‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు. నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది.
ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ మార్గం, చెంచయ్యగారు భాష వాడుకొనే దృష్టీ, ఆయన సరళమైన భాషా విన్యాసం, వ్యాస రచనలో ఆయన శిల్ప దృష్టి మొదలైనవి మనకి తెలుస్తాయి.
ఈ సందర్భంగా కె.వి.ఆర్ గారి ‘‘అక్షర తుణీరం’’కి జి కళ్యాణ్ రావు గారు తన ముందు మాటలో ‘‘ఏ విమర్శకుడిలో సహృదయం లేదో, ఎవడు కావ్యాన్ని సానుభూతితో పరామర్శించడో వాడు కువిమర్శకుడు’’ అనే కె.వి.ఆర్ అన్న మాటలు పేర్కొన్నారు. ఈ మాటలు సాహిత్య విమర్శకులందరికీ వర్తిస్తాయి. విమర్శ బాధ్యతను తెలియజేస్తాయి. ’సాహిత్య సమీక్ష మొక్కు చెల్లించడానికి కాదు. నేను నేర్చుకోవడానికి మరింత అధ్యయనం కోసం, నూతన అన్వేషణకి, విమర్శ క్షేత్రంలోకి ఒక తోటమాలిగా ప్రవేశించాలని నా మనసుకు సమాధానం చెప్పాను’ అన్న టీ.ఎస్.ఇలియట్ అన్న మాటలు కూడా విమర్శకులకు అవసరం.
‘‘సాహిత్య విమర్శ యొక్క పొలిమేరలు విస్తరించాయి.’’ చెంచయ్య గారు తడవని విషయం అంటూ లేదు. ఆయన ఇతరుల వ్యాసాలను నిశితంగా పరిశీలించి నిష్పక్షపాతంగా వివరణ ఇస్తూ పాఠకులకు పరిచయం చేస్తూ ఈ వ్యాసాలు రాశారు. ఇందులో ప్రాచీన కవుల దగ్గర నుంచి నేటి ఆధునిక విమర్శకుల వరకు అనేక మంది మీద చెంచయ్యగారి అభిప్రాయాలు తెలుస్తాయి.
సాహిత్యంలో స్త్రీవాద, మైనార్టీ వాద సాహిత్యం, ప్రాంతీయ (తెలంగాణ) వాద సాహిత్యం, నక్సల్‌బరి వెలుగులో ప్రారంభమైన విప్లవ సాహిత్యంలోని కొనసాగింపు మొదలైనవి ఉన్నాయి. అమెరికన్ సామ్రాజవాదాన్ని, హిందుత్వ భావజాలాన్ని ధ్వంసం చేసే నూతన ప్రజాస్వామిక శక్తుల భావజాలానికి అక్షర రూపం కల్పించాలనే ఎరుకను ఈ సాహిత్య విమర్శ వ్యాసాలు అందిస్తాయి. ‘‘కవిత్వంలో కవితా విలువలు లేవనే’’ వేలూరి వెంకటేశ్వరరావు లాంటి (ఎన్నారై)లకు, వేదగిరి రాంబాబు గారికి సహృదయంతో తనదైన శైలిలో సూటిగా సమాధానం ఇచ్చారు.
‘‘ప్రపంచీకరణ ఒక పెద్ద సాహిత్యోద్యమం రావడానికి కీలక సమయమని’’ ఓల్గా చెప్పిన మాట వాస్తవం అని అంగీకరిస్తూనే మరింత విస్తృతార్థంలో ‘‘అయితే ఈ సాహిత్యోద్యమం దానంతటది విడిగా వచ్చే ఉద్యమం కాదు. అదొక ప్రత్యేక ఉద్యమంలా కనిపించవచ్చు, దాని మూలాలు విప్లవ సాహిత్యోద్యమం లో ఉన్నాయి.’’ అని చెంచయ్యగారు అంటారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో భాగంగా నడుస్తున్న ప్రజా ఉద్యమాలు, ప్రపంచ విప్లవోద్యమాలకి ఒక దిక్సూచిగా మారిన దండకారణ్య జనతన సర్కార్ విప్లవ నిర్మాణం గురించిన సందర్భంలో ఆయన ఈ మాట అన్నారని మనకు అర్థం అవుతుంది.
