ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో…

అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది 

గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ  

బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ !

కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..      

 కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ !

ఆ స్రీల  కళ్లు కోపంతో ఎర్ర మిరప పండ్లలా రక్తం రంగులో  మెరుస్తున్నాయి.

వాళ్ళ ఊపిరి  నాలుగు బర్నర్ల పొయ్యి లోంచి ఎగుస్తున్న మంటలా  వేడి., వేడిగా , ఆవిరి .. ఆవిరిగా  ఉంది.

వాళ్ళ దేహాన్నిబిగుతుగా  బంధించిన వంటింటి యాప్రాన్ నిండా..                                                                 గోధుమపిండి, రకరకాల మసాలా మరకలు.. కారం , పసుపు , నూనె డాగులు  అంటుకుని ఉన్నాయి.

ఆ వంటింటి  స్రీలలో.. వొకామే ముందున్న లారీడు అంట్ల  గిన్నెలు తోమడం  ఆపి..  చటుక్కున చెక్క అలమరలోని  కంచాల కింద దాచిన పుస్తకంలో అప్పుడే వెలిగిన కవితా వాక్యాలను *మైల్స్ టు  వాక్ * అని ఆరాటంగా రాసుకుంటుంది..ఎప్పుడూ యుగాలుగా అవే   వాక్యాలు కానీ ఆమె ఆ మూడు వందల నుంచి మూడు వేల  చదరపు అడుగుల ఇళ్ళు దాటి వెళ్లలేదు ఎప్పుడూ.  అయితే ఆమె వెళ్ళిపోతుంది,. తన ఊహల్లో., తాను రాసే కవితల్లో., కథల్లో .. ఆ చిత్రకారిణి తానేసిన పావురాయి రెక్కల్లో.. ఆ గాయని తన పాటల్లో వెళ్ళి  పోయనట్లు., ఎగిరిపోయినట్లు   

మీకు తెలుసా…. ఆమె ఓ రచయిత్రి !

మరొకామే యుగాలుగా  టన్నుల కొధ్ధి సాంబార్లు ., పులుసులు చేస్తూ., చేస్తూనే చటాలున  చేతికంటిన పసుపుని చీర కొంగుకి తుడుచుకుంటూ..తన గధిలోకి  ఆరాటంగా  పరిగెత్తుకుంటూ  తన కుంచె మీద ఎగరాలనుకునే పావురపు  అసంపూర్ణ చిత్రానికి ఎగిరే  రెక్కలు ధిద్ధి.,   రంగులధ్ధి..  మళ్ళీ  ఎవరో ‘చాలు చాలు ., ఇక పద’ అని   గంట కొట్టినట్లే   ఖంగారు ఖంగారుగా వంటింట్లోకి పరుగెడుతుంది .. ఆమె వో  చిత్ర కారిణి .  

అదిగో .. లక్షల్లో  చపాతీలు రుద్ధ్ధుతూనే రేపటి సంగీత పాఠాన్ని పాడుకుంటుందే..  ఆమె వో  గాయని !   ఇక్కడ ఈ వంటింటి మూలలో మోకాళ్ళల్లో తలెట్టుకుని వెక్కెక్కి ఏడుస్తున్నది  చూడండి వొంటి నిండా గాయాలతో., చెంపల మీద పళ్ల  గాట్లతో  పెదవి చిట్లి కొత్త పెళ్లి కూతురు  ,. ! ,అలా చాలా రకాలుగా ఉన్నారు.  వాళ్ళంతా ఇళ్ళల్లో ఉంటారు. ఇళ్ళల్లోనే రోజులూ ., నెలలూ ., సంవస్థరాలూ.. దశాబ్దాలు .. యుగాలుగా నడుస్తూనే ఉన్నారు .. పరుగెడుతూనే ఉన్నారు ఎవరో పరుగు పందెం పెట్టినట్లుగా., మైళ్ళ కొద్ది.   వాళ్ళను యుగాలుగా తయారు చేస్తున్నారు ఆడవాళ్లను తయారు చేసే కార్ఖానాల్లో.. ఆడవాళ్ళ ని తయారు చేసే కార్ఖానాలకి బాగా గిరాకీ ఉంది పోటీ కూడా బాగాఉండి తయారు చేయడానికి ట్రైనింగు సెంటర్లు కూడా పుట్టల కొద్ది  ఉన్నాయి ఎవరు నడిపిస్తున్నారో కానీ. బయట కనిపించవు కాలేజీల్లాగా ., యూనివర్సిటీల్లాగా .

ఆ స్రీలు రోజూ  వంటింటినుంచి లోపలికి.. బయటకి ,. అటు పెరట్లొకి..ఇటు లివింగ్ రూమ్ లోకి.. అటునుంచి బెడ్ రూముల్లోకి మైళ్ళ కొధ్ధి నడుస్తూనే ఉంటారు .

