వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్; పోలీసుల బెదిరింపులను సవాలు చేసిన ఒడిశా గ్రామస్తులు
ఒడిశాలో, కార్పొరేట్ ప్రయోజనాలు, అక్రమ మైనింగ్, అన్యాయమైన నిర్బంధాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే గ్రామస్థుల అద్భుతమైన దృఢ సంకల్పాల గాథ పురివిప్పుతోంది. సిజిమాలి కొండలకు సమీపంలో ఉన్న ఈ సముదాయాలు తమ జీవన విధానానికి ముప్పు కలిగించే మైనింగ్ ప్రాజెక్టుల ప్రతికూల పర్యావరణ ప్రభావాలకు భయపడి కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా నిలబడాలని ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంతో, ఈ కథనం ఒడిశాలోని గ్రామస్తులు తమ భూమి, జీవనోపాధి, హక్కులను కాపాడుకోవాలనే తపనలో కార్పొరేట్ ప్రభావాన్ని ధిక్కరిస్తున్నారు.

వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్:

సిజ్మాలిలో నిల్వ చేయబడిన 311 మిలియన్ టన్నుల బాక్సైట్ ఇ-వేలం 2023 ఫిబ్రవరి 9న జరిగింది. వేదాంత కంపెనీ “ప్రాధాన్య బిడ్డర్”గా ప్రకటించారు. ఒడిశా ప్రభుత్వం 2023 మార్చి 1న వేదాంతకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌ లో రూ. 972 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

ప్రతిపాదిత బాక్సైట్ గని తూర్పు కనుమలలోని మధ్య-తూర్పు ప్రాంతంలో భాగంగా, కలహండి జిల్లాలోని తువాముల రాంపూర్ బ్లాక్- రాయగడ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్‌ల మధ్యన ఉంది. సిజిమాలి కొండలకు ఆనుకుని ఉన్న కనీసం 50 గ్రామాలు ఈ ప్రాంతంలో “అక్రమ” మైనింగ్ వల్ల ప్రభావితమవుతున్నాయి. మైనింగ్ ప్రాంతం 1549 హెక్టార్లు (సుమారు 3871 ఎకరాలు), 127.9 హెక్టార్లు ప్రైవేట్ భూమి, 1807 హెక్టార్లు ప్రభుత్వ భూమి; 699.7 హెక్టార్లు అటవీ భూమి.
ఈ ప్రాజెక్టు ప్రభావం 500 కుటుంబాలపై పడుతుంది. వందకు పైగా కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వెళ్లాల్సి వస్తుంది. మలిపాడు, టిజిమాలి గ్రామాలు పూర్తిగా నాశనమవుతాయి. ప్రతి రోజూ, కంపెనీకి 725 కిలోలీటర్ల (కెఎల్‌డి) నీరు అవసరం. ఒక కిలోలీటర్ 1000 లీటర్లు, కాబట్టి ఒక రోజుకు 725,000 (7 లక్షల 25 వేల లీటర్లు) నీటిని వాడతారు. ఈ నీటిని సేకరించేందుకు లోతైన బావులను తవ్వాల్సి వుంటుంది. ఆ ప్రభావం స్థానిక నీటి వనరులపై మరింతగా వుంటుంది.

అక్టోబర్ 7వ తేదీ రాత్రి కాశీపూర్‌లోని పోలీసులు దీపు నాయక్ ఇంట్లోకి వెళ్ళి, దీపు సోదరుడు, తండ్రి వేదాంత కంపెనీకి లొంగిపోకుంటే మరిన్ని తప్పుడు కేసులు పెడతామని కుటుంబాన్ని బెదిరించి, ఒడిశాలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపేరుతో సంస్థ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా పోలీసులు ఇంట్లో వున్న 40 గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండితో పాటు 50,000 నగదును తీసుకెళ్లారు.

అక్టోబరు 9వ తేదీ రాత్రి రాయగడ జిల్లా కాశీపూర్ బ్లాక్‌లోని రెండు గ్రామాలకు చెందిన దాదాపు 24 మంది మహిళలు సమీపంలోని సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు , వేదాంతకు చెందిన కొందరు గూండాలు, ఒడిశా పోలీసులు వారిని అడ్డుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించారు.

