(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట )
ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’.
శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం. ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు, ఆ మాటకొస్తే భారత సమాజాలే గత నలభై యాభై ఏళ్లుగా అనుభవిస్తున్న సంక్షోభాలు ఈ వ్యాసాలకు నేపథ్యంలో పని చేశాయని అనిపిస్తోంది. రాజ్యం, రాజ్యాంగం, పాలకుల రాజకీయార్థిక విధానం, వీటన్నిటి వల్ల పెరిగిపోతున్న సామాజిక సంక్లిష్టతలు, తీవ్రమవుతున్న దోపిడీ రూపాలు, ప్రజలను చుట్టుముడుతున్న హింసారూపాలు, కంటికి కనిపించని పీడనలు..ఇలా ఎన్నో శేషయ్యగారి ఆలోచనల వెనుక ఉన్నాయి. వీటన్నిటినీ సునిశితంగా, చలనంలో పరిశీలించగల దృక్పథం ఉండటం ఆయన ప్రత్యేకత. ఈ దృక్పథాన్ని ఆయన కేవలం తన అధ్యయనం నుంచి మాత్రమే సంతరించుకోలేదు. తన ఆచరణ నుంచి, పౌరహక్కుల ఉద్యమం నుంచి మాత్రమే అభివృద్ధి చేసుకోలేదు. నిర్దిష్ట స్థల కాలాల్లో ప్రజలు ఎంచుకున్న పోరాట ఆచరణ నుంచి ఆయన తన దృక్పథాన్ని పదును పెట్టుకుంటూ వచ్చారు. ఆ రకంగా శేషయ్యగారి దృక్పథం ప్రజా పోరాట చైతన్యంలోంచి వికసించింది. వేర్వేరు పోరాట రూపాలతో ఈ సమాజం గడిరచిన చైతన్యాన్నంతా ఆయన మేధో వ్యక్తిత్వంలో గమనించవచ్చు.
ఈ మౌలికత ఆయన వ్యాసాల్లో ఉన్నది. బహుశా పౌరహక్కుల ఉద్యమానికి తిరుగులేని భావజాల పునాదిని సమకూర్చడంలో ఆయనకు ఇది దోహదం చేసింది. హక్కుల ఉద్యమం ఇతర ఉద్యమాలను ప్రభావితం చేసినట్లే ఆ ఉద్యమాల అవగాహన నుంచి, చైతన్యం నుంచి హక్కుల ఉద్యమం విస్తరిస్తూ వచ్చింది. ఈ పరస్పర సంబంధంలోనే హక్కుల కార్యరంగానికి ఉన్న ప్రత్యేకతలను ఆయన మరింతగా స్పష్టపరిచారు. శేషయ్యగారి ఆలోచనల్లోని విశిష్టత ఏమంటే రోజువారీ ప్రజా సమస్యల గురించి నిరంతరం ఆలోచిస్తూ, పని చేస్తూ, మాట్లాడుతూ, రాస్తూ వాటిని సిద్ధాంతీకరించడం. ఈ పని ఆయన చాలా సృజనాత్మకంగా చేశారు. చాలా సరళమైన పరిశీలనలు చేస్తూ వాటన్నిటినీ గుదిగుచ్చి రాజకీయ, సిద్ధాంత స్థాయికి తీసికెళతారు. ఆ అర్థంలో ఆయన హక్కుల ఉద్యమాన్ని కూడా ఒకానొక రాజకీయ ఉద్యమంగా వ్యాఖ్యానిస్తారు. అందుకే ‘హక్కుల ఉల్లంఘనను రాజకీయ సందర్భంలో చూడాలి’ అనే మాట ఆయన ప్రసంగాల్లో, రచనల్లో తరచూ వినిపించేది. ఈ మాటను ఇంకాస్త పొడిగించి`ప్రజలకు సంబంధించిన ప్రతి హక్కు రాజకీయార్థిక సాంస్కృతిక కారణాలతోనే ఉల్లంఘించబడుతోంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రాజకీయార్థిక, సాంస్కృతిక పోరాటాల పర్యావరణంలోనే ప్రజలు తమ హక్కులను కాపాడుకోగలరు. ఇలాంటి విస్తృత అవగాహనను ఆయన హక్కుల ఉద్యమానికి సాధికారికంగా అందించారు. కాబట్టి ఘటనలను, సమస్యలను, పరిష్కారాలను ఆయన దేనికదే విడిగా చూసి సంతృప్తి చెందరు. అన్నిటినీ హోలిస్టిక్‌గా చూస్తారు. అలాంటి ప్రాపంచిక దృక్పథం వల్లే హక్కుల ఉద్యమానికి సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వస్తుందనే స్పష్టతతో ఆయన విశ్లేషణలన్నీ సాగాయి.
