(ఇది 2015 జనవరిలో విరసం ప్రచురించిన *సామాన్యుల సాహసం * అనే కథా సంకలనానికి రాసిన ముందు మాట.  మైనా , నిత్య, సుజాత రాసిన కథల సంకలనం ఇది. వీళ్ళు భారత  విప్లవోద్యమంలో సీనియర్ నాయకులు.  అజ్ఞాత కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలి వరుస రచయిత్రులు.  సామాన్య ప్రజలే  చరిత్రను నిర్మించగల సాహసికులుగా, సృజనశీలురుగా, మహాద్భుత శక్తిగా  వర్గపోరాటం లో  తయారవుతారని విప్లవోద్యమమం నిరూపించింది. ఆ మానవ పరిణామాన్ని ఈ కథలు చిత్రిక పట్టాయి. నలభై ఏళ్ళ అజ్ఞాత రచయిత్రుల కథలు *వియ్యుక్క* గా వెలువడుతున్న ఈ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట చారిత్రిక సందర్భాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని అల్లం రాజయ్య రాసిన ఈ ముందుమాటను పాఠకుల కోసం పునర్ముద్రిస్తున్నాం. ..వసంత మేఘం టీం )

ఉద్యమాలల్లో నుండి ఉద్యమ అవసరాల కోసం కలం పట్టి రాస్తున్న ముగ్గురు రచయిత్రుల పదమూడు కథలు చదవడం ముందుమాట రాయడం ఒక అనుభవం. ముఖ్యంగా తెలుగులో విప్లవ సాహిత్యంలో ఒక విస్ఫోటనంగా – తమదైన ఒక ప్రత్యేక గొంతుగా మహిళలు నాకు తెలిసి షహీదా, మిడ్కో మైనా, నిత్య, సుజాత, అమరక్క అనురాధ, పద్మకుమారి, తాయమ్మ కరుణ వాళ్లు వాసిలో, రాశిలో మంచి కథలు రాస్తున్నారు. తమదైన ఒక కొత్త వొరవడి సృష్టిస్తున్నారు. మహిళా సాహిత్యంలో కూడా ఒక ఆచరణ క్రమంలో – పోరాటంలో – వైరుధ్యాలను పరిష్కరించుకున్న ఒక విలక్షణ విప్లవ సాహిత్యం కూడా ఈ సాహిత్యం. విప్లవోద్యమంలో మహిళలగురించి అధ్యయనం చేసినట్లుగానే – ఈ సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం

చేయవల్సి ఉంటుంది.

“జాజిపూల పరిమళం” పేర షహీదా కథలు 33 ఒక సంకలనంగా వెలువడ బోతున్నది. లోగడ మిడ్కో కథలు వచ్చాయి. తాయమ్మ కరుణ కథల సంకలనం వచ్చింది. ఇప్పుడు మైనా, నిత్య, సుజాత కథలు ఈ సంకలనంలో రాబోతున్నాయి.నా దృష్టికి రాని రచయిత్రులు చాలా మంది ఉండవచ్చును.

సుదీర్హ విప్రవానుభవం గల ఈ ముగ్గురు రచయిత్రులు రాసిన కథలు సంఖ్యలో తక్కువే… బహుశా అందుకు కారణం అనేక పరిమితుల మధ్య యుద్ధరంగంలో నిలబడి రాయడం కూడా యుద్ధమంత తీవ్రమైందే… కనుక ఈ రచయిత్రులు పని చేస్తున్న రంగంలోంచి మాత్రమే – ఆ ఒత్తిడి తీవ్రత నుంచి మాత్రమే ఈ కథలనుఅర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అంచనా వేయాల్సి ఉంటుంది.