 వాళ్ళ ఇంట్లోని మగవాళ్ల టీల కోసం , ఫలహారాలకోసం అరిచే అరుపులను మౌనంగా వింటూ.. ఆగ్రహాన్ని., వాళ్ళ మగవాళ్ళని తిట్టబోయే తిట్లని  పళ్ల బిగువున అణుచుకుంటూ.. పొగలు కక్కే టీలు అలుపెరగకుండా  అందిస్తూనే ఉంటారు

 సరే ..ఇహ ఇక్కడ చూడండి.  

 మగవాళ్లు లివింగ్ రూమ్ లో ఆరాంగా కూర్చుని వున్నారు.

తాతయ్యలు .. నాన్నలు .. కొడుకులు  !

అందరికన్నా చిన్నవాడు వీడియో గేమ్ ఆడుతున్నాడు

పెద్ద మగవాళ్లేమో .. టీలు చప్పరిస్తూ  పేపర్లు ..ప్రసిద్ధ కవుల  కవిత్వం చదువుతూ.,[వంటింటి స్రీ  రాసిన కవిత్వం తప్ప] అంతర్జాతీయ రాజకీయాలు చర్చిస్తూ ‘అవునూ భగవత్ గారు భలే చెప్పారు చదివారా.,మన హిందూ స్రీలు కూడా ఒక్కో స్రీ  ఐదు మంది పిల్లల్ని కనాలిట .. ఈ ఆడాళ్ళు  ఇద్దరు పిల్లల్నే  చూడలేక పోతున్నారు .. ఇక ఐదుగురిని ఎక్కడ చూస్తారోయ్ .. మళ్ళా ఇంకా ఏం చెప్పారోయ్ గురువు గారు.,ఈ ఆడాళ్ళాకి అసలు  ఉద్యోగాలు అవసరమే లేదు ఇళ్ళల్లో ఉంటూ మొగుళ్ళని అత్తమామలను చూసకుంటే చాలని కదా ..! భలే చెప్పారోయ్  ఆయన. ఇలా చెప్పేవాళ్లు  కావాలి ఈ కలికాలానికి లేక పోతే అబ్బో వీళ్ళని ఎవరాపగాలరెంటీ ‘’   భళ్ళున .. ఫెటిల్లున పగిలిపోయే నవ్వులుతో..  ఫోన్లు మాట్లాడుతూ .. టివి చూస్తూ మరో కప్పు టీ కోసం భార్యలకి  కేకలు వేస్తూ.. అబ్బో చాలా స్థిరంగా .. ప్రశాంతంగా సంతోషంగా కనిపిస్తున్నారు .

వంటింట్లో శబ్ధాలు చేస్తున్న స్రీల మీద ..జోకులేసి  నవ్వుతూ ఉన్నారు . మధ్య మధ్య.,మధ్యలో “ఆకలి వేస్తుంది వంటయిందా” .. అని అరుస్తూ .. “వీళ్ళకి భర్తల కోసం త్వరగా వంట చేయడం కూడా  రాధు ..  ఈ ఆడవాళ్ళున్నారు చూసారూ .. ఒట్టి  బధ్ధకస్థులు.. దేనికీ పనికి రారు” అంటూ విసుక్కుంటూ ఉన్నారు . వాళ్ళ చేతుల్లో కత్తెరలు ఉన్నాయి . వీధి చివరికి పాకుతున్న ఆమె పాటల తీగలను .. ఆమె రాసుకుంటున్న కవితావాక్యాల్లోని ప్రశ్నలను .. ఆమె  కుంచె మీది పావురాళ్ళ రెక్కలను   ఆ కత్తెరలతో కత్తిరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు .   ఆ ఆడవాళ్ళు ‘అయ్యో వద్ధు  .. వొద్ధద్ధు  .. అబ్బా వొద్ధూ ,,నొప్పి ., నొప్పిగా ఉంది ఊపిరి ఆడట్లేదు అలా కత్తిరించకండి ., మావయ్యా .. యావండి .. వధొద్ధు’ అంటున్నా కత్తిరించేసి కత్తెర జేబులో పెట్టేసుకుంటూ.. పాట  వినిపించినప్పుడల్లా.. అక్షరాలూ.. రంగులూ..కనిపించినప్పుడల్లా కత్తెర మళ్ళీ మళ్ళీ తీస్తూ.. ఝళి పిస్తూ .,భయపడుతున్న ఆడాళ్లను చూస్తూ నవ్వే సుకుంటూ వాళ్ళున్నారు చూడండి ఆ మగాళ్లు ..’నడవాలి నడవాలి., ఇంకా త్వరగా నడవాలి వేగంగా నడవాలి., అసలు ఇప్పుడు  నడవబాకండి, పరిగెత్తండిక. వంటలు..  వడ్డించడాలు ఆలస్యం అవుతున్నాయి..  పనులు నెమ్మదిస్తున్నాయ్ ! కాళ్ళు చేతులు నడుము తలా నొప్పులంటారా ,, మంటలంటారా.,నాటకాలా., .  ఛలో వన్ ., టూ .. త్రీ రన్ ., రన్ .. ఎవరు చక్కగా పరుగులు పెడుతూ పనులు చేసుకుంటూ.. వాళ్ళ వాళ్ళ మగాళ్లను సుఖ పెడతారో వాళ్ళకు ఉత్తమ ఇల్లాలి బహుమతి .. ఛలో ఛల్ .. రన్  రన్ … అంటూ జంధ్యాలు సవరించుకుంటూ .,ములుకర్రలు నేల మీద తాటిస్తూ ఆడవాళ్లను పరుగులు పెట్టిస్తూ మగాళ్లు!        

