కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా? ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
కానీ అలాంటి రోజు వచ్చింది.
ఈ సంఘర్షణ ఆధునిక భారత దేశ చరిత్రలో అరుదైనది. అనేక క్రమాలు ఇక్కడికి చేరుకున్నాయి. దీనికి ఎన్నో రాజకీయార్థిక సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన గంభీరమైన విశ్లేషణను అధిగమిస్తూ ’ఫెలో ట్రావలర్‘ వసంతమేఘం పక్ష పత్రిక ఏప్రిల్ 1 సంచికలో ఒక దీర్ఘ కవిత రాశారు.
ఈ కవిత శీర్షిక ‘అడవి-రోడ్డు’. మధ్య భారతదేశంలోని అడవులన్నిటినీ చుట్టి వచ్చిన కవిత ఇది. అడవుల్లోకి విధ్వంస, దోపిడీ, యుద్ధ మార్గాలుగా రోడ్లు విస్తరిస్తున్నాయని చెప్పే కవిత ఇది. ఈ ఒక్క మాట దానికదే కవిత్వం కాదు. ఇందులో కవిత్వం కాగల అంశం ఉండాలి. అదేమిటో తెలుసుకోడానికి ఈ దీర్ఘ కవితను అందరూ తప్పక చదవాలి. అదెలా కవిత్వమైందో గ్రహించడానికి కవులందరూ చదవాలి.
అడవికి రోడ్డుకు వైరుధ్యమేమిటో మామూలుగా ఎవ్వరికీ అంతుపట్టదు. అడవిలో అయినా రోడ్డు ఉండాల్సిందే కదా అనుకోవచ్చు. రోడ్లు నాగరికతకు చిహ్నాలనే నినాదాలను వింటూ ఉంటాం. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో వేసే రోడ్లు అడవుల్లో ఎప్పటి నుంచో ఉండే దారులు కాదు. అడవులు`దారులు అభేదంగా ఉంటాయి. అసలు అడవులంటే నదులు, సెలయేళ్లు, పిల్లకాలువలు అయినట్లే అడవులంటే దారులు కూడా. అడవులంటే చెట్లు చేమలు, కొండలు గుట్టలు అయినట్లే అడవులంటే దారులు కూడా. దారులతో కలగలసిపోయిన అడవికి రోడ్డుతో వైరుధ్యం వచ్చింది. అడవుల్లోని ఆదివాసులకు రోడ్లతో జీవన్మరణ వైరుధ్యం వచ్చింది. అదే ఒక పెద్ద యుద్ధాన్ని తెచ్చిపెట్టింది. ఆదివాసులు అభివృద్ధి కాకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారనే సూత్రీకరణ ఈ యుద్ధాన్ని వివరించలేదు. ఆధునిక కాలంలో ఏ యుద్ధాన్నయినా ఏదో ఒక సూత్రీకరణతో వివరించడం అయ్యే పని కాదు. ‘ఆదివాసుల’లనే వెనుకబడిన సమూహం మీద భారత రాజ్యమనే ‘ఆధునిక’ యంత్రాంగం చేస్తున్న యుద్ధం ఇది. అడవి మీద దేశంలోనే అతి పెద్ద నాగరికతా కేంద్రమైన నగరం ఢల్లీిలో ఉండే పాలకులు చేస్తున్న యుద్ధం ఇది. చాలా సంక్లిష్లమైనది. ఇంత జటిలమైన ఇతివృత్తాన్ని ఫెలోట్రావెలర్ కవితా ఇతివృత్తంగా ఎంచుకున్నారు. బహుశా ఇప్పటికి ఈ యుద్ధం గురించి వచ్చిన విశ్లేషణల సారాన్ని అధిగమించి కాల్పనిక, భావావేశ, వర్ణనాత్మక శైలీ రూపాల్లో అడవికి, రోడ్డుకు ఉన్న వైరుధ్యంలోని రహస్యాలన్నీ విప్పి చెప్పారు.
