పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది వేరే విషయం. శ్రీ వాజ్‌పేయీ మూడవ సారి ప్రధాన మంత్రి అయిన (1999) తరువాత, 2000 సంవత్సరంలో సంఫ్‌ు పరివార్‌ భావజాలంతో ఒక కొత్త పాఠ్య ప్రణాళిక తీసుకువచ్చారు. అది చాలా వివాదంశం అయింది. 2004లో యు.పి.ఎ 1 ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ కాలంలో 2005 ఒక కొత్త పాఠ్య ప్రణాళిక చట్రం ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2005’’ విచ్చింది. ఆ ప్రణాళిక చాలా ప్రశంసలందుకున్నది. అయితే, విద్యా వ్యాపారం కూడదని చెప్పకపోవడం, అది తన పరిధిలో లేని సమస్యగా భావించడం వల్ల ఆ పాఠ్య ప్రణాళిక క్షేత్ర వాస్తవికతలో ఎంతవరకు విజయవంతమయింది చెప్పలేం. బి.జె.పి నాయకత్వాన గల ప్రస్తుత ఎన్‌.డి.ఎ ప్రభుత్వం ‘‘జాతీయ విద్యా విధానం 2020’’, దానిపై ఆధారపడి ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2023 (ముసాయిదా)’’ తీసుకువచ్చింది. ఈ రెండు విధానాలు కూడా భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్‌ అభివృద్ధి నిరోధక విధానాలపై ఆధారపడి  ఉన్నాయని ఆ విధాన పత్రాలను చదివిన వారు సులభంగా గ్రహిస్తారు. 

మన రాష్ట్రం అనేక దశాబ్ధాలుగా ‘రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణ మండలి’ ద్వారా స్వతంత్రంగా పాఠ్య ప్రణాళికను, పాఠ్య పుస్తకాలను రూపొందించే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నది. కొన్ని లోటుపాట్లున్నప్పటికీ ఆ విధానం ప్రయోజనకరమైనదిగానే ఋజువయ్యింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అట్టి విధానాన్ని ప్రక్కన పెట్టి ‘జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణ మండలి’ రూపొందించిన పాఠ్యపుస్తకాలను (సి.బి.ఎస్‌.ఇ సిలబస్‌) నేరుగా ఉపయోగించటం 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. గత సంవత్సరం 8వ తరగతికి కేంద్రం తయారు చేసిన సి.బి.ఎస్‌.ఇ పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఈ సంవత్సరం అదే విధానాన్ని కొనసాగిస్తూ కేంద్రం తయారుచేసిన 9వతరగతి పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్పరంలో 6 నుండి 10వ తరగతి వరకు అన్ని తరగతులకు కేంద్రం తయారు చేసిన పాఠ్యపుస్తకాలనే అమలుచేస్తామని చెప్తున్నారు. కేంద్రాన్ని అనుసరించే ఈ  విధానం తీవ్ర సమస్యలకు దారితీస్తున్నది. ఇది కాక ఒక వెయ్యి ఉన్నత పాఠశాలలను నేరుగా కేంద్ర బోర్డుకు అనుబంధం చేసింది.

