క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు.   ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది.

భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర అడుగంటిపోయింది. ఆర్యుల తొలి వలస కాలానికి చెందిన యాగక్రతువులు, పూజా విధానం, వారి మంత్రోచ్ఛరణ (రుక్కులు-శ్లోకాలు)ను రుగ్వేద కాలానివి. మన దేశాన్ని నాలుగు వేదాలు పుట్టిన భూమిగా బ్రాహ్మణం ఎత్తిపడుతుంది. వేదకాలం ముఖ్యంగా రుగ్వేదంలో పేర్కొన్న స్త్రీ-పురుష సంబంధాలను చూడడం ద్వారా ఆనాటికి హిందుస్తాన్‌లో ఫూనలాన్‌ కుటుంబ వ్యవస్థ ఇంకా ఉనికిలోకి రాలేదని తెలుస్తుంది. సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ-పురుష సంబంధాలలో మొదట రక్తసంబంధీకుల మధ్య, ఆ తర్వాత తరాల మధ్య శారీరక సంబంధాలు నిషేధమయిన విషయం చరిత్రకారులు వెల్లడిస్తారు. పరమ పవిత్రమైనదని చెప్పుకునే బ్రాహ్మణంలో మహిళలకు సంబంధించి ఎంత అసమంజసత్వం ఉన్నదో చూద్దాం.

బ్రాహ్మణం చెప్పే సృష్టి ప్రదాత బ్రహ్మ, తన ముగ్గురు కుమారులలో ఒకడైన దక్షుడు, తన చెల్లెను వివాహమాడాడు. తమకు పుట్టిన ఆడపిల్లలను దక్షుడు తన ఇద్దరు తమ్ముళ్లకు కశ్యపుడికి, ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే రుగ్వేదంలో పేర్కొన్న యమ, యామి కవల పిల్లలు. వాళ్లిద్దరు పరిణయమాడారు. వశిష్టుడు తన కూతురు శత్రుపను పెళ్లాడితే, మనువు తన కూతురు అహల్యను వివాహమాడాడు. జహ్న తన కూతురు జహ్నవీని పెళ్లాడాడు. సూర్యుడు తన కూతురు ఉషతో కాపురం చేశాడు. ఏకపత్నీ వ్రతుడు, పురుషోత్తముడుగా హిందువులు కొలుచుకొనే శ్రీరామచంద్రుడికి సీత సోదరి అవుతుందనీ జైన రామాయణం స్పష్టం చేస్తుంది. వాల్మీకి రాయాయణంలో ఒకటి, ఇంకా అనేకానేక రామాయణాలలో సీత గురించి అనేకం రాశారు.  ప్రజల్లో ‘రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది’ అనే సందేహం రావడానికి తొలి స్త్రీ-పురుష విచ్చలవిడి సంబంధాల నేపథ్యమే కారణం. వీళ్లంతా కూతుర్లతో, సోదరితో కాపురాలు చేసిన జాబితాలోకి వస్తే, మనుమరాళ్లతో కాపురాలు చేసిన తాతయ్యలు రుగ్వేదంలో దర్శిస్తారు.

దహప్రచేతనీ తన కుమారుడు సోమా ఇరువురు కలిసి సోమా కూతురు మరీషాతో సంభోగం చేస్తారు. దక్షుడు తన కూతురును తన తండ్రైన బ్రహ్మకు ఇచ్చి వివాహం చేయగా పుట్టిన వాడే జిత్తులమారి నారదుడు. దౌహిత్రా తన 27 మంది కూతుర్లను తన తండ్రి సోమాతో సంభోగం జరిపించినట్టు రుగ్వేదం చెపుతుంది. ఇక్కడ వాడిన వివాహం అనే మాట తర్వాతి కాలంలో బ్రాహ్మణత్వ పవిత్రతను లేదా దైవ సంకల్పాన్ని చాటడానికే హైందవం జోడించి వుంటుంది. బ్రాహ్మణం యొక్క ‘‘గొప్పతనం’’ ఏంటంటే ఇలాంటి వ్యక్తులకు దైవత్వాన్ని ఆపాదించి 21వ శతాబ్దంలో కూడా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలచే ఆరాధింప చేయడంలోనే వుంది. భక్తికి విశ్వాసంతో తప్ప జ్ఞానంతో పనిలేదు.

ఆర్యుల పితృస్వామ్య పైశాచికత్వాన్ని, వేదకాలంలో మహిళల దుస్థితిని, అప్పటి స్త్రీ-పురుష సంబంధాలను తెలుసుకోకుండా బ్రాహ్మణవాద స్త్రీ వ్యతిరేక మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేం. వేద కాలంలో రాజన్యులు, బ్రాహ్మణులు కలిసి నిర్వహించిన యాగ క్రతువులలో అశ్వమేధయాగం గొప్పది. రాజన్యుడైన ఆ యజ్ఞ నిర్వాహకుడు తన భార్యను గుర్రంతో సంభోగింప చేయడం అనేది ఆ రెండు పైవర్ణాల స్త్రీ వ్యతిరేక పైశాచిక మనస్తత్వాన్ని బయటపెడుతుంది. అలాగే వామదేవ్య వ్రతం ఆచరించే విధానం చూద్దాం. ఆ వ్రతం నిర్వహించే పురుషుడు పూజా స్థలంలోనే బహిరంగంగా తన భార్యతో సంభోగిస్తాడు. అంటే దానిని బట్టి అప్పటికీ సమాజంలో సెక్స్‌ కార్యకలాపాలు రహస్యమేమి కావని తెల్సుకోవాలి. 20వ శతాబ్దం చివరి వరకు దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాలలో (కొండగాం, నారాయణ్‌పూర్‌ జిల్లాలు) గోటుల్‌ (రాజకీయ, సాంస్కృతిక కేంద్రం) సంస్కృతిలో భాగంగా యువతీ`-యువకుల మధ్య బహిరంగ రతి జరిగేదనీ ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. అయితే గోటుల్‌ రతిలో వావి వరుసలు పాటిస్తారు.

రుగ్వేద బ్రాహ్మణంలోని తండ్రులతో, తాతలతో సెక్స్‌ సంబంధాలు చూస్తుంటే, కలియుగ బ్రాహ్మణం తక్కువేం కాదని ఎన్‌సిఆర్‌బి రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో 70 శాతానికి పైగా తమ బంధువులు చేస్తున్నాయంటూ, దగ్గరి వరుసైన వారి ద్వారానే జరుగుతున్నాయంటూ ఎన్‌సిఆర్‌బి వెల్లడిస్తున్నది.