మధ్య మధ్యలో లేచి కాళ్ల తిమ్మిరి తగ్గడానికి వాకిట్లోని లాన్ లో నాలుగడుగులు నడిచి మళ్ళీ వచ్చి ఈజీ చైర్లు , సోఫాల్లో.. మంచాలలో  వాలిపోతూ ఉన్నారు .. ఆ మగాళ్లు.

ఇస్రీ చేసిన బట్టలతో .. షేవింగ్ చేసుకుని  మెరిసిపోతున్న గడ్డాలూ ..నున్నటి  బుగ్గలతో ..  చక్కగా దువ్విన తల కట్టుతో.. ఆ మగవాళ్లు .. ఆ చిన్న మగ పిల్లలూ  చాలా శుభ్రంగా.. పద్ధతిగా ఉన్నారు.

ఆ ఆడవాళ్ళు అలా ఆ ఇంట్లో  తిరుగుతూనే ఉన్నారు.. తిరుగుతూనే ఉన్నారు ,,తిరుగుతూనే ఉన్నారు .  

మోకాళ్ల నొప్పులతో.. బీపీలు  గుండె జబ్బులతో ..మధువు ఇవ్వని కసుక్కున  సూదులు గుచ్చే  మధుమేహాపు రోగాలతో ..గొంతు నిండా గుటుక్కున  మింగుతున్న మందులతో.,   ఋతువులు మారినా మారని ఋతుస్రావపు  నొప్పులతో..  గర్భాలతో భారంగా..పిల్లల్ని పెంచుతూ దించుతూ .. ఋతువులు ఆగిపోతే.. మెనోపాస్ లతో ., ముడుచుకుపోయిన దేహాలతో .. పెరిగి పోయిన డిప్రెషన్లతో.. కోపాలతో., ఉద్రేకాలతో., ధుఖాలతో   పూజలు.. నోములు.,వ్రతాలు.,ఉపవాసాలతో .,సరిగా తినీ తినక రక్తం తగ్గిపోయి  అనీమియాలతో..  కడుపులో యాసిడ్ లు, కళ్లల్లో కన్నీళ్ళు వూరినట్లే పొట్టల్లో ఊరి పుండ్లు ,. పుండ్లు చేసేస్తే అల్సర్లు పెట్టె మంటలతో ., తిరుగుబోతు మొగుళ్లు బయట సుఖపడిపోయి  సుఖవ్యాధులు అంటిస్తే  ఆ మంటలు .,నొప్పులూ .,దురదలతో   మందులు   మింగుతూ., రాసుకుంటూ ఆ ఆడవాళ్ళున్నారు చూడండి తిరుగుతూనే ఉన్నారు వంటింట్లోంచి.. బెడ్  రూమ్లోకి., పెరట్లోనుంచి వాకిట్లోకి .. లివింగ్ రూమ్ లో నుంచి.. పూజ గదిలోకి పువ్వులు హారతులు.. కొబ్బరికాయలు అగరొత్తులు .. పగలగొడతూ .. వెలిగించేస్తూ అంట్ల  గిన్నెలు..గరిటెలు కప్పు సాసర్లు . కంచాలూ..మంచాలూ , ఇళ్ళూ పాయిఖానాలూ కడుగుతూ ., లైజాళ్లు  ., హార్ పిక్కులతో రుద్దేస్తూ కడిగేస్తూ  .. ఉప్పు కారాలు, పసుపు నూనెలు,  మసాలాలు, పిన్డ్లు  పొళ్లు.. పాలు పెరుగు..లడ్లు.. జంతికలు ఇడ్లీలు దోసలు పూరీలు పరాటాలు..చేసుకుంటూ.,.,  చేసేస్తూ., మగాళ్ళకి  తినిపించేస్తూ  ఆరాటాలు .. ఆరాటాలు, భయాలు భయాలతో ఏవో దిగుళ్ళతో బుగుళ్ళతో .. పెదవుల .. బుగ్గల మీద మెడల .. రొమ్ముల మీద, నడుముల మీద, తొడల మీద .. ఆమె వొంటి మీద.. ఈమె వొంటి మీద , ఆమామెల  ., ఈమీమెల వొంటి మీద , కనిపించీ కనిపించని గాయాలు ..పూర్తిగా తగ్గని జ్వరాలతో ., పూట పూటకి అదేంటి ఆ ., పేరాసిటమాల్ ., డోలో .. ఆ .,ఆ డోలోలు గుప్పిళ్ల కొద్ధీ మింగేస్తూ  వొణుకుతో వొణుకుతో వంటిళ్ళల్లోనే  నులక మంచాలేసేసుకుని ముణుక్కుంటూ .,మళ్ళీ లేచి వంటలు చేస్తూ మళ్ళీ అక్కడే మునుక్కుంటూ  బాధలు కళ్లలో .. నొప్పి అదిమి పట్టే పంటి బిగువుల్లో, వంటింట్లో ఒకరికొకరు  రహస్యం రహస్యంగా చెప్పుకునే గుస గుసల కథల్లో  గాయాలకు రాసుకునే .. ఆపుకునే.. ఆపుకోలేని  కన్నీళ్లతో .. రాత్రి పూట వెన్నెలకో , చంద్రుడికో , కరికి  పోయే రాత్రికో గోడు గోడున  చెప్పుకుంటూ , వల వాలా  ఏడుస్తూ ,విలవిల్లాడిపోతూ . ఒక్కోసారి పది కాళ్లతో ఒకేసారి నాలుగువైపులా పరిగెడుతూ ..మరో సారి పది చేతులతో.. ఇరవై  వేళ్ళకి  స్పూనులు గరిటలూ, కంచాలూ  ..వీపులకి    మంచాలూ అంటుకుపోతుంటే .. పెకిలించుకుంటూ రాక, రక్తాలు కారుస్తూ నొప్పితో గావు కేకలు వేస్తూ .. ఆ ఆడవాళ్ళు తమ చేతులు .. తమ నిలువెత్తు దేహాలు  అవిశ్రాంత రక్త మాంసాల పనిముట్లయిపోయి  ..   ఆ ఆడవాళ్ళు అలా  నడుస్తూనే ఉన్నారు .. యంత్రాలలా        

