భారత దేశ ఆర్థిక, రాజకీయ చిత్రం పరిశీలిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకుందని తెలుస్తోంది. నిత్య జీవితావసర వస్తువులు గోధుమలు, బియ్యం, వంట నూనెలు, వంట గ్యాస్‌, పాలు వంటి వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ సాధారణ కార్మికుల వేతనాలు సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. వేతన జీవుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతున్నది. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది.  గ్రామీణ నిరుద్యోగాన్ని కొంతమేర నిలువరించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30శాతం ఈ సంవత్సరంలో తగ్గించి వేశారు. సంక్షేమ పథకాలపై కోత పెట్టారు. రైతులకు కనీసమద్దతు ధర హామీ ఇవ్వకుండా మాటలతో మైమరిపించే పనిచేస్తున్నారు.

దాదాపు ఏడాదిక్రితం బ్రిటన్‌ను తోసిరాజని ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ధ్రువీకరించగానే, మరిన్ని ప్రగల్భాలు మోతెక్కిపోయాయి. 2027 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి, 2029 నాటికి జపాన్‌ను అధిగమించి మూడో ర్యాంకుకు ఇండియా ఎదగడం తథ్యమన్న విశ్లేషణలు హోరెత్తాయి. ఇటీవలి ఎర్రకోట ప్రసంగంలోను, జొహానెస్‌బర్గ్‌ వేదికగా బ్రిక్స్‌ సదస్సులోను ప్రధాని మోడీ పలుకుల్లో భారత్‌ అభివృద్ధి స్థిర కక్ష్యలో వెలుగులు విరజిమ్ముతుందన్న ధీమా ప్రస్ఫుటమైంది. సమీప భవిష్యత్తులో ఇండియా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందంటున్న జోస్యాలు నాణేనికి ఒక పార్శ్వమే. భారత్‌ వృద్ధి పురోగమిస్తున్నదంటూ ఎవరెన్ని గణాంకాలు ఉటంకిస్తున్నా తలసరి స్థూల దేశీయోత్పత్తి లెక్కల ప్రకారం, మనది ఇప్పటికీ దిగువ మధ్యాదాయ దేశమే.

పెరుగుతున్న ఆర్థిక అసమానతలు :

మనదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక అసమానతలు గతంలో కంటే మరింతగా పెరుగుతూ వస్తున్న సంగతి విధితమే. పేదలు ధరా భారాలతో, కష్టాల కడగండ్లతో కకావికలమవుతుంటే సంపన్నుల ఆస్తులు మాత్రం కొండల్లా పేరుకుపోవడానికి కారణం పాలకులు అమల్జేస్తున్న వినాశకర విధానాలే కారణమన్నది స్పష్టం. మోడీ పాలనలో నింగి, నేలా తేడా లేకుండా సర్వ సంపదలనూ కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెడుతుండటంతో కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతోంది. గత పది ఏళ్లలో కుబేరుల సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. వారి సంపద రెండిరతలు పెరిగింది. ఇవాళ దేశంలో ప్రజల ఆదాయాలు తగ్గడం, ధరలు పెరుగుతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడం, తయారీ రంగ వృద్ధిలో క్షీణత… ఇవన్నీ కలిసి ఉధృతమవుతున్న ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

ఇవాళ భారత్‌లో కనీసం ఒక బిలియన్‌ డాలర్ల పైన సంపద (రూ.8 వేల కోట్ల పైబడి సంపద) కలిగిఉన్న వారి సంఖ్య 169కి పెరిగినట్లు అమెరికా మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ అక్టోబర్‌ 5 నాడు వెల్లడిరచింది. గతేడాది 166 మంది బిలియనీర్లు ఉండగా వారి సరసన మరో ముగ్గురు చేరారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతున్న సమయంలో 2020లో ముంచుకొచ్చిన కొవిడ్‌ విపత్తు ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేసింది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న దరాఘాతాలకు బలైపోయి ప్రజల ఆదాయాలు అంతకంతకూ క్షీణించిపోతుంటే కుబేరుల సంపదతో పాటు సంఖ్య కూడా పెరగడం అసమానతల తీవ్రతకు అద్దం పడుతోంది. చమురు, టెలికాం వంటి పరిశ్రమల్లోనే కాకుండా చిల్లర వ్యాపారాలను సైతం చిధ్రం చేసి సర్వం తానే ఆక్రమించి లాభాలను టోకుగా ఆర్జిస్తున్న రిలయన్స్‌ గ్రూపు అధినేత ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో రూ. ఏడున్నర లక్షల కోట్ల సంపదతో దేశంలో అగ్రస్థానంలోనూ, ప్రపంచంలో 11వ స్థానంలోనూ నిలిచారు. ఆ తర్వాత స్థానంలో బిజెపికి ఆప్తుడైన గౌతం అదానీ రూ.నాలుగున్నర లక్షల కోట్ల సంపదతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు.

