సాహు
(కొమురం భీమ్ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయన వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం.- వసంతమేఘం టీమ్)
సూర్య వంశ దేవతల్
కేత దర్శ సితార
సూర్య వంశ రాజధాని
మావబూడె మాతారా
కచ్చీ బాండేగ్ మావాసొత్తా
కయ కాల్ కుటియాతా
మావా రాజ్ బుడేమాతా
సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ వారు కొనసాగిస్తున్న జీవితంలోని ఆవేదనను ఆర్తిని పై పాట ద్వారా వ్యక్తం చేస్తారు. ఇది వాళ్ళ మౌలిక సాహిత్యంలోని ఒక సేకరణ. వేల ఏళ్ళుగా నాలుకల మీదే రాసుకుని ఒకరి మంచి ఒకరికి చరిత్రగా గానం చేయబడుతున్నది.
భాషవున్నా సాహిత్యం రాసుకున్న తీరు ఇది. లిపి లేదు కదా! అందుకే వాళ్ళ సాహిత్యమే అనేది ఏదైనా వుంటే అది గుండెలపై రాసుకునేదే. కాగితాల మీద రాసుకునే అక్షర రూపం ఆ భాషకి లేదు. అది మౌఖిక సాహిత్యమే.
మనము అనుకునే గిరిజన సాహిత్యం వారి మౌఖిక సాహిత్యాన్ని పూర్తిగా రికార్డు చేయలేదు. కొంత కృషి జరిగినా వాటి వెనుక ఉద్దేశ్యాలు వేరు. గిరిజన ఉద్యమాల గురించి రాసినా, గిరిజన సమస్యలపై రాసినా, అది గిరిజనేతరులు రాసిన సాహిత్యమే. గిరిజనులతో సమైక్యమై, జీవితాన్ని, భాషను ఆర్థం చేసుకుని గాఢ అనుభూతితో వాప్తవికతను వ్యక్తీకరించినా ఇంకా ఆ రచనల్లో జీవితం కొరవడిందనిపిస్తుంది.
మనం మన జీవితాన్ని కొన్ని మూసల్లోపోసి చూసుకున్నట్టుగానే, వాళ్ళ జీవితాన్ని చూడడంవల్లే జీవిత వాస్తవికత కొరవడింది. ఈ జీవితాన్ని ఎక్కడ నుంచి పట్టుకోవాలి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళ మౌఖిక సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తుంది. ఇదొక అంచనా. ఇదే పరమ సత్యం కాకపోవచ్చు.
భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రకాల ఉద్యమకారులు, సంస్కర్తలు ‘‘ఆంథ్రోపాలజిస్టులు’’, సాహిత్యకారులు, గిరిజన సంస్కృతి, గిరిజన సాహిత్యం, గిరిజన సామ్రాజ్యాలు, గిరిజన తిరుగుబాట్లు, గిరిజనుల పరాయీకరణ మొదలగు అంశాలు తీసుకుని రాశారు. ఆంధ్రదేశంలో గిరిజన సాహిత్యం గురించి మాట్లాడాలన్నా దేశవ్యాప్త గిరిజన సమూహాల్ని విడిచి మాట్లాడలేము. అసలు ఎవరీ గిరిజనుడు అనేది మొదటగా మాట్లాడుకుందాము.
ప్రతీ దేశానికి నైసర్గిక, చారిత్రక, సామాజిక, ప్రత్యేకతలు వున్నట్టే వాళ్ళకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. ఈశాన్యం మొదలుకొని మధ్య భారతదేశం నుంచి తూర్పు పడమర కనుమలలో ఆవాసాలు ఏర్పరచుకుని రాష్ట్రాల పరిధిలో ఉన్న గిరిజనులు ఈ దేశంలో సంఖ్యరీత్యా 7 శాతం, జనాభా రీత్యా 7 కోట్ల మంది. ఈ లెక్కన మన ఆంధ్రదేశంలో అరకోటి గిరిజనులు వుండి వుండవచ్చు.
