(రాజ్యాంగవాదం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, న్యాయశాస్త్ర ఆచార్యుడు ప్రొ. శేషయ్య 2008వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ మిత్రుల కోసం చెప్పిన పాఠం ఇది. ఈ వ్యాసం ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురిస్తున్న ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1లో అచ్చయింది)

రాజ్యాంగం ప్రాథమికంగా అధికారం గురించి మాట్లాడుతుంది. మన భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటులోని రెండు సభలు, రాష్ట్రపతి కలిపి ఒక నిర్మాణం వుంటుంది. అది పని చేయాలంటే అధికారం ఇవ్వాలి కదా. రాజ్యాంగం అధికార విభజన గురించి చెప్తుంది. పార్లమెంటుకు ఏం అధికారముంది. ప్రెసిడెంటుకు ఏం అధికారం వుంది, గవర్నరు కేం అధికారం వుంది, ముఖ్యమంత్రి కేం అధికారం వుంది. ఒక మినిష్టర్‌కి ఏమి అధికారం వుంది. తరువాత ఆఫీసర్స్‌, అంటే కొన్ని రాజ్యాంగ పదవుల్లో వున్న వారికి ఏమి అధికారం వుంది, న్యాయవ్యవస్థకేం అధికారాలున్నాయి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్‌ (కార్యనిర్వాహక వర్గం) కు ఏమధికారాలున్నాయి? ఇలా రాజ్యాంగం  అధికార విభజన చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికేం అధికారాలుండాలి, కేంద్ర ప్రభుత్వానికేం అధికారాలుండాలి, వేరువేరు వ్యవస్థలను ఎట్లా ఉంచాలి – ఇలా మొత్తం పవర్‌ (ఆధికారం) గురించి అది మాట్లాడుతుంది.

మనం అధికారం గురించి ఎందుకు మాట్లడుకుంటున్నాం అంటే అధికారం ఎక్కడ వున్నా, లేదా ఆధిపత్యం ఎక్కడ వున్నా హక్కులకు ప్రమాదం వుంది. అధికార విభజన జరిగి వ్యవస్థలకు పవర్స్‌ ఇచ్చి ఒకదానిలో ఒకటి జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం చెప్తుంది. మనం నిత్యం పేపర్లలో చూస్తా వుంటాం. సుప్రీంకోర్టు మీద ప్రైం మినిష్టర్‌ గుర్రుగా ఉన్నాడని, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయవాదులంతా గవర్నమెంటు మీద తిరుగుబాటు చేస్తున్నారని వింటూ వుంటాం. అధికారం గురించి, వివిధ వ్యవస్థలకు రాజ్యాంగం దాఖలు చేసే అధికారం గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే, రాజ్యాంగం అధికారాన్ని నియంత్రిస్తుంది. అధికారం ఎవరికిచ్చినా దాన్ని దుర్వినియోగం చేయకుండా, దాన్ని స్వలాభం కోసం వాడుకోకుండా సజావుగా, సమానంగా పరిపాలన అందించాలనే ఉద్దేశం రాజ్యాంగంలో కీలకం. అది అధికారాన్ని నిర్వచిస్తుంది, విభజిస్తుంది, అదే సమయంలో నియంత్రిస్తుంది, నిరోధిస్తుంది. రాజ్యాంగం  ఉద్దేశం అధికారాన్ని విచక్షణాయుతంగా ఉపయోగించాలని చెప్పడం.

ప్రభుత్వాలు, వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం నడచుకోవడం లేదు అని మనం అంటుంటాం. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంలోని విధులకే వ్యతిరేకంగా చేస్తున్నారని విమర్శించాం. అధికారం అంటే రాజ్యానికుండే అధికారం – స్టేట్‌ (రాజ్యం) అనేదాన్ని అర్ధం చేసుకోకపోతే ప్రైవేట్‌ టీచర్ల సంగతేంది అనేది కూడా మనం అర్థం చేసుకోలేం. 

రాజ్యాంగంలో వుండేవి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగంలో అయినా వుంటాయి. అయితే ఆయా దేశాల్లో చరిత్ర పరిశీలిస్తే, చారిత్రిక అభివృద్ధి క్రమంలో ప్రజలు పోరాడి హక్కులు సాధించుకుని, వాటిని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు. ఇంగ్లాండ్‌లో అయినా సరే, అమెరికాలో అయినా సరే, చాలా పాశ్చాత్య దేశాల్లో అయినా హక్కులను రాజ్యాంగం ఏమి ఇవ్వలేదు. కలిసి కూర్చొని రాసిండొచ్చు. ఆ కలిసి కూర్చొని రాయడానికి అసలు సమాచారముండాలి కదా. ఏమి చేయాలి, యెట్లా రాయాలి అని. కాబట్టి రాజ్యాంగ రచన చేసే క్రమానికి ముందే ఆ రాజ్యాంగంపై ఆ దేశంలో జరిగిన పోరాటాల ప్రభావం, ఆ ప్రభావాలతో ముందుకు తీసుకువచ్చిన హక్కులు, ఆ హక్కులు యెట్లా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి అనే విషయాన్ని చూడాలి. ఇట్లా ఏ రాజ్యాంగానికైనా చరిత్ర ఉంటుంది.

మన రాజ్యాంగ రచన సుదీర్ఘంగా జరిగింది. రెండున్నర సంవత్సరాల పాటు జరిగింది. దాంట్లో చాలా మంది మేధావులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులూ వాళ్ళే, మేధావులూ వాళ్ళే, తరువాత పరిపాలకులు అయింది కూడా వాళ్ళే. రాజ్యాంగ సభలో 88 శాతం సభ్యులు హిందువులు, మెజారిటీ 50 శాతం బ్రాహ్మణులు. ఆ రోజు వున్న స్వాతంత్ర పోరాటంలో నాయకులుగా ముందుకు వచ్చిన వాళ్ళు, కొంతమంది న్యాయవాదులు, కొంతమంది మేధావులు అందరూ కూర్చొని రాజ్యాంగం రాసారు. ఆ రాసే క్రమంలో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తరువాత దాదాపుగా రెండు వేల అమెండ్‌మెంట్స్‌ (సవరణలు) వచ్చాయి. ఆ అమెండ్‌మెంట్స్‌పై చర్చ జరిగింది. తరువాత రాజ్యాంగం రాయబడిరది.

కానీ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రాసాడని చాలా మంది చెప్తుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే అంబేద్కర్‌ అంటారు. నేనేమంటానంటే ఆయన నిర్మాత కాదు. ఆయన కౌన్సిల్‌లో చాలా చాలా ప్రభావశీలమైన వ్యక్తి. డ్రాఫ్టింగ్‌ కమిటీ చైర్మెన్‌. అన్ని తీర్మానాలొచ్చిన తరువాత ఈ కమిటీ డ్రాఫ్టు రూపంలో రాసింది. అయితే ఈ తీర్మానాలు ఎక్కడ నుంచి వచ్చాయి? కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చాయి. వాటిని అమోదించిన తరువాత – గైడ్‌ చేసే క్రమంలో అంబేద్కర్‌ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రాజ్యాంగం ఆయన కాదు రాసింది. ఏ రాజ్యాంగం అయినా రాయడానికి ఒక చరిత్ర కావాలి. ఆ చరిత్రలో ముందుకొచ్చిన మంచి మంచి అంశాలేమిటి, నాగరికతను పెంపొందించటానికి వచ్చిన అంశాలేమిటి, ప్రజల హక్కులు పెంపొందించడానికి వచ్చిన అంశాలేంటి అనేవి చూడాలి. కాబట్టి నేను అనడం ఏమంటే, మన రాజ్యాంగ రచనలో హక్కులను మూడు చారిత్రక పరిణామాలు ప్రభావితం చేశాయి. మొట్టమొదటిది 17, 18 శతాబ్దాలలో పాశ్చాత్య దేశాల్లో జరిగిన బూర్జువా విప్లవాల ప్రభావం మన రాజ్యాంగం మీద ఉంది. ప్రధానంగా ఫ్రెంచ్‌ రివల్యూషన్‌. ఈ ఫ్రెంచ్‌ రివల్యూషన్‌ ఆ రోజుల్లో ఫ్రీడం (స్వేచ్చ), ఈక్వాలిటి (సమానత్వం) అండ్‌ ఫ్రటర్నిటి (సౌభ్రాతృత్వం) ఏం స్లోగన్‌ ఇచ్చింది? ఈ పదాలు మన రాజ్యాంగంలోకి వచ్చాయని ఈ స్లోగన్స్‌ మన దేశంలో మనం ఇవ్వలేదు. మనం ఇచ్చిన స్లోగన్స్‌ ఏమంటే బ్రిటిష్‌ వారి నుంచి మనకు స్వాతంత్య్రం కావాలి. అది మన పోరాటం. అయితే విలువలకి సంబంధించి, హక్కులకి సంబంధంచి ఇంగ్లాండ్‌లో గానీ, అమెరికాలో గానీ మొత్తం వేరే, వేరే పాశ్చాత్య దేశాల్లో జరిగిన పోరాటాల ప్రభావం మన రాజ్యాంగం మీద వుంది.

కాబట్టి మేధావులంతా కలిసి హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచినారు అంటే చాలా పొరపాటు. అమెరికన్‌ ఇండిపెండెన్స్‌ వార్‌, ఫ్రెంచ్‌ రివల్యూషన్‌, అంతేకాకుండా ఆ కాలంలో జరిగిన అన్ని బూర్జువా పోరాటాల ప్రభావం నుంచి హక్కులు మందుకు వచ్చినాయి. ఎందుకంటే వ్యక్తికప్పుడు హక్కులు లేవు. ఆ హక్కులు సాధించుకోవడానికి వాళ్ళు పోరాటం చేసారు. అంటే ప్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో బూర్జువాలు మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్య్రం కావాలి, మాకు సమానత్వమనే హక్కు కావాలి అన్నారు. కాబట్టి ఈ హక్కులన్నీ కూడా ఆ పోరాటాల నుంచి వచ్చి మన రాజ్యాంగ రచన మీద ప్రభావం చూపాయనేది ఒక చారిత్రిక సత్యం. రెండోది రష్యా విప్లవం ప్రభావం కూడా ఉంది.