ఉత్పత్తి శక్తుల వికాస క్రమంలో ఆటంకంగా మారిన ఉత్పత్తి సంబంధాలను తెంచుకోవడంలో భాగంగా నూతన వ్యవసాయక సమాజాలకు ప్రాతినిధ్యం వహిస్తూ బ్రాహ్మణవాద జంతుబలుల కర్మకాండలకు వ్యతిరేకంగా బౌద్ధం, జైనం, చార్వాకం ముందుకు వచ్చాయి. వీరు కేవలం బ్రాహ్మణవాద కర్మకాండల్నే వ్యతిరేకించడమని కాకుండా గణవ్యవస్థ నాటి ప్రాపంచిక దృక్పథాన్ని, విలువల్ని ధ్వంసం చేశారని అర్థం చేసుకోవాలి. అప్పటికి చాతుర్వర్ణ వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంది. అయితే వీరెవరూ స్త్రీలపై అమలవుతున్న పితృస్వామ్యాన్ని ప్రశ్నించలేదు. సమాజంలో ఒకవైపు మాతృస్వామ్యం, మరోవైపు ఆర్యుల పితృస్వామ్యం రెండూ దాడులు, విలీనాల క్రమంలో పితృస్వామ్యం వ్యవస్థీకృతమయింది.

ఆ కాలంలో పలు స్మృతులు వెలుగు చూశాయి. యజ్ఞవల్క స్మృతి, కాత్యాయన స్మృతి, నారద స్మృతి, విష్ణుస్మృతి, పరాశర స్మృతిలతో పాటు మను స్మృతి రూపొందిన కాలమది. వాటన్నింటి లోకి మనుస్మృతినే ప్రధానంగా ఎందుకు చెప్పుకుంటారంటే అది అత్యంత పాశవికమైనది. రాజ్య వ్యవస్థ ఎలా నడుచుకోవాలో నిర్దేశించింది మనుస్మృతి. ఇందులో భాగంగానే మహిళలు, దళితులు, ఆదివాసుల గురించి మనువు పాశవికమైన నియమాలు రాశాడు. నేడు భారతదేశంలో పీడిత ప్రజల మీద అమలవుతున్న ఆర్థిక, భావజాల దోపిడీకి సైద్ధాంతిక పునాది మనుస్మృతే.

భారతదేశంలో 11వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు కొనసాగిన భక్తి ఉద్యమాలు కానీ, ఆ ఉద్యమాల ప్రబోధకులుగా  కింది కులాల వారే వచ్చినప్పటికీ వారి బోధనలలో స్త్రీ సమానత్వాన్ని చెప్పినవారు లేరు. బట్టలపై అద్దకం చేసే కులస్తుడు నాందేవ్‌, నేతపని చేసే కబీరు, పాకీపని చేసే రవిదాస్‌, మంగలిపని చేసే సాయి, దూదేకుల దాదూ దయాల్‌లు గానీ, చివరకు మీరా గానీ మహిళల సమానత్వాన్ని బోధించలేదు. ఈ బృందాలలో అన్ని కులాలవారికీ ప్రవేశం ఉన్నది. కొంతవరకు కబీరును అనుసరించి గురుఘాసీదాస్‌ ద్వారా 17వ శతాబ్దంలో ముందుకొచ్చిన సత్నామీలలో కంసాలులు, వడ్రంగులు, ఊడ్చే వారు, తోలు శుద్ధి చేసేవారు ఉన్నారు. సత్నామీలలో అంతర్వివాహం విధిగా పాటించాలనే నిబంధన కూడా ఉంది. అన్ని పంథ్‌లలో కుల విభేదాలు నిషేధమైనప్పటికీ అంతర్వివాహాలనే పాటించే ధోరణి మాత్రం ఉంది. కర్ణాటకలోని లింగాయతుల సహా ఈ ఉద్యమాలన్నీ కులవ్యవస్థను కూలదోయకుండా అవసరమైన సర్దుబాట్లు చేశాయన్నది చారిత్రక వాస్తవం.

మహిళల కట్టూ బొట్టూ విషయంలోనూ మనువు చాలా విషయాలే రాసిపెట్టాడు. స్వంత ఆస్తిని నిలపడంలో భాగంగా మహిళల పవిత్రతకు, నైతికతకు (సెక్సువాలిటి) పెద్ద పీట వేశాడు. బాల్య వివాహాలను ఎత్తిపడుతూ ‘అష్టవర్షేత్‌ భవేత్‌ కన్య’ అన్నాడు. స్త్రీ-పురుష సంబంధాలలో కుల కట్టడులను అతిక్రమించిన వారికి భయంకరమైన శిక్షాస్మృతిని రూపొందించాడు. స్త్రీ, పురుషుల స్వలింగ సంపర్కం విషయాలలో కూడా ఆ కాలంలోనే శిక్షాస్మృతి లోకి ఎక్కించాడు. మహిళను ఇనుప కచ్ఛడాలలో బంధించిన బ్రాహ్మణ మనువు దళిత మహిళల ఛాతీపై ఎలాంటి ఆచ్ఛాదన ఉండకూడదనే నిషేధాన్ని విధించాడు. ఆదివాసీ మహిళ విషయంలోనూ అనేక నిషేధాలు ప్రకటించాడు. తిండి విషయంలోనూ ఆదివాసీ మహిళపై అనేక కట్టడులు అమలవుతున్నాయి. మన దేశంలోని అన్ని వర్గాల, అన్ని సెక్షన్‌ల హైందవ మహిళల స్థితిగతులను మనుస్మృతియే శాసిస్తుంది. మనువు చాతుర్వర్ణ వ్యవస్థ వకాల్తాదారు కావడంతో అన్ని వర్ణాలు, అన్ని కులాలు మనువు బోధనలను తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. ఇది తరతమ తేడాలతో ఆదివాసులకూ వర్తిస్తుంది. పాలకుల మతం బ్రాహ్మణం కాబట్టి పాలితుల పైన బ్రాహ్మణ సంప్రదాయాలన్ని చతురోపాయాల ద్వారా అమలవుతాయి.

స్త్రీ పవిత్రతా భావం (పతివ్రత) పై మనువు ఎన్ని నిబంధనలు పెట్టినా, మరెన్ని నిషేధాలు విధించినా, అనేక నీతులు చెప్పినా చాతుర్వర్ణ సామాజిక చట్రంలో కులాలుగా రూపాంతరం చెందిన అనేక ప్రాచీన ఆదివాసీ సమూహాలు వాటి స్త్రీ-పురుష సంబంధాల పరంపరని పూర్తిగా వదులుకోలేదనే చెప్పవచ్చు. ఈనాటికీ దండకారణ్య ఆదివాసులలో అవశేషాలుగా మిగిలి వున్న స్త్రీ స్వతంత్రత కోణంలో వీటిని పరిశీలిస్తే గతాన్ని పోల్చుకోవచ్చు. వివాహ పూర్వ సంబంధాలపై ఆదివాసులలో ఇప్పటివరకు కఠినమైన నిషేధాలు ఏమీ లేవు. హైందవ ప్రభావం వున్న చోట తప్ప బాల్యవివాహాలు అంతకన్నా లేవు. స్త్రీ పునర్వివాహ అవకాశాలున్నాయి. అన్ని తెగలలో ఇష్టమైన వాడిని మనువాడే సంప్రదాయం ‘ఇల్లు చొరడం’ ఉంది. అన్ని తెగలలో మేనరికం విధిగా పాటించాలనే ఆచారం ఉంది. పెళ్ళి తంతు పూర్తయిన తర్వాతనే సహజీవనం చేయాలనిగానీ, కాపురం చేయాలని గానీ నిరంకుశ నిబంధనలేమీ లేవు. అలాగే ఏ గుంపులో కడితేనేమి మన గుంపులో ఈనితే చాలునంటూ పశుసమాన సంబోధనతో చెప్పే నానుడి కూడా ఉంది. వివాహపూర్వ సంబంధాలతో గర్భం దాల్చిన మహిళను నిస్సంకోచంగానే పురుషులు వివాహమాడే పద్ధతితో పాటు వివాహపూర్వ సంబంధాలతో జనించిన శిశువును వివిధ పేర్లతో ‘గోటుల్‌ శిశువు’, ‘అడవి శిశువు’ అని పిలుస్తూ గుర్తింపు ఇవ్వడం ఉంది. ఆ శిశువు పుట్టుకను ఎంతమాత్రం తప్పుగానో, అవమానకరంగానో చూసే మానసికత ఆదివాసులలో లేదు. మరో మంచి విషయమేమంటే, ఆదివాసులలో శిశువుకు పాలు ఇచ్చినంత కాలం తల్లి సెక్స్‌లో పాల్గొనదు. దీనితో పిల్లల నడుమ ఎడం ఎక్కువగా ఉంటుంది. శిశువుకు తల్లి పాలు ఎక్కువ కాలం లభించి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