142.8 కోట్లకు పైబడిన జనభారతావని తలసరి రాబడి లెక్కల ప్రాతిపదికన జి-20 కూటమిలో భారత్‌ అత్యంత పేదదేశం. ఈ సంవత్సరం మొదట్లో వెలుగుచూసిన ఆక్స్‌ఫామ్‌ అధ్యయనాంశాల ప్రకారం, అయిదు శాతం జనాభా చేతుల్లో 60 శాతానికి పైగా దేశ సంపద పోగుపడి ఉంది. అట్టడుగు 50 శాతం మంది దగ్గర మొత్తం సంపదలో కేవలం 3 శాతమే ఉందంటే అసమానతల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఆకలి మంటలకు కమిలిపోతున్న భారతీయుల సంఖ్య కోట్లలో విస్తరిస్తోంది. 2018లో 19 కోట్లుగా లెక్కతేలిన క్షుధార్తుల జనరాశి, 2022 నాటికి 35 కోట్లకు చేరినట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక స్పష్టీకరించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ నిచ్చెన మెట్లు ఎక్కుతుంటే జనాభాలో అత్యధికులు బతుకుపోరులో నిస్సహాయంగా చితికిపోతున్నారు. ఆదాయ అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్నాయి. పేదరికం, ఆకలిదప్పులు, అనారోగ్యం, దుర్భర వేదనలతో సాధారణ జనజీవనం తీవ్ర ఇక్కట్ల పాలవుతోంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ దేశం సంపన్నం, ప్రజలే పేదలు!

ప్రజలపై పెరుగుతున్న రుణభారం :

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ మన ప్రధాని  అవకాశం దొరికిన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. అదే సమయంలో దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేస్తున్నది. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రం చేసిన అప్పులు 150 శాతం పెరిగాయని అప్పుల చిట్టాను బయటపెట్టింది. ఇక రాష్ట్రాల అప్పు ఏకంగా 200 శాతం పెరిగిందని తేలింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! దీన్ని బట్టి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ప్రగతి సాధించిన రంగం ఏదైనా ఉందా అంటే అది ‘రుణ భారం’ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ అప్పుల వల్ల దేశం మౌలిక వనరుల పరంగానో, అభివృద్ధి పరంగా ఏమైనా సాధించిందా అంటే అదీ లేదు. ఈ అప్పుల వెనుక ఉన్న అసలు కారణాలు పరిశీలించాలి. 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. మరుసటి ఏడాది జులైలో హడావుడిగా తీసుకొచ్చిన జిఎస్‌టి మరింత దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీని నుండి బయటపడేందుకు అప్పుల మీద అప్పులు చేయాల్సి వచ్చింది. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 62 శాతం అప్పులున్నాయని కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడిరచింది. ఇది 152 లక్షల కోట్లకు సమానం. ఈ రుణ భారం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతున్నదా అంటే అదీ లేదు.

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం :

2018 జనవరి నుంచే భారత్‌ వృద్ధి క్రమంగా పడిపోవటం మొదలైంది. యేటా దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. గతేడాది ఉన్న వృద్ధి ఈ యేడు లేదు. రెండేండ్ల కింద ఉన్నంత గతేడాది లేదు. ఈ అంతరం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకపక్క మౌలిక వసతులు, మానవ వనరులు సరిగాలేని బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశం కూడా నైపుణ్యం లేని మానవ వనరులనే పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ముందంజ వేస్తున్నది. కార్మికులు అవసరమయ్యే వస్త్ర ఉత్పత్తిపై దృష్టిపెట్టి ఎగుమతుల్లో దూసుకుపోతున్నది. వస్త్ర పరిశ్రమలోకి మహిళలు భారీ సంఖ్యలో వచ్చేలా ప్రోత్సహించింది. కానీ మన దేశంలో మహిళలను పారిశ్రామికోత్పత్తిలో భాగస్వాముల్ని చేయడం కన్నా వాళ్లు ఏ మతం వాళ్లను పెండ్లి చేసుకుంటున్నారు? ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారు? అన్న విషయాలు ప్రధానమైపోయాయి.

