కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ` 2020లో భాగంగా ఐకెయస్ను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఇప్పుడు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యిమంది అధ్యాపకులకు భారతీయ జ్ఞాన వ్యవస్థలలో డిగ్రీస్థాయిలో బోధించడానికి అనుగుణంగా సుశిక్షితులను చేసే కార్యక్రమాన్ని యుజిసి ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలపై ఒక అవగాహన కల్పించడం దీని వుద్దేశం. అలాంటి పాఠాలను బోధించడానికి వీలుగా అధ్యాపకులకు శిక్షణ యిస్తున్నారు.
యుజి స్థాయిలోనూ, పిజి స్థాయిలోనూ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా దీనికి సంబంధించిన రెండు కోర్సులను పూర్తిచేయాలనే నిబంధనను యుజిసి విధించింది. ఇందుకు అవసరమైన 15లక్షల మంది అధ్యాపకులను రాబోయే రెండు సంవత్సరాల కాలంలో తయారుచేయడానికి యుజిసి ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ కోర్సులలో ప్రధానమైన అంశాలు 1. పరంపర (సాంప్రదాయం) 2. దృష్టి (దృక్కోణం) 3. లౌకిక ప్రయోజనం (ఆధునిక ప్రాసంగికత) ఇవి ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థలలో ఎలా వున్నాయో వివరించడం ఈ కోర్సు ఉద్దేశం. ఈ శిక్షణను నాలుగు భాగాలుగా విభజించారు. మొదటిభాగం పరిచయం లాంటిది. 14వ శతాబ్దానికి పూర్వంనాటి వైదిక వాచకం, వైదిక తత్వశాస్త్రంలోని దర్శన శాస్త్రాన్ని, కర్మ, ధర్మ వంటి అనువాదానికి లొంగని పదాలను పరిచయం చేయడం ఇందులో భాగం. చిట్టచివరిది అన్నింటికంటే ముఖ్యమైనది, అది పరిశోధనా పద్ధతికి సంబంధించింది. అక్కడ తంత్రయుక్తిని నేర్పుతారు.
ప్రాచీన భారతదేశంలో ఉనికిలో వున్న జ్ఞానం ఆధునిక భారతదేశానికి ఎట్లా ఉపకరిస్తుందో ఈ పాఠ్యాంశాల సారాంశం. ఈ కోర్సులో భాగంగా కేవలం విద్యాబోధనే కాకుండా పరిశోధనకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి నాగపూర్, చెన్నై, వారణాసి, శ్రీనగర్, గౌహతి, ఢల్లీిల కేంద్రంగా ఈ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు నడుస్తాయి. ఒక్కొక్క కేంద్రంలో 180మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో భాగంగా వేదాలు, చరిత్ర, గణితం, ఆయుర్వేదం, భారతీయ తత్వశాస్త్రం వంటి అంశాలపై శిక్షణ వుంటుందని గీతం విశ్వవిద్యాలయంలోని అసోసియేట్ ప్రొఫెసర్ ఆముక్తమాల్యద అంటున్నారు.
ఈ విద్యాభోదనతోపాటు పరిశోధనా పత్రాలు సమర్పించేవారికి రెండు సంవత్సరాలపాటు 20లక్షల చొప్పున గ్రాంటు కూడా ఇస్తారు. ఒక తరం నుండి మరోక తరానికి జ్ఞానాన్ని పద్ధతి ప్రకారం అందించడమే ఐకెయస్. ఇందులో కేవలం తరం నుంచి తరానికి సాంప్రదాయాలను అందించడం మాత్రమే కాక, జ్ఞాన ప్రక్రియను కూడా అందించడం విశేషమని యుజిసి చెప్తున్నది. ఉపనిషత్తులు, వేదాలు, ఉపవేదాలు వంటి వైదిక సాహిత్యం ఐకెయస్ పాఠ్యాంశాలలో ముఖ్యమైనవి.
మానవీయ శాస్త్రాలు, ఇంజనీరింగ్, వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, కళలు, సాంస్కృతిక కార్యకలాపాలు వంటివాటితో పాటు రసాయనశాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి నూతన వాచకాలకు సాంప్రదాయక వాచకాలను జతచేయాలని యుజిసి భావిస్తోంది.
యుజిసి విడుదల చేసిన అవగాహనా పత్రం ప్రకారం భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అనే విభాగంలో చక్రవర్తి క్షేత్రంగా (అంటే కేంద్రంగా) భరతవర్షం, ధర్మరక్షకుడుగా, బలహీనుల రక్షకుడుగా, వేదాల రక్షకుడుగా రాజు అనే అంశాలు వుంటాయి. అలానే ఆర్కిటెక్చర్ కోర్సులో స్థపత్య వేద అంటే శిల్పుల ప్రాధాన్యత, సింధు నది నుండి సరస్వతీ నదివరకు విస్తరించిన ప్రాంతాలలో పురాతన నగరాల నిర్మాణం, రామాయణ, మహాభారత కాలాలలో ఆర్కిటెక్చర్, భారతదేశంలో రాజగృహాల కంటే దేవాలయాలు ఎక్కువగా వుండటానికి కారణాలు వంటి అంశాలు వుంటాయి.