వస్తువు, శిల్చం, భాష, వాళ్లు ఎంచుకున్న కథాంశంలోని వైరుధ్యాలు – వాటి పరిష్కారంలో సాగిన వారి కథలు… విప్లవ పోరాట కాలం నాటి రష్యా, చైనా, కథలను గుర్తుకు తెస్తాయి. మైనా, నిత్య, సుజాత ఈ ముగ్గురు రచయిత్రులు స్ధలం, కాలం వేరైనా ఒకేవస్తువు గురించి రాసినా కూడా – వారి వారి ప్రత్యేకలు – కథా నిర్వహణకుసంబంధించిన నైపుణ్యంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి దృష్టి కోణం వారిదే.మైనా కథలు మూడు – బాలగెరిల్లాలు, కరువుదాడి, అరుణ స్మృతిలో…బాలగెరిల్లాలు, కరువుదాడి దండకారణ్య నేపధ్యంలో రాసినవి. పోరాటం ఉన్నఒక గ్రామంలో బాలల సంఘం అధ్యక్షుడు కా॥ బుద్రాల్కు 18 సంవత్సరాల వయస్సు. చురుకైన బాల కామ్రేడ్. గ్రామంలో జరిగే అనేక విషయాలను దళానికి రిపోర్టు చేయడమే కాక బాలల సంఘాన్ని చైతన్యవంతంగా తయారు చేశాడు. బాలల సమస్యలు – పెద్దవాళ్లు పిల్లలను కొట్టడం చేయవద్దని పిల్లలందరి తరఫున చెప్పుతాడు. కొద్ది రోజుల తర్వాత మరోమారు దళం వెళ్ళేసరికి కా॥ బుద్రాల్ లేడు. కడుపునొప్పి, కక్కుడు, విరేచనాలతో చనిపోయాడు. సామాజిక అవసరాలు తీర్చే బాధ్యతను వొదిలేసిన పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడే విప్లవకారులు – అత్యంత దుర్భర పరిస్థితులో ఉన్న ప్రజల అవసరాలు పట్టించుకొని నిర్మాణం చేయాల్సిన స్థితిని తెలుపుతున్నదీ కథ. బుద్రాల్ అకాల, అవాంఛనీయ మరణం గురించి ఆలోచించకుండా ఉండలేము. ఆదివాసి ప్రాంతాలల్లో ఇలాంటి మరణలు కోకొల్లలు.

రెండవ కథ కరువుదాడి. ప్రజలల్లో ఉందే ఆస్తికి సంబంధించిన సాంప్రదాయిక అభిప్రాయాలను ఆలోచనలను తార్మికంగా చర్చించిన కథ – “ఒకరి మాల్ తెచ్చుకుంటే దొంగతనం బెతుంది కదా!” కరువుదాడి ప్రపోజ్ చేసిన కమిటీలోని జోగి “భూస్వాములు తక్కువ కూలి ఇవ్వడం, ఒక్కొక్కసారి వారం పది రోజుల కూలి ఎగ్గొట్టడం ఇంతే కాకుండా మనలాంటి గరీబోల్ల కష్టంతో ఎందరో బలిసిన షావుకార్లు అయ్యారు…” అని అదనపు విలువే కదా భూస్వాముల సంపద అనే విషయాన్ని అసలు దొంగలు భూస్వాములేనని చెప్పుతాడు… తీవ్రమైన కరువులో ఆదివాసులు కరువుదాడి చేసి ధాన్యం మాత్రమే తెచ్చుకొని ప్రాణాలు కాపాడుకుంటారు.

మూడో కథ అరుణ స్మృతిలో… ఈ కథ మహబూబ్ నగర్  ప్రాంతంలో పనిచేసిన మహిళా కామ్రేడ్ సుగుణకు సంబంధించినది. సుగుణ సహచరుడు కిరణ్ చెరువులో మునిగిపోవడం ఒక విషాదం. సుగుణ తనకళ్ల ముందే జరిగిన ఆ ఘటనకు కదిలి పోతుంది. విప్లవోద్యమాలల్లో సహచరులైనా కూడా అనేక కారణాల రీత్యా సంవత్సరాల తరబడి కలిసి ఉందే అవకాశం రాదు. వచ్చినా కూడా సమయం, సందర్భం – నిర్బంధం అనేక కారణాల రిత్యా విప్లవకారుల జీవితం, సాహచర్యం చాలా ఒడిదొడుకులతో సాగుతుంది. తమ సహచరులు అమరులైనప్పుడు. ఉద్యమ ప్రాంతాలు మారినప్పుడు స్తీ పురుషులిద్దరికి ఎదురయ్యే మానసిక సమస్యలు. ఇలాంటి సందర్భంలో సుగుణ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అట్లా మళ్లీ పెళ్లి చేసుకున్న తరువాత వాళ్లిద్దరిని పోలీసులు పట్టుకొని కాల్చేశారు. అక్షరాల వెనుక – వాక్యాల వెనుక విప్లవకారుల లోలోపలి సంఘర్షణ ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే…

విప్లవకారుల లోపలి సంఘర్షణను రేఖామాత్రంగా చిత్రించిన కథ.