మన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 12 స్టేట్‌ (రాజ్యం) గురించి చెప్పంది. స్టేట్‌ అంటే ఏమిటి? రాజ్యాంగంలో రాజ్యం అంటే ఏమిటో నిర్వచించలేదు. కాని దాన్ని వివరించారు. ఇది సమస్య. స్టేట్‌ అంటే ఏందనేది మనకు అవగాహనలో వుంటుంది గానీ నిర్దిష్టంగా ఏమిటి స్టేట్‌ అంటే? భర్తను స్టేట్‌ అంటుంది భార్య. పోలీసోడు ఎట్లా కొడతాడో నన్నట్ల కొడ్తాడు. లాకప్పులో ఎట్లేస్తాడో నన్ను ఇంట్లో తాళం వేసి బైటికి పోతాడు అనుమానంతో. వచ్చి టార్చర్‌ పెడతాడు. స్టేట్‌ అట్లే చేస్తాది, భర్త అట్లే చేస్తాడు. మరి భర్త స్టేటా? రాజ్యాంగం ప్రకారం స్టేటంటే పార్లమెంటు, స్టేట్‌ లెజిస్లేచర్స్‌, లేదా మొత్తం ఈ గవర్నమెంట్‌కు చెందిన డిపార్ట్‌మెంట్స్‌ అనుకున్నాం. తరువాత చాలా చర్చ జరిగి ఇవాళ యూనివర్సిటీలు, పబ్లిక్‌ స్కూల్స్‌ కూడా స్టేట్‌ నిర్వచనం కిందికి వస్తాయి.

మనం మొత్తం చరిత్ర చూస్తే రష్యా విప్లవ ప్రభావం ఏమిటి అంటే రైట్‌ టు వర్క్‌.. పని హక్కు అనేది  ఆదేశిక సూత్రాలలో చూస్తున్నాము. అప్పుడప్పుడు దీన్ని ఫండమెంటల్‌ రైట్‌ (ప్రాథమిక హక్కు) అంటున్నాము గానీ, రష్యాలో రైట్‌ టు వర్క్‌ అనేది ప్రాథమిక హక్కు. రష్యా రాజ్యాంగంలో రైట్‌ టు వర్క్‌తో పాటు, రైట్‌ టు లీజర్‌ (విశ్రాంతి హక్కు) కూడా ఉంటుంది. రైట్‌ టు లీజర్‌ అనేది మనకు లేదు కదా? ఇవాళ మీకైనా లీజర్‌ ఉందా? లీజర్‌ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన క్రమంలో ఇది వచ్చింది. పని చేసేవారికి రెస్ట్‌ ఇస్తే మళ్ళీ బాగా ఎనర్జీ పుంచుకుని సెల్‌ ఫోను చార్జింగ్‌ లాగా వాళ్ళు మళ్ళీ పనిచేయడానికి వస్తారు. అంతే తప్ప అదేదో సానుభూతితో అయ్యో చాలా అలసిపోయినారు, వారికి విశ్రాంతి కావాలి అని కాదది. పెట్టుబడిదారీ విధానం ఉద్దేశం కాసేపు రెస్ట్‌ ఇచ్చి మళ్ళీ మళ్ళీ పని చేయించుకోవడం. రెస్ట్‌ లేకుండా మనుషులు పనిచేయలేరు. అంటే అదే శక్తితో పనిచేయడం కష్టం. ఆ విధంగా రైట్‌ టు వర్క్‌, రైటు టు లీజర్‌, రైట్‌ టు అసోసియేషన్‌ (సంఘం పెట్టుకునే హక్కు) ఇవన్ని కూడా రష్యా విప్లవ ప్రభావం నుంచి మన రాజ్యాంగంలో కనపడతాయి. ప్రధానంగా ఏందంటే మన దేశంలో జరిగిన స్వతంత్ర పోరాటం ప్రభావం కూడా మన రాజ్యాంగం మీద ఉంది.

ఒకసారి లిస్టు తీసుకుందాం. మన ప్రాథమిక హక్కుల్లో ఏమేం ఉంటాయో చూద్దాం. మూడో అధ్యాయంలో 12వ అధికరణం రాజ్యాన్ని నిర్వచిస్తుంది. 13 ఏమంటుందంటే నువ్వు ఏ చట్టం తీసుకువచ్చినా ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉండాలి అంటుంది. ఏ చట్టం తీసుకువచ్చినా, ఏ విధానం తీసుకు వచ్చినా, అది హక్కులను గౌరవించి, హక్కులను అమలు చేసేపద్ధతిలో ఉందాలి తప్ప, అది హక్కులను హరించే విధంగా ఉండకూడదు. అలాంటి చట్టం తీసుకొస్తే దాన్ని కోర్టు కొట్టి వేయొచ్చు. దానినే జుడీషియల్‌ రివ్యూ పవర్‌ అంటారు. ఆర్టికల్‌ 13లో ఉందది. దాని తరువాత మన హక్కులు మొదలవుతాయి. ముఖ్యంగా మూడు హక్కులు. మొదటిది ఈక్వాలిటి – సమానత్వం, రెండోది ఫ్రీడమ్‌ – స్వాతంత్య్రాలు, మూడోది లిబర్టి – స్వేచ్ఛ. మొత్తం 32 వరకున్న ఆర్టికల్స్‌ అన్నీ హక్కుల గురించే చెప్పాయి. బ్రాడ్‌గా అంటే, ఒకటి ఈక్వాలిటీ, రెండోది ఫ్రీడం, మూడోది లిబర్టీ. స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం అంటే పౌరస్వేచ్ఛలు. పౌరులకు సంబంధించిన సమానత్వం, స్వాతంత్రం. ఆర్టికల్స్‌ 14, 15, 16, 17, 18 ఇవన్ని సమానత్వాన్ని గురించే చెబుతాయి. ఈక్వాలిటీ బిఫోర్‌ లా అండ్‌ ఈక్వల్‌ ప్రొటెక్షన్‌ బై ద లా   ఏం  చెప్తాయి అంటే. (చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది) ఇదెక్కడి నుంచి వచ్చింది? ఈ వాక్యం కూడా మన వాళ్ళు రాసినేది కాదు. ఇది అమెరికా నుంచి వచ్చింది. 

సమానత్వానికి సంబంధించిన హక్కులన్నీ అమెరికా అనుభవాల నుండి వచ్చాయి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అని హక్కులు ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది? మన భారతదేశంలో, వేరే దేశాలకి, మనదేశంలో ఆ సమానత్వమనే హక్కులు అనుభవించడానికి వుండే అవకాశాలు ఏమిటి అని లోతుగా పరిశీలిస్తే 14లో సమానత్వమనే హక్కు ‘రైట్‌ టూ ఈక్వాలిటి. నా దృష్టిలో ఒక విప్లవాత్మకమైన హక్కు. ఎందుకు రైట్‌ టు ఈక్వాలిటీ అంటే 15వ ఆర్టికల్లో చెప్తారు. ఈ దేశంలో జాతిపరంగా, కులపరంగా మతపరంగా అన్ని రకాలుగా వివక్ష ఉంది. రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ ఏమిటి అంటే వివక్షను నిషేధించడం. వివక్షకు వ్యతిరేకంగా ఈ హక్కు ఇచ్చారు. అంబేద్కర్‌ పోరాటం మనకు తెలుస్తున్నదిక్కడ. 15(2), 15(3), 15(4) లో ఆర్టికల్‌ 15 క్లాజ్‌ 3,4 రిజర్వేషన్ల గురించి చెప్తాయి.

కులపరంగా, మతపరంగా, జాతిపరంగా, లింగపరంగా వుండే అసమానతలన్నీ దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగంలో ఏముందంటే జాతి, మత, కుల,లింగ, ప్రాంతాల పరంగా వివక్షను నిరోధించే అంశం కాబట్టి  సమానత్వమనే హక్కును ఎట్లా పొందుపరిచారు అంటే మన భారతదేశంలోని అసమానతలన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నారు. అంతేకాకుండా దేశంలో వచ్చిన పోరాటాలన్నిటి ప్రభావం గూడా ఉంది. చాలా రోజులు మనం పాలేర్లే అనుకున్నాము. పాలేరూ, బాండెడ్‌ లేబరూ ఒకటి కాదు. ఏ రాజ్యాంగంలో లేని హక్కు మన భారత రాజ్యాంగంలో ఉంది. నిర్దిష్టంగా, చారిత్రికంగా వుంది.  దోపిడికి వ్యతిరేకంగా వుండే హక్కును ఎక్కడన్నా ఏ రాజ్యాంగంలో అయినా చూస్తామా? మరి ఎట్లా వచ్చింది. ఈ హక్కు రాజ్యాంగంలోకి? అంటే దేశంలో ఉండే వెట్టిచాకిరి పరిస్థితి చూసి, ఇట్లా చేయడం   దుర్మార్గం, ఇది   దోపిడీ, కాబట్టి ప్రజలకు ఈ హక్కు ఇస్తున్నామని రాజ్యాంగంలో ఆర్టికల్‌ 23లో వుంది. తరువాత పిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ప్రత్యేక రక్షణ ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్పింది.

ఈ సమానత్వం గురించి ఆర్టికల్‌ 14లో మాత్రమే లేదు. ఆర్టికల్‌ 15లో, 16లో, 17లో ఉంది. 17 అంటరానితనం గురించి ఉంది. ‘‘అంటరానితనం నేరం’’. అమెరికాలో ఉండే జాతి వివక్షకు, భారతదేశంలో ఉంటే కులవివక్షకు తేడా వుంది. మన భారతదేశంలో కుల వ్యతిరేక ఉద్యమాలు, అదే విధంగా చాలా సంస్మరణ పోరాటాలు జరిగాయి. మీకందరికీ తెలుసు, మన రాష్ట్రంలో అయితేనేమి, వెస్ట్‌ బెంగాల్‌లో అయితేనేమి, జరిగిన సంస్కరణ పోరాటాల ఫలితంగా మహిళలకు సంబంధించిన హక్కులు వచ్చాయి. సో వుమెన్‌ ఆర్‌ ఈక్వల్‌. కాబట్టి ఈ రైట్‌ టూ ఈక్వాలిటీ అనేది మనం ఎట్లా అర్ధం చేసుకోవాలంటే ఈక్వల్‌ రెస్పెక్ట్‌ అండ్‌ ఈక్వల్‌ రికగ్నిషన్‌. అందర్నీ సమానంగా గుర్తించడం, అందర్నీ సమానంగా గౌరవించడం, అందరికి సమాన అవకాశాలు కల్పించడం. ఇంత విస్తృతంగా భారతదేశ రాజ్యాంగంలో మనం ఆర్టికల్‌ 14ని అర్ధం చేసుకోవాలి. అట్లా చేసుకుంటున్నామా మనం? అంబాని అండ్‌ బిచ్చగాడు, కారులో పోయే వాడు, బ్రిడ్జి కింద పడుకునే వాడు ఇద్దరు సమానమా, చట్టం ముందు ఒకటేనా? యాక్స్చువల్‌ ఇనీక్వాలిటీస్‌ (అసలైన అసమానతలు) ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే, హక్కులైతే ఇచ్చారు. చాలా చాలా విలువలు కూడా రాజ్యాంగంలో వున్నాయి. రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి చెప్తుంది. సెక్యులరిజం, సామ్యవాదం గురించి చెప్తుంది. అన్నీ ఇస్తామని ప్రామిస్‌ చేసింది. దీన్ని నిజం చేయడానికే పాలకవర్గం అధికారంలోకి వస్తుంది. రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌ (పీఠిక) అనేది కేవలం ఒక వివరణ కాదు. అదొక ప్రతిజ్ఞ. ఆనాటి పాలకవర్గాలు ఆ ప్రతిజ్ఞ చేశాయి. ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని, లౌకికత్వాన్ని సామ్యవాద సమాజాన్ని నెలకొల్పుతామని, రిపబ్లిక్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం ప్రతిజ్ఞ చేసారు. అలాగే ఆత్మగౌరవంతో బతికే హక్కు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందిస్తామన్నారు. ఆ ప్రామిస్‌ ఇవాళ ఎంత నిలబెట్టుకున్నామన్నది వేరే సంగతి.