నేను మీరు ముద్దుగా పిలుచుకునే గిరిజనున్ని కొండమనిషిని – ఆదివాసిని. నా పేరేదైనా వా బతుకు యుద్ధంలో నిత్యపోరాట యోధున్ని
నా నేల – నా అడవి
నా సెలయేరు – వా నింగి
నా సంస్కృతి – నా ఆట
నా సమస్తం దోచుకోబడిన వాన్ని చరిత్రలో నా ఉనికి కోసం పిడికిల్లు బిగించి యుద్ధం చేసిన ప్రతిసారి ప్రకృతి, ప్రతిఘాతక శక్తులు నాకు వంగి సలాం చేసాయి – నేను కేకలేస్తే వేల కంఠాలు నాతో పలికాయి. వేల హస్తాలు ఆకాశాన్ని చుట్టు ముట్టాయి. నా వాళ్ళ తలలు నేల రాలినా మా వాళ్ళ పిడికిల్లు ఇంకా బిగుసుకుంటూనే వున్నాయి.
రక్తసిక్త క్షతగాత్రుల్ని – నేను – గెలుపూ ఓటమిల ప్రస్తావన లేకుంటే నేను ‘‘బిర్సాముండాను, రాంజీ గొండును, శ్రీకాకుళ సత్యాన్ని, మన్నెం రామరాజుని ఎదల బాధల కొమురం భీమున్ని – ఇంద్రవెల్లిని చీకట్లున్నంత వరకు – ఉదయించే సూర్యతేజాన్ని’’
ద్రవిడులు, ఆర్యులు, ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణలతో, ఆగమనంతో అన్ని రకాల నష్టపోయింది గిరిజనులే. ఆయా కాలాల్లో నుంచి ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి గిరిజనులలో ఏమీ లేదు. సరికదా వాళ్ళు తిరుగుబాట్లను ఎట్లా అణచాలో ప్రభుత్వాలు మాత్రం బాగా పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాయి.
ద్రవిడులు, ఆర్యులు, గిరిజనుల్ని అడవుల్లోకి తరిమారనడానికి రుజువులు ఇంకా అన్వేషించవలసేయున్నది. రాజులు గిరిజన రాజ్యాన్ని కొల్లగొట్టి మహా సామ్రాజ్య శాసనాల క్రింద బంధించి వేశారు. ఒక్క బంధించడమేకాదు భౌతికంగా వాళ్ళతో కలిసిపోయారు. గిరిజన తెగల ఆడపిల్లల్ని అవసరం కోసం పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అవసరం తీరినాక తన్ని తగలేశారు. ఇందుకు చరిత్రలో సాక్ష్యాలు కోకొల్లలు.ఎంత భౌతికంగా కలిసిపోయారంటే గిరిజనుల స్ట్రక్చర్‌లోని కొన్ని అంశాలు జెనిటికల్ గిరిజనేతర జాతుల్లో కనిపిస్తాయి. గిరిజనేతర స్ట్రక్చర్‌లో కొన్ని గిరిజనుల్లో కనిపిస్తాయి. ద్రవిడ, తొగ, లంబాడా, గొండు, కోయల్లోనే కాక ఎన్నో తెగల్లో సారూప్య రూపాలు కనిపిస్తాయి.
నదీ పరివాహక ప్రాంతాలు స్థిర వ్యవసాయంతో ఎదిగి మైదాన నాగరికత ఏర్పడితే కొండలు కోనలు అందుకు భిన్నంగా వుండి అక్కడే నివాసముంటున్న తెగల జీవితాన్ని గిడసబారి పోయేటట్టు చేయవచ్చు. ‘గిరిజన’ ఆవిర్భావం పై సజీవమైన చారిత్రక పరిశోధనలు జరగాలి. ఈనాటి సమాజం మాత్రం గిరిజనుల్ని బలవంతంగానే తనతో ఈడ్చుకువస్తున్నది. రాజరికం ఏ పని అయితే చేసిందో ప్రజాస్వామ్య రాజ్యం ఆపవే చేస్తున్నది. గ్రేట్ రష్యా ఆపనే చేసింది.