ఒడిశాలో గత కొన్ని నెలలుగా అసమ్మతి స్వరాలపై అణిచివేతను ఒడిశా ప్రభుత్వం ఉధృతం చేసింది. 9 మందిపైన క్రూరమైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఆయుధ చట్టం కింద 200 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీరిలో అణగారిన వర్గాలకు చెందిన 22 మంది గత రెండు నెలల్లో జైలుకు వెళ్లారు.

వేదాంత గ్రూపు యిచ్చిన సలహా మేరకు ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాన్ని గురించి సిజిమాలి కొండల పరిసర ప్రాంతాల ప్రజల నుంచి స్పందనలు సేకరించేందుకు కాలుష్య నియంత్రణ మండలి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఏకాభిప్రాయం వుందనే ముద్రను సృష్టించే ప్రయత్నంలో, ప్రభుత్వం అక్టోబర్ 16న రాయగడ జిల్లాలోని సుంగేర్ గ్రామ పంచాయతీలో బహిరంగ విచారణను ఏర్పాటు చేసింది.

ప్రజా విచారణను ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం వుంది కాబట్టి, ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్టోబర్ 16న జరగాల్సిన బహిరంగ విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ 50 గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల సంతకాలతో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

ప్రభుత్వం ప్రజా విచారణను తనకు అనుకూలంగా మార్చుకుంటుందని వారు నమ్ముతున్నారు. లేఖలో “వేదాంత కంపెనీ పాత వ్యూహాల ప్రకారం, 2023 అక్టోబర్ 16న జరగాల్సిన బహిరంగ విచారణను వేదాంత కంపెనీకి చెందిన కిరాయి గూండాలు తమ నియంత్రణలోకి తీసుకొని ఆధిపత్యం చెలాయిస్తారని, ఈ ప్రాజెక్టుల వ్యతిరేక స్వరం మూగబోతుందని మేము భయపడుతున్నాం. అందువల్ల, సాధారణ పరిస్థితికి ఏర్పడేవరకు, ఈ ప్రాంతంలో పోలీసుల అణచివేత, చుట్టివేతలను ఉపసంహరించుకునేంతవరకు, మా గ్రామస్తులను అక్రమ నిర్బంధం నుండి విడుదల చేసేంత వరకు బహిరంగ విచారణ నిలిపివేయాలని మేము ప్రార్థిస్తున్నాము” అని రాశారు.

లేఖ కాపీని భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి కూడా పంపారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ 2,000 మంది గ్రామస్తుల సంతకాలను కూడా జత చేశారు.

ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభను హైజాక్ చేసేందుకు కార్పొరేట్ దిగ్గజం వేదాంత చేసిన ప్రయత్నాలను సిజిమాలి పర్వతాల చుట్టుపక్కల గ్రామస్థులు అడ్డుకున్నారు. సిజిమాలి పర్వత ప్రాంతంలోని గ్రామస్తుల అటవీ హక్కుల కోసం ప్రచారం చేస్తున్న మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, “అక్టోబర్ 16 న, మైనింగ్ ప్రభావిత గ్రామాల నుండి స్థానిక ప్రజలు త్రినాథ్ దేవ్ హైస్కూల్‌కు వెళ్లడం ప్రారంభించారు. బహిరంగ సభ కోసం, భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, ప్రతి 500 మీటర్లకు ప్రజలను నిలువరించారు. పోలీసులు వారిని బహిరంగ సభ స్థలం కూడా వద్ద ఆపడానికి ప్రయత్నించారు. బయటి నుండి తీసుకువచ్చిన కంపెనీ దళారులు, కిరాయి గూండాలను సభా స్థల వేదిక మీదనుంచి, ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లగొట్టారు. ” బహిరంగ విచారణ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జరిగింది. 17 నుండి 20 మంది దాకా స్థానిక ప్రజలు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడారు; వేదాంత కంపెనీకి అనుకూలంగా ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు. బహిరంగ విచారణకు పది వేల మందికి పైగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో అదనపు జిల్లా కమిషనర్‌, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం బంత్‌జీ, అలీప్‌గుణ, సాగబరి, కాంతమాల్‌, మలిపదార్‌ తదితర గ్రామాల వాసులు లిఖితపూర్వకంగానూ, వీడియోలోనూ నమోదు చేసిన ఫిర్యాదుల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేక కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపిస్తామని పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు. అదనపు జిల్లా కమిషనర్ స్థానిక మీడియా లేదా గ్రామస్తుల నుండి ఎలాంటి ప్రశ్నలను వినలేదు.