మైనా కథల్లో క్లుప్తత, నిరాడంబరత కన్పిస్తుంది. సుదీర్భ విప్లవ జీవితానుభవం కల్గిన మైనాకు పరిస్థితులు అనుకూలిస్తే రాయాలనుకుంటే మరింత సాహిత్యం రాగలదు.

నిత్య రాసిన మూడు కథలు చాయ్ గ్లాస్ , మార్పు ,  లక్ష్మణ రేఖ.. చాయ్ గ్లాస్  ప్రసిద్ధమైన కథ. వస్తువు రీత్యా, శిల్చం రీత్యా కూడా… పితృస్వామిక భావజాలం జీవితం పొడుగుతా అవిచ్చిన్న ఆచరణలో కూడా ఎట్లా వ్యక్తమౌతుంది? ఏ విధంగా తమతోటి వాళ్లను ముఖ్యంగా మహిళలను న్యూనతగా చూస్తుంది. చాయ్ గ్లాస్ ద్వారా వ్యక్తమైన పితృస్వామిక భావజాలం అత్యంత సునిశితంగా, సున్నితంగా చిత్రించిన కథ. నిత్య జీవితంలో ఇంకి పోయిన ఈ ఆధిపత్య భావజాలాన్ని ఎట్లా గుర్తించాలి ఎట్లా మార్చాలి? దండకారణ్యంలో పురుషులతో సమానంగా పోరాడుతున్న మహిళలు ఇట్లాంటి పితృస్వామిక భావజాలాన్ని గుర్తించి – ఏకకాలంలో భౌతిక, భావజాల రంగాలల్లో ఏవిధంగా యుద్ధం చేస్తున్నారో ఈ కథ తెలువుతుంది. కథ పది సంవత్సరాల కాలపరిధిలో – కొన్ని ప్రతీకల ద్వారా – అటు విప్లవాన్ని – ఆ విప్లవంలో వస్తున్న మార్పులతో పాటు భావజాల మార్చును సూచిస్తుంది. 1994లో “తిన్న వాటిని ఆడవాళ్లే కడుగాలి” అనే రివాజు జీర్ణించుకున్న ఆదివాసి బుడతడు  చాయ్ గ్లాస్ కడుక్కోమంటే విసిరికొడుతాడు. 2001లో మాడ్ డివిజన్లో ఇంద్రావతి ఏరియా భూంకాల్ స్కూలులో పాఠాలు…

“అమ్మ పొలం దున్నుతుంది

నాన్న ఊయల ఊపుతాడు

చందు అన్నం వండుతాడు

పెదనాన్న బియ్యం చెరుగుతాడు”

అనే వాక్యాలు పిల్లలు చదువుతుంటారు… అగ్రవర్ణ, హిందుత్వ బ్రాహ్మణ భావజాలం – లింగ, కుల, వర్గ వివక్షలకు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసే పాఠ్యాంశాలు కాన్ సెంట్రేషన్ క్యాంపుల్లాంటి స్కూల్లు, కాలేజీలు – కోట్లాది యువకుల మెదళ్లను కలుషితం చేసే మన పాఠ్య పుస్తకాలు నిండా భూస్వామిక, పెట్టుబడిదారి భావజాలం… పితృస్వామిక భావజాలం పోవడానికి యువత మనం ఉద్యమించ వల్సిందే. 2005 భూంకాల్ ఉత్సవంలో గెరిల్లాగా మారిన బుడతడు తన పల్లెం తనే కడుక్కొని ‘నేను మునుపటిలా లేను” అంటాడు. మాటలు అర్ధవంతంగా పొదుపుగా వాడిన కథ. మన నిత్యజీవితంలో పితృస్వామిక భావజాలంలో ప్రవర్తిస్తున్నప్పుడల్లా “బుడతడు” గుర్తొస్తాడు. భారతదేశంలో మనందరిలో వ్యక్తమయ్యే కులవ్యక్తీకరణను మనమింకా గుర్తుపట్టగలిగే చైతన్యం పెంపొందించుకోనేలేదు.

