నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది.

‘‘చరిత్ర కన్నులోంచి
దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను
మూగబోయిన అలల తీగలపై 
పురిటి బిడ్డల తొలి ఏడుపునై
పెల్లుబుకుతున్నాను..’’ 

అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.

            ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి వస్తున్న’’ అనడంలో  విప్లవానికి మూలం ధ్వనించింది.

            ‘‘సిగ్గు కప్పుకునేందుకు గుడ్డ పీలిక లేని నేల’’లో ఆర్థిక అసమానతలను ప్రశ్నిస్తే ‘‘నేల మెడ చుట్టూ ముంతల బరువుకు మెడ చుట్టూ కమిలిన గుర్తులుంటాయి’’ అంటూ శ్రీరాం తరాల సామాజిక అంతరాల నిగ్గు తేల్చారు. ‘‘ఈ దేశం నేలని ఊరి చివర్లో నిలబెట్టింది’’ అంటూ వెలివాడ బతుకుల దైన్యాన్ని కళ్ళ ముందుంచారు. మళ్ళీ కోరేగావ్‌ పురా గాయాన్ని ఆత్మీయంగా హత్తుకుంటున్నా అంటూ వివక్ష ను విసిరి పడేయాలనే సంకేతం ఇచ్చారు.

  ‘‘రెండు శతాబ్దాలుగా నొప్పెడుతున్న అవయవాల్లోంచి ఒళ్ళు విరుస్తున్నా’’ అని మహర్ల యుద్దాన్ని నెమరు వేసుకోవాల్సిన తరుణాన్ని చెప్పారు. ‘‘కప్పెట్టిన అవశేషాల్లోంచి కళ్ళు తెరుస్తున్నా’’ అని మేలుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. ‘‘పేరు కొరగాని కులం’’ తుపాకీలోంచి తూటా ముఖ మ్మీద తెల్ల వాడి గన్‌ పౌడర్‌ వాసనొస్తుంది’’ అంటూ  పేరు చివరి తోకలకి చురక అంటించారు. ‘‘చరిత్ర నిర్లక్ష్యాన్ని రాసేందుకే ఒక్క వర్ణమాల చాలడం లేదంటూ వక్రీకరించబడిన వక్రీకరించ జూస్తున్న ఆధిపత్య భావ జాల కలాలను కడిగేసారు పుప్పాల శ్రీరామ్‌.

 ‘‘నాకా భీకర యుద్ధం ఇంకా గుర్తుంది

 ఇప్పుడు రెండు వందల ఏళ్ళ తర్వాత

 భయంతో నక్కిన ఉరుముల శబ్దం

 నా మేఘపు చెవుల్లో ఇంకా మార్మోగుతునే ఉంది’’ అని ఆనాటి ఆధిపత్య వర్గాల భీతిని కళ్లముందు వుంచారు కవి. ‘‘ప్రపంచీకరణతో లుంగలు చుట్టుకు పోయి కులాధిపత్య గూట్లోంచి తీగలు సాగుతున్న పురుగుతో మీకు పేచీ వుందని’’ వర్తమానాన్ని విశ్లేషించారు శ్రీరామ్‌.

 ‘‘తల వొంచడం చాత కావట్లేదు

 రేగడి తొవ్వల నుంచి తప్పుకోలేను’’ అని నిఖార్సైన వ్యక్తిత్వాన్ని కలం మొన మీద నిలబెట్టారు. ఈరోజు ఆఖరి అన్నం ముద్ద కోసం చాచిన అరచేతుల్లో వర్గాల మధ్య సంఘర్షణ చూసాన్నేను అంటూ తరాలుగా సాగుతున్న దోపిడీ ని బట్టబయలు చేసారు.

            పుప్పాల శ్రీరామ్‌ గారు భీమా కోరే గావ్‌ యుద్దాన్ని వస్తువుగా చేసుకుని ఓ దీర్ఘ కవిత  రాయడం శ్లాఘనీయం. నాటి యుద్దాన్ని నేటికీ సాగుతున్న అసమానతల్ని తనదైన శైలిలో పాఠకులకు అందించారు. ఈ కవిత అన్ని వర్గాలను చేరుతుందో, ఆ వర్గాలు ఎంతవరకు స్వీకరిస్తాయో  తెలియదు కానీ చరిత్రను పునాదిగా చేసుకుని ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాలకు జవాబు దొరక్క అచేతనులు కాక తప్పదు. దీర్ఘ కవితలో భాగమైన సంఘటనలు పూల మాలలో ఒదిగిన పూలుగా కాకుండా అగ్ని బావుటాలుగా కనిపిస్తాయి. సాంతం ఒక్క బిగువున చదివించే గుణం ఈ కవితకు ఉంది. 

 ‘‘మై డియర్‌ ఇండియా!

 నరికిన ఉలివేళ్లు నీ భుజాలు పట్టుకుని రోదిస్తున్నప్పుడు

 ఉలకని పలకని అసంపూర్తి శిల్పారాజానివి!’’ అనే ఈ వాక్యం ఎన్నో ప్రశ్నలను, ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. ఆఖరి ఉన్ని పోగుల కోసం చర్మాన్ని వలుస్తున్నా కిమ్మనని జడల బర్రెవే ఇండియా అని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దిగంబర కవిత్వ ఛాయలు కనిపించాయి మై డియర్‌!! ఈ దీర్ఘ కవిత  లోపలి పేజీల్లో వేసిన చిత్రాల్లో సృజనాత్మకత వెల్లి విరిసింది  

ప్రతులకు: పుప్పాల శ్రీరామ్‌, 99634 82597 ను సంప్రదించండి

One thought on “భీమా నది ఘోష 

  1. 1818 ఒక పోరాటాన్ని భుజాన వేసుకొని వర్తమాన ప్రపంచాన్ని స్ఫూర్తి కలిగించిన కవిత్వం. శ్రీ రామ్ పుప్పాల శైలి అద్భుతంగా ఉంది.

Leave a Reply