తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ కాలేదు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ, పై నుంచి కురిసే బాంబుల వర్షం నుంచి  తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది గ్రామస్తులు గాయపడ్డారు.

జబ్బగట్ట గ్రామానికి చెందిన కల్ము అనే గ్రామస్థుడు బాంబు దాడి ప్రారంభమైనప్పుడు పొలాల్లో మహువపూలను ఏరుతున్నాడు. బాంబు దాడి, భారీ తుపాకీ కాల్పుల మధ్య ఇంటి వైపు పరిగెత్తుతూ పడిపోవడంతో తలకి, చెవికి గాయాలయ్యాయి.

ఇలాంటి వైమానిక దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. బీజాపూర్‌లోని ఉసూర్ బ్లాక్‌లోని గ్రామాలపై  2023 జనవరి 11న వైమానిక బాంబు దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు 2023 ఫిబ్రవరిలో, కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (సిడిఆర్‌ఓ-ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయకమిటి) నిజ నిర్ధారణ బృందం వెళ్లినప్పుడు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. 2023 మార్చిలో మరోసారి ప్రయత్నించి వెళ్లగలిగింది.

బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లోని మెట్టుగూడ, బొట్టెథాంగ్, ఎర్రపల్లి గ్రామాలలో వైమానిక బాంబు దాడులు జరిగిన ప్రదేశాలను చూసి, గ్రామస్థుల సాక్ష్యాలు, రుజువుల ఆధారంగా, బహుళ డ్రోన్‌లను ఉపయోగించి 9 బాంబులు పడినట్లు, తరువాత 2 హెలికాప్టర్ల నుండి తీవ్రమైన కాల్పులు జరిగినట్లు నిర్ధారించింది. బస్తర్ గ్రామస్థులు చేసిన వైమానిక బాంబు దాడుల ఆరోపణలకు సంబంధించి ఇటువంటి పరిశోధనలు ఎటువంటి సందేహాలకు తావివ్వవు. 2021- 2022లో గ్రామస్తులు ఇదే విధమైన ఆరోపణ చేశారు. 2021 ఏప్రిల్ 19న బీజాపూర్ జిల్లాలోని బోతలంక, పాలగూడెం గ్రామాల మధ్య ఉన్న ఆదివాసీ కుగ్రామాలపై కనీసం 12 బాంబులు పడ్డాయి.

అదేవిధంగా, 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి, బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన బోట్టెథాంగ్, మెట్టగూడెం, డ్యూలేడ్, సక్లెర్, పొట్టేమంగి గ్రామాలపై డ్రోన్‌లను ఉపయోగించి బాంబు దాడి చేశారు. సిడిఆర్‌ఓ వంటి ప్రముఖ హక్కుల సంస్థను విచారణ జరపకుండా అడ్డుకోవడం, ఆ ఆరోపణలను నిజమని ఆ తర్వాత నిర్ధారించడం, బస్తర్‌లో భారత ప్రభుత్వం చేస్తున్న వైమానిక యుద్ధానికి స్పష్టమైన సూచన.

గత మూడేళ్లలో ఇలాంటి డ్రోన్‌ దాడి జరగడం ఇది నాలుగోసారి. ఈ దాడులు నిత్యజీవితాన్ని నాశనం చేసే ముప్పును సృష్టిస్తున్నాయి. ఆదివాసీలు మానవులుగా మనుగడసాగించడానికి  వీల్లేకుండా చేస్తున్నాయి. అంతర్గత ఘర్షణలలో లేదా పౌరులు నివసించే ప్రాంతాలలో వైమానిక దాడులను ఉపయోగించడాన్ని వివిధ అంతర్జాతీయ చట్టాలు నిషేధిస్తున్నాయని యిక్కడ పేర్కొనాల్సి వుంటుంది. అయినప్పటికీ, ఆ ప్రాంతాలలో లభించే గొప్ప ఖనిజ వనరులను విదేశీ బహుళజాతి కంపెనీలు, బడా కార్పొరేట్‌ల దోపిడిని సులభతరం చేసే ప్రయత్నంలో, బ్రాహ్మణీయ ఫాసిస్ట్ ఆర్ఎస్‌ఎస్-బిజెపి సారథ్యంలో రాజ్యం దేశమంతటా ప్రజలపై యుద్ధం చేయ ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో, డ్రోన్‌లను, ఆయుధాలను కొనడానికి, డజన్ల కొద్దీ పారామిలిటరీ క్యాంపుల రూపంలో మైనింగ్ కంపెనీలకు సమగ్ర  భద్రతను కలిగించడానికి, ప్రభుత్వ-కార్పొరేట్ ల అపవిత్ర కూటమి, అపఖ్యాతి పాలైన ఆపరేషన్ గ్రీన్-హంటిన్‌ను ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ రూపంలో పొడిగించింది. క్యాంపులు, కార్పొరేట్‌ల కోసం భద్రతా బలగాలను ప్రైవేట్ మిలీషియాగా, సల్వా జుడుం వంటి ప్రైవేట్ కిరాయి సేనలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ పేరుతో భద్రతా దళాలుగా మార్చింది. విదేశీ పెట్టుబడి ప్రయోజనాల కోసం వనరులను దోచుకోవడానికి, ప్రజలపై విచ్చలవిడిగా జరుపుతున్నఅప్రకటిత అంతర్యుద్ధం. ప్రతిపక్షం మౌనంగా వుంది, న్యాయవ్యవస్థ మౌనంగా వుంది, మీడియా మౌనంగా వుంది, యుద్ధం ఉగ్రరూపం దాలుస్తోంది.

 డ్రోన్ దాడులు, పారామిలటరీ క్యాంపులు, ప్రజల సహనశక్తిని పరీక్షిస్తున్నాయి ; ఇది దాదాపు ఉనికిలో లేని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.

దేశ ప్రజలపై పెరుగుతున్న  డ్రోన్ దాడులను, ప్రజల జీవిత భద్రతను నిర్మొహమాటంగా విస్మరించడాన్ని ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న అన్ని ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులు మన ప్రజలపై సాగుతున్న ఈ యుద్ధాన్ని తీవ్ర స్వరంతో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.

మా డిమాండ్లు:

ఆపరేషన్ సమాధాన్ప్రహార్‌ను వెంటనే ఆపాలి!

బస్తర్‌లో లేదా దేశంలోని మరెక్కడైనా డ్రోన్‌లు లేదా హెలికాప్టర్‌లతో జరిపే అన్ని రకాల వైమానిక దాడులను వెంటనే ఆపాలి!

విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రజాస్వామిక, మానవ హక్కుల కార్యకర్తల బృందం ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తును జరిపేట్లు సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్య తీసుకోవాలి!

వైమానిక బాంబు దాడులు, క్యాంపులు, రోడ్ల నిర్మాణం, బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మూలవాసీ బచావో మంచ్‌తో ప్రభుత్వం తప్పనిసరిగా చర్చలు జరపాలి!

బస్తర్‌లో లేదా దేశంలోని మరెక్కడైనా డ్రోన్‌లు లేదా హెలికాప్టర్‌ల నుండి అన్ని రకాల వైమానిక దాడులను వెంటనే ఆపండి!

ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను వెంటనే ఆపివేయాలి!

FORUM AGAINST CORPORATIZATION AND MILITARIZATION (FACAM), NEW DELHI

facam.delhi@gmail.com

https://countercurrents.org/2023/04/when-the-state-bombs-its-own-people/

Leave a Reply