‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది.

‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన ‘తురక తెలుగులా’.  . తను వచ్చిన పని పూర్తయ్యే వరకు కలిసే ఉన్నాము. చివరికి ఇక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అలా 2011 నుంచి ఇక్కడి ఉద్యమంలో భాగమయ్యాడు. జిల్లా కమిటీ స్థాయికి పరిణితి చెందాడు. మాస్ వర్కు పై పట్టు సంపాదించాడు. ఎంత పట్టంటే ముందు నుంచి పని చేస్తున్న కామ్రేడ్స్ కన్నా.

‌ఒక క్యాంప్ తయారీ పనుల సందర్భంగా కా. అనిల్ సురేష్ పేరుతో పరిచయం అయ్యాడు. అట్టా కలిశాడు. ఇట్టా విడి పోయాడు. మళ్ళీ చాలా రోజులకు కలిశాడు. చేత్తో బర్మారుతో. అప్పుడే నిర్మాణమైన మిలీషియాలో సభ్యుడయ్యాడు. ఒద్దికగా కూర్చుని మిలీషియా లక్ష్యాన్ని, కర్తవ్యాలను శ్రద్ధగా విన్నాడు. కొద్ది రోజులకు జరిగిన మిలిటరీ ట్రైనింగులో పాల్గొన్నాడు. ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విషయాలను మరీ, మరీ అడిగి తెలుసుకున్నాడు. అప్పట్నుంచి క్రమం తప్పకుండా మిలీషియాతోనే ఉన్నాడు.

‌కా. రైను, అనిల్ ఇద్దరిదీ ఒకే రకమైన స్వభావం; ఒకే రకమైన గుణాలు కలిగిన నిండు పున్నమి చంద్రులు. తాము నమ్మిన విషయాలపై ఎటువంటి గందరగోళం, ఊగిసలాట లేని స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు. ఉద్యమంలోకి పూర్తి కాలం రాకముందు ఇద్దరూ మిలీషియాలో పని చేశారు. పెద్ద, పెద్ద గ్రామాలు తిరిగారు. రోడ్డు, క్యాంప్ కు దగ్గరున్న గ్రామాల జనాన్ని కలిశారు. వారి బాధలను విన్నారు. వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. 2006 సం. లో కా. రైను ఉద్యమంలో భాగమైతే, కా. అనిల్ 2012 సంవత్సరంలో  భాగమయ్యాడు. ఎక్కడికంటే అక్కడికి బదిలీ అయ్యారు. ఉద్యమ అవసరాల రీత్యా. తక్కువ సమయంలోనే భౌగోళిక పరిస్థితిని, ప్రజల పరిస్థితిని ఆకళింపు చేసుకున్నారు. స్వతహాగానే ప్రజలు మాట్లాడే భాషల మీద పట్టు ఉండటంతో వారిలో తొందరగా కలిసి పోయారు. వారిని సంఘటితం చేశారు, వారిలో ఉద్యమాన్ని  నిలబెట్టారు.

‌అమరుల జీవితాలన్నీ సమాజంలోని దోపిడీ విధానం నుండి మొదలుకొని వాటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు-వాటిపై అమలైన అణచివేత, సాంఘిక ఆచారాలు మొదలైన అనేక విషయాలు కళ్ళకు కడతాయి. అలా ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకమైన ప్రేరణతో, ఆదర్శంతో మన ముందు నిలుస్తుంది.

‌కాంకేర్ జిల్లా ఆంతాగఢ్ బ్లాక్ ఎడనార్ పంచాయతీ, గ్రామంలో ముప్పై రెండు సంవత్సరాల క్రితం కా. రైను జన్మించాడు. తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన పేరు బల్లి. పాడి (గోత్రం) హురా.  కా. రైను కు మరొక పేరు కూడా ఉంది. అదే ‘అశోక్’. ఆర్.కె.బి. డివిజన్ లో ఆ పేరుతోనే ప్రజలకు చిరపరిచితుడు. కాంకేర్ జిల్లా ఆంతాగఢ్ బ్లాక్ పెన్‌జోడ్ పంచాయతీ లోని మడమ్ గ్రామంలో ఇరవై ఏడు సంవత్సరాల క్రిందట కా. అనిల్ జన్మించాడు. ఇడ్కో పాడి కుటుంబంలో పుట్టిన కా. అనిల్ కు తల్లిదండ్రులు ప్రేమగా ‘సురేష్’ అని నామకరణం చేశారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే.  ఇద్దరూ కేసకల్ ఏరియా వారే. 

