సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది.

కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.

ప్రజాస్వామిక భావజాల పరిరక్షణే ధ్యేయంగా, కర్తవ్యంగా వేదిక పనిచేయాలి. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తమదైన పాత్ర నిర్వహించాలి. భావజాలావరణలో కాషాయమూకల ఆక్రమణను తొలగించాలి.. ఒక్కమాటలో చెప్పాలంటే కార్పొరేటీకరణ చెందుతోన్న సామాజిక పోకడలివి. కార్పొరేటీకరణలో అన్ని అంశాలూ మార్కెట్‌ సూత్రాలకనుగుణంగా మలచబడుతాయి. మార్కెట్‌కు యిబ్బందికరమయినదేదీ మనుగడ సాగించదు. ఆవు మాంస విక్రయమైనా సరే!

కేంద్రంలో అధికారంలో వున్న మోడీ వలన యిదేదో హిందుత్వీకరణగా సూత్రీకరించడం సరయినది కాదనుకుంటాను. హిందుత్వ అనేది కేవలం దళితులపై దాడులతోనూ, ఆవు పేరుతో హింసతోనూ, రామనామం పేరిట జరిగే దాడులతోనూ పోల్చి నిర్ధారించడం పాక్షికమవుతుంది.

అనేక దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్లపై, ముస్లింలపై, దళితులపై జరిగే, జరుగుతోన్న దాడులూ, ప్రజాస్వామిక విధానాల కోసం గళమెత్తే మేధావులపై దాడులూ, ప్రతిపక్ష పార్లమెంటరీ నేతలపై జరిగే దాడులూ (సిబిఐ దాడులు) కొసకు యిపుడు ఉగ్రవాద నిరోధక బిల్లు రూపకల్పనలూ చాలా జరుగుతున్నవి.

ఇవన్నీ కేవలం మోడీ, ఆరెస్సెస్‌ రాజకీయాధికారానికి పనికొచ్చే కొన్నికొన్ని చర్యలు, అధికార స్థిరీకరణకుపకరించే చర్యలు తప్పా హిందుత్వ రాజ్యనిర్మాణం కోసం జరిగే చర్యలు కావు. మోడీకీ, ఆరెస్సెసూ లోలోపల హిందూరాజ్య ఆలోచన వుంటే వుండొచ్చుగాక!

గత ఐదేళ్ల మోడీ పాలన ద్వారా బలపడినవి మార్కెట్‌ శక్తులే. అదే సమయంలో రాజకీయావరణంలో గతం కంటే యెక్కువ ఆవరణను ఆరెస్సెస్‌ ఆక్రమించింది. గానీ దేశంలోని సహజ వనరులను, సకల మార్కెట్‌ రంగాలనూ మున్నెన్నటికంటే కార్పొరేట్లు ఆక్రమించేయి.

ఏ మేరకో వున్నటువంటి ప్రభుత్వ సంస్థలు కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్నాయి. (బిఎస్సెన్నెల్‌, ఏఐఆర్‌ తదితరాలు) అడవులమీద ఆదివాసీలకు హక్కులు పోతున్నాయి. సముద్రం నుంచి మత్స్యకారులు నెట్టబడుతున్నారు. మైదానాలనుండి బహుజనులు వలసబోవలసొస్తోంది. అంతిమంగా అత్యధికంగా హిందువులైన ఆదివాసీలు, మత్స్యకారులు, బహుజనులు విస్థాపనకు గురయినారు! వీరిని ఐక్యం చేసి, విస్థాపన వ్యతిరేక ఉద్యమానికి కదిలించాలంటే విస్థాపన వ్యతిరేక నినాదాన్నివ్వాలి. వీరిలోగల మతవిశ్వాసాన్ని పాలక పార్టీలు పావుగా వాడుకోవడమే… హిందుత్వ! హిందుత్వ వ్యతిరేక ఉద్యమం, నినాదం విస్థాపితులను ఐక్యం చేయదు. సాహిత్యరంగంలో యీ కోణంలో రచనలు, ప్రచారాలు జరగాలి.

ఈ విస్థాపనను అడ్డుకునే విశాలపోరాటానికి పూనుకోకుండా మోడీ, మోడీబృందం ఆరెస్సెస్‌ చేసే భావజాల ఆక్రమణ మీద పోరాటానికి పిలుపే హిందుత్వ వ్యతిరేక పోరాటమవుతుంది. అంచేతనే వాళ్లు దీన్ని వినియోగించుకుంటున్నారు. తమకు వ్యతిరేకంగా జరిగే, తమ రాజకీయావరణాక్రమానికి వ్యతిరేకంగా జరిగే ప్రతీ పోరాటాన్నీ, ప్రతీ వ్యతిరేకినీ హిందువుల వ్యతిరేకిగా, హిందువులు అధికంగా గల దేశ వ్యతిరేకులుగా ప్రచారానికి లంఘిస్తున్నారు. నమ్మిస్తున్నారు. విస్థాపనకు గురయిన వాళ్లను తమతో నడిపించుకోగలుగుతున్నారు.

విస్థాపనకు వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటాన్ని ప్రధానపోరాటంగా తీసుకోవాలి, హిందుత్వీకరణ వ్యతిరేకపోరాటాన్ని ద్వితీయంగా తీసుకోవాలనుకుంటాను. ఈ కోణంలో భావజాలరంగంలో పనిచేయడం అవసరమని భావిస్తున్నాను.

Leave a Reply