‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌… సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు… భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత పట్టుకొని, కొత్తగా ఉద్యోగ వేట మొదలుపెట్టిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఎఐ మరింత విస్తారమైతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఓపెన్‌ ఎఐ వేగంగా వృద్ధి చెందడం ప్రపంచ వ్యాప్తంగా పెను సవాళ్లకు దారితీస్తోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) సేవల నుంచి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ వరకు అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవా మొదలైంది. ఈ క్రమంలో, ఐటి దగ్గజం ఐబిఎం కూడా ఇటీవల ఖాళీ అయిన ఉద్యోగాలను ఎఐతో భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎఐ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు సంచలనాలకు దారితీస్తున్నాయి.

కృత్రిమ మేధస్సు అనేది ఒక అప్లికేషన్‌ రోబో. ఇది వృత్తులను స్థానభ్రంశం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, నిరుద్యోగాన్ని పెంచుతుంది. అందువల్ల, మానవుల స్థానంలో చాట్‌బాట్లు, రోబోట్లు రావడంతో నిరుద్యోగం ఏర్పడే అవకాశం ఎప్పుడూ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉత్పాదకత పలురకాల కార్యాలయాల్లో కీలక పాత్రను పోషించవచ్చు. పనిభారాన్ని సులభతరం చేయవచ్చు. గతంతో పోలిస్తే ఎక్కువ పనిని మరింత నాణ్యవంతంగా పూర్తి చేయవచ్చు. ఇదే ఎఐ కారణంగా నిరుద్యోగిత పెరుగుతున్నది. ఉద్యోగుల స్థానాన్ని ఎఐ భర్తీ చేయడం వివిధ రంగాల్లో ఇప్పటికే మొదలైంది. ఇదే ఒరవడి మరింత వేగంగా కొనసాగడం ఖాయం. స్టీఫెన్‌ హాకింగ్‌ భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు ‘పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి మానవ జాతి అంతానికి దారి తీస్తుందని’ హెచ్చరించాడు.

నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాలను పెంచుకునేందుకు వీలు కల్పించేలా ఉత్పత్తి ప్రక్రియలో శారీరక, మానసిక శ్రమను తొలగించేందుకు ఒక సాధనంగా కృత్రిమ మేధస్సు రూపొందించబడిరది. ఇది శ్రామికులను భారీగా తగ్గిస్తుంది. దోపిడీని తీవ్రతరం చేస్తుంది. ఇటీవలి కాలంలో దీని వేగం, విస్తరణ… ఇదివరకెన్నడూ ఊహించని రంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఎఐ వల్ల ఆదా అవుతున్న సమయం, సదుపాయాలు అందరికీ దక్కడం లేదంటే ప్రస్తుత పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలే అందుకు కారణం. ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం గల కొద్దిమంది దాన్ని అనుభవించగలుగుతున్నారు. మిగిలిన వారు పనులు కోల్పోతున్నారు. సాంకేతికత వారి పని సమయం తగ్గించకపోగా పనులు పోగొట్టి బజారులోకి నెడుతున్నది. పనుల్లో ఉన్నవారు కూడా ఎక్కువ గంటలు ఎక్కువ శ్రమ చేస్తూ భద్రత కోల్పోతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక ఉత్పాదకత నిరంతరాయంగానూ వేగంగానూ పెరగడం స్వతఃసిద్ధమైన ధోరణి. మరోవిధంగా చెప్పాలంటే నిరుద్యోగం పెంచడం దాని లక్షణం. పనులు కోల్పోయిన ఈ నిరుద్యోగులే పనిచేస్తున్న శ్రామికుల వేతనాలు పెరుగకుండా ఒక రిజర్వు ఆర్మీగా అందుబాటులో ఉంటారు.