కేసకల్ ఏరియాకు ఎంతో మహోన్నత చరిత్ర ఉంది. ఆ పుడమి తల్లి ఎంతో విలువైన  ప్రకృతి – ఖనిజ సంపదలకు పుట్టినిల్లు. 1910 మహాన్ భూమ్‌కాల్ పోరాటంలో తాడోకి, ఆమబేడ దాని చుట్టుపక్కల గ్రామాలు ముఖ్య భూమిక పోషించాయి. ఆ పోరాటపు వారసత్వంగా ఉద్యమం  కేసకల్ ఏరియాకు విస్తరించి ప్రజలను ఐక్యం చేసింది. మాంజీలు, జమీందారులు అక్రమంగా సంపాదించిన భూములను ‘దున్నే వానికే భూమి’ నినాదంతో పోరాటం చేసి పేద ప్రజలకు పంపిణీ చేసింది. తరతరాలుగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న బక్క పేగులకు అండగా నిలబడింది. రావ్‌ఘాట్, కువ్వేమారి, బుధియారి మాడ్ గనులపై సర్వాధికారాలు మూలవాసీ ప్రజలకే చెందాలని అమరుడు కామ్రేడ్ సుఖదేవ్ దాదా నాయకత్వంలో వేలమంది ప్రజలు పోరాడి గనుల తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేసిన చరిత్ర కేసకల్ కు ఉంది.  ఆ పోరాట స్ఫూర్తికి ఉత్తేజితులైన కామ్రేడ్స్ రైను, అనిల్ లు విప్లవోద్యమ బాట పట్టారు.

    ఇద్దరూ వేరు వేరు ప్రాంతాల్లో పని చేసి ఆ తర్వాత కువ్వేమాడ్ ఏరియాలో పనిచేశారు. కువ్వేమాడ్ ఏరియాలో ఉన్న నిర్వాసిత సమస్యకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేశారు. ప్రజా పోరాటాలు, మిలిటెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టారు. అడ్డం వచ్చిన పెత్తందారులను, ఏజెంట్లను అడ్డు తొలగించారు. ‘జల్-జంగల్-జమీన్’ పై సర్వాధికారాలు ప్రజలవే అన్న పోరాట స్ఫూర్తిని అందించారు.

‌ ఉద్యమ అవసరాల్లోంచి తమ రాజకీయ అవగాహనను పెంచుకున్నారు. ఉద్యమం ముందున్న సవాళ్ళను సూటిగా, స్పష్టంగా చర్చించారు. ఇతరులను ఆలోచింప చేశారు. ఉద్యమ అభివృద్ధికి తమ వంతు పాత్రను నిర్వహించారు. ప్రజల, కార్యకర్తల  ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. పేద ప్రజలను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించారు.   ఫైరింగ్స్ లలో కూడా అంతే. ఏమాత్రం వెనుకడుగు వేయని సాహసులు. భుజానికి గాయమయ్యి లేవలేని పరిస్థితుల్లో కూడా చుట్టుముట్టిన శత్రు వలయం నుండి తప్పించుకున్న ఘటనలు కా. రైను విప్లవ జీవితంలో ఎన్నో.

‌పెద్ద, పెద్ద మార్క్సిజపు గ్రంథాలు చదివి విప్లవోద్యమ   అత్యున్నత స్థాయిలో పని చేసిన కోబాడగాంధీ  ఉద్యమం  మీదే బురద చల్లి  బహిష్కారానికి గురైతే, అటువంటి పెద్ద గ్రంథాలు చదవకున్నా  బతుకు పాఠాన్ని (సిద్ధాంత సారాన్ని) ఆకళింపు చేసుకున్న  కా. రైను, అనిల్ లు  ఉద్యమ   ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడారు;  కమ్యూనిస్టు విలువలను-ఆదర్శాలను ఎత్తిపట్టారు.

‌’కొన్ని పనులకు కొందరే సూటవుతారు’ అప్పుడప్పుడు అమ్మ అనేది. నిజం కూడా. నూటికి నూరుపాళ్ళు. ఈ మాట కా. రైను, అనిల్ లకు చక్కగా సూటవుతుంది. ఆచరణలో దాన్ని అనితర సాధ్యం చేశారు కూడా. అందుకే వారు లేని లోటును జీర్ణించుకోవటమంటే మనసు బరువుగా, భారంగా అనిపిస్తుంది.