వర్తమాన భారతదేశంలో అనేక పోరాట స్థావరాలు ఉన్నాయి. వాటిలో దండకారణ్యం ఒకటి. కానీ మరెక్కడా లేని పోరాట ఉద్రిక్తత దండకారణ్యంలోనే ఉంది. నిజానికి దండకారణ్యం గురించి మాట్లాడుకోవడమంటే దేశంలోని ఒకానొక భూగోళం గురించి మాట్లాడుకుంటున్నట్లు. అనేక వర్గాల, ప్రత్యేకతల, అస్తిత్వాల భారత ప్రజల్లో ఆదివాసుల గురించి మాట్లాడుకుంటున్నట్లు. కానీ దండకారణ్యంలో ఆదివాసులకు, వాళ్ల మీద దాడి చేస్తున్న భారత రాజ్యానికి ఉన్న ఘర్షణ వల్ల అది దండకారణ్యానికే పరిమితమైంది కాదు. దాని రాజకీయార్థిక, సాంస్కృతిక, యుద్ధ ప్రకంపనాలు యావద్దేశాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే భారత రాజ్యాంగయంత్రంలోని అన్ని విభాగాలు దండకారణ్యంలో కేంద్రీకరించాయి.
అలాంటి చోట ప్రజా జీవితం ఎలా ఉంటుంది? అక్కడి ప్రజా పోరాటం ఎలా ఉంటుంది? భారత రాజ్యం ఎంత సంక్లిష్టంగా అక్కడ ఆవరించి ఉంటుంది? అది ఎన్నెన్ని పొరల్లో సూక్షస్థాయిలో విస్తరించి ఉంటుంది?ఆ ఉద్రిక్తతనంతా ఫెలో ట్రావెలర్ కవిత కాల్పనీకరించింది. ఇరు పక్షాల వ్యూహాలను తరచి చూసి, ఇరు శక్తుల బలాబలాలను, న్యాయాన్యాయాలను, నిర్మాణ విధ్వంస ప్రయత్నాలను కవిత్వం చేశారు.
ఈ కవిత శీర్షిక అడవి-రోడ్డు అయినప్పటికీ ఇందులో ‘అడవి-ఆకాశం’ అనే ఉప ఖండిక కూడా ఉంది. ఈ శీర్షికల మధ్య ఒక సంబంధం ఉంది. ఒక విస్తరణ కూడా ఉంది. ఈ దీర్ఘ కవిత ‘అడవి మీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది…’ అని మొదలవుతుంది. అట్లా మొదలు పెట్టి దండకారణ్య ప్రాంత నైసర్గిక ప్రత్యేకతల్లోకి, అక్కడి ఆదివాసీ సుదీర్ఘ చరిత్రలోకి, పోరాట పరంపరలోకి కవిత వెళుతుంది. ఆదివాసుల సాంస్కృతిక ప్రత్యేకతల్లోకి వెళుతుంది. వాటన్నిటిలోని సంఘర్షణను చిత్రిస్తుంది. మామూలుగా చాలా మందికి అడవి అంటే ప్రశాంతత, సౌందర్యం గుర్తుకు వస్తాయి. అవే కవితా వస్తువులు అవుతాయి. కానీ అడవి అంటే సంఘర్షణ అనే వాస్తవ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం ఈ కవిత ప్రత్యేకత.
అందువల్ల అడవి మీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది అని మొదలవుతుంది. అడవి`ఆకాశం దాకా ఈ దీర్ఘ కవిత విస్తరిస్తుంది. అడవి మీద దండయాత్ర చేయడానికి రోడ్లు నిర్మిస్తున్న భారత రాజ్యం నేల మీద ఆదివాసులను ఎదుర్కోలేక గగన తలం మీది నుంచి బాంబులు వేస్తోంది. యుద్ధం తీరు మారింది. సన్నివేశం మారింది.
అందుకే ఫెలోట్రావలర్ అడవి`ఆకాశం అనే చివరి భాగాన్ని ‘ఇప్పుడిక ఆదివాసీ విల్లంబులకు ఆకాశం లక్ష్యమైంది’ అంటారు. తమ విల్లంబుల గురిని ఆకాశం మీదికి ఎక్కుపెట్టవలసి వస్తుందని ఆదివాసులు ఎన్నడైనా ఊహించి ఉంటారా? వేల ఏళ్లుగా చెట్టు మీది పండు కోసమో, జంతువు కోసమో గురి పెట్టిన ఆ విల్లంబులు ఇక ఆకాశం వైపు ఎక్కుపెట్టి అప్రమత్తంగా పహారా కాయాల్సిన స్థితి వచ్చింది. ఈ దీర్ఘ కవితలో పాఠకులకు ఈ వాక్యం దగ్గర దర్శనం కలుగుతుంది. నేల మీద బతికే ఆదివాసుల గురించి, ఈ నేల మీద వాళ్లు నిర్మిస్తున్న ప్రత్యామ్నాయం గురించి, అట్టడుగు నుంచి వాళ్లు అమలు చేస్తున్న విప్లవ ప్రత్యామ్నాయం గురించి కవి చెబుతూ.. చెబుతూ వాటిని ధ్వంసం చేయాలనకుంటున్న యుద్ధాన్ని ఎదుర్కోడానికి ఆదివాసులు ఆకాశం వైపు విల్లంబులు ఎక్కుపెట్టారని చెప్పడం ద్వారా కవితా పఠనానుభవం కూడా నేల మీదికి బాంబులు విసురుతున్న ఆకాశం దాకా విస్తరిస్తుంది. సరిగ్గా అప్పుడు మనం దండకారణ్యం నుంచి వీర వియత్నాం చరిత్రలోకి వెళతాం. చీమ కాలంత వైశాల్యం ఉన్న ఆ దేశ ప్రజలు బోర విరుచుకున్న అమెరికా గగనతల విమానాలను నేల మీది నుంచే ఎలా కూలగొట్టారో తలపుకు వస్తుంది.
ఆ తర్వాతి చరణంలోనే కవి మనల్ని మళ్లీ దండకారణ్యానికి తీసుకొస్తారు. ‘అడవి ఇప్పుడు రాకెట్ లాంఛరయి, డ్రోన్‌గా మారిన ఆకాశ మార్గాన్ని కూల్చక తప్పదు..’ అని ముగిస్తారు.
గత రాజ్యాలకు ‘పరాక్రమం’, మంది మార్బలం, ఆయుధ సంపత్తి మాత్రమే ఉండేవి. దురాక్రమణకు హద్దులు లేవు. నియమ నిబంధనలు లేవు. విస్తరణ ఒక్కటే లక్ష్యం. కానీ ఇవ్వాళ్టి భారత రాజ్యం అలాంటిది కాదు. దీనిది రాజ్యాంగబద్ధ అధికారం. అది ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఈ అధికారంతోనే చేస్తుంది. అది ఎలాంటి అధికారమో చెప్పి ప్రజాధికారాన్ని కూలదోయడానికి, ప్రజల సంపదను కార్పొరేట్లకు తొవ్విపోయడానికి అడవిపై రోడ్డు దండయాత్ర చేస్తోందని, ఆకాశ మార్గంలో రాజ్యం యుద్ధం చేస్తోందని ఈ కవిత చెబుతుంది. ఈ యుద్ధం వెనుక భారత రాజకీయార్థిక, సాంస్కృతిక, పాలనా, సైనిక, యుద్ధ సంక్లిష్టతలన్నీ ఉన్నాయి. అయినా ఈ యుద్ధంలో ఆదివాసుల పక్షాన నిలబడి రాసిన కవిత కాబట్టి అంత సంక్లిష్టతను కూడా అత్యంత సరళ సౌందర్యశైలిలోకి మలిచారు. తీవ్రమైన ఆగ్రహంతో రాసినప్పటికీ చాల ఆలోచనాత్మకంగా రాశారు. కవిత్వమంటే అనుభూతిని అనుభవంగా మార్చడమే కాదు. ఆలోచనాత్మకం చేయడం కూడా. ఆ అర్థంలో ఇది రాజకీయార్థిక కవిత. వర్తమాన భారత ప్రజల పోరాటాన్ని చిత్రించిన చారిత్రక కవిత. సారాంశంలో ఈ కాలాన్నంతా పట్టుకున్న నిండైన కవిత.