వియ్యుక్క సంకలనాలను ఆదరిస్తున్న పాఠకులకు విప్లవాభినందనలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను.

ముందుగా సంకలనాలలో దొర్లిన కొన్ని పొరపాట్లను, కొత్తగా అందిన సమాచారం  వల్ల గుర్తించిన వాటిని పాఠకుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు, ఒక విద్యార్థిని తమ థీసిస్ విషయవస్తువుకు ప్రధాన వనరుగా వియ్యుక్క సంకలనాలను స్వీకరించామని మరింత సమాచారం కోసం సంపాదకురాలిని సంప్రదించారు. నేటి తరం యువతను వియ్యుక్క సంకలనాలు ఆకర్షించటం, వారి బాధ్యతగా వారు విప్లవ సాహిత్యంలో మరింత సూక్ష్మ పరిశోధనలు చేపట్టటం చాలా సంతోషించవలిసిన విషయం. వారికి, వారిని ప్రోత్సహిస్తున్న ఆచార్యులకు విప్లవాభివందనాలు.  ఇటువంటి పరిశోధనలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కోసం వీటిని రికార్డ్ చేయడం అవసరం అనుకొని నా బాధ్యతగా ఈ తప్పులు సవరించుకుంటున్నాను.

వియ్యుక్క సంకలనాలను సంకలనం అనకుండా సంపుటి అని రాశాం. ‘ఒకే రచయిత రచనలను మొత్తం ఒక దగ్గర చేరిస్తే వాటిని సంపుటాలు అనాలి,  ఒకరి కంటే ఎక్కువ రచయితల రచనలను వేస్తే వాటిని సంకలనాలు అనాలి’కదా అని కాత్యాయినీ విద్మహే గారు గుర్తింపజేశారు. ఆమెకు కృతజ్ఞతలు.

వియ్యుక్క సంకలనాల్లో మొదటి మూడు సంకలనాలకు ఒక ముందు మాట, తక్కిన మూడు సంకలనాలకు ఒక ముందుమాట రాశాను. రెండవ ముందుమాటలో 5వ పేజీ మూడవ పేరా మూడవ లైనులో – “మహిళలకు సంబంధించి మౌలిక సంబంధాలను పితృస్వామ్యం నిర్దేశిస్తుంది. మహిళలకు యాజమాన్య హక్కును లేకుండా చేయడం, ప్రధాన ఉత్పత్తి సాధనాలపై అజమాయిషీని లేకుండా చేయడమనేది పశ్చిమ దేశాల్లో బానిస యాజమాన్య వ్యవస్థ కాలం నుండీ, భారత దేశంలో శూద్ర యాజమాన్య వ్యవస్థ కాలం నుండీ అంటే వర్గాల ఆవిర్భావ దశ నుండే సమాజంలో మహిళల స్థానాన్ని నిర్దేశిస్తూ వచ్చింది”- అనే వాక్యం ఉంది. ఈ వాక్యంలో శూద్ర యాజమాన్య వ్యవస్థ అంటే శూద్రులు యాజమాన్యంలో ఉన్నారనే అర్థం వస్తోంది. నిజానికి ఈ పేరాలోని విషయం మహిళా సమస్య పై మావోయిస్టు పార్టీ అవగాహన గురించి చెప్పే సందర్భంలో మహిళా సమస్య పై దృక్పథం డాక్యుమెంట్ లో నుండి తీసుకున్నది. అయితే అందులో చాలా స్పష్టంగా ముందు పేజీలోనే శూద్ర యాజమాన్య వ్యవస్థ అంటే “శూద్రుల శ్రమపై ఆధారపడిన ఉత్పత్తి విధానం” అనే వివరణ కూడా ఇచ్చారు. ఈ వివరణను నేను కూడా బ్రాకెట్లో ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పొరపాటు అర్థం వచ్చే అవకాశం ఇచ్చినట్టయ్యింది. అయితే సాధారణంగా డాక్యుమెంట్లలో ఇంగ్లీష్ నుండి అనువాదం చేసేటపుడు స్లేవ్ హోల్డింగ్ సిస్టమ్ ను బానిస యాజమాన్య వ్యవస్థ అనీ, శూద్ర హోల్డింగ్ సిస్టమ్ ను శూద్ర యాజమాన్య వ్యవస్థ అనీ అనువాదం చేస్తున్నారు. అయితే శూద్ర యాజమాన్య వ్యవస్థ అన్నప్పుడు ఇలాంటి అపార్థం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనక ప్రతి చోట బ్రాకెట్ లో శూద్ర హోల్డింగ్ సిస్టమ్ అని రాస్తున్నారు. తప్పక పై వివరణ కూడా ఇస్తున్నారు. అయితే ఇలాంటి వివరణలు సాధారణంగా ముందు పేజీల్లో ఉంటాయి. తక్కిన పేజీల్లో ప్రతిచోటా ఈ వివరణ ఉండదు కాబట్టి ఎక్కడి నుండైన ఉటంకించినపుడు వివరణ రాయకపోతే ఇలాంటి సమస్య వస్తుంది. నేను వివరణ రాయకపోవడం ఈ తప్పు అర్థాన్ని ఇస్తుంది కనక దానిని గుర్తిస్తూ ఇక్కడవివరణ ఇస్తున్నాను.

