ప‌ద్మ‌కుమారి

(అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌)

కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.

                కుటుంబ వ్యవస్థలో నాది అనే భావన ఉంటుంది. నా అనుకున్నవాళ్లను కోల్పోయినప్పుడు ఎంత అగాథంలోకి కూరుకపోయేది మనందరికీ తెలుసు.  కానీ వ్యక్తిగతం ఏమీ లేని విప్లవోద్యమ నాయకుడైన ఆర్‌కేలాంటి వాళ్లకు ఇది ఒక సామూహిక విషాదం. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో లోలోపలి దుఃఖాన్ని   వర్గ కసిగా మార్చుకొని రాటుదేలిన వ్యక్తులు కదా వాళ్లు. అనేక మంది  అమరుల ఆశయాలను భుజానికి ఎత్తుకొన్న    నికార్సయిన విప్లవకారుడిగా  నిలిచాడని చాలా మంది చెప్పగా విన్నాను.

                దేనికంటే ఆయన మామూలు తండ్రి కాదు. విప్లవకారుడు,   వందలాది మంది కామ్రేడ్స్‌ మరణాన్ని చూశాడు.  ఎందరో తల్లుల, తండ్రుల కన్నీటి వెచ్చదనాన్ని స్పృశించాడు.   ఇప్పుడాయన బిడ్డను కోల్పోయిన తండ్రి కూడా.

                నేను అమరుల బంధుమిత్రుల సంఘంలోకి వచ్చాక పిల్లలను కోల్పోయిన ఎందరో తండ్రుల దు:ఖాన్ని చూశాను. వాళ్లలో ఏమీ తెలియని వాళ్లు ఉన్నారు. చదువు లేకపోయినా విప్లవం గురించి తెలిసిన వాళ్లు ఉన్నారు. బాగా చదువుకొని అవగాహన చేసుకోగలిగిన వాళ్లు కూడా ఉన్నారు. ఇన్ని తేడాలు ఉన్నా వాళ్లందరి దు:ఖం ఇక్కటే. 

          వాళ్లకంటే భిన్నంగా ఆర్‌కే విప్లవోద్యమ నాయకుడు. మున్నా ఆయనకు ఎప్పుడు ఎలా గుర్తుకొస్తుంటాడు? అని ఆ తర్వాత కూడా ఆర్‌కే గురించి ఆలోచించేదాన్ని.

                2004లో  శాంతి చర్చల వాతావరణం ఏర్పడగానే పల్నాడులో ప్రజల కోరిక మేరకు అమరుల బంధుమిత్రుల సంఘం గుత్తికొండ బిలంలో ఒక స్థూలం కట్టాలని అనుకుంది.  గుంటూరు జిల్లా అమర వీరుల స్మృతి చిహ్నంగా అది ఉండాలని పని మొదలు పెట్టాం.  స్థానిక ప్రజలు  గ్రామ పంచాయతీ నుంచి  ఏబీఎంఎస్‌ వ్యవస్థాపక నాయకులు కా. నరసన్న, కా. ఉప్పు కృష్ణ పేర్లతో ఆ స్థలం రిజిస్టర్‌ చేయించారు.  అయితే   అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా నాయకురాలు  కా. చందన  పార్టీ తరపున ఆ స్తూపాన్ని ఆవిష్కరించి మీటింగ్‌ పెట్టాలనుకున్నట్లు  ప్రజలు  కా. నరసన్నకు తెలియజేశారు. ఈ విషయం  అమరుల బంధుమిత్రుల సంఘంలో చర్చించుకున్నాం.  కుటుంబాల రక్త సంబంధీకులు ఏ ఉద్యమంలో   అమరులు అయ్యారో ఆ ఉద్యమమే స్థూపాన్ని ఆవిష్కరించాలనుకుంటే అంతకంటే కావాల్సిందేమిటి? అనుకున్నాం. మా ఆమోదాన్ని తెలిపాం. ఈలోగా  చర్చల పనులు ముమ్మరమయ్యాయి.  శాంతి చర్చలకు బైటికి వచ్చిన విప్లవ పార్టీల నాయకులే గుత్తికొండ స్థూప ఆవిష్కరణ సభకు హాజరవుతారని తెలిసి మేం గర్వపడ్డాం.   వాళ్లు సభ నిర్వహించడం చాలా బాగుంటుందని అనుకొని  మా అంగీకరాన్ని తెలిపాం.