అన్నట్లు .. అక్కడో చిన్న పాప కూడా ఉంది సుమా నేను చెప్పటం మరిచాను

కధ  ముందరి చరణం లోనే రాయాల్సింది .

 సరే .. ఆ పాప గధిలో ఒక మూల., చేతిలో బార్బీ  బొమ్మని పట్టుకుని ,. దూరాలు కొలిచే టేపు తో బార్బీ బొమ్మ చేతుల్ని .,కాళ్ళని. పొట్టను ఛాతీని  విసుగు ,. విసుగ్గా కొలుస్తూ ఉంది. మధ్య మధ్యలో బొమ్మను పడేసి వంటింట్లోనుంచి బెడ్రూంలోకి.. లివింగ్ రూమ్లోకి పెరట్లొకి ., వాకిట్లోకి అలుపెరగకుండా  పరిగెడుతున్న అమ్మ.. అమ్మమ్మ.,నానమ్మ.,అత్తల .,చిన్నమ్మల  అడుగుల దూరాలను వాళ్ళతో పాటు వు రుకురికి  కొలుస్తోంది ‘1,609.344 మీటర్లు అంటే ఒక మైలు.’ తనలో తానే  అనుకుంటూ ., ఆయాస పడుతూ ..మరోసారి గట్టిగా  అరుస్తూంది . విచిత్రంగా పాప ఒకసారి అమ్మగా . , ఇంకోసారి  అమ్మమ్మగా., నానమ్మగా.. ముత్తమ్మ గా .. ఎత్తుగా  సాగిపోతూ ., మారిపోతూ , మళ్ళీ చిన్న పాపగా కుదించుకు  పోతున్నది   “ ఒహవ్ పాపా ఏం కొలుస్తున్నావు ఇదిగో మేవూ  నడవటంలా మైళ్ళు మైళ్ళు  మార్నింగ్., ఈవెనింగ్  వాకులు  ., ? మరీ చోద్యం చేస్తున్నావు కానీ” తాతయ్య  ..” కాదు తాతయ్యా  .. నాన్నారూ మరేం అమ్మా వాళ్ళు రోజూ  చాలా..  చాలా మైళ్ళు నడిచేస్తారు మీ కంటే ఎక్కువ తెలుసా . రోజూ  ఇరవై నాలుగు గంటల్లో పది మైళ్ళు నడుస్తారు  మీకేం తెలుసు  ఖచ్చితంగా నిర్ధారణ అయ్యింది . . మొన్నామధ్య పేపర్లో వచ్చినప్పుడు నువ్వు చదివావ్ కూడా., భళ్ళున నవ్వావ్ కూడా. నువ్ ఆనాడు నవ్వినప్పుడు ఇదుగో నా పాదాలు పెటి ళ్లున  పగిలి రక్తం కూడా కారాయి ., నువ్వధి చూసావు కూడా ., అయినా మళ్ళీ నవ్వావు, మళ్ళీ మళ్ళీ ఫెటిల్లున నవ్వు తూనే ఉన్నావు .  ఎంత నిర్దయుడివి., నీ కోసం నీకన్నం పెట్టటం కోసం అనుక్షణం పరిగెత్తిన పాదాలు  పగిలితే ., నవ్వేట్టా వచ్చింది నీకు ?సరే నీ పాపం నీకే ఉంటుంది . నాకెందుకులే ..  సరే ఈ మధ్య ఈ పాడు  సెల్ ఫోనులొచ్చి అసలెవరూ ఆడ వాళ్ళకి ఇళ్లల్లో  కొంచెం కూడా సాయం చేయకపోవడంతో  ఈ నడక దూరం ఇంకా పెరిగిందట.   పాపం అమ్మమ్మ ఈ మధ్య మోకాళ్ల నొప్పులతో కొంచెం  ఎక్కువ నడవలేకపోతుంది . కొంచెం స్పీడు తగ్గిపోయింది వయసైపోయిందిగా పాపం కదా తాతయ్యా ‘’!  ” చాల్లే చాల్లే చెప్పొచ్చావ్ ఆ టేప్ పడేయ్  ముందు..  అసలు నువ్వు కూడా నడక నేర్చుకో ఫో ., ఇప్పటినుంచీ నేర్చుకుంటేనే మీ అమ్మంతయ్యాక పరుగు నేర్చుకుంటావు.. మాను.,మానిక  మానేయ్ ఈ  కొలవడం ..