణ నుంచి ఎనిమిది గెరిల్లా దళాలను ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి ప్రాణహిత నదిని దాటి అప్పటి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోకి ప్రవేశించింది.

రెండు రోజుల తర్వాతనే, మహారాష్ట్ర పోలీసులు జరిపిన కాల్పుల్లో 1980 నవంబర్ 2న దళ సభ్యుడు కామ్రేడ్ పెద్ది శంకర్(23) అమరుడయ్యాడు. ‘ఎన్‌కౌంటర్’ పేరుతో జరిగిన క్రూర హత్యగా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్ తన నిజ నిర్ధారణ నివేదికలో పేర్కొంది. పెద్ది శంకర్ స్వస్థలం బెల్లంపల్లి. వేలాది మంది అమరుల రక్తంతో ఎరుపెక్కిన, అనేక చిత్రహింసల రహదారుల్లో పయనిస్తూ, ప్రజా సైన్య నిర్మాణం కోసం 1980లో ప్రారంభమయిన ఈ ప్రయత్నాలు ఈ శతాబ్దపు ఆరంభంలో ఒక ప్రబలమైన ప్రజా గెరిల్లా సైన్యంగా అభివృద్ధి చెందడంలో సఫలతను సాధించాయి. సరిగ్గా ఏడాది క్రితమే, దారుణ హత్యకు గురైన అమరులు కామ్రేడ్స్ శ్యామ్, మురళి, మహేష్‌లు అమరులైన మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2000 డిసెంబర్ 2న పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటైంది.

విప్లవకారుల ఐక్యత – ఉద్యమ వ్యాప్తి

జిల్లా కమిటీ నుండి అటవీ అనుసంధాన కమిటీకి, ఆ తర్వాత 1987లో అటవీ కమిటీకి, కరీంనగర్, ఆదిలాబాద్ నుండి మొత్తం ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోని తూర్పు జిల్లాలు, దండకారణ్యలోని మధ్య భారతదేశ జిల్లాలు- బస్తర్, గడ్చిరోలి వరకు విప్లవోద్యమాభివృద్ధికి అనుసంధానంగా కామ్రేడ్ ఆనంద్ ఎదుగుదల జరిగింది. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌ను 1995లో అఖిల భారత ప్రత్యేక సమావేశంలో కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. పీపుల్స్ వార్, పార్టీ యూనిటీలు ఒకే పార్టీగా విలీనం అయినప్పుడు అతను పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యాడు. పీపుల్స్ వార్, MCCI లు సిపిఐ (మావోయిస్టు)గా విలీనమైనప్పుడు పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగాడు.

పార్టీ ఉత్తర తెలంగాణా ప్రాంతాలలో ఉద్యమాన్ని నిలబెట్టుకోలేక పోయినప్పటికీ, అప్పటి గృహ మంత్రి చిదంబరం 2009లో ప్రారంభించిన నమూనా ఆపరేషన్ గ్రీన్‌హంట్ తో మొదలుకొని ఇంతకు ముందెన్నడూ లేనంతగా లక్షలాది కేంద్ర పారామిలటరీ బలగాలు వివిధ స్థాయిలలో జరుపుతున్న చుట్టుముట్టి, అంతంచేసే కార్యకలాపాలకి వ్యతిరేకంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, జనాతన ప్రభుత్వాలు కఠినమైన పోరాటాన్ని సాగిస్తున్నాయి. అతని నుండి వారసత్వాన్ని తీసుకొని అమిత్ షా 2024 నాటికి, అలాంటి గడువులు చాలా దాటిపోయినప్పటికీ, మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేశాడు.