మీరు మాతోనే వుండాలని మాకు సరిహద్దుల్లో వున్నారు కాబట్టి భద్రత వుండదని గనులు, వనాలు మీ వద్దే వున్నాయి కాబట్టి ఇవన్నీ మావేనవి ఏనాడో ప్రకటించుకున్నాము. కాబట్టి మీరు ఈశాన్యములోని ఏడుగురు అక్క చెల్లెళ్ళే కావచ్చు. మధ్యభారతంలోని జార్కండీయులే కావచ్చు. గోండులే కావచ్చు. ఎవరయినా మీరు మా రాజ్య చట్రాల్లో వుండాల్సిన వాళ్ళే. లేకపోతే ఉక్కుపాద పదఘట్టనల క్రింద నలిగిపోవాల్సిన వాళ్ళే. నాగరికుల వైఖరి ఇది. గిరిజనులు ఆర్థికంగా ఎదగలేదు సరికదా, సాంస్కృతికంగా కొంత పరాయీకరించబడ్డా ఇప్పటికీ ప్రత్యేక తెగలుగా మనుగడ సాగిస్తూ వారి భాషల్ని నిలుపుకుంటూ గత కాలపు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఆంధ్రదేశంలో శ్రీకాకుళం ఆ కొన నుంచి ఆదిలాబాద్ ఈ చివరి వరకు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో ఎన్నో తెగలు నివసిస్తున్నాయి. సవరలు, జాతాపులు, కోయ, మన్నై, కొండరెడ్డి, నాయకపు, గోండు, కొలాం, సుగాలి, తెగలుగా వున్నారు. ఈ దేశంలోని గిరిజనులు నాగరిక (దోపిడీ) సమాజ విస్తరణకు లొంగక స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేశారు.
మనం ఘనంగా కీర్తించే ఆశోకుడు రెవెన్యూ కోసం అడవులు నరకడమేకాక గిరిజన రాజ్యాల్ని కూడా నరికి చంపి మహాసామ్రాజ్యంలో కలుపుకుని తన రక్తమలిన చరిత్రను బౌద్ధ అహింసా వాదంతో కడిగేసుకున్నాడు. (ఇందుకు కళింగ కారవేళ చరిత్ర చదవాల్సిందే..) పగిడిద్ద రాజును హత్య చేసి చివరకు సమ్మక్క – సారలమ్మలను కూడా చంపి వారిని దేవతల్ని చేసి తమ సామ్రాజ్య విస్తరణ కాంక్షను రాక్షసంగా బహిర్గతం చేసుకున్న కాకతీయ రాజుల చరిత్రను కూడా మనం గమనించాలి.
గోండులను చంపిన నైజాం రాజుతోపాటు, ఈ నాటివరకు అణచివేతకు గురి అవుతున్న గిరిజనుల జీవితాల్ని పరిశీలిస్తే ఆయా చారిత్రక విభాత సంధ్యలో వారి ఉనికీ, వారి పోరాటమే మౌఖిక సాహిత్యమై రూపుదిద్దుకుని ఇవ్వాల్టికి వాళ్ళ లిఖిత సాహిత్యంగా కొద్దికొద్దిగా వస్తున్నది.
గిరిజనులనగానే తలలో ఈకలు, మొలలో గజ్జలు వుండి రిపబ్లిక్ డే వేడుకల్లో, కవిపించే విచిత్ర జీవులు కారు. సినిమాల్లో కనిపించే జోకర్లూ కారు. తెల్లబట్టలవాడు ఎవడైనా దోచుకునే వాడుగానే కవిపిస్తాడు వాళ్ళకి. అతడే గిరిజనుడు. మనము పెట్టిన ఆ ముద్దు పేరులోనే మన చైతన్యం, సంస్కృతుల వ్యక్తీకరణ గోచరిస్తుంది. వాళ్ళని లొంగదీసి మనలో కలుపుకున్న క్రమానికి ఆధారాలు దొరకవు. ఈ నేల మీద జరిగిన దౌర్జన్యపూరిత ఆక్రమణలకు గెలిచిన వాళ్ళే చరిత్రలు రాసుకున్నారు. కాబట్టి సాక్ష్యాలు కూడా లేకుండా చేశారు. ఓడించబడ్డవాడు ఈ చరిత్రను తిరిగి వెతికిపట్టుకుని ‘‘ఎలక్స్ హేలీ’’, ‘‘రూట్స్’’ (ఏడుతరాలు) నవలను రాసినట్టుగా గిరిజనులు వాళ్ళ చరిత్రను వాళ్ళే రాసుకోవలసిన అవసరం వుంది. గిరిజనులు ఏర్పడిన క్రమం నుంచి ఇవ్వాల్టి వరకు జరుగుతున్న సజీవ చరిత్రను తవ్వి తీయాల్సిన అవసరం వుంది. గిరిజన జీవితాల్లో సాంస్కృతిక పరాయీకరణ ఎట్లా జరిగిందో చూడడానికి మన పౌరాణిక సాహిత్యాన్ని గిరిజనుల పురాణగాథల్ని పరిశీలిస్తే కొంత అర్థమౌతుంది.