పెట్టుబడిదారులు సహజంగానే కొత్త పరికరాల కోసం వ్యయించిన మొత్తం వెనువెంటనే తిరిగి రాబట్టుకోవాలని ఆరాటపడతారు. కనుక పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల కారణంగానే పెరుగుతున్న సాంకేతికత ఉద్యోగాల పెంపుదలకు దారీతీయడం జరుగదు. అందువలన ఎఐ పరిణామాలను అదుపు చేయడానికి ఒక అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై కనిపిస్తున్నది. ‘ఎఐ అగ్ని లాంటిది. మనం జాగ్రత్తగా ఉండాలి’ అంటాడు ట్విటర్‌ అధినేత అలెన్‌ మస్క్‌ . అందువల్ల ఎఐతో ఎదురయ్యే సవాళ్లను సవ్యంగా పరిష్కరించడం అవసరం. సమాజ శ్రేయస్సును నిర్ధారించేటప్పుడు కృత్రిమ మేధస్సు యొక్క సామర్థ్యాన్ని పెంచడంలోని సృజనాత్మకత – నైతికత మధ్య సమతుల్యతను సాధించడం కీలకం.

సాంకేతిక పురోగతిలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఎఐ) ఆవిష్కరణ ఒక గేమ్‌ చేంజర్‌. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం జీవించే, పనిచేసే, సంభాషించే విధానాన్ని మార్చింది. స్వీయ డ్రైవింగ్‌ కార్ల నుండి వర్చువల్‌ అసిస్టెంట్ల వరకు, ఏఐ సామర్థ్యం, కచ్చితత్వం- మొత్తం మానవ అనుభవాన్ని మెరుగుపరచడంలో విశేషమైన పురోగతిని సాధించింది. అయినప్పటికీ, కృత్రిమ మేధ యుగాన్ని మరింత లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, దానివల్ల ఎదురయ్యే సమస్యలను పరిశీలించడం చాలా ముఖ్యం. దాని శక్తిని బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించేలా చూడటం మరింత కీలకం. ‘టెక్నాలజీ ఉపయోగకరమైన సేవకుడు, కానీ ప్రమాదకరమైన మాస్టర్‌’ అంటాడు నార్వే చరిత్రకారుడు క్రిస్టియన్‌ లాస్‌ లాంగే. మంచి పనులు చేయడానికి ఉపయోగించిన రోబోను… చెడ్డపనులకు ఎలా ఉపయోగించారో ‘రోబో’ సినిమాలో చూస్తాం.

‘మనిషి చేయగల ఏ పని అయినా మెషీన్స్‌ మరో 20 ఏళ్ళలో చేస్తాయి’ అని ప్రముఖ శాస్త్రవేత్త, అమెరికన్‌ రాజకీయ శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత హెర్బర్ట్‌ సైమస్‌ 1965లోనే అన్నాడు. నేడు మనిషి చేసే అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి. విద్య, వాణిజ్యం, వైద్యం, మిలిటరీ, పరిశోధన వంటి రంగాల్లో కృత్రిమ మేధ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో ఎఐ  ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. రోగనిర్ధారణలో ఏఐ మెరుగైన సేవలు అందిస్తోంది. ముఖ్యంగా వైద్యులకు సహాయం చేయడంలో, మానవ తప్పిదాలను తగ్గించడంతో పాటు కృత్రిమ మేధతో నడిచే రోబోలను శస్త్ర చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే, ఇటీవల ప్రాచుర్యం పొందిన చాట్‌ జిపిటి వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయోననే ఉత్సుకత ఒకవైపు ఉన్నా, ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయోననే ఆందోళన కూడా నెలకొంటోంది. ఇప్పటికే సాంకేతిక విజ్ఞానం ప్రభావం ఉద్యోగులపై కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి రంగాల్లో ఏఐ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఏఐ సాంకేతికతో వస్తోన్న వ్యవస్థలు (చాట్‌ జిపిటి వంటివి) ప్రపంచ మానవాళికి తీవ్ర ప్రమాదాన్ని తలపెడతాయని అంతర్జాతీయంగా టెక్‌ దిగ్గజ సంస్థల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థల డెవలప్‌మెంట్‌ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తూ అనేక మంది నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దాంట్లో ఎలాన్‌ మస్క్‌ వంటి కీలక వ్యక్తులు సంతకాలు కూడా చేశారు. ఇటువంటి వ్యవస్థలను సరైన రీతిలో ఉపయోగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ హెచ్చరించారు. కృత్రిమ మేధó దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆయన అన్నారు. ఈ కృత్రిమ మేధస్సును ప్రయోజనకరంగా ఉపయోగించడంపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని సుందర్‌ పిచాయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయా ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు.