వైద్య సంబంధమైన కోర్సులు ఆయుర్వేదానికి వున్న వేద మూలాలు, త్రిగుణ, త్రిదోష, పంచ మహాభూతాలు, సప్త ధాతువులు, ఆగ్ని ప్రాధాన్యత వంటి అంశాలతోపాటు శుశ్రూతుడు, చరకుడు వంటి ప్రాచీనుల వైద్య శాస్త్ర రహస్యాలు వుంటాయి. అందులో భాగంగా ఆ కాలంలో ప్లాస్టిక్ సర్జరీ, ఫిస్టూల, క్యాటరాక్ట్ సర్జరీ వంటి వాటిపై వున్న జ్ఞానం నేర్పుతారు. ప్రాచీన కాలం నుండి 18, 19 శతాబ్దాల వరకు ఆయుర్వేదం ఎలా అభివృద్ధి చెందిందో కూడా వివరిస్తారు.
అదేవిధంగా ఆరు వేదాంగాలు ` శిక్ష, వ్యాకరణ, చందాలు, నిరుక్త, జ్యోతిష్య, కల్పలు కూడా వివరిస్తారు. భారతీయ నాగరికతలో సాహిత్యానికున్న పునాదులను, రామాయణం, మహాభారత కాలం నాటి భారతీయ మతసాంప్రదాయాలు వేద కాలం నుండి భక్తి ఉద్యమం వరకు ఎలా కొనసాగాయో కూడా పాఠ్యాంశాలలో భాగంగా వుంటాయి.
యుజిసి రూపొందించిన ఐకెయస్ పాఠ్య ప్రణాళికలో ఇవి కొన్ని అంశాలు మాత్రమే. బయట నుండి పైపైన పరిశీలిస్తే ఈ కోర్సులలో బోధించే విషయాలన్నీ ప్రాచీనతను ఆధునిక కాలానికి అనువర్తింపచేసే గొప్ప విషయాలుగా కన్పిస్తాయి. కాని కాస్త లోతుగా తరచి చూస్తే ఇందులో ఆర్యస్యస్ భావజాలానికి అనుగుణంగా బ్రాహ్మణీయ, వైదిక తత్వానికి పెద్దపీఠ వేసే లక్షణం కనబడుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా మనం గమనించవచ్చు.
భారతీయ వైద్యశాస్త్రం అభివృద్ధి క్రమంలో ఆయుర్వేదానికి ఎంతటి స్థానం వున్నదో యునానికి కూడా అంతే ప్రాధాన్యత వున్నది. కాని దాని ప్రస్తావన సిలబస్లో ఎక్కడా లేదు. కారణం అది ఇస్లామిక్ దేశాల వైద్య పద్ధతికి సంబంధించింది కావడమే. మరొక అంశం ఈ కోర్సులకు సంబంధించిన పుస్తకాలను అన్ని భారతీయ భాషలలోకి అనువదిస్తామని వున్నది. కాని అందులో ఉర్దూ లేదు. కారణం అది ముస్లింల భాషగా పరిగణించబడడం.
నిజానికి నూతన విద్యావిధానం 2020 నుండే భారతీయ జ్ఞానపరంపర పేరుతో హిందూత్వ ఎజెండాను విద్యావ్యవస్థలో కింది స్థాయి నుండి పై స్థాయివరకు తీసుకువచ్చే ప్రయత్నం వున్నది. గ్రీకు, రోమన్ తత్వశాస్త్రవేత్తల ఫోటోలను పాఠ్యపుస్తకాల నుండి తొలగించాలని, పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలా సరిఅయినవి కావో పిల్లలకు బోధించాలని కూడా వున్నది. ఇదంతా చూస్తే సరస్వతి శిశువిద్యామందిర్లలో బీజస్థాయిలో ఏమి నేర్పుతున్నారో ఎలాంటి ఆలోచనా పరమైన శిక్షణ ఇస్తున్నారో దాన్నే విశ్వవిద్యాలయాల స్థాయిదాకా తీసుకువెళ్ళే కుట్ర ఐకెయస్లో అంతర్లీనంగా వుందనేది స్పష్టం.
జ్ఞానం కేవలం మనుషుల మేధస్సుల్లో నుండి పుట్టేదికాదు. అది మానవ శ్రమ ఫలితం.
