విరసం సాహిత్య పాఠశాల నివేదిక
విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.
విరసం సీనియర్ సభ్యులు కా.చెంచయ్య విరసం జెండాను, అమరులు కా.లింగవ్వ కుటుంబ సభ్యులు ఎర్రజెండాను, కా.ఎల్.ఎస్.ఎన్.మూర్తి మేనల్లుడు కా.కృష్ణమూర్తి అమరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. విరసం సభ్యులు కా.సుదర్శన్ విరసం పతాకగీతాన్ని ఆలపించగా, ప్రజాకళామండలి, అరుణోదయ కళాకారులు ఉద్యమ గీతాలను పాడారు.
ప్రారంభ సమావేశానికి అరసవిల్లి కృష్ణ అధ్యక్షత వహించారు. ఏడాది కాలంలో అమరులైన నర్మద, ఎల్ఎస్ఎన్ మూర్తి, వాసం శివ లను స్మరిస్తూ వారంతా ఆరోగ్యకరమైన, ప్రజాస్వామిక సమాజం కోసం కలలుగన్నారని, మృత్యువులో సైతం విప్లవ విజయాన్నే స్వప్నించారని అన్నారు. అలాగే ఇటీవల మరణించిన అభ్యుదయ, ప్రగతిశీల రచయితలకు జోహార్లు అర్పించారు. తెలుగు రచయితలు ముక్తకంఠంలో బ్రాహ్మణీయ హిందూ భావజాలాన్ని నిరసిస్తున్నారని, పదేళ్లుగా ఇదే అంశం మీద విరసం మాట్లాడుతోందని అన్నారు. ఫాసిజం ఎలాగైతే తన పడగను విస్తరిస్తుందో దాని వల్ల పీడితులైన సమూహాల రచనలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు ముస్లిం కవులు మహమూద్, ఇబ్రహీం నిర్గున్ పుస్తకాలను ఆవిష్కరించడం ఫాసిజానికి మా జవాబు అన్నారు.
తర్వాత విరసం కార్యదర్శి రివేరా యం.టి.ఖాన్, ఇటీవల మరణించిన ఫిలిప్పీన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జోస్ మేరియా సిజాన్లకు నివాళులర్పించారు. ప్రారంభోపన్యాసం చేయడానికి వచ్చిన హిమాంశుకుమార్ను పరిచయం చేసారు: హిమాంశుకుమార్ ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న క్రియాశీల కార్యకర్త. వనవాసీ చేతనా ఆశ్రమం స్థాపించి, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించారు, వైద్యం చేశారు. ఆదివాసీలు ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటే వారికి అండగా ఉన్నారు. వారి రాజ్యాంగ హక్కుల గురించి చైతన్యపరిచారు. 2009లో సుక్మా జిల్లాలో పోలీసు బలగాలు 17 మంది ఆదివాసులను కాల్చి చంపిన ఘటనపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తే, కోర్టు దాన్ని కొట్టేసి ఆయన్నే బోనులో నిలబెట్టింది. 5 లక్షలు జరిమానా కట్టమంటే నిరాకరించి ఆయన అదే ధిక్కారంతో ఉన్నారు.
హిమాంశు కుమార్ మాట్లాడుతూ పోరాడే ప్రజలందరు ఒక్కటై ముందుకు సాగాల్సిన సందర్భంలో ఉన్నామని అన్నారు. తాము స్థానికులకు చేస్తున్న సహాయాన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా చెప్పారని, 15 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కోర్టు కూడా తమనే తప్పుపట్టి జరిమానా విధించిందని అన్నరు. గాంధీ గారు అన్నట్లు తమ తప్పు ఏమీ లేనప్పుడు జరిమానా కట్టనవసరం లేదని, తాను జరిమానా కట్టనని, జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. హిమాంశు కుమార్ హిందీ ప్రసంగాన్ని పద్మ తెలుగులోకి అనువదించారు.
ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహంపై పాణి కీనోట్ ప్రవేశపెట్టారు. ఫాసిజం ద్రవ్య పెట్టుబడి యెక్క పాశవిక దోపిడి రూపమని, దీనికి భారతదేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ అనేది నిర్మాణ రూపమని అన్నారు. ఇక్కడి సనాతన ధర్మాన్ని, కులాన్ని, పితృస్వామ్యాన్ని ఆధారం చేసుకుని ఉన్న ఫాసిజానికి సామాజిక, రాజకీయ, ఆర్థిక పునాది ఉందని, దానిని ఓడిరచడానికి ఈ దేశ ప్రజల దగ్గర ప్రతివ్యూహం ఉండాలని అన్నారు. అది సాంస్కృతిక ప్రతివ్యూహంగానే కాదు, ఏకకాలంలో అది రాజకీయ, సైనిక వ్యూహంగా కూడా ఉండగలగాలని అన్నారు. ఉదారవాద ఆలోచనలతో పాటు పీడిత అస్తిత్వాలు, వర్గపోరాట శక్తులు అందరూ కలిసి, అందరూ ఆచరించగల ప్రతివ్యూహం ఉండాలని, విడివిడి పోరాటాలతో ఫాసిజాన్ని ఓడించడం సాధ్యం కాదని అన్నారు.
భోజన విరామం తర్వాత శివరాత్రి సుధాకర్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది. కొడవటిగంటి కుటుబరావు సాహిత్యం, సలంద్ర కవిత్వం, ఉదయమిత్ర కథలు, వి.చెంచయ్య సాహిత్య విలోచన, మహమూద్ కవిత్వం తదితర పుస్తకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు రచయితలు ఆవిష్కరించారు.
అనంతరం ‘భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలు’ అంశంపై ఆకార్ పటేల్ మాట్లాడగా సియస్ఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించి ఆయన ప్రసంగాన్ని అనువదించారు. భారతదేశంలో జాతీయవాదానికి, జర్మనీ, ఇటలీ వంటివాటికి తేడా ఉందని ఆకార్ పటేల్ అన్నారు. భారత జాతీయవాదానికి ఈ దేశంలో ఉన్నవాళ్ళే శతృవులని, అందునా మైనారిటీల్లో ఎక్కువగా ఉన్న ముస్లింలు శతృవులని అన్నారు. హిందుత్వ ఫాసిజానికి రాజ్యాంగం పట్ల ఏ గౌరవం లేదని, వారు చట్టానికి లోబడి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారని, అయితే వారి అవసరాల కోసం యుఎపిఎ లాంటి చట్టాలను ప్రయోగిస్తారని అన్నారు. వారు వ్యవస్థలన్నిటినీ లోబరచుకున్నారని, రాజ్యాంగ యంత్రాంగం చేయాల్సిన పనిని మూకకు అప్పగించారని అన్నారు. అయితే పరిస్థితి పూర్తి నిరాశాజనకంగా లేదని, మనం పని చేయగలిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని అన్నారు.
తర్వాత ఫాసిస్టు వ్యతిరేక ఐక్యవేదిక నిర్మాణ అవసరంపై మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ కవులు, రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబా, భూపతి వెంకటేశ్వర్లు, రాపోలు సుదర్శన్, ఎన్.వేణుగోపాల్, యాకూబ్, కుప్పిలి పద్మ, దివికుమార్, అరుణోదయ విమల, కాసుల లింగారెడ్డి, బి.అనూరాధ, మెట్టు రవీందర్, నాళేశ్వరం శంకరం, కె.శివారెడ్డి, కాత్యాయని విద్మహే పాల్గొన్నారు. అందరూ ఫాసిస్టు వ్యతిరేక ఐక్యవేదిక నిర్మాణ అవసరాన్ని నొక్కి చెప్పారు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేదని, ఆ అనుభవాల నుండి ప్రస్తుత అవసరాలను కూడా గుర్తించి మరింత సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. (ఈ సమావేశం రిపోర్టు మరింత వివరంగా ఇదే సంచికలో విడిగా ఇస్తున్నాం `సంపాదక వర్గం)
