త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు. ఓటుకు నోటు కాలం వచ్చాక ముఖ్యంగా మునుగోడు ఎన్నికల తర్వాత ఓటువేసిన ప్రజలకు కూడ ఎన్నికలపట్ల ఎంత భ్రమారహిత వైఖరి ఉన్నదో స్పష్టం చేసింది.


ఎవరు ఎన్నికలు బహిష్కరించినా బహిష్కరించకున్నా మావోయిస్టులు అంటే పార్టీశ్రేణులు, మిలీషియాతో, మిలిటెంటు సానుభూతిపరులతో సహా ఎన్నికలకు దూరంగానే ఉంటారు. అన్ని ఎన్నికలపార్టీలను సమదూరంగానే చూస్తారు. ఏమైనా ఎన్నికలు మావోయిస్టురహితంగానే జరుగుతాయి. బిజెపి కాంగ్రెస్ రహిత భారత లక్ష్యంతోనే ఎన్నికల్లో దిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి మొదట కాంగ్రెస్ రహిత, ఇపుడు బిజెపి కాంగ్రెస్రహిత తెలంగాణ అంటున్నాడు గానీ ఆచరణలో కాంగ్రెస్రహిత ఎన్నికలకోసం బిజెపికి బి టీమ్గా పనిచేస్తున్నాడనే చాలమంది భావిస్తున్నారు. కనుక పాలకవర్గపార్టీల్లో కూడ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పాలకవర్గపార్టీని ప్రతిపక్షంలో ఉండడానికి కూడ అనుమతించని ఒకేపార్టీని నియంతృత్వ పార్లమెంటు ప్రజాస్వామ్యం మావోయిస్టుపార్టీ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక రాజకీయాలను అనుమతిస్తుందనే భ్రమ ప్రజలకు కూడ లేదు. అయితే మావోయిస్టు రహిత ఎన్నికలు అనే వ్యూహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అమిత్షా ప్రకటన చదువగానే నాకు ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికలు గుర్తుకొచ్చాయి.


2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్సభకు ఎన్నికలు (భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు పోలింగ్) జరిగినపుడు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆ ఎన్నికలలో మహబూబ్నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న ఇరవైఐదువేల మంది చెంచులను ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించలేదు.

ఈ ప్రాంతం నల్లమల మావోయిస్టు విప్లవకేంద్రంగా అప్పటికి రెండుదశాబ్దాలుగా బలమైన పోరాట ప్రాంతంగా ఉన్నది. అటు గుంటూరుజిల్లా నుంచి ఇటు మహబూబ్నగర్ జిల్లా నుంచి దక్షిణఆంధ్ర, దక్షిణ తెలంగాణలకు విప్లవోద్యమ వీరగడ్డగా ఉన్నది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో రెండు విప్లవపార్టీలు చర్చలకు ఈ నల్లమలలోని చినఆరుట్ల నుంచే బయల్దేరి వచ్చాయి. చినఆరుట్ల శ్రీశైలంకు దగ్గరగా కర్నూలు జిల్లాలో ఉన్న అటవీగ్రామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీకి కార్యదర్శిగా, మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా ఉన్న రామకృష్ణ నాయకత్వంలోనే ఉత్తర తెలంగాణ, ఎఒబి కమిటీల నాయకత్వం ఈ చర్చల్లో పాల్గొన్నది. అప్పటికే నల్ల్లమల ఆర్కెకు, మావోయిస్టుపార్టీలోని చిన్నయ్య, శాకమూరి అప్పారావు, సుధాకర్రెడ్డి వంటి ఎందరో విప్లవ వీరులకు కార్యక్షేత్రంగా కూడ ఉన్నది.


