కవిత్వం

పదేళ్ల పచ్చి గాయం

ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి వచ్చిన పిల్లాడి లంచ్ బాక్స్ అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు అంతా తత్తరపాటు అప్పటికి విన్న ఆమెకది పగటి కలే కావచ్చు ముఖ పరిచయమే లేని నాకు మాత్రం ఎండిన నాలుకపై తెప్పరిల్లే చిన్న వాన చినుకు అతగాడికి కాగితాలకందని శిక్ష వెయ్యాలని తీర్పరి చెరకుగడ పిప్పిగా పాఠాన్ని నములుతూ పోతుంటాడు శూన్యం కుమ్మరించిన నేలపై ఒకరి కళ్లను మరొకరు ఫొటోగ్రాఫ్ చేస్తూ
కవిత్వం

వలస కావిడి

నెత్తిన నీళ్ళకుండ భుజాన సూర్యుడు ఆకలిముల్లు గోడలపై ఎగాదిగా ఎగబాకిన పాదాలు లాగేసిన కంచంలో ఆరబోసే తెల్లారికై చుక్కల పరదాతో రాత్రంతా కొట్లాడిన పాదాలు ఇంటి కుదుర్లు జల్లిస్తూ కార్పొరేట్ కాలేజీ వంటపోయ్యిలో కట్టెలవుతున్నాయి పుట్టినూరు నోరు తేలేసినందుకు... దేహాన్ని కప్పే సిమెంట్ రేకుల పగుళ్లలో విరిగిన బతుకులు చినిగిన గౌను లాగూ లేని చొక్కా ఆడుకోడానికి నలుగురు దోస్తులూ లేని గిరాటేసిన బాల్యం ఇక్కడ వంటపాత్రల కింద మసి పలక అందరికీ నిలువెత్తు ఊపిరైన వూరు ఆరో మెతుకును అడగకుండానే ఇచ్చిన నేల సంపెంగ మీసాల పుక్కిలింత వలస కావిట్లో నిట్టనిలువునా కాలిపోతోంది.