రెండో రోజు ఉదయం సరిగ్గా అనుకున్న సమయానికే సభ ప్రారంభమైంది. మొదట పుస్తకావిష్కరణలు జరిగాయి. అలిశెట్టి కవిత్వ విశ్లేషణ, ఇబ్రహీం నిర్గున్, శ్రీరాం పుప్పాల, ఇక్బాల్, అరుణ్ కవిత్వం రాంప్రసాద్ బిస్మిల్ స్వీయచరిత్ర తదితర పుస్తకాలను ప్రముఖ రచయితలు ఆవిష్కరించారు. తర్వాత ‘దేశవ్యాప్తంగా ఫాసిస్టు దాడులు ` ప్రతిఘటన’ అనే అంశంపై సీమా ఆజాద్, బిట్టూ, దండపాణి మహంతి, ఎన్.బాబయ్య ప్రసంగించారు. సమావేశానికి రాంకీ అధ్యక్షత వహించారు. సీమా ఆజాద్ తన ప్రాంతమైన యుపిలో బుల్డోజర్ రాజ్యం ఎలా నడుస్తోందో వివరించారు. అక్కడ బుల్డోజర్ను ఆ ప్రాంత సంస్కృతిలో భాగం చేస్తున్నారని, ఆ విధ్వంసకర చర్యలు హీరోయిజంగా ప్రచారం అవుతున్నాయని అన్నారు. పిల్లల ఆటవస్తువుల్లో ఇప్పుడు బుల్డోజర్ బాగా పాపులర్ అయిందని, ఇది ఒక తరాన్ని విధ్వంసం వైపు నెట్టే చాలా ప్రమాదకర సంకేతమని అన్నారు.
బిట్టూ తనను తాను ట్రాన్స్జెండర్ అబ్బాయిగా పరిచయం చేసుకుంటూ, జెండర్ సంబోధనల విషయంలో మనం ప్రజాస్వామికంగా ఎలా వ్యవహరించగలమో చర్చించారు. ఇటీవలి కాలంలో దేశంలో ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన రెండు ఉద్యమాలు `సిఎఎ వ్యతిరేక ఉద్యమం, ఢల్లీి రైతు ఉద్యమాలను విశ్లేషించారు. సిఎఎ వ్యతిరేక ఉద్యమం అణచివేతకు గురైన నిరాశాజనక వాతావరణంలో రైతు ఉద్యమం దేశ ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి నిచ్చిందని, ఆ ఉద్యమం నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉందని చెప్పారు.
దండపాణి మహంతి ఒడిశాలో ఇప్పుడు నడుస్తున్న ప్రజా ఉద్యమాలను, రాజ్య అణచివేత చర్యలను గురించి చెప్పారు. స్వయంగా తనపై 25 కేసులున్నాయని, అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే ఒక మహిళకు జీవితఖైదు విధించారని అన్నారు. ఒడిశాలో వేరువేరు ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, ప్రజలకు వనరుల మీద అధికారం దక్కేవరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా తాను జైల్లో ఉండగా చనిపోయిన మిత్రులు గంటి ప్రసాదం, చలసాని ప్రసాద్లను గుర్తుచేసుకొని విచారం వ్యక్తం చేశారు.
కర్ణాటక నుండి వచ్చిన బాబయ్య గౌరి లంకేశ్, కల్బుర్గి, దబోల్కర్ హత్యలు మామూలు విషయం కాదని అంటూ ఆనాడు గాంధీని చంపిన వాళ్లే, ఇప్పుడు గౌరిని చంపారని అన్నారు. గౌరిని చంపినప్పుడు తెలుగు నేల నుండి నేను సహితం గౌరిని అంటూ వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఈ దేశంలో దళితులు, ముస్లింల ఐక్యత సాధించే ప్రయత్నం జరగాలని, ఆ దిశగా తాము పనిచేస్తున్నామని అన్నారు.
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ‘భారతదేశంలో మతతత్వం` హేతువికాసం’ మీద రావలసిన వక్త దేవరాజు మహారాజు, అధ్యక్షత వహించాల్సిన ఇక్బాల్ ఇద్దరూ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో ఆ సెషన్ పూర్తిగా మార్చవలసి వచ్చింది. వి.చెంచయ్య అధ్యక్షతన ఇద్దరు హేతువాదులు రెండు ఆసక్తిక అంశాల మీద ప్రసంగాలు చేశారు. మానవ వికాస వేదిక నాయకులు సాంబశివరావు ‘ఫాసిస్టు భావజాలంలో హిందూ గ్రంధాలు భగవత్గీత ఉదాహరణ’ అనే అంశం మీద మాట్లాడగా, ‘మతభావజాలం` వైజ్ఞానిక దృక్పథం’ మీద విజ్ఞానదర్శిని సంస్థ అధ్యక్షులు రమేశ్ మాట్లాడారు.