అత్యున్నత దశకు చేరుకున్న విప్లవోద్యమం –

2009 నుండి అన్నీ వైపులా నుంచి చుట్టుముట్టి, అణచివేత కేంపెయిన్ పార్టీ ఎదుర్కొన్న కష్ట సుఖాలన్నింటిలోనూ ఆనంద్ భాగస్వామిగా వున్నాడు. విప్లవోద్యమం విస్తరణ కొద్దిపాటిగా వున్న గెరిల్లా జోన్‌లు ఉత్తర తెలంగాణ, దండకారణ్య మొదలుకొని బీహార్, జార్ఖండ్‌లోని విశాలప్రాంతాల్లో భారతదేశ నలుమూలలకు అనేకంగా విస్తరించడం; గెరిల్లా యుద్ధాన్ని చలనయుధ్ధంగా మార్చడం; మధ్య భారతదేశం, ఆంధ్ర-ఒడిశా బార్డర్ జోన్‌లు, బీహార్, ఝార్ఖండ్‌లలో జనాతన సర్కార్ (రివల్యూషనరీ పీపుల్స్ కౌన్సిల్స్) ఏర్పాటు వంటి ఉన్నత స్థాయిలను అతను చూశాడు.

టాటాలాంటి పెద్ద వ్యాపార సంస్థల ప్రాయోజిత, బిజెపి ప్రభుత్వ మద్దతు యిచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేంద్ర కర్మ నేతృత్వంలో తిరుగుబాటు వ్యతిరేక విజిలెంట్ ఉద్యమం (కౌంటర్ ఇంసర్జెన్సీ విజిలంటే మూవ్‌మెంట్) – సల్వా జుడుంకు వ్యతిరేకంగా సిఆర్‌బి సెక్రటరీగా సమర్థవంతమైన నాయకత్వాన్నందించి, తటస్థం చేయగలిగాడు. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో పార్టీ ఉద్యమాన్ని నిలబెట్టలేకపోయినా, 2009లో అప్పటి గృహ మంత్రి చిదంబరం రచించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుకొని, ఇంతక ముందెన్నడూ లేనంతగా లక్షలాది మంది కేంద్ర పారామిలిటరీ బలగాల చుట్టుముట్టి, అంతం చేసే కేంపెయిన్‌ల వివిధ దశలలో పిఎల్‌జిఎ, జనతన సర్కార్‌లు గట్టి పోరాటం చేస్తూనే ఉన్నాయి. అతని నుండి వారసత్వాన్ని తీసుకొని, అంతకుముందు యిలాంటి అనేక గడువులు దాటిపోయినప్పటికీ, 2024కల్లా భారత్‌ను మావోయిస్టుల నుంచి విముక్తం చేస్తానని అమిత్ షా ప్రతిజ్ఞ చేశాడు.

ఆనంద్: తుపాకులు – కలాలు

జనతన సర్కార్‌లను ఏర్పరుచుకుంటూ తెలంగాణా, దండకారణ్యాలలో పీపుల్స్ వార్‌కు నాయకత్వం వహిస్తున్న సమయంలో ఆనంద్ క్రాంతి, ఎర్ర జెండా, పీపుల్స్ వార్, పీపుల్స్ మార్చ్ వంటి అజ్ఞాత పత్రికలకు సంపాదకత్వం వహించారు. 2008 నుంచి 2012 మధ్య ఆదిలాబాద్‌లోని భూసంబంధాలపై నిశితంగా విచారణ జరిపారు. వక్రీకరించబడిన పెట్టుబడిదారీ సంబంధాలు వున్నప్పటికీ, భారతదేశంలోని గ్రామీణ దృశ్యం అర్ధ భూస్వామ్య విధానం అనే సిపిఐ (మావోయిస్ట్) విశ్లేషణను అతని అన్వేషణ ధృవీకరించింది. ‘జనతన సర్కార్: దండకారణ్యలో మావోయిస్టుల ప్రయోగం’ అనే పాణి పుస్తకానికి ఆనంద్ వ్రాసిన పరిచయం, చరిత్రపై ఆయనకున్న లోతైన పరిజ్ఞానాన్ని, వైరుధ్యాల సంక్లిష్టతను అర్థం చేసుకోగలగడాన్ని, చైనాలోలాగా స్థావర ప్రాంతాలను ఏర్పరచుకోవడంలో ఎదురయ్యే తీవ్ర ఇబ్బందులను దాపరికం లేకుండా అంగీకరించడాన్ని చూపిస్తుంది. కానీ, భారతదేశంలో దీర్ఘకాల ప్రజాయుద్ధానికి సంబంధించి శ్రేయోభిలాషులు లేవనెత్తిన ఆందోళనలకు, అది అసంభవం కాదన్న అతని విశ్వాసం భరోసాని కూడా కలిగిస్తుంది.

