సత్యం
**
సత్యమిపుడు
సంకెళ్ల కింద
రక్తమోడుతూ ఉండవచ్చు
జైల్లో
అండా సెల్లో
అనారోగ్యంతో
కునారిల్లుతూ ఉండవచ్చు
ముస్లిం మొహల్లాలలో
మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో
ఇరుకిరుకు బతుకుల్లో
కప్పబడి ఉండవచ్చు
అడవిలో గూడేల్లో
కాల్చిన బూడిద కుప్ప కింద
ఊపిరాడక గింజుకోవచ్చు..
ఇంద్రావతి అలల మీద
శవమై తేలి యాడ వచ్చు
కోర్టు మెట్ల మీద
దిగాలుగా కూర్చుని
దిక్కులు చూస్తుండవచ్చు
అనేకానేక
కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద
శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద
ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు
దాన్ని సముద్రంలో ముంచండి
నిప్పుల్లో కాల్చండి
ఏడేడు నిలువు ల లోతున
భూమి లోపల పాతిపెట్టండి
అది లేస్తుంది
రూపాల్ని మార్చుకొని
కాలాన్ని జయించి
ఖండాంతరాల దాటుకొని..
నిన్న నాటిన రక్తపు బొట్టు
నేడు అక్షరమై మొలకెత్తుతుంది
ప్రపంచపు గుండె మీద
ప్రజా హాననపు
దారుణ మారణ రహస్యాల్ని అతికించి
చూపుడువేలై
నియంతల నిగ్గదీస్తుంది
జాతి
సిగ్గుతో తలవంచు కుంటుంది
బిల్కిస్ బానో
ప్రజాస్వామ్యమింకా మిగిలేఉంది
       సి.వనజగారికి కృతజ్ఞతలతో
పిచ్చిది
 **
ఓ పాడుబడ్డ స్కూలు
పిచ్చిదానిఇల్లు

టెంకాయచిప్పలు,ఇటుకలు,మాసిన బట్టలు
అదే సామ్రాజ్యం
ఆమే అధిపతి

ఓ జనవరి చలిరాత్రి
ఏఉన్మాదానికో విందై పోయింది..

పిచ్చిదాని అరుపులు
అనంత శూన్యంలో కలగల్సి పోయాయి
సామ్రాజ్యం కుప్నగూలింది

బైట పొగమంచు
లోపల గాఢాంధ కారం


మూలం..pagli
By ..moumita alam


మనం కథల్ని మనమే చెప్పుకోవాలి
       ***
మనం వ్యూహం
రాజ్యాన్నెదిరించడమేగాదు
ఊపిరాడని పట్టుతో
ఉక్కిరిబిక్కిరి చేయాలి. .

ఆక్సిజన్ అందకుండా చేయాలి
మోసాల్ని అపహాస్యం చేయాలి
అది సిగ్గుతో తొలగించుకోవాలి..

మన సమస్త కళల్తో
మనం సంగీతంతో
మనం సాహిత్యంతో
మనమొండిధైర్యంతో
మృత్యువునాహ్వానించే చిరువ్వుతో
మన మేధా సంపత్తితో
మనం అవిశ్రాంత కృషితో
ఆకలికింద,అవమానంకింద
 చరిత్రకెక్కని శతాబ్దాలదమన కాండ కింద
రక్త మోడిని చరిత్రను చెప్పుకోవాలి..

రాజ్యపు గిలెటిన్ కింద
తెగిపడ్డ తలల 
చివరి సందేశాన్ని ఎత్తి పట్టాలి. 

మనం కథల్ని మనమేచెప్పుకోవాలి

నిన్నటి కంటే 
భిన్నంగా,కొత్తగా,శక్తి వంతంగా
ఆగామియుగాల వైతాళిక గీతాల్లా....
      ******

 అరుంధతీ రాయ్ వాక్యాలకు కవిత్వీకరణ...
పండగెట్లా జేతునే
     ***

చేతులాడకున్నవే-- నాచెల్లేల చెంద్రమ్మా
పండగెట్ల జేతునే -- నాచెల్లేల చెంద్రమ్మా..(2)

    పొలావుజేద్దమంటే -- పొలాలు యాదికొచ్చె
    చీడపీడల తగిలి. --- పంటతెగులు యాదికొచ్చే
        పండగెట్ల జేతునే-- సిన్నంబాయి సాయమ్మ
        బత్కు ఆగమాయెనే-- సిన్నంబాయి సాయమ్మ
                     " చేతులాడకున్నవే " (2)

    చికెను తెద్దమంటే. -- సిమెంటు గుమ్మి యాదికొచ్చే
    గుప్పూ గుప్పునా ఇడిసే -- విషవాయువు యాదికొచ్చే
           పండగెట్టజేతునే -- కన్మనూరు సెన్నమ్మ
           బత్కు ఆగమాయెనే -- కన్మనూరు సెన్నమ్మ
                     " చేతులాడకున్నవే "(2)

     సకినాలు జేద్దమంటే -- మన్నెవాగు యాదికొచ్చే
     విషకాలుష్యంగలిసి -- గత్తరలేసినట్లాయె
          పండగెట్ల జేతునే -- అల్లీ పురం ఎల్లమ్మ
          బత్కు ఆగమాయెనే -- అల్లీ పురం ఎల్లమ్మ
                       " చేతులాడ కున్నవే "(2)

    నువ్వుల రొట్టెలు గొడ్దమంటె -- నడ్సినబాటలు యాదికొచ్చె
    పంచుకున్న ,దించుకున్న -- అనుభవాలు యాదికొచ్చె
          పండగెట్ల జేతునే -- బాయి కాడి బూవమ్మ
          బత్కు ఆగమాయెనే -- బాయికాడి బూవమ్మ
                     " చేతులాడకున్నవే "(2)

చీడలంట పీడలంట -- పీల్చే గాలి కరువంట
సాగునీరు తాగునీరు -- ఇసమెక్కి పోతాయంట
దారులన్ని మూతవడి- చీకటి మిగిలి పాయె
పచ్చని బతుకుల్ల. -- సిచ్చు వట్టె సర్కారొచ్చె

    చేయీ చేయి గలుపవే -- చిత్తనూరు చిన్నమ్మ
      కంపెనీ ని సాగనంపుదమే -- చిత్తనూరు చిన్నమ్మ
         మన ఊరిని గాపాడుకుందమే. -- చిత్తనూరు చిన్నమ్మ
          మన బత్కును గాపాడు కుందమే- చిత్తనూరుచిన్నమ్మ
                   14_01_23

Leave a Reply