(ఈ వ్యాస రచయితల్లో ఒకరైన కోట ఆనంద్ ను ఏప్రిల్ 28 తెల్లవారుజామున 3.00 గంటలకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో పరిశోధన విద్యార్థి గా విద్యారంగ సమస్యలపై , సామాజిక సమస్యలపై వివిధ దిన, మాస పత్రికలలో రచనలు చేశారు. వసంత మేఘంలో కూడా ఆనంద్ వ్యాసాలు అచ్చయ్యాయి . అరెస్టుకు ముందు ఆయన ఆవుల నాగరాజుతో కలిసి ఈ వ్యాసం రాశారు )
దేశంలో నేడు విద్య ప్రవేటీకరణ, విద్య కాషాయీకరణ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయి. భాజపా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా ప్రవేటీకరణను తీవ్రం చేయడానికి పూనుకున్నది. రెండవసారి అధికారంలోకి వచ్చాక విద్యను బ్రాహ్మణీకరిస్తూ విద్యా కాషాయీకరణకు పాల్పడుతున్నది. విద్య రంగంలో హిందుత్వ ఎజెండా అమలు కోసం 2019లోనే నూతన విద్యా విధానం డ్రాఫ్టు తయారుచేసి విడుదల చేశారు. అందుకు నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసు వేదికంది. ఇక 2020 సెప్టెంబర్ లో నూతన విద్యా విధానాన్ని ఆమోదించిన వెంటనే 2020-2021, 2021- 22 విద్య సంవత్సరాలలో అనేక యూనివర్సిటీలలో కొత్త విద్య విధానం అమలులో భాగంగా భారతీయ సంస్కృతి పేరుతో విద్య కాషాయీకరణకు పూనుకుంటూ విద్యార్థులు చదివే పాఠ్యాంశాలలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మహా భారతం, భాగవతం, రామాయణం వంటి అశాస్త్రీయమైన పురాణాలను సిలబస్ లో చేర్చారు. ప్రపంచమే నివ్వెరపోయేలా ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) లో ‘భూతవైద్యం’ (పారా నార్మల్ సైన్స్ అని పేరు) పై ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిచారు. 2022-23 విద్య సంవత్సరంలో పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్య వరకు పాఠ్యపుస్తకాలలోని అనేక చరిత్ర సైన్సు పాఠ్యాంశాలను ఎత్తివేశారు . 2023 ఎప్రిల్ లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంస్థ కరోనా సంక్షోభంను సాకుగా చెప్తూ ,హేతుబద్ధీకరణ పేరుతో 9 , 10 తరగతుల సైన్స్ పాఠ్యపుస్తకాల నుండి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. డార్విన్ జీవ పరిణామ సిద్దాంతం శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ప్రపంచ దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరమైనది. స్వతంత్ర సంస్థగా వుంటూ పాఠశాల విద్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వాల్సిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంస్థ నేడు ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల ప్రచురణ సంస్థగా మారింది. 11, 12 తరగతి సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం పాఠ్యాంశాలలో నుంచి మహాత్మా గాంధీ హత్య, హిందూ ముస్లిం ఐక్యత, గుజరాత్ అల్లర్లు వాటి పరిణామాలు, ఎమర్జెన్సీ పాఠాన్ని, 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తొలగించడం, కర్నాటక భాజపా సర్కారు ఏడో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ పాఠాన్ని తొలగించడం, జాతియోద్యమకారుల చరిత్రను మాయం చేయడం ఇండియా విద్యావ్యవస్థ పై దాడిగా భావించాలి.