కానీ ఇవన్నీ బ్రాహ్మణవాద సాహచర్యం పెరుగుతున్న చోట మారుతున్నాయి. హైందవ ప్రభావం పెరుగుతోన్న ప్రాంతాలలో ఆదివాసీ మహిళలపై బ్రాహ్మణవాద ఛాయలు దట్టంగా పరుచుకుంటున్నాయి. నిజానికి కులవ్యవస్థలోని ఉన్నత కులాలలో, దోపిడి వర్గాలలో పితృస్వామ్య ఇనుప కచ్చడాల మధ్య నలుగుతూ ఉన్న మహిళల లాగా శ్రమైక కులాల మహిళలపై విధి నిషేధాలు లేవని చరిత్రను అధ్యయనం చేస్తే బోధపడుతుంది. అందుకు ఒక ఉదాహరణగా ‘‘రవికెల పండుగ’’ ని చెప్పుకోవచ్చు.   ఇవి భూస్వామ్య సమాజంలో గడప దాటని స్త్రీలను పక్కన పెడితే మిగతా స్త్రీ`-పురుష సంబంధాలను వ్యక్తం చేస్తాయి. ఇక్కడ మితిమీరిన పతిసేవను కూడా తెలుసుకుందాం. బెంగాలీ మహిళల ముక్కుపుడక పతిసేవ పవిత్రతకు అద్దం పడుతుంది. సాధారణంగా మహిళలు ముక్కుపుడక ముక్కు వెలుపలనే పెట్టుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల బెంగాలీ మహిళలు లోపలి వైపు నుండి ముక్కుపుటలు కట్టిస్తారు. బంగారు ముక్కుపుడక ధరిస్తారు. అలా ఎందుకంటా? అంటే సంభోగ సమయంలో ఆవిడ ఉఛ్వాసనిఛ్వాసలతో భర్తగారు అపవిత్రుడై పోకుండా బంగారు పుడక వాయువులను పవిత్రం చేసి అందిస్తుందంటారు. భూస్వామ్యం బుసలు కొట్టిన చోట పీడిత కులాల మహిళలు భూస్వాముల లైంగిక దోపిడీకి ఎంతగానో బలయ్యేవారు. 20వ శతాబ్దం చివరి పాదంలో సైతం శ్రామిక కులాల ముఖ్యంగా అంటరాని కులాల మహిళలపై బహిరంగంగానే భూస్వాముల లైంగిక దోపిడి జరిగేది. బ్రాహ్మణవాద దొరబాబులకు లైంగికచర్యలపుడు కులం`అస్పృశ్యత అడ్డొచ్చేది గాదు. విప్లవోద్యమం ప్రారంభమైన తర్వాతనే బీహార్‌, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ దుష్ట సంస్కృతికి కాలం చెల్లిపోయింది. దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపై సాగే అధికారుల, దోపిడీ దారుల లైంగిక దోపిడీ చాలావరకు రద్దయింది. పితృస్వామ్యాన్ని ఎదుర్కోవడంలో విప్లవోద్యమం మహిళలకు అండగా నిల్చి వారి విశ్వాసాన్ని ఎంతగానో చూరగొన్నది.

ఆర్యుల దాడులకు, విస్తరణకు అందనంత దూరంలోకి పారిపోయి తలదాచుకున్న మూలవాసులను ఆధునిక ఆర్యులు గత రెండు శతాబ్దాలుగా వెంటాడుతూ వేటాడుతూ హైందవీకరిస్తున్న వైనం ఈనాటి వాస్తవం. దండకారణ్యంలో బ్రాహ్మణంలో చేరి ద్విజులుగా అవతారమెత్తిన మూలవాసీ గణాల వారిని ‘‘మాలదారులు’’ (జంధ్యం పోగు వేసుకున్నవారు)గా, మిగిలిన సోదర మూలవాసులను వారు యజ్ఞోపవిత ప్రభావంతో ‘కత్వా’ లు (శూద్రులు)గా పిలవడం పరిపాటైంది. విప్లవోద్యమ ప్రారంభం వరకు ఇది నిర్విఘ్నంగా సాగింది. బ్రాహ్మణవాదాన్నే సనాతన ధర్మంగా, హిందూ మతంగా, వర్తమానంలో హిందుత్వగా పేర్కొంటున్నారు. మన దేశంలో హిందూమతం ప్రబల మతమే అయినప్పటికీ అనేక మతాలకు నిలయమైన మన దేశంలో దాదాపు రెండువేలకు పైగా కులాలు, పలు జాతులు, నాలుగు వందలకు పైగా ఆదివాసీ తెగలు సహజీవనం చేస్తున్నారు.

కుల వ్యవస్థ వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారా ఆయా కులాలలోని మహిళల పరిస్థితులు అర్థం చేసుకోవడం తేలికవుతుంది. మన దేశంలో దోపిడీ లేదా పరాధీన కులాల మహిళలు చాలా వరకు వంటశాలకు, పిల్లలను కనడానికే పరిమితమవుతారు. మనువు బోధనలను అనుసరించి పతి సేవలో మునిగిపోయీ సహజంగానే పితృస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా బయటపడలేక లోలోపల కుమిలి పోతుంటారు. వారికి సీత, సావిత్రి, అనసూయలను ఆదర్శ మహిళలుగా నిలుపుతూ పుంఖానుపుంఖలుగా బ్రాహ్మణ విశ్రాంత వర్గాలు సాహిత్యాన్ని సృష్టించాయి.