అమెరికాకు చెందిన మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఇటీవల జెనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ఇన్‌ అమెరికా పేరిట నిర్వహించిన అధ్యయనంలో 2030 నాటికి అమెరికా ఉపాధి రంగంపై కృత్రిమ మేధ గణీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని వెల్లడిరచారు. ఆటోమేషన్‌ డేటా సేకరణ, రీసైక్లింగ్‌ పనుల్ని భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేస్తుంది. 2030 నాటికి ఒక్క అమెరికాలోనే 12 మిలియన్ల మంది తమ ఉద్యోగాల్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా కోల్పోవాల్సొస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాధాన్యత ప్రతి రంగంలో పెరుగుతోంది. ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోనూ కృత్రిమ మేధ వినియోగానికి గల అవకాశాలపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. 2030 నాటికి భారతిలో కూడా కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఇది నిరుద్యోగాన్ని పెంచే ప్రమాదముందని నిపుణులు ఇప్పట్నుంచే భయపడుతున్నారు.

మనిషి తన మేధస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? టెక్నాలజీ మనిషి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేధó వల్ల మనుషుల ఉపాధి తగ్గిపోయే అవకాశాలున్నాయనే అనుకుంటున్నాం గానీ ఏకంగా అదే టెక్నాలజీ మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయుధాన్ని ఉత్పత్తి చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మనుషుల్ని చంపే ఆయుధాలను ఎఐ సృష్టించగలదు.. అంటూ బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌ సలహాదారు క్లిఫర్డ్‌ హెచ్చరించారు. దీంతో టెక్నాలజీ అంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వచ్చాయా? అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కృత్రిమ మేధó చాలా శక్తివంతమైనది. కృత్రిమ మేథను నియంత్రించకపోతే కేవలం వచ్చే రెండేళ్లలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, టెక్‌ దిగ్గజ అధినేతలు హెచ్చరిస్తున్నారు.

భారత ఐటీ రంగం చాలాకాలంగా ప్రపంచ టెక్‌ రంగానికి బ్యాక్‌ ఆఫీస్‌గా పనిచేస్తోంది. అయితే రానున్న కాలంలో చాలా ఉద్యోగాలను కృత్రిమ మేధ కనుమరుగయ్యేలా చేయగలదని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఎఐని ఆదాయ మార్గంగా టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలు భావిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాట్‌ జిపిటి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైపు దృష్టి సారించాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థలో ఫుల్‌ టైం సిబ్బందికి  ఎవరికీ ఈ ఏడాది జీతాల పెంపు ఉండదంటూ మైక్రోసాఫ్ట్‌ షాక్‌ ఇచ్చింది. తద్వారా మిగిలిన మొత్తాన్ని మార్కెట్‌కు అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం వెచ్చించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 300 మిలియన్‌ ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలకు సమానమైన ఉద్యోగాలను భర్తీ చేయగలదని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్ట్‌మన్‌ సాచ్స్‌ నివేదిక పేర్కొంది. ఇది అమెరికా, యూరప్‌లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న పనుల్లో నాలుగింట ఒక వంతు భర్తీ చేయగలదు. దీనితో నిరుద్యోగితా శాతం పెరగడం ఖాయం. అంటే, కొత్త ఉద్యోగాలు కేవలం ఎఐకి సంబంధించినవే ఉంటాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు… మార్పులు… కొత్తకొత్త ఆవిష్కరణలు ఉద్యోగాల తీరుతెన్నులను మార్చేశాయి. ఎఐ పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఒకప్పుడు నలుగురు చేసే పని ఇప్పుడు ఒక్కరే చేయగలుగుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పని భారాన్ని మోస్తున్నారు. మనదేశం ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో, విద్యావంతుల సంఖ్య కూడ పెరుగుతున్నది. ఉద్యోగావకాశాలు మాత్రం పడిపోతున్నాయి. నిరుద్యోగులకు ఇది గడ్డుకాలం. భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారనున్న ఎఐ విచ్చలవిడి వినియోగానికి అడ్డుకట్ట వేయాలి.