అంతకన్నా ముఖ్యం చెంచులు ఆదివాసుల్లో కూడ అత్యంత ఆదిమజాతి. సుప్రసిద్ధ మానవశాస్త్రవేత్త హేమన్డార్ఫ్ ఆదిలాబాదు జిల్లా లోని గోండుల గురించే కాకుండా నల్లమల చెంచుల గురించి (ముఖ్యంగా నైజాం పాలనలోని మహబూబ్నగర్ జిల్లాలోని చెంచుల గురించి అధ్యయనం చేసాడు. అప్పటినుంచి ఇప్పటివరకు మానవశాస్త్ర అధ్యయనం చేస్తున్న పరిశోధకులందరూ ఇది క్రమంగా అంతరించిపోతున్న జాతి అని దీనిని కాపాడుకోవడం మానవసమాజ, ముఖ్యంగా తెలుగుసమాజ బాధ్యత అని చెప్తున్నారు. వీళ్లింకా వ్యవసాయపూర్వ ఉత్పత్తివిధానం లోనే ఉంటూ తొండలను, అటువంటి జీవరాశులను వేటాడుతూ, చెట్లబంక తీసి సంతలలో అమ్ముకుంటూ, ఒకరకంగా ఆహారసేకరణ దశలో ఉండేవాళ్లు. చర్చల కాలానికి (2004) అటువంటి చెంచులు మావోయిస్టుపార్టీ నాయకత్వంలో కాలువలమీద ఆనకట్టలు నిర్మించుకొని, కుంటలు, చెరువులు తవ్వుకొని వ్యవసాయం చేసే స్థితికి, గాడిదలు, మేకలు పోషించి గాడిదలను ఆహారసామాగ్రి వంటి వస్తువుల రవాణాకు వినియోగించే దశకు వచ్చారు. మహబూబ్నగర్ జిల్లానుంచి నల్లమలలో ప్రవేశించే గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించిన క్వార్టర్స్లోకి వెళ్లడానికి నిరాకరించి వాళ్లు తమ మధ్యన విప్లవకారులకు ఆశ్రయమిస్తూ వ్యవసాయజీవితంలో ప్రవేశిస్తున్న స్థితిలో చర్చలు ముగిసి 2005 జనవరిఆగస్టు నెలల మధ్య నల్లమలలో రాజ్యహింస, దౌర్జన్యాలతో నెత్తురు పారింది. రాష్ట్రమంతటా రాజ్యహింస ప్రతిఘటన తీవ్రమయిన స్థితిలో మావోయిస్టు దళాలతో సహా నాయకత్వమంతా ఎఒబికి, ఉత్తరతెలంగాణకు వ్యూహాత్మకంగానే వెళ్లిపోయింది. ఈ పార్టీ, ప్రజాసంఘాలు, విరసం కూడ 2005 ఆగస్టు 17న నిషేధింపబడ్డాయి. కోవర్టు హత్యలు మొదలయ్యాయి. ఆ చరిత్ర అంతా రాయడానికి కాదు గానీ అటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగితే చెంచులు కాంగ్రెస్కు ఓటువేయరని వాళ్లను ఓటింగ్కు అనుమతించలేదు.
చర్చలకాలంలో ప్రతినిధులుగా ఉన్నవారు హోంమంత్రి దృష్టికి తెచ్చినా రాష్ట్ర జనాభాలో 25000 మంది ఏ మూలకండి అంతమాత్రాన ప్రజాస్వామ్యానికి ప్రమాదం లేదన్నాడు. నల్లమల అడవిలోని ఖనిజాల కోసం, ముఖ్యంగా యురేనియం, వజ్రాలు వంటి విలువయిన ఖనిజాలకోసం ఆ అడవిని బహుళజాతి కంపెనీలకు ఇవ్వజూపిన కుట్రను మావోయిస్టుపార్టీ దళాలను కూడ ఉపసంహరించుకొని ముఖ్యంగా దండకారణ్యానికి సరిహద్దు జిల్లాలైన ఉత్తరతెలంగాణ జిల్లాలలో విప్లవపార్టీ కార్యకలాపాలు కనిపించని స్థితి వచ్చాక హైదరాబాదు నగరానికి దగ్గరలో ఉన్న పోలేపల్లిలో అరవింద్ ఫార్మాసుటికల్స్ సెజ్ మొదలు ఇపుడు అదే జిల్లాలో మక్తల్ దగ్గర చిత్తనూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీల వరకు పెట్టే దుస్సాహసాలు ప్రభుత్వాలు చేయగలుగుతున్నవి. కామారెడ్డి, జగిత్యాల వంటి చోట్ల రోడ్ వైడెనింగ్ పేరుతో గ్రామాలలో భూముల్ని, రైతుల వ్యవసాయభూముల్ని ఆక్రమించుకోకుండా అడ్డుకున్న ప్రతిఘటనలు చాల తక్కువే కనిపిస్తాయి. నక్సలైట్లకు ఆశ్రయమిస్తున్నారనే నెపంతో ఆదివాసులమీద దాడులు జరిగిన సందర్భాల్లో తెలుగు సమాజంలో ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు హక్కులసంఘాల నాయకత్వం లోనూ, విడిగానూ స్పందించిన సందర్బాలు చాలనే ఉన్నాయి. 1985లో గుత్తికోయలు నక్సలైట్లకు ఆశ్రయమిస్తున్నారని ఎన్టీఆర్ ప్రభుత్వం చింతపెల్లి అడవుల్లో గుత్తికోయల ఆరువందల గుడిసెలు తగులబెట్టినపుడు ఎపిసిఎల్సి, ఇండియన్ పీపుల్స్ ట్రిబ్యునల్ వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఆ దౌర్జన్యాన్ని ప్రజలదృష్టికి తెచ్చాయి. కెసిఆర్ ప్రభుత్వం ఏటూరునాగారం అడవుల్లో గుత్తికోయ మహిళను చెట్టుకు కట్టి హింసించిన దగ్గర్నించి ఇటీవల పోడుభూములను అటవీశాఖ ఆక్రమించుకునే క్రమంలో జరుగుతున్న ప్రతిఘటనలో ఒక అటవీ అధికారి హత్య జరిగేదాకా సంఘటనల్లో గుత్తికోయలను అడవినుంచి విస్థాపితులను చేయాలని చేస్తున్న వ్యూహాలు మనకు తెలిసినవే. ఎన్టీఆర్ నక్సలైట్లకు జోహార్లు అని అధికారానికి వచ్చిన వాడే. నక్సలైట్లు తనతో చేతులు కలిపితే ఎర్రకోటపై ఎర్రజెండా నెగురవేస్తానన్నవాడే. ఆ తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో అమలయినటువంటి రాజ్యహింసను అమలుచేసాడు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలుగా పిలవబడే అడవుల్లో సెటిలర్ల ప్రయోజనాల కోసం శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన 1 / 70 చట్టాన్ని కూడ రద్దుచేయాలని చూసాడు. చంద్రబాబునాయుడయితే చింతపెల్లి అడవుల్లో గ్రానైట్ తవ్వకాలకు దుబాయి కంపెనీకి అనుమతి ఇవ్వడానికి కొన్ని అటవీచట్టాలు రాజ్యాంగంలో షెడ్యూల్ట్ ట్రైబ్స్కు ఉన్న సంరక్షణ ఆర్టికల్స్ను తొలగించడానికి రాజ్యాంగాన్ని సవరించడానికే మధ్యభారతం సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, న్యాయనిపుణులను కూడ సంప్రదించాడు. ఈ గ్రానైటుతవ్వకాలను అడ్డుకునే క్రమంలో భల్లగూడలో ఆదివాసీ మహిళలపై సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన అత్యాచారాలు ఆ మహళల ప్రతిఘటన ఎంత దేశవ్యాప్త సంచలనమైందో మనకు తెలుసు. ఎన్టీఆర్ ఆకర్షణలోనే రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశంపార్టీ నుంచి