అంతర్జాతీయంగా పేరున్న థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ 2018లో విడుదల చేసిన (ప్రపంచంలో మహిళల భద్రతపరంగా అత్యంత ప్రమాదకర దేశాలు) జాబితాలో భారత్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. అంటే మన దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. ఇదే సమయంలో మోడీకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తల ఆస్తులు ఎంతగా పెరిగిపోయాయో చూస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. 2020 లెక్కల ప్రకారం ముఖేశ్‌ అంబానీ ఆస్తులు 350 శాతం, గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏకంగా 700 శాతం ఇవి పెరిగాయి. ఈ మూడేండ్లలో మరింత పెరిగాయి. కరోనా సైతం వీరి వృద్ధిని ఏ మాత్రం అడ్డుకోకపోవటం వైచిత్రి, తెచ్చిన అప్పుల్లో సగానికి పైగా ఇలాంటి కార్పొరేట్ల రాయితీలకే ఖర్చు చేస్తుంటే వాళ్ల ఆస్తులు పెరగవా మరి! ‘ప్రభుత్వం కార్పొరేట్లకు వారు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు 14.49 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది.

ఏ దేశమైనా అభివృద్ధి చెందడమంటే ఏమిటి? పరిమిత సంఖ్యలో వ్యక్తులు అపర కుబేరులుగా ఆవిర్భవించి వారివద్ద సంపద పోనుపోను మేటలు వేసుకుపోవడమా? కానేకాదు! సాధారణ ప్రజానీకం జీతీతాలు కుదుటపడాలి. వారి రాబడి ఇనుమడిరచాలి. జీవ ప్రమాణాల్లో గణనీయ మెరుగుదల సాధ్యపడాలి.

వాస్తవంలో  క్షేత్రస్థాయి స్థితిగతులు దుర్భరంగా మారుతున్నాయి. వ్యవసాయంలో గిట్టుబాటు ఎండమావై రైతుల మెడలకు ఉరితాళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత ఎకాయెకి 66 శాతం. ఆ బలిమి జాతికి కలిమిగా రూపాంతరం చెందాలంటే మేలిమి విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన ప్రణాళికాబద్ధంగా చురుకెత్తాలి.  అందుకోసం మేలిమి వ్యూహాల కూర్పు, పకడ్బందీ కార్యాచరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా విధానాలు రూపొందించి అమలు చేయాలి. ఈ కీలకాంశాన్నే రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తాజాగా ప్రస్తావించింది. ప్రస్తుతం విద్యాఫలితాల స్థాయిలో అత్యధిక జనాభా(మానవ వనరులు) తాలూకు సత్ఫలితాలను ఒడిసిపట్టాలంటే పటిష్ఠ విద్య, నాణ్యమైన మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించాలన్నది మూడీస్‌ సూచనల సారాంశం. ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయాల ప్రాతిపదికన గణించే మానవాభివృద్ధి సూచీలో భారత్‌ ఎక్కడుంది? అంటే, 191 దేశాల జాబితాలో 132వ స్థానానికి పరిమితమై  ఈసురోమంటోంది.

మనదేశ ప్రజానీకం వాస్తవిక ఆదాయాలు కృశించి పోతున్నాయి. దీంతో జీవనం మరింత దుర్భరంగా మారుతోంది. ఫలితంగా దేశ ఆర్థికారోగ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గిపోతోంది. పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ ఉండడం లేదు. ఉత్పత్తి చేసింది వెంటనే అమ్ముడయ్యి లాభాలు వచ్చి, అభివృద్ధి నమోదైతేనే పెట్టుబడులు పెరుగుతాయి. డిమాండ్‌, పెట్టుబడులు లేనప్పుడు ఆర్థిక వృద్ధి కూడా జరగదు. ఈ నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న ప్రాథమిక సమస్య ఇది. మోడీ ప్రభుత్వ హయాంలో మతం-కార్పొరేట్‌ బంధం మరింత బలపడుతుండడంతో, దేశంలో ఉత్పత్తి అయ్యే సంపదలో ప్రధాన భాగం ఆశ్రితుల చేతుల్లోకి వెళ్తోంది. అదానీ వ్యవహారం ఇందుకు మంచి ఉదాహరణగా ఉంది. మెజారిటీ ప్రజలను పణంగా పెట్టి కొద్దిమంది ఆశ్రితులను మరింత సుసంపన్నులను చేయడానికి దేశ సంపద మళ్లించబడుతోంది.