మానవ ఆచరణ అందులో కీలకమైన అంశం. శ్రమ, ఆచరణ అంటేనే సమష్టితత్వంతో కూడుకున్నవి. అంటే జ్ఞానం వ్యక్తిసంబంధమైనవి కాదు. ఏ సమాజంలోనైనా అది సమష్టికి సంబంధించిన సంపద. జ్ఞానాన్ని ఒక వ్యక్తికో, కులానికో, జాతికో, మతానికో ప్రాంతానికో అంటగట్టటం అశాస్త్రీయం, అవివేకం. అలాంటి తప్పుడు ఆలోచనలున్న సమాజాలు ఏవీ నిరంతర అభివృద్ధిని సంతరించుకోలేదు. ప్రాచీన కాలంలో భాషలో, వ్యాకరణంలో, శిల్ప కళలో, నౌకానిర్మాణంలో, వైద్య శాస్త్రంలో, వ్యవసాయంలో, ఖగోళశాస్త్రంలో భారతీయులు ప్రపంచానికి చాలా విలువైన సంపదను అందించారనేది అందరమూ అంగీకరించే విషయమే.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక గొప్ప నాగరికతకు చిహ్నంగా నిలిచిన ఈ విజయాల పరంపర ఆధునిక కాలంలోకి ఎందుకు ప్రవహించలేదు అన్నదే ఆ ప్రశ్న. భారతీయ జ్ఞాన ప్రవాహం ఒకానొక కూడలి దగ్గర నిలవ నీరుగా ఎందుకు మారిపోయింది. పాశ్చాత్య దేశాలలో ఆధునికి కాలాలలో జ్ఞాన వికాసం ఎందుకు సాధ్యం అయింది. ఈ ప్రశ్నలకు నిజాయితీతో సమాధానం ఇస్తే తప్ప ఉపయోగం వుండదు. మతంపేరుతో, కులంపేరుతో, ఆచార వ్యవహారాల పేరుతో , భగవంతుని పేరుతో, వేదాలు అపౌరుషేయాలని, సంస్కృతం దైవభాష అని వాటిని నేర్చుకునే హక్కు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వుందని కట్టడులు పెట్టి, జ్ఞానాన్ని కొందరి గుత్తసొత్తుగా మార్చుకున్న క్రమంలోనే భారతీయ జ్ఞాన పరంపర నిలవనీరుగా మారిపోయింది.
దానికి ఆ తుప్పును వదలగొట్టి జ్ఞానాన్ని ప్రజలందరికీ చేరువచేసి, ప్రజల శ్రమనుండి, భౌతిక ఉత్పత్తి నుండి దైనందిన జీవిత ఆచరణ నుండి ఆవిర్భవించే జ్ఞాన పరంపరను స్వీకరించడం ద్వారా మాత్రమే నిజమైన జ్ఞాన వికాసం ఈ దేశంలో కలుగుతుంది. అలా కాని పక్షంలో ఒకవైపు చంద్రయాన్లు వుంటూనే మరోవైపు విశ్వవిద్యాలయాలలో సైన్సు పేరుతో రాహు, కేతువుల గురించి గ్రహణాల గురించి బోధించడం కూడా జరుగుతోంది. అయితే జ్ఞానాన్ని మత, కుల విష కౌగిలి నుండి బయటకు తీసుకువచ్చే ఎజెండా ఏదీ భాజపా ప్రభుత్వానికి లేదు. ఆ కారణంగానే దాని ఆధ్వర్యంలో జరిగే భారతీయ జ్ఞాన వ్యవస్థ లేదా జ్ఞాన పరంపరలు విశ్వవిద్యాలయాల స్థాయికి తీసుకువెళ్ళడం అంటే అది సరస్వతి శిశువిద్యామందిర్లను యూనివర్శిటీలకు ఎగబాకించడమే. ఆధునిక సమాజాలకు అవసరాలకు అనుగుణమైన జ్ఞానతృష్ణను రేకెత్తించకుండా, మేధోపరంగా మరుగుజ్జులను తయారుచేయడం మాత్రమే అవుతుంది. ప్రాచీనతను ఆధునికతకు అంటుగట్టటం అనే పేరుమీద జరిగే ఈ ప్రక్రియ చివరకు భారతీయ జ్ఞాన వికాసం కుంచించుకుపోవడానికి , దేశం, సమాజం అప్రజాస్వామికంగా మారడానికే ఉపయోగపడతాయి. అందుచేత స్త్రీ వ్యతిరేక, ఉత్పత్తి కులాల వ్యతిరేక, దళిత కులాల వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, బౌద్ధం, జైనం, చార్వకం వంటి ప్రజాస్వామిక సంప్రదాయాల వ్యతిరేకమైన ఈ భారతీయ జ్ఞాన పరంపర కార్యక్రమాన్ని మనం నిరసించాలి. దానికి నిజమైన ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని రూపొందించి ప్రజల ముందు చర్చకు పెట్టాలి.