పైదానికి పూర్తి భిన్నంగా శ్రామిక కులాల మహిళల జీవితాలు ఉంటాయి. శ్రామిక కులాల మహిళలు కేవలం వంటపనికే పరిమితం కారు. వారు వ్యవసాయ పనులలో పాల్గొంటారు. ఆదివాసీ మహిళలు పురుషులను మించి శ్రమిస్తుంటారు. ఈ విషయం 2017 నవంబర్‌లో విడుదలైన గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు చూస్తే కూడా అర్థమౌతుంది. అంబేడ్కర్‌ పేర్కొన్నట్టు ప్రపంచమంతా వృత్తులవారిగా శ్రమవిభజన జరిగితే బ్రాహ్మణవాదంలో కులాలవారిగా శ్రమ, శ్రామికుల విభజన జరిగిన మాట వాస్తవం. వ్యవసాయ కులాలు లేదా శూద్ర కులాల మహిళలు ఇంటి పనితో పాటు అన్ని రకాల వ్యవసాయ పనులలో (దున్నడం లాంటివి మినహాయించి) పురుషులతో పాటు పాల్గొంటారు. ఆదివాసీ మహిళలు దున్నడం కూడా చేస్తారు. అస్పృశ్య కులాల మహిళలు ఇంటి పనిచేస్తూనే వ్యవసాయ అనుబంధ పనులలో పురుషులతో పాటు పాల్గొంటూ ఎంతగానో తోడ్పడుతారు. ఇటీవల అమెరికాలో ఒక సంస్థ జరిపిన సర్వేలో ఇంటి పనిచేసే మహిళలకు సంవత్సరానికి ఒక లక్షా 15 వేల డాలర్ల వేతనం చెల్లించాల్సి ఉంటుందంటూ  ఉచిత గృహ శ్రమశక్తికి లెక్కలు కట్టింది. వాస్తవంగా చూస్తే, మహిళల శ్రమ లేకుండా ఇంటి పనులు లేవనీ, వ్యవసాయమే లేదనీ, సాగుపనులు సాగవనీ, సామాజిక శ్రమలో వారు పురుషులతో సమానంగా పాల్గొంటారనీ నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా పరాధీన కులాల మహిళలలో ఉండే తండ్రిపైన, భర్త పైన, తనయుల మీదా ఆధారపడే తత్వం శ్రామిక మహిళల్లో అంత బలంగా కనపడదు. శ్రామిక మహిళలో ఏదో ఒక మూల తన కష్టంపై తాము బతకగలననే విశ్వాసం ఎంతో కొంత తప్పక ఉంటుంది. అయితే పితృస్వామ్య సమాజం గావడంతో ప్రతి పురుషుడు తన మహిళను అనుక్షణం తన కనుసన్నలలోనే ఉంచుకోవడానికి, ఆమెలో సామాజిక అభద్రతా భావాన్ని పెంచిపోషించడానికి బ్రాహ్మణవాద భావజాలంతో ఎడతెరపి లేకుండా ప్రయత్నిస్తుంటాడు. ఫలితంగా సాధారణంగా ప్రతి మహిళ పురుషుడిని ఉన్నతుడిగా, బలాధిక్యుడిగా చూసే స్థితికి నెట్టబడుతుంది.

శ్రామిక కులాల మహిళలు సామాజిక శ్రమలో ఎంతగా పురుషులతో పాలుపంచుకుంటున్నప్పటికీ రాజకీయ, మత, సాంస్కృతిక విషయాలలో మాత్రం వారి పాత్ర తక్కువేనని చెప్పవచ్చు. శ్రామిక మహిళలలో వుండే స్వతంత్రతను, వ్యక్తిత్వాన్ని వెలికి తీసి వారిలో అణచబడి ఉండే ఆత్మవిశ్వాసాన్ని తెగింపుగా మలచాలంటే హైందవం బిగించిన సంకెళ్ల గుట్టు వారికి విప్పి చెప్పాలి. శ్రామికుల మధ్య వర్గ ఐక్యతకు భంగకరంగా ఉన్న బ్రాహ్మణవాద, మనువాద కుట్రలను బట్టబయలు చేయాలి. వర్తమాన పార్లమెంటరీ రాజకీయాల పంచాయితీ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చినప్పటికీ మహిళలను ఆ రాజకీయాలలో నియంత్రించేది పురుషులేనని విడిగా వివరించాల్సిన అవసరం లేదు.

ఏ సమాజంలోనైనా స్త్రీలపైన అమలవుతోన్న పితృస్వామ్యాన్ని అర్థం చేసుకోవడానికి, దాని మోతాదు, రూపాలను తెలుసుకోవడానికి కొన్ని సాధారణ కొలమానాలున్నాయి. అవి ఇవి

1. స్త్రీకి తన పెళ్లి, విడాకులు, సహజీవనం, లైంగికత విషయంలో స్వేచ్ఛ ఏ మేరకు లభ్యమవుతున్నది?

2. స్త్రీకి తన పిల్లలపై, ఆస్తిపై అధికారం వుందా (ఉత్పత్తి, పునరుత్పత్తి)? అవసరమనుకుంటే గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళ నిర్ణయం తీసుకోగలుగుతుందా?

3. స్త్రీకి పునర్వివాహ స్వేచ్ఛ ఉందా?

4. ఏ విషయంలోనైనా పురుషుడే ముందు అనే ప్రాథమ్యం అమలవుతోందా?

5. ఒకే సమస్య / విషయం పురుషులకు ఆమోదయోగ్యం, స్త్రీలకు అనామోదం అంటూ తారతమ్యత ఉందా?

6. సమాజంలో ఒక పని పురుషుడు చేస్తే సత్కారం జరిగి అదే పని మహిళ చేస్తే ఛీత్కారం లభిస్తున్నదా?

7. పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలకు సమాజంలో గుర్తింపు ఉందా?

8. మహిళల శరీరాలను ఎలా ప్రదర్శిస్తున్నారు? ఎలా చూస్తున్నారు? కళ, సంస్కృతిలో మహిళను ఎలా చూపుతున్నారు?

9. చట్టాలలో వివక్ష ఏయే రూపాల్లో ఉంటున్నది?

10. యువతులు స్లిమ్‌గా ఉండాలని వారికి తగ్గించి ఆహారం ఇవ్వడం, కన్నతల్లులు సౌందర్యం చెడుతుందని శిశువుకు పాలు పట్టకపోవడం, మహిళలపై హింస, రాజకీయాలలో వారి పాత్ర మున్నగునవి చూడాలి.

11. సమాన పనికి సమాన వేతనం అమలవుతోందా?

12. మహిళల శ్రమకు గుర్తింపు ఎలా లభిస్తోంది?

నోటు : మహిళల గర్భవిచ్ఛిత్తి విషయంలో భర్త అనుమతి అవసరం లేదనీ 2017 డిసెంబర్‌ చివరి వారంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం గమనార్హం.

పైన పేర్కొన్న విషయాలు సమాజంలో ఎలా అమలవుతున్నాయి లేదా స్వీకరించబడుతున్నాయనే దానిని బట్టి ఆ సమాజంలో పితృస్వామ్యం ఏ మోతాదులో, ఏయే రూపాలలో ఎంతటి వివక్షతతో అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. పైన పేర్కొన్నవి కేవలం కొన్ని కొలమానాలు మాత్రమే. ఆయా సమాజాల వికాసాన్ని బట్టి తరతమ తేడాలు తప్పనిసరి

ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్దిష్టంగా బ్రాహ్మణ వాదం లేదా హిందుత్వం పడగనీడలో జీవిస్తున్న భారత ప్రజల (వివిధ మతాల, కులాల, జాతుల, తెగల) పరిస్థితులను అధ్యయనం చేయాలి. సమాజంలో పితృస్వామ్యం, మహిళలపై దాని ప్రభావం తెల్సుకోవాలి.

