నేనేమీ
సుడిగాలుల పిడి గుద్దులకు
తుఫానుల రౌడీతనానికీ
చలించిపోయే గోడను కాను
భూమి లోలోపలి పొరల్లో
పాతుకు పోయిన రాయినీ కాను
గుచ్చుకొన్న దుఃఖపుసూదుల చురుక్కుమనే పోట్లకు
పట్టించుకోని తనపు నిర్లక్ష్యపు కత్తిగాట్లకు
విలవిలలాడే సున్నితత్వాన్ని
గుడ్డులో నుంచి అప్పుడే రెక్కలు విప్పుకొంటున్న సౌకుమార్యాన్ని
ప్రతి చిన్నదానికీ కరిగి కురిసే చినుకును
నా రెక్కల్ని ముక్కల్ని చేసే
హక్కు నీకెవరిచ్చారు

అమ్మ గర్భాంతరంలో
ఉమ్మనీటి తటాకం నుంచి
బాహ్య ప్రపంచంలోకి రాగానే
అలా ఉండు ఇలా ఉండకు
ఈ విధి నిషేధ సూత్రాలే కదా
నా బ్రతుకు వ్యాకరణం నిండా
ఈ ప్రపంచపు సూర్యకిరణాల వర్షంలో తడవకుండా
నా దేహ పుష్పానికీ గాలిసోక కుండా
కప్పేసిన ఈ నల్లని ముసుగేమిటి?
అసలు నా కట్టుబొట్టుపై
పరాయి పెత్తనమేమిటి?
నా ఊపిరి మీద నా బట్టల మీద
ఒకరి ఆజ్ఞ లేమిటి
న్యాయమూర్తులైనా పాలకులైనా
మీ నిర్ణయాలతో పనేమిటి
ఇక ఈ ముసుగు ధరించాలా
ముక్కలు ముక్కలుగా చింపేయాలా
ఇప్పుడు నా నిర్ణయం .

Leave a Reply