ఆర్టికల్‌ 14 ఒక్కటే కాదు, భారత రాజ్యాంగంలో సమానత్వానికి సంబంధించిన వేరువేరు అంశాలు ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య భేదాలు, కులపరంగా వివక్ష మతపరంగా, జాతిపరంగా వివక్ష వీటితో పాటు ఇవాళ ఇంకో చర్చకూడా ఉంది. ఛాయిస్‌ ఆఫ్‌ సెక్సువల్‌ బిహేవియర్స్‌, ఓరియంటేషన్స్‌ – ఎల్‌జిబిటిక్యు గురించి. శబరిమలై మీద మహిళలకు ప్రవేశం ఉండాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌

ఇచ్చిన తర్వాత మొత్తం గగ్గోలు పెట్టారు. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్‌ స్టెప్‌ వచ్చింది అంటే సమాజంలో దాన్ని రెసిస్ట్‌ చేయడానికి చాలా శక్తులు ఉన్నాయి. అంటే మనికింకా రాజ్యాంగ స్పృహలేదు అని అర్ధం. సమానత్వమనే ఒక విలువ, మన స్పృహలో, మన చైతన్యంలో లేదు. ఏదైనా ఒక సమస్య వచ్చినపుడు, స్త్రీ, పురుషుల మధ్య ఏదైనా గొడవొచ్చినపుడు, లేదా వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడేప్పుడు మనం మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. ‘ఆమె చానా ఫాస్ట్‌ లేబ్బా, లేకపోతే ఎందుకు జరుగుతాది గాని’, ‘అలా డ్రస్సులేసుకోవడం వల్ల రేపులు జరుగుతాయి’.. ఇలా ఉంటుంది మన సమాజంలో. 

కాబట్టి మన స్పృహలో, మన చైతన్యంలో ఆ విలువలు లేవు. ఎందుకంటే మనం పారిశ్రామిక విప్లవ వారసులం కాదు. వాళ్ళు ఇచ్చిన కొన్ని ఫలాలు మనం అనుభవిస్తున్నాము. తప్ప, కనీసం స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొనింది లేదు. కాబట్టి ఆ స్పృహ, ఆ భావన అనేవి మనకు చాలా తక్కువ స్థాయిలో వుంటాయి, అంతేకాకుండా నీ కులం శాసిస్తూ ఉంటుంది. నీ జీవితాన్ని నీ మతం శాసిస్తూ ఉంటుంది. నీ లింగ వివక్ష శాసిస్తూ ఉంటుంది. ఇన్ని పద్ధతుల్లో నీ మెదడులో చైతన్యమనేది ఆధారపడి ఉంటుంది.

సమాత్వం గురించి ఆదేశికసూత్రాలలో కూడా చెప్పారు. అంటే పరిపాలన గురించి మౌలికమైన అంశాలున్నాయి. వీటిని ప్రభుత్వం అమలు చేయాలి. ఎట్లా అమలు చేయాలి అంటే చట్టాల రూపంలో అమలు చేయాలి. ఉదాహరణకి మనకు మినిమం వేజెస్‌ (కనీస వేతనాలు) కావాలని 1948లో ఒక చట్టం వచ్చింది. ఏంటి మినిమం వేజెస్‌ అంటే? వాళ్ళు లెక్కలేసినారు. ఈ లెక్కలు కూడా మనం తయారుచేసుకున్నవి గాదు. బ్రిటిష్‌ సంప్రదాయం నుంచి వచ్చింది. అసలు మినిమం వేజెస్‌ అంటే ఏంది అంటే బతకడానికి అవసరమైన జీతం. అంటే వర్కర్‌ ఒక్కడేనా, కుటుంబం బతకొద్దా, వాళ్ళు చదువుకోరా, వాళ్ళకేమైనా ఆరోగ్య సమస్యలు రావా? కాబట్టి మినిమం వేజ్‌స్‌ అంటే ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్లు సుఖంగా, గౌరవప్రదంగా జీవితం కొనసాగించడానికి ఎంత అవసరమవుతుంది?  మినిమం వేజ్‌స్‌ కోసం కొట్లాట జరుగూతూ వుంది. బోనస్‌ కోసం జరుగుతూ ఉంది. 13 వేలు ఇస్తామంటే మాకు 18 వేలియ్యాలి అని. మినిమం వేజెస్‌ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో వేరువేరుగా ఉంటుంది. మినిమం వేజెస్‌ లెక్కేయాల్సింది పనిచేస్తున్న వాడికొక్కనికే కాదు. వాళ్ళ కుటుంబం సుఖంగా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంత డబ్బులవసరమౌతాయి. ఆయన గూడా ప్రమాదంలో పడితే ఎంతైతది అనే లెక్కలతో ఉంటాయి.

కాబట్టి మూడు రకాల వేజ్‌స్‌ ఉన్నాయి. మినిమం వేజెస్‌ (కనీస వేతనం), రియల్‌ వేజెస్‌ (నిజ వేతనం), లివింగ్‌ వేజ్‌స్‌ (జీవన వేతనం). మనం కనీసం లివింగ్‌ వేజ్‌స్‌ కూడా అడగడం లేదు. అంటే కుటుంబం బతకడానికి కనీస ఆదాయం. దాన్ని మీరు ప్రసాదించండి అని 1948లో చట్టమొస్తే యాజమాన్యాలంతా సుప్రీం కోర్టుకు పోయినాయి. యాజమాన్యాలు, పెట్టుబడిదారులు, భూస్వాములు సమానత్వం అనే ప్రశ్న ఎప్పుడు వచ్చినా కూడా కోర్టుకు పోతారు. భూసంస్కరణలు చేసినపుడు కోర్టుకు పోయినారు. వీళ్లేమన్నారంటే సుప్రీం కోర్టు ముందు, మేం జమీందారులమే, కాదనలేదు. మా దాంట్లో చిన్న జమిందార్లున్నారు, పెద్ద జమిందార్లున్నారు. అయితే మేం పౌరులం కదా, రాజ్యాంగంలో ఏం రాసినారు? చట్టం ముందు అందరూ సమానులు. మరి ఎందుకు మా లాండ్స్‌ ఎటా గుంజుకుంటున్నావ్‌? అంతేగాకుండా చిన్న జమిందారులకు ఎక్కువ పరిహారం ఇవ్వండి, పెద్ద జమీందారులకు కొంచెం తక్కువ పరిహారం ఇవ్వాలని చట్టంలో వుంటే అట్లా ఎందుకు తేడా చూపిస్తావు, అందరికి ఒకటే ఇవ్వాలి కదా, చిన్న జమిందారైతే ఏం, పెద్ద జమిందారైతే ఏం? పెద్ద జమిందారుకు ఎక్కువ కష్టాలుంటాయి ఇంకా ఇది వివక్ష కాదా! ఇది సమానత్వమనే హక్కుకు వ్యతిరేకం కాదా! అని సుప్రీంకోర్టులో 1950లో సవాలు చేశారు. అవును ఇది ఈక్వాలిటికి వ్యతిరేకం అని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకేం చేయాలి.

నెహ్రూ ఏమో భూ సంస్కరణలు తీసుకోనొస్తా, దున్నే వానికి భూమి ఇస్తా, మొత్తం భూస్వాముల దగ్గర నుంచి, జమీందారుల దగ్గర నుంచి భూమి అంతా స్వాధీనం చేసుకొంటా అన్నాడు. అక్వయిర్‌ చేయడమంటే తీసేసుకోవడమనిగాదు, కొంత నష్టపరిహారం ఇవ్వాలి కదా,  కాబట్టి కొని, ఎవరైతే వ్యసాయదారులున్నారో, ఎవరైతే పేద రైతులున్నారో వారందరికీ ఇస్తామని అన్నాడు.

మరి 1955లోనే ఆ రకంగా బ్రేక్‌ వస్తే నెహ్రూ ఏమన్నాడంటే, ఈ కోర్టులన్ని ఇట్లే చేస్తాయి, ఈ కోర్టులకు అసలు తెలివి లేదు, ఈ జడ్జీలకు న్యాయమంటే విలువ లేదు. మేమేదో సమానత్వం కోసం, సంస్కరణల కోసం ఈ చట్టం తీసుకువస్తే మీరు కొట్టేస్తే, ఏమనుకోవాల మేము?

మరి నీదగ్గర ఉన్న పరిష్కారం ఏంది చివరికి? రాజ్యాంగాన్ని సవరించు, సవరించడం సమానత్వమనే హక్కు మీదనే. ఆయనేమన్నాడు అంటే రాజ్యాంగాన్ని పెట్టుబడిదారులు, భూస్వాములు, ఈ లాయర్లంతా కలిసి హైజాక్‌ చేస్తున్నారు. ఈక్వాలిటి అనేపేరు చెప్పి. కాబట్టి సవరణ తీసుకురావాలి అని, భూ సంస్కరణలను కోర్టులో సవాలు చేయకుండా వీలు కల్పించే ఒక అమెండ్‌మెంట్‌ని రాజ్యాంగంలో తీసుకొచ్చారు. ఇక సవాలు చేయరు వీళ్ళు. అంటే పార్లమెంటు చట్టం చేసింది. దాన్ని అమెండ్‌మెంట్‌ ద్వారా తీసుకొచ్చింది.