బయటికి వచ్చి తెలంగా రాష్ట్రసమితి నెలకొల్పిన కెసిఆర్ తాను మావోయిస్టు అజెండానే అమలుచేస్తానని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని అడ్డుకుంటానని భద్రాచలంలో వేలాదిమంది ఆదివాసుల సభలో ప్రకటించాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమయితే అక్కడ నీళ్లు పారవు రక్తం పారుతుందని హెచ్చరించాడు. కాని అధికారానికి వచ్చి ఈ తొమ్మిదేళ్లలో తన చేతికి నెత్తురంటకుండా వివేక్, శృతి, సాగర్లతో ప్రారంభించి మావోయిస్టు ఉద్యమాన్ని ఎన్కౌంటర్ల ద్వారా తాత్కాలిక సెట్బ్యాక్కు గురిచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డుపడక పోవడమే కాకుండా అదే గోదావరి నది పై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంచేసి ఇరవైమూడు గ్రామాల్లో ఆదివాసులను నిర్మాసితులను చేసాడు. ఆదిలాబాదుజిల్లాలో ముఖ్యంగా, తెలంగాణ అంతటా కూడ లంబాడా సంచార జాతులకు, గోండులకు మధ్య చిచ్చుపెట్టి వర్గీకరణ ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివేసి బిజెపి ఆదివాసీ ప్రాంతాల్లో బలపడడానికి బాటలు వేసాడు. విహంగ వీక్షణంగానయినా ఈ చరిత్రనంతా మావోయిస్టు రహిత దేశమంటే, ఆదివాసీరహిత దేశమనే సారాంశంలో అర్థమని చెప్పడానికే తెలుగునేలమీద కొన్ని మైలురాళ్ల వంటి ఉద్యమాలు, సంఘటనలు, అందులో ఆదివాసీ పోరాటలాలకు ప్రజాస్వామిక స్పందనకు సంబంధించిన సందర్భాలు పేర్కొన్నాను. ఈ సందర్బాలన్నీ కూడ ఆదివాసీల ఉనికి, జీవనవిధానం కోసం నిర్వాసితత్వాన్ని ప్రతిఘటించిన సందర్భాలు. వాటిని స్థూలంగా సాంఘిక, ఆర్థిక, ప్రజాస్వామిక పోరాటాలుగా పేర్కొనవచ్చును. అవి భూపోరాటాలు కూడ. అయితే నలభైఏళ్లుగా బస్తర్లో జరుగుతున్న ఆదివాసీ పోరాటం మాత్రం అక్కడితో ఆగకుండా గత ఇరవై సంవత్సరాలుగా అమిత్షా చెప్తున్న ఎన్నికల ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నమైన ప్రజాప్రత్యామ్నాయ రాజకీయపోరాటం. ఆ పోరాటాన్ని కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా, ఛత్తీస్గఢ్లో ఏ ప్రభుత్వమున్నా వివిధ, అభియాన్ల ద్వారా అణచివేస్తూనే ఉన్నది. మొదటినుంచి కూడ ఈ రాజ్యహింసకు, అణచివేతకు కేంద్ర అర్థసైనిక బలగాలమీదనే ఆధారపడుతున్నది ఒకవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా తూర్పు, మధ్య భారతాల్లో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిరది. 