కోయ శబరిని రాముడు పునీతన్ని చేయడం, గుహున్ని పునీతున్ని చేయడం కోసం రాముడు ఘనమైన గంగానదిని దాటాడు (గుహుడు లేకున్నా దాటే వాడే). ఆర్య పుత్రులకన్న ప్రతిభాశాలి ఎవడు వుండకూడదని ద్రోణుడు కుట్రతో భిల్లు తెగకు చెందిన ఏకలవ్యుడ్ని బొటన వ్రేలు కోరతాడు. లక్కా ఇల్లు దహనం పిదప ఆడవినపడ్డ పాండవులలోని భీముడు హిడంబిని పెళ్ళాడతాడు. ‘‘చాంగ్ రే బంగారు రాజా చాంగ్ చాంగ్‌రే బంగారు రాజా’’ అనే సాహిత్యంతో సినీ తెర గిరిజన జీవితానికి అద్దం పడుతుంది. ఇది గిరిజన జీవితమని మనకి జూపి డబ్బు చేసుకుంటారు – నిర్మాత. ఇప్పటి గోండులు వాళ్ళ పురాణగాథ వాస్తవమని, తామంతా హిడంబి వారసులమని భావిస్తారు. నల్లమల కొండల్లోని చెంచుల్లోని చెంచులక్ష్మిని పెళ్ళాడిన నరసింహున్ని మార్వాడి లక్ష్మి శాపం పెడుతుంది. మీరంతా అందవిహీనులు కమ్మని, కామంతో కళ్ళు మూసుకున్న నరసింహున్ని మాత్రం పతిగా గౌరవిస్తుంది. అయినా కారణజన్ముడైన నరసింహుడు – చెంచును పెండ్లాడక తప్పదు.
క్రిమినల్ ట్రైబల్స్‌గా బిల్లుల్ని బ్రిటిష్ పాలకులు పిలిచేవాళ్ళు. వేటాడి సమంగా పంచుకుతినే, స్వంత ఆస్తుల గొడవల్లేని బిల్లులు వాళ్ళకు క్రిమినల్స్‌గా కనబడ్డారు. ఇంకా వెనక్కి వెళ్తే మన రామాయణ కాలం నాటికి కూడా బిల్లులు దొంగలుగానే కనబడ్డారు.వాల్మీకి దొంగే – వాల్మీకికి ఒక నాగరిక (దోపిడి) సమాజపు రాజరిక వంశాన్ని కీర్తిస్తూ రామాయణం రాయాల్సిన అవసరం ఏముందో మాత్రం అర్థం కావడం లేదు.
హిందూపురాణాల్లో గిరిజన దేవతలు వాళ్ళ ఆది పురుషులు – హిందూ దేవతలకు భక్తులుగా, సేవకులుగా, వారి కరుణా కటాక్షాలకు పునీతులైన పాపులుగానో మారిపోయారు. హిందూ దేవ హీరోలకు రెండో భార్యలుగానో, ఉంపుడు కత్తెలు గానో జాంబవంతుని కూతురు జాంబవతిని అల్పస్థాయి, నీచస్థాయిలో పెళ్ళి చేసుకోవడం ఒకటైతే ఏకంగా మా చరిత్రనే వాల్మీకి రాశాడనడం ఎంత వంచనలో భాగమో చూడాల్సింది.