శేషయ్యగారి రచనలను సేకరించి, క్రోడీకరించి ప్రచురిస్తున్న సమయంలో ఈ కోణం మాకు మరింత బాగా అర్థమైంది. ఈ వివరణ దేనికంటే ఈ సమగ్ర హక్కుల దృక్పథం నుంచి ఆయన రచనలను అంశాల వారీగా విభజించడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. ఏ విషయం మీద రాసినా దాన్ని మొత్తం వ్యవస్థ వైపు నుంచి, దాన్ని కాపాడుతున్న పాలకుల విధానాల వైపు నుంచి, రాజ్య స్వభావం వైపు నుంచి, వీటన్నిటికీ మార్గదర్శకత్వం వహిస్తున్న భారత రాజ్యాంగం వైపు నుంచి చూస్తారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆయన రచనలను కొన్ని విభాగాలుగా విభజించాం. ఇప్పుడు మీ ముందున్న ‘నూతన ఆర్థిక విధానాలు`కార్మికోద్యమం’ పుస్తకంలో శేషయ్యగారి విశ్లేషణ పద్ధతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయన అకడమిక్‌గా న్యాయశాస్త్ర అధ్యాపకుడు అయినప్పటికీ న్యాయాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని రాజకీయార్థిక సంబంధాల వైపు నుంచి చూడగల దృక్పథం ఆయనకు పుష్కలంగా ఉంది. అందుకే శేషయ్యగారు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు లోతైన రాజకీయార్థిక విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది. పోలీసులు, కోర్టులు, చట్టాలు చేసే పనుల వెనుక రాజకీయార్థిక శక్తులు పని చేస్తూ ఉంటాయని చెప్పడం ఆయన ఉద్దేశం. తద్వారా న్యాయం, చట్టం, రాజ్యాంగం అమూర్తంగా, అతీతంగా ఉండవనే ఎరుక కలిగిస్తారు. న్యాయశాస్త్ర ఆచార్యుడిగా, హక్కుల ఉద్యమ నాయకుడిగా ఆయన సఫలమైంది ఈ రాజకీయార్థిక దృక్పథం వల్లనే. ఉదారవాద, అకడమిక్, స్వచ్ఛంద సంస్థల హక్కుల దృక్పథం నుంచి పౌరహక్కుల సంఘం అవగాహనను వేరే చేసే బలమైన పునాదిని దీని వల్లనే ఆయన అందించగలిగారు. ఈ విస్తృత నేపథ్యంలో ఈ సంపుటిలోని వ్యాసాలను పరిశీలించాలి.
శేషయ్యగారికి కార్మికోద్యమంతో దృక్పథపరమైన సంబంధమే కాదు. ఆచరణాత్మక సంబంధం కూడా ఉంది.మదనపల్లి స్పిన్నింగ్ మిల్లులోని కార్మిక సంస్థకు ఆయన న్యాయ సలహాదారుగా చాలా కాలం పని చేశారు. అక్కడి కార్మికుల పోరాటాలతో కలిసి నడిచారు. యాజమాన్య వైఖరులను మొత్తంగా భారత రాజకీయార్థిక విధానం నుంచి పరిశీలించారు. ఈ ప్రత్యక్ష అనుభవం కూడా ఆయన ఈ వ్యాసాలు రాయడానికి దోహదం చేసింది. పౌరహక్కుల సంఘం చేసిన క్షేత్రస్థాయి అధ్యయనం మీద ఆధారపడి రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి.
నూతన ఆర్థిక విధానాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాక పబ్లిక్ రంగం మొత్తంగా కుప్పకూలిపోవడం మొదలైంది. ఇవాళ అత్యంత ప్రమాదకారిగా మారిన కార్పొరేటీకరణ వెనుక నెహ్రూ ఆరంభించిన మిశ్రమ ఆర్థిక విధానం ఉన్నప్పటికీ నూతన ఆర్థిక విధానాలు అందులో కీలక మార్పులు తీసుకొచ్చాయి. ఈ పరిణామాల్లో దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. పరిశ్రమలు మూత పడ్డమంటే ప్రజల పని హక్కు రద్దు కావడం. ఇది కార్మికుల జీవించే హక్కును కాలరాయడంగా మారుతుంది. పాలకుల రాజకీయార్థిక విధానం నేరుగా ప్రాథమిక హక్కులకు విఘాతంగా మారడం అంటే ఇదే.