2008లో మన్మోహన్సింగ్ ప్రధాని అయ్యాక 2009లో ఆదివాసుల మధ్య మావోయిస్టులు నీటిలో చేపల్లా మసులుకుంటున్న తీరును దేశానికి అత్యంత ప్రధానమైన ప్రమాదంగా బాహాటంగా ప్రకటించి గ్రీన్హంట్ ఆపరేషన్ పేరుతో ప్రత్యక్షయుద్ధానికే దిగాడు. ఇది అంతర్యుద్ధంగా ప్రకటిస్తే జెనీవా ఒప్పందాల వంటి అంతర్జాతీయ న్యాయసూత్రాలు అడ్డువస్తాయి గనుక ప్రకటించడంలేదు. ఆదివాసీ సమాజాన్నే చీల్చాలని అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ను మహేంద్రకర్మ చేసిన సాల్వాజుడుం ప్రయోగం కూడ ఆదివాసీ ప్రతిఘటనతోనూ, సుప్రీంకోర్టు తీర్పుతోనూ విఫలమైంది. అయితే వెంటనే అది ఎస్పిఒ అవతారమెత్తి ఇవ్వాళ డిఆర్జి అవతారమెత్తి (డిస్ట్రిక్ఞ్ రిజర్వు ఫోర్స్) సిఆర్పిఎఫ్తో పాటు కార్పోరేట్ కంపెనీల చొరబాటును అడ్డుకుంటున్న ఆదివాసులపై దాడులు చేస్తున్నది. ఇటీవలి ఈ చరిత్రంతా మనముందున్నది. తెలుగుసమాజం గ్రీన్హంట్ ఆపరేషన్ను కూడ కేవలం అది దండకారణ్యం మీద మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని మైదానప్రాంతాల ప్రజలపై జరుగుతున్న దాడిగానే భావించి ప్రతిఘటింటింది. ఇపుడీ యుద్ధం కీలకదశకు వచ్చింది. సిలింగేర్లో దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న పోలీసుక్యాంపుల వ్యతిరేకపోరాటం రోడ్డునిర్మాణాలను అడ్డుకోవడం, పోలీసుక్యాంపుల ఏర్పాటును అడ్డుకోవడం అంటే అవి అడ్డుకోవడమనే ప్రతికూల పోరాటాలు కాదు. కార్పోరేటు కంపెనీలు మధ్యభారతంలో ప్రకృతిసంపద దోచుకొని పోకుండా కాపాడుకోవడమనే
ఒక అనుకూల జీవనవిధానంగా ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయ ప్రతిపాదన చేస్తున్నారు. అది ఇపుడు హన్స్దా అడవులకు, ఏడుజిల్లాలుగా విస్తరింపబడిన బస్తర్కంతా వ్యాపించింది. మధ్యభారత్ ఆదివాసీ సమాజ జీవన్మరణ పోరాటమది. అక్కడ కేంద్రస్థానంలో మావోయిస్టులు ఉన్నారు. ఉంటారు. కాని అది ప్రజల సార్వభౌమ అధికారం కోసం ఆదివాసుల పోరాటం.
ప్రజల సార్వభౌమ అధికారమంటే దేశసరిహద్దుల నుంచి శత్రుసైన్యాల చొరబాటును అడ్డుకోవడం కాదు. శత్రువు అనే మాట పొరుగుదేశాల కొరకు ఉపయోగించేదే అయితే అంతకన్నా హీనమైన దేశభక్తి లేదు. పైగా అది పాకిస్తాన్ యే అయితే వేలసంవత్సరాల భారతదేశ చరరిత్రలో అది మననుంచి విడిపోయి డెబ్బై ఐదేళ్లే అయింది. ఇప్పటికీ హిమాలయాలు, సింధూనది, పంజాబ్ మనను కలుపుతున్నాయి. అన్నిటికీ మించి ఇప్పటి ఇండియా లోని, పోనీ భారత్లోని ఏ కార్పోరేట్ కంపెనీల దోపిడీలోనూ పాకిస్తాన్ ప్రమేయం లేదు. దేశ ఆంతరంగిక వ్యవహారాలు చూసే హోంమంత్రి ఇవేవీ తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. ఆయన మాత్రమే కాదు తూర్పు మధ్యభారతాల్లో అడవిలోకి రోడ్లనిర్మాణం కోసం సరిహద్దు భద్రతాదళాలను తెచ్చినపుడే మన కేంద్ర ప్రభుత్వాలకు