అరుణతారలో అచ్చయిన షహీదా రాసిన  వ్యాసం ‘విప్లవ సాహిత్యం-స్త్రీల కృషి నమోదుకు చేర్పు’ (అరుణతార జూన్-జులై 2014)వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం మాడివి ఇడిమే పేరుతో కథలు వ్యాసాలు రాసింది మైనా. కథల కోసం వెతికేటపుడు మళ్ళీ మొత్తం సంచిక అంతా కాకుండా కేవలం కథలు మాత్రమే చూస్తూ పోవడం వల్ల ఈ వ్యాసం మిస్ అయ్యి కాస్త ఆలస్యంగా చూడడం వల్ల మాడివి ఇడిమే పేరుతోనే ‘శ్యామల’ అనే కథను ప్రచురించాం. ఆ కథా రచయిత మైనా.

ఇతరత్రా అందిన సమాచారం మేరకు చూపు పేరుతో అచ్చయిన విభజన రేఖ కథ తాయమ్మ కరుణ రాశారు. మృత్యుకుహరంలోనుంచి కథను జీవని, పి.జి. స్వర్ణ పేరుతో రాశారు.

 ప్రజలే ఉక్కుకోట కథను చాడ విజయలక్ష్మి రాశారు. ఆ విషయం ధృవీకరించుకున్న తరవాతే ఆమె పేరుతో వేశాం. అయితే ఈ కథ విప్లవి పత్రికలో అచ్చయ్యింది. ఇది అజ్ఞాత పత్రిక కాబట్టి సాఫ్ట్ కాపీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పత్రిక ఏప్రిల్ 2005-జులై 2006 సంచిక, అక్టోబర్ 2006 సంచిక రెండిటిలోనూ రచనలు ఒకటే ఉన్నాయి. ముఖచిత్రాలు వేరుగా ఉన్నాయి. రచయితల పేర్లు కూడా వేరు వేరుగా ఉన్నాయి. ఒక సంచికలో ప్రజలే ఉక్కుకోట కథకురచయిత పేరు చాడ విజయలక్ష్మి అనీ,ఒక సంచికలో ఈ కథా రచయిత పేరు సెలయేరు అని ఉంది. ఆ రకంగా సెలయేరు కలం పేరుతో రాసింది చాడ విజయలక్ష్మి అని పొరపాటుగా అర్థం చేసుకున్నాం. ఆమె కలం పేరు సెలయేరు కాదు. సెలయేరు పేరుతో విప్లవ మహిళ 3 వ బులెటిన్ లో “నిండు హృదయమూ అమానవీయతా” అనే కథ అచ్చయ్యింది. ఆ కథ పేరును ‘విలువలు’ గా మార్చాము. దానిని చాడ విజయలక్ష్మి రాశారని పొరపడి ఆ పేరుతో వియ్యుక్కలో చేర్చాం. ఈ కథ ఆమె రాయలేదని ఆమె మిత్రులు తెలియజేశారు. అరుణతారలో ప్రకటించిన కథల వివరాలను చూసి సెలయేరు అనే కలం పేరుతో రాసింది అమర కామ్రేడ్ దుబాసి భారతి అని ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె సహచరుడు దుబాసి శంకర్ తెలియజేశారు. ఈ సమాచారం వియ్యుక్క సంకలనాలు అచ్చు కాకముందు తెలియకపోవడంతో సంకలనాల చివర పొందుపరిచిన అమర రచయితల జాబితాలో కామ్రేడ్ దుబాసి భారతి గురించిన సమాచారం చేర్చలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. కా.దుబాసి భారతి 2016 అక్టోబర్ లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని రాంగూడ ఎదురుకాల్పుల ఘటనలో అమరులయ్యారు. అలాగే కొత్త వెలుగు కథ తూర్పు కనుమ జనవరి –జూన్ 2000 లో అమరురాలు కా. లక్ష్మక్క పేరుతో అచ్చయ్యింది. కా.లక్ష్మక్క వివరాలు ఏవీ తెలియకపోవడంతో ఆమె గురించి కూడా అమర రచయితల జాబితాలో పొందుపరచలేకపోయాం. వివరాలు తెలిసిన వారు అరుణతారకు సమాచారం అందిస్తే భవిష్యత్తులోనైనా పొందుపరిచే అవకాశం ఉంటుంది.