ఇంకొక ఉదాహరణ ఏందంటే రిజర్వేషన్స్‌, మొదటి ఓబిసిలకు రిజర్వేషన్స్‌ చేసింది మద్రాసు గవర్నమెంట్‌లో. 1918లోనే కొల్హాపూర్‌ రాజా వాళ్ళ దగ్గర నుంచే రిజర్వేషన్స్‌ మొదలయ్యాయి. అయితే మద్రాసులో అప్పటికే కుల వ్యతిరేక పోరాటాలున్నాయి. ప్రభుత్వం కొన్ని కొన్ని సెక్షన్స్‌కి రిజర్వేషన్స్‌ కల్పించబోతే దాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసారు. సుప్రీం కోర్టు కూడా అందరూ సమానంగానే చదువుకోండి, మెరిట్‌ సంపాదించుకుందురు, సీట్లు సంపాదించుకుందురు, లేదా ఉద్యోగాలు సంపాదించుకోండి, అంతే తప్ప ఈ కులం పేరుతో రిజర్వేషన్లు పొందడమేందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టేసింది. అంటే ఆ కాలంలో 50, 60లలో కోర్టుల చైతన్యం కూడా ప్రజాస్వామికంగా లేదు అనేది మనకు తెలుస్తుంది. తరువాత దాన్ని అమెండ్‌ చేసుకోవడం, తరువాత మళ్ళీ ఆ చట్టాలను, విధానాలను అమలు చేయడానికి సులభం అయింది. ఇప్పటికి కూడా దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. అంటే ఎందుకొస్తాది చర్చ? ఒకసారి సెటిల్‌ అయిన తరువాత, రాజ్యాంగం పక్కాగా చెప్పిన తరువాత ఎందుకు ప్రతిసారీ దీనిమీద చర్చ, దాని మీద కేసులు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కోసారి కోర్టులకు పోవాల్నా వద్దా అని కూడా డిసైడ్‌ చేసుకోవాలి మనం.

ఇంక స్వేచ్ఛల గురించి మాట్లాడుకుంటే, ఆర్టికల్‌ 19ను ప్రత్యేకంగా ‘‘లైట్‌ హౌస్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ డెమోక్రసీ’’ అని చెప్తారు. అనేక స్వేచ్ఛల గురించి రాజ్యాంగం రాసింది. ఎందుకివన్నీ అవసరం? హక్కులను మనం ఎట్లా అర్ధం చేసుకుంటాం? హక్కులు లేకపోతే నీవు వికలాంగుడివి అయినట్లే. హక్కులు మన స్పృహలో భాగం, నీ శరీరంలో భాగం. నిన్ను ఒక పది రోజులు ఒక రూములో వేసి ఎవ్వరితో మాట్లాడకుండా చేస్తే ఏమైపోతావు? బాగా ప్రేమించుకున్నారనుకో ఇద్దరు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా, కలుసుకోకుండా చేస్తే వాళ్ళు యేట్లా అల్లాడుతారు? మాట్లాడే స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేవి జీవితానికి చాలా ముఖ్యం. ఒక సింగర్‌ను పాడకుండా ఆపేసినా, ఒక రైటర్‌ను రాయకుండా ఆపేసి లేదా, ఒక సంఘాన్ని ఆపేసినా నువ్వు హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు. కాబట్టి ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అంటే నిన్ను నువ్వు వ్యక్తీకరించుకోవడం. నీ అభిప్రాయమేందో బహిరంగంగా చెప్పడానికి, నీ ఆలోచనలను వ్యక్తీకరించడానికి నీకు స్వేచ్ఛ ఉండాల్నా వద్దా?

ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్వీచ్‌లో ఫ్రీడం ఆఫ్‌ ప్రెస్‌ కూడా ఉంది అని మన రాజ్యాంగం చెప్తూ ఉంది. నిన్ననే నక్కీరన్‌ను లోపలేసినారు. జైల్లో వేసి మళ్లీబైటకి తీసుకొచ్చినారు మద్రాసులో. ఆయన పత్రికా సంపాదకుడు. అయనేదో గవర్నరు గురించి రాసినాడు. ఆ గవర్నరు కూడా ఏదో కాలేజీకి  సంబంధించి లెక్చరర్‌ ఏదో దందా చేస్తోంది, ఆమెతో సంబంధాలున్నాయి అని రాసినాడు. అది నిజమా కాదా, వెరిఫికేషన్‌ ఏం లేదు. తమిళనాడులో ఆయన ప్రముఖ జర్నలిస్టు. గౌరీ లంకేష్‌ను చంపేశారు. అన్నిటిమీద మాట్లాడుతుందని. మీ అభిప్రాయాలు సమాజానికి చెప్పడానికో, సమాజాన్ని చైతన్య పరచడానికో, లేదా మీ అభిప్రాయంతో అంగీకరింపచేయడానికో ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ అవసరం. వాక్‌ స్వాతంత్రం అంటే గొణుక్కోవడం కాదు. ఇంట్లో వుండి గొణుక్కుంటూ వుంటే అది ఫ్రీడ్‌ ఆఫ్‌ స్వీచ్‌ కాదు.

వ్యక్తులకు, సమూహాలకు భావవ్యక్తీకరణ ఎట్లా అదుపు చేయబడుతుంది మన సమాజంలో? మా యూనివర్సిటీలో హాస్టల్‌లో చూస్తుంటాము. ఒక అర్ధగంట కరెంట్‌ పోయిందంటే విద్యార్థుల అసలు మనస్తత్వం తెలుస్తుంది. ఎన్ని విజిల్స్‌ వస్తాయి, ఎన్ని బూతులొస్తాయి? ఎంత అల్లరి చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడూ అంత బహిరంగంగా, అంత ఓపెన్‌గా మాట్లాడే అవకాశం రాదు. కరెంట్‌ పోయినప్పుడే. యూనివర్సిటీలో వేరేవాడేమనుకుంటాడో, లేదా వార్డెను దృష్టిలో పడితే నన్ను తీసేస్తాడేమో, ఇవన్నీ వుంటాయి.

ఇక మహిళల పరిస్థితి ఏమిటి? భావవ్యక్తీకరణ ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు కనీసం నవ్వడానికి ఉంటుందా? ఒకసారి మీటింగ్‌లో మాట్లాడుతుంటే, ప్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఇనీక్వాలిటీ అని ఒకరు అంటుంటే సీనియర్‌ సుప్రీం కోర్టు అడ్వకేట్‌ నందితా హక్సర్‌ యు స్టాపిట్‌ అనింది. మీకేం తెలుసు అసలు మహిళల గురించి అనింది.

నిజంగా మగవాళ్ళకేం తెలీదు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టు ఫస్టు. అసలు ఆమెకు ఓపెన్‌గా నవ్వడానికుందా? ఒక చీర ఎంపిక చేసుకునే హక్కు ఉందా? ఇతర్లతో కలిసి నడవడానికుందా?’’ అన్నది ఆమె. మన సంస్కృతిలో మన మ్యారేజ్‌ సిస్టంలో, మన కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు ఆ ఫ్రీడం ఉందా? ఎంత ఇంట్లో వుంటే అంత మర్యాదస్తురాలు! కాబట్టి బైటికి పోయిందంటే ఏదో ఒకటి జరుగుతుంది. మా కొలీగ్స్‌ కూడా భార్యలను ఇంట్లోపెట్టి లాక్‌ చేసి యూనివర్సిటీకి వచ్చేవారున్నారు.

ఫ్రీడం అఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అనేది సమాజంలో చాలా శక్తివంతమైన ఆయుధం. నేను చెప్పడం వాళ్లకు ఇష్టమా లేదా అని కాదు. సమాజంలో చైతన్యం, ప్రజాస్వామిక స్పృహ కలిగించడానికి నీకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడాలి కదా! వేరే వాళ్ళతో సంబంధంలో వుండాలి కదా! ఒంటరిగా నువ్వు జీవించలేవు. సమూహంలో జీవిస్తావు. నీ సామాజిక సంబంధాల్లో నువ్వెప్పుడూ ఉంటావు. లేదా నీ ఫ్రెండ్‌ షిప్‌లో  ఉంటావు. కానీ ఒక వ్యక్తీకరణకు, ఎక్స్‌ప్రెషన్‌లోఉంటావు. కానీ ఒక వ్యక్తీకరణకు, ఎక్స్‌ప్రెస్‌ యువర్‌ సెల్ఫ్‌ అనేదానికి మన సమాజంలో అవకాశాలు లేవు. ప్రత్యేకంగా స్త్రీలకు. వ్యక్తిగతంగా హక్కులు చాలా అవసరం, నువ్వు మాట్లాడుకోడానికి, ఎక్స్‌ప్రెస్‌ చేసుకోడానికి, నీ అభిప్రాయాలు చెప్పుకోడానికి.  అదే సమయంలో సామాజిక ఆచరణకు హక్కులు చాలా అవసరం. ప్రశ్నించడానికి హక్కులు అవసరం. ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌ దేని కోసం? ఒకరిని ప్రశ్నించడానికి. దేని గురించి ప్రశ్నించడానికి. సమాజానికి నష్టం చేసే పరిస్థితులు, లేదా సమాజాన్ని అనాగరికత వైపు తీసుకుపోతున్న పరిస్థితులు – దాని మీద మాట్లాడాలి. సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించడానికి ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అనేది కావాలి.

మనం మంచిగా, గౌరవంగా, మన ఇష్ట ప్రకారం, లేదా మన కాన్షియస్‌ ప్రకారం బతకడానికి, ఇష్టమైన పోయం రాసుకోవడానికి, ఇష్టమైన నవల రాసుకోవడానికి, లేదా ఇష్టమైన పాట పాడుకోవడానికి, ఇష్టమైన డ్యాన్సు చేయడానికి ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌ కావాలి. ఇదొక పెద్ద ప్రశ్నగా మేనకా గాంధీ విషయంలో ఇదే వచ్చింది. ఆమెకి, అత్తకి పడదు. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. తరువాత మళ్లీ ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ వచ్చిన తరువాత, మేనకాగాంధీ ఫారిన్‌ టూరు పోవాలనుకుంది. ఆమె పోయి జనతా గవర్నమెంట్‌ గురించి, జనతా పార్టీ పాలసీ గురించి ప్రచారం చేయడమేగాక తన మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అని ఇందిరాగాంధీ ఆమె పాస్‌ పోర్టు విత్‌ డ్రా చేసింది. పాస్‌ పోర్ట్‌ అవసరం కదా వేరే దేశాలకు పోవడానికి. ఈమె సుప్రీంకోర్టుకు పోయింది. కారణాలు చెప్పకుండా నా పాస్‌ పోర్ట్‌ విత్‌ డ్రా చేయడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19కు వ్యతిరేకం, ఆర్టికల్‌ 21కి అంటే పర్సనల్‌ లిబర్జీకి వ్యతిరేకం. పాస్‌ పోర్ట్‌ అధికారికి అధికారం వుంది కదా అంటే విచక్షణాధికారం వుంది గాని దాన్ని యెట్లా ఉపయోగించాలి. సజావుగా ఉపయోగించాలి, సమానంగా వుపయోగించాలి. రీజనబుల్‌గా ఉపయోగించాలి. ఇందిరాగాంధీ చెప్పింది కాబట్టి రద్దు చేయడం కాదు. కాబట్టి చాలా చర్చ చేసింది సుప్రీంకోర్టు. ఒక డ్యాన్సర్‌ వేరే దేశానికి పోయి నృత్య ప్రదర్శన చేయాలనుకో, లేదు,  నువ్‌ చేయడానికి వీలు లేదు, నృత్యం చేయడంలో కూడా నువ్వు విప్లవం చెబుతావని  నాకు భయంగా వుంది అంటే అది వేరే.