సరిహద్దుల నుంచి ప్రమాదం లేదని తెలుసు లేదా ప్రధానిగా మన్మోహన్ చెప్పినదయినా, మోడీ మన్ కే బాత్ అయినా ప్రమాదం అంతర్గతమైనదే. అది మావోయిస్టు ప్రమాదమే. అది ఎట్లా మావోయిస్టు ప్రమాదం ప్రభుత్వాలు దళరులుగా సామ్రాజ్యవాద కార్పోరేట్లకు, బడా కంపెనీలకు కట్టబెట్ట దలుచుకున్న ప్రకృతి సంపదనంతా తరతరాలుగా ప్రజలకోసం సంరక్షిస్తున్న ఆదివాసుల పోరాటంలో మావోయిస్టులు అండగా ఉన్నారు. కనుక అడవిని ఆక్రమించుకోవాలంటే ఆదివాసులను నిర్వాసితులను చేయాలి. ఆదివాసులను నిర్వాసితులలను చేయాలంటే మావోయిస్టురహిత దేశం కోసం వాళ్ల ఆశ్రయాలమీద దాడిచేయాలి. చెరువులో చేపలు ఏరివేయాలంటే చెరువులే తోడివేయాలి. అపుడుగానీ అడవిని ఆక్రమించుకోలేరు. అందుకోసం భూమార్గం లోని అన్ని ప్రయత్నాలను, రోడ్లనిర్మాణం, పోలీసుక్యాంపుల నిర్మాణాన్ని సిలింగేర్, బాహుదా అన్ని ప్రాంతాల్లోనూ ఆదివాసులు అడ్డుకుంటున్నారు. దానిని వాళ్లు క్యాంపు వ్యతిరేక పోరాటమంటున్నారు. అది సారాంశంలో కంపెనీల దోపిడీ వ్యతిరేకపోరాటం. ఆదివాసీ ప్రజలు ఇరవై సంవత్సరాలుగా అమలుచేస్తున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య జీవనవిధానాన్ని కాపాడుకోవడం. అది బస్తర్కంతా విస్తరించింది కాబట్టి ఇపుడు భూమార్గం దిగ్బంధమైపోయింది. అందుకే అమిత్షా మావోయిస్టురహిత భారత్లో 2024 ఎన్నికలు అని ప్రకటించిన రెండురోజులకే బీజాపూర్ సుక్మా జిల్లాల్లో పలుచోట్ల ఇండియన్ ఏర్ఫోర్స్ విమానాల్లో వచ్చి ఆదివాసీ గ్రామాలపై బాంబులవర్షం కురిపించారు. ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టులు మసలుకునే స్థావరాలు చూపడానికి సిఆర్పిఎఫ్ తన వెంట సాల్వాజుడుంలో పనిచేసిన డిఆర్జి పోలీసులను తెచ్చుకున్నది. బాంబుకు అడవిని, అడవిలోని గూడాన్ని, గూడాలలోని మనిషిని గురిచేయడం తెలియవచ్చుగానీ ఆదివాసీ ఎవరో మావోయిస్టు ఎవరో పోల్చుకోవడం ఎట్లా తెలుస్తుంది. ఒక ఆదివాసీ మహిళ మరణించింది. సిలింగేర్ పోలీసుకాల్పుల్లోనూ ఐదుగురు ఆదివాసులు మరణించారు. తూర్పు మధ్య భారతాల్లో అడవి ఉన్న మేరా, ఆదివాసీలున్న మేరా మావోయిస్టురహిత భారత్ ఏర్పడాలంటే అది ఆదివాసీ రహిత అడవియే అవుతుందని అమిత్షాకు తెలుసు. అమిత్షాకైనా, మోడీకౖౖెనా, పాలకుల కెవరికైనా ఆదివాసుల ప్రాణాలను కాపాడే ప్రేమ లేదు. కన్సర్న్ లేదు. జాగ్రత్త లేదు. వాళ్లకు కావాల్సింది అదానీ, అంబానీ, మిట్టల్, జిందాల్, వేదాంత, టాటా వంటి ఎందరో బడా కంపెనీలు, ఈ బడా కంపెనీలతో పొత్తుపెట్టుకున్న విదేశీకంపెనీల కోసం అడవి సంపదనంతా దోచిపెట్టే దళారీ ప్రభుత్వ ప్రయోజనం.