                  స్థూపం పనులు మేం పూర్తి చేశాక సభ ఏర్పాట్లు అన్నీ  పార్టీ వాళ్లే చూసుకున్నారు.   ఆర్‌కే గురించి మళ్లీ ఆట్లా మొదటిసారి విన్నాను. శాంతి చర్చలకు వచ్చినప్పుడు చూశాను. ఆరోజు ఆయన చాలా ఉత్తేజంగా ప్రసంగించాడు. దేశాన్ని విముక్తి చేయడానికి పోరాడుతున్న విప్లవపార్టీకి నాయకుడిగా ఆయన ప్రజలను ఉద్దేశించి  అద్భుతంగా మాట్లాడాడు. ‘జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం… మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..’ అని ఆయన అన్నాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇప్పటికీ   ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది.  ఈ కాలపు మావోయిస్టు జీవన సందేశంలా దాన్ని ఆయన ప్రజలకు అందించి వెళ్లిపోయాడు.

                శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఆ పది రోజులు ఆయన ప్రభుత్వంతో, వివిధ సెక్షన్ల ప్రజలతో మాట్లాడాడు. విప్లవకారులపట్ల ప్రజల్లో ఉండే అభిమానం, విప్లవోద్యమం ముందుకు పోవాలనే కోరిక వెల్లడి అయింది. ఆయన విప్లవానికి సింబల్‌గా నిలిచాడు.

                  అనేక ఎన్‌కౌంటర్లలో ఆయన మరణించాడనే వార్తలు వచ్చేవి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా అక్కడ ఆర్‌కే ఉన్నాడనే వార్తలు వచ్చేవి. మృతదేహాల స్వాధీనానికి  మేం బయలుదేరినప్పటి నుంచి ఆర్‌కే గురించిన నిర్ధారణ కోసం పత్రికల వాళ్లు మాకు ఫోన్లు చేసేవాళ్లు. రాంగూడా ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఆయన కూడా ఉన్నాడనే వదంతలు వచ్చాయి. ఆ తర్వాత గాయపడి తప్పించుకున్నాడనే వార్త వచ్చింది.

                అనేక యుద్ధాలలో ఆరితేరి, ప్రమాదాలను తప్పించుకొని, చివరికి ఆయన అనారోగ్యంతో అమరుడయ్యాడు. విప్లవోద్యమ నాయకుడిగా ఆయన సమాజం మీద చాలా ప్రభావం వేశాడు. శాంతి చర్చల ప్రతినిధిగా ఆయన వేసిన ప్రభావం కూడా అందులో భాగమే. ఆయన భౌతిక కాయాన్ని కూడా బైటి విప్లవాభిమానులు, ప్రజలు, కుటుంబసభ్యులు చూడలేకపోయారు.

                అయితే ఆయన మరణవార్త తెలిసినప్పటి నుంచి సమాజం నుంచి చాలా ప్రతిస్పందన వచ్చింది. టీవీలు, పత్రికలు వారం రోజులపాటు ఆయన గురించి రాశాయి. ఆ తర్వాత కూడా వ్యాసాలు అచ్చయ్యాయి. సోషల్‌ మీడియాలో ఇప్పటికీ ఆయన గురించి కవిత్వం, నివాళి వ్యాసాలు వస్తున్నాయి. ఆయన జ్ఞాపకంగా వీటన్నిటినీ ఒక పుస్తకం వేయాలని అమరుల బంధుమిత్రుల సంఘం అనుకుంది. మేం అనుకున్నప్పుడు ఇన్ని రచనలు ఉన్నాయని అనుకోలేదు. మా శక్తికి మించిన పుస్తకం అయిపోయింది. ఇప్పటికీ మేం పత్రికల్లో, ఫేస్‌బుక్‌లో వచ్చిన రచనలన్నీ సేకరించామని అనుకోవడం లేదు.   మాకు అందుబాటులో ఉన్నవి మాత్రమే ఈ పుస్తకంలోకి తీసుకొచ్చాం.