కేంద్రం ఈనాడు శాస్త్రీయ దృక్పథానికి, లౌకిక, ప్రజాస్వామిక విలువులకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలను మారుస్తున్నది. అదే విధానాన్ని రాష్ట్రంలో అమలుచేయటం వల్ల మన రాష్ట్రం కూడా యు.పిÑ బీహార్‌ వలే వెనుకబడటం తప్ప మరొక ప్రయోజనం ఉండదు. పీరియాడిక్‌ టేబుల్‌ లేకుండా రసాయనిక శాస్త్రం, జీవ పరిణామ సిద్థాంతం లేకండా జీవశాస్త్రం, హక్కుల కొరకు జరిగే ఉద్యమాలు లేకుండా రాజకీయ శాస్త్రం బోధించి ఏం లాభం.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సి.బి.ఎస్‌.ఇ సిలబస్‌ను రాష్ట్రంలో ప్రవేశపెడతామని అన్నప్పుడు ప్రొ.చక్రధరరావు, ప్రొ.హరగోపాల్‌ గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటి కేంద్ర పాఠ్యపుస్తకాలను నేరుగా ప్రవేశపెట్టటం మంచిది కాదని సి.బి.ఎస్‌.ఇ సిలబస్‌లో మంచి అంశాలను తీసుకుని రాష్ట్రంలో స్వతంత్రంగా పాఠ్యపుస్తకాలను తయారు చేయాలని సూచించటం జరిగింది. ఆ ప్రతినిథి వర్గంలో ఈ వ్యాస రచయిత కూడా ఉన్నాడు. విద్యా పరిరక్షణ కమిటీ సలహాను అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. సారభూతంగా మంచి పాఠ్యపుస్తకాలు తయారుచేయబడ్డాయి. అది గతం. ప్రస్తుత జగన్మోన్‌ రెడ్డి ప్రభుత్వానిది కేంద్రాన్ని ప్రశ్నించలేని అసహాయత. స్వతంత్రంగా వ్యవహరించటం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదేమో. సి.బి.ఎస్‌.ఇ ఏఏ పాఠాలను 8వ తరగతి నుంచి తొలగించాలని నిర్ణయించిందో వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పాఠాలను సిలబస్‌ నుండి తొలగిస్తూ ఆదేశాలివ్వటం జరిగిపోయింది. ఈ రాష్ట్ర వర్తమాన, భవిష్యత్‌ తరాల అవసరాల కంటే కేంద్రం అభీష్టాన్ని అమలుచేయటమే ఈ ప్రభుత్వానికి ప్రధానమైపోయింది.

ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, సామాజిక శాస్త్రాల నుండి పాఠాలను లేదా పాఠ్య భాగాలను తొలగిస్తూ ప్రభుత్వం సర్కులర్‌ విడుదల చేసింది. చరిత్రకు సంబంధించిన పాఠాలను ఉదాహరణగా పరిశీలిద్దాం. సామాజిక శాస్త్రం మూడు విభాగాలుగా ఉంటుంది. చరిత్ర అనే విభాగాన్ని ‘మన గతాలు’ అని వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న పది పాఠాల్లో 6వ, 10వ పాఠాలను పూర్తిగా తొలగించారు. మిగిలిన పాఠాల్లో ఇతర దేశాలకు చెందిన చారిత్రక సమాంతరాలను  తొలగించారు. తొలగించబడిన 6వ పాఠం ‘చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు’ అనే మకుటంతో ఉంది. ఈ పాఠంలో ఆంగ్ల దొరల పాలనా కాలంలో విదేశాల నుంచి ముందుగా నూలు, తరువాత బట్ట దిగుమతి చేసినప్పుడు ఇక్కడ నేత కార్మికుల పరిస్థితి ఏవిధంగా దిగజారిందో, అలాగే ఇనుమును దిగుమతి చేసినప్పుడు ఆ పరిశ్రమల్లో వృత్తి కార్మికుల, యజమానుల పరిస్థితి ఏమైందో సోదాహరణగా వివరించారు. అంత కంటే ప్రధానంగా ఈ పాఠం 17, 18 శతాబ్ధాల్లో భారత్‌ బ్రిటిష్‌ వ్యాపారంలో భారత్‌ మిగుల్లో ఉండేదని, అనంతర కాలంలో బ్రిటిష్‌లో ముందుకొచ్చిన ఆధునిక పరిశ్రమలు దానితో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చిన సరుకులపై నిషేధాలు విధించటం వల్ల లేదా భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేయటం వల్ల భారత పరిశ్రమలు ఏవిధంగా దివాళా తీసాయో బాలబాలికలకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. అంతేకాక, భారత చేనేత కళాకారుల కళా నైపుణ్యాలను కూడా ఈ పాఠంలో చూపించారు. యూరప్‌లో ధనికులు అక్కడ తయారైన మిల్లు వస్త్రాల కంటే భారత చేనేత పరిశ్రమల్లో తయారైన ప్రత్యేక వస్త్రాలనే ఇష్టపడేవారని, బ్రిటిష్‌ రాణి కూడా ఇక్కడి నుంచి వస్త్రాలు తెప్పించుకునే వారని ఎత్తి చూపారు. తరువాత కాలంలో ముంబైలో మిల్లు వస్త్రాల తయారీ, గాంధీ విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం వంటి వాటిని ఈ క్రమంతో జోడిరచారు. ఈ పాఠాన్ని నిజానికి 17నుంచి 20వ శతాబ్ధం వరకు భారత ఆర్ధికరంగ చరిత్రగా, ఆర్థిక రంగం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయాల చరిత్రగా చెప్పవచ్చు. సామాజిక శాస్త్రానికి చెందిన చాలా సంక్లిష్టమైన విషయాలను చాలా సరళంగా బాలబాలికల కొరకు ఈ పాఠం అందిస్తుంది. ఇదే పాఠంలో దక్షిణ భారత దేశంలో కుటీర పరిశ్రమల్లో తయారయ్యే నాణ్యమైన ఊడ్జ్‌ ఐరన్‌ గురించి కూడా ఉంది. భారత దేశంలో మాత్రమే తయారయ్యే ఒకానొక ఇనుముకు స్థానిక నామం ఉక్కు. దీన్నే ఆంగ్లేయులు ఊడ్జ్‌గా పలికేవారు. ఆ పేరు దానికి అంతర్జాతీయంగా స్థిరపడిపోయింది, ప్రపంచ వ్యాప్తమైపోయింది. ఈ ఇనుముతో ఎంత బలమైన పదునైన ఖడ్గాలు తయారైయ్యేవంటే వాటితో సాధారణ ఖడ్గాలను నిలువునా చీల్చవచ్చు. బ్రిటిష్‌వారిని ఎదిరించిన మైసూరు నవాబు టిప్పు సుల్తాను సైన్యం అటువంటి ఖడ్గాలనే వాడేదని పేర్కొన్నారు. నిజానికిది చాలా విలువైన పాఠం. ఈ పాఠం బాలబాలికలకు భారం కాజాలదు. భారత దేశ ఔన్నత్యాన్ని వారు ఆస్వాదించేటట్లు చేయగలదు. ఈ పాఠాన్ని ఎందుకు తొలగించారో అర్ధం చేసుకోవటం కష్టం. మొఘలుల పాలనా కాలంలో దేశం సాధించిన ఆర్థిక విజయాలు బాలలకు తెలియకూడదని, టిప్పు సుల్తాను గొప్ప సైనిక పాటవంతో బ్రిటిష్‌ వారిని ఎదిరించిన విషయాలు బాలబాలికలకు తెలియకూడదని నేటి పాలకులు భావిస్తుండవచ్చు.