వేదాంత బాక్సైట్ తవ్వకాల ప్రాజెక్టుపై ఏకగ్రీవంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రజల సాక్ష్యాన్ని బట్టి తెలుస్తుందన్నారు. అధికార పార్టీలైన బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలతో కలిసి వేదాంత కంపెనీ గూండాలను నియమించుకుందని, మైనింగ్‌ ప్రాజెక్టుకు అనుకూలంగా బయట గ్రామాల నుంచి 2000 మందికి పైగా పిలిపించి బహిరంగ విచారణ జరిపించారని చూశారనీ కానీ, స్థానిక మద్దతుదారులు ఇరవై వేల మందికి పైగా అక్కడ సమావేశానికి రావడంతో వారు బహిరంగ విచారణ నుండి నిష్క్రమించవలసి వచ్చింది అని మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్ నుండి మధుసూదన్‌ వివరించారు.

“బహిరంగ విచారణ ఫలితంపై మేము ఆశాజనకంగా ఉన్నాము. రాయగడ, కలహండి ప్రభావిత గ్రామాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, మైనింగ్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తుందని ఆశిస్తున్నాము. అలా చేయడంలో విఫలమైతే. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే, వేదాంత, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టులోనైనా, వీధుల్లోనైనా పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

“సిజిమాలి బహిరంగ విచారణను నాలుగు ప్రధాన కారణాల వల్ల చారిత్రాత్మకమైనదిగా పిలవవచ్చు. మొదటిది, ఈ ఉద్యమాన్ని ఢిల్లీ, భువనేశ్వర్ లేదా ఏ వ్యక్తి లేదా సంస్థ కానీ చేయడంలేదు, దళితులు, ఆదివాసీల నాయకత్వంలో జరుగుతోంది. స్థానిక ప్రభావిత ప్రాంతాల బహుజనులు, ‘సిజిమాలి సురక్షా సమితి’ బ్యానర్‌ కింద ఐక్యమయ్యారు. సిజిమాలి సురక్షా సమితి అనేది స్థానిక దళిత, ఆదివాసీ, బాధిత గ్రామస్తులు అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్ మద్దతుతో ఏర్పాటు చేసిన ప్రజా ఉద్యమ సంస్థ.

రెండవది, ఈ ఉద్యమానికి నిధులను స్థానిక నివాస వనరుల కమిటీ (కమిటీ ఆఫ్ ద లోకల్ రెసిడెంట్), మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్‌లోని స్థానిక, ఆర్థిక, రాజకీయ, మేధావుల సహాయంతో సమకూర్చుకున్నారు తప్ప బిజెపి, బిజెడి, కాంగ్రెస్, లేదా మరే ఇతర రాజకీయ పార్టీ, ఎన్‌జీవోలు లేదా పెట్టుబడిదారుల నుంచి కాదు. మూడవది, ఈ ఉద్యమం బిర్సా, ఫూలే, అంబేద్కర్, రంధో మాఝీ, చక్కర బిష్యోయి తదితర బహుజన మహాత్ముల లోతైన ప్రభావాన్ని కలిగివుంది తప్ప గాంధీ లేదా సావర్కర్ లేదా ఇతర సవర్ణ రక్షకుల సంక్లిష్ట ఆదర్శాలు కాదు. చివరగా, ఉద్యమం వేదాంత, అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు మద్దతు ఇచ్చే బ్రాహ్మణవాద మీడియాను వ్యతిరేకించింది. ప్రజల గోతును వినిపించే మీడియా, అంబేద్కరైట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మద్దతు పొందింది.