ఈ చిన్న గ్రంథంలో చెంచయ్యగారు సాహిత్య విమర్శకు అందించిన వినూత్న దృక్కోణం కనిపిస్తుంది. అనేక భావాలను, దృక్పథాలను విప్లవ దృక్పథంలో చెంచయ్యగారు తులనాత్మక పరిశీలించి, వివేచించారు. ఆ విమర్శకుల ఆలోచన, సాహిత్యాన్ని చూస్తున్న తీరుతెన్నులను ఎలా అర్థం చేసుకోవాలో ఒక పద్ధతిని చెంచయ్యగారు అందించారు. ఆయన మార్క్సిస్టు పద్ధతిని సాహిత్య, కళృా రంగాలను, విమర్శ రంగానికి అన్వయించారు. ఆ విమర్శకులకు, రచయితలకేగాక పాఠకులకు కూడా ఇదంతా అర్థమయ్యేలా విమర్శ పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. సాహిత్య విమర్శను సృజనాత్మకత ప్రక్రియగా చెంచయ్యగారు మలిచారు.
‘విప్లవ సాహిత్య విమర్శ’ అనే వ్యాసంలో విప్లవ సంస్కృతిలో వస్తున్న కొన్ని మార్పులు, కొత్త భావాల, ఉద్వేగాల వ్యక్తీకరణల వల్ల వస్తున్న సంఘర్షణ ఛాయలు కనిపిస్తున్నాయి. రచయితకు సృజనపట్ల ఎరుకను పెంచుతూ, విమర్శకుడి అనుశీలనకు కొత్త కోణాలు అందించారు. సద్విమర్శతో తులనాత్మక సాహిత్య గుణగణాల నిర్ధారణ, పరిశీలన, వస్తుత్త్వ నిరూపణ ఈ విమర్శ వ్యాసాల లక్ష్యం. తద్వారా పాఠకులకు సాహిత్య అవగాహనను పెంచడమే ఆయన అసలు ఉద్దేశం. ఈ వ్యాసాల్లో ఒక చోట చెంచయ్యగారు ‘‘కుటుంబరావు ఒక సందర్భంలో అంటాడు- సాహిత్య విమర్శ అవసరం లేని విధంగా సాహిత్యం ఎదగాలని’’ అంటారు. దీనికి కొనసాగింపుగా చెంచయ్యగారు..అయితే వర్గ సమాజంలో అది సాధ్యం కాదు. ఈ అభిప్రాయాన్ని కొనసాగిస్తే అసలు సాహిత్యం అవసరం లేని స్థాయికి సమాజం ఎదగాలనిపిస్తుంది. మానవుల మధ్య ఉన్న వైరుధ్యాలన్నీ సమసి పోయినప్పుడు రాజ్యం అదృశ్యం అయిపోతుందని మార్క్స్ అన్న మాటలు ఈ ఆలోచనకు మూలం. అప్పటిదాకా సాహిత్యమూ అవసరమే, సాహిత్య విమర్శ అవసరమే. దాన్ని నిరంతరం విప్లవీకరించుకోవడం అవసరం’’ అంటారు. ఆ పనిలో భాగంగా చెంచయ్యగారు ఈ వ్యాసాలు రాశారు. ఈ స్ఫూర్తితో నవనిర్మాణకై ముందుకు పోదాం.
రచన: వి. చెంచయ్య
(విమర్శ వ్యాసాలు)
వెల: 40రూ
ప్రచురణ: విప్లవ రచయితల సంఘం నెల్లూరు జిల్లా శాఖ
వ్యాసాల దృక్పథాన్ని చక్కగా విశ్లేషించారు.