అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్రత్యామ్నాయ సంస్కృతి* లక్ష్యంగా సంస్కృతి – మార్క్సిజం ఇతివృత్తంగా తలపెట్టిన ఈ మహాసభల సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విరసం పనిని తమ పనే అనుకొని ముందుకు వచ్చారు.
అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.
భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా తప్పుడు కేసులు పెట్టి మా గొంతు నొక్కేయాలని చూసిన ప్రభుత్వం ఇప్పుడొక సభను జరగనివ్వకుండా అడ్డుకొని మమ్మల్ని మాట్లాడానివ్వకుండా చేయాలని చూసింది. అయితే ఇంతటి నిర్బంధ పరిస్థితుల్లో సైతం నెల్లూరు మిత్రులు మాకు అండగా నిలిచారు. అప్పటికప్పుడు మరో వేదిక సుందరయ్య భవన్ ను మాకు ఏర్పాటు చేశారు. తెల్లవార్లూ మాతోనే ఉండి, సరంజామా అంతా తరలించి కొద్ది గంటల్లో కొత్త వేదికను సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. ఇది నిజంగా చారిత్రాత్మకం.
సుందరయ్య భవన్‌లో కూడా సభలు జరగనిస్తారా? అనే సందేహంతోనే అక్కడికి వెళ్లాం. జరగనిచ్చినా ఇప్పటికిప్పడు రెండు రోజులకు సరిపడ ఏర్పాట్లు సాధ్యమేనా? అనుకున్నాం. అనుకున్నట్లుగానే అక్కడికీ పోలీసులు వచ్చారు. ఈ ఒత్తిడిలో సభల నిర్వహణలో కొన్నిలోటుపాట్లు జరిగి ఉండవచ్చు. అసౌకర్యం కలిగి ఉండవచ్చు. వాటిని కొందరు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు.
విరసం సభలకు సహకరించడమంటే ప్రమాదాన్ని తెచ్చుకోవడమే అని తెలిసీ మాకు రెండురోజులు షెల్టర్ ఇచ్చిన నెల్లూరు సుందరయ్య భవన్ వారికి, అలాగే సంఘమిత్ర స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.
మా ఆహ్వానం మన్నించి సభల ప్రారంభోపన్యాసం చేసిన ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారికి, సౌహార్థ సందేశాలందించిన మిత్రులకు, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన అరుణోదయ, ప్రజా కళామండలి, అమరుల బంధుమిత్రుల సంఘం కళాకారులకూ, సభల్లో పాల్గొన్న రచయితలకు, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాల వారికి ధన్యవాదాలు. ఇంత నిర్బంధం మధ్య వీరంతా ఎప్పటిలాగే మాతో నిలిచారు. విప్లవ సాహిత్యోద్యమానికి అండగా నిలిచారు.
విరసం సభలకు విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ అభిమానుల నుంచి, రచయితల నుంచి, సోదర ప్రజాసంఘాల నుంచి అపురూపమైన స్పందన ఉన్నట్లే, రాజ్యం నుంచి, విరసంపట్ల విమర్శనాత్మకంగా ఉండే మిత్రుల నుంచి, వ్యతిరేకుల నుంచి కూడా తీవ్ర ప్రతిస్పందనలు ఉంటాయి. విరసం కార్యకలాపాలపట్ల, ముఖ్యంగా మహాసభల పట్ల ఈ ప్రతిస్పందనలను మేం మొదటి నుంచీ గమనిస్తున్నాం.
భారత విప్లవోద్యమంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పని చేస్తున్న విరసం కార్యకలాపాలను, విశ్లేషణలను, వైఖరులను ఎన్ఐఏ దగ్గరి నుంచి అంత మంది ఇంత సన్నిహితంగా గమనిస్తుండటం కూడా రాజకీయ, తాత్విక, సృజనాత్మక రంగాల్లో విరసం శక్తిని సూచిస్తోంది. భావజాల సంఘర్షణకు విరసం కేంద్రంగా, చోదకంగా ఉన్నదని రుజువు చేస్తోంది. అందువల్లనే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఈ మైత్రీపూర్వక, విమర్శనాత్మక, వ్యతిరేక ప్రతిస్పందనలు వెలువడుతున్నాయి. నెల్లూరు సభల కరపత్రం వచ్చినప్పటి నుంచి అందులో సంస్కృతిపై విరసం అందించిన స్థూల విశ్లేషణ గురించి మాతో కొందరు ఆలోచనాత్మక సంభాషణ ప్రారంభించారు. సభలు ఆరంభమైనప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న తీవ్రస్థాయికి వెళ్లాయి. ఈ రోజు ఒక దిన పత్రికలో కూడా చర్చ మొదలైంది.
