దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలా
ఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు.
చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి. స్థల, కాలాలు కడజూఆ వాస్తవమైనవి. రచయిత కాల్పనికత చంద్రవంకలో ఉండదు. నవలలోని పాత్రలు, అవి నడిచిన తీరు, ఆ పాత్రల వ్యక్తీకరణలు తెలుగు ప్రాంతంలో జరిగిన రెండు సంఘటనలో వ్యక్తావ్యక్త రూపం.
కారంచేడు, చుండూరు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అమానవీయ ఘటనలు. రెండు ఘటనలకు కోస్తా ప్రాంతపు ఆధిపత్యమే కాదు, వర్గస్వభావమే కాదు, రెండు ఆధిపత్య కులాలు. అవి పాలకవర్గ కులాలుగా వుండటం అనేది గమనించవలసిన అంశం. భారత సమాజం కుల వైవిధ్యమున్న సమాజం. అంతరాల సమాజం. అభ్యుదయ, ప్రగతిశీల శక్తులు వాటి మధ్య ఉన్న అంతరాలు తొలగేందుకు, తమ శక్తిమేరకు పనిచేసినా మరింత బలంగా కులాధిపత్యం బహుముఖాలుగా విస్తరిస్తున్న దశ. చంద్రవంక నవలను ఈ కోణం నుండి చూడవలసిందే. భారతీయ సమాజంలో కులపీడన ప్రధాన అంశం. ఎవరైతే పీడితులు వున్నారో తరతరాలుగా అనుభవిస్తున్న పీడన చివరకు హింసాయుతంగా మారుతున్న సందర్భంలో హింస కూడా అత్యంత పాశవికమైనదిగా మారినప్పుడు కులవివక్షను ఎదుర్కోవడానికి అణగారిన కులాల వద్ద వున్న చిట్టచివరి ఆయుధమేమిటి? తమ చుట్టూ వున్న సామాజికావరణ, మేధోవంతమైన సమాజం తమకు ఇస్తున్న ఊతమేమిటి? వివక్షకు గురి అవుతున్న సమూహం నుండి అనేక చంద్రవంకలు ఎట్లా గొంతు విప్పుతున్నాయి?
చంద్రవంక ఒక కాలపు వ్యక్తీకరణ మాత్రమే కాదు. ఒక ప్రాంతపు ఆధిపత్యం మాత్రమే కాదు. మొత్తంగా తమ సామాజికావరణ ధ్వంసం అయినప్పుడు లేచి నిలబడ్డ మనుషుల చరిత్ర. ఆ చరిత్ర వెనుక వున్న వర్గం, కులం వీటిద్వారా చైతన్యీకరించబడిన సమాజం. ఈ పెనుగులాటలో రచయిత ఒక భాగం. కళ్ళ ముందటి అమానవీయ చరిత్రకు దాని గమనా గమనాన్ని చూసి వెలుపలికి రాలేదు. ఒక దారి చేస్కోని ముందుకు వెళ్ళాడు. కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి కారంచేడు, చుండూరు చరిత్రలో నమోదయిన ఘటనలు. కేవలం ఇవి ఘటనలు మాత్రమేనా? వేలాది సంవత్సరాల కుల దాష్టీకానికి, దౌర్జన్యానికి కొనసాగింపు. ఆ కొనసాగింపు హింసాయుత రూపం, సామూహిక రూపం తీసుకోవడమే అసలు విషాదం. మొత్తం ఘటనలకు ఎజ్రాశాస్త్రి బయట వ్యక్తి కాదు. నిజానికి ఒకనాటి మౌనసాక్షి. హృదయం నిండా అలుముకున్న చీకటిని ధ్వంసం చేస్కోని ఒకనాటి చీకటి కోణాన్ని, తదనంతరం వెలిగిన ఉద్యమ కోణాన్ని ఆవిష్కరించాడు. ఎక్కడ రచయిత వెలుపలి వ్యక్తి కాదు. చరిత్రలో నమోదయిన అనేక గొంతులును, వాటి చలనాల్ని చంద్రవంక నవలలో నమోదు చేసాడు. కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. కొందరు మార్గమధ్యంలో తప్పుకున్నారు. కొందరు కొనసాగుతున్నారు. ఈ మొత్తం పరిణామ క్రమం రచయిత అంతరంగంలో వున్నదే. విస్తృతమైన నవలా ప్రక్రియలోనే వాస్తవమైన అంశాన్ని తీసుకు రాగలిగాడు. కాలంతోపాటు కొన్ని కనుమరుగవుతాయి. అయినా ఒక ఉద్యమం అందించిన స్ఫూర్తికి స్థల, కాలపరిమితులుండవు. ఈ విషయం రచయిత అవగాహనలో వున్నదే. కారంచేడు, చుండూరు దౌర్జన్యం రెండు అగ్రకులాల ఆధిపత్యం మాత్రమేనా? ఆ ఆధిపత్యం ఇవాల్టికీ కొనసాగుతున్నది. పాలితుల రూపంలో అయితే పీడితులు అధికారంలోకి వస్తే ఈ పీడన తొలగిపోతుంది అనే చర్చ కూడా భారత సమాజంలో జరుగుతుంది. కేవలం రాజ్యాధికారం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం కాలేదు. ఒక మేధోప్రపంచం తనకున్న జ్ఞానంతో సామాజికావరణలో పనిచేయగలగాలి. చంద్రవంకలో ఆ దృష్టి వుంది. చంద్రవంక చుట్టూ వున్న మనుషులలో ఆ వెలుగు వున్నది. ఆ వెలుగు చుట్టూ అనేక మంది చేరతారు.