సుప్రీంకోర్టు మేనకాగాంధీ కేసులో చెప్పింది చాలా ఇంపార్టెంట్‌. హక్కుల కార్యకర్తలకు, పవర్‌, అంటే చట్టం అనేది సజావుగా, ఫెయిర్‌గా, రీజనబుల్‌గా వుండాలి. ప్రొసీజర్‌ కూడా అంతే ప్రొసీజర్‌ కూడా సవ్యంగా, సమంజసంగా న్యాయబద్ధంగా వుండాలని మొట్టమొదటి సారిగా మన భారతదేశంలో ఒక జీవో పాస్‌ చేశారు.

అమెరికాలో ఎట్లయితే సుప్రీంకోర్టులు ఫాలో అవుతాయో, అదేవిధంగా మన భారతదేశంలో కూడా కావడానికి, ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో పాటు ఫ్రీడం ఆఫ్‌ అసోసియేషన్‌ (సంఘం పెట్టుకునే హక్కు) అన్నారు. ఫ్రీడం ఆఫ్‌ యూనియన్‌ విత్‌ అవుట్‌ ఆర్ట్మ్‌ (ఆయుధాలు లేకుండా యూనియన్‌గా ఏర్పడే హక్కు) – కాబట్టి నక్సలైట్లతో  మీరు ఆయుధాలు పట్టుకొని తిరగితే మేం చర్చలు చేయం అంటారు. అమెరికాలో మళ్ళీ ఆయుధాలు కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు, కాల్చేసుకోవచ్చు, తరువాత కేసులుంటాయి. కాబట్టి అక్కడ పిల్లలు ఆయుధాలు పెట్టుకోని ఉంటారు అంటుంటారు. ప్రభుత్వమే చెబుతోంది మీకు సేఫ్‌ కాదని, సెక్యూరిటీ కల్పించలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం. వాళ్ళు మన ఫ్యాక్షన్‌ లీడర్ల మాదిరి ఎప్పుడూ గన్‌ పెట్టుకుని తిరుగుతారు.

ఫ్రీడం ఆఫ్‌ అసోసియేషన్‌, ఫ్రీడం ఆఫ్‌ యూనిటీ ఇవి ఎక్కడినుంచి వచ్చినాయి అంటే, వేరే దేశాల్లో, ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా మన రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఏముండేదంటే సమ్మె చట్టవిరుద్ధం అని, సమ్మె చేయడం కుట్ర అని. ఇది చాలా కాలం జరిగింది.

తర్వాత ఏమైందంటే యూనియన్‌లో మెంబర్‌ అయితేనే నీకు ఉద్యోగం వస్తుంది. ఫ్యాక్టరీలో. ఇక్కడ ఏందంటే యూనియన్‌ పెట్టుకోకపోతే నీకేదైనా ఇస్తాం బ్రిటన్‌లో కార్మికోద్యమం చాలా స్ట్రాంగ్‌, వాడు ఫైనల్‌గా ఏంజేసినాడంటే యూనియన్‌కు చెప్పకుండా, యూనియన్‌లో మెంబర్‌గా ఉన్నా నువ్వు ఉద్యోగం సంపాదించుకోలేవు.

అమెరికాలో ఏమైంది? అది స్వెట్‌ షాప్స్‌ అంటాం. నీకు ఉద్యోగం దొరకాలంటే ఒక కాంట్రాక్టరుంటాడు. అంటే ఇప్పుడు అడ్డాలు ఉంటాయి చూడండి. మన అడ్డాలల్లో కూలీలుంటారు కదా, మనకు కావాల్సిన వాణ్ని సంతలోనో యాడో తీసుకొచ్చుకుంటాం. అట్లా అమెరికాలో కూడా స్వెట్‌ షాప్స్‌. దాన్నంతా వ్యతిరేకించి, పోరాడి, వాళ్ళు ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్లకు కావాల్సి హక్కులు సాధించుకున్నారు.

మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేకంటే కొంచెం ముందు కూడా బ్రిటన్‌లో సమ్మె అనేది కుట్రతో సమానం. ఒకే వ్యక్తి స్ట్రైక్‌ చేయలేడు (నలుగురూ కలిసే చేస్తారు) అంటే ఇప్పుడు చేస్తున్నారు. భర్తతో అవమానాలు పడి, ఇంటి ముందు మౌన పోరాటం చేస్తుంటారు అది కాదు.  

అక్కడ పోరాటాలు ఎట్లా వచ్చాయంటే, ఈ స్ట్రైక్‌ అనేది ఇల్లీగల్‌ కాదు. అది ఒక సామూహిక హక్కు అన్నారు. సమ్మె కూడా ఒక ప్రజాస్వామిక హక్కు సంఘటితమయ్యే హక్కు సంఘం పెట్టుకునే హక్కు మీ డిమాండ్లను సామూహికంగా వ్యక్తీకరించడానికి అవసరం. ఇప్పుడు (పారిశ్రామిక వివాదాల చట్టం) మనకు అంటే టీచర్సుకు వర్తించదు, కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. దాంట్లో సమ్మె హక్కు ఉందా అంటే ఎంతవరకు ఉంది? నువ్వు 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. దాన్ని 80 రోజులకు పెంచాలని మోడీ ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తా ఉంది.   కాని ఎందుకు నోటీసు ఇవ్వాలి? షడెన్‌గా సమ్మె చేయకూడదా? అన్నిటికంటే ప్రమాదం పారిశ్రామికవేత్తలకు, యజమానులకు ఏందంటే సిట్‌ డౌన్‌ స్ట్రై చేయడం. బయట ఎన్నిసార్లు చేసినా వాళ్ళకు ఏం కాదు. లోపలికొచ్చి సిట్‌డౌన్‌ చేస్తే సమాధానం చెప్పుకోవాలి. పనిచేయకుండా జీతం అడుగుతారు. కాబట్టి సిట్‌ డౌన్‌ స్ట్రైక్‌ లేకుండా చేసారు.

సుప్రీంకోర్టు కూడా ఉద్యోగస్తులు సమ్మె చేయడానికి వీలులేదని చెప్పింది. 1995లో తమిళనాడులో ఉద్యోగస్తులంతా సమ్మె చేస్తే  సమ్మె చట్టబద్ధంకాదు, సమ్మె సమంజసం కాదు, సమ్మె ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉద్యోగస్తులు అక్కడి కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కి సంబంధించి ప్రొసీజర్‌ ఫాలో కాకుండా సమ్మె చేస్తే జయలలిత ప్రభుత్వం వేల మందిని తొలగించింది.

ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్‌ యాక్ట్‌లో చాలా స్పష్టంగా నువ్వు సమ్మె చేయాలనుకుంటే నోటీసు ఇవ్వాలి అని వుంటుంది. ఎందుకు నోటీసు ఇవ్వాలంటే, మనం కూర్చొని మాట్లాడొచ్చు కదా, కొంత బేరసారాలు చేసుకోవచ్చు కదా, మీ వాదనలు, మా వాదనలు విన్న తరువాత మనం సెటిల్‌ చేసుకోవచ్చు కదా అంటారు. సెటిల్‌మెంట్‌ సాధ్యం కాకపోతే తర్వాత ఏముంది? లేబర్‌ కమిషనర్‌ ఉన్నాడు కదా! లేబర్‌ కమిషనర్‌ కాకపోతే మనకు లేబర్‌ కోర్ట్‌ వుంది కదా! ఇవన్నీ ఒక పద్ధతి. కానీ హఠాత్తుగా సమ్మెలోకి పోవడానికి వీలు లేదు అంటారు. అసలు ఆ  యాక్ట్‌లోనే ఒక మెలిక వుంది నోటీసివ్వాలనడం వెనక రహస్యం ఏమిటి? కార్మికుల ఐక్యతను నీరుగార్చడం. అన్ని రకాల వత్తిడులు యాజమాన్యం నుంచి  వస్తాయి. అంతలోపల ఈ సమ్మె విరమించుకుంటారేమో అని ఒక ఆశతో ఆ చట్టం వచ్చింది.

ఇంకొకటి ఏముంది చట్టం అంటే  ప్రజోపయోగ సేవల్లోలో సమ్మె చేయడానికి వీల్లేదు. సెక్షన్‌ 10 (3) ప్రకారం ప్రభుత్వం ప్రజోపయోగ సేవల్లో సమ్మెను నిరోధించొచ్చు. అంతేకాకుండా ఇంకేం చెప్తందంటే, యాజమాన్యంతో చర్చించి ఒక అంగీకారానికి రాకపోతే, వాళ్ళు వెంటనే లేబర్‌ కోర్టుకో, దేనికో పోతారు. కోర్టుకు పోయినప్పుడు కూడా సమ్మె చేయడానికి లేదు. మొత్తంగా ఏందంటే ఒక పక్క రైట్‌ టూ స్ట్రైక్‌ ఇస్తూనే, మరోపక్క దాని మీద ఎకనమిక్‌ కొయెర్షన్‌ పెట్టి అక్కడ సమ్మెలను చేయడానికి లేకుండ కూడా చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది.

రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులమీద కూడా ఏయే పరిమితులు పెట్టొచ్చు అని ఆర్టికల్‌ 19(2) చాలా స్పష్టంగా చెప్పింది. ఒక చేత్తో హక్కులిస్తూ, మరోచేత్తో దానిమీద ఆంక్షలు విధించడమనేది మనకు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. రాజ్యాంగ సభలో చర్చ జరిగినపుడు కొంతమంది ఏం చెప్పినారంటే, ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు పోలీసుల దృష్టిలో నుంచే రాసినారు అని. ఎందుకో చెప్తా మళ్ళా.

ఇన్ని హక్కలిచ్చినారు రాజ్యాంగంలో, ఇవేం మీరిచ్చింది కాదు, ప్రజలు పోరాడి, రక్త తర్పణలు చేసి సాధించుని, ఈ రాజ్యాంగంలో పెట్టించుకున్నాం. దీని మీద ఇన్ని ఆంక్షలా! ఎనిమిది రకాల ఆంక్షలు! ఈ ఎనిమిది రకాల ఆంక్షల్లో మొట్టమొదటిది దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు దెబ్బ తగిలే విధంగా నీ మాట, భావప్రకటన, కదలిక, కూడిక ఉంటే (మూవ్మెంట్‌ ఆర్‌ అసెంబ్లీ) నీకా హక్కులేదు. సరే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలుండాలి. అవి దెబ్బ తగిలేలా మాట్లాడొద్దు. కాబట్టి మనం రాఫెల్‌ మీద ఏమన్నా అంటే, మీరంతా దేశాన్నే అమ్మడానికి చూస్తా ఉన్నారని మాట్లాడితే, ఫ్రెండ్లీ రిలేషన్స్‌ వున్నాయి, దెబ్బతింటాయి, ఇలా మాట్లాడుతున్నారు అని లోపలేస్తారు.

