వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా
కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు వారంట్ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒకటి ఉన్నట్లు భీమా కొరేగావ్ కేసులో అరెస్టయి పూనా జెయిల్లో ఉండగా 2019లో ఆయనకు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వరవరరావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో ఆరునెలల మెడికల్ బెయిల్ ఇవ్వడానికి ముందే మధుగిరి కోర్టులో ఈ కేసులో బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత కోవిడ్ కారణాల వల్ల కోర్టులు ఆన్లైన్ పద్ధతిలో నడిచాయి. అట్లా వరవరరావు మధుగిరి కోర్టుకు మూడు నాలుగు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. 2021 అక్టోబర్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో రెండు గంటలపాటు ఉన్నప్పటికీ జడ్జి పట్టించుకోకుండా గైర్హాజరీ అని రాసి వారెంట్ ఇచ్చారు.
ఈ వారంట్ మీద నవంబర్‌లో తుమకూరు పోలీసులు బొంబాయి వచ్చి వరవరరావు ఆస్పత్రిలో ఉండగా ఫొటోలు తీసుకొని వెళ్లారు. నిందితుడు భీమా కొరేగావ్ కేసులో కండీషన్స్‌తో కూడిన మెడికల్ బెయిలు తీసుకొని ఆస్పత్రిలో ఉన్నారని, కాబట్టి ఈ వారంట్ రద్దు చేయాలని మధుగిరి కోర్టులో వరవరరావు తరపు లాయర్ వాదనలు వినిపించారు. అసలు ఈ కేసే అక్రమమని, సహ నిందితుల మీద కేసు కొట్టివేశారు కాబట్టి ఆయన మీద కేసు డిస్చార్జి చేయాలని బెంగుళూరు హైకోర్టులో మరో పిటిషన్ విచారణలో ఉంది.
మధుగిరి కోర్టు ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా ఫిబ్రవరి11న మళ్లీ గైర్హాజరీ అని వారంట్ ఇచ్చి, మార్చి 19 నాటికి అరెస్టు చేయాలని ఆదేశించింది. దీనికితోడు రూ. 25,000 జరిమానా విధించింది.
పోలీసుల అక్రమ కేసులకు తోడు కోర్టు అక్రమంగా, హేతురహితంగా వారంట్లు ఇవ్వడం న్యాయ ప్రక్రియలోని డొల్లతనాన్ని, రాజకీయ దురుద్దేశాలను తెలియజేస్తోంది.
అసలు ఈ పావగడ కేసే నిరాధారం. కుట్రపూరితం. కేవలం వరవరరావును నిర్బంధించడానికే ఇందులో ఆయనను చేర్చారు.
2005 ఫిబ్రవరి 10న తుమకూరు జిల్లా తిరుమని పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటమ్మనహల్లి గ్రామంలో పాఠశాలలో ఉండిన కర్నాటక స్పెషల్ పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన కేసు ఇది. ఆరోజు సాయుధ నక్సలైట్లు ఆ క్యాంపు మీద దాడి చేసి ఒక ఎస్ఐని, ఏడుగురు పోలీసులను, ఒక పౌరుడిని చంపారని పోలీసులు ఇందులో ఆరోపించారు. ఆ ఘటన జరిగిన వెంటనే పోలీసులు తుమకూరు, పొరుగున ఉన్న అనంతపురం జిల్లాల గ్రామాల మీద ప్రతీకార దాడులు చేశారు. వందకు పైగా వ్యక్తులను నిర్బంధించి, చిత్ర హింసల పాలు చేశారు. చివరికి అరవై ఐదు మందిని నిందితులుగా కేసు తయారు చేశారు.
ఈ జాబితాలో ఉద్దేశపూర్వకంగా, కుట్ర పూరితంగా వరవరరావు, గద్దర్ల పేర్లు చేర్చారు. 2004 అక్టోబర్‌లో ప్రభుత్వానికీ విప్లవపార్టీలకూ మధ్య మొదలైన చర్చలు అప్పటికి విఫలమయ్యాయి. 2005 ఆగస్ట్‌లో విప్లవ పార్టీ మీద, ప్రజాసంఘాల మీద నిషేధాన్ని పునరుద్ధరించి, విరసం మీద కూడ ప్రభుత్వం నిషేధం విధించి ఉన్నది. ఆ సమయంలో శాంతి చర్చల ప్రతినిధులను ప్రతి కేసులోనూ నిందితులుగా చూపారు. అట్లా ఉమ్మడి ఆంధ్రపద్రేశ్లో కనీసం ఎనిమిది కేసులలో వరవరరావును నిందితుడిగా చూపించారు. పావగడ కేసు కూడ అటువంటిదే.