భారతదేశంలోని పాలకవర్గాలు రాజ్యాంగంలో ఏం రాసుకున్నా అవన్నీ హైందవాన్ని ఆదరించేవేనన్న విషయం జగద్విదితమే. రాజ్యాంగ పీఠికలో లైంగిక సమానత్వంతో పాటు భారతదేశం సామ్యవాదం, లౌకికవాదం అంటూ 45 సంవత్సరాల క్రితం చేర్చి పేర్కొన్నప్పటికీ హైందవాన్ని ఆచరించే పాలకవర్గాలు, ఎంతో చలాకీగా సెక్యులర్‌కు ‘‘సర్వమత సమభావన’’ అనే వ్యాఖ్యానాన్ని చేర్చి ఆచరణలో బ్రాహ్మణవాదాన్ని ఎత్తి పడుతున్నాయి. 2014లో కేంద్రంలో ఎలాంటి దాపరికాలు అవసరం లేని కరుడుగట్టిన హిందుత్వ శక్తులు అధికారంలోకి వచ్చాయి. గత మూడున్నరేళ్లుగా దేశం హిందుత్వ శక్తుల దాడులతో అట్టుడుకిపోతోంది.

గోవును, గోవు పవిత్రతను కేంద్రం చేసుకొని హిందుత్వ శక్తులు హత్యలూ చేస్తున్నాయి. తొలి వేదకాలంలో (రుగ్వేదం) ఆవుకు ఎంతగానో ప్రాధాన్యత వుండిరది. ఆవుని సూచించే (గో) పదం వివిధ రూపాలలో 176 సార్లు గృహధర్మ సూత్రాలలో చేరింది. ధనవంతుడిని గోమతుడని పిలిచేవారు. యుద్ధాన్ని తెలిపే గవిష్ఠి, గోషా, గవ్యత్‌, గవ్య, గవేషణ పదాలు, దూరాన్ని తెలిపే పదం గవేక్షణ లాంటి అనేక పదాలు గోవు ప్రాధాన్యతను తెలిపేవే. దేవుళ్లలో కూడా గోజాత (ఆవునుండి పుట్టినవారు) వారు వున్నారంటూ బ్రాహ్మణం చెబుతుంది. ఆవు ఎంత పవిత్రమైనదంటే తొలి వేదకాల వాసులకు గోమాంసం ప్రధాన ఆహారం అనే విషయం కూడా మనం మర్చిపోవద్దు. ఇది నాలుగువేల సంవత్సరాల నాటి చరిత్రగా గుర్తుపెట్టుకుంటే నేటి ఆధునిక హిందుత్వ శక్తులు 21 వ శతాబ్దంలో గోమాంసాన్ని మాత్రం నిషేధిస్తూ గోవుకు మళ్లీ అదే స్థానాన్ని కల్పించే మూర్ఖపు చర్యలకు పూనుకుంటూ చరిత్ర రథ చక్రాలను వెనక్కి మళ్లింప చూస్తున్నారు. ఒకరిని మించి మరొకరు పాలకులు గోవు ప్రాధాన్యతను ఎత్తిపడుతూ కేంద్ర, రాష్ట్రాల చట్ట సభలలో కొత్త చట్టాలకు ప్రాణం పోస్తూ గోమాంస ప్రియులపై (దళితులు, మత మైనారిటీలు, ఆదివాసీలు) ప్రాణాంతక దాడులు చేయిస్తున్నారు. గోరక్షణ పేరుతో దండిగా గోమాంస వ్యాపారం చేస్తూ మరో వైపు చనిపోయిన పశు కళేబరాలను శుద్ధి చేసి జీవనం సాగించే దళిత సోదరులపై హత్యలకు పాల్పడుతున్నారు. పేద ముస్లింల కబేలాలపై దాడులకు పూనుకుంటున్నారు. మన దేశంలో నేటికి గ్రామీణ భూస్వామ్యం, ఉన్నత కులాలు శ్రమ కులాల ప్రజలపై అనేక రకాల దాడులు చేస్తూ వారిని ఊచకోత కోస్తున్నారు. మన దేశంలో భూస్వామ్యాన్ని ` పితృస్వామ్యాన్ని జంటగా బ్రాహ్మణవాదం నడిపిస్తున్నది. ఈ స్పష్టతతోనే మహిళలు భూస్వామ్య వ్యతిరేక, పితృస్వామ్య వ్యతిరేక పోరాటాలలో ముందుండాలి.

పీడిత ప్రజలపై రాజకీయ ఆధిపత్యం, తెగ ఆధిపత్యం, మత ఆధిపత్యం వుండగా మహిళలపై అదనంగా పురుషాధిపత్యం కొనసాగుతోందని కా.మావో చెప్పాడు. మన దేశంలో తెగ వ్యవస్థలోనూ, కులవ్యవస్థలోనూ పితృస్వామ్య సంకెళ్లలో మహిళ బందీగా వుందనే స్పష్టతని కలిగి వుండాలి. వర్తమాన పాలకులు చాతుర్వర్ణ వ్యవస్థను ఎత్తిపట్టిన భగవద్గీతను రాజ్యాంగంగా ప్రకటించే కుట్రలలో నిమగ్నమై వున్నారు. పార్లమెంటులో కాషాయ నాయకుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్‌ హెగ్డే బహిరంగంగానే డిశంబర్‌ 27 నాడు ఆ విషయం ప్రకటించాడు. సుష్మాస్వరాజ్‌ 2014లోనే తమ లక్ష్యాన్ని చెప్పింది. ఇప్పటికే భారత పాలకులు దేశంలోని 10 కోట్లకు పై బడిన ఆదివాసీల అస్థిత్వాన్నే అభావం చేశారు. 80% హిందువుల భారతాన్ని వందశాతం భారతం చేయాలని సంఫ్‌ు పరివార్‌ శక్తులు పదేపదే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మత మైనారిటీల అస్థిత్వానికి ఎంతటి ప్రమాదకరంగా తయారయ్యాయో 2002 నాటి గుజరాత్‌ ముస్లిం ప్రజలపై సాగిన మారణకాండ, దేశంలో ఏదో ఓ మూల నిరంతరం జరిగే దాడులు వారిలో నిత్యం భయాందోళనలను కలిగిస్తున్నాయి. మరోవైపు దేశ ప్రధాని, కరుడుగట్టిన హిందుత్వ శక్తి గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోది 2002 గుజరాత్‌ హత్యాకాండ సమయంలో రథయాత్ర చేపట్టి ‘‘హమ్‌ పాంచ్‌`హమారా పచ్చీస్‌’’ నినాదాన్నిచ్చి మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా మారమన్నాడు. అదే పని ఇప్పుడు కొందరు పార్లమెంటు సభ్యులు చేస్తున్నారు. పదేసి పిల్లలను కనాలంటూ హిందూ మహిళలకు నీతులు బోధిస్తున్నారు. రాజస్థాన్‌ (హిందూమత దురహంకార నాయకులు ఏలుతున్న రాష్ట్రం)లో విద్యాశాఖ నిర్వహించే పత్రికలో మహిళల ఆయురారోగ్యానికి ఇల్లు ఊడ్చడం, విసుర్రాయి తిప్పడం శ్రేష్ఠం అని రాస్తే, వారి పాఠ్యప్రణాళిక లోని 9వ తరగతి పుస్తకంలో మహిళల గృహశ్రమను గాడిద చాకిరిగా పేర్కొన్నారు. నిజమే, ఏ ‘గాడిదల’ కోసమో ఆ చాకిరి మరి! చెప్పితే బాగుండు. సిగ్గుపడాల్సినదేమంటే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం అది. నేటి హిందుత్వశక్తుల బోధనలు చూస్తుంటే నాజీ హిట్లర్‌ మహిళల విషయంలో ఇచ్చిన ‘కిచన్‌, చర్చి, పిల్లలు (చిల్డ్రన్‌)’ నినాదం గుర్తొస్తున్నది.