‘స్వాతంత్య్రానంతర భారతదేశం’ అనే మకుటంతో ఉన్న మరొక పాఠాన్ని (10వ పాఠం) చరిత్ర విభాగం నుంచి తొలగించారు. ఈ పాఠంలో భారత్‌ పాకిస్తాన్‌ విభజనను, నాటి బాధాకరమైన పరిస్థితులను క్లుప్తంగా చెప్తారు. తరువాత గాంధీ హత్య గురించి కూడా క్లుప్తంగా చెప్పారు. అవి చెప్పడం అవసరమే అదే విధంగా ఆ స్థాయిలో విస్తరించి చెప్పకపోవడం కూడా మంచిదే. సున్నితమైన ఈ విషయాలను చాలా జాగ్రత్తగా రచించారు. ఇంకా ప్రధానంగా, భారత రాజ్యాంగ రూపకల్పనలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ చర్చలను, అందులో ముఖ్యమైనవాటిని, ఈ పాఠంలో సహేతుకంగా వివరించారు. ఎ) అందరికీ ఓటు హక్కు ఇవ్వటంపై జరిగిన చర్చను, బి) భారత దేశం పాకిస్థాన్‌ వలే ఒక మత రాజ్యంగా కాక, ఒక సెక్యులర్‌ రాజ్యంగా ఉండాలన్న దానిపై జరిగిన చర్చను, సి) కేంద్ర, రాష్ట్రాల అధికారాల విభజన గురించిన చర్చను, డి) ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థల మధ్య అధికార విభజన గురించిన చర్చను, ఇ) చారిత్రకంగా వెనుక ఉంచబడిన సామాజిక విభాగాలకు ప్రత్యేక రక్షణ గురించిన చర్చను, ఎఫ్‌) ఆధికార భాష విషయమై వచ్చిన భావోద్వేగాలను ఈ పాఠంలో వివరించారు. నేటి పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్‌లు ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న విషయాన్ని, పశ్చిమ పాకిస్థాన్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఉర్దూను బాంగ్లా భాష మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌ (స్వాతంత్ర పూర్వకాలంలో తూర్పు బెంగాల్‌, అనంతరం తూర్పు పాకిస్తాన్‌, 1971నుంచి బాంగ్లాదేశ్‌) ప్రజలపై బలవంతంగా రుద్దటానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి ఏ విధంగా అది ఆ దేశ విభజనకు దారితీసిందోÑ అలాగే శ్రీలంకలో సిన్హలీ భాషను తమిళ భాషపై రుద్దటానికి చేసిన ప్రయత్నం ఆ దేశాన్ని ఎలా విధ్వంసం చేసిందో వంటి ఋణాత్మక ఉదాహరణలు ఒకవైపుÑ ఆంధ్ర రాష్ట్రం కొరకు మహనీయుడు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, 1956లో మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన నెహ్రూ పటేల్‌ ఆందోళన చెందినట్లు దేశం బలహీన పడలేదని మరింతగా అభివృద్థిచెందిందని కూడా ఈ పాఠంలో వివరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల విభజన భావోద్వేగాలు పెరగవని, భాషాపరమైన గుర్తింపుకు ప్రాధాన్యత కల్పించటం వల్లే ఐక్యత సాధ్యం అవుతుందనే సామాజిక శాస్త్ర విషయాన్ని ఈ పాఠం సోదాహరణంగా వివరిస్తుంది. ఈ పాఠాన్ని మొత్తానికి మొత్తంగా తొలగించారు. సార్వత్రిక ఓటు హక్కు, అధికార విభజన, రాష్ట్రాల ఫెడరల్‌ హక్కులు, భాషా సాంస్కృతిక వైవిధ్యాల ఔన్నత్యం, సామాజిక న్యాయం, అన్నింటికంటే మతాతీత లౌకిక రాజ్య భావన నేటి కేంద్ర పాలకులకు పడవు. రాష్ట్రంలో అధికార పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా తన రాజకీయ అవసరాల కొరకు కేంద్రం అడుగుజాడల్లో నడుస్తుంది. పాఠ్యాంశాలను మతోన్మాదంతో, మనువాదంతో నింపుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మతోన్మాద శక్తులు, రాష్ట్రంలో దానికి  ఊడిగం చేసే ప్రభుత్వాలే వస్తే మన రాష్ట్రం అనతి కాలంలోనే మణిపూర్‌ కాగలదు. విద్యను తిరిగి రాష్ట్ర జాబితాకు మార్చే ఉద్యమం ముందుకు రావాలి. విద్య రాష్ట్ర జాబితాలో ఉండాలి, అలాగే పాఠ్య ప్రణాళిక భారత రాజ్యాంగ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, లౌకకవాదరం, సామ్యవాదం, సామాజిక న్యాయం, ఫెడరిజజం వంటి విలువలపై ఆధారపడి ఉండాలి.         

Leave a Reply