COVID-19 భారతదేశం అంతటా వ్యాపించడంతో, చమురు, గనుల పరిశ్రమలను నియంత్రించే కీలక పర్యావరణ భద్రతా నిబంధనలను పలుచన చేయడానికి గని త్రవ్వకాల- చమురు సంస్థ వేదాంత కంపెనీ చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. అదానీ అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసిసిఆర్‌పి) కరోనా సమయంలో వేదాంత గ్రూప్‌ జరిపిన రహస్య లాబీయింగ్‌, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది.

ఓసిసిఆర్‌పి నివేదిక ముఖ్యాంశాలు:

– కోవిడ్ సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను బలహీనపరిచేందుకు మైనింగ్ – చమురు దిగ్గజం వేదాంత ప్రచ్ఛన్న లాబీయింగ్ చేసింది.

– ప్రజలతో సంప్రదింపులు జరపకుండానే భారత ప్రభుత్వం మార్పులను ఆమోదించింది. చట్టవిరుద్ధమైనవని  నిపుణులు చెప్తున్న పద్ధతులను ఉపయోగించి వాటిని అమలు చేసింది.

– ఒక సందర్భంలో, నూతన పర్యావరణ సంబంధిత అనుమతుల అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50             శాతం వరకు ఎక్కువ ఉత్పత్తి చేయగలవని నిర్ధారణ చేయడంలో వేదాంత నాయకత్వం వహించింది.

– ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాక్‌లలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం బహిరంగ విచారణలను రద్దు   చేయడానికి వేదాంత గ్రూప్‌ చమురు వ్యాపార సంస్థ కెయిర్న్‌ ఇండియా సైతం విజయవంతంగా లాబీయింగ్ చేసింది.

– తత్ఫలితంగా రాజస్థాన్‌లో కెయిర్న్‌కు చెందిన ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులు స్థానిక వ్యతిరేకత  ఉన్నప్పటికీ అనుమతిని పొందాయి.

కోవిడ్ COVID -19 విపత్తు భారతదేశాన్ని 2021లో చీల్చి చెండాడింది, దేశ ఆరోగ్య వ్యవస్థను నీరు కార్చేసింది, ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసింది. అయితే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌కు మాత్రం ఆ సంక్షోభం ఒక అవకాశాన్ని అందించింది. 

2021 జనవరిలో వేదాంత గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు “కొత్త పర్యావరణ అనుమతులు లేకుండానే కంపెనీలకు గనుల తవ్వకాలకు వీలు కల్పిస్తే 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచగలుగుతాయని, దీనివల్ల దేశ జీడీపీ పరుగులు పెడుతుందని, అంతేగాక పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కూడా వస్తాయని, ప్రభుత్వ ఖజానాకూ భారీగా ఆదాయం వస్తుందని” లేఖ రాసారు. దీంతో జవదేకర్‌ వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తన మంత్రిత్వ శాఖ కార్యదర్శికి తగువిధంగా సూచనలు చేసాడు. “విధాన సమస్యను చర్చించమని” రాసిన లేఖపై “VIMP [చాలా ముఖ్యమైనది]” అని కూడ రాసాడు. అటవీ శాఖ డైరెక్టర్‌ జనరల్‌కూ పర్యావరణ అనుమతుల విధానంపై చర్చ అవసరమని లేఖ రాసాడు. ఈ నేపథ్యంలోనే అడ్డగోలుగా పర్యావరణ చట్టాల సవరణ జరిగిపోయింది. తద్వారా అనిల్‌ అగర్వాల్‌ తాను కోరుకున్నది సాధించారు. ఇదే విధమైన మార్పు కోసం గతంలో పరిశ్రమ చేసిన ప్రయత్నాలు నిలిచిపోయాయి.