దేశంలో ఈనాటికీ దళితుల మీద 40 కి పైగా సామాజిక నిషేధాలు అమలులో ఉన్నాయి. హిందుత్వ ప్రయోగశాల గుజరాత్‌లో 90 రకాల నిషేధాలు వారిపై విధించబడి ఉన్నాయి. మరోవైపు ఇస్లాం మహిళల ఉద్ధరణ ముసుగులో ప్రజాస్వామిక చర్చ అంటూ ముమ్మారు తలాక్‌ను అత్యంత వివాదాస్పదంగా తయారు చేసిన మోదీ దానిపై చట్టాన్ని రూపొందించడానికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూ ఇస్లాం వ్యతిరేకతను చాటుకున్నాడు. మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గుండె చెరువు చేసుకొని ముమ్మారు తలాక్‌ బిల్లు తేవడాన్ని సమర్థించుకుంటాడు. సుప్రీంకోర్టు 2011లోనే ముమ్మారు తలాక్‌పై నిషేధం పెట్టినా 100 కేసులు తమ ముందుకు వచ్చాయంటాడు. అందుకే చట్టం చేయాలంటాడు ఆయన. కానీ బాల్య వివాహాలు రాజ్యాంగ విరుద్ధమంటున్నా 2011 జనగణనాలలో 52 లక్షల ఆడపిల్లల పెళ్లిళ్లు 18 ఏళ్ల లోపే జరిగాయనీ నమోదు చేసింది రవి గారికి అగుపడడం లేదేమో! 2016 వార్షిక ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 15-19 మధ్య వయసు గల యువతులలో 27 శాతం గర్భం దాల్చినవారున్నారని తేల్చారు. రవిగారి హైందవ గ్లాసులకు ఇవన్నీ కనపడవు. నిజానికి ఈ దేశంలో మస్లిం ప్రజల అవస్థలు సచ్చార్‌ కమిటీ రిపోర్టు చూస్తే అర్థమవుతాయి. ఆ రిపోర్టు లోని ఏ ఒక్కటీ పట్టించుకోని మోదీకి ముమ్మారు తలాకే ముందు గుర్తొస్తున్నది. ఆ మహానుభావుడు తలాక్‌ అనైనా చెప్పకుండా ఇంటి నుండి పారిపోయి యశోదాదేవి జీవితంలో నిప్పులు పోసిన విషయాన్ని మోదీ అండ్‌ కంపెనీ మరిచి పోతున్నది.

దేశంలో సనాతన హిందూ ధర్మాన్ని ఎత్తిపడుతూ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందుత్వ శక్తులు ఉబలాటపడుతున్నాయి. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని వేదకాల గొప్పతనాన్ని వివరించిన వివేకానందను, ఆ ఒరవడిని అందుకున్న వారందరినీ 1925లో నాగపూర్‌లో ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు తన ఆదర్శ నాయకులుగా నిలుపుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు గల అనేక అనుబంధ సంఘాలలో 1936లో ఏర్పడిన ‘‘రాష్ట్ర సేవికా సమితి’’ మహిళా విభాగానికి చెందినది. దీనికి యువ మహిళా విభాగంగా ‘‘కిశోరీ వర్గ్‌’’ పనిచేస్తుంది.

రాష్ట్ర సేవికా సమితి హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం పనిచేస్తుందని చెప్పుకుంటారు. ఇందులోని మహిళలు దేశానికి (రాష్ట్ర) అంకితమైన సేవికలంటారు. ఈ మహిళా విభాగానికి చెందిన శాఖలు దేశంలో దాదాపు 55 వేలకు పైగా వున్నాయంటే ఇవి హైందవం గురించి ఎంతటి తీవ్ర ప్రచారానికి పూనుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వ అండతో ఇవి చాలా దూకుడుగా హిందుత్వ ఎజెండాను ఎత్తిపడుతూ పనిచేస్తున్నాయి. రాష్ట్ర సేవికా సమితి ఆధునిక స్త్రీవాదాన్ని, మార్క్సిజాన్ని, హైందవేతర మతాలను సహించదు. ఇది పదహారణాల హిందూ కుటుంబవాద (ఫ్యామిలిస్ట్‌) సంస్థ. ఈ మహిళాసంఘం ప్రబోధకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్తలు ఎమ్‌.ఎస్‌.గోల్వల్కర్‌, సురేష్‌ భయ్యాజీలు మహిళలకు ఇచ్చే  ఉపదేశాలు ఇలా ఉన్నాయి.

‘‘ఆడవాళ్ల పని ప్రధానంగా తల్లి బాధ్యతలు నిర్వహించడమే అంటే పిల్లల పోషణే’’ అంటూ గోల్వల్కర్‌ రాశాడు.

‘‘ఆవు గడ్డిమేస్తూ తన దూడకు మూటకట్టి తేలేదు కాని మహిళ ఏం తిన్నా తన ఇంటివాళ్ల కోసం మూట కట్టుకొని తేవాలి. పశువుకి మనిషికీ గల ఈ తేడాను ఆడది మరవకూడదు’’ – సురేష్‌ భయ్యాజి.