                అట్లాగే ఆర్‌కే అమరుడయ్యాక ఆయన రచనలు, ఇంటర్య్వూలు సోషల్‌ మీడియాలో, అంతర్జాల పత్రికల్లో, దిన పత్రికల్లో వెలుగులోకి వచ్చాయి. ఆర్‌కే నివాళి రచనలు ఉన్న ఈ పుస్తకంలోనే ఆయన రచనలు కూడా అచ్చువేస్తే పాఠకులకు బాగుంటుందని అనిపించింది.  శాంతి చర్చల రోజుల్లో ప్రధాన దిన పత్రికల్లోనే ఆయన రాసిన కొన్ని వ్యాసాలు మాకు దొరకలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో పౌరస్పందన వేదిక నాయకులు చర్చల ప్రయత్నం చేసినప్పుడే ఆర్‌కే వార్త  దినపత్రికలో రాసిన  వ్యాసం దొరికింది. వైఎస్‌ హయాంలో శాంతి చర్చలు జరిగినప్పుడు తమ పార్టీ  చర్చలను  ఎలా చూస్తున్నదీ   2004లో    రెండు, మూడు వ్యాసాలు రాశాడు. ఇవేవీ మాకు దొరకలేదు. ఈ ‘సాయుధ శాంతి స్వప్నం’ పుస్తకంలో తప్పక ఉండవలసిన రచనలు అవి. అవే మేం సంపాదించలేకపోయాం. అయితే ఆ రోజుల్లో ఆయన శాంతి చర్చల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలు, కొన్ని వ్యాసాలు ఆ లోటును చాలా వరకు పూడ్చుతాయని అనుకుంటున్నాం. 

                 అమరవీరుల త్యాగాలను, ఆశయాలను అమరుల బంధుమిత్రుల సంఘం గౌరవిస్తుంది. మా కుటుంబాల నుంచి విప్లవంలోకి వెళ్లి, అమరులు కావడం వల్ల వ్యక్తిగతంగా మాకు తీరని వెలితి, దు:ఖమే అయినా వాళ్లు ప్రజల్లో భాగం అయ్యారు. పోరాట చరిత్రను నిర్మించారు. వారి  అజ్ఞాత జీవితంలో ఎలాంటి పోరాటాలు నిర్మించారో మాకు తెలియదు. వాళ్ల గురించి ఈ సమాజం ఏమనుకుంటోందో మాకు తెలుసు. అమరులైన మా రక్తసంబంధీకులను మేం ప్రజల స్పందనల నుంచి, మేధావుల అభిప్రాయాల నుంచే తెలుసుకుంటూ ఉంటాం.  ఆర్‌కే గురించి కూడా అంతే. అందుకే ఆయన మీద వచ్చిన ఈ రచనలను, ఆయన రాసిన వ్యాసాలను ఆయన జ్ఞాపకంగా మేం పదిలపరుచుకోవాలనుకున్నాం. అందుకే ఈ పుస్తకం ప్రచురిస్తున్నాం. అందరూ చదవండి. మాలాగే మీరూ ఆర్‌కే జీవితాన్ని, ఆయన నిర్మించిన విప్లవోద్యమాన్ని తెలుసుకోండి.

               

        

             

One thought on “మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

  1. ✊✊
    మా సత్యం
    కామ్రేడ్ పద్మ కుమార్ రాసిన
    “మ‌న‌ కాలపు మావోయిస్టు జీవన సందేశం” వ్యాస స్ఫూర్తితో ఆశయసాధనకు మును ముందుకు పోదాము
    ” జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసం
    జీవిస్తాం
    మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసం మరణిస్తాం”
    —-RK
    Long live Indian revolution
    Long live long live

Leave a Reply