పడేయ్ ఆ టేపు ..  మొదలు పెట్టేయ్  నడవడం ., నడు., నడు., పద పదా., నడు  నడూ’ ’,.  ’భలే వాడివే నాన్నా  నేనిప్పటినించా నాన్నా ., అమ్మ పొట్టలో ఉన్నప్పటినుంచే కొలుస్తున్నాగా ఈ టేపు అప్పటినుంచే నా దగ్గర ఉంది నా తోనే ఇది కూడా తయారైంది అమ్మ పొట్టలోనే.. పుట్టాక నేనెంత దూరం నడవాలో .. అదే పరుగులు పెట్టాలో .,  .,ఆపేయాలో కొల్చుకొని., తేల్చుకోడానికి.  నీకు తెలీదేమో .. నాకు తెలుసు.  నేను యుగాలుగా ఈ టేప్ తో ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనులు చేస్తూ,. పరుగులు పెడుతూ నడిచే దూరాలు కొలుస్తూనే ఉన్నాను. నేనిలా చిన్న పాపలాగా  కనిపిస్తానే కానీ నేను చాలా పెద్ద దాన్ని.  చూడు ఎంత పెద్ద దాన్నో.,  పొట్టలో బాదం కాయంత  పిండం నుంచి  ముత్త మ్మ  ఉండే   పొడవు దాకా మర్రి చెట్టంత  సాగి ఉన్నాను నాన్నా ., నేనిప్పటిదాన్నా  నాన్నా?  కాదు మీ ముత్త వ్వ కూడా నా నుంచే వచ్చింది నాన్నా.  చూడు అరే  అలా భయపడతావేంటి.. తలెత్తి చూడు నాన్నా. నేను  కనపడతాను. నా లోపల మీ ముత్తమ్మ కనపడుతుంటే అట్టా భయపడతావేంటి నాన్నా ., పోనీ తాతయ్యా  నువ్వయినా  చూడు నన్ను., నా లోపల ..లోలోపల ., మీ అమ్మని .,అమ్మమ్మని .. తాతమ్మని  చూస్కో., చూస్కో తాతయ్యా’’ ., ”చాల్లే ., ఏంటి ఈ మంత్ర గత్తె వేషాలు ? నువ్వు మా అమ్మలాగా రూపం మారితే భయపడతాననుకున్నావా .. మారిపోతాననుకున్నావా ., మిమ్మల్ని పరుగులు పెట్టించననుకున్నావా .,నడిపించననుకున్నావా .. ఆడవాళ్ళ ఇంటి నడక అనాదిగా ఉంది. మగాళ్లు వాళ్ళని నడిపించడం సంప్రదాయంగా ఉంది .. దీన్ని నువిప్పుడొచ్చి మారుస్తానంటావా ., నువ్వెంత జిమ్మిక్కులు చేసినా., రూపాలు మారుస్తూ భయపెట్టాలని చూసినా , మీ నడక మా చేతుల్లోనే ఉన్నది గుర్తు పెట్టుకో. ఫో ,. పోయి నడక ప్రాక్టీస్ చేయి మీ అమ్మలాగా., అమ్మమ్మలాగా’’
 ‘’ ఓహో ., అబ్బా , అవునా తాతయ్యా .. నేనేం చేయగలనో చూస్తావా. ., చూసేస్తావా ., చూడు మరి  మీ తరానికి.. అమ్మ తరానికి లేని శక్తి నా తరానికి ఉంది. వాళ్ళు నా మాట వింటారు చూడు. నీ స్థాన బలిమే కదా నీకింత బలాన్ని అధికారాన్ని ఇచ్చింది? ఇప్పుడు  చూడు నేనేం చేస్తానో ..