మొదటి వక్త సాంబశివరావు ప్రసంగిస్తూ ఈ రోజు వేదసాహిత్యాన్ని, బ్రాహ్మణవాదాన్ని రంగం మీదికి తీసుకొచ్చి మేము అందరికంటే ఉన్నతులమని చెప్పుకుంటున్న అగ్రకులాల వాళ్లు ఈ దేశం వాళ్లు కాదని జెనెటిక్ ఇంజనీరింగ్ నిరూపించిందని అన్నారు. వేదాల సారాంశాన్ని, వేదకాలం నాటి సామాజిక పరిస్థితులను, అనాడు మూలవాసులకు, దేవజాతివారికి మధ్య జరిగిన సంఘర్షణలను, మూలవాసులను అణచివేసిన క్రమాన్ని వివరించారు. భగవద్గీత చాతుర్వర్ణ ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని స్థిరీకరించి ఫాసిస్టు భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడిన గ్రంథమని అన్నారు. రమేశ్ మాట్లాడుతూ కదల్లేకపోతున్న మనిషికి బెయిల్ ఇవ్వమని న్యాయమూర్తిని అడిగితే అతని మొదడు పనిచేస్తుందని, అదే పెద్ద ప్రమాదమని అన్నారని, మెదడు పనిచేయకుండా సమాజాన్ని మూఢవిశ్వాసాల మత్తులో ముంచడం, మేధావులని నిర్బంధించడం ఆధిపత్యశక్తుల కుట్ర అని అన్నారు. రాజ్యం ఏరోజూ వైజ్ఞానిక భావజాలాన్ని సహించలేదని, మానవ వికాసానికి దోహదం చేసే ప్రశ్నను అణచివేయడానికే ప్రయత్నిస్తుందని అన్నారు. ఫాసిజానికి మొట్టమొదటి రూపం భారతదేశంలోని మనువాదమని, విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేసిన చార్వాకులను, బౌద్ధులను ఇక్కడ ఊచకోత కోసారని అన్నారు. జ్ఞానాన్ని గాని, శ్రమను గాని మనువాదులు ఏనాడూ గౌరవించలేదని అన్నారు.
చివరి అంశం ‘చరిత్రలో ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య సాంస్కృతిక వ్యక్తీకరణలు’. దీని మీద రివేరా ప్రసంగించగా, వరలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ రోజు ఫాసిజానికి వ్యతిరేకంగా మనం సాంస్కృతిక ప్రతివ్యూహం గురించి ఆలోచిస్తున్నామంటే దాని వెనక చరిత్రలో ప్రాణాల్ని బలిపెట్టి చేసిన ప్రయత్నం ఉందని రివేరా గుర్తుచేశారు. రైతులు, కార్మికులే కాదు, కవులు కళాకారులు వీధుల్లోకి వచ్చి, తుపాకులు పట్టుకుని ఫ్రాంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘటనలు ఉన్నాయన్నారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన స్టాలిన్ మీద పశ్చిమ యూరొప్లో వ్యతిరేకత ఉన్నా కూడా మొత్తం మానవాళికి శత్రువైన ఫాసిజాన్ని ఓడిరచాలని కలిసి పనిచేశారని, విజయం సాధించారని అన్నారు. స్పానిష్ రిపబ్లిక్ను కాపాడుకోడానికి తీవ్రమైన భావజాల వ్యతిరేకతతో ఉన్నవాళ్లు కూడా ఐక్యంగా కదలిలారని, భిన్న భావజాలాలున్నవారి మధ్య ఐక్యత సాధ్యమేనని చరిత్ర మనకు చెబుతుందని అన్నారు. అనంతరం కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్.మూర్తి వేదిక మీద అరసవిల్లి కృష్ణ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. కళ్యాణరావు, హరగోపాల్, నల్లూరి రుక్మిణి ప్రసంగించారు. అంతర్జాతీయ గీతంతో సాహిత్య పాఠశాల ముగిసింది.