పరిశ్రమల్లో కూడా ఆటోమేషన్‌ గణనీయ సంఖ్యలో ఉద్యోగ నష్టాల్ని కల్పించనుంది. పరిశ్రమల్లో ఉత్పాదకతను ఆటోమేషన్‌ ద్వారా క్రమపద్ధతిలో నిర్వహించొచ్చు. సంక్లిష్టమైన సృజనాత్మకమైన తయారీ వ్యవస్థలో కూడా ఇది సులువుగా పని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 2024 వరకు ఆటోమేషన్‌ వినియోగం 12 శాతం పెరుగుతుందని అంచనాలేస్తున్నారు. రవాణా, తయారీ, సేవా రంగం, రిటైల్‌ అమ్మకాలు, ఆర్థికసేవలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో దీని వినియోగం పెరుగుతోంది. ఆ స్థాయిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కూడా తగ్గనున్నాయి. అయితే ఎంతటి కృత్రిమ మేధ అయినా దాని తయారీ, నిర్వహణకు మానవ వనరుల అవసరం తప్పదు. కొత్త నైపుణ్యాలు గల ఉద్యోగులకు మాత్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా పెద్దగా నష్టం ఉండదు. కానీ నైపుణ్యాల్ని పెంచుకోవడంలో ఆసక్తి చూపని ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భారీ మార్పులు తీసుకరానుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సాంకేతికతను పెంచి మానవ శ్రమను తగ్గించడమంటే అది నిరుద్యోగానికి పర్యాయపదంగా మారుతుంది. మరోవైపు సాంకేతికత పెరుగుతుంటే పర్యావరణం విధ్వంసం అవుతుంది. తద్వారా మానవ శ్రమను తగ్గించివేయడం ద్వారా శ్రామికులకు పనిలేకుండా చేస్తుంది. ఆహార పదార్థాల ధరలను కూడ ఎఐ ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జనాభాలో అత్యధికులకు ఆదాయం లేకుండా పోతుంది. పనిలో ఉన్నవారికి కూడా తమ నిపుణతలు కొత్తగా మార్చుకోవలసి వస్తుంది. ఆ విధంగా వారు అవసరం లేని సజ్జుగా మార్చి వేస్తుంది. నేటీ పోటీ ఉద్యోగ విపణిలో ఇప్పటికే పని దొరక్క ఇబ్బందులు పడుతున్న యువతకు ఇది ఆందోళన కలిగించే అంశమే. మానవులకూ వారు సృష్టించిన వాటికీ (నిర్జీవ సజీవ శ్రమల) మధ్య ఘర్షణ మరోసారి ప్రజ్వరిల్లుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం వెల్లువలా వచ్చేస్తున్న నేటి నేపథ్యంలో ఇది మరోసారి విజృంభించనున్నది. మానవ మేధ సృష్టి అయిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆ మానవాళి శ్రేయస్సుకే నష్టదాయకమవడం ఇక్కడ వైపరీత్యం!

One thought on “కృత్రిమ మేధస్సు 

Leave a Reply