ఈ సాంస్కృతిక దౌర్జన్యం ఇంతటితో ఆగక గుళ్ళు గోపురాలపై కూడా పడింది. బాబ్రీ మసీదును కూల్చిన హిందు సనాతనులు శ్రీశైలం – ఆహోబిలం – తిరుపతి – భద్రాచలం – పూరి జగన్నాధుని ఆలయాన్ని కూల్చి ఇవి మావే అవి గిరిజనులంటే ఊరకుంటారా? వాస్తవానికి అవి గిరిజనులవి – అక్కడ మారుమూల అడవుల్లో గుళ్ళు కట్టాల్సిన అవసరం రాజరికానికి లేదు. వుంటే గింటే వాటిలో ఆర్య దేవతల్ని ప్రతిష్టించి వారిని కొలిచేటట్టు, ప్రజల్ని, గిరి జనుల్ని, మూఢులుగా, మూర్ఖులుగా చూడవలసిన కౌటిల్య నీతిలో భాగమే ఆ అవసరం.
గిరిజన దేవతలు గిరిజనేతరుల దేవతలై క్షుద్ర శక్తులుగా రక్తమాంసాదులు, సార కళ్ళు తాగే నీచ శక్తులుగా జీవం పొందడం – చెట్టుకు, పుట్టకు సాగిలబడే గిరిజనేతరుల్లో రాజుల ప్రాపకంలో గిరిజన దేవతలు కూడా హిందూ దేవతలకు ప్రచారం చేయించారు.
ఈ సాంస్కృతిక పరాయీకరణ ఎంతగా జరిగిందంటే – ఇందులో కుట్ర ఏమీ లేదు – సహజంగానే జరిగింది అనిపించేలా జరిగింది. అడవి, అడవి సంపదల్ని ప్రైవేటు వ్యక్తుల, దళారీల, పరంచేసి గిరిజనాభ్యుదయాన్ని గూర్చి మాట్లాడే పాలకులుగా గిరిజనుల్ని ఆర్థికంగా పూర్తిగా దోచుకోవడానికి తలుపు తెరిచిన పాలకులుగా గిరిజన దర్బారుల్లో – గిరిజన సాంస్కృతిక వారోత్సవాలని – వెకిలిగా ప్రవర్తించే హక్కు మాత్రం మనకు వుంది.అది ఢిల్లీ అయినా – బెంగాలయినా ఆంధ్రా అయినా గిరిజన జీవితాల్లో మాత్రం వికాసం లేదు. యుద్ధ వ్యూహాల్లో భాగంగా గిరిజన ప్రాంతాల్ని ఎంచుకున్న వాళ్ళు స్థానిక సమస్యల వరకే ఉద్యమించే గిరిజనుల్ని – రాజ్యాధికార కైవసంలో భాగం చేస్తున్నందుకు – గిరిజనులకు ప్రతిఫలంగా గూండాలుకాలడం – ఎన్‌కౌంటర్లు, ఇన్‌ఫార్మర్స్ పేర చంపడాలు మిగిలి – దేశవ్యాప్త సంచలన ఇంద్ర వెల్లుల్ని మిగిల్చింది.
పైన చెప్పుకున్న చరిత్ర మొత్తంగా గిరిజన చరిత్రగా, గిరిజన సంస్కృతిగా -గిరిజన సాహిత్యంగా చూడబడుతున్నది కాబట్టి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.గిరిజనుల్లో సమిష్టి తత్వమే మనల్ని ఆకర్షించే గుణం – మనలో లేనిది వారిలో వుంది. అది వ్యవసాయ పనుల్లో (ఎవరి కమతం వారికున్నా) పూజ పునస్కారాల్లో పండగలు – పబ్బాల్లో కల్సి, సమిష్టిగా జరుపుతారు.