ఇవాల్టికీ దేశంలో కారంచేడు, చుండూరు వంటి ఘటనలు నమోదు కావడం లేదా? అనే ప్రశ్న రావొచ్చు. వాటిని ఎదుర్కొనే శక్తులు బలంగా వున్నాయా అనే సందేహం రావొచ్చు. వీటన్నిటికి ప్రగతిశీల ఆలోచనా ధార గల శక్తులు సమాధానం చెప్పాయి. భారతీయ సమాజం అత్యంత మెళుకువతో వున్నది. ఇప్పటికే తగిన మూల్యం అణగారిన వర్గాలు చెల్లించాయి. ఇక ఎంత మాత్రం మౌనంగా వుండలేం అనే తాత్వికత చంద్రవంక నవలలో నమోదయింది.
ఇదంతా చూడటానికి, ఆలోచించడానికి, ఒక స్వరాన్ని వినిపించడానికి ఒక సూచనగా వున్న చంద్రవంకలో రచయిత మాల మాదిగల మధ్య వున్న వర్గీకరణను చర్చించాడు. అణచబడిన స్వరం నుండి మళ్ళీ తమదయిన అంతర్గత చర్చను ప్రజాస్వామీకరణ గొంతుతో స్పృశించాడు. అనేక ఉద్యమాల నుండి చైతన్యవంతమైన తరం తమ మాటేమిటి? అని ఇవాళ అడుగుతున్నది. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎ.బి.సి.డి. వర్గీకరణ అనే అంశం ముందుకు వచ్చింది. ఒక సున్నితమైన భావోద్వేగ అంశం మాత్రమే కాదు. రెండు సామాజిక వర్గాలు అంబేద్కర్, జగజ్జీవన్‌రాంలు చూపిన వెలుగులో పరిష్కరించుకోవాల్సిన అంశం. ఎక్కడా దుందుడుకు లేకుండా ద్వేషభావం లేకుండా మూడు దశాబ్దాలుగా ఈ ఉద్యమం కొనసాగుతుందో ఇదొక పార్శ్వం మాత్రమే. మాల, మాదిగల ఉమ్మడి పరిష్కారంలో ఈ అంశం ఇమిడి వున్నది. అయితే దానివెనుక రాజకీయ ప్రయోగం కూడా వున్నది. రెండు సామాజిక వర్గాలు రాజకీయ సమిధలుగా మారుతున్న ఎన్నికల తీరు కూడా వున్నది. ఎజ్రాశాస్త్రి చంద్రవంకలో అనేక సామాజిక
ఉద్యమాల చలనాన్ని చెప్పినట్లుగానే వర్గీకరణ అంశం గురించి కూడా మాట్లాడాడు. ఇక్కడ కీలకాంశం రచయిత సున్నితత్వంలో వ్యక్తమయింది. రెండు సామాజిక వర్గాల మధ్య వుండే దగ్గరతనం మాత్రమే కాదు. వారి మధ్య ఐక్యత మాత్రమే కాదు. ఎదుటి వర్గం ముందు రచయిత సానుకూలంగా తన ప్రతిస్పందనను ఉంచాడు. ఆలోచనాపరుడైన రచయిత ఇంతకంటే ఎట్లా స్పందించగలడు. భారత సమాజంలో వర్గీకరణ అంశం కేవలం శత్రు శిబిరాలుగా విడిపోవడం కాదు. మొత్తంగా వర్గీకరణ వెనుక ఉన్న అసమానతను చర్చకు పెట్టాడు. ఇక తేల్చుకోవాల్సింది మనమే. దానికి అనేక ఆర్థిక, సాంస్కృంతిక కారణాలు వున్నాయి. దానినుండి బయటపడాలి. రెండు శత్రువర్గాలుగా చీలిపోకూడదు అనేది చంద్రవంక ఆలోచన మాత్రమే కాదు, రచయిత ఎజ్రాశాస్త్రిది కూడా.
చంద్రవంక సామాజిక నవల. అంతరాల సమాజంలో తన పుట్టుక ద్వారా నమోదు కాబడిన రచయిత స్వరం చదువరి, అనేక పోరాటలలో నడిచిన వ్యక్తి. సామాజిక అంతరంగాన్ని అనువర్తించుకున్నాడు. రచయిత జననం తూర్పు గోదావరి జిల్లా అయినా ప్రకాశం జిల్లా యాసను చంద్రవంకలో పలికించాడు. తనదయిన సాంస్కృతిక నేపథ్యం వున్న నేల. రాజకీయ సాంస్కృతిక పునాది గలిగిన నేల. ఆ ప్రాంతం నుండి వచ్చిన రచయిత నవలా శిల్పంలో పరిణతి సాధించాడు. చంద్రవంక రాజకీయార్థిక నవల. దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ఒక పోరాట చరిత్రను బహుముఖాలుగా చర్చించాడు. నిజానికి ఇటువంటి కథాంశాలు ఇంకా ఎక్కువగా తెలుగు సాహిత్యావరణలోకి రావాల్సిన అవసరముంది. నిజానికి ఆ పనిని దుగ్గినపల్లి నిజాయితీగా చేస్తున్నారు. ఒక ప్రతిస్పందన, సామాజిక అంతర్గతనలోకి దారిచేస్కోని వెళ్ళవలసి వున్నది. సజీవ పాత్రల చుట్టూ అల్లిన నవల వర్తమాన కాలాన్ని, దానియొక్క వ్యక్తీకరణలను అత్యంత ధైర్యంగా, మెళకువలతో రికార్డు చేసాడు. రచయిత ఎజ్రాశాస్త్రి ఒక బాధ్యతను నిర్వహించాడు.