ఇదుగో ఈ గీత గీసా  చూశారా ఇది దాటి ఇక మీరు రాలేరు అక్కడే ఆగిపోతారు ,. మీ మగాళ్లని నిలువరించడానికి ముత్తవ్వే  నాకు ఈ గీత ఇలా గీయడం నేర్పించే ఈ లోకానికి పంపింది. చూశారా ఎంత గింజు కొంటున్నా కదల్లేక పోతున్నారు.,నిలిచి పొండిక .    “హే అమ్మా .. అమ్మమ్మా  ,,నానమ్మా  .. ఒహ్హ్ అక్కడ ఆ వంటింట్లో ఉన్న ఆండాళ్లందరూ  బయటకు రండి .. చాలిక ఈ మగాళ్లు వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు ఇక మీరు మీ ఆకలిని  గుక్కెడు నీళ్ళు తాగుతూ,. చంపుకుంటూ చేయాల్సిన పనే లేదు .. ఒసేయ్  దమయంతీ.. పరిమళా .. సుజాతా. సంధ్యా. వసంతా .,నిర్మలా,. పద్మావతీ ,గిరిజా  అందరూ వంటింటి బయటకు రండే .. నేనే మీ అత్తను, అమ్మను,అమ్మమ్మను ,ముత్తమ్మను.. మీ బిడ్డను, మీ మనమరాలను , మునిమనమరాలను   చెప్తున్నాను . నన్ను చూసి భయపడకండి , రండి .,బయటకు వచ్చెయ్యండి మీ రక్తం తాగే ఆ వంటింటి నుంచి., మీ పాదాలు పుండ్లయ్యేదాకా  అలుపెరగక నడిపించే ఆ వంటింటి నుంచి రండి వచ్చేయండి .. కమాన్ .. ఈ లివింగ్ రూమ్ లో కూర్చోండి మీకిష్టమైన పనులు చేసుకోండి . కథ ., కవిత్వం రాసుకోండి., బొమ్మలు వేసుకోండి,పాటలు పాడుకోండి., చదువుకోండి .,విశ్రాంతి ., అవును విశ్రాంతి తీసుకోండి. హాయిగా అలా ఆ ఈసీ చైర్ లలో .. సోఫాల్లో .. మంచాలమీద వాలి పోయి హాయిగా.,హాయిగా  విశ్రాంతి తీసుకోండి ,.  తీరిగ్గా మీకేం ఇష్టమూ గుర్తు తెచ్చుకుని అవన్నీ కడుపు నిండా మెల్లిగా .,ఇష్టంగా తినండి. రండి., రండి భయపడకండి ఇదిగో నా శక్తిని ., ముత్తమ్మ నాకు మంత్రం వేసిచ్చిన  ధైర్యాన్ని మీ చెవుల్లోకి ఊదుతున్నా వినండి. ఆమె శక్తిని మీలోలోకి ఊపిరిలా ఊధుతున్నా  తీసుకోండి..  మీ గుండెల  నిండా పీల్చుకోండి. ఇదుగో నా చేయి పట్టు కొని గడప దాటవేయండి, దుంకెయ్యండి  , హమ్మయ్య !  అద్గధీ  .. అదీ అలా నా మాట విన్నారు బాగుంది. రండి , వచ్చేశారు కదా . ఒహ్హ్ ఏంటిధి .. ఏంటీ  అద్భుతం?? మీరంతా గట్టి నిర్ణయం తీసుకుని., లివింగ్ రూమ్ లోకి రాగానే  మీ వొంటి నుంచి ఆ గరిటెలూ స్పూనులూ,కప్పు సాసర్లు అలా జల,జలా విడిపోయి  పడిపోతున్నాయో చూశారా .. మీ చర్మం నుంచి ఆ ఉప్పూకారాలు.. టి పొడీ  చక్కెరలు ,.  ఆ పోపు గింజలు ఎలా రాలి దుమ్ములా గాలిలో కలిసిపోతున్నాయో చూశారా ?