శ్రామిక ప్రజలు తమ ఆదాయాలను ప్రధానంగా ఆహారం మీద ఖర్చు చేస్తారు. ఆ తర్వాత అసంఘటిత రంగంలో ఉత్పత్తి అయ్యే సరుకులను తమ వినియోగం కోసం కొనడానికి ఖర్చు చేస్తారు. మొత్తం వస్తూత్పత్తి రంగంలోనే వృద్ధి దాదాపు లేదు. అందులో ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పూర్తిగా మాంద్యం నెలకొంది. అంటే శ్రామికవర్గం కొనుగోలుశక్తి ఏమీ పెరగలేదని కనిపిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యయం ఈ కాలంలో వాస్తవ విలువలలో ఏమీ పెరగలేదు. స్థూల స్థిర పెట్టుబడిలో పెరుగుదల కనిపిస్తున్న మాట నిజం. కాని వినిమయంలో గాని, ఎగుమతులలో గాని పెరుగుదల లేనప్పుడు పెట్టుబడులు పెట్టడంలో పెరుగుదల కొనసాగుతుందని భావించలేము. జిడిపి గణాంకాలలో అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయం శ్రామిక ప్రజల వినిమయంలో పెరుగుదల ఏమీ లేకపోవడం. ప్రపంచంలో కెల్లా మనదే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’’ అని ఎంత గొంతు చించుకున్నా, ఈ చేదు నిజాన్ని పాలకులు కప్పిపుచ్చలేరు.

మనదేశ కార్మికవర్గంలో అసంఘటిత కార్మికులు 83 శాతం వరకు ఉంటారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి 15 ఏళ్ళు అవుతున్నా పట్టించుకునే నాధుడు లేడు. కొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీలేదు. జిడిపిలో 60 శాతం వాటా ఉన్న అసంఘటిత రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. 84 శాతం నిరుద్యోగిత పెరిగింది. అశాంతి, అలజడి రేకెత్తించే స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉంది. ప్రతి సంవత్సరం దేశంలో కోటి 20 లక్షల కొత్త ఉద్యోగార్థులు వస్తున్నారు. వారిని ఆదుకునే అభివృద్ధి ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేవు. గత 9 ఏళ్ళలో కేవలం 1 కోటి 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగామని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది.

2018-19లో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగం రేటు 2023 మార్చి నాటికి 7.9 శాతానికి ఎగబాకింది. (సిఎంఇఇ వెల్లడిరచిన గణాంకాలు) జిడిపి వృద్ధిరేటు పెరుగుతున్నప్పుడు, అందునా, జనాభా పెరుగుతున్న వేగం కన్నా జిడిపి వేగంగా పెరుగుతున్నప్పుడు నిరుద్యోగం రేటు తగ్గాలే తప్ప పెరగకూడదు కదా. మరి ఎందుకు నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది? ఆర్థిక వ్యవస్థ పెరిగే వేగం కన్నా జనాభా, అందులోనూ నిరుద్యోగ జనాభా వేగంగా పెరిగిపోతే అప్పుడు నిరుద్యోగం రేటు పెరగడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ దానికి భిన్నంగా నిరుద్యోగ జనాభా పెరుగుదల వేగం కన్నా ఆర్థిక వృద్ధి పెరిగిన వేగం ఎక్కువ. అంటే నిరుద్యోగం పెరిగిపోవడానికి లేబర్‌ సప్లై పెరగడం కాదు కారణం. దానికి భిన్నంగా లేబర్‌ డిమాండ్‌ తగ్గిపోవడం వల్ల నిరుద్యోగం పెరిగింది. సిఎంఇఇ వెల్లడిరచిన మరో అంశం దీనిని ధృవపరుస్తోంది. 2019-20లో 40 కోట్ల 89 లక్షల మంది ఉద్యోగాలలో ఉంటే మార్చి 2023 నాటికి 40 కోట్ల 76 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలలో ఉన్నారు.

ఇక దేశంలో ప్రజారోగ్య పరిస్థితిని  చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్తహీనత (అనీమియా) పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019-21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67 శాతం, 15-19 సంవత్సరాల బాలికల్లో 59 శాతం, బాలురలో 31శాతం. పిల్లల్ని కనే వయస్సున్న మహిళల్లో 57 శాతం, గర్భిణుల్లో 52 శాతం, గర్భిణులు కాని మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో ఉన్నారు. అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. గ్రామీణ పేదలకు ప్రజారోగ్య సేవలు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో లభ్యం కావడం లేదు. ప్రజలు గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది.