పర్యావరణ అనుమతి ప్రక్రియ అత్యంత కఠినమైనదిగా వుండం అవసరమని పరిశ్రమలోని చాలా మంది భావించినప్పటికీ, రహస్య సమావేశాల తర్వాత, 2022 ప్రారంభంలో భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను సడలించి, బహిరంగ విచారణలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు తమ ఉత్పత్తిని 50 శాతం వరకు పెంచడానికి అనుమతించింది. అక్రమ పద్ధతిలో చట్టాల సవరణతో వేదాంత గ్రూప్‌తోపాటు గనుల రంగంలోని ఇతర కంపెనీలకూ మోదీ సర్కారు లబ్ధి చేకూర్చింది.

ఒక ప్రధాన పరిశ్రమ లాబీ గ్రూప్ అధిపతి, భారతదేశపు మైనింగ్ కార్యదర్శి కూడా నిబంధనలను సడలించాలని ఒత్తిడి చేసినప్పటికీ, అంతర్గత పత్రాలు, ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాల ప్రకారం వేదాంత లాబీయింగ్ యిందుకు కీలకమని సూచిస్తున్నాయి. ఆఫీస్ అంతర్గత సమాచారాల కోసం ఉపయోగించే తన వెబ్‌సైట్‌లో ఆఫీస్ మెమోను ప్రచురించడం ద్వారా పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను మార్చింది.

స్థానిక సముదాయాలకు నష్టాన్ని కలిగించి, పర్యావరణాన్ని దెబ్బతీసేవైనప్పటికీ, తమకు అనుకూలంగా విధానాలను రూపొందించుకోవడానికి భారత ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న శక్తివంతమైన వ్యక్తులకు ఈ రకమైన రహస్య లాబీయింగ్ వీలు కల్పిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎటువంటి బహిరంగ చర్చ లేకుండా, ఆఫీస్ మెమోలు వంటి సాధనాలను ఉపయోగించి ముఖ్యమైన నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వం కూడా చట్టాన్ని ఉల్లంఘించిందని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ చేసిన విపత్తు-యుగ నియంత్రణ మార్పుల అధ్యయనం అభిప్రాయపడింది.

ఒక అధ్యయనాన్ని నిర్వహించిన ‘థింక్ ట్యాంక్ క్లైమేట్ అండ్ ఎకోసిస్టమ్స్ టీమ్’ అధిపతి దేబదిత్యో సిన్హా “సమిష్టిత, ప్రజాస్వామ్య నిర్ణయాధికార సూత్రాలతో గల వాటి పొందికకు సంబంధించి ఈ మార్పులు ఆందోళన కలిగిస్తాయి” అని వ్యాఖ్యానించారు.

విపత్తు సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను ఎలా సవరించారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమాచార స్వేచ్ఛ హక్కును ఉపయోగించి పొందిన వేలాది ప్రభుత్వ పత్రాలను గ్లోబల్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం నెట్‌వర్క్‌ ఓసిసిఆర్‌పి పరిశీలించింది. పరిశ్రమ చేసిన, ముఖ్యంగా వేదాంత కంపెనీ చేసిన అభ్యర్థనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు నిబంధనలను రూపొందించినట్లు రికార్డులు, అంతర్గత మెమోలు, రహస్య సమావేశాల నిర్ణయాల వివరాల నుండి అగర్వాల్ నుండి వచ్చిన లేఖల వరకు చూపిస్తున్నాయి.

భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన కంపెనీలలో ఒకటైన వేదాంతకు, గత సంవత్సరం $18 బిలియన్ డాలర్లు (1800 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ రెవెన్యూ వున్నట్లుగా నివేదిక తెలియచేస్తోంది. దీని ఛైర్మన్ అగర్వాల్ పరధాని మోడీ అభిమాని. ప్రధానిని, ఆయన విధానాలను బహిరంగంగా ప్రశంసించాడు. భారతీయ జనతా పార్టీ (BJP)కి వేదాంత ముఖ్యమైన మద్దతుదారు కూడ: కేవలం వేదాంత-సంబంధిత రెండు ట్రస్ట్‌‌లు మాత్రమే 2016-2020 మధ్య పార్టీకి $6.16 (రూ.43.5 కోట్లు) మిలియన్లు విరాళంగా ఇచ్చాయని ఓసిసిఆర్‌పి విశ్లేషించిన విరాళాల నివేదికలు చూపుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఒక ట్వీట్‌లో “ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత బలమైన, [అత్యంత] నిర్భయ నాయకుడు” అని అభివర్ణించాడు.