ఒహ్హ్., ఇది మరీ అద్భుతం,. మీకు కొత్త చర్మం వచ్చింది. చూడండెలా మెరిసిపోతుందో ? అచ్చమైన చర్మం . మీ పుట్టింటి నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకున్న  అసలైన చర్మం ! ఇక అత్తింటికి వచ్చాక  వేల మైళ్ళు  నడిచి ., నడిచీ పొట్టు తేలి  పగిలిన మీ పాదాలు .,మామూలు కావడానికి కొన్ని రోజులు పడుతుంది. మీకో  మాట చెబుతా . ఇక  ఇలాగే, ఇక్కడే  ఉండండి ఇదే ఇక మీ స్థానం .. మీకూ రూమ్ కావాలి., ప్రశాంతంగా  రాస్కొడానికి ,చదువుకోవడానికి , సంగీత సాధన చేసుకోడానికి,బొమ్మలు వేసుకోడానికి. ఇక మీ రూములు సిధ్ధం చేసుకోండి ..  ఈ లివింగ్ రూమ్ లోనే  మీ లైఫ్ ఉంది ఆ కుకింగ్ రూమ్ లో  కాదు. కిచెన్ కిల్స్ యు .   అక్కడ నిప్పుంధి .. కత్తులూ కటార్లున్నాయి .,కోస్తాయ్ .,మిమ్మల్ని కాట్లు కాట్లుగా కోస్తాయ్ . మీ చేతులు, వేళ్ళు .. కాళ్ళు ముక్కలు .,ముక్కలు చేస్తాయ్ .  వంటిల్లు మీ మెడ మీద కత్తి పెట్టి మరీ మీతో వంట చేయిస్తుంది .కారాలూ మిరియాలూ ఉన్నాయి. మీ వొళ్లంతా మంటలు పుట్టిస్తాయి పొయ్యి మిమ్మల్ని కాల్చేస్తుంది  మిమ్మల్ని ఇల్లంతా పచ్చి పుండ్లు అయిన పాదాలతో నడిపిస్తుంది. వంటిల్లు ఒక  దెయ్యం,.  మీ తాత ముత్తాతలు నడిపించే ., ఆడవాళ్లను తయారు చేసే కార్ఖానా ..మన దేహాలను ఆ పొయ్యిలో వేసి మసి బొగ్గు చేసే మహా రాక్షస చితి .నేనూ  అలా మసి బొగ్గయినదాన్నే ., కానీ మీ కోసం ఫీనిక్స్ లా మళ్ళీ పుట్టాను. నేను  మీ  పాపనే .  కానీ., ‘అనాది ఆడదాన్ని’ కూడా. ఇక కదలకండి ఇక్కడినుంచి. మీ కాళ్ళని , చేతులని మీ దేహాలను., హృదయాన్ని ఈ లివింగ్ రూంలోనే ఉంచి రక్షించుకోండి .. దక్కించుకోండి   వెళ్ళకండి అటువైపు.మీకంటూ ఒక గది దొరక లేదా .,బయటకు వెళ్ళిపోయి వెతుక్కొండి . వాళ్ళు ఆ మగవాళ్ళు వెళతారులే. . ఆకలేస్తే  వండుకోక చస్తారా ., వాళ్ళకి వంట వచ్చు అన్నీ నాటకాలు . చేసుకుంటారు తింటారు రాకపోతే యు ట్యూబు ల్లో చూసి నేర్చుకుంటారు .. ఇక నడుస్తారు వాళ్ళు కూడా., మనం నడిచినట్లే. రోజూ  పది మైళ్ళు . నడవక ..  వెళ్ళక చస్తారా,. ఛల్  .ఓయ్ మగాళ్లూ , వెళ్లండెళ్లండి.. ఈ లివింగ్ రూమ్ వదిలి పెట్టి ., ఆ కుకింగ్ రూమ్ దారి పట్టండి. ఇదిగో గీత చెరిపేశా కానీ మీరంతా వంటింట్లోకి వెళ్ళే మాయ చేశా .., వెళ్ళండి అదిగధిగో వంటిల్లు . ఆగండాగండి ,. ఇదిగో ఈ టేపు తీసుకోండి.. గుర్తు పెట్టుకొండేం  ., ఇరవై నాలుగు గంటల్లో., పది మైళ్ళు ఈ ఇంట్లో నడవాలి ., నేను .,పోనీ మేమంతా లేమూ మీ నడక కొలవడానికి ? కదలండిక ., నడవండిక !

