వానికి యుద్దమంటే భయం
అందునా..అడవిలో యుద్ధమంటే
అణువణువునా భయమే!

అందుకేవాడు
అందరిని కుప్పేసుకొని
మంతానాలాడి
అడవిలోకి అడుగు పెట్టాలని
అడుగులో అడుగేయడానికి
వెనకడుగు వేస్తాడు
పిరికి గుండె దుండగీడు!

అడవిలో ఆకులను చూసినా
బాకులని భయపడుతాడు
ఎండు కట్టెను చూసినా
ఏకే రైఫిలనుకుని ఎగిసిపడతాడు
అడవిలో అగ్గిరవ్వలను లెక్కగట్టి
ఆర్పాలని ఆకాశమార్గాన మాటువేస్తాడు
వాడకున్న ధైర్యమంతా రాజ్యమే!
చట్టమూ, సైన్యమూ భుజాన వేసుకొని
అభివృద్ధి పాట పాడుకుంటూ
అడవిబిడ్డలను ఆదమరపించి
కాటు వేయచూస్తాడు

వాడికితెలుసు...
'జనతనసర్కారు' ఎదుట
తన సర్కారు తలదించుకోవాలని!
జనరాజ్యం విస్తరిస్తే
వాడిరాజ్యం అదృశ్యమవుతుందని తెలుసు.

Leave a Reply