అంతేకాకుండా పబ్లిక్‌ ఆర్డర్‌ దెబ్బ తింటాది, శాంతి భద్రతలు దెబ్బతింటాయి అంటే ఆంక్షలు. ఇంక పబ్లిక్‌ ఆర్దర్‌ అంటే మనం డిఫైన్‌ చేయలేం. ఎవరు డిఫైన్‌ చేస్తారు? ముఖ్యమంత్రి కాదు, కానిస్టేబుల్‌ డిఫైన్‌ చేస్తాడు, లేదా ఎస్సై డిఫైన్‌ చేస్తాడు. వీళ్ళంతా వస్తా వున్నారు. పబ్లిక్‌ ఆర్డర్‌ దెబ్బ తింటాది, శాంతిభద్రతలు దెబ్బ తింటాయి, కాబట్టి సెక్షన్‌ 144 అంటారు. నేనొక్కొక్కసారి ఈ ప్రశ్న వేస్తుంటా మా స్టూడెంట్స్‌కు పాఠం చెప్పేటప్పుడు. ‘‘రాజ్యాంగం గొప్పదా, సెక్షన్‌ 144 గొప్పదా’’ అని ఏది గొప్పది? నా ప్రాక్టీస్‌లో వన్‌ ఫార్టీ ఫోరే  గొప్పది.

పబ్లిక్‌ ఆర్డర్‌ దెబ్బ తింటాది, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది కాబట్టి ప్రివెంటివ్‌ ఆక్షన్‌ తీసుకుంటున్నాం, కాబట్టి వాళ్ళని అక్కడ నుంచి కదలనివ్వం అంటారు. అయితే మరి చంద్రబాబు నాయుడు ఉద్యమం చేస్తాడు గాని ప్రజలు ఉద్యమం చేయకూడదు. వరలక్ష్మి వాళ్ళు పోస్టర్లు పట్టుకుని ఆడ నిలబడితే వీళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలికి తోయచ్చు. కాబట్టి 144 అనే కాదు, మొత్తం రాజ్యాంగంలోనే, నీ హక్కులు వుపయోగించుకోడానికి, లేదా పొందడానికి చాలా ఆంక్షలున్నాయి.

ఎనిమిది రకాల ఆంక్షలు – కోర్టు ధిక్కారం దగ్గర నుంచి, డీసెన్సీ, మొరాలిటీ దాకా. ఏది మొరాలిటీ? ఏది డీసెన్సీ? నీవు డిఫైన్‌ చేసేదే మొరాలిటీనా? అంటే సమాజంలో మొరాలిటి అంటే నైతికత అనేది ఎప్పటికి ఒకే విధంగా ఉంటుందా? స్త్రీ పురుషుల మధ్య లైంగికచర్య, హోమో సెక్సువాలిటీని మనమెందుకు ఒప్పుకోలేదు? ఇది నైతిక వ్యతిరేకమా? ఇవ్వాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పు. ఇద్దరు యువకుల మధ్య పరస్పర అంగీకారంతో సెక్స్‌ అనేది తప్పు కాదు. ఎందుకు చెప్పాల్పొచ్చింది అంటే, ఈ పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడమూ, లోపలేయడమూ, చిత్రహింసలు పెట్టడమూ, మొత్తం సమాజం చిన్న చూపు చూడడం, వాళ్ళు భయంభయంగా సంబంధాలు పెట్టుకోవడం, మళ్ళీ ఎయిడ్స్‌ వస్తుందని పుకార్లు చేయడం చాలా ఉంది. వేరే దేశాల్లో కూడా స్వలింగ సంపర్కం అనేదాన్ని ఆమోదించారు. వాళ్ళ మధ్య వివాహాన్ని కూడా గుర్తిస్తున్నారు. మ్యారేజ్‌ చేసుకుంటే పిల్లలు పుట్టరు కదా, అంటే పిల్లలు పుడితేనే మ్యారేజా? అంటే మ్యారేజ్‌ ఉద్దేశ్యమేమిటి? మరి సంతానం ఊరికే రారు కదా, లైంగిక చర్య వుండాలి కదా. లైంగిక సపోర్టు ఉండాలి కదా. వాళ్ళ ఇష్టమది. ఒక్కోసారి ఒక్కో వ్యక్తికి నాచురల్‌గా ఉంటాది. కాబట్టి చాలా చక్కగా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది.

అయితే. వ్యక్తిగతమైన హక్కులు చాలా చెప్తున్నప్పటికీ, రెండోపక్క సామూహిక హక్కులు, సంఘటితమయ్యే హక్కు యూనియన్‌ పెట్టుకునే హక్కు నిరసన తెలిపే హక్కు అసమ్మతి తెలిపే హక్కు అనేవి సుప్రీం కోర్టుకూడా ఆంగీకరించడం లేదు. ఈ ఫ్రీడమ్‌ గురించి అర్ధం చేసుకోవాలి. ఇవి లైట్‌ హౌస్‌ (దీపస్థంబం) లాంటివి – మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోడానికి, మీ సృజనాత్మకను పెంపొందించుకోడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి. దోపిడీపై పోరాడడానికి, ప్రభుత్వాలపై పోరాడడానికి. పోరాదే చైతన్యం అనేది హక్కులు ఇస్తాయని మనం అర్ధం చేసుకోవాలి. వ్యక్తిగత హక్కులు అయిన్నప్పటికీ కూడా పోరాడే చైతన్యాన్ని కల్పిస్తాయి. కాబట్టి హక్కుల సృహ అనేది లేకుండా మనం పోరాడలేం, మనం ప్రశ్నించలేం.

లిబర్టీ-వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే, పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలు చేస్తే అతన్ని చిత్రహింసలు చేయడానికి వీల్లేదు, బెయిల్‌ ఇవ్వాలి, జైల్లోవుంచకూడదు అని అడగడానికి చాలా చరిత్ర వుంది బ్రిటన్‌లోగానీ, అమెరికాలో గాని, యూరప్‌లో గాని ఈ చరిత్ర వుంది. ఒక స్లోగన్‌ వుండేది బ్రిటన్‌లో. ‘ఎండ రావచ్చు, ఉరుము రావచ్చు, గాలి రావచ్చు గాని నీ ఇంట్లోకి పోలీసువాడు రాకూడదు. ప్రతి ఇల్లు ఒక కోట లాంటిది. నీ ఇల్లు నీకొక సౌధం. నీ ఇంట్లోకి నీ అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకూడదు’

ఎందుకొచ్చింది ఇలాంటి డిమాండు అంటే, పొద్దున్న లేచిన దగ్గరనుండి పోలీసులొచ్చి తలుపులు కొట్టి సతాయించే వాళ్ళు. ఎవడెవడున్నాడు అని. రైట్‌ టు ప్రైవసీ (గోప్యత హక్కు) అది. ఆధార్‌తో రైట్‌ టు ప్రైవసీ కాదు మనం మాట్లాడేది. ఆ రోజుల్లో బ్రిటన్‌లో, అదే విధంగా అమెరికాలో మహిళలకు, ప్రత్యేకించి వితంతువులకు, ప్రభుత్వం కొన్ని బెనిఫిట్స్‌ ఇచ్చింది. అయితే ఒక కండిషన్‌ పెట్టింది. అదేమంటే, ఆ ప్రయోజనాలు పొందుతున్నంత వరకు ఆమె ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదు. వేరే వాళ్ళతో వుండకూడదు. ఆ కండీషన్‌ పెట్టి, రాత్రి పన్నెండు గంటలయ్యిందంటే పోలీసోడొచ్చి తలుపు కొట్టేది, ఎవరితోనన్నా ఉన్నావా అని. అది భరించలేకపోయినారు వాళ్ళు. వాళ్ళ ఆర్గ్యుమెంట్‌ ఏందంటే, మేం విధవలమేగానీ జీవితాంతం ఇట్లనే బతకాలా? రెండోది, మా వ్యక్తిగత ఏకాంతాన్ని వీళ్ళు భగ్నం చేస్తున్నారు. కాబట్టి అదెట్లా సబబు రాజ్యాంగం ప్రకారం? లిబర్టీ అంటే ప్రైవసీ వుండాలి. ఇట్లా పోలీసులు రోజూ వచ్చి తలుపు తడుతూ మాకు నిద్రాభంగం కలిగించడం ఏమిటి? ఒకవేళ సంబంధం పెట్టుకుంటే అంత మాత్రంకే రాయితీకి మేం అర్హులం కాదా అని కూడా డిమాండ్‌ చేస్తే, చివరికి సుప్రీంకోర్టు అవును ఇది రైట్‌ టూ ప్రైవసీ కూడా, పోలీసోళ్ళు పోయి ఇట్లా చేయడానికి అవకాశం ఉండకూడదు అని తీర్పు ఇచ్చింది.

మన రాజ్యాంగాన్ని జూస్తే ఆర్టికల్‌ 21 అందరికి జీవించే హక్కు ఉంది అని చెప్తుంది. ఎవరి ప్రాణం కూడా తీయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం తప్ప. దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తున్నారు. రైట్‌ టూ లైఫ్‌ పోతావుంది. రైట్‌ టూ లైఫ్‌ అనేది ఎన్‌కౌంటర్‌ గురించే కాదు. గౌరవప్రదంగా జీవించే హక్కు. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే, మనిషి బతకడటమనేది, కేవలం పశువులా బతకడం కాదు. మనిషి మేధస్సు, వ్యక్తిత్వం, సృజనాత్మకత అభివృద్ధి చేయడానికి రాజ్యం సహకరించాలి. కాబట్టి రైట్‌ టు వర్క్స్‌ (పని హక్కు, రైట్‌ టు ఎడ్యుకేషన్‌, రైట్‌ టు హెల్త్‌  అన్నీ జీవించే హక్కులో భాగం అని చెప్పేసింది. పనిలేకుండా ఎవడూ తినలేడు, బతకలేడు. కేవలం మీరేదో రైట్‌ టూ లైఫ్‌ అంటే పశువు కూడా బతుకుతుంది, పశువు కూడా మేత మేస్తుంది. కాబట్టి మనుషులకు హుందాగా, ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉండాలి.