అవగాహనకు భిన్నంగా ఉండి, వాటిమీద తీవ్ర చర్చ జరిగి వాటిని ప్రచురించకుండా ఉండవలిసిందని భావించిన 3,4 కథలనువియ్యుక్క సంకలనాల్లో చేర్చలేదు.

అరుణతారలోప్రచురితమైన మరొక ఉత్తరంలో విమర్శించిన ఒక కథ ‘పునర్జన్మ నిచ్చిన ప్రజలు’ కూడా పొరపాటున ఎంపిక చేశాం. ఆ ఉత్తరం కూడా వియ్యుక్క సంకలనాల పని జరుగుతున్న సమయంలో గమనించుకోలేకపోయాం. ఈ పొరపాట్లకు చింతిస్తున్నాము. మలి ప్రచురణ సాధ్యపడితే తప్పక సవరించుకోగలం అని సవినయంగా తెలియజేస్తున్నాం. 

ఈ సందర్భంలోనే అజ్ఞాత రచయితలకు కూడా ఒక విజ్ఞప్తి. మీ కథలు/ రచనలు పంపేటప్పుడు తప్పక రచయిత పేరు రాయాలి. కొన్ని సార్లు పేరు లేకుండా అందినపుడు సంపాదకులే ఏదో ఒక పేరు పెట్టాల్సి వస్తుంది. అలాగే వీలైనంత వరకు ఒకే కలం పేరుతో రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మీ రచనలు చరిత్రలో నమోదు అవుతున్నాయి. పరిశోధనలకు కేంద్రం అవుతున్నాయని గుర్తించగలరు.

షహీదా రాసిన “విప్లవ రచయిత్రి గజ్జెల సరోజ జీవితం-సాహిత్యం” అనే వ్యాసంలో “పోదాం కలిసి పోరాటానికి వస్తావా నువు నా వెంట” అనే పాట గజ్జెల సరోజ రాసినదిగా భావించి దాని గురించి రాశారు. ఆ పాట ఎల్లంకి అరుణకి, గజ్జెల సరోజకి చాలా ఇష్టమైన పాట అని వారిద్దరి జీవిత చరిత్రల్లో, రచనల్లో అర్థం అయ్యింది. బహుశా అందుకే సరోజ దానిని తన డైరీలో రాసిపెట్టుకుని ఉంటారు. ఈ పాట కా. ఎన్‌కే రాసింది. ఇది సృజన 1975 ఫిబ్రవరి సంచికలో ప్రచురించారు. ఆ పాటకు ప్రేరణ కా. శివసాగర్ రాసిన “ఆకాశంలో సగం నీవు” అని పాద సూచికలో పేర్కొన్నారు.