ఆనంద్ విప్లవోద్యమాన్ని, ప్రజా సైన్యాన్ని నిర్మించాడు. కానీ ఆనంద్ గురించి అంతగా తెలియని వాస్తవం ఏమిటంటే, పులి ఆనంద్ మోహన్ అనే కలం పేరుతో, ‘వసంతగీతం’ నవల రాశాడు. ఈ నవల ఆదిలాబాద్‌లో ప్రారంభదశలో జరిగిన రైతాంగ తిరుగుబాటును వర్ణిస్తుంది. ఇటీవలి హుస్సేన్ నవల ‘తల్లులు-బిడ్డలు’ అమరుడు గజ్జెల గంగారాం తల్లి లచ్చవ్వ చుట్టూ కేంద్రీకృతమైన బెల్లంపల్లికి చెందిన విప్లవకారుల కథాంశం. బొగ్గు గని కార్మిక, రైతాంగ ఉద్యమాలూ, ఆదిలాబాద్‌ నుంచి వాటికి నాయకత్వం వహించిన కామ్రేడ్స్ గురించి చక్కని వివరణనిస్తుంది. ఈ నవల మనక గోర్కీ తల్లిని గుర్తు చేస్తుంది. విప్లవంలో ప్రజల పాత్ర గురించి ఆనంద్ మాట్లాడిన అరుదైన ఆడియోను ఇటీవల HMTV ఛానెల్ ప్రసారం చేసింది. ఆనంద్, విప్లవ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రజానీకం పాత్ర కున్న అపారమైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. విప్లవంలో మంత్రసానిగా పార్టీ పాత్రను గుర్తు చేశారు. ఆనంద్ ఇలా అన్నారు: “నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, సోషలిజాన్ని సాధించడానికి దీర్ఘకాలం పట్టినప్పటికీ, మేము విప్లవ మార్గంలో చాలా ముందుకి సాగాము. మనం కోరుకున్న మార్పుని మనకు కావలసినప్పుడు సాధించలేకపోవచ్చు. మధ్యలో అనేక అంశాలు వస్తాయి. విప్లవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలి. నిస్సందేహంగా ప్రజలు త్వరలో బలంగా ముందుకు వచ్చి విప్లవంలో పాల్గొంటారు. పార్టీ విప్లవానికి మంత్రసాని మాత్రమే. విప్లవానికి ప్రజలే నిజమైన వెన్నెముక.” ప్రముఖ రచయిత, విప్లవ రచయితల సంఘం సభ్యుడు అల్లం రాజయ్య “ప్రజలే నిజమైన చరిత్ర నిర్మాతలు అని ఆనంద్ యిచ్చిన క్లుప్తమైన వివరణను కొన్ని సృజనాత్మక నవలలుగా విస్తరించవచ్చు” అని అన్నారు.

రెండేళ్లుగా ఆనంద్ కేంద్ర కమిటీకి మీడియా ప్రతినిధిగా ఉన్నారు. సీపీఐ(మావోయిస్ట్) పార్టీ నుంచి మీడియాతో సంభాషించే సంస్కృతిని ప్రారంభించిన తొలి అగ్రనేత ఆనంద్ అని హిందూ కరస్పాండెంట్ రవిరెడ్డి ఇటీవల రాశారు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆనంద్ ఆరుగురు జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి సుప్రభాతంలో సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఆనంద్ చాలా మృదుస్వభావి అని, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, నక్సల్ ఉద్యమంపై అణచివేత గురించి ఆ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా చర్చించారని అన్నారు.