                                           ****     

6 thoughts on “ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

  1. ‘ఇరవైనాలుగు గంటలు…’ గీతాంజలి కథ బావుంది. విస్తృతమైన సబ్జెక్ట్ ను చిన్న కథగా మలచటంలో ఈ కథాశిల్పం ఉపకరించింది.

  2. చేదు వాస్తవాన్ని అత్యంత శక్తిమంతంగా ముఖమ్మీద చాచికొట్టినట్లు చెప్పిన కథ. ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత ఆవేశం, ఎంత తిరుగుబాటు! గీతాంజలి గారి కలం నుంచి భరించలేని ప్రెజర్‌తో బద్దలైన కుక్కర్‌ ముక్కల్లా ఈ ధర్మాగ్రహం. కేవలం ఆడ అయినందుకే ఈ పీడన! నరజాతిలో సగభాగం నెత్తిన ఈ దిక్కుమాలిన చాకిరీని నింపి, మెదళ్లను, హృదయాలను దెబ్బతీసి మొద్దుబార్చిన ఆధిపత్యాన్ని గొప్ప సంవేదనతో బొమ్మకట్టిన కథ ఇది. చరిత్ర సంగతి వదిలేస్తే.. ఇంత తెలివిడి, ఇంత టెక్నాలజీ అందుబాబులోకి వచ్చినా ఆమెను ఇంకా వంటింటికి, ఇంటికి బందీ చేస్తున్న రాజకీయార్థిక చలనాలు మనకింకా సరిగ్గా అర్థం కావడం లేదు. వాటి గతిమారితే తప్ప మోక్షం లేదు.
    ఆర్థిక స్వావలంబన వల్ల సిటీల్లో పరిస్థితి ‘కొంత మెరుగైనట్టు’ కనిపిస్తున్నా వేరుపురుగు చావలేదు. దీనికిప్పట్లో చికిత్స లేదు. కథలోని కంఠస్వరంలో ఎంత తీవ్రత ఉందో అంత ఆలోచనా, నైశిత్యం ఉన్నాయి. సెల్ ఫోన్లు వచ్చాక ఆడవాళ్లకు సాయం చేసే టైమ్ మగళవాళ్లకు లేదన్న విషయం స్ట్రైకింగ్. ‘చేసుకుంటారు తింటారు రాకపోతే యూట్యూబులో చూసి నేర్చుకుంటారు!’ కత్తిపదునుకంటే ఎక్కువ ఈ మాట. కానీ ఈ సమాజపు తోలుమందం తెగుతుందా? తెగాలని ఆశిస్తూ. చైతన్యస్రవంతి, మంత్రవాస్తవికతతో..అన్నిటికీ మించి చేదువాస్తవికతను అద్భుతంగా సృజించిన గీతాంజలి గారికి నమస్సులు..

    పి. మోహన్

  3. చేదు వాస్తవాన్ని అత్యంత శక్తిమంతంగా ముఖమ్మీద చాచికొట్టినట్లు చెప్పిన కథ. ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత ఆవేశం, ఎంత తిరుగుబాటు! గీతాంజలి గారి కలం నుంచి భరించలేని ప్రెజర్‌తో బద్దలైన కుక్కర్‌ ముక్కల్లా ఈ ధర్మాగ్రహం. కేవలం ఆడ అయినందుకే ఈ పీడన! నరజాతిలో సగభాగం నెత్తిన ఈ దిక్కుమాలిన చాకిరీని నింపి, మెదళ్లను, హృదయాలను దెబ్బతీసి మొద్దుబార్చిన ఆధిపత్యాన్ని గొప్ప సంవేదనతో బొమ్మకట్టిన కథ ఇది. చరిత్ర సంగతి వదిలేస్తే.. ఇంత తెలివిడి, ఇంత టెక్నాలజీ అందుబాబులోకి వచ్చినా ఆమెను ఇంకా వంటింటికి, ఇంటికి బందీ చేస్తున్న రాజకీయార్థిక చలనాలు మనకింకా సరిగ్గా అర్థం కావడం లేదు. వాటి గతిమారితే తప్ప మోక్షం లేదు.
    ఆర్థిక స్వావలంబన వల్ల సిటీల్లో పరిస్థితి ‘కొంత మెరుగైనట్టు’ కనిపిస్తున్నా వేరుపురుగు చావలేదు. దీనికిప్పట్లో చికిత్స లేదు. కథలోని కంఠస్వరంలో ఎంత తీవ్రత ఉందో అంత ఆలోచనా, నైశిత్యం ఉన్నాయి. సెల్ ఫోన్లు వచ్చాక ఆడవాళ్లకు సాయం చేసే టైమ్ మగళవాళ్లకు లేదన్న విషయం స్ట్రైకింగ్. ‘చేసుకుంటారు తింటారు రాకపోతే యూట్యూబులో చూసి నేర్చుకుంటారు!’ కత్తిపదునుకంటే ఎక్కువ ఈ మాట. కానీ ఈ సమాజపు తోలుమందం తెగుతుందా? తెగాలని ఆశిస్తూ. చైతన్యస్రవంతి, మంత్రవాస్తవికతతో..అన్నిటికీ మించి చేదువాస్తవికతను అద్భుతంగా సృజించిన గీతాంజలి గారికి నమస్సులు..

Leave a Reply