ఈ పరిస్థితుల్లో 1992లోనే శేషయ్యగారు నలుపు పత్రికకు గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు సమస్యలను, రోడ్డున పడుతున్న కార్మికుల జీవితాలను విశ్లేషిస్తూ చాలా పెద్ద వ్యాసం రాశారు. ఆ తర్వాత 1994లో పౌరహక్కుల సంఘం తరపున ‘ఖాయిలా పడిన మిల్లులు ’ అనే పుస్తకాన్ని రాశారు. అందులో కేవలం రాజకీయ వాదనేగాక, హక్కుల విశ్లేషణేగాక నూతన ఆర్థిక విధానాల స్వభావాన్ని లోతుగా పరిశీలించారు. ఈ పుస్తకం ముప్పై ఏళ్ల కింద రాశారని గుర్తు చేసుకుంటే శేషయ్యగారి అవగాహన విస్తృతి అర్థమవుతుంది. ఇందులో ఆయన అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ఖాయిలా పడిన పరిశ్రమల గురించి రాశారు. ఆ పరిశ్రమల వివరాలు, వాటిని ఒక పథకం ప్రకారం ప్రభుత్వం ఖాయిలా పడేయడం, దానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడటం, వాటిని ప్రభుత్వం అణచివేయడం..ఇట్లా ఒక సమగ్ర చిత్రాన్ని ముందు పెట్టారు.
నూతన ఆర్థిక విధానాల వల్ల చట్టాల్లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయో వివరిస్తూ మరో అద్భుతమైన వ్యాసం రాశారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడిపోయిన తీరును రాజకీయార్థిక కోణంలో విశ్లేషిస్తూ రాసిన వ్యాసం ఇప్పటికీ చాలా అత్యవసరమైనది. వీటన్నిటికీ భిన్నమైనది ముప్పై ఏళ్ల నక్సల్బరీ సందర్భంలో రాసిన వ్యాసం. ఇందులో భారత కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా కార్మికోద్యమాన్ని పరిశీలిస్తారు. ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం వర్గపోరాట రాజకీయాలను చరిత్ర మీదికి తీసుకొని వచ్చాక కూడా కార్మికోద్యమ అవగాహనలో, ఆచరణలోని లోటుపాట్లను చాలా సంయమనంగా విశ్లేషించారు.
కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతోంటే ప్రభుత్వం అణచివేత ప్రయోగించినప్పుడు వాళ్లకు హక్కుల సమస్య తలెత్తుతుందనే సాధారణ అవగాహనకు శేషయ్యగారు పరిమితం కారు. దోపిడీ కొనసాగుతున్న సమాజంలో హక్కులకు కుదురు ఉండదని ఆయన అంటారు. హక్కుల దృక్పథం గురించిన ఒక చర్చా వ్యాసంలో ఆయన దోపిడీతో సంబంధం లేకుండా హక్కుల గురించి మాట్లాడటానికి వీల్లేదని అంటారు. దీన్ని ఆయన కార్మిక రంగానికి అన్వయించి హక్కుల ఉల్లంఘనను చాలా మౌలిక స్థాయి నుంచి పరిశీలిస్తారు.
కార్మిక చట్టాలన్నిటినీ రద్దు చేసి, ప్రభుత్వరంగాన్నంతా అదానికి ఇచ్చేసి, డెబ్బై ఏళ్ల కింద ఏ లక్ష్యం కోసమైతే భారత ప్రజాస్వామ్యం బయల్దేరిందో, దాన్నంతా రద్దు చేసి కార్పొరేట్స్వామ్యంగా మార్చేస్తున్న హిందుత్వ శక్తుల పాలనలో కార్మిక రంగం మరింత సంక్షోభంలో పడిపోయింది. కార్మికోద్యమాలు గత అనుభవాల నుంచి నేర్చుకుంటూనే సరికొత్త వ్యూహాలతో, కొత్త నినాదాలతో పని చేయకతప్పని స్థితి ఏర్పడిరది. ఈ క్రమం ఎక్కడ మొదలై ఇక్కడి దాకా ఎట్లా చేరుకున్నదో తెలుసుకోడానికి శేషయ్యగారు రాసిన ఈ వ్యాసాలు తప్పక ఉపయోగపడతాయి. గత రెండు సంపుటాల్లాగే దీన్నీ పాఠకులు, ఉద్యమకార్యకర్తలు, మేధావులు చదువుతారని ఆశిస్తున్నాం.
ఈ వ్యాసాలను డిటిపి చేసిన రంగనాయకులు, పుస్తక రూపంలోకి తెచ్చిన వై. రామచంద్రం, అందమైన కవర్ సిద్ధం చేసిన శేషు కొర్లపాటి, ప్రూఫ్ రీడిరగ్ పని చేసిపెట్టిన కవి, రచయిత, మానవతా రక్తదాత సంస్థ కన్వీనర్ తరిమెల అమరనాథ్‌రెడ్డి, అట్లాగే ఆ సంస్థ కో కన్వీనర్ కె. సలీంమాలిక్, మమత రక్తదాతల సంస్థ కో కన్వీనర్, ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేట్ ప్రొ. ఎన్ నవీన్‌గార్లకు, ఈ పుస్తకాన్ని అచ్చేసిన కర్షక ప్రెస్(హైదరాబాదు)వారికి ధన్యవాదాలు.