అటవీ (పరిరక్షణ) సవరణ చట్టం 2023ని కూడా మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్‌ విడుదల చేసిన నివేదిక విమర్శించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చేసిన సవరణ ఏదైనా ప్రాజెక్ట్‌‌ను అనుమతించే లేదా ఆపే అధికారం ఉన్న గ్రామసభల చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ బిల్లు అటవీ, భూ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని భారీగా తగ్గించింది. ఏదైనా కార్యాచరణను “అటవీయేతర ప్రయోజనం”గా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి యిచ్చింది.

వేదాంత కంపెనీ గూండాలలాగా వ్యవహరిస్తున్న పోలీసులు

మూల్ నివాసి సమాజసేవక్ సంఘ్‌కు చెందిన మధుసూదన్‌తో “ప్రభుత్వానికి రహస్య ఉద్దేశాలు ఉన్నాయి. ప్రభుత్వం బహిరంగ విచారణను పారదర్శకంగా ఉండేలా బహిరంగంగా నిర్వహించాలి. రెండవది, పోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారు. వేదాంత కోసం, వారు మా కార్యకర్తల ఇళ్లలోకి ప్రవేశించి నిరసన విరమించమని బెదిరిస్తున్నారు.”

ఈ ప్రాంతపు ఇటీవలి వాస్తవాలను ప్రచురిస్తామని, ప్రభుత్వ బెదిరింపు వ్యూహాలకు బెదిరిపోమని. వేదాంత కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు అమలు చేస్తున్న పోలీసుల అణిచివేతను బయటపెడుతూనే ఉంటాం అని మూల్ నివాసి సమాజ్ సేవక్ సంఘ్ ప్రకటించింది.

‘మన సంప్రదాయ ఆయుధాల వల్ల ఎవరూ చనిపోలేదు, పోలీసుల ఆయుధాలు మాత్రం మన ప్రాణాలు తీసుకున్నాయి’

“పోలీసులు మా గ్రామానికి వచ్చి మా సంప్రదాయ ఆయుధాలను నిషేధిస్తున్నారు. మా సాంప్రదాయ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు, కానీ మా సాంప్రదాయ ఆయుధాలను మేము అడవి నుండి కలప, ఆకులు తెచ్చుకోవడానికి ఉపయోగిస్తాం. వ్యవసాయం చేస్తాం. కానీ పోలీసులు లాఠీలు, తుపాకులను ఉపయోగించి మా సిజిమాలిని చేపలు, కూరగాయల్లా ధరలకు అమ్మేసి మమ్మల్ని నిర్వాసితులను చేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి 1993 ఆగష్టు 9వ తేదీన స్థానికులకు సంప్రదాయ ఆయుధాలు ధరించే హక్కును కల్పించింది. ఈ రోజున, మేము ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. మా సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగించడం వల్ల ఎవరూ చనిపోలేదు, కానీ పోలీసుల ఆయుధాలు మా ప్రాణాలు తీసుకున్నాయి. పోలీసులు ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు 22 మంది జైల్లో ఉన్నారు.సాంప్రదాయ ఆయుధాలలో విల్లులు, బాణాలు మొదలైనవి ఉన్నాయి”అని అంటున్నారు 19 ఏళ్ల యువతి కాంచన్ మాఝీ.

మరో గ్రామస్థురాలు నమితా మాఝీ.. ‘‘జల్ జంగల్ జమీన్ మా దేవుళ్లు.. మా జీవనం కోసం ఆహారం కోసం వారిపై ఆధారపడ్డాం, ఎంతకైనా తెగిస్తాం.. కార్పొరేట్లకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను తప్పుడు కేసుల్లో అరెస్టు చేశారు. ఇంతకు ముందు లార్సెన్ & టౌబ్రో వచ్చినప్పుడు వాళ్ళను బయటకు నెట్టేసాం. ఈసారి కూడా మేము బెదిరింపులకు లొంగేది లేదు.
అనువాదం : పద్మ కొండిపర్తి

https://en.themooknayak.com/tribal-news/sijimali-uprising-odisha-villagers-challenge-vedantas-mining-project-police-intimidation?utm_source=website&utm_medium=related-stories

Leave a Reply