మోడీ ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు రెండు భారతాలను-సంపన్నులకు ప్రకాశవంతమైన భారతదేశాన్ని, నిరుపేదలకు బాధలు పడుతున్న భారతాన్ని సృష్టించే క్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, భారతదేశం పుంజుకుంటోందని, జిడిపి దృష్ట్యా చూసినట్లైతే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందంటూ మోడీ ప్రభుత్వం అవిశ్రాంతంగా చేస్తున్న ప్రచారం వట్టి డొల్ల. ఎందువల్లనంటే ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో పెరిగినప్పటికీ, అనేక ఇతర రంగాలలో మన స్థానం అట్టడుగునే ఉంది. అత్యంత ఆనందదాయక జీవితాలను గడుపుతున్న దేశాలలో మనది 126వ స్థానం. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానితో నిమిత్తం లేకుండా, ప్రస్తుత గణాంకాల ధోరణులను బట్టి చూసినట్లైతే, 2027లో భారత్‌ ప్రపంచ జిడిపిలో మూడవ స్థానంలో ఉంటుంది. కానీ, తలసరి జిడిపి దృష్ట్యా భారత్‌ ఎక్కడ ఉంటుందనేదే 100 డాలర్ల ప్రశ్న. ఎందుకంటే సంపన్న దేశాల జనాభా 10 కోట్ల లోపు మన దేశ జనాభా 142 కోట్లు. అంటే సంపన్న దేశాల తలసరి ఆదాయంలో మనదేశ తలసరి ఆదాయం 15వ వంతు మాత్రమే. ఇదేనా మోడీ చెప్పే అభివృద్ధి.

జి-20 దేశాలన్నింటిలోకి అత్యంత తక్కువ తలసరి జిడిపి భారత్‌దే. అలాగే మానవ వనరుల అభివృద్ధిలో కూడా దిగువ స్థానంలోనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత తక్కువ కార్మిక ప్రాతినిధ్యం రేటు ఉన్న రికార్డు కూడా మనదే. అంటే అత్యంత ఎక్కువగా నిరుద్యోగ సమస్య నెలకొందన్న మాట. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. ఫలితంగా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. గతేడాది కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టే కొత్త ప్రతిపాదనలు 72.5 శాతం క్షీణించగా, ప్రైవేటు పెట్టుబడులు 79.2 శాతం తగ్గాయి. 2013-14 నుండి తయారీ రంగం వృద్ధి సగటున 5.9 శాతం ఉంది. పెట్టుకున్న  లక్ష్యం మాత్రం 12-14 శాతంగా ఉంది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించలేదు. జిడిపిలో తయారీ రంగం వాటా 25 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకోగా 16.4 శాతం దగ్గరే స్తంభించిపోయింది. 2013-14, 2022-23 మధ్యకాలంలో తయారీ రంగంలో ఉద్యోగాలు 12.6 శాతం నుండి 11.6 శాతానికి  క్షీణించాయి.

ముగింపు : మొత్తంగా ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయన్నది పలు రంగాలను పరిశీలిస్తే తెలుస్తుంది. గత ఆగస్టులో నిరుద్యోగం రేటు 8.1 శాతంగా ఉంది. 2022లో యువత (15-24 సంవత్సరాలు) లో నిరుద్యోగం 23.22 శాతంగా ఉంది. పట్టభద్రుల్లో ఇది ఏకంగా 42 శాతంగా ఉంది. ఉపాధి తగ్గడంతో పాటు ధరలు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్ళుగా ఆర్‌బిఐ పెట్టిన పరిమితి 6 శాతాన్ని ద్రవ్యోల్బణం అధిగమిస్తూనే ఉంది. అంతకన్నా అధ్వాన్నమేంటంటే, ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుతండడంతో ఈ ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతోంది. ప్రజల ఆదాయాలు తగ్గడం, ధరలు పెరుగుతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడం, తయారీ రంగ వృద్ధిలో క్షీణత, వ్యవసాయ రంగ సంక్షోభం, పెరుగుతున్న అప్పుల భారం వెరసి ఉధృతమవుతున్న ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఆశ్రితుల ఆస్తుల వృద్ధికి ఆశ్రయం కల్పించడం ఆపి, దానికి బదులుగా ప్రభుత్వ వనరులను ప్రజా పెట్టుబడులకు ఉపయోగించి, ఎంతగానో అవసరమైన మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్‌ పెరుగుతుంది. అప్పుడు మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు.

Leave a Reply