‌కా. రైను సమయ స్ఫూర్తి, పనుల ప్లానింగ్ కాలానికి సరిగ్గా అద్దినట్టు అనిపించేది. తను టీమ్ లో ఉన్నాడంటే అందరికీ ధైర్యంగా ఉండేది, నూతనోత్సాహం కలిగేది. కొద్దిమంది కామ్రేడ్స్ కైతే ‘రైను ఉన్నాడు గదా!’ అనే భరోసా ఉండేది. అందుకే కా. రైను బదిలీ ప్రస్తావన ముందుకు వచ్చినప్పుడు ‘రైనూ! బదిలీని అస్సలు ఒప్పుకోవద్ద’ని మనసులో ఎన్నిసార్లు అనుకున్నానో? మళ్ళీ అంతలోనే ‘ఉద్యమ అవసరం కదా!’ అనిపించేది. అలా తను ఉన్నంతకాలం, కలిసిన ప్రతిసారి.

‌ ‘కమ్యూనిస్టుగా తయారవ్వటమే కాదు, చివరి వరకు ప్రజల కోసం జీవించేవారే అసలైన కమ్యూనిస్టు’ అన్న కామ్రేడ్ లెనిన్ మాటను తుచ తప్పకుండా ఆచరించారిద్దరు. కాబట్టే తమని రిక్రూట్ చేసినవారు, తమతో పాటు రిక్రూట్ అయిన వారు రాజకీయ పతనం అయ్యి పార్టీకీ, ప్రజలకు ద్రోహం తలపెట్టినప్పుడు, వాటికి వెరవక శత్రువుకు సూటిగా సమాధానం చెప్పారు, అమరుల ఆదర్శాలను తుదకంటా ఎత్తి పట్టారు. 

‌వర్గ పోరాటమే ఏకైక మార్గమని విశ్వసించిన కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఉద్యమ ఎగుడు-దిగుడులను భౌతికవాద దృక్పథంతో అర్థం చేసుకున్నారు. ఎంతటి నిర్భంధమైనా వ్యూహాత్మకంగా కాగితం పులి లాంటిదేననే వాస్తవాన్ని  తమ అనుభవం నుండి గ్రహించారు. దాని కనుగుణంగా ఎత్తుగడలు రూపొందించారు.  మరో ముందడుగు వేయటానికి సిద్ధమయ్యారు.

‌వర్గ శత్రువును నిర్మూలించటంలో ఏమాత్రం వెనుకడుగు వేయని వర్గ ప్రేమికుడు కా. రైను. అమరత్వం, వర్గ కసి అందరికీ ప్రేరణదాయకం. 

‌నిరంతరం కష్టించే స్వభావం, నిరాడంబరత, మాటల్లో సూటిదనం, చిన్నా, పెద్దా అందరితో కలిసిపోయే గుణం, తమకంటూ ప్రత్యేకంగా ఆలోచించని నైజం…నిండుగా ఉన్న కా. రైను, అనిల్ ల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. నేడున్న ఉద్యమ పరిస్థితికి వారి సేవలు ఎంతో అవసరం. ఉద్యమం కూడా అటువంటి వారినే డిమాండ్ చేస్తున్నది..

‌ప్రజలతో మమేకమై, విప్లవమే జీవితంగా జీవించిన కా. రైను, అనిల్ ల విప్లవ జీవితం మనందరికీ ఆదర్శనీయం. వారు ఏ ప్రజల మధ్యనైతే  పనిచేస్తూ అమరులయ్యారో, ఆ ప్రజల మనసుల్లో నిండిపోయి వారిని నిత్యం ఉత్తేజపరుస్తుంటారు. ఆ ప్రజలు సదా  గుర్తుంచుకొని వారి కోసం ఎదురు చూస్తుంటారు. మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తారని.

‌ తమ ప్రాణాలను ధారపోసి శత్రువుతో మరింత దీటుగా పోరాడే ధైర్యాన్ని , అనుభవాలను అందించిన కా. రైను, అనిల్ ల విప్లవ జీవితాన్ని అన్వయించుకుంటూ మనల్ని మనం మరింతగా విప్లవీకరించుకుందాం. 

‌మీరు నడిచినంత మేరా…మీ నెత్తుటితో తడిచిన నేల తల్లిని ముద్దాడుతూ…

(ఆర్.కె.బి. డివిజన్ పరదోని గ్రామ అంచుల్లో 2020 మే 8 వ తారీఖున రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆర్. కె. బి.  డివిజన్ కమిటీ సభ్యుడు కా. రైను అమరుడయ్యాడు.

ఉత్తర బస్తర్ డివిజన్ లో 2022 జులై 12 వ తారీఖున సాయంత్రం 6.30 గంటలకు మేండకి నది ప్రవాహంలో మునిగి కువ్వేమాడ్ ఏరియా కమిటీ సభ్యుడు కా. అనిల్ కన్నుమూశాడు. వారిద్దరితో కలసి పని చేసిన రోజులను స్మరించుకుంటూ…)

Leave a Reply