ఫేస్‌బుక్‌లో జరిగిన ఈ మొత్తం చర్చలో మా మిత్రులు విరసం దృక్పథాన్ని చెప్పారు. ఇతరుల వాదనల్లోని ఇంప్రెషన్స్‌ను, పొరబాటు అవగాహనలను, దురుద్దేశాలను తార్కికంగా ఎత్తి చూపారు. మాలోని లోటుపాట్లను కూడా గుర్తింపజేశారు. అది కేవలం విరసం పట్లనేగాక విప్లవోద్యమం పట్లనే వాళ్ల ప్రేమను, దృష్టిని తెలియజేస్తుంది. నిజానికి విరసం చుట్టూ ఐదు దశాబ్దాలుగా ఇలాంటి మిత్రులే అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్లందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం.
అట్లాగే విప్లవ సాహిత్యోద్యమ సంస్థగా విరసం పట్ల చాలా విమర్శనాత్మకంగా ఉండే మిత్రులు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లు చేసే నిర్మాణాత్మక సూచనలు మాకు ఉపయోగకరం. వాటిపట్ల మాకు గౌరవం ఉంది. వాటిని మేం తీసుకుంటూ వచ్చాం. ఈ సభల సందర్భంగా సాగిన ఫేస్‌బుక్ చర్చల్లో అలాంటివాళ్లు కూడా కొందరు పాల్గొన్నారు. వాళ్లకు ధన్యవాదాలు.
ఇక ఈ చర్చల్లో విరసం.. ప్రజలకు దూరమైందని అన్నవాళ్లు ఉన్నారు. అగ్రహారం అన్నవాళ్లు ఉన్నారు. తోచినవన్నీ రాసిన వాళ్లు ఉన్నారు. వక్రీకరించినవాళ్లు ఉన్నారు. అబద్ధాలు రాసిన వాళ్లు ఉన్నారు. ఎప్పడూ ఇలాంటి వాళ్ల సంఖ్య పిడికెడు మించి లేదు. భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటానికి దిగాక ఇలాంటి వాళ్లు తప్పక తారసపడతారు. వాళ్లు విరసాన్ని ఎదుర్కోవడమంటే విరసం తన రంగంలో వర్గపోరాటాన్ని సునిశితంగా కొనసాగిస్తున్నట్లే.
కాకపోతే ఒకటే విచారం. ఈ వ్యతిరేకులు ముప్పై ఏళ్ల నుంచి ఒకటే భాష వాడుతున్నారు. విరసాన్ని, విప్లవోద్యమాన్ని విమర్శించడానికి అప్‌డేట్ అయితే బావుండు. ఎవరితోనైనా.. ముఖ్యంగా సాహిత్యరంగంలో సాగవలసిన నిరంతరాయ సంభాషణ తాజాగా ఉండాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా.
విప్లవోద్యమంతో సహా నిర్బంధాన్ని అనుభవిస్తూ, తను ఎన్నుకున్న రంగంలో తన శక్తినంతా ధారపోసి సాంస్కృతిక వర్గపోరాట సంస్థగా విరసం కొనసాగుతున్నది. నిరంతరం పునశ్శక్తిని కూడగట్టుకుంటూ ఎప్పటికప్పుడు లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకు వెళుతున్నది. అసంఖ్యాక పోరాట ప్రజల అండదండలతోనే, సూచనలతోనే ఇది సాధ్యం అవుతున్నది.
సహకారాన్నేకాదు, నిర్మాణాత్మక విమర్శలను ఎప్పటిలా సదా కోరుకుంటూ, నెల్లూరు సభలను విజయవంతం చేసిన వాళ్లందరికీ మరోసారి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
రివేరా, కార్యదర్శి
విరసం
13.1.2022