ఇదే చాఫ్టర్‌లో ఆర్టికల్‌ 22 అనేది ఉంది. నేనేమంటానంటే ఇది రోజా చెట్టులాంటిది. స్వేచ్ఛ అనేది వుంటుంది, అయితే ముల్లులుంటాయి. ఆ ముల్లెక్కడ అంటే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (ముందస్తు అరెస్టు) చేయడానికి రాజ్యానికి అధికారం వుంది. అదే ఆర్టికల్‌లోనే ఏం చెప్పాడంటే, నువ్వు అరెస్టయితే వెంటనే నీకు అరెస్టు కారణాలు చెప్పాలి. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. నీకందుబాటులో ఉన్న లాయర్‌తో కన్సల్ట్‌ కావాలి. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. సి.ఆర్‌.పి.సి.లో ఉండేటివి కాదు.

ఆ తరువాత మొదలవుతుంది మన కథ. ఆర్టికల్‌ 22 (4) నుంచి. దీని ప్రకారం  ముందస్తు అరెస్టు చట్టం చేయడానికి అవకాశం ఉంది. ఎన్నిరోజులైనా నిర్బంధంలో పెట్టడానికి అవకాశం వుండే చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంది. దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే మరి ఏం లాభం? ఎమర్జెన్సీలో అదే జరిగింది. నాసా చట్టం, మీసా చట్టం ముందస్తు అరెస్టును అనుమతిస్తాయి. కాబట్టి మీసాలు, నాసాలు తీసుకొచ్చి, ఇప్పుడు యుఎపిఎ తీసుకొచ్చి నిన్ను కదలకుండా జైల్లో వేయడానికి అవకాశం వుంది. ఇంక వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఎక్కడ మాట్లాడాలి? ఆర్టికల్‌ 19 మీద ఆంక్షలు, అలాగే ఆర్టికల్‌ 21 మీద కూడా ఆంక్షలు పెట్టి, ముందస్తు చర్యగా, ప్రివెంటివ్‌గా అరెస్టు చేస్తున్నాము తప్ప మొత్తానికైతే అరెస్టు చేయడం లేదు కదా అంటారు.

ముందస్తు అరెస్టు చట్టాలనేవి నాగరిక సమాజంలో ఏ రాజ్యాంగంలో లేవు. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో వెతికినా ఈ చట్టముండదు. మన రాజ్యాంగంలోనే వుంది. చాలామంది విమర్శించారు. నెహ్రూని అడిగినారు, పటేల్‌ని అడిగినారు. ఈ చట్టం చేసిన తరువాత పటేల్‌ ‘నాకు నిద్ర రావడం లేదు, నేను చట్టమయితే చేసినా’’ అన్నాడు. మరి నిద్ర రాకుండా ఎందుకు చేసుకున్నావ్‌, లేకుండా చేయచ్చు కదా అంటే, ‘కాదు’’. ఎందుకంటే హిందూ ముస్లింల గొడవలున్నాయి. దేశం ఇప్పుడే స్వాతంత్రమైంది, అభివృద్ధి పథంలో నడవాలి, ఇక్కడ అల్లర్లు చేస్తున్నారు కమ్యూనిస్టులు, వేరేవాళ్ళు అందరూ, కాబట్టి వీళ్ళందర్నీ లోపలెయ్యాలి. నంబూద్రిపాద్‌, ఎ.కే. గోపాలన్‌ ఇట్లాంటి వాళ్ళు స్వాతంత్రమొచ్చినా ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ కింద జైల్లోనే వున్నారు. ఎంతోమంది స్వాతంత్రమొచ్చినా జైల్లోనే వున్నారు. 

ఇవీ మనకు సంబంధించిన ప్రాథమిక హక్కులు. ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అన్నీ కలిపి వ్యక్తిగత హక్కులున్నాయి. సామూహిక హక్కులున్నాయి. సమ్మె హక్కు సంఘం పెట్టుకునే హక్కు అనేవి కలెక్టివ్‌ రైట్స్‌ (సామూహిక హక్కులు). ఇవి ప్రజాస్వామిక హక్కులు. ఈ చైతన్యం వుంటే తప్ప మనం ధైర్యంగా పోయి ఆర్గనైజ్‌ చేయలేం. కేవలం ఒక డిమాండ్‌ కోసం కాదు. ఒక రంగానికి సంబంధించినది కాదు. అసోసియేషన్‌ పెట్టుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ వుంది. అయితే ఫైటింగ్‌ స్పిరిట్‌ ఎక్కడ నుంచి వస్తుంది? మనది న్యాయబద్ధమైనది. సంఘటితం కావడం, సంఘం పెట్టుకోవడం, డిమాండ్‌ చేయడం అనేవి మన హక్కులు. అలాగే పోరాడే హక్కు అనేది ప్రజాస్వామిక హక్కు అది రాజ్యాంగంలో లేదు. రైట్‌ టు అసోసియేషన్‌ అన్నప్పుడు అసోసియేషన్‌ పెట్టుకొని మేం కొట్లాడుతాం అంటే కుదరదు అంటారు. నువ్వు మాట్లాడచ్చు అంటూ, నువ్వేమైనా మాట్లాడు కాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటారు. స్వాతంత్ర పోరాటమే లేకుంటే స్వేచ్ఛ ఎక్కడిది? పోరాటమనేది కలెక్టివ్‌ స్పిరిట్‌. ఇప్పుడు పొలిటికల్‌ ప్రాక్టీస్‌ను బ్యాన్‌ చేస్తారు. రాజకీయాలను బ్యాన్‌ చేయడం.

ఇటువంటి పరిస్థితులలో మీరు అసోసియేషన్‌ స్టార్ట్‌ చేయడం అనేది చాలా గొప్ప సంగతి అని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే మీరు ఉద్యోగస్తులా, లేక కార్మికులా? ఏందసలు మీ క్యాటిగరీ? మనం చరిత్ర తెలుసుకోవాలి ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు. ఉద్యోగస్తుల గురించి, లేదా వేరే వాళ్ళ గురించి చాలా కేసులొచ్చినాయి. సుప్రీంకోర్టులో. నీకు ఉద్యోగమిచ్చే టప్పుడే నీ బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫై చేస్తారు. నీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఎట్లా వెరిఫై అవుతుందంటే, పోలీసోడు వచ్చి మంచోడేనా, ఏమైనా ఉన్నాయా అని కనుక్కుంటాడు. పోలీసోడికి డబ్బులిస్తే నేరం చేయనట్టే. ఏదైనా సమ్మె జరిగినపుడు, ఎవ్వరినీ లెక్క చేయకుండా సమ్మెలో ఆక్టివ్‌గా పాల్గొని, ఆర్గనైజ్‌ చేసినప్పుడు, యాజమాన్యాన్ని లేదా ప్రభుత్వ అధికారులను ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా సస్పెండ్‌ చేయొచ్చా? చిన్నపురెడ్డి జడ్జిమెంట్‌ మనం చదివితే  తెలుస్తుంది. అంటే ఉద్యోగంలో చేరినంత మాత్రాన నువ్వు హక్కులన్నీ కోల్పోవాల్సిన అవసరం లేదు. నువ్వు పౌరుడిగా చనిపోయినట్ల కాదు. అన్ని హక్కులు అనుభవించొచ్చు. అయితే ప్రవర్తనా నియమాల (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) లోపల అంటాడు మళ్ళా. ఒక రైట్‌ అయితే ఇచ్చినాడు. సివిల్‌ డెత్‌ కాదు, నువ్‌ మాట్లాడచ్చు, నువ్‌ ఆర్గనైజ్‌ కావచ్చు. కాబట్టి రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి అసోసియేట్‌ కావడానికి, యూనియన్‌ పెట్టుకోవడానికి హక్కుంది. బ్యాక్‌గ్రౌండ్‌ చూసి క్రమశిక్షణాచర్య కింద తొలగిస్తే వీటిని కూడా ప్రశ్నించి చేసి చాలా విజయాలు సాధించాం. మేం ఆర్‌.ఎస్‌.యూ.లో పనిచేసినప్పుడు, ఉద్యోగాలిచ్చే నాటికి పెద్ద సమస్య అయింది. చాలా మంది ఉద్యోగాలు చేయాలనుకున్నారు. కొంతమంది ఉద్యమంలోకి వెళ్ళిపోయినారు. అప్పుడంతా రాడికల్‌ స్టూడెంట్స్‌ మెడికల్‌, ఇంజనీరింగ్‌ స్టూడెంట్సే. అయితే ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ బ్యాచ్‌, మా అనంతపురంలో ఒక పదిమందికి ఉద్యోగాలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే వీళ్లంతా రాడికల్స్‌ అని. మేము ఫైట్‌ చేసినాము. పాలిటిక్స్‌ వుండడం అనేది నేరం కాదు. రాజకీయ అభిప్రాయాలు  ఉండడమనేది నేరం కాదు. రాజకీయాలు ఉంటే, అసోసియేషన్లో ఉంటే ఉద్యోగానికి నువ్వు అనర్హుడివి కాదు. ఫస్ట్‌ టైం అపాయింట్మెంట్‌ తీసుకుండేటప్పుడే వీళ్ళకు ఇన్ని యాంటిసిడెంట్స్‌ (పూర్వ చరిత్ర) ఉండడమనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే రాజ్యాంగంలో వుండే ఫ్రీడం ఆఫ్‌ అసోసియేషన్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఒపీనియన్‌, ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ హైకోర్టు ఆమోదించి, వాళ్ళందరికీ క్షియరెన్సు ఇచ్చింది. అయితే ఆరోజు ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఇక్కడలేరు. అందరూ అమెరికాలో ఉన్నారు. అది వేరే సంగతి. అంటే ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందేమో, లేదా ఇన్‌డిసిఫ్లిన్‌ కింద ఉద్యోగం తీసేస్తుందేమో, తీసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనికి భయపడుతున్నారు. అయితే యాంటిసిడెంట్స్‌ అనేవి సర్వీస్‌ నుండి తొలగించడానికి ఏకైక కారణం కాకూడదు. వాళ్ళకు రాజకీయాలు వున్నాయా లేదా అని కాదని చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో ఈ మధ్యకాలంలో, ఇంతకు ముందు కూడా వచ్చినాయి.