సంఘ్ పరివార్ చేసిన అత్యంత హేయమైన చర్య డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని విద్యార్థుల పాఠ్యపుస్తకాల నుండి తొలగించడం. డార్విన్ నిరూపించిన జీవ పరిణామ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ చెబుతున్న ప్రకృతి సృష్టికి మూలం ఎక్కడో కంటికి కనిపించని అభౌతికమైన బ్రహ్మ అనే భావవాద ధోరణిని ప్రశ్నిస్తూ దానినిచావుదెబ్బ కొడుతోంది. ఈ పాఠాన్ని చదివిన విద్యార్థులు ఆర్ఎస్ఎస్ మనువాదులను ఇక ఏమాత్రం నమ్మబోరని భావించి తమ చెప్పు చేతల్లో ఉన్న ఎన్సీఈఆర్టీ సంస్థను నడిపించే కొంతమంది వ్యక్తుల ద్వారా సిలబస్ నుంచి దీన్ని తొలగించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన హేతువాదులు డాక్టర్ దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గి, గౌరీ లంకేష్ లను హత్యచేసిన వారు వారి ప్రశ్నకు కారణమైన సైన్స్ నే చదవకుండా నిరోధించాలని చూస్తున్నారు. మానవాళి ఆవిర్భావం నుండి భావవాదం, భౌతికవాదం అనే రెండు శిబిరాల మద్య భావజాల ఘర్షణ తత్వశాస్రంలో కొనసాగుతున్నది. గ్రీకు తత్వవేత్తలైన థేల్స్, అనగ్సిమెనీస్, అనాగ్సిమెండర్ ఈ ప్రకృతి ఆవిర్భావానికి నీరు, గాలి, అనంతద్రవ్యం అనే హేతువులు కారణమని చర్చను తెరలేపగా అనంతరం వీరి కొనసాగింపుగా హెరక్లిటస్, సోక్రటీసు, అరిస్టాటిల్, ప్రోటాగొరస్ అనంతరం హేతువాదులుగా రెనె డెకార్టె ఆధునిక యుగంలో హెగెల్, ప్యూయర్ బా, కార్ల్ మార్క్స్ లు కొనసాగించగా భావవాద శిబిరంలో జార్ట్ బర్క్ లీ, డేవిడ్ హ్యూమ్ లు ఉన్నారు. ఇండియాలో ఈ చర్చ వైదిక దర్శనాలు అవైదిక దర్శనాల నడుమ సాగింది. వేద ప్రమాణాన్ని అంగీకరించే న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, పూర్వ మీమాంసా దర్శనం , ఉత్తరమీమాంసా దర్శనం (వేదాంతదర్శనం) వేద ప్రామాణ్యాన్ని నిరాకరించే లోకాయుత (చార్వాక)దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనాల మధ్యన జరిగాయి. న్యాయ, సాంఖ్య దర్శనాలను అనుకరించే వారు దైవాన్ని నిరాకరించినప్పటికీ అంతిమంగా దైవ భావనకు లోనయ్యారు. అసలు దేవుడే లేడని ప్రారంభమైన చార్వాకులు, బౌద్ధులు జైనులు చివరిదాకా ఆ భావనపై నిలబడలేకపోయారు. ప్రకృతికి మూల కారణం అన్వేషిస్తున్న తత్వవేత్తలకు టాలమి భూ కేంద్రక సిద్దాంతం, నికోలస్ కొపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం, డార్విన్ జీవ పరిణామ సిద్దాంతం వెలుగుని చూపించాయి. న్యూట్రన్, ఎలక్ట్రాన్, ప్రొటాన్ లను గుర్తించడంతో ప్రకృతి ఆవిర్భావం విషయంలో భావ వాదానికి ప్రపంచవ్యాప్తంగా కాలం చెల్లింది. ఈ క్రమంలో బ్రూనో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ క్రైస్తవుల చేత హత్య కు గురయ్యాడు.
నేడు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కొంతమంది భావవాదులు వారి అధిపత్యాన్ని, రాజకీయ అధికారాన్ని, దోపిడీని నిలబెట్టుకోవడం కోసం ప్రజలను దైవం అనే మత్తులో ఉంచుతున్నారు. ఇండియాలో ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో ఈ చర్యలు జరుగుతున్నవి. ఈ చర్యల అసలు ఉద్యేశ్యం మెజారిటీ బహుజన ప్రజలను అంద విశ్వాసాల వైపు నడిపిస్తూ,అజ్ఞానులుగా, అసమర్ధకులుగా దిగజార్చడం, 2024 ఎన్నికల్లో మనువాద పాలనను మళ్లీ నిలబెట్టుకొని వారి డాక్యుమెంట్ లో రాసుకున్న విధంగా అఖండ భారత్-హిందూ రాష్ట్ర నిర్మాణం చేసుకోవలనే ఆర్ఎస్ఎస్ – భాజపా కుట్రలో భాగంగానే విద్యా వ్యవస్థ పై దాడి చేస్తున్నారు. దేశమంతా విద్యార్థులు యువకులు, ఈ చరిత్ర పాఠశాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, ప్రజా మేధావులు, చరిత్రకారులతో అసలు చరిత్రను బయట పెడుతూ సదస్సులు జరపాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంలో నెలకొన్నది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో సంఘ్ పరివార్ కు చెందిన వారే యుజిసి చైర్మన్లుగా,సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతులుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లూగా, ఎన్సీఈఆర్టీ వంటి స్వాతంత్ర విద్యాసంస్థల డైరెక్టర్లుగా నియామకమయ్యారు. నూతన విద్య విధానం ముసాయిదా కమిటీ చైర్మన్, మెజారిటీ సభ్యులు సంఘ్ పరివార్ కు చెందిన వారే. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్య కాషాయకరణ రాజ్యమేలుతున్న సందర్భంలో ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేస్తూ ఎన్సీఈఆర్టీ తొలగించిన చరిత్రను, జాతీయ ఉద్యమకారుల చరిత్రను పునరుద్ధరించాలని సమాన, శాస్త్రీయ విద్యా విధానం కోసం మొత్తంగా సైన్స్ ను కాపాడుకోవడం కోసం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని సొంతం చేసుకొని చర్చను లేవనెత్తుదాం.
26-04-2023.