నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 – 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా మరింత అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. తరతరాలుగా తమ సమస్తాన్ని దోచుకుంటున్న బ్రాహ్మణీయ భూస్వామ్యంతో వలసదారులతో ఆదివాసులు చేస్తున్న పోరాటాలను నుండి విప్లవోద్యమం చాలా నేర్చుకుంది. ఈ విప్లవోద్యమం అనేక విధాల నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నది. ఎదుర్కొంటూ పోరాడుతున్నది. భారతదేశ సమాజాన్ని గతి తార్కికంగా అధ్యనం చేస్తూ ఆచరణ ద్వారా ముందుకు పోతున్నారు. ఆదివాసి ప్రాంతాల్లో భూమి పంపకం సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, బావులు, కుంటలు, చెరువులు తవ్వకం ,భూమిని చదును చేయడం, సాంప్రదాయక వ్యవసాయం స్థానంలో ఆధునిక వ్యవసాయం, కూరగాయల పెంపకం, రైతులకు శిక్షణ పాత సాంప్రదాయక తెగ పెద్దల అధికారం తొలగింపు అభివృద్ధి నిరోధకమైన పద్ధతులు వీటిని మార్చాలని విప్లవోద్యమం కృషి చేస్తున్నది.

కథల విషయానికొస్తే ఇందులో మొత్తం 14 కథలు ఉన్నాయి. ప్రతి కథ అనుభవం నుంచి వ్యక్తం అవుతుంది. సీతా బాయ్ గెలుపు అనే కథ సన్నావ్, సీతాబాయిలు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సన్నావ్ ఆ ఊరిలో ప్రజలందరి సమస్యలు పరిష్కరించడం ముందుంటాడు. అంతేకాకుండా గ్రామంలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడం గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తూ తిరుగుబాటు లేవనేత్తుతాడు. ఠానేదారు సన్నావును అరెస్టు చేసి తర్వాత ఏం చేశాడన్న…విషాదం ఈ కథలో ఆధ్యాంతం దుఃఖపు చాయలు అలముకుంటాయి.

తొలి సంజ కథ దీన్ని వినోద గారు అద్భుతంగా మలిచారు. తులారాం కుటుంబం అడవిలో నివసిస్తుండగా అక్కడ సహజవనరులను దోచుకోవాలని ఉద్దేశంతో ఆ గ్రామం నుండి వలస పెట్టుబడిదారులు గుండాయిజంతో దుర్మార్గంగా తరలించి వేస్తే చివరగా అడవులలో వారు పడే పాట్లు అతడి మరణం, తర్వాత వాళ్ళ కుటుంబం ఎదురుకున్న కష్టాలు అన్నీ కూడా ఈ కథలో మనకు యామిని గారు కళ్ళ ముందు ఆవిష్కరించారు. తెగింపు కథలో సుక్కో ఆమె భర్త ఫూల్ సింగ్ ఇద్దరు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్న క్రమంలో పోలీసులు ఫుల్ సింగ్ ను ఎన్కౌంటర్లో చంపేస్తారు. దాంతో సుక్కో కూడా తన కుమారుడిని అత్తమామలకు అప్పగించి దళంలో చేరడంతో కథను ముగుస్తుంది, పోలీసులు వేసే ఎత్తుగడలు తప్పించుకున్న తీర్లు అడవితల్లి వారిని కాపాడిన విధానము అన్నీ కూడా కథలో మనకు కనిపిస్తాయి.. దిక్కారం కథను ఆసిఫా గారు మహిళలలో లౌకికంగా కనిపించే బలహీనతను త్రోసిపుచ్చి మహిళలలో ఉండే చైతన్యాన్ని దిక్కారస్వరాన్ని ఈ కథలో చూపించారు. ఊరి మీద పడ్డ పోలీసులు పసిబిడ్డల తల్లులను పట్టుకుపోతుంటే వారు ఏ విధంగా ప్రతిఘటించారు అనేటువంటి విషయాన్ని సున్నితంగా కథలో వ్యక్తం చేశారు..