అగర్వాల్ మోడీకి లేఖ రాయడానికి ముందు సంవత్సరం, వేదాంత గ్రూప్‌ చమురు వ్యాపార సంస్థ కెయిర్న్‌ ఇండియా కూడా చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం బహిరంగ విచారణలను రద్దు చేయడానికి లాబీయింగ్ ప్రారంభించింది. గనుల త్రవ్వకాల మాదిరిగానే, ప్రభుత్వం ఎటువంటి ప్రజా సంప్రదింపులు లేకుండా నిశ్శబ్దంగా ఆ చట్టాన్ని సవరించింది. అప్పటి నుండి, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కెయిర్న్‌ లాబీయింగ్‌తో అనుమతుల్ని పొందిన రాజస్థాన్‌లోని ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులు “అభివృద్ధి సూచిక”గా కొనసాగుతున్నాయి.

భారతదేశ కార్పొరేట్ నేతలకు తమ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి పర్యావరణంపై మరింత విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసే దేశాలలో మన దేశం మూడో స్థానంలో ఉంది. (మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో కార్బన్ డై ఆక్సైడ్ వాటా 76 శాతం. ప్రధానంగా వ్యవసాయం నుండి వచ్చే మిథేన్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో 16 శాతం; ఎక్కువగా పరిశ్రమ-వ్యవసాయాల నుండి వచ్చే నైట్రస్ ఆక్సైడ్ 6 శాతం దోహదం చేస్తాయి. పర్యావరణం, ఆరోగ్యాలపై గ్రీన్‌హౌస్ వాయువులు సుదీర్ఘకాల దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. అవి వేడిని గ్రహించడం ద్వారా వాతావరణ మార్పులకు కారణమవుతాయి. పొగమంచు, వాయు కాలుష్యాల వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.  గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల కలిగే ఇతర ప్రభావాలు వాతావరణంలో విపరీతమైన మార్పులు, ఆహార ఉత్పత్తిలో అంతరాయాలు, అధికమయ్యే దావానలాలు మొదలైనవి.) వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నాలకి భారీ పరిశ్రమలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగివుండడం అనేది చాలా కీలకమైన అంశం .

2030 నాటికి భారతదేశపు కర్బన ఉద్గారాలను బిలియన్ టన్నుల మేర తగ్గించి, ఆ తర్వాత 40 ఏళ్లలోపు నికర సున్నా ఉద్గారాలను చేరుకుంటామని మోడీ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. కానీ, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అతని ప్రభుత్వం చమురు, మైనింగ్ కంపెనీల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చిందని ఓసిసిఆర్‌పి కనుగొన్న విషయాలను సమీక్షించిన నిపుణులు చెబుతున్నారు.

“ఇది పర్యావరణ పాలనపై కార్పొరేట్ జరిపిన ఆక్రమణకు సంబంధించిన స్పష్టమైన కేసు” అని అంటున్నారు పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తా.

గత కొన్ని సంవత్సరాలుగా, పర్యావరణ చట్టాలు, విధానాలలో చేసిన అత్యధిక మార్పులు చాలావరకు కొన్ని కార్పొరేట్ సంస్థలు లేదా రంగాల ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా వున్నాయనేది స్పష్టమైంది.

“భారతదేశంలోని ప్రముఖ సహజ వనరుల సంస్థలలో ఒకటిగా” తమ కంపెనీ “స్థానిక, దేశీయ ఉత్పత్తిని క్రమంగా పెంచడం ద్వారా దిగుమతి ప్రత్యామ్నాయాన్ని లక్ష్యంగా చేసుకుంది” అని వేదాంత ఓసిసిఆర్‌పికి తెలిపింది.

