1
కమ్మటి దాల్చా
 
తెలంగాణమా!
నా ప్రాణమా!!

 ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి
 నడిచి వెళ్ళే ఇంటింటికి 
ఇనుప గోడలల్లుతున్న
 సాలీలు తిరుగుతున్నాయి

గడపలకు
విద్వేష బొట్లు పెడుతున్నాయి 
దుఃఖం మీద దునుకు లాడుతూ
దూర దూరాలు
 పంపిణీ చేస్తున్నాయి

వాటి అడుగుల్లో
మంటలు లేస్తుంటాయి 
వాటి మాటల్లో
మృత్యు వాసనొస్తుంది 

నా ప్రియతమా!
మూసి ప్రవహిస్తున్న గుండెల్లో
మానవతా పరిమళాల మాగానివి

గోదావరై ప్రేమలు ప్రవహించే దానా!
మనసులు కలిసిన చేతుల మీంచి 
 ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి

పంట కావలి
మంచై
చార్మినార్

కమ్మటి దాల్చా జుర్రుకునే
మతాతీత మనసులు
అలాయి బలాయి ఆత్మీయతలు 

పీర్ల పంజాలు తాబుతులు పోచమ్మల
పట్టుకు తిరిగే
మానవీయ గానమా!


లోపాల మనసుల 
దారి పడనీయకు 
పాలకంకుల మనసులగొంతుల్లో
ద్రోహ శిరస్సుల 
విష ధారలు కురువనీయకు

ఆజాల.. ఆంజనేయ దండకాల నేలా!
జాగ్రత్త!జాగ్రత్త!!
కత్తులకు గొడ్డళ్లకు దండలేసి
ఊరేగింపు ఉచ్చులు పెడతాయి

2
పైశాచకీయం 

నెలవంకను
పగబడితేనే
నేలమీద
నిలబడతాననుకుంటాడు

ఆకుపచ్చని
ఒడిపెడితేనే
అధికారం 
ఒడిలో కూర్చుంటాననుకుంటాడు

మనుషుల్ని
మతంఇనుప రోలరుతో
మట్టిలో మట్టి చేస్తేనో

 వాడి
 విద్వేష బుల్డోజరు
 మాసిన గడ్డాల చెమటగూళ్ళు
 మట్టి కలిపితేనో

 మహారాజయోగం పడుతుందనుకుంటాడు

 భయం గుర్రాల
 రథయాత్రల రాతి గుండె
 రాముని
 ఇల్లు
 కడుతుంది

 రాత్రీ పగలు మెతుకు వేటాడే
 రసూల్ భాయ్
 ఇల్లు
 కూలగొడుతుంది

 వాడి చేతిలో
 సెక్యులరిజం ప్రజాస్వామ్యం పాచికలయ్యాయి
 ప్రలోభాలపంజరంలో
ఓటు చిలుకను చూశాకో!
మతంమొహం లోనో
సరిహద్దుల్లోంచి కుమ్మరించినఉన్మాదం లోనో
స్పృహతప్పిన ఓటునుచూశాకో!

నెలవంక
నెత్తురో
కన్నీల్లో
ఆర్తనాదాలో
శవాలో

ఇవాళ
వాడి అధికారం
జన్మస్థలం.

3
కొంగమొగ్గల చెట్టు

ఆఖరి సారిగా 
ఆ రోజుకు 
అద్దంలో చూసుకుంటాడు సూరీడు   
చలిచీమలు కొరుకుతున్న అగ్నిశిఖను

ఆటలాడీ ఆటలాడి
చెట్లు
అలసిపోయి 
 నీడల
 ఒంటికి తొడుక్కుంటాయి 

పొద్దంతా 
ఎండిన ముఖం మీద కూర్చున్న
ఎండను దించుకోగానే 
వరదలెత్తిన శ్వేతవసంతంలా
చెట్టు 
కొంగమొగ్గ లేస్తుంది

మెల్లమెల్లగా 
బంగారుపూతల ఆకాశం 
నల్ల నల్లగా కరుగుతూ
భూమ్మీదకు కారుతుంటుంది

రాత్రైనా 
నిద్రపోక బిగుసుకునే రైలుపట్టాల్లా
చిరుగులు పడ్డ నల్లరగ్గులోంచి
అరణ్యసంగీతం వింటూ
నులివెచ్చగా 
చూస్తుంటాయి చుక్కపిల్లలు 

చలిసముద్రంలో తడిసిన 
లోకం
చీకటి తెప్ప మీద 
శవాసనం వేస్తుంది  
వెల్తురు చెయ్యి 
చీకటి దుప్పటి గుంజేదాక 

One thought on “వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

Leave a Reply