అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.

                సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల యంత్రాంగం  విద్యా సంస్థల్లో, హాస్పెటళ్లలో లేకపోవడం చాలా విషాదం. సీనియర్లకు, జూనియర్లకు, స్త్రీ పురుషులకు మధ్య ఆధిపత్య అంతరాలు ఉండటం, అవి వేధింపులకు దారి తీయడం, ఒక్కోసారి అవి హింసాత్మకంగా, అమానవీయంగా, బలవన్మరణాలుగా బైట పడటం తరచూ జరుగుతున్నది. ఉన్నత విద్య కనీస ప్రజాస్వామిక సంస్కృతిని అందిస్తుందనే భరోసా నానాటికీ అడుగంటిపోతున్న సమయం ఇది.

                ఈ విషాద ఘటన తర్వాత  చేసే విశ్లేషణలో మానవీయ వైఖరి లోపించడానికి వీల్లేదు.  ఇలాంటి ఘటనలకు తావు లేని సాంస్కృతిక, భావజాల వాతావరణాన్ని నిర్మించుకొనే దిశగా సమాజం ఆలోచించాలి.  మామూలప్పుడు అంతా సవ్యంగానే  ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే వాస్తవ స్థితి అందరి దృష్టిలోకి వస్తుంది. ఇది చాలా విషాదకరం.

                 సమాజం అధునికమవుతున్నదని, పెద్ద చదువులు, ఆదాయాలు, కొత్త సాంస్కృతిక, సాంకేతిక జీవితపు తళుకుబెళుకులతో విరాజిల్లుతున్నదని అనుకొనే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ మన సమాజంలో పితృస్వామ్యం, కులం, మతం, తెగ వంటివి సజీవంగా ఉన్నాయని పదే పదే జరుగుతున్న ఇలాంటి బలన్మరణాలు తెలియజేస్తున్నాయి.  ఒక్కో ఘటనలో వివరాలు మాత్రమే తేడా. ఊరు, పేరు, వ్యక్తులు వేరే. కానీ ఉన్నత విద్యా సంస్థల దగ్గరి నుంచి సర్వత్రా ఈ పీడన కొనసాగుతున్నది. పాత రోజులతో పోల్చితే బైటికి నాజూకుగా కనిపించే లోతైన   వివక్ష, అణచివేత సమాజంలో విస్తరిస్తున్నది. మనుషుల ఆత్మస్తైర్యాన్ని తొలిచివేసి, నిస్సహాయులను చేసి తమను తాము రద్దు చేసుకొనే స్థితికి వ్యక్తులను తోసి వేస్తున్న ఈ సాంస్కృతిక, నైతిక సంక్షోభం ప్రమాదకరంగా తయారైంది. అంతకుమించి క్రమంగా ఇలాంటి ఘటనలను యథాలాపంగా తీసుకొనే మానసికత సమాజంలో పెరుగుతున్నది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక పక్క రాజ్యం తన హింసాత్మక స్వభావానికి సాధికారతను కూడగట్టుకొనే చర్యలకు పాల్పడుతుంది. ఇంకో పక్క  ఆధిపత్య కుల, మత శక్తులు  ఇలాంటి ఘటనలను వాడుకొని వాతావరణాన్ని మరింత కలుషితం చేసే ప్రమాదం ఉంది.

                 వ్యక్తుల దౌర్బల్యమే బలవన్మరణాలకు కారణమని చెప్పే ధోరణి కూడా పెరిగిపోతోంది. ఇది మరింత ప్రమాదకరం. సమస్య మూల కారణం మీదికి వెళ్లకుండా గందరగోళం సృష్టించే ఇలాంటి వాదనలను ఎదుర్కోవాల్సి ఉంది. డాక్టర్‌ ప్రీతి ఘటన చుట్టూ ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేలా విచారణ జరపడం ప్రభుత్వ బాధ్యత.  బలవన్మరణాలన్నీ హత్యలే అనే ఎరుకతో లోతైన సాంస్కృతిక, భావజాల, వ్యవస్థాగత చర్చకు సమాజం సిద్ధం కావాలి. ఇలాంటి మరణాలకు అందరి నైతిక బాధ్యత ఉందని అనుకుంటే తప్పక సున్నితమైన, పదునైన ఆలోచనలతో ఈ విషాదకర ముగింపులకు ముగింపు పలకగలం.

Leave a Reply