హిందూ ఆధిపత్య ఫాసిజాన్ని ఓడించడానికి ఐక్య పోరాటం అవసరం

చౌ ఎన్ లై లేకుండా ఐక్య సంఘటన గురించి ఆలోచించలేమని మావో ఒకసారి చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు, ఆనంద్, ఐక్య సంఘటన ఎత్తుగడలకు నేతృత్వం వహించడంలో, మార్గనిర్దేశం చేయడంలో నైపుణ్యాన్ని సాధించారు. హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశానికి వచ్చిన కొత్త విపత్తును ఎదుర్కోవడానికి ఆనంద్ విప్లవ శక్తులకు మార్గనిర్దేశం చేశాడు. విభిన్న వర్గాలు, సెక్షన్లు ఐక్య పోరాటం చేసేలా వేదికలను నిర్మించే ఆలోచనలను అభివృద్ధి చేశాడు.

ప్రభుత్వం అనేక సార్లు మరణించినట్లు ప్రకటించిన కొద్దిమంది సహచరులలో ఆనంద్ ఒకరు. మహారాష్ట్ర ప్రభుత్వం గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు 1997లో ప్రకటించినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 2003లో ఆదిలాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి, ఆనంద్ జీవన సహచరి సాధన అలియాస్ లలిత, ప్రభుత్వం చేసిన ప్రకటనల తర్వాత తమ కమిటీ కనీసం అరడజను సార్లు సంస్మరణ సమావేశాలను జరిపిందని ఒకసారి చెప్పారు. ఆనంద్ మరణాన్ని పాలక వర్గాలు ఎంత బలంగా కోరుకున్నాయో ఇది తెలియజేస్తుంది.

ఆనంద్ -భారత విప్లవంలో విడదీయరాని భాగం

సీపీఐ (మావోయిస్ట్‌) నాయకత్వం అగ్రవర్గ, అగ్రవర్ణాల నుంచి వచ్చిందని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్‌ వల్ల మరణించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్, అలియాస్ యాపా నారాయణ వంటి సహచరులు అణగారిన వర్గానికి చెందిన వారన్న వాస్తవాన్ని వారు సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారు. అప్పటి A.P. రాష్ట్ర కమిటీ కార్యదర్శి బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్ చాలా పేద కుటుంబానికి, అణగారిన కులానికి చెందినవాడు.

కామ్రేడ్ ఆనంద్ కార్మిక కుటుంబంలో జన్మించి, సీపీఐ (మావోయిస్ట్)లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మూలనా కార్యక్రమాలు లేకపోతే వేలాది మంది కామ్రేడ్‌లు అటువంటి స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మావో ఒకసారి ఒక ఘటన చెప్పాడు. లాంగ్ మార్చ్ సమయంలో, చాంగ్-కై-షేక్ ఆకాశం నుండి బాంబులు వేసినప్పుడు మావోకి గార్డులుగా వున్న ఇద్దరు చనిపోయారు. మావో తప్పించుకున్నాడు. ‘వారు త్యాగం చేయకపోతే నేను ఇక్కడ ఉండగలిగేవాడినా?’ అన్నాడు మావో. విప్లవ ఆచరణ (ప్రాక్సిస్) గతిశీలతను అర్థం చేసుకో, విప్లవ పార్టీలో నాయకత్వ నిర్మాణానికి సంబంధించిన అంశాలను అర్ధం చేసుకోవడం కష్టం.

భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవమూ, వినమ్రుడు, స్నేహశీలి నిరాడంబరుడైన విప్లవకారుడు, అపార అనుభవాన్ని మిగిల్చిన కామ్రేడ్ ఆనందూ ఉప్పు సముద్రంలా విడదీయరానివి. ఉద్యమం ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమిస్తూ అతనెగరేసిన ఎర్ర జెండా విప్లవాన్ని ఆవిష్కరించేలా చూస్తుంది.
“నిరంకుశులు, “మట్టి పాదాల రాక్షసులు” మట్టికొట్టుకుపోతారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం వంటి ప్రతిఘాతుకాలన్నింటినీ పాతిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు ముందుకు సాగుతాయి.

Leave a Reply