 “దీనిని దృష్టిలో ఉంచుకుని, జాతీయ అభివృద్ధికి, సహజ వనరులపై భారతదేశం స్వావలంబన దిశగా సాగే ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా, నిరంతర ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించింది” అని ఒక ప్రతినిధి ఒక ఇమెయిల్‌లో రాశారు.

భారతదేశ ప్రస్తుత పర్యావరణ మంత్రి వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనలకు మోడీ కార్యాలయం స్పందించలేదు. పంపిన ప్రశ్నలకు మాజీ పర్యావరణ మంత్రి జవదేకర్ సమాధానం ఇవ్వలేదు.

పర్యావరణవేత్తలపై అణచివేత

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం పర్యావరణవేత్తలు మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి బెదిరింపులు, సెన్సార్షిప్‌లు (కత్తిరింపులు) పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రధాన కొత్త పర్యావరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారితో సహా పర్యావరణ సమస్యలపై ప్రచారం చేస్తున్న కార్యకర్తల సముదాయాల వెబ్‌సైట్‌లను భారతీయ అధికారులు బ్లాక్ చేశారని మీడియా దర్యాప్తులో తేలింది.

బొగ్గు ప్రాజెక్టులను “తొలగించడానికి” విదేశీ నిధులను ఉపయోగిస్తున్నాడని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పర్యావరణ న్యాయవాది రిట్విక్ దత్తాపై ఏప్రిల్‌లో ఆరోపణలు చేసింది. ఈ కేసు “వాస్తవిక లోపాలు, తప్పుడు ప్రస్తావనలతో నిండి ఉంది” అని, ఇది “భారతదేశంలో వ్యాజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని” నిపుణులు పేర్కొన్నట్లు లీగల్ వాచ్ డాగ్ ఆర్టికల్ 14 పేర్కొంది.

ఒక థింక్ ట్యాంక్ (మేథోపర సంస్థ) అయిన ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌’కు వున్న విదేశీ నిధులను స్వీకరించే  లైసెన్స్‌ను ఈ సంవత్సరం నిలిపివేసింది. పర్యావరణ కారణాలతో “ప్రమేయం” కారణంగా నివేదించబడిన ఉల్లంఘనల కోసం పన్ను అధికారులు వారి రికార్డులను పరిశీలించడం ప్రారంభించారు. వాషింగ్టన్ పోస్ట్ జూన్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు, మోడీ ముఖ్య మిత్రుడు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ యాజమాన్యంలోని భారీ బొగ్గు గని తవ్వకాలను విమర్శిస్తున్న వారిపై కూడా ప్రభుత్వం విరుచుకుపడింది. గత సెప్టెంబర్‌లో పన్ను అధికారులు ఒకేసారి మూడు లాభాపేక్షలేని సంస్థలపై దాడి చేశారు.

” కరోనా విపత్తు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసే వ్యక్తులను పరిమితం చేయడాన్ని అధికారులకు సులభతరం చేసింది, విపత్తు పరిమితులు సడలించిన తరువాత కూడా ఇది కొనసాగింది” అని 2021 లో రైతాంగం కోసం కేంపెయిన్  చేసినందుకు అరెస్టు అయిన పర్యావరణ కార్యకర్త దిషా రవి “విమర్శలు, సూచనల ఆరోగ్యకరమైన ప్రవాహాన్ని అనుమతించని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యం” అన్నారు. ఓసిసిఆర్‌పి సంప్రదించినప్పుడు ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి అధికారులు నిరాకరించారు.

మైనింగ్ నిబంధనల సడలింపు

కరోనా విపత్తు  భారతదేశాన్ని తాకడానికి ముందే, కంపెనీలు ఉత్పత్తిని పెంచినప్పుడు కొత్త పర్యావరణ ఆమోదాలు అవసరమయ్యే నిబంధనలను తొలగించడానికి మైనింగ్ పరిశ్రమ సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తూంది. ప్రత్యేకించి, విస్తరణ తమ జీవితాలను, జీవనోపాధిని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై స్థానిక ప్రజలు తమ భయాందోళనలను వ్యక్తం చేయగల ప్రజా సంప్రదింపులను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగించాలని పరిశ్రమ కోరుకుంది.