ఇక వియ్యుక్క వెలుగులో కొంచెం ముందుకు వెళ్ళడం అంటే ఈ కథలను ఇంగ్లిష్ భాషలోకి అనువదించి ప్రచురించడం అనే ఒక ప్రయత్నం మొదలవ్వడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. వసంతమేఘం వెబ్ సైట్ లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక కథ చొప్పున అప్ లోడ్ అవుతున్నాయి. ఈ ప్రయత్నం 2023 అక్టోబర్ లో మొదలయ్యింది. మే నెల ఒకటవ తేదీ నాటికి 12 కథలు అనువాదం అయ్యి అప్ లోడ్ అయ్యాయి. వీటిని ఇతర రాష్ట్రాల స్థానిక భాషల్లోకి తీసుకుపోవడానికి  వీలుగా ఇతర రాష్ట్రాల్లోని విప్లవాభిమానులకి కూడా చేరువయ్యేలా చూడాలని, సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చెయ్యాలనీ విప్లవాభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నాం.

2 thoughts on “వియ్యుక్క వెలుగులో మరికొంత ముందుకు

  1. ఈనాడు మధ్య భారత దేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఫాసిస్టైజ్డ్ నియంతృత్వ సెమీ- ఫ్యాసిస్టు పాలనతో ఒకే పార్టీ ఒకే పార్లమెంట్ నినాదంతో అవశేష ఫాసిస్టు మూలాలను సంరక్షిస్తూ 1937 స్పానిష్ అంతరిద్యం ఇలాంటి పరిస్థితిని మనమందరం నిలబెట్టాడు. చత్తీస్గడ్ దండకారణ్యంలో ఆదివాసి ప్రజలపై మావోయిస్టు లపై జరుగుతున్న వైమానిక దాడులు 1937లో జరిగిన స్పానిష్ అంతరిక్ష సమయంలో చేసిన ఏరియా బాంబ్/కార్పెట్ బాంబు దాడి 1937 తర్వాత ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొదటి వైమానిక బాంబు దాడులలో ఒకటి, అది ఈనాడు పెట్టుబడుదారులను సంరక్షించ
    డానికి ఆపరేషన్ కగార్ పేరుతో కార్పెట్ బాంబు లాంటిదే. కనుక ఈనాడు బుద్ధి జీవులుగా ఉన్న మనమంతా కూడా ఆత్మ విమర్శన చేసుకుంటూ ఫాసిస్ట్ పాలకుల వైపా, సోషలిస్టు నిర్మాణం వైపా చారిత్రాత్మ
    కంగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళ్లి పరిశీలించి చూసి
    నట్లయితే
    జర్నలిస్టులు బ్రిటిష్ సామ్రాజ్య పాలకులకు
    వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రో
    ద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక
    మైన నేపథ్యం జర్నలిస్టులది. పత్రిక/ మీడియా యాజమాన్య అధినేతలకు తెలియంది కాదు. అందుకు ఉదాహరణగా జర్నలిస్టు
    మౌల్వీ మహమ్మద్ బాకీర్. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి
    నందుకు అతని పట్టుకుని ఫిరంగికి కట్టి, పేల్చి అతని చంపి వేశారు.మౌలానా హజ్రత్ ముహానీ “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే ప్రసిద్ధ నినాదాన్ని అందించారు. ఆ నినాద స్ఫూర్తి తో ఈనాటి జర్నలిస్టులు/మీడియా పత్రికల అధినేతలు పాలకుల ఆజ్ఞలకు తలవగ్గక, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
    (NIA- ఎన్ఐఏ) బెదిరింపులకు తలవగ్గక జర్నలిజం విలువలతో సత్యం కొరకు న్యాయం కొరకు పోరాడుతున్న ఉద్యమ
    కారులపట్ల నిలబడుతూ
    నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో ప్రపంచ మానవులకి తెలియజేస్తారని కోరుతూ.
    మా సత్యం

Leave a Reply