వెంకటమ్మనహల్లి దాడి జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు 2005 ఫిబ్రవరి 6న కర్నాటకలోని చిక్కమంగళూరు జిల్లా పశ్చిమ కనుమల అడవుల్లో మావోయిస్టు పార్టీ నాయకుడు, కర్నాటక చరిత్రకారుడు సాకేత్ రాజన్‌ను పోలీసులు హత్య చేశారు. ఆ సందర్భంలో వరవరరావు, గద్దర్ బెంగళూరు వెళ్లి, ఆ ఎన్కౌంటర్ బూటకమైనదని ఆందోళన చేశారు. సాకేత్ రాజన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వెంకటమ్మనహల్లి దాడి సాకేత్ రాజన్ ఎన్కౌంటర్ కు ప్రతీకారంగా జరిగిందని భావించిన పోలీసులు అందువల్ల ఆ కేసులో వీళ్లిద్దరి పేర్లూ కూడ చేర్చారు.
కాని వాళ్లిద్దరికీ 2005 నుంచి 2011 వరకూ కూడ సమన్లు ఇవ్వలేదు. అరెస్టు చేయలేదు. ఆ కాలంలో జరిగిన కేసు విచారణలో వారిద్దరినీ పరారీలో ఉన్నట్టుగా (అబ్ స్కాండిరగ్) చూపారు. నిజానికి ఆ కేసు విచారణ జరిగినప్పుడు 2005 ఆగస్ట్ నుంచి 2006 ఏప్రిల్ వరకూ వరవరరావు జైలులోనే ఉన్నారు. ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు బహిరంగ జీవితంలో ఉన్నారు. అయినా పరారీలో ఉన్నట్టు చూపి మిగిలిన 19 మంది మీద విచారణ జరిపారు. దాదాపు 150 మంది సాక్షులను విచారించారు. ఆరు సంవత్సరాల విచారణ తర్వాత తుమకూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి బాలకృష్ణ ఆ 19 మంది మీద 2011 అక్టోబర్ 29న కేసు కొట్టేశారు.
ఆ తీర్పు మీద పోలీసులు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఆ అప్పీల్‌ను బెంగళూరు హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు పరిశీలించి తుమకూరు అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమైనదా కాదా మాత్రమే పరిశీలించవలసి ఉంది. ఇందులో భాగంగా మిగిలిన నిందితులను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. వారిని విచారించి, తీర్పు వెలువరించిన తర్వాతనే ఈ పాత తీర్పు మీద అప్పీల్‌ను వింటామన్నారు.
ఇది న్యాయ ప్రక్రియలో కనీవినీ ఎరగని వ్యవహారం. ఎప్పుడూ ఎక్కడా ఇలా జరిగి ఉండదు. బెంగళూరు హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఇలాంటి అసాధారణమైన ఆదేశాల పర్యవసానంగా భీమాకొరేగావ్ కేసులో జైలులో ఉన్న వరవరరావును అరెస్టు చేసి పావగడ కోర్టులో హాజరు పరిచారు.
అసలు ‘‘నేరం’’లో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న వారి మీదనే కేసు కొట్టివేసినప్పుడు, ఆ ‘‘నేరం’’ జరగడానికి ‘‘కుట్ర’’ చేశారనే ఆరోపణ ఉన్నవారి మీద కేసు ఉండడానికే వీల్లేదు. అయినా కేసును అలాగే ఉంచారు. విచారణ జరిపారు. ఎట్టకేలకు వివికి బెయిలు ఇచ్చారు. ఆ తర్వాతనే ఆయనకు భీమాకొరేగావ్ కేసులో అనేక కండీషన్లతో గృహ నిర్బంధంవంటి మెడికల్ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ దాకా వీడియో కాన్ఫరెన్స్‌లో మధుగిరి కోర్టుకు హాజరవుతునే ఉన్నారు. కానీ ఇప్పుడు గైర్హాజరీ అని అరెస్టు చేయమని కోర్టు వారంట్ ఇచ్చింది. అబ్ స్కాండింగ్, ఆబ్సెన్సీ అనే మాటలు పోలీసుల, న్యాయమూర్తుల ఉమ్మడి పరిభాషలో భాగమైనట్లుంది. అక్రమ ఆరోపణలతో కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడానికి తోడు న్యాయ ప్రక్రియ అన్యాయ ప్రక్రియగా మారడాన్ని విప్లవ రచయితల సంఘం ఖండిస్తోంది.
అరసవిల్లి క్రిష్ణ – విరసం అధ్యక్షుడు
రివేరా – కార్యదర్శి