‘‘పెళ్ళి ఒక పవిత్ర బంధం. దంపతులు కలిసి వుండడం వారికి అమితానందాన్నిస్తుంది. ఆ ఆనందాన్ని అర్థం చేసుకుంటే అన్నీ సవ్యంగానే నడుస్తాయి. భార్యను భర్త రేప్‌ చేయడమేంటి? అలాంటిదేది వుండదు. ధర్మ శాస్త్రాలపై ఆధారపడి మహిళల జీవితం సాగాలి.’’ ఇవి రాష్ట్ర సేవికా సమితి సీనియర్‌ మహిళల ప్రచారాస్త్రాలు. ఈ మహిళలు ఎంతటి సుప్రీంకోర్టు తీర్పుకైనా ఆవగింజంతైనా విలువ ఇవ్వని మనువాద పుత్రికలు. ఈ మధ్య 2017 అక్టోబర్‌ 2వ వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 18 సంవత్సరాల లోపు భార్యతో భర్త సంపర్కం పెట్టుకుంటే నేరమంది. ఆ అమ్మాయి ఏడాదిలో ఎప్పుడైనా భర్తపై ఫిర్యాదు చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది.  మనువాదం శిరోధార్యమైన ఈ మహిళలకు రాజ్యాంగంతో పనేమి ఉంటుంది? ధర్మశాస్త్రాలే వారికి మార్గదర్శకులు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ‘కిశోరీ వర్గ్‌’ మహిళల స్వేచ్ఛ, స్వతంత్రత గురించి ఏమాత్రం ఆలోచించదు. ‘జై శివశంకర్‌, జై మా దుర్గా’ అంటూ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటూ ముస్లిం, క్రైస్తవ మతాలపై కయ్యానికి కాలు దువ్వుతూ విషం కక్కడమే నేర్చుకుంటుంది. ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని పెళ్లాడ సాహసిస్తే, హిందూ యువకులు పది మంది ముస్లిం యువతులను ఎత్తుకు రావాలని ప్రబోధించే కాషాయ వస్త్రధారి యోగి ఆదిత్యనాథ్‌ బోధనలు వీరికి శిరోధార్యం. లవ్‌ జిహాద్‌ అంటూ దేశంలో అనేక దాడులకు పూనుకోవడం యువతరానికి నేర్పుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆరోగ్యభారతి ‘గర్భ సంస్కారం’ గురించి బోధిస్తుంది. మహిళలు శౌర్యవంతులైన, ఆజానుబాహువులైన శిశువుకు జన్మనివ్వాలని చెపుతుంది. తల్లి, తండ్రి నలుపైనా తెల్లని శిశువును కనాలని ఆధునిక జెనటిక్‌ విజ్ఞానాన్ని అనుసరించి శుభ ముహూర్తాన సంభోగం జరిపి సుసంతానాన్ని కనడానికి ‘పంచకర్మ’ థెరపీ అనుసరించాలని బోధిస్తుంది. భార్యాభర్తలు మంచి ముహుర్తం చూసి కలుసుకోవాలని ఆరోగ్యభారతి బోధిస్తుంది. మాతృమండలి అనే మరో సంస్థ వుంది. ఇది శుభ్రత గురించి చెపుతుంటుందని అంటారు. కానీ ఈ మహిళలంతా ‘‘ఇది హిందూ దేశం, ఇక్కడి ‘మతం హిందూ మతం, హిందువులంతా చాతుర్వర్ణ వ్యవస్థననుసరించాలి, దానిని అనుసరించి ఎవరి విధులు వారు (అన్ని కులాల వారు) నిర్వహించాల్సిందే’’ అంటూ బ్రాహ్మణ మత విషాన్ని మహిళల తలకెక్కిస్తుంటారు.

విశ్వ ఆర్థికవేదికకు చెందిన గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ రిపోర్టు 2017 నవంబర్‌లో తాజా గణాంకాలు ప్రకటించింది. 144 దేశాల జాబితాలో భారతదేశం స్త్రీ`పురుష సమానత్వంలో గత సంవత్సరం కన్నా 21 అంకెలు దిగజారి 87 నుండి 108వ స్థానం వద్ద నిల్చింది. బంగ్లాదేశ్‌ కన్నా భారత్‌ వెనుక ఉండడం గమనార్హం. దేశ జనాభాలో 48.5 శాతంగా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, పౌష్ఠికాహారం, భద్రత మొదలైన విషయాలలో వివక్ష కొనసాగుతోంది. వ్యవసాయ రంగంలో కూలీ పురుషుల కన్నా మహిళలకు 27.6 శాతం తక్కువగా దొరుకుతున్నట్టు కార్మిక విభాగం నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నది. రాజ్యాంగంలో రాసుకున్న ‘సమాన పనికి సమాన వేతనం’ ఇదన్నమాట. నిజానికి పురుషుల కన్నా  స్త్రీల శ్రమే వ్యవసాయంలో అధికం అంటూ అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. గృహ పని విషయానికి వస్తే 70 శాతం కి పైగా మహిళల శ్రమ ఏ లెక్కలోకి రాకుండానే పోతున్నది. ఇలాంటి వాస్తవాలు వెలుగు చూస్తుండగా స్త్రీ`పురుష సమానత్వం హిందుత్వ శక్తుల పాలనలో ఊహకందని విషయం. అది పోరాటాల ద్వారానే సాధ్యం.

భారత సమాజంలో హిందుత్వం ఊడలు దిగిన మతం. దోపిడి కొనసాగినంత వరకూ మతం కొనసాగుతుంది. మతం మనిషి విశ్వాసాలపై ఆధారపడి వుంది. వాటిని దోపిడి వర్గాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి. మత్తుమందులాంటి మత ప్రభావం నుండి ప్రజలను బైట పడేయడానికి ముందుగా వారు దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలలో సంఘటితం కావాలి. మహిళలకూ ఇదే వర్తిస్తుంది. సామాజికంగా మహిళ దోపిడీ వ్యతిరేక పోరాటంలో ప్రధానంగా పాల్గొంటూ పితృస్వామ్య వ్యతిరేక చైతన్యాన్ని పెంచుకోవాలి, పితృస్వామ్యంతోనూ పోరాడాలి.