అమ్మ పాలు ఆయుదాలైన వేళ కథలో ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్లను రక్షించడంలో ఆడవాళ్లు ,వాళ్ళు పడుతున్నటువంటి పాట్లు ముఖ్యంగా పసిపిల్లలను కన్న తల్లులు వారి పాలధారలతో ఏ విధంగా దళాలను రక్షించాలన్నటువంటి విషయాన్ని మనo ఈ కథలో చూడొచ్చు. శిక్ష అనే కథను యామిని కొత్త అనుభవరీతిగా ఆవిష్కరించారు ఇందులో దళంలో చేరినటువంటి కొంతమంది పోలీసులకు ఇంఫార్మెర్ మారితే ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అధ్యంతం ఆసక్తికరంగా రచించారు.. విప్లవంలో ఒక తల్లి తండ్రి కథలో పోలీస్ కాల్పులలో దళంలో కొత్తగా చేరిన తన బిడ్డ కాల్పుల సమయంలో ఆందోళన తోటి భయంతో తుపాకిని మరిచి రావడం అలా రావడం తప్పు బిడ్డ అని తల్లిదండ్రులు ఆ కూతురుకు ధైర్యం చెప్పడం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ కథ ద్వారా ఆవిష్కరించారు ఆసిఫా గారు…. పీలు అనే కథలో పిల్లవాడి నుండి తన తండ్రి మరణం దాకా పీలు అనే పసిపిల్లవాడు ఉద్యమంలోనే అన్ని చూసి నేర్చుకుంటాడు తన తండ్రి చావుకు కారణమైన వి…. తన తండ్రి చేతుల్లో ఉన్న ఆయుధం ఉన్నప్పటికీ ఎలా మరణించాడు అమ్మ అని తల్లిని ప్రశ్నించడం ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన అర్థం చేసుకునే వయసు పీలుకు లేదు. చివరగా పీలు తన తండ్రి మార్గాన్ని అనుసరించడంతో ఈ కథ ముగుస్తుంది.. విప్లవ తరం కథలో పార్టీలోకి చేరినటువంటి కొన్ని కుటుంబాలు తమ బిడ్డలను వివాహం చేసుకోమని ఒత్తిడి చేయడము ఆ తర్వాత వారిలో సంభవించినటువంటి మార్పు పార్టీలో చేరిన తర్వాత అక్కడ జీవించే విధానము పద్ధతులు పెండ్లికి అక్కడ వాళ్ళు వాడే సహచరులు పదము కొత్తగా అనిపిస్తాయి..

సహచరులు అనే కథ తాయమ్మ కరుణ గారు రచించారు ఇందులో దీప అనిల్ ఇద్దరు కూడా చిన్నప్పటినుండి ఒకే చోట పెరగడము ఒకే రకమైన ఆలోచన విధానం ఉండటం తర్వాత దళంలో చేరిన తర్వాత కూడా సహచరులుగా ఎలా కాలాన్ని ఎదుర్కొన్నారు అనేది ఈ కథలో కనపడుతుంది. నూతన మానవుడు కథ కూడా చాలా సృజనాత్మకంగా ఆవిష్కరింపబడింది. ఇందులో మమత, సంజీవ్ అనే ఇద్దరి వ్యక్తుల ప్రధాన పాత్రలుగా వారి ప్రేమ వారి ఆప్యాయత పార్టీలో వారు చేసినటువంటి సేవలు వారి కర్తవ్యనిష్ట అనేక అంశాలు ఇందులో మనకు కనపడతాయి. మౌఖిక చరిత్రకారులు కథలో పార్టీలో కొంతమంది ఉపాధ్యాయ వృత్తి నేర్చుకొని పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు తర్వాత కొత్త క్యాడర్ నియమించుకోవడం వారికి బోధించడం పట్ల చైతన్యవంతమైనటువంటి స్పృహ కలిగించడంతో ఈ కథ నడుస్తుంది.. అమూల్యం కథలో తన కొడుకును దళంలో చేర్పించిన తండ్రికి కొడుకు ప్రవర్తన ద్వారా పార్టీ నుండి వెలివేయబడటం దానికి దుఃఖించి వయసు మళ్ళినప్పటికీ తాను దళంలో చేరాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందో అన్నీ కూడా మనకు కథలో కనిపిస్తాయి.. చివరి కథ కామ్రేడ్ పోజ్జె ఉత్తరం ఈ కథలో పార్టీలో ఉండేటువంటి కొంతమంది తమ కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాయడంలో ఎదుర్కొనే భాషా సమస్య అక్కడి వారి సహచర్యము చివరగా వాళ్ళు ఎలా కుటుంబ సభ్యులకు ఎలా ఉత్తరాల రాసారు అనేటువంటిది కథలో తెలుస్తుంది.. మొత్తం మీద దండకారణ్య కథలు నిజంగా 45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం..

Leave a Reply