ఆ ప్రక్రియను రద్దు చేయాలన్న ఆలోచనను 2018లో లేవనెత్తినప్పటికీ, రాష్ట్ర, సమాఖ్య ప్రభుత్వాలు రెండూ ఆ అంశం తమ పరిధిలో లేదని పేర్కొనడంతో ఏమీ చేయలేదని పలు పరిశ్రమలు, ప్రభుత్వ వర్గాలు ఓసిసిఆర్‌పికి తెలియచేసాయి. 2021 జనవరిలో వేదాంత చైర్మన్ పర్యావరణ మంత్రికి లేఖ రాసినప్పుడు మాత్రమే దీనిపై తీవ్రంగా చర్చించినట్లు అంతర్గత పత్రాలు చూపిస్తున్నాయి.

అగర్వాల్ జవదేకర్‌కు లేఖ రాసిన రెండు వారాల తరువాత, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాబీ గ్రూప్ అధిపతి నుండి పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఇదే విధమైన అభ్యర్థనతో ఒక లేఖ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభుత్వం బొగ్గు గనుల కోసం కూడా ఇలానే చేసిందని, కాబట్టి ఇతర రకాల గనులకు కూడా ఈ నిబంధనలను వర్తింపజేయడం సరళమైన విషయం అని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత, మైనింగ్ శాఖ కార్యదర్శి నిబంధనలను సడలించి, పర్యావరణ మంత్రిత్వ శాఖలో తన సహోద్యోగిని బొగ్గుతవ్వకాలకు సమానమైన సడలింపును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జూన్ నెలలో, వెదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్, సునీల్ దుగ్గల్, నేరుగా మోదీకి రాసిన లేఖలో, ప్రధాన మంత్రి పర్యావరణ ఆమోదాలను మంజూరు చేసే ప్రస్తుత పద్ధతిని రద్దు చేయడం ద్వారా “ఆర్థిక ఇంజిన్‌ను పెంపొందించవచ్చు” అని వాదించారు. ఇది వృద్ధిని పెంచడమే కాక, ఉద్యోగాలను సృష్టించి, దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ అంశంపై చర్చించేందుకు ఇప్పటికే సమావేశాలు, కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న పర్యావరణ కార్యదర్శికి మోదీ కార్యాలయం లేఖను పంపింది. కానీ అప్పుడు కూడా ఈ ఆలోచన అంతర్గత వ్యతిరేకతను ఎదుర్కొంది.

వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ దుగ్గల్ 2021 జూన్ 13 న నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మోదీ కార్యాలయం అప్పటి పర్యావరణ కార్యదర్శికి ఆ లేఖను పంపింది.

నిబంధనలను సడలించడం చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో అనియంత్రిత గని త్రవ్వకాలకు ఉచిత పాస్ ఇస్తారని అధికారులు భయపడ్డారని జూలైలో జరిగిన ఒక సమావేశ వివరాలు చూపుతున్నాయి. మంత్రిత్వ శాఖ అధికారులు, మైనింగ్ నిపుణులతో రూపొందించబడిన జాయింట్ ఎక్స్‌‌పర్ట్ అప్రైజల్ కమిటీ అంతర్గత సమావేశ సారాంశం ఇలాంటి ఆందోళనలను గుర్తించింది. మైనింగ్ ఉత్పత్తిలో ఏదైనా పెరుగుదల చేయాలంటే ప్రజా సంప్రదింపులు అవసరమని పేర్కొంది.

అక్టోబరులో, భూపెందర్ యాదవ్ నేతృత్వంలోని పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఒక మెమో బహిరంగ విచారణలు లేకుండా గనులలో ఉత్పత్తిని 20 శాతం మాత్రమే విస్తరించడానికి అనుమతించింది.  ఇది అగర్వాల్, మైనింగ్ పరిశ్రమ లాబీ గ్రూప్ కోరుకున్న దానిలో సగం కంటే తక్కువ. కానీ మోదీకి నేరుగా రిపోర్టు చేసే కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రభుత్వంలో బ్యూరోక్రసీని తగ్గించడానికి అంతర్గత ప్రయత్నానికి నాయకత్వం వహించినప్పుడు ఈ సమస్యను పునరుద్ధరించారు.

2021 డిసెంబర్ 9 న జరిగిన సమావేశ వివరాల్లో, ప్రాజెక్టులను ఆమోదించడానికి దాని ప్రక్రియను సమీక్షించాలని పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆయన ఆదేశాలిచ్చినట్లు చూపిస్తున్నాయి. గౌబాజ్ ఇచ్చిన ఆదేశాన్ని మైనింగ్ రంగానికి సంబంధించిన వివిధ నిబంధనలను మార్చే ఆదేశంగా భావించినట్లు ఒక అధికారి చెప్పారు. “ఇసి [పర్యావరణ క్లియరెన్స్], ఎఫ్‌సి [ఫారెస్ట్ క్లియరెన్స్] ప్రక్రియలలో మార్పులు చేయమని క్యాబినెట్ కార్యదర్శి మమ్మల్ని కోరారు, కాబట్టి ఇది చేయవలసి వచ్చింది” అని చెప్పిన అధికారి తన పేరు బయటపెట్టవద్దని, అలా చేస్తే తన ఉద్యోగానికి ప్రమాదమేర్పడవచ్చని ఓసిసిఆర్‌పిని కోరారు.

గని తవ్వకందారులు ఉత్పత్తిని 40 శాతం వరకు విస్తరించినప్పుడు  ప్రజా సంప్రదింపులు జరపవలసిన అవసరం వుండదని, 50 శాతం వరకు పెంచితే కేవలం వ్రాతపూర్వక అభిప్రాయాన్ని పంపుతే సరిపోతుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్లో ఒక మెమోను ప్రచురించింది. భారతీయ ప్రజానీకంలో నిరక్షరాస్యులైన అధిక శాతం ప్రజలను, ప్రభుత్వ బ్యూరోక్రసీని ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఇది మినహాయిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఎటువంటి ప్రజా సంప్రదింపు ప్రక్రియను నిర్వహించకుండా మెమోను ఉపయోగించి భారతదేశ పర్యావరణ చట్టానికి పెద్ద మార్పును అమలు చేయడం చట్టవిరుద్ధమని పర్యావరణ న్యాయవాది దత్తా అన్నారు. “ఆఫీస్ మెమోరాండం ఒక చట్టం కాదు. చట్టంగా పరిగణించబడదు” అని అతను ఒక ఇమెయిల్‌లో రాశాడు.

నిబంధనలను సడలించడం

భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి, చట్టంలో ఏవైనా ప్రతిపాదిత మార్పులను సంప్రదింపుల కోసం ప్రజల ముందుంచాలి. ఆఫీస్ మెమోలు అంతర్-ప్రభుత్వ కమ్యూనికేషన్ రూపాలు, కాబట్టి చట్టాన్ని ప్రవేశపెట్టడానికి లేదా మార్చడానికి ఉపయోగించకూడదు. బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని 50 శాతం వరకు పెంచుకునేందుకు అనుమతినివ్వడానికి  ప్రభుత్వం ఆఫీస్ మెమోను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పర్యావరణవేత్తలు, న్యాయవాదులు ఓసిసిఆర్‌పికి తెలిపారు.

“నా దృష్టిలో OM [ఆఫీస్ మెమో] స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుంది, అది పర్యావరణానికి మంచిది కాదు” అని 2019 లో మోదీ ప్రభుత్వం తన ఖనిజాల విధానాన్ని మార్చవలసి వచ్చిన ఒడిశాలోని ఒక కీలకమైన మైనింగ్ కేసులో తీర్పు ఇచ్చిన పూర్వ న్యాయమూర్తి మదన్ లోకుర్ అన్నారు.

పర్యావరణాన్ని దెబ్బతీసే అభివృద్ధిని ఆపడానికి బహిరంగ విచారణలు “గార్డ్రైల్స్” (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో, ప్రాజెక్ట్‌ను ట్రాక్‌లో ఉంచడానికి మరియు సంభావ్య ప్రమాదాలు లేదా సమస్యల నుండి రక్షించడానికి సహాయపడేవి) గా పనిచేస్తున్నాయని, కాబట్టి గనుల ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పుడు వాటిని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం “అస్థిరమైన అభివృద్ధిని” ప్రోత్సహిస్తోందని లోకుర్ అన్నారు.

నిబంధనలను సమర్థిస్తూ భారతదేశ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును “విరుద్ధమైనది” అని ప్రముఖ పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తా విమర్శించారు. చమురు-గ్యాస్ కంపెనీలను బహిరంగ విచారణలు నిర్వహించకుండానే అన్వేషణాత్మక డ్రిల్లింగ్‌ను నిర్వహించడానికి అనుమతించే మార్పులపై నిపుణులు ఇలాంటి విమర్శలు చేశారు. ఇది తీవ్రమైన పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుందని వారు హెచ్చరించారు.

ఈ మార్పులను ప్రచురించిన కొద్దిసేపటికే పర్యావరణ కేసులను విచారించే న్యాయ సంస్థ అయిన భారతదేశ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో అనుభవజ్ఞుడైన పర్యావరణ కార్యకర్త రాజీవ్ సూరి పిటిషన్‌లో సవాలు చేశారు. పర్యావరణ చట్టాల ప్రకారం ప్రజా విచారణలు “ప్రజలకు అత్యంత ముఖ్యమైన భద్రతలలో ఒకటి” అని ఆయన వాదించారు. మార్పులు కేవలం విధానపరమైనవని ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ కోర్టు సూరికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

అయితే, ఓసిసిఆర్‌పి పొందిన పత్రాల్లోని కొన్ని వివరాలను – ప్రత్యేకించి, ప్రభుత్వ స్వంత జాయింట్ ఎక్స్పర్ట్  అప్రైజల్ కమిటీ ఒక సమావేశం తీర్మానాలలో ‘మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని పెంచే ప్రతి దశలోనూ ప్రభావితమైన ఎవరితోనైనా రాతపూర్వకంగా సంప్రదించాలని’ సిఫార్సు చేసిన విషయాన్ని అప్పీల్‌కు ఆధారాలుగా పరిగణించినట్లు సూరి తరపు న్యాయవాది వంశదీప్ దాల్మియా చెప్పారు.

ఈ సమాచారాన్ని కోర్టుకు వెల్లడించకపోవడం కేసు సారాంశంపై “ప్రాముఖ్యమైన ప్రభావాన్ని” కలిగి ఉన్న వాస్తవాలను “మినహాయింపు-దాచడం” కు సమానం అని డాల్మియా అన్నారు.

ఓసిసిఆర్‌పి విచారణ ” బడా వ్యాపార సంస్థల మధ్య సంక్లిష్టతను వెలుగులోకి తెచ్చిందని”, “వీరు తమ డబ్బును, శక్తిని నిర్ణయాలు తీసుకునే అధికారులను సంప్రదించడానికి ఉపయోగిస్తారు” అని సూరిరి చెప్పారు. అయితే విపత్తు  సమయంలో కేవలం వేదాంత రహస్య లాబీయింగ్ ప్రయత్నాల వల్ల  మాత్రమే మైనింగ్ చట్టాలలో మార్పులు జరగలేదు.

  • అక్షయ్ దేశ్‌మనే
  • తెలుగు: పద్మ కొండిపర్తి
https://adrindia.org/content/inside-indian-energy-and-mining-giant-vedantas-campaign-weaken-key-environmental-regulations
https://www.newsclick.in/vedanta-covertly-lobbied-centre-weaken-environmental-laws

Leave a Reply