ఈ విధంగా మనం ఏ డిమాండు పెట్టి పోరాటం చేయాలనుకున్నా కానీ ఈ భయాలు పోగొట్టుకోవాలి. ఇన్‌హిబిషన్స్‌ అయితే ఉన్నాయి మనకు. యాజమాన్య మేమంటుందో, ఏమైనా చర్య తీసుకుంటుందేమో, మన జీతం కట్‌ చేస్తుందో, మన ఇంక్రిమెంట్‌ కట్‌ చేస్తుందో – ఇట్లా ఇంక్రిమెంట్‌ కట్‌ చేసిన సందర్భాలు కూడా వున్నాయి. తరువాత కోర్టుకు పోయి తెచ్చుకున్న సందర్భాలు కూడా వున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు అన్ని కేసులూ భరించాయి. 19 లో పాత వాళ్ళను చూస్తే వాళ్ళు ఇటువంటి కేసులన్నీ భరించారు. అయినా కూడా ఆర్గనైజేషన్‌ ఫైట్‌ చేసుకుంటూ, మేనేజ్మెంట్‌తో, ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటూ, పరిష్మరించుకోవడమనేది జరుగుతూ వచ్చింది.

కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు.  హక్కులనేవి చట్టం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అట్లా ఇవ్వని హక్కులు చాలా ఉన్నాయి మనకు. కలెక్టివ్‌ రైట్స్‌ ఎప్పుడూ చట్టంలో ఇవ్వరు. రైట్‌ టు స్ట్రగుల్‌ (పోరాడే హక్కు) అనేది మనం ఎక్కడైనా డిఫైన్‌ చేసినామా? ఎవరమైనా పోరాడుతూ ఉంటాము. పోరాడే హక్కు అనేది రాజ్యాంగంలో ఎక్కడా కనబడదు మనకు. కానీ ప్రజల ఎరుకలో వుంటుంది. ప్రజల సామూహికతలో వుంటుంది. పోరాడే హక్కు అనేది ప్రజాస్వామిక హక్కు నువ్వు గౌరవప్రదంగా హుందాగా బతకాలంటే పోరాడాలి. అంటే పోరాడే హక్కు  అనేది జీవించే హక్కుతో సమానం. ఈరోజు బతకాలంటే పోరాటం చేయాల్సిన పరిస్థితి అన్ని రంగాలకూ వచ్చింది కాబట్టి, రైట్‌ టు స్ట్రగుల్‌ అనేది కాపాడుకోవాలంటే, మనకు కచ్చితంగా హక్కుల చైతన్యం ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిందే కాకుండా రాజ్యాంగానికి ఇంకా అతీతంగా కూడా ఆలోచించి మనం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

నిర్దిష్టంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్లే యాజమాన్యాలు చర్యలు తీసుకుంటాయి. అయితే కొంత ముందడుగు వేసినారు. ఇంక దీన్నించి వెనక్కిపోవద్దు. వేసిన అడుగును వెనక్కి తీసుకోకుండా దీన్ని బలంగా చేసుకోవాలి. మనం బలం పెరిగితే ఆరోజు మనకు నెగోషియేట్‌ (సంప్రదింపులు) చేసే శక్తి వస్తుంది. కాబట్టి మనం నెగోషియేట్‌ చేసే శక్తికి ఎదిగామా లేదా అనేది ఒక పరీక్ష. ఆ నెగోషియేట్‌ చేసేటప్పుడు ఏం నెగోషియేట్‌ చేయాలి? మొదట మనం ఏం డిమాండ్లు సాధించుకోవాల అనేది మనం కూర్చుని చర్చించుకోవాలి. ఒక్కొక్క డిమాండు సాధించుకోవాలి.

ఇవాళ మీరు లీవు (సెలవు) సాధించుకున్నారు. కానీ లీవు ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఒక అజెండా తయారుచేసుకోవాలి. ఇవీ డిమాండ్స్‌ అని గుర్తించి మీ సంఘానికి ఒక అజెండా తయారుచేసుకోవాలి. మీ సంఘాన్ని రిజిస్టర్‌ చేసినారు కదా. రిజిస్టర్డ్‌ ఆర్గనైజేషన్‌ అయినా కాకపోయినా, ఒక ఛార్జర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌తో  మనమొక ప్రణాళికని తయారు చేసుకుని ముందుకు పోవలసిన అవసరమయితే వుంది. ఆ మానిఫేస్టోలో మొత్తం ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలంన్నింటినీ తక్షణ సమస్యలేంటి, దీర్ఘకాలికంగా ఉండే సమస్యలేంటి అని బేరీజు వేసుకుని, మనం ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క రకమైన ఆందోళన చేయడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం చేయగలం తప్ప, పోయి మెమొరాండాలు ఇస్తే మాత్రం తీసుకునే పరిస్థితిలో వాళ్ళులేరు. ఇప్పుడు సర్వీసు విషయం తీసుకుందాం. అసలు సర్వీసు ఇస్తాడా లేదా అనేది మన ఓపికని బట్టి, వాడి దయా దాక్షిణ్యాన్ని బట్టి కంటిన్యూ అవుతాము. ఇప్పుడు యూనివర్సిటీ తరపున మేం ఫైట్‌ చేస్తా ఉన్నాం. ఎందుకింత తేడాలున్నాయి జీతాల్లో. సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు కాదు? ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసే సర్వీసుకు వాళ్ళు పొందే వేతనాలకు, మాకు ఎందుకు సమానంగా ఇవ్వరు అని మనమెందుకు ఒక టెస్ట్‌ కేస్‌లాగా హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని వేయకూడదు.  

అయితే అసలు ఈ దారిద్రమంతా తెచ్చింది ఎవరు అంటే సుప్రీంకోర్టు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించాలా లేదా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలా? రిజర్వేషన్స్‌తో వచ్చింది సమస్య. కలకత్తా అమ్మాయి బెంగుళూరులో మెడికల్‌ కాలేజిలో అడ్మిషన్‌ కావాలంటే వాళ్ళేం చెప్పినారంటే, మీరు బయటి నుంచి వస్తే ఫీజు ఎక్కువ, ఇక్కడి వాళ్లైతే (లోకల్‌) ఫీజు తక్కువ అని చెప్పినారు. ఎవరైనా ఒకటే కదా? కాలేజిలో అడ్మిషన్‌ ఒకటే కదా? కాబట్టి నాకెందుకు ఫీజు ఎక్కువ పెడతారు అని ఛాలెంజ్‌ చేసింది. వాళ్లేమన్నారంటే ప్రైవేట్‌ సంస్థ కదా. మేమెంతైనా దీన్ని మేనేజ్‌ చేయాలన్నా, దీని ఇన్ఫాస్ట్రక్చర్‌ బిల్డప్‌ చేయాలన్నా మాకు నిధులు కావాలంటే, మేం పేమెంట్‌ సీట్స్‌ పెట్టుకుంటాం. కాబట్టి పేమెంట్‌ సీట్స్‌, ఫ్రీ సీట్స్‌ అనే పద్ధతి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. గతంలో లేదు కదా. పేమెంట్‌ సీట్స్‌, ఫ్రీసీట్స్‌ అని చెప్పేసి, మళ్ళా ఏమంటుంది సుప్రీంకోర్టు అంటే  (విద్యాహక్కు అనేది ప్రాథమిక హక్కు అంటుంది.  మళ్లీ ప్రైవేట్‌ విద్యను ఎంకరేజ్‌ చేసిందే సుప్రీంకోర్టు. స్టేట్‌ మొత్తంగా ఎగ్జామ్‌ పెట్టి అడ్మిషన్‌ చేస్తాం అంటే, ‘‘లేదు లేదు, ఎవరి ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు పెట్టుకోవచ్చు’’. రేపు నారాయణ వాళ్ళు అవసరమనుకుంటే ఆ కాలేజికి ఎంట్రన్స్‌ టెస్ట్‌ పెట్టకోవచ్చు. మా దగ్గర డబ్బుల్లేవు, మేము విద్యను భరించలేము అనే ప్రభుత్వ వాదనను దృష్టిలో తీసుని సుప్రీంకోర్టు మొత్తం విద్య ప్రైవేటీకరణకు కారణమైంది. ప్రభుత్వం ఒక పక్క కోర్టు ఒకపక్క ఇద్దరు కుమ్మక్కైనారు. ఒక ప్రాథమిక హక్కు అని చెప్తూనే ఇదంతా జరిగింది. ఏమైందంటే  రైట్‌ టు ఎడ్యుకేషన్‌? నీకు అందుబాటులో లేకపోతే ఏం ప్రయోజనం?  ఇవాళ ప్రైవేటు విద్యాసంస్థలు 25శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం లేదు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఆక్ట్‌ వచ్చిన తరువాత అది 25 శాతం బీ.సీలకు, ఎస్సీలకు కేటాయించినా కూడా పాటించడం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే  ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో సమాన పనికి సమాన వేతనం తప్పక ఇవ్వాలనే  డిమాండ్‌తో కోర్టుకు వెళ్ళాలి. ముందు ప్రభుత్వంతో సంప్రదించాలి. దానికన్నా ముందు క్యాటగరైజ్‌ చేయాలి. చాలా హోంవర్క్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తం వర్గీకరణ చేసి, స్కేల్స్‌ ఆఫ్‌ పే వాళ్లకెంత వున్నాయి, మనకెంత తేడా వస్తున్నాయి చెప్పాలి. కాబట్టి మనం ఈసారి కూర్చున్నప్పుడు నిర్దిష్ట సమస్యల మీద స్పెసిఫిక్‌గా ఏయే చట్టంలో ఏముందో చూద్దాం. ఇప్పుడు మీతో మాట్లాడిన తరువాత నా దృష్టిలో ఏ చట్టం మీ ఉద్యోగానికి దగ్గరిలో లేదు. మీది  పారిశ్రామిక వివాదాల చట్టం కిందికి రాదు. కార్మిక చట్టాలే కాదు, వేరే ఉద్యోగుల చట్టాల కిందికి కూడా మీరు రారు. సో మిమ్మల్ని ఏమనాలి?

అసంఘిటిత కార్మికులకు కూడా ఒక చట్టం వచ్చింది 2005లో. ఆ సంఘటిత రంగంలో వాళ్ళకి వేతనాల గురించి చెప్పినారు. తరువాత కంట్రాక్టర్ల దోపిడి తగ్గించినారు. మనం అసంఘటిత రంగం అని పోల్చుకోవడం కూడా మంచిది కాదేమో. అట్లా కాకుండా మనం కూడా ఒక పేరు పెట్టుకుని, దాన్ని ఇన్నోవేట్‌   చేసుకుని, దాని పక్కన ఒక చార్జర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ తయారు చేసుకుని ప్రభుత్వంతో చర్చలు జరపాలి. దానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలించి, కోర్టుకు పోవడం సాధ్యమవుతాదేమో చూడాలి. నేను చెప్పిన సొల్యూషన్స్‌ సరిపోవు ఈసారి వచ్చినపుడు చర్చించి మళ్ళా విఫులంగా మాట్లాడుదాము అవకాశం వస్తే, థాంక్యూ.

రాత : మంజుల, ఉద్యోగ క్రాంతి

Leave a Reply