హిందువులు నమ్మినట్లే – అదృశ్య శక్తులనునమ్మి పూజిస్తారు – అలా చేస్తే పాతాళానికి పోతామనుకుంటారు – మనం స్వర్గానికి పోతాం కదా! అది తేడా – ఈ ఆచార వ్యవహారాలు మంత్ర, తంత్రాలు – అన్నీ కూడా మౌఖిక రూపంలో వున్నాయి. పండగల్లో, పెళ్ళిల్లో, పాడే సాహిత్యంలో వాళ్ళ జీవితంతోపాటు దేవతల్ని కూడా కలుపుకు రాప్తారు.
‘‘జానపద గిరిజన సాహిత్యంపై ఒక పరిశీలన’’ అనే థీసిస్‌లో రాజ్ మహమ్మద్ గారు విపులంగానే సేకరించారు. ఆ సాహిత్యాన్ని.
వీళ్ళ గూర్చి సాహిత్యం చాలా వచ్చింది. అయితే అదంతా వాళ్ళను గూర్చి మనం తెలుసుకోవడానికి తప్ప – వాళ్ళకువాళ్లను పరిచయం చేయడం కోసం కాదు. వెన్నెలకంటి రాఘవయ్య మొదలుకొని గిడుగు పంతులు, పాణిగ్రాహి, వంగపండు, గద్దర్, బి.ఎస్.రాములు, సాధనల వరకు, చారిత్రక వలసలకు ప్రాణం పోసిన సాహు, అల్లం రాజయ్యలు, కొండగాలి కొన్ని కథలు భూషణం గార్లు, గిరిజనుల గూర్చి వ్రాశారు.
ఇంకా ఎందరో వుండవచ్చు. వారిని పేరు పేరున జ్ఞాపకం చేయకపోయినా ఆ అవసరం వాళ్ళ కెందుకొచ్చిందంటే, జాతీయ, వామపక్ష ఉద్యమాలకు వాళ్ళ జీవితాల్ని పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళను అర్థం చేసుకుని తమతోపాటు పోరాట స్రవంతిలో వెంట తీసుకుపోవడానికి వాళ్ళ భాషతోపాటు సాహిత్యాన్ని, సంస్కృతిని పరిశీలించారు.
అడవిలో వెన్నెల కథల్లో ఇంద్ర వెల్లికి పూర్వరంగమైన గిరిజన జీవితం కనిపిస్తుంది. కొమురం భీము – ఒక చారిత్రక పోరాటాన్ని నడిపి పట్టుకుని – నవల రూపంగా మన ముందుకు వచ్చింది.
వసంతగీతం – (వామపక్ష యుద్ధ వ్యూహంలో) గిరిజనులు – రాటుదేలిన క్రమం వుంది. అయితే నాగరికత కన్న – వ్యూహాలు ఎత్తుగడలు రాజకీయాలు జీవితాలై – కాల్పనికత పాలు ఎక్కువై అతిశయోక్తుల చిత్రణ గోచరించినా – ఒక కొత్త కథనం – కొత్త ఒరవడి మిలటరీ దృక్పథంతో రాసిన నవల కాబట్టి పాఠకులకు ఒక కొత్త వస్తువు కాబట్టి వాస్తవ – కల్పనల మీమాంసతో పనిలేదు. ఇక వ్యాసాల్లో, బాలగోపాల్ మొదలుకొని రాఘవయ్య, టి.వి.గార్లు గిరిజనుల పట్ల వాళ్ళకున్న దృక్పథం – (అవి సామాజిక దృక్పథమే కావచ్చు) గిరిజనుల్ని పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి.
చివరగా కొన్ని గిరిజన మౌఖిక గీతాల్ని వినిపిస్తూ వా యీ గిరిజన సాహిత్యంపై పరిశీలనను ముగిస్తాను. దళిత పీడిత జన జాతుల వారంతా గెల్చుకోవాల్సిన ప్రపంచం గూర్చి గోండుల్లో పిల్లలు పాడుకునే పాటతో ముగిస్తాను.
కుహు – కుహు – కుహు
సబ్బల దేశం కుహు – కుహు
మైపివాకట్ (గెలిచి వస్తాం) కుహు – కుహు
కుహు – కుహు…. కుహు ` .