ఒకప్పుడు కరువు కాటకాలతో, మూఢనమ్మకాలతో, అతి పురాతన వ్యవసాయ ఉత్పత్తి విధానంతో ఉన్న గ్రామాలల్లోకి పుష్ప విప్లవ కార్యకర్తగా తన సహచరుడు రాహుల్తో సహా వస్తుంది. రాహుల్ జీలుగ కల్లుకు బానిసైనందున వేరే ప్రాంతం – వేరే పనికి మార్చారు. అతనికి బదులుగా వనిత వస్తుంది. వాళ్లు ఆ గ్రామాలల్లో వ్యవసాయ కార్యకర్తలుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, ప్రజలను సంఘటితం చేసే విప్లవ ఆర్గనైజర్లుగా అన్ని పాత్రలు పోషించి ప్రజలను అన్ని రకాలుగా జనతన సర్కార్ ఏర్పాటు చేసుకునే విధంగా సంసిద్ధం చేశారు… ఆ గ్రామాలల్లో ఉత్పత్తి, చైతన్యం ‘పెరగడమే కాదు. ప్రజల నుండి మంచి నాయకత్వం ఎదిగి జనతన సర్కారును నడుప గల స్థాయికి చేరుకున్నారు. ఆ గ్రామాలల్లోని సమస్యలే కాదు. సైన్యము రావటమూ, పథకాలు అమలు చేయడం ఇవి రెండూ ఆదివాసుల మీద ప్రభుత్వం తలపెట్టిన దాడిలో భాగమే” అని అర్ధం చేసుకోగలిగిన *మార్చు”ను సాధించారు.

మూడో కథ – లక్ష్మణ రేఖ – దండకారణ్యం ప్రవేశించిన తొలితరం విప్లవకారుడు జోగన్న దృష్టికోణంలో నడిచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘణంగా జరుపుకోవడానికి దండకారణ్య మహిళా సబ్కమిటీ పిలుపు మేరకు ఒక కంపెనీ ప్రజా విముక్తి సైన్యంతో నడుస్తూ దండకారణ్య ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటాడు. జోగన్న గ్రీన్హంట్ ఆపరేషన్ మధ్య, చుట్టు సైన్యం, పైన చక్కర్లు కొట్టే శత్రువు హెలికాఫ్టర్ మధ్య పదిహేను వేల మందితో జరిగిన సభ – అటు శత్రువు – ఇటు ప్రజలు… రెంటి మధ్య లక్ష్మణ రేఖ. కథాంశం ఎన్నుకోవడం – నిర్వహించడం – అంతర్గతంగా ఉండే వైరుధ్యాలు వాటి చలనాలు – తగిన శిల్చంతో – ఘటనలతో నిత్య అతికొద్ది కథలు రాసినా కూడా – మనలను వెంటాడే కథలు… విప్లవోద్యమ అవసరం రీత్యా మరిన్ని కథలు నిత్య నుండి ఆశించవచ్చును.