ఈ సైనిక వ్యూహంతోపాటు ఆదివాసీ ప్రాంతాల్లోకి హిందూమత ప్రచారం కోసం వనవాసీ ఆశ్రమాల పేరుతో కూడ సంఘపరివార్ ప్రవేశించింది. ఆర్ఎస్ఎస్ అందుకే ఆదివాసీ అనేమాట గానీ మూలవాసీ అనే మాట గానీ ప్రయోగించదు. ముఖ్యంగా దండకారణ్యం విషయంలకి వచ్చేవరకు వాళ్లకు ఇక్కడ మూలవాసులపై ఆర్యసంస్కృతి చేసిన దాడి, ఆక్రమణ గొంతుమింగని చేదునిజమవుతుంది. ఇంద్రవెల్లి మారణకాండ కాలం నుంచి కూడ ఆదివాసులు హిందూసమాజంలో భాగమే అని ప్రచారానికి వాళ్లు పూనుకుంటున్నారు. ఆదివాసులేమో తాము హిందువులం కాదని, తమకు మతం లేదని, తాము పూజించే దేవతలందరూ ప్రకృతిసంబంధమైన శక్తులే తప్ప బ్రాహ్మణీయ భావజాలం ప్రవేశపెట్టిన మతప్రతీకలను వాళ్లు స్వీకరించడం లేదు. దేశంలో జనగణన లోని మతం దగ్గర తమకోసం విడిగా ఒక కాలమ్ ఆదివాసీ తెగలు పూజించే దేవతలపరంగా వదలాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంద్రవెల్లి కాలం నుంచే కేస్లాపూర్ జాతర, నాగోబా దేవత, రగల్జెండాలు ప్రచారంలోకి వచ్చిన సందర్భాలను మనమిక్కడొకసారి గుర్తుచేసుకోవాలి. హేమన్డార్ఫ్ కొమురంభీము తిరుగుబాటు తర్వాత అధ్యయనం చేయడానికి వచ్చినపుడు ఈ కేస్లాపూర్ జాతరకు, నాగోబా దేవాలయానికి ఒక గుర్తింపు, ప్రతిపత్తినివ్వాలనే ప్రయత్నంలో ఇక్కడ జిల్లా అధికారి కలెక్టర్ దర్బార్ నిర్వహించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అది ఎన్నోరోజులపాటు ప్రయాణం చేసి కేస్లాపూర్ చేరుకున్న వివిధప్రాంతాల ఆదివాసీలు తమ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తెచ్చే ఒక దర్బార్. అంటే పెసా (పంచాయితీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా) చట్టం కింద గ్రామసభల విస్తార రూపం. ఇవ్వాళ ఈ కేస్లాపూర్ జాతరను ఒక బ్రాహ్మణీయతంతుగా మారుస్తున్నారు. అతి ప్రాచీనమైన మేడారం జాతరను అట్లాగే మార్చారు. ఇట్లా ఆదివాసీ జీవనాన్ని, విశ్వాసాలను సంస్కృతిని బ్రాహ్మణీయ హిందుత్వలో ఒక భాగం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఈ బ్రాహ్మణాధిక్య భావజాల వివక్ష నుంచి బయటపడడానికి గానీ, స్వచ్ఛందంగా గానీ క్రైస్తవమతంలో చేరిన వారిపై ` వాళ్లు ఆదివాసీ సంప్రదాయ కట్టుబాట్లను విచ్ఛిన్నం చేస్తున్నారని వాళ్లమీద దాడులకు పురికొల్పుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల ఇటువంటి చీలికల కోసం కూడ ఆర్ఎస్ఎస్ దాడులను ప్రోత్సహిస్తున్నది. దీనిని మొగ్గలోనే తుంచాలి.
ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్పోరేటు మార్కెటు దేశం అన్నా, జాతి అన్నా హిందుత్వ అనే బ్రాహ్మణీయ ఆధిపత్య భావాన్ని తన మోనోపలీ మార్కెటు ద్రవ్య పెట్టుబడి వాదానికి చాల వ్యూహాత్మకంగా వాడుకుంటున్నది. కనుక మావోయిస్టు రహిత భారత్ అంటే ఆదివాసీరహిత దేశమే సారాంశంలో అవుతుందని, అప్పుడది నేటివ్స్ ప్రదర్ళనజీవులుగా మారిన అమెరికా వలె దోపిడీరాజ్యంగా రూపొందుతుంది. అయితే అందులోనూ అది దోపిడీ దళారీ రాజ్యమే కాగలదు తప్ప దోపిడీ సామ్రాజ్యవాద దేశం కాజాలదు. దోచుకునే స్వాతంత్య్రంలో దానిది దళారీ పాత్రయే.

Leave a Reply