గత విప్లవోద్యమాల చరిత్రలో ముఖ్యంగా రష్యా, చైనా ఎర్రసైన్యాలలో మహిళ సాయుధ యోధగా నిలిచి యుద్ధంలో భాగం కాలేదు కానీ ప్రజాసైన్యానికి చెందిన అనుబంధ విభాగాలలో ఆమె చేరి అపారమైన సేవలందించింది. చైనా మిలీషియాలో (పౌర సైన్యం) మహిళ చెప్పుకోదగిన పాత్ర పోషించింది. ఆ విప్లవోద్యమాలలో లేని విధంగా నేటి భారత విప్లవోద్యమంలో మహిళ ఒక యోధగా తన పాత్రను తాను ప్రజాసైన్యంలో నిర్వహిస్తుండడం ఒక విశేషం. ఇది భారతదేశానికి సంబంధించిన ఒక నిర్దిష్టత. 1960లలో ఏర్పడిన మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల నాయకత్వంలో కొనసాగుతున్న అనేక దేశాల ప్రజాయుద్ధాలలో మహిళ సైనికరంగంలో ఒక సాయుధ గెరిల్లాగా నిలిచి సాహసంగా పోరాడుతోంది. మన దేశంలోని మహిళ సాయుధం కావడానికి బ్రాహ్మణం ససేమిరా అంగీకరించదు. కానీ దేశంలోని భూస్వామ్యాన్ని, బడా బూర్జువాను, పితృస్వామ్యాన్ని వాటిని నడిపే బ్రాహ్మణాన్ని కూల్చడానికి నడుం కట్టిన భారత మహిళను, మహిళా విముక్తి కోసం సాయుధమైన పీడిత మహిళను అణచివేయడానికి మాత్రం బ్రాహ్మణం మహిళలను అభివృద్ధి నిరోధక సైన్యంలో చేర్చి రణభూమికి పంపుతుందని కశ్మీర్‌ సరిహద్దులను గానీ, దండకారణ్యంలోని బీజాపూర్‌ జిల్లాకు చేరిన మహిళా కమాండోలను గానీ చూస్తే అర్థమవుతుంది. సామ్రాజ్యవాదులు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమ దేశాన్ని వదలి రణభూమిలో ఉన్న సైనికుల సెక్స్‌ అవసరాలను తీర్చడానికి వేలాది జపాన్‌ మహిళలను కంఫర్ట్‌ విమెన్‌గా మార్చిన చందంగా మనదేశ బ్రాహ్మణం ఈనాడు సైన్యంలో చేర్చుకున్న మహిళలను కంఫర్ట్‌ విమెన్‌గా మార్చరన్న గ్యారంటీ ఏమీలేదు. ఇప్పటికీ అనేక కేసులు వార్తలలోకి వస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బ్రిగేడియర్‌ నవదీప్‌ బరాజ్‌ భార్య సైనికుల భార్యలతో ఎలా వ్యవహరిస్తుందో ఈ మధ్యే బట్టబయలైంది. ఖాకీల దుశ్చర్యలు ఎన్నెన్నో వెలుగు చూస్తున్నాయి. సల్వాజుడుం కాలంలో ఎస్‌పిఒ లుగా చేరిన అనేక మంది మహిళల వృత్తాంతాలు చూసాం. విప్లవ మహిళ పోరాట జాతుల మహిళలతో సమైక్యమై, కుల వ్యవస్థలో కొట్టుమిట్టాడుతోన్న మహిళను, తెగ వ్యవస్థలో నలిగిపోతున్న మహిళను జాగృతం చేస్తూ వారి విముక్తికై నూతన ప్రజాతంత్ర విప్లవంలో భాగం చేయడానికి మున్నెన్నటి కన్నా సాహసంగా, స్పష్టతతో పోరాడాల్సిన తరుణమిది. ఈ సమయంలో మనం కా.లెనిన్‌ వందేళ్ల పూర్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుందాం.

‘‘కష్ట కాలాలలో మతం పీడిత ప్రజలకు ఉపశమనాన్నిస్తుంది. మతం మత్తుమందులా పనిచేస్తుంది. ప్రజలు నిజమైన ఉపశమనం, సుఖాన్ని పొందాలంటే కల్పితమైన సుఖాన్నిచ్చే మతాన్ని రద్దు చేయాలి. మతపరమైన భ్రమలనుండి మనిషిని బయట పడేయ్యాలంటే ముందు మతాన్ని సృష్టించిన పరిస్థితులు మారాలి’’ ` లెనిన్‌. మనదేశంలోని విప్లవోద్యమాన్ని అణచివేయడానికి కాషాయ టెర్రరిజం వేగిరపడుతోంది. 2017 మేలో ‘సమాధాన్‌’ వ్యూహాన్ని ప్రకటించింది. విప్లవోద్యమ ప్రాంతాలలో ఎడతెరపి లేని ఖాకీ దాడులు సాగుతున్నాయి. ఖాకీల లైంగిక క్రౌర్యానికి, అమానుష అత్యాచారాలకు డజనుల కొద్దీ మహిళలు బలి అవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత పాశవికంగా మహిళలతో వ్యవహరించిన ఐజీ కల్లూరిని 2018 ప్రారంభంలో బస్తర్‌ నుండి బదిలీ చేసి ఏ బాధ్యతలు ఇవ్వకుండా ఉంచిన ప్రభుత్వం తొమ్మిది మాసాల తర్వాత మళ్లీ రాయపూర్‌లో బాధ్యతలిచ్చింది. ఐజి కల్లూరి ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడో బస్తర్‌ ప్రజలనడిగితే తెలుస్తుంది. అలాంటి వాడిని ప్రభుత్వం శిక్షించాల్సింది పోయి బాధ్యతలు ఇవ్వడం అంటే ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా తనకు తానే మరోసారి ముందుకొచ్చింది. ఎదుగుతోన్న బిడ్డల రెక్కలను ఎగురనివ్వాలనీ, ఆడపిల్లలను కాపాడాలనీ, వారిని చదివించాలనీ, పురుషులతో సమాన హోదా ఇవ్వాలనీ ప్రచార, ప్రసార సాధనాలతో ఊదరగొడుతున్న సామ్రాజ్యవాద అనుకూల భారత పాలక హిందుత్వ శక్తులు మావోయిస్టు  ఉద్యమ ప్రాంతాలలో నవయవ్వన ప్రాయంలోకి అడుగిడుతున్న ఆడబిడ్డల జీవితాలను చిదిమేస్తున్నాయి. అయినా ఆ ఆదివాసీ మహిళలు   వెరవడం లేదు. 2015 వరకు విప్లవోద్యమంలో తమ వాటా 35 -40 శాతంగా నమోదు చేసుకుంటే 2018 ప్రారంభం నాటికి 55 శాతానికి పెరిగి నూతన రికార్డును నెలకొల్పుతున్నారు. దండకారణ్యంలోని ప్రజలకు అందులో భాగంగా మహిళలకు అండగా నిల్చిన సోనీసోడీపై ఆసిడ్‌ దాడికి పాల్పడినా, మాలినీ సుబ్రహ్మణ్యంను జగ్దల్‌పూర్‌ నుండి తరిమి వేసినా, బేలా బాటియాను బస్తర్‌లో ఉండనిచ్చేది లేదనీ, శాలినీ ఘెరా, ఇషా కందెల్‌వాల్‌లను పాలకులు, ఖాకీలు ఎంతగా వేధిస్తున్నా, నందినీ సుందర్‌ లాంటి వాళ్లను టార్గెట్‌ చేసినా, డబ్ల్యుఎస్‌ఎస్‌ సంస్థపై పోలీసులు నిప్పులు కురిసినా వారిలో ఏ ఒక్కరు హిందుత్వ శక్తుల ఆగడాలకు బెదరడం లేదు. వారందరి అండదండలు విప్లవ మహిళల త్యాగాలను, పోరాటదీక్షను కొనియాడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ సహా పలు యురోపియన్‌ దేశాల శ్రామిక మహిళలకు, టునీషియా లాంటి ఉత్తర ఆఫ్రికా దేశాల పోరాట మహిళలకు దండకారణ్య పోరాట మహిళలు ఆదర్శ ఐకాన్‌లవుతున్నారు. ఆకాశంలో సగం పోరాటాకాశంలో పురుషుడితో భుజం భుజం కలిపి విప్లవ మహిళ పోరాడుతోంది. ఇది పోరాడే సమయం. నిన్నటి కన్నా మరింత దృఢంగా పోరాడే సమయమిది. పోరాడకుండా విముక్తి లేదని గట్టిగా నినదిద్దాం. భూస్వామ్య`సామ్రాజ్యవాదానికి గోరీ కడుదాం. బ్రాహ్మణవాద సంకెళ్లను తెంచుకుందాం.

Leave a Reply