ఇక ఈ సంకలనంలో సుజాత కథలు ఏడున్నాయి. అందులో నాలుగు కథలు మైదాన ప్రాంత పట్టణ ప్రాంతాలకు సంబంధించినవి. ‘శాస్తి, ‘మీకు మేమున్నాము” – రెండు కథలు మహిళలను పురుషులు లైంగికంగా వేధించడం – మహిళలే ఎదిరించి అలాంటి మొగవాళ్లకు మెడలో చెప్పుల దండ వేసి గుండు గీయించి ఊరేగించడం. మొదటి కథలో ఒక ఉద్యోగి, ఒక మహిళను వేధిస్తే – రెండో కథలో నలభై సంవత్సరాల మేస్త్రీ పదమూడు సంవత్సరాల పిల్లను తన భార్య సహకారంతో లోబరుచుకుంటాడు. భూస్వామ్య, పెట్టబడిదారి, సామ్రాజ్యవాద  సమాజాలన్నింటి లోను మహిళలు స్వంత ఆస్తిగా చూడడం – రాజ్యాధికారంలాగే ఆ మహిళలపట్ల లైంగిక వేధింపులు ఒక దుర్మార్గమైన ఆస్తి సంబంధమైన, అధికారానికి సంబంధించిన మొరటు వ్యక్తీకరణ – దీనికి మహిళలే సంఘటితపడి పరిష్కరించు కోవాలని ఈ రెండు కథలు చెప్పుతాయి. అసమ సమాజంలో సమానత్వం! అనే కథ అసలు సమానత్వం కాదు అంతకన్నా ఎక్కువగా మహిళలను చూడాలని నొక్కి చెపుతుంది. లలిత చిరు ఉద్యోగి ఆ కిక్కిరిసిన బస్సులో గంటలకు గంటలు ప్రయాణం చేసి మళ్లీ ఇంటి పని వంట పని చేయాలి. ఇలాంటి పని వత్తిడిని సమాజం గుర్తించి తప్పని సరిగా స్తీ పురుషులకు పని విభజన జరుగాలి. నాల్గవ కథ ఎఫ్డిఐ మన దేశంలోకి మాల్స్ రావడం – వృత్తులు, ఉద్యోగాలు, జీవనభృతి కోల్పోవడం లా కలలో ఎలుకలు కూడా తమ తిండి కోల్పోయాయని – తిరుగుబడాలనుకుంటాయి. ఒక నోబుల్ బహుమతి పొందిన స్వీడిష్ రచయిత రెండు ప్రపంచ యుద్దాలల్లో జరిగిన జన నష్టం కన్నా – మార్కెట్ మాల్స్ గా  విస్తరించడం వల్ల ఎక్కువ మంది వీధిన పడి మృత్యువాత పడ్డారంటాడు.

అయిదో కథ ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో 1995 నుండి  1999 వరకు సాయుధ దళాలు అనుభవించిన అతలాకుతలానికి సంబంధించినది. చుట్టు ముట్టి మట్టుబెట్టే శత్రు నిర్భందం – ఒకవేపు – ప్రజారాజ్య కమిటీలు – ఆర్థికవాద, అతివాద ధోరణులకు లోను కావడం మూలకంగా గగ్రామాలల్లో అదివరకు అందిన అన్ని రకాల సహాయ సహకారాలు కుంచించుకపోయి శత్రువు దాడులు పెరిగి, ఇన్ఫార్మర్లు పెరగడం మరోవేపు. ఫలితంగా వందలాది మంది గొప్ప కార్యకర్తలు అమరులయ్యారు. ఇలాంటి స్థితి మీద చాలా కథలు వచ్చాయి. వరంగల్ ఉద్యమం మీద భారతి రాసిన రెండు పోరాటకథలు “చంద్రగిరి అమరత్వం”, ‘ఒక అరెస్టు గురించి”, ఇట్లాంటి దుర్భర పరిస్థితిలో కూడా గాయపడిన రజితను, గ్రామయువకులు, విలేకర్లు, డాక్టరు రక్షించుకున్నారు. దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రజలు

కాపాడుకుంటారని ఒక ఆశావహనమైన దృక్పథంతో రాసిన కథ ఇది.

రెండు కథలు దండకారణ్య విప్లవోద్యమం మీద రాసినవి. పోలీసులు ఇప్పుడొస్తేనా.. ఒక గ్రామంలో “క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్’ చేసిన పోరాటాలు ముఖ్యంగా ఆదివాసి మహిళలు రీతిరివాజు పేరిట ఎదుర్కుంటున్న సమస్యలు… అందులో ముఖ్యంగా “గోటులొకు యువతులు పోకుండా ఉండటం. ఊరిలో యువకులు ఆడ, మగ యుక్తవయసు వాళ్లు కాగానే గోటుల్లో పడుకోవడం ఆచారం. అందులో యువతులు గర్భందాల్చ్బడం – గ్రామ పెద్దలు పంచాయతులు చేయడం – ఈ సంస్కృతి వలన అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న యువతులు ఈ రివాజును ఎదిరించారు. ‘దేవునికి కోపం వస్తుంది – పెద్దపులి ఊరిమీద పడుతుందని బెదిరించిన పెద్దలను ధిక్కరించారు. అలాంటివాళ్ళు తమ సమస్యలనే కాదు సాయుధులై – సంఘటితమై పోరాడటం ఈ కథ.

ఆఖరు కథ “సామాన్యుల సాహసం’ గొప్ప కథ. కథనిండా గలగల పారే దొడ్డ (నది) వర్షం – నది ఈవల గెరిల్లాలు – నది కావల పోలీసులు – పోటెత్తే నది. నదిలో పడవ వేసే వాళ్లను బలవంత పెట్టి పోలీసులు గెరిల్లాల మీద దాడి చేయడానికి, తుపాకులతో ఇద్దరు పోలీసులు నదిలోకి ప్రవేశిస్తారు. పడవ మునిగుతుంది. పోలీసులు చనిపోతారు. తరువాత చుట్టు పక్కల గ్రామాల వాళ్లు వచ్చి “తలాష్ అభియాన్” నిర్వహించి ఆ పోటెత్తే నదిలో పోలీసుల ఏడు తుపాకులు వెతికి సంపాదిస్తారు. అది ఎకె 47 లాంటి విలువైన ఆయుధాలు సంపాదించడమే కాక ఎస్పి నాయకత్వంలో దాడికి దిగిన మూడు వందల మంది శత్రు మూకలను ఎదురించి పోరాడుతారు. చైనాలో లాంగ్మార్చు సందర్భంలో యైత్ రూట్ ఆర్మీకి సంబంధించి, వియత్నాంలోను ఇట్లాంటి ప్రజల సాహసానికి సంబంధించిన కథలు, నవలలే కాదు – సినిమాలు చాలా వచ్చాయి. అలాంటి పోరాట సాహిత్యాన్ని మన కాలంలో – ఈ కథలు చిత్రించాయి.

కథలల్లో ముఖ్యంగా సుజాత కథల్లో కథకు అవసరమైనంత మేరకు అద్భుతమైన ప్రకృతిని, దాని లయాత్మకతను, చలనాన్ని చిత్రించడం దండకారణ్య కథల్లో కన్పిస్తుంది.

ముగ్గురు రచయిత్రులకు కథకు సంబంధించిన లక్ష్యం తెలియును.  అయితే – వస్తువు రీత్యా ఎట్లాగు సారూప్యత చాలా కథలకు తప్పదు గాని, వాటి నిర్వహణలో – తగిన జాగ్రత్తలు తీసుకుంటే – అన్ని కథలు ఒకే ప్రాంతం, సారూప్య  ఘటనల ప్రమాదం నుండి తప్పించుకుంటాయి.

దండకారణ్యంలో సగం కన్నా ఎక్కువ మంది మహిళలు విప్లవ పోరాటాలల్లో నిలిచి పోరాడుతున్నారు. ప్రపంచ విప్లవాలల్లోనే ఇది ఒక కొత్త అనుభవం.

తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరువడిని అందులోనుండి వస్తున్న సాహిత్యం రచయిత్రులు ప్రవేశపెడుతున్నారు. బహుశా విప్లవోద్యమంలాగే ఈ సాహిత్య ఒరవడి మన సమాజానికి కావాల్సింది. అనివార్యమైంది… పితృస్వామిక భావజాలంతో కుళ్లి కంపు కొడుతున్న ప్రధాన తరతరాల బూజు సాహిత్యానికి ఈ సాహిత్యం ఒక ట్రీట్మెంట్…

రొటీన్ సాహిత్యానికి పూర్తిగా భిన్నమైన ఇలాంటి సాహిత్యాన్ని అందరు తప్పక చదివి మన కాలపు మహిళా విప్లవ సాహిత్యాన్ని ఆహ్వానించాలని కోరుకుంటూ –

22, జనవరి 2015

Leave a Reply