పాణి

రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం.

 రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక పాఠ్యాలు అందరికీ తెలిసినవే. వీటి అమలు సంగతి ఎలా ఉండనీగాక. అవి నమోదై ఉండటమే వాటి బలం. ‘భారత ప్రజలమైన మేము.. మా కోసం మేము..’ ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని ప్రవేశికలో ఉంటుంది. అక్షరాల్లోని ఈ స్ఫూర్తి అపురూపమైనది. ఇలాంటి రాజ్యాంగం ఉన్న దేశంలోని ప్రజలు ప్రభుత్వానికి శతృవులయ్యే అవకాశం ఉన్నదా? ఈ మాట అనడానికి ఆధారాలు ఉన్నాయి. అవి పెరిగిపోతున్నాయి.  ప్రజలకు`ప్రభుత్వానికి మధ్య ఎంత శతృవైరుధ్యం ఉంటే ఈ స్థితి వస్తుంది? ఈ ప్రశ్నలు మనల్ని నిలువనీయవు.
 

భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ఈ దేశ ప్రజలను తన శతృవులుగా భావిస్తున్నది. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చి పడ్డ విపత్తు కాదు. కశ్మీర్‌లో, ఈశాన్య భారతదేశంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ దేశ ప్రజల సర్వంసహాధికారానికి ఎంత చరిత్ర ఉన్నదో అంత ఈ శతృ భావనకు వయసు ఉన్నది. ఇప్పుడు అంత సుదీర్ఘ కథనాన్ని కదిలించబోవడం లేదు. కనీసం రెండు దశాబ్దాలుగా మధ్య భారతదేశంలోని ప్రజలను, ముఖ్యంగా దండకారణ్య ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం తనకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తోంది. దీని కోసం పాత వివరాలను  గుర్తు చేసుకోవాల్సిన అగత్యం లేదు. తాజాగా ఈ నెల 11న భారత ప్రభుత్వం సరిహద్దు దేశాలతో యుద్ధాల్లో వాడే హెలికాప్టర్‌తో దక్షిణ బస్తర్‌లోని పామేడు`కిష్టారం మధ్య ప్రాంతంలో బాంబు దాడులు చేసింది. ఆ రోజు తెల్లవారు జామున, మంచు తెరల్లో గూడేలు, అడవి ముడుక్కొని ఉన్న సమయంలో వాయు మార్గంలో సైనికులు వెళ్లి బాంబులు వేశారు. ఈ దాడుల్లో అడవి దద్దరిల్లిపోయింది. పేలిన బాంబుల శకలాలు చెల్లాచెదరుగా పడ్డాయి. పొట్టం హంగి అనే యువతి మృతి చెందింది. 

గతంలో మానవ రహిత డ్రోన్లు వెళ్లి బాంబులు వేసేవి. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్‌ నెలలో పెద్ద సంఖ్యలో డ్రోన్ల ద్వారా బాంబులు కురిపించారు. ఈసారి ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ చాపర్‌ను కేంద్ర ప్రభుత్వం వాడిరది. ఇందులో కోబ్రా కమాండోస్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లాయని స్వయంగా బస్తర్‌ ఐజి ప్రకటించాడు. 

భారత ప్రజలతో కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత శతృ వైరుధ్యం తలెత్తింది? ఇది ఎట్లా ఇంత భీతావహ స్థితికి చేరుకున్నది?   గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలకు కొనసాగింపుగా ఈ  తీవ్ర రూపం ఎలా తీసుకున్నది?

  సైనిక విషయాలు కనీసంగా తెలిసిన వాళ్లయినా దీన్ని యుద్ధమనే అంటారు. సరిహద్దు దేశాలతో యుద్ధాలకు కూడా అంతర్జాతీయ సూత్రాలు ఉంటాయి. యుద్ధ నియమాలు ఉంటాయి. బడుగు దేశాల మీద ఏక పక్ష దాడులు ఎన్నయినా జరగవచ్చు.. కానీ ఒక దేశం మీద మరో దేశం దాడినే  ఎవ్వరూ అంగీకరించరు. అలాంటి ప్రజాస్వామిక చైతన్యం ఇవాళ ప్రపంచమంతా ఉన్నది. ఇలాంటి  చోట ఒక ప్రభుత్వం తనకు అధికారాన్ని అప్పగించిన ప్రజల మీద, రాజ్యాంగం ద్వారా అసలైన రాజకీయాధికారం దఖలు పడి ఉన్న   ప్రజల మీద తానే యుద్ధానికి వెళ్లింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, దృక్పథాలు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేదే కాదు. సమాజంలో భిన్న ప్రయోజనాలు ఉన్న సమూహాలు ఉంటాయి. భిన్న దృక్పథాలు కూడా ఉంటాయి. కానీ ప్రజలను శతృవులుగా భావించే స్థితి ప్రభుత్వానికి ఉన్నదంటే ఆ సమాజం ఎంత ప్రజాస్వామికీకరణ చెందినట్లు? సమానత్వం, ప్రగతి ఎంత సాధించినట్లు? ఇలాంటి ఎన్ని  బలవత్తర కారణాలతో ప్రభుత్వం ఇలాంటి నీతి బాహ్యమైన, రాజ్యాంగ విరుద్ధమైన, అమానుషమైన యుద్ధ చర్యలు కొనసాగిస్తున్నది?  

ఇవన్నీ ఆందోళన కలిగించే ప్రశ్నలు. భారత భూభాగం మీద అధికారం ఉన్న ప్రజలకు స్థానికంగా తమ అవసరాలేమిటో, వాటిని ఎలా తీర్చుకోవాలో ఆలోచించుకొనే స్వేచ్ఛ ఉంటుంది.  దండకారణ్యంలో ఆదివాసులు ఆ స్వేచ్ఛను కోరుకోవడం భారత ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఆదివాసుల జీవన శైలిలోనే ప్రకృతి వనరుల పరిరక్షణ ఉన్నది. బహుశా ఆదివాసీ, గ్రామీణ, పట్టణ జీవన విధానాల్లో అతి తక్కువగా సహజ వనరులను వాడుకొనే అలవాటు ఆదివాసులకే ఉంది. దేనికంటే సహజ వనరులను ఆదివాసులు వినియోగ వస్తువులుగా చూడలేరు. తమ సాంస్కృతిక నైసర్గిక జీవితంలోంచి వేరు చేయలేని భాగంగా సహజ వనరులను చూస్తారు. దీనికి పూర్తి భిన్నమైన పెట్టుబడి తర్కంతో  కార్పొరేట్‌ కంపెనీలు అడవిలోకి వెళ్లడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రకృతి మొత్తాన్ని సరుకులుగా, లాభాలుగా మార్చుకోవాలనే రాజకీయార్థిక వ్యూహాన్ని ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఇది భారత రాజ్యానికి తీవ్రమైన కోపం తెప్పించింది. 

రాజ్యాంగం ప్రకారం రాజకీయాధికారం ప్రజలదే కావచ్చు. ఈ భూభాగం మీద సార్వభౌమాధికారమూ వాళ్లదే కావచ్చు. కానీ రాజ్యాంగ యంత్రం మీద అధికారం మాత్రం కార్పొరేట్లదే. వాళ్ల ప్రయోజనాలు నెరవేర్చే విషయంలో పాలకులు తరచూ భంగపడుతున్నారు. అదీ ఆదివాసుల చేతిలో. కనీసం ముప్పై ఏళ్లుగా ఈ సంకుల సమరం సాగుతున్నది. ఆదివాసులు తమ ప్రాచీన సాంఘిక సాంస్కృతిక మూలాలను మార్చుకుంటూ ఆధునిక, హేతుబద్ధ జీవన విధానంలోకి మారుతున్నారు. మానన సమాజాలు ఎప్పటికైనా సాధించవలసిన ప్రగతిదాయక పరివర్తన ఎలా ఉండాలో వాళ్లు ఒక విస్తృత సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక ప్రయోగం చేస్తున్నారు. ఆ చైతన్యానికి ప్రకృతి పరిరక్షణ అనే కోణం ఉన్నది.  తమకేగాక ఈ దేశ ప్రజలందరికీ చెందిన సహజ వనరులు పిడికెడు కార్పొరేట్ల పరం కావడానికి వీల్లేదనే ఇంకో ముఖ్యమైన కోణం ఉన్నది. అందువల్ల వాళ్లు  అడవిలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్లను నిలేస్తున్నారు. గత ఇరవై ఏళ్లలో దండకారణ్యంలోకి కార్పొరేట్ల చొరబాటు ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ ప్రతిఘటన ఉన్నది. లక్షల సైన్యాన్ని వెంట  తెచ్చుకొని ఎన్ని కంపెనీలు అడవిలోకి ప్రవేశించాయో అంతకంటే ఎక్కువ వెనుతిరిగి పారిపోయాయి. ఈ సంఘర్షణలో అడవిపై ఆదివాసుల హక్కులు బలైపోయాయి. గ్రామ సభల అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించే వీల్లేదనే స్థానీయుల అధికారం కొల్లగొట్టబడిరది. దేశాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగా మొదట అడవిని కార్పొరేటీకరించడానికి పాలకులు ప్రయత్నించారు. దానికి ప్రతిఘటన రావడంతో సైనికీకరిస్తున్నారు. 

భారత రాజ్యానికి ఉన్న అనేక సైనిక విభాగాల్లో ఇప్పటికే దండకారణ్యంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నాయి. అదంతా నేల మీద జరిగే యుద్ధం. భూమి మీది వనరులను, భూ గర్భంలోని అపార సంపదను కొల్లగొట్టడానికి అవసరమైన ఆకాశంలోంచి బాంబులు వేస్తామని భారత ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అమలు చేస్తున్నది. నేల మీద భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసలు నిరాయుధంగా ఎదుర్కొనే మెలకువలను, అవగాహనను సంపాదించుకున్నారు. ఏడాదిన్నరగా దండకారణ్యమంతా సిలింగేర్‌ పోరాట స్ఫూర్తితో సైనికీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం జరుగుతున్నది. కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా మహత్తర సాంస్కృతిక పోరాటం సాగుతున్నది. దీంతో భారత ప్రభుత్వం ఇక లాభం లేదని అనుకున్నట్లుంది. నేల మీది యుద్ధానికి సమాధానంగా నిరాయుధ ప్రతిఘటనలో ఆరితేరిన ఆదివాసులపై ఇక బాంబింగ్‌ తప్పదని భావించినట్లుంది. గత ఏప్రిల్‌లో  డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆకాశంలోంచి బాంబులు విసిరింది. విచిత్రమేమంటే  దాదాపు ఈ పది నెలల్లో భారత ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన  కార్పొరేట్‌ సంస్థలు నేల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి. అవి ఆక్రమించుకోవాల్సిన కొండలు, గుట్టలు, గూడేలు, నదులు ఆపారంగా కనిపిస్తున్నాయి. వాటిలోంచి పిడికెడు కూడా సొంతం కావడం లేదు. ఈ స్థితిలో కార్పొరేట్‌ సంస్థలకు, వాటి తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత కోసం, ఎంత అసహనం? నేల మీద అధికారం సంపాదించుకోడానికి గగన తలంలోంచి యుద్ధం చేయక తప్పడం లేదు.    

రాజ్యాంగం ప్రకారం ఆదివాసులు ఈ దేశ పౌరులే కావచ్చు. ఈ మట్టి బిడ్డలే కావచ్చు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కార్పొరేట్‌ స్వామ్యంగా మారిపోయాక ప్రభుత్వానికి ఈ  యుద్ధం అనివార్యమైంది. ఆదివాసులు దీన్ని ఎలా ఎదుర్కొంటారనేది పూర్తిగా వేరే ప్రశ్న. భారత రాజ్యానికి మాత్రం ఇది తప్పించుకోలేని యుద్ధంగా మారింది. సమాజం లోపల ఉండే సంక్లిష్టమైన వైరుధ్యాలు సరే. రాజ్యానికి`ప్రజలకు మధ్య ఇంత శతృపూరిత వైరుధ్యాన్ని వెనుకటి తరాల వాళ్లు అనుకొని ఉండరు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించి ఉండరు.  భారత ప్రజాస్వామ్యం ఇక్కడి దాకా ప్రయాణించింది. పాము తన పిల్లలను తానే తింటుందని అంటారు. అది నిజమే అయితే కేవలం అది ప్రాకృతిక స్వభావం. భారత రాజ్యం తన ప్రజలపై తానే యుద్ధం చేయడాన్ని కార్పొరేట్‌ స్వభావం అనవలసి ఉంటుంది. కాకపోతే యుద్ధంలోని రెండు పక్షాలు మీరు ఏవైపు ఉంటారని అందరినీ అడుగుతూ ఉంటాయి